GCC system
-
జీసీసీల చూపు హైదరాబాద్ వైపు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు హబ్‌గా మారుతోంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై జీసీసీలను ఆకర్షించేందుకు హైదరాబాద్‌తో తీవ్రంగా పోటీ పడుతున్నప్పటికీ.. ఈ రంగంలో తెలంగాణ రాజధాని నగరం స్పష్టమైన ఆధిపత్యం కనబరుస్తోంది. గడిచిన ఐదేళ్లలో భారత్‌లో 1,700 జీసీసీలు, 2,975 జీసీసీ యూనిట్లు ఏర్పాటు కాగా, వీటిలో 30 శాతం హైదరాబాద్‌లోనే నెలకొల్పటం గమనార్హం. 2019లో హైదరాబాద్‌లో 230 జీసీసీలు ఉండగా 2024 నాటికి వీటి సంఖ్య 355కు చేరింది. భారత సాంకేతిక వాతావరణం, ఉద్యోగాల కల్పన, మార్కెట్ వృద్ధి, సామర్థ్యాల పెంపుదల తదితరాల్లో 2030 నాటికి జీసీసీలు కీలకపాత్ర పోషిస్తాయని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాల నిర్వహణ కోసం స్థానిక నైపుణ్యాలు, ప్రావీణ్యత, వనరులను ఒడిసి పట్టుకునేందుకు దిగ్గజ కంపెనీలు వ్యూహాత్మకంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ’(నాస్కామ్) తెలంగాణలో జీసీసీల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను వివరిస్తూ ఇటీవల ‘జీసీసీ తెలంగాణ ప్లే బుక్’ను విడుదల చేసింది. తెలంగాణ అనుకూలతలు ఇవే..! ⇒ హైదరాబాద్‌లో నాణ్యమైన మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతిక ఆవిష్కరణలు, స్టార్టప్ వాతావరణం వేగంగా వృద్ధి చెందుతుండటం. ⇒ భూమి కొనుగోలుపై రాయితీ, ఐటీ పార్క్ ప్రోత్సాహకాలు, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, విద్యుత్ రాయితీ, పేటెంట్‌కు మద్దతు. ⇒ టాస్్క, స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఏటా వేలాది మందికి నైపుణ్య శిక్షణ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఎస్బీ వంటి అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఉండటం. ⇒ వివిధ రంగాల్లో జీసీసీల ఏర్పాటుకు అనువుగా వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో 40 లక్షల నుంచి 60 లక్షల చదరపు మీటర్ల ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తుంది. ⇒ ప్రభుత్వ సంస్థలైన టీ హబ్, వీ హబ్, టీఎస్ఐసీ వంటి స్టార్టప్ ఇంక్యుబేటర్లతో 50కి పైగా జీసీసీలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ⇒ తెలంగాణలో ఏటా స్టెమ్ కోర్సుల్లో (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్) లక్షకు పైగా విద్యార్థులు పట్టభద్రులవుతున్నారు. వీరిలో 80 వేల నుంచి 90 వేల మంది ఇంజనీరింగ్, సాంకేతిక రంగాలకు చెందినవారే. ⇒ డేటా సెంటర్ల ఏర్పాటుకు అనువుగా భూకంప సంభావ్యత తక్కువగా ఉండటం, ఏఐ సాంకేతికతకు సంబంధించిన మౌలిక వసతులు ఎక్కువగా ఉండటం. జీసీసీల దృష్టి ఉన్న రంగాలివే..తెలంగాణలో ఏర్పాటవుతున్న జీసీసీలు కొన్ని ప్రధాన రంగాల్లో కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. సాఫ్ట్వేర్/ఇంటర్నెట్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ, సెమీకండక్టర్, ఫార్మాస్యూటికల్స్, రిటైల్, మెడికల్ డివైజెస్, టెలి కమ్యూనికేషన్స్, బీఎఫ్ఎస్ఐ, ఆటోమోటివ్, వృత్తిపరమైన సేవల రంగాల్లో జీసీసీల ఏర్పాటుకు సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. తెలంగాణలో ఏర్పాటైన జీసీసీలన్నీ హైదరాబాద్‌లో.. ప్రత్యేకించి గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, మణికొండలోనే కేంద్రీకృతమయ్యాయి. అయితే ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లోనూ జీసీసీల ఏర్పాటుకు మౌలిక వసతులు అందుబాటులో ఉన్నట్లు నాస్కామ్ ప్రకటించింది. -
ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు చేరే రంగం!
దేశీయ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) పరిశ్రమ 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల(రూ.84.38 లక్షల కోట్లు)కు చేరనుంది. అందులో పనిచేసే ప్రొఫెషనల్స్ సంఖ్య 25 లక్షలకు పెరగనుంది. భారత్‌లో జీసీసీలపై రూపొందించిన ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దాని ప్రకారం ప్రస్తుతం దేశీయంగా 1,700 పైచిలుకు జీసీసీలు ఉన్నాయి. వీటి మొత్తం వార్షిక ఆదాయం 64.6 బిలియన్ డాలర్ల పైగా ఉండగా, 19 లక్షల మంది ప్రొఫెషనల్స్ వివిధ హోదాల్లో పని చేస్తున్నారు.‘భారతీయ జీసీసీలు సంఖ్యాపరంగానే కాకుండా సంక్లిష్టత, వ్యూహాత్మక ప్రాధాన్యతపరంగా కూడా ఎదుగుతున్నాయి. గడిచిన అయిదేళ్లలో సగానికి పైగా సెంటర్స్, సాంప్రదాయ సర్వీసుల పరిధికి మించి సేవలు అందిస్తున్నాయి’ అని నివేదిక పేర్కొంది. ‘గ్లోబల్ కార్పొరేషన్ల వ్యూహాత్మక కార్యకలాపాలకు కీలక కేంద్రంగా భారత్ ఎదుగుతోంది. ఈ నేపథ్యంలోనే జీసీసీ మార్కెట్ 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరనుంది. అలాగే సిబ్బంది సంఖ్య 25 లక్షలకు చేరనుంది’ అని పేర్కొంది. ఇదీ చదవండి: మీటింగ్‌కు రాలేదని 90 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓనివేదిక ప్రకారం.. 70 శాతం సెంటర్లు 2026 నాటికి అధునాతన కృత్రిమ మేథ సామర్థ్యాలను సంతరించుకోనున్నాయి. వీటిలో ఆపరేషనల్ అనలిటిక్స్ కోసం మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ మొదలుకుని ఏఐ ఆధారిత కస్టమర్ సపోర్ట్, ఆర్అండ్డీ కార్యకలాపాల వరకు వివిధ సామర్థ్యాలు ఉండనున్నాయి. తూర్పు యూరప్‌తో పోలిస్తే నిర్వహణ వ్యయాలు సగటున 40 శాతం తక్కువగా ఉండటం వల్ల నాణ్యత విషయంలో రాజీపడకుండా కార్యకలాపాలను పటిష్టం చేసుకోవడానికి అంతర్జాతీయ సంస్థలకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా మారింది. భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న 100 పైగా జీసీసీ దిగ్గజాలపై సర్వే, పరిశ్రమ నిపుణులతో ఇంటర్వ్యూలు, అధ్యయనాలు మొదలైన అంశాల ప్రాతిపదికన ఈ నివేదిక రూపొందింది. -
అంతా ఇన్‌చార్జీలే..
► డీఆర్డిపోలపై పర్యవేక్షణ కరువు ► పూర్తిస్థాయి మేనేజర్లు లేకే ఈ దుస్థితి ► కుంటుపడుతున్న జీసీసీ వ్యవస్థ ► ఆందోళనలో ‘గిరి’జనం జిల్లాలో గిరిజనులకు వివిధ రకాల సేవలందిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేసే జీసీసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న జీసీసీ సొసైటీలకు పూర్తి స్థాయి విధులు నిర్వహించే మేనేజర్లు లేరు. ఏళ్ల తరబడి ఇన్‌చార్జీలతోనే గిరిజన సహకార సంస్థ కాలం వెల్లదీస్తోంది. ఫలితంగా జీసీసీ వ్యవస్థ కుంటుపడడమే కాకుండా అనుకున్న లక్ష్యాలు సాధించడంలో పూర్తిగా విఫలమవుతోంది. ఉట్నూర్(ఖానాపూర్): జిల్లాలో గిరిజనుల ఆర్థికాభివృద్ధి తోపాటు మధ్య దళారీ వ్యవస్థను తొలగించి గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏజెన్సీ కేంద్రంగా 1971లో జీసీసీ వ్యవస్థను ప్రభుత్వం ప్రారంభించింది. ఉట్నూర్ కేంద్రంగా జీసీసీ డివిజన్ కార్యాలయం ఏర్పాటుతోపాటు జిల్లా వ్యాప్తంగా ఇచ్చోడ, ఉట్నూర్, ఆదిలాబాద్, జన్నారం, ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రాంతాల్లో సొసైటీలు (సహకార మార్కెటింగ్ సంఘాలు) ఏర్పాటు చేసింది. వీటి ఆధీనంలో 90 డీఆర్‌డిపోలు, 40 సబ్ డిపోలు, 19 గిరి బజార్లు, 21 గిరి దుకాణాలు ఏర్పాటు చేసి గిరిజనులకుసేవలందిస్తోంది. అయితే వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు ప్రతీ సొసైటీకి ఒక్కో మేనేజర్ విధులు నిర్వహించాలి. మేనేజర్ తన పరిధిలోని డీఆర్‌డిపోలు, సబ్ డిపోలను పర్యవేక్షించాలి. గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయడం, వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేయడం మేనేజర్ ముఖ్య విధి. ఇంతటి కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సిన సొసైటీలకు పూర్తి స్థాయి మేనేజర్లు లేక పోవడంతో జీసీసీ వ్యవస్థ కుంటుపడుతోంది. సీనియర్ అసిస్టెంట్లకే బాధ్యతలు.. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు జీసీసీ సొసైటీలకు పూర్తి స్థాయి మేనేజర్లు లేక పో వడంతో ఆయా సొసైటీల్లో విధులు నిర్వహించే సీనియర్ అసిస్టెంట్లకు ఇన్చార్జి మేనేజర్లుగా బాధ్యతలు అప్పగించారు. దీంతో ఉట్నూర్, జన్నారం సొ సైటీలకు ఫుల్ అడిషనల్ ఇన్చార్జి మేనేజర్‌గా రాథోడ్ తారాచంద్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్ సొసైటీ మేనేజర్‌గా ఎం.ఉపేందర్, ఇచ్చోడ సొ సైటీకి ధన్ను, సిర్పూర్ కాగజ్‌నగర్ సొసైటీకి రాథోడ్ గులాబ్‌సింగ్, ఆదిలా బాద్ సొసైటీకి రాథోడ్ బాపురావ్‌లు ఇన్చార్జి మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. కుంటుపడుతున్న వ్యవస్థ.. జీసీసీ సొసైటీ అభివృద్ధిలో మేనేజర్లదే కీలక పాత్ర. ఏ ఒక్క సొసైటీకి పూర్తి స్థాయిలో విధులు నిర్వహించే మేనేజర్లు లేక జీసీసీ వ్యవస్థ కుంటుపడుతోందని గిరిజనులు వాపోతున్నారు. సొసైటీ మేనేజర్లుగా విధులు నిర్వహించేవారు గిరిజనుల తరఫున చిన్నతరహా అటవీ ఉత్పత్తుల యూనిట్లను అటవీశాఖ నుంచి లీజుకు తీసుకుని గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలి. గిరిజనులకు డీఆర్‌డిపోల ద్వారా నిత్యావసర సరకులు సరఫరా చేయాలి. గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలోని శ్రమ, తదితర పాఠశాలలకు బియ్యం, ఇతర నిత్యావసరాలు, కాస్మొటిక్స్ సరఫరా చేయాలి. గిరిజనులకు అవసరమైన స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు అందించాలి. గిరి బజార్లు, గిరి దుకాణాలు లాంటివి పర్యవేక్షించాలి. వాటి అభివృద్ధికి బాటలు వేయాలి. ఇలాంటి కీలక విధులు నిర్వహించే పూర్తి స్థాయి మేనేజర్లు సొసైటీలకు లేక జీసీసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రభుత్వం దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టి జీసీసీల సేవలు తమకు అందేలా చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. ప్రమోషన్ల కోసం ఎదురుచూపులే.. గిరిజన సహకార సంస్థలో 2008 నుంచి ప్రమోషన్లు నిలిచిపోవడంతో జీసీసీ అభివృద్ధి కుంటుపడుతోంది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో జీసీసీ రెండుగా విభజించబడుతుందని, దీంతో తెలంగాణ ప్రభుత్వం ప్రమోషన్లు, బదిలీలు చేపట్టనుందని సంస్థ సిబ్బంది, అధికారులు ఆశించారు. కానీ ఇంతవరకు రెండు రాష్ట్రాల మధ్య జీసీసీ విభజించబడలేదు. దీంతో నాటి నుంచి పదోన్నతులు లేక జీసీసీలకు ఇన్చార్జి మేనేజర్లతో కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీసీసీ విభజన లేక తమకు ఎలాంటి బదిలీలు, పదోన్నతులు లేక పోవడంతో ఉన్న ఉద్యోగంలోనే విరమణ చేయాల్సిన దుస్థితి ఉందని పలువురు వాపోతున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు జీసీసీలో విభజన చేపట్టి బదిలీలు, పదోన్నతులు కల్పించాలని కోరుతున్నారు.