ssc student
-
తండ్రి మరణాన్ని దిగమింగుకుని..
ఖమ్మం: అనారోగ్యంతో తండ్రి మరణించగా, అంత్యక్రియలు నిర్వహించిన మరుసటి రోజే.. ఆ బాధను దిగమింగుకుని ఎస్సెస్సీ విద్యార్థి పరీక్షకు హాజరయ్యాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని అవని వెంచర్లో నివాసముంటున్న వై.ముత్యాలరావు అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందగా ఆయన అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. ముత్యాలరావు ఏకై క కుమారుడు, ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎస్సెస్సీ చదువుతున్న మౌళిరాజ్ తలకొరివి పెట్టాడు. అయితే, సోమవారం నుంచి పదో తరగతి వార్షిక ప్రారంభం కావడంతో బంధువులు, కుటుంబీకుల సూచన మేరకు ఆయన దుఃఃఖాన్ని భరిస్తూనే సత్తుపల్లిలోని ఎన్టీఆర్నగర్లోని పరీక్షా కేంద్రానికి హాజరై తెలుగు పరీక్ష రాశాడు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు, స్నేహితులు సైతం ఆయనకు మనోధైర్యాన్నిచ్చారు. ఇవి చదవండి: 13 ఏళ్లుగా '108 అంబులెన్స్' రూపంలో.. వెంటాడిన మృత్యువు! -
ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని తీవ్ర నిర్ణయం..
బాపట్ల: పరీక్షలు సరిగ్గా రాయలేనేమోననే బెంగతో మానసిక ఒత్తిడికి గురైన ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన బుధవారం సాయంత్రం మార్టూరులో జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బలరాం కాలనీకి చెందిన తిరుమలశెట్టి నాగేశ్వరరావు కుమార్తె ప్రవల్లిక (16) చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. త్వరలో జరగబోతున్న పరీక్షలు సరిగా రాయలేనేమోనని తరచూ స్నేహితులతో చెప్పే ప్రవల్లిక మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరెతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బైక్.. క్షణంలో ఇద్దరూ.. -
అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో.. జపాన్‌కు పయనమైన హర్షిత!
సాక్షి, కరీంనగర్/పెద్దపల్లి: రామగిరి మండలం చందనాపూర్ ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థి డి.హర్షిత శుక్రవారం జపాన్‌కు బయలుదేరి వెళ్లింది. దాసరి మహేశ్–స్వప్న దంపతుల కుమార్తె దాసరి హర్షిత.. గైడ్ టీచర్ సంపత్‌కుమార్ సహకారంతో తను తయారుచేసిన బహుళప్రయోజనకర(హెల్మెట్) హెల్మెట్ ప్రాజెక్ట్ జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది. ఈనెల 5 నుంచి పదో తేదీ వరకు జపాన్‌లోని టోక్యో నగరంలో నిర్వహించనున్న అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో తన ప్రాజెక్ట్‌ను ప్రదర్శించన్నుట్లు హెచ్ఎం లక్ష్మి, గైడ్ టీచర్ సంపత్ కుమార్ తెలిపారు. ఈసందర్భంగా హర్షిత మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికపై తన ప్రాజెక్టు ప్రదర్శించడం సంతోషంగా ఉందని పేర్కొంది. -
గ్రహ శకలం కనుగొన్న విద్యార్థిని.. అరుదైన రికార్డు సొంతం
నిడదవోలు(తూర్పుగోదావరి జిల్లా): నిడదవోలుకి చెందిన పదో తరగతి విద్యార్థి కుంచాల కైవల్యరెడ్డి మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్న ముఖ్యమైన ఆ్రస్టాయిడ్ బెల్ట్‌లో గ్రహ శకలం 2021 సీఎం37ను కనుగొన్నది. నాసా భాగస్వామ్య సంస్థ అయిన అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొలాబిరేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన క్యాంపెయిన్‌లో ఈ గ్రహశకలాన్ని కనిపెట్టింది. ఈ మేరకు అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొలాబిరేషన్ సంబంధిత ధ్రువీకరణపత్రాన్ని కైవల్యకు అందజేసింది. చదవండి: మీ కెరీర్ మలుపు తిప్పే టర్నింగ్ పాయింట్.. నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సే.. పాన్‌స్టార్స్ టెలిస్కోప్ సాయంతో తీసిన అంతరిక్ష ఛాయా చిత్రాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి విశ్లేషించడం ద్వారా ఈ గ్రహశకలాన్ని గుర్తించినట్లు కైవల్య తెలిపింది. ఢిల్లీకి చెందిన స్వచ్ఛంధ సంస్థ స్పేస్‌పోర్ట్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు సమీర్ సత్యదేవ్ వద్ద కైవల్యరెడ్డి శిక్షణ తీసుకుని ‘గామా’ టీం పేరు తో శకలాన్ని గుర్తించింది. గతంలో కైవల్య 2020 పీఎస్ 24 అనే మెయిన్ బెల్ట్‌లో ఉన్న గ్రహశకలాన్ని కనుగొనడంతో సీఎం వైఎస్ జగన్ ఆమెను అభినందిస్తూ రూ.లక్ష నగదు బహుమతి అందజేసి ప్రోత్సహించారు. రెండో గ్రహశకలం కనుగొన్న కైవల్యని తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి అభినందించారు. -
యశస్వి ఆత్మహత్య.. పాఠశాల సీజ్
నేరేడ్మెట్: పదో తరగతి విద్యార్థిని యశస్విని ఆత్మహత్య ఘటన నేపథ్యంలో అఖిలపక్ష నాయకులతోపాటు విద్యార్థి సంఘాల నేతలు శుక్రవారం నేరేడ్మెట్ ఠాణా పరిధిలోని రవీంద్రభారతి పాఠశాల ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. పాఠశాల వద్దకు మల్కాజిగిరి మండల విద్యాశాఖ అధికారి శశిధర్ రావడంతో ఉద్రికత్త నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన పాఠశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఫీజు చెల్లించాలని ఒత్తిడి వల్లనే విద్యార్థిని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు తల్లిదండ్రులు చెప్పారని, ఈమేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలతో పాఠశాలను సీజ్ చేసి, సీలు వేసినట్టు ఎంఈఓ తెలిపారు. ప్రస్తుతం స్కూల్ నిర్వాహకులు విజయలక్ష్మిరెడ్డి అందుబాటులో లేరని, ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నామని ఎంఈఓ వివరించారు. విజయలక్ష్మిరెడ్డిపై కేసు నమోదు చేసినట్టు నేరేడ్మెట్ సీఐ నర్సింహ్మాస్వామి తెలిపారు. మల్కాజిగిరి తహసీల్ధార్ వినయలత స్కూల్‌ను పరిశీలించారు. అనంతరం విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వ పరంగా ఆర్ధిక సహాయం అందేలా చూస్తానని చెప్పారు. విద్యార్థిని యశస్విని తల్లిదండ్రులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మైనంపల్లి విద్యార్థి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.2లక్షల సాయం శుక్రవారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఈస్ట్‌కాకతీయనగర్‌లోని విద్యార్థిని యశస్విని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించారు. ఫీజు చెల్లించాలని స్కూల్ యజమాన్యం యశస్వినితో తనకు ఫోన్ చేయించారని, ఒత్తిడి చేయడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు విద్యార్థిని తండ్రి హరిప్రసాద్ ఎమ్మెల్యేతో వాపోయారు. ఈ విషయంపై ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయంచేస్తామని హామీ ఇచ్చారు. నేతల రూ.3లక్షల సాయం బీజేపీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, టీఆర్ఎస్,బీజేపీ నేతలు బద్ధం పరుశురామ్‌రెడ్డి,సతీష్‌కుమార్, ప్రసన్ననాయుడుతోపాటు పలువురు నాయకులు కలిపి రూ.3లక్షలను అందజేస్తామన్నారు. స్కూల్ యాజమాన్యం తరపున రూ.5లక్షల ఆర్థిక సహాయం అందేలా చూస్తానని ఎమ్మెల్యేకు స్కూల్ బిల్డింగ్ యజమాని చెప్పారు. చదవండి: ఫీజు వేధింపులకు విద్యార్థిని బలి -
టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
నేరేడ్మెట్: ఫీజులు చెల్లించాలని స్కూలు యాజమాన్యం ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో మనస్తాపానికి గురైన టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గురువారం నేరేడ్మెట్ ఠాణా పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నేరేడ్మెట్ పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈస్ట్ కాకతీయనగర్‌లో ఉండే హరిప్రసాద్ దంపతులు కూలీలు. వీరికి ముగ్గురు కుమార్తెలు. చిన్న కుమార్తె యశస్విని (16) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. గడిచిన మూడ్రోజులుగా స్కూల్ ఫీజు సుమారు రూ.3 వేలు చెల్లించాలని స్కూల్ యజమాన్యం తండ్రికి ఫోన్‌చేస్తూ ఒత్తిడి తెస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన యశస్విని స్కూల్‌కు వెళ్లలేదు. తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని నేరేడ్మెట్ సీఐ నర్సింహస్వామి చెప్పారు. -
‘పది’లో ఫస్ట్ వస్తానంటివే..!
సాక్షి, కమలాపురం: కమలాపురం–లేటపల్లె ప్రధాన రహదారిలో నసంతపురం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి పరీక్ష రాయడానికి వెళ్తున్న విద్యార్థి దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యుల రోదనతో ఆసుపత్రి ఆవరణం దద్దరిల్లింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎర్రబల్లె కొత్తపల్లెకు చెందిన విద్యార్థి అలిదెన విష్ణువర్ధన్ రెడ్డి(15) చిన్నచెప్పలి హైస్కూల్లో పదవతరగతి చదువు తున్నాడు. రోజూ అదే గ్రామానికి చెందిన మరి కొంత మంది విద్యార్థులతో కలిసి ఆటోలో పాఠశాలకు వెళ్తాడు. పదవ తరగతి పరీక్షలు కమలాపురంలో బాలికల హైస్కూల్ పరీక్ష కేంద్రంలో రాస్తున్నాడు. రోజులాగే మంగళవారం కూడా ఇతర విద్యార్థులతో కలిసి పరీక్ష రాయడానికి ఆటోలో బయలు దేరి వెళ్లాడు. అయితే ఆ ఆటో మార్గ మధ్యలో నసంతపురం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీ కొంది. ప్రమాదంలో విష్ణువర్ధన్‌రెడ్డి కుడి కాలువ విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటీన చికిత్స నిమిత్తం మరో ఆటోలో కమలాపురం తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి విష్ణువర్ధన్ రెడ్డి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అలాగే ఈ ఘటనలో 6వ తరగతి చదువుతున్న నవ్య శ్రీ,, 4వ తరగతి చదువుతున్న వెంకట కిషోర్‌తో పాటు ఆటో డ్రైవర్ సుబ్బరాయుడు తీవ్రంగా గాయపడ్డారు. వారికి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం రిమ్స్‌కు రెఫర్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరు బాధ్యత వహిస్తారు రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి పరీక్షలు రాయడానికి వెళ్తూ విద్యార్థి విష్ణు వర్ధన్ రెడ్డి మృతి చెందడం దారుణం అని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, రాజోలి వీరారెడ్డి తెలిపారు. మంగళవారం కమలాపురం ఆసుపత్రిలో ఉన్న మృతదేహాన్ని వారు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ శివారు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు లేక పోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ప్రజల సేవ కోసం బస్సులు ఏర్పాటు చేస్తే నష్టం వస్తోందని ఆర్టీసీ వారు సర్వీసులను తొలగించడం అన్యాయం అన్నారు. ఈ ప్రమాదం పట్ల ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? అధికారులా? లేక ఆర్టీసీనా? అని ప్రశ్నించారు. మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందిస్తానని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. -
ఒత్తిడి భరించలేక విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, ఖమ్మం: మితిమీరిన ఒత్తిడి భరించలేక విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న సంఘటనలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా సింగరేణి మండలం చీమలపాడులో ఓ పదో తరగతి విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన రంగు సౌజన్య(15) శుక్రవారం కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. కాగా.. పాఠశాలలో ఒత్తిడి కారణంగానే తమ కూతురు ఇంత పని చేసిందని.. ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
‘విషా’దాంతం
కళ్లెదుటే కన్నవారు కాట్లాడుకుంటుంటే కలత చెందింది. తరచూ వారించడానికి ప్రయత్నించి విఫలమైంది. పలు మార్లు బెదిరించింది కూడా. అయినా వారిలో మార్పు రాలేదు. వారిని మందలించేందుకు వయసు సరిపోలేదు. వారితో వేగలేక ఇక వారికి దూరం కావాలనుకుంది. ఇక చావే శరణ్యమనుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇదీ జియ్యమ్మవలస మండలం శిఖబడికి చెందిన చీపురుపల్లి మాలతి విషాదాంతం. విజయనగరం, జియ్యమ్మవలస(కురుపాం): ఇంట్లో నిత్యం కలహాలు... ఎంతగా చెప్పినా వారు సర్దుకు పోకపోవడం ఓ విద్యార్థిని ప్రాణాలు బలిగొనేలా చేశాయి. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం శిఖబడిలో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించిన వివరాలివి. గ్రామానికి చెందిన చీపురుపల్లి దుర్గారావు, గంగమ్మ దంపతులకు మాలతి(15), అనే కుమార్తె, ఏడేళ్ల కుమారుడు ఉన్నారు. ఆమె బొమ్మిక జగన్నాథపురం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు నిత్యం గొడవలు పడుతుండడంతో ఎన్నో మార్లు వారిని వారించడానికి యత్నించింది. కానీ వారు వినకపోవడంతో మాలతి గురువారం పురుగు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది నాలుగోసారి... ఆమె ఆత్మహత్యకు గతంలోనూ మూడుసార్లు యత్నించింది. ఇది నాలుగోసారని గ్రామస్తులు చెబుతున్నారు. రోజూ ఇంట్లో కలహాలు ఆమెలో కలతను రేపాయి. గురువారం ఉదయం కూడా గొడవ జరగ్గా తల్లి గంగమ్మను తండ్రి దుర్గారావు తీవ్రంగా కొట్టి బయటకు వెళ్లిపోయాడు. అది కళ్లారా చూసిన మాలతి మనస్తాపంతో దగ్గరలో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను చూసిన తల్లి ఇరుగుపొరుగువారికి చెప్పగా వారు వచ్చి 108కు సమాచారం అందించారు. ఆ సిబ్బంది వచ్చి పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్థారించారు. చదువులో వెనుకబడినట్టు కేసు... కాగా తల్లిదండ్రులు మాత్రం పోలీసులకు మాలతి చదువులో బాగా వెనుకబడిందనీ... అందుకే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. గ్రామస్తులు కూడా ఆ విషయాన్ని బలపర్చడంతో వారు తెలిపిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ చిరంజీవులు తెలిపారు. ఎల్విన్‌పేట సీఐ ఎస్.రాము కూడా సంఘటనా స్థలానికి వచ్చి సమీక్షించారు. చదువులో తెలివైనదే: ఉపాధ్యాయులు బీజేపురం పాఠశాలను గురువారం తనిఖీ చేసిన డీఈవో అరుణకుమారి విద్యార్థి మృతిపై తరగతిలో వివరాలు సేకరించారు. అయితే ఆమె బాగా చదువుతుందని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా తెలిపారు. గత సంవత్సరం ప్రోగ్రెస్ రికార్డులు పరిశీలించగా మంచి మార్కులు వచ్చినట్లు ఉందని డీఈవో తెలిపారు. కాగా పరీక్షలకు ఇంకా చాలా సమయం ఉందనీ, బాగా చదువుతుందనీ, పరీక్షలకు భయపడేది కాదనీ ఉపాధ్యాయులు చెబుతున్నారు. -
టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
మెడపై మార్కుల ‘ఖడ్గం’ ♦ సరిగ్గా స్కోర్ చేయడం లేదని విద్యార్థిని ఇంటికి పంపిన స్కూల్ యాజమాన్యం ♦ తానింతే.. చదవలేనని చెప్పినా ♦ వినని టీచర్లు, తల్లిదండ్రులు ♦ వారంపాటు పాఠశాలకు రావొద్దని హుకుం.. ♦ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి హైదరాబాద్: బట్టీ చదువులు.. మార్కుల ఒత్తిడి మరో విద్యార్థి ప్రాణం తీశాయి. ‘నేనింతే.. ఇంతకంటే చదవడం నా వల్ల కాదు’అని చెప్పినా అటు టీచర్లు.. ఇటు కన్న తల్లిదండ్రులు వినిపించుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చదివి తీరాల్సిందేనని తల్లిదండ్రులు.. వారం పాటు స్కూల్‌కు రావొద్దని పాఠశాల యాజమాన్యం హుకుం జారీ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ టెన్త్ విద్యార్థి చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నగరంలోని గోల్నాక దుర్గానగర్‌కు చెందిన రతన్‌కుమార్, సబ్రీనా దంపతుల కుమారుడు నితిన్ జాన్సన్(15) నల్లకుంట సెయింట్ ఆన్స్ స్కూల్లో టెన్త్ చదువుతున్నాడు. ఇటీవల స్కూల్ టీచర్లు.. నితిన్ తండ్రి రతన్‌కుమార్‌ను పాఠశాలకు పిలిపించారు. తోటి విద్యార్థులతో పోలిస్తే.. నితిన్ చదువులో వెనుకబడ్డాడని చెప్పారు. ఇకపై పిల్లాడి చదువుపై శ్రద్ధ తీసుకుంటానని ఆయన చెప్పారు. అయినా నితిన్ చదువు మెరుగుపడలేదు. దీంతో పాఠశాల యాజమాన్యం బుధవారం మరోసారి తల్లిదండ్రులను స్కూల్‌కు పిలిపించింది. విద్యార్థులంతా చదువులో ముందుకెళ్తుంటే నితిన్ వెనుకబడిపోతున్నాడని, ఓ వారం పాటు ఇంటి వద్దే ఉంచుకుని ట్యూషన్ చెప్పించి, సబ్జెక్టుల్లో మెరుగుపడిన తర్వాత పాఠశాలకు పంపించాలని చెప్పి నితిన్‌ను వారితో పాటే ఇంటికి పంపించారు. దీంతో బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు నితిన్‌ను మందలించి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు బస్తీలోనే స్నేహితులతో గడిపిన నితిన్ రాత్రి 8 గంటలకు తన గదిలోకి వెళ్లి తల్లి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన తండ్రి రతన్‌కుమార్ నితిన్ గది వద్దకు వెళ్లి చూడగా ప్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కిందికి దించేలోపే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నితిన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇంత పని చేస్తాడనుకోలేదు నితిన్ చాలా చురుకైనవాడని, పదో తరగతి కాబట్టీ చదువుపై దృష్టి పెట్టాలని తాపత్రయపడ్డామే తప్ప ఇలా చేస్తాడనుకోలేదని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. కొద్దిరోజుల క్రితం చదువుకోమంటే చస్తానని బెదిరించాడని, ఇంత చలాకీగా ఉండేవాడు చనిపోయేంత ధైర్యం ఎలా చేస్తాడని అనుకున్నామని బోరుమన్నారు. ఎదిగిన కొడుకు అర్ధాంతరంగా తనువు చాలించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు తనతోనే ఉన్నాడని, స్కూల్లో జరిగిన విషయాన్ని తనతో చెప్పలేదని, సరదాగా ఉండేవాడని, ఇలా చనిపోతాడని మాత్రం అనుకోలేదని నితిన్ స్నేహితుడు శ్యామ్సన్ చెప్పాడు. వేధింపులకు పాల్పడలేదు నితిన్‌పై ఎలాంటి ఒత్తిడి, వేధింపులకు తాము పాల్పడలేదని పాఠశాల యాజమాన్యం తెలిపింది. టీసీ ఇచ్చామని, ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేశామని వస్తున్న వార్తల్లో నిజం లేదని సెయింట్ ఆన్స్ పాఠశాల డైరెక్టర్ సాల్మన్‌రాజు చెప్పారు. విద్యార్థి చదువుపై మాత్రమే తాము తల్లిదండ్రులకు చెప్పామన్నారు. అతను ఆత్మహత్య చేసుకోవడం తమను కూడా కలచివేసిందని చెప్పారు. కాగా, విద్యార్థుల మానసిక పరిస్థితులను తెలుసుకోకుండా చదువు చదువూ అంటూ ఒత్తిడి తెచ్చి ఆత్మహత్య చేసుకునేలా పాఠశాల యాజమాన్యం ప్రేరేపించిందంటూ తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్, ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ, డీవోఎఫ్ఐ నాయకులు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. -
ఈతకు వెళ్లి పదో తరగతి విద్యార్థి మృతి
రంగారెడ్డి: ఈతకు వెళ్లిన పదో తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజేష్(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈక్రమంలో బుధవారం రాజేష్ బావిలో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు.