► డీఆర్‌డిపోలపై పర్యవేక్షణ కరువు
► పూర్తిస్థాయి మేనేజర్లు లేకే ఈ దుస్థితి
► కుంటుపడుతున్న జీసీసీ వ్యవస్థ
► ఆందోళనలో ‘గిరి’జనం
జిల్లాలో గిరిజనులకు వివిధ రకాల సేవలందిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేసే జీసీసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న జీసీసీ సొసైటీలకు పూర్తి స్థాయి విధులు నిర్వహించే మేనేజర్లు లేరు. ఏళ్ల తరబడి ఇన్‌చార్జీలతోనే గిరిజన సహకార సంస్థ కాలం వెల్లదీస్తోంది. ఫలితంగా జీసీసీ వ్యవస్థ కుంటుపడడమే కాకుండా అనుకున్న లక్ష్యాలు సాధించడంలో పూర్తిగా విఫలమవుతోంది.
ఉట్నూర్(ఖానాపూర్): జిల్లాలో గిరిజనుల ఆర్థికాభివృద్ధి తోపాటు మధ్య దళారీ వ్యవస్థను తొలగించి గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏజెన్సీ కేంద్రంగా 1971లో జీసీసీ వ్యవస్థను ప్రభుత్వం ప్రారంభించింది. ఉట్నూర్ కేంద్రంగా జీసీసీ డివిజన్ కార్యాలయం ఏర్పాటుతోపాటు జిల్లా వ్యాప్తంగా ఇచ్చోడ, ఉట్నూర్, ఆదిలాబాద్, జన్నారం, ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రాంతాల్లో సొసైటీలు (సహకార మార్కెటింగ్ సంఘాలు) ఏర్పాటు చేసింది.
వీటి ఆధీనంలో 90 డీఆర్‌డిపోలు, 40 సబ్ డిపోలు, 19 గిరి బజార్లు, 21 గిరి దుకాణాలు ఏర్పాటు చేసి గిరిజనులకుసేవలందిస్తోంది. అయితే వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు ప్రతీ సొసైటీకి ఒక్కో మేనేజర్ విధులు నిర్వహించాలి. మేనేజర్ తన పరిధిలోని డీఆర్‌డిపోలు, సబ్ డిపోలను పర్యవేక్షించాలి. గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయడం, వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేయడం మేనేజర్ ముఖ్య విధి. ఇంతటి కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సిన సొసైటీలకు పూర్తి స్థాయి మేనేజర్లు లేక పోవడంతో జీసీసీ వ్యవస్థ కుంటుపడుతోంది.
సీనియర్ అసిస్టెంట్‌లకే బాధ్యతలు..
జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు జీసీసీ సొసైటీలకు పూర్తి స్థాయి మేనేజర్లు లేక పో వడంతో ఆయా సొసైటీల్లో విధులు నిర్వహించే సీనియర్ అసిస్టెంట్‌లకు ఇన్‌చార్జి మేనేజర్లుగా బాధ్యతలు అప్పగించారు. దీంతో ఉట్నూర్, జన్నారం సొ సైటీలకు ఫుల్ అడిషనల్ ఇన్‌చార్జి మేనేజర్‌గా రాథోడ్ తారాచంద్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్ సొసైటీ మేనేజర్‌గా ఎం.ఉపేందర్, ఇచ్చోడ సొ సైటీకి ధన్ను, సిర్పూర్ కాగజ్‌నగర్ సొసైటీకి రాథోడ్ గులాబ్‌సింగ్, ఆదిలా బాద్ సొసైటీకి రాథోడ్ బాపురావ్‌లు ఇన్‌చార్జి మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు.
కుంటుపడుతున్న వ్యవస్థ..
జీసీసీ సొసైటీ అభివృద్ధిలో మేనేజర్లదే కీలక పాత్ర. ఏ ఒక్క సొసైటీకి పూర్తి స్థాయిలో విధులు నిర్వహించే మేనేజర్లు లేక జీసీసీ వ్యవస్థ కుంటుపడుతోందని గిరిజనులు వాపోతున్నారు. సొసైటీ మేనేజర్లుగా విధులు నిర్వహించేవారు గిరిజనుల తరఫున చిన్నతరహా అటవీ ఉత్పత్తుల యూనిట్లను అటవీశాఖ నుంచి లీజుకు తీసుకుని గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలి. గిరిజనులకు డీఆర్‌డిపోల ద్వారా నిత్యావసర సరకులు సరఫరా చేయాలి.
గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలోని శ్రమ, తదితర పాఠశాలలకు బియ్యం, ఇతర నిత్యావసరాలు, కాస్మొటిక్స్ సరఫరా చేయాలి. గిరిజనులకు అవసరమైన స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు అందించాలి. గిరి బజార్లు, గిరి దుకాణాలు లాంటివి పర్యవేక్షించాలి. వాటి అభివృద్ధికి బాటలు వేయాలి. ఇలాంటి కీలక విధులు నిర్వహించే పూర్తి స్థాయి మేనేజర్లు సొసైటీలకు లేక జీసీసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రభుత్వం దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టి జీసీసీల సేవలు తమకు అందేలా చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.
ప్రమోషన్ల కోసం ఎదురుచూపులే..
గిరిజన సహకార సంస్థలో 2008 నుంచి ప్రమోషన్లు నిలిచిపోవడంతో జీసీసీ అభివృద్ధి కుంటుపడుతోంది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో జీసీసీ రెండుగా విభజించబడుతుందని, దీంతో తెలంగాణ ప్రభుత్వం ప్రమోషన్లు, బదిలీలు చేపట్టనుందని సంస్థ సిబ్బంది, అధికారులు ఆశించారు. కానీ ఇంతవరకు రెండు రాష్ట్రాల మధ్య జీసీసీ విభజించబడలేదు. దీంతో నాటి నుంచి పదోన్నతులు లేక జీసీసీలకు ఇన్‌చార్జి మేనేజర్లతో కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జీసీసీ విభజన లేక తమకు ఎలాంటి బదిలీలు, పదోన్నతులు లేక పోవడంతో ఉన్న ఉద్యోగంలోనే విరమణ చేయాల్సిన దుస్థితి ఉందని పలువురు వాపోతున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు జీసీసీలో విభజన చేపట్టి బదిలీలు, పదోన్నతులు కల్పించాలని కోరుతున్నారు.