
పదో తరగతి విద్యార్థి ఎత్తు 6.8 అడుగులు
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ కా అమితాబ్ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. బడిలో చదివే విద్యార్థుల ఎత్తు సాధారణంగా 5 అడుగుల వరకు ఉంటుంది. కానీ ఒక విద్యార్థి ఏకంగా 6.8 అడుగుల ఎత్తుతో ఆకర్షణగా నిలిచాడు. ఆదిలాబాద్ పట్టణం (Adilabad Town) బొక్కల్‌గూడకు చెందిన వన్నెల సుజాత, వినోద్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు హేమంత్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల (Govt School) నంబర్–2లో పదో తరగతి చదువుతున్నాడు.
ఈ విద్యార్థి తాత నందు 6.5 అడుగుల ఎత్తు, తల్లి సైతం అంతే ఎత్తులో ఉంటారు. హేమంత్ చెల్లి పదో తరగతి చదువుతోంది. హేమంత్ (Hemanth) 7వ తరగతిలో 5 అడుగుల ఎత్తులో ఉండగా, 8వ తరగతిలో 6 అడుగులు, 9వ తరగతిలో 6.5, ప్రస్తుతం పదో తరగతిలో 6.8 అడుగుల ఎత్తుకు పెరిగాడు. దీంతో స్నేహితులతోపాటు ఇంటి చుట్టుపక్కల వారు, బంధువులు హేమంత్‌ను జూనియర్ అమితాబ్‌గా పిలుస్తున్నారు.
చివరి బెంచీలో కూర్చుంటా..
అందరికంటే పొడవుగా ఉండటంతో తరగతి గదిలో చివరి బెంచీలో కూర్చుంటాను. ఆటోలో కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంటోంది. పోలీసు ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను. శుభకార్యాలకు వెళ్లినప్పుడు నాతో బంధువులు, మిత్రులు సెల్ఫీలు దిగుతున్నారు.
– హేమంత్
ఈఏపీ సెట్‌కు తొలిరోజు 5,010 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్‌కు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ శనివారం మొదలైంది. తొలి రోజు 5,010 దరఖాస్తులు వచ్చినట్టు సెట్ కోకన్వీనర్, జేఎన్టీయూహెచ్ రెక్టార్ కె.విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ విభాగానికి 3,116, అగ్రికల్చర్, ఫార్మసీ సెట్ విభాగానికి 1,891, రెండు విభాగాలకు రాసే వారి 3 దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించారు.
ఓయూలో ముగిసిన పీహెచ్‌డీ దరఖాస్తుల స్వీకరణ
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పీహెచ్‌డీ ఎంట్రన్స్ టెస్ట్–2025 దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారం ముగిసింది. కేవలం 456 సీట్లకు 9000 మంది దరఖాస్తు చేసుకున్నారు. రూ.2000 అపరాధ రుసముతో ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సీట్ల సంఖ్యను పెంచి.. నెలరోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించాలని తెలంగాణ డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జి.విజయ్ నాయక్ శనివారం పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగా రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
చదవండి: ఊరు, ఇల్లు వదిలి.. అక్కడ అందరిదీ అదే పరిస్థితి
కాగా, ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితి 65 ఏళ్లకు పెరిగినా.. పీహెచ్‌డీ సీట్ల సంఖ్యను పెంచేందుకు ఓయూ అధికారులు సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారంతో ముగిసినా పీహెచ్‌డీ సీట్ల పెంపుపై ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.