![Global Capability Centers 4. 0 in India says NLB Services](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/GCCS.jpg.webp?itok=mYCyXzya)
హైరింగ్ ప్రణాళికల్లో 35% సంస్థలు
2030 నాటికి పరిశ్రమలో 33 లక్షల మంది నిపుణులు
ఎన్‌ఎల్‌బీ సర్విసెస్ నివేదిక
న్యూఢిల్లీ: దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో కొత్త కొలువులు రానున్నాయి. ఈ ఏడాది (2025లో) 4.25–4.5 లక్షలు, వచ్చే ఆరేళ్లలో పది లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. 35 శాతం కంపెనీలు తమ సిబ్బంది సంఖ్యను 50–100 శాతం పెంచుకునే యోచనలో ఉన్నాయి.
గ్లోబల్ టెక్నాలజీ, డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ సంస్థ ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ రూపొందించిన ఇండియా జీసీసీ గ్రోత్ ఔట్‌లుక్ 2024 నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 6 ప్రధాన నగరాల్లో 10 రంగాలవ్యాప్తంగా 207 జీసీసీల నుంచి సేకరించిన వివరాలతో ఈ నివేదిక రూపొందింది. దీని ప్రకారం, నిపుణుల లభ్యత, పరిశ్రమకు అనువైన పాలసీల దన్నుతో జీసీసీలకు భారత్ ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది. 2030 నాటికి పరిశ్రమలో మొత్తం 33 లక్షల మంది ప్రొఫెషనల్స్ ఉంటారు.
2,100కు జీసీసీలు ..
‘గ్లోబల్ జీసీసీ హబ్‌గా భారత్ స్థానం మరింతగా పటిష్టమవుతోంది. 2030 నాటికి వీటి సంఖ్య 2,100కి చేరనుంది. మార్కెట్ పరిమాణం 100 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. జీసీసీ 4.0కి సన్నాహాలు జరుగుతున్న తరుణంలో దేశీయంగా టెక్, ఫైనాన్స్, తయారీ, సస్టైనబిలిటీ వంటి విభాగాల్లో నియామకాలు మరింతగా పెరగనున్నాయి. ఆర్థిక సేవలకు సంబంధించి నైపుణ్యాలకు గణనీయంగా డిమాండ్ (79 శాతం) ఉంటుంది. వ్యాపార సంస్థలు డిజిటల్ బాట పడుతుండటంతో మార్కెటింగ్.. డిజిటల్ అడ్వరై్టజింగ్ (73 శాతం) తర్వాత స్థానంలో నిలుస్తుంది. అలాగే ఇంజినీరింగ్, తయారీ (69 శాతం), మానవ వనరుల నైపుణ్యాలకు (68 శాతం) డిమాండ్ ఉంటుంది‘ అని ఎన్‌ఎల్‌బీ సర్విసెస్ సీఈవో సచిన్ అలగ్
తెలిపారు.
నివేదికలోని మరిన్ని విశేషాలు..
→ ఫ్రెషర్స్ నియామకాల విషయంలో బెంగళూరు, ముంబై, పుణె, చెన్నై నగరాల్లోని జీసీసీలు ముందు వరుసలో ఉంటాయి. 2030 నాటికి 42% జీసీసీ లు తమ సిబ్బందిని 50% మేర పెంచుకోనున్నాయి.
→ 61 శాతం జీసీసీలు మహిళా ఉద్యోగుల నియామకాలు 50 శాతం పైగా పెరుగుతాయని అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఇది సుమారు 7 శాతంగా ఉంది.
→ 2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలతో ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లో జీసీసీల వృద్ధి, కీలక విభాగాల్లో నిపుణులకు డిమాండ్ కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment