జీసీసీలు @ రూ.8.72 లక్షల కోట్లు | india GCCs projected to generate significant revenue by 2030 | Sakshi
Sakshi News home page

జీసీసీలు @ రూ.8.72 లక్షల కోట్లు

Published Thu, Feb 27 2025 7:20 AM | Last Updated on Thu, Feb 27 2025 7:20 AM

india GCCs projected to generate significant revenue by 2030

న్యూఢిల్లీ: దేశీయంగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఆదాయం 2030 నాటికి 105 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ.8.72 లక్షల కోట్లు)కు చేరుతుందనే అంచనాలు ఉన్నట్లు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమీతా దావ్రా తెలిపారు. అప్పటికి 28 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఎంటర్‌ప్రైజ్‌ ఆపరేషన్స్, నవకల్పనల్లో గ్లోబల్‌ హబ్‌గా భారత్‌ స్థానం మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు. గతేడాది 1,700 జీసీసీల్లో 19 లక్షల మంది నిపుణులు పనిచేస్తుండగా, 64.6 బిలియన్‌ డాలర్ల ఆదాయం నమోదైందని వివరించారు.

మరో అయిదేళ్లలో జీసీసీల సంఖ్య దాదాపు 2,400కి చేరవచ్చని దావ్రా చెప్పారు. ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌వో) బృందంతో భేటీ అయిన సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు. హైదరాబాద్, బెంగళూరు, పుణె, చెన్నై మొదలైన ప్రాంతాలు కీలక జీసీసీ హబ్‌లుగా ఉంటున్నాయని పేర్కొన్నారు. మరోవైపు, కొత్త ఆవిష్కరణలు, వ్యాపార అభివృద్ధికి దోహదపడే నిపుణులు పెద్ద సంఖ్యలో ఉన్నందున భారత్‌ పోటీతత్వం మరింతగా మెరుగుపడుతోందని ఐఎల్‌వో డైరెక్టర్‌ జనరల్‌ గిల్బర్ట్‌ ఎఫ్‌ హువాంగ్‌బో తెలిపారు. కృత్రిమ మేథ, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, సెమీకండక్టర్లు మొదలైన కొత్త విభాగాల్లో జీసీసీలు విస్తరించడం కొత్త ట్రెండ్‌ అని పేర్కొన్నారు.  


వెల్‌స్పన్‌ రూ.1,000 కోట్ల పెట్టుబడులు

ముంబై: గిడ్డంగుల విభాగానికి సంబంధించి రూ.1,000 కోట్ల పెట్టుబడుల ప్రోగ్రాంను వెల్‌స్పన్‌ వన్‌ ఆవిష్కరించింది. తమ రెండో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి అయిన ఫండ్‌ 2కి ఇది మద్దతుగా ఉంటుందని వివరించింది. 50 లక్షల చ.అ. వేర్‌హౌసింగ్‌ స్పేస్‌ను అభివృద్ధి చేసేందుకు ఈ నిధులు తోడ్పడతాయని సంస్థ తెలిపింది. దీనితో కంపెనీ పోర్ట్‌ఫోలియో మొత్తం 2.2 కోట్ల చ.అ.కు చేరుతుందని పేర్కొంది.

ఇదీ చదవండి: ఇన్ఫోసిస్‌లో 20 శాతం వరకు వేతన పెంపు

నిర్మాణం పూర్తయిన తర్వాత నికరంగా రూ.1,100 కోట్ల నిర్వహణ ఆదాయం రాగలదని అంచనా వేస్తున్నట్లు వెల్‌స్పన్‌ తెలిపింది. రూ.2,000 కోట్ల కార్పస్‌ నిధి లక్ష్యంతో 2023 మార్చిలో ఆవిష్కరించిన ఫండ్‌ 2, ప్రధానంగా ఈ–కామర్స్‌ వంటి విభాగాలకు అనుగుణంగా ఉండే కొత్త తరం గిడ్డంగులపై దృష్టి పెడుతోంది. దీని కింద ఇప్పటికే తొమ్మిది గ్రేడ్‌ ఏ అసెట్స్‌కి వెల్‌స్పన్‌ కేటాయింపులు జరిపింది. కొత్తగా కో–ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రోగ్రాంతో తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను 14–15 పెంచుకోవాలని భావిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement