జీసీసీల చూపు హైదరాబాద్‌ వైపు! | GCCs Focus On Hyderabad | Sakshi
Sakshi News home page

జీసీసీల చూపు హైదరాబాద్‌ వైపు!

Published Wed, Dec 25 2024 5:56 AM | Last Updated on Wed, Dec 25 2024 5:56 AM

GCCs Focus On Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరం గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు హబ్‌గా మారుతోంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై జీసీసీలను ఆకర్షించేందుకు హైదరాబాద్‌తో తీవ్రంగా పోటీ పడుతున్నప్పటికీ.. ఈ రంగంలో తెలంగాణ రాజధాని నగరం స్పష్టమైన ఆధిపత్యం కనబరుస్తోంది. గడిచిన ఐదేళ్లలో భారత్‌లో 1,700 జీసీసీలు, 2,975 జీసీసీ యూనిట్లు ఏర్పాటు కాగా, వీటిలో 30 శాతం హైదరాబాద్‌లోనే నెలకొల్పటం గమనార్హం. 2019లో హైదరాబాద్‌లో 230 జీసీసీలు ఉండగా 2024 నాటికి వీటి సంఖ్య 355కు చేరింది. 

భారత సాంకేతిక వాతావరణం, ఉద్యోగాల కల్పన, మార్కెట్‌ వృద్ధి, సామర్థ్యాల పెంపుదల తదితరాల్లో 2030 నాటికి జీసీసీలు కీలకపాత్ర పోషిస్తాయని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాల నిర్వహణ కోసం స్థానిక నైపుణ్యాలు, ప్రావీణ్యత, వనరులను ఒడిసి పట్టుకునేందుకు దిగ్గజ కంపెనీలు వ్యూహాత్మకంగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీ’(నాస్కామ్‌) తెలంగాణలో జీసీసీల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను వివరిస్తూ ఇటీవల ‘జీసీసీ తెలంగాణ ప్లే బుక్‌’ను విడుదల చేసింది. 

తెలంగాణ అనుకూలతలు ఇవే..! 
హైదరాబాద్‌లో నాణ్యమైన మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతిక ఆవిష్కరణలు, స్టార్టప్‌ వాతావరణం వేగంగా వృద్ధి చెందుతుండటం. 
⇒ భూమి కొనుగోలుపై రాయితీ, ఐటీ పార్క్‌ ప్రోత్సాహకాలు, స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు, విద్యుత్‌ రాయితీ, పేటెంట్‌కు మద్దతు. 

⇒ టాస్‌్క, స్కిల్‌ యూనివర్సిటీ ద్వారా ఏటా వేలాది మందికి నైపుణ్య శిక్షణ, ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ఐఎస్‌బీ వంటి అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఉండటం. 
⇒ వివిధ రంగాల్లో జీసీసీల ఏర్పాటుకు అనువుగా వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో 40 లక్షల నుంచి 60 లక్షల చదరపు మీటర్ల ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులోకి వస్తుంది.  
⇒ ప్రభుత్వ సంస్థలైన టీ హబ్, వీ హబ్, టీఎస్‌ఐసీ వంటి స్టార్టప్‌ ఇంక్యుబేటర్లతో 50కి పైగా జీసీసీలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 

⇒ తెలంగాణలో ఏటా స్టెమ్‌ కోర్సుల్లో (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌) లక్షకు పైగా విద్యార్థులు పట్టభద్రులవుతున్నారు. వీరిలో 80 వేల నుంచి 90 వేల మంది ఇంజనీరింగ్, సాంకేతిక రంగాలకు చెందినవారే. 
⇒ డేటా సెంటర్ల ఏర్పాటుకు అనువుగా భూకంప సంభావ్యత తక్కువగా ఉండటం, ఏఐ సాంకేతికతకు సంబంధించిన మౌలిక వసతులు ఎక్కువగా ఉండటం. 


జీసీసీల దృష్టి ఉన్న రంగాలివే..
తెలంగాణలో ఏర్పాటవుతున్న జీసీసీలు కొన్ని ప్రధాన రంగాల్లో కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌/ఇంటర్‌నెట్, ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్, ఎఫ్‌ఎంసీజీ, సెమీకండక్టర్, ఫార్మాస్యూటికల్స్, రిటైల్, మెడికల్‌ డివైజెస్, టెలి కమ్యూనికేషన్స్, బీఎఫ్‌ఎస్‌ఐ, ఆటోమోటివ్, వృత్తిపరమైన సేవల రంగాల్లో జీసీసీల ఏర్పాటుకు సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. 

తెలంగాణలో ఏర్పాటైన జీసీసీలన్నీ హైదరాబాద్‌లో.. ప్రత్యేకించి గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ, మాదాపూర్, కొండాపూర్, మణికొండలోనే కేంద్రీకృతమయ్యాయి. అయితే ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లోనూ జీసీసీల ఏర్పాటుకు మౌలిక వసతులు అందుబాటులో ఉన్నట్లు నాస్కామ్‌ ప్రకటించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement