వేతనాల్లో..ఐటీ కన్నా జీసీసీలే మిన్న! | GCCs in India offer 12 to 20percent higher tech salaries than IT services firms | Sakshi
Sakshi News home page

వేతనాల్లో..ఐటీ కన్నా జీసీసీలే మిన్న!

Published Sun, Sep 1 2024 1:33 AM | Last Updated on Sun, Sep 1 2024 5:31 AM

GCCs in India offer 12 to 20percent higher tech salaries than IT services firms

12–20 శాతం అధికంగా వార్షిక ప్యాకేజీలు 

జీసీసీల్లో సిబ్బంది సంఖ్య 16 లక్షల పైనే 

వచ్చే ఐదేళ్లలో మరో 800 కొత్త సెంటర్ల ఏర్పాటు 

ద్వితీయ శ్రేణి నగరాలపైనా ఫోకస్‌ 

విదేశీ కంపెనీలు భారత్‌లో పొలోమంటూ ఏర్పాటు చేస్తున్న గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు).. అదిరిపోయే వేతన ప్యాకేజీలతో టెక్‌ సిబ్బందిని ఆకర్షిస్తున్నాయి. భారీ విస్తరణ బాట నేపథ్యంలో  టెక్‌ నిపుణులకు జీసీసీల నుంచి డిమాండ్‌ పెరుగుతోంది. మరోపక్క, జీతాల విషయంలో జీసీసీలతో పోలిస్తే సంప్రదాయ ఐటీ సేవల కంపెనీలు వెనుకబడుతుండటం గమనార్హం.

దేశంలో ప్రస్తుతం 1,600కు పైగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వాటిలో 16.6 లక్షల మందికి పైగానే నిపుణులు పనిచేస్తున్నారు. 

ఐటీ కంపెనీల్లోని టెకీలతో పోలిస్తే అవే విధుల్లో పనిచేస్తున్న జీసీసీ ఉద్యోగులకు 12–20 శాతం మేర అధిక వేతనాలు లభిస్తున్నాయి. అంతేకాదు, టెక్నాలజీ యేతర కంపెనీల్లో పనిచేస్తున్న నిపుణులతో పోల్చినా కూడా జీసీసీల్లోనే భారీ వేతన ప్యాకేజీలు దక్కుతుండం విశేషం. 

టీమ్‌లీజ్‌ డిజిటల్‌ నివేదిక ప్రకారం సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌–ఇంజినీరింగ్, సైబర్‌ సెక్యూరిటీ, నెట్‌వర్క్‌ అడ్మిని్రస్టేషన్, డేటా మేనేజ్‌మెంట్‌–ఎనలిటిక్స్, క్లౌడ్‌ సొల్యూషన్స్, ఎంటర్‌ప్రైజ్‌ అప్లికేషన్స్‌ తదితర విభాగాల్లో ఎంట్రీ, మిడ్, సీనియర్‌ స్థాయిల్లో కూడా జీసీసీలు ప్యాకేజీల్లో ‘టాప్‌’లేపుతున్నాయి.

 మెరుగైన జీతాల నేపథ్యంలో జీసీసీల్లోకి వలసలు కూడా భారీగా పెరిగేందుకు దారితీస్తోంది. ఉదాహరణకు సాఫ్ట్‌వేర్‌ డెవలపర్, ఏఐ/ఎంఎల్‌ ఇంజినీర్స్‌ జాబ్స్‌నే తీసుకుంటే, జీసీసీల్లో ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగి వార్షిక వేతనం రూ.9.7 లక్షలు కాగా, సీనియర్‌ లెవెల్‌ సిబ్బంది ప్యాకేజీ రూ.43 లక్షల్లో ఉంది. ఐటీ కంపెనీలను పరిశీలిస్తే, అవే విధులకు గాను ఎంట్రీ లెవెల్‌ ప్యాకేజీ రూ.5.7 లక్షల నుండి సీనియర్లకు గరిష్టంగా 17.9 లక్షలుగా ఉండడటం గమనార్హం.

చిన్న నగరాల్లోనూ నిపుణులకు డిమాండ్‌ 
జీసీసీలు టెకీలకు భారీగా వేతన ప్యాకేజీలు ఇస్తున్న నగరాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గురుగ్రా మ్, హైదరాబాద్, చెన్నై వంటివి ఉన్నాయి. అయితే, జైపూర్, ఇండోర్, కోయంబత్తూరు తదితర ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా జీసీసీలు, డేటా సెంటర్లు శరవేగంగా దూసుకొస్తున్న నేపథ్యంలో అక్కడ డే టా సైన్స్, ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్, డే టా ఇంజినీరింగ్‌ నిపుణులకు డిమాండ్‌ భారీగా ఉందని పరిశ్రమ చెబుతోంది. 

‘జీసీసీలు ప్రధానంగా జెన్‌ ఏఐ, ఏఐ/ఎంఎల్, డేటా ఎనలిటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి విభాగాలపై ఫోకస్‌ చేస్తున్నాయి. దీంతో డిజిటల్‌ మార్పులకు దన్నుగా నిలవడంతో పాటు నవకల్పనల్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాయి’ అని టీమ్‌లీజ్‌ డిజిటల్‌ వైస్‌–ప్రెసిడెంట్‌ కృష్ణ విజ్‌ పేర్కొన్నారు. సాంప్రదాయ ఐటీ కంపెనీలతో పోలిస్తే జీసీసీల్లో 12–20 శాతం అధిక ప్యాకేజీలు, డిజిటల్‌ స్కిల్స్‌కు ఎంత డిమాండ్‌ ఉందనేదుకు నిదర్శనమని ఆమె అభిప్రాయపడ్డారు.       
 

విస్తరణ జోరు.. 
2025 నాటికి జీసీసీల సంఖ్య 1900కు పెరగనుంది. సిబ్బంది 20 లక్షలను మించుతారని అంచనా. ముఖ్యంగా జెనరేటివ్‌ ఆరి్టఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ (జెన్‌ ఏఐ), మెషిన్‌ లెరి్నంగ్‌/ఏఐ, డేటా ఎనలిటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి విభాగాల్లో భారీగా నిపుణుల అవసరం ఉంటుందని టీమ్‌లీజ్‌ చెబుతోంది.

 గ్లోబల్‌ టెక్‌ హబ్‌గా భారత్‌ ప్రాధాన్యత అంతకంతకూ పెరుతుండటంతో వచ్చే 5–6 ఏళ్లలో ఏకంగా 800 కొత్త జీసీసీలు భారత్‌లో కొలువుదీరే అవకాశం ఉంది. ఇవి కేవలం మెట్రోలు, బడా నగరాలకే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ విస్తరించే సన్నాహల్లో ఉండటం పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టే టెకీలకు కలిసొచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు.

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement