సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి మూడు ప్రతిష్టాత్మక విదేశీ కంపెనీలు ముందుకొచ్చాయి. జపాన్‌కు చెందిన ఏటీజీ సంస్థ టైర్ల తయారీ కంపెనీ, చైనాకు చెందిన వింగ్‌టెక్ సంస్థ మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్, హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్‌మెంట్ సంస్థ భారీ స్థాయిలో పాదరక్షల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఈ మూడు కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు.. తద్వారా ప్రత్యక్షంగా 22,000 మందికి ఉపాధి కల్పించడానికి ఉద్దేశించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాయి. వీటిని పరిశీలించిన పరిశ్రమల శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడులకు ముఖ్యమంత్రి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపిన వెంటనే ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు(ఎంఓయూ) చేసుకోవడానికి ఆయా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి.
ఎస్‌ఐపీబీ పునర్‌వ్యవస్థీకరణ
గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రితో పాటు మొత్తం 11 మంది సభ్యులతో ఎస్‌ఐపీబీని ఏర్పాటు చేశారు. ఆ బోర్డును పునర్‌వ్యవస్థీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిమిత సభ్యులతో కొత్త ఎస్‌ఐపీబీని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. వారం రోజుల్లో కొత్త బోర్డు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. మూడు ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపితే, ఎంఓయూ కుదుర్చుకొని, ఆయా సంస్థలకు భూ కేటాయిపులు చేయడానికి రంగం సిద్ధమైంది.
ఏటీజీ టైర్ల కంపెనీకి 80 ఎకరాలు..
భారీ వాహనాలు, గనుల తవ్వకంలో ఉపయోగించే యంత్రాలకు అవసరమైన టైర్ల తయారీలో పేరొందిన జపాన్‌కు చెందిన అయన్స్ టైర్ గ్రూపు(ఏటీజీ) విశాఖపట్నం సమీపంలో యూనిట్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. రూ.1,600 కోట్ల పెట్టుబడితో ఎగుమతి ఆధారిత టైర్ల యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. విశాఖపట్నంలో పోర్టులు ఉండటంతో వ్యూహత్మకంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. యూనిట్ ఏర్పాటుకు 110 ఎకరాలు కావాలని ఏటీజీ కంపెనీ కోరగా, డీపీఆర్‌ను పరిశీలించిన తర్వాత దాదాపు 80 ఎకరాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికే గుజరాత్, తమిళనాడులో ఏటీజీ యూనిట్లు ఉన్నాయి. విశాఖపట్నం యూనిట్ దేశంలో మూడో యూనిట్ కానుంది. విశాఖపట్నంలో ఏర్పాటు చేసే కొత్త యూనిట్‌లో దాదాపు 2,000 మందికి ప్రత్యక్షంగా, 3,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది.
రేణిగుంట ఈఎంసీలో వింగ్‌టెక్ యూనిట్
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ వింగ్‌టెక్ ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ యూనిట్ ద్వారా నేరుగా 10,000 మందికి ఉపాధి లభించడంతో పాటు మరో 5,000 మందికి సప్లైచైన్ విభాగంలో పరోక్ష ఉపాధి లభించనుంది. చిత్తూరు జిల్లా రేణిగుంటలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)–2లో వింగ్‌టెక్ యూనిట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఏడాదికి 40 లక్షల మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. రేణిగుంటలో ఈఎంసీలకు నీటి కొరతను తీర్చడానికి ఏపీఐఐసీ రూ.20 కోట్లతో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నెలకొల్పనుంది. తిరుపతి మున్సిపాలిటీ నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేసి, ఈఎంసీలకు పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. శాశ్వత ప్రాతిపదికన కండలేరు రిజర్వాయర్ నుంచి రూ.200 కోట్లతో పైపులైన్ ద్వారా నీటి సరఫరా చేయడానికి పరిశ్రమల శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. నీటి కొరత తీరితే ఈఎంసీల్లో పెట్టుబడులు పెట్టడానికి మరిన్ని సంస్థలు ముందుకొస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
రెండు దశల్లో పాదరక్షల తయారీ యూనిట్
హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్‌మెంట్ సంస్థ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో భారీ పాదరక్షల తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి ముందుకొచ్చింది. దాదాపు రూ.750 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. అడిడాస్ వంటి ప్రముఖ బ్రాండ్ పాదరక్షలను ఈ సంస్థ తయారీ చేస్తోంది. శ్రీకాళహస్తి సమీపంలో రెండు దశల్లో ఏర్పాటు చేసే యూనిట్ ద్వారా 10,000 మందికి నేరుగా ఉపాధి లభించనుంది. ఇందులో అత్యధికంగా మహిళలకే ఉపాధి కల్పించనున్నారు. 298 ఎకరాలు కేటాయించడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇంటెలిజెంట్ సంస్థ ఇప్పటికే నెల్లూరు జిల్లా తడ వద్ద యూనిట్ ఏర్పాటు చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2006లో మొదలైన ఈ యూనిట్ ఇప్పుడు ప్రతినెలా 12 లక్షల జతల పాదరక్షలను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటివరకు రూ.700 కోట్ల పెట్టుబడి పెట్టి, 11,000 మందికి ఉద్యోగాలు కల్పించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment