అంధుల T20లో వైజాగ్‌ అమ్మాయి | Vizag girl Karuna Kumari selected for India Blind T20 World Cup team | Sakshi
Sakshi News home page

అంధుల T20లో వైజాగ్‌ అమ్మాయి

Sep 18 2025 3:58 AM | Updated on Sep 18 2025 5:59 AM

Vizag girl Karuna Kumari selected for India Blind T20 World Cup team

దృష్టి అంతా ఆటపైనే

న్యూస్‌మేకర్‌ – కరుణ కుమారి

‘నాకు బాల్‌ కనపడదు. కాని నా మైండ్‌తో, చెవులతో దాని రాకను పసిగట్టి కొడతాను’ అంటోంది విశాఖ అంధబాలిక  పాంగి కరుణ కుమారి. పదో తరగతి చదువుతున్న కరుణ బ్యాటింగ్‌లో దిట్ట. అందుకే నవంబర్‌ 11న ఢిల్లీలో తొలిసారి  నిర్వహించనున్న అంధుల టి20 వరల్డ్‌ కప్‌కి భారత జట్టులో ఎంపికైంది. తెలుగువారు సంతోషపడాల్సిన సందర్భం ఇది. స్ఫూర్తినిస్తున్న కరుణ కుమారి పరిచయం.

స్కూలు పుస్తకాల్లో అక్షరాలు కనపడటం లేదని చదువు మానేసి ఇంట్లో కూచున్న అమ్మాయి నేడు భారత దేశ అంధ మహిళల క్రికెట్‌ జట్టులో స్థానం సం పాదించింది. ఆ అమ్మాయి  పాంగి కరుణకుమారి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం వంట్ల మామిడికి చెందిన అరుణ ప్రస్తుతం విశాఖపట్నం అంధ బాలికల ఆశ్రమ  పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఢిల్లీలో నవంబర్‌ 11 నుంచి జరగనున్న అంధ మహిళల టి20 వరల్డ్‌ కప్‌లో ఆమె భారత్‌ తరఫున ఆడనుంది. అంధ మహిళల కోసం టి20 వరల్డ్‌ కప్‌ నిర్వహించడం ఇదే ప్రథమం.

ఆమె ఆల్‌రౌండర్‌
వంట్ల మామిడిలో కూలినాలి చేసుకునే రాంబాబు, సంధ్యల మొదటి కుమార్తె కరుణ పుట్టుకతోనే దృష్టిలోపంతో పుట్టింది. ఒక కన్ను కొద్దిగా మరో కన్ను పూర్తిగా కనిపించేది కాదు. ఏడవ తరగతి వచ్చేసరికి చూపు దాదాపుగా పోవడంతో చదువు మానేసి ఇంట్లో కూచుంది. అయితే చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుగ్గా ఉండేది. ఫోన్‌లో క్రికెట్‌ చూసేది. 

ఈ విషయం తెలిసి అంధ బాలికలను వెతికి చదివించే బాధ్యతతో విశాఖ అంధ బాలిక ఆశ్రమ  పాఠశాల వారు కరుణ తల్లిదండ్రులను ఒప్పించి తమ స్కూల్‌లో చేర్పించారు. రెసిడెన్షియల్‌ స్కూల్‌ కావడం వల్ల అక్కడ కరుణ తిరిగి చదువులో, ఆటల్లో పడింది. క్రికెట్‌ పట్ల ఉన్న ఆసక్తి గమనించిన పీటీ మేడమ్‌ కరుణనుత్సహించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌.. మూడింటిలో ప్రతిభ చూపుతూ  ఆల్‌రౌండర్‌గా ఎదిగింది కరుణ. నేషనల్‌ సెలక్షన్స్‌లో భాగంగా 2023లో హైదరాబాద్‌లో, 2024లో హుగ్లీలో, 2025లో కొచ్చిలో మేచెస్‌ ఆడింది. సెలెక్టర్ల దృష్టిలో పడింది.

60 బాల్స్‌లో 100 పరుగులు
అంధ మహిళల టి20 వరల్డ్‌ కప్‌ జట్టు ఎంపిక కోసం ఆగస్టు నెలలో బెంగళూరులో 20 రోజుల క్యాంప్‌ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన మ్యాచ్‌లో కరుణ 60 బంతుల్లో 100 పరుగులు చేయడమే కాక 114 నాటౌట్‌గా నిలిచింది.  బౌలింగ్‌లో, ఫీల్డింగ్‌లో కూడా ప్రతిభ చూపింది. దాంతో భారత జట్టుకు కరుణను సెలెక్ట్‌ చేశారు. ‘నాకు బాల్‌ కనపడదు. కాని దాని రాకను పసిగట్టగలను. బాల్‌ రాకను అర్థం చేసుకోలేనప్పుడు అది ఒంటికి తగిలి దెబ్బలయ్యేవి’ అని తెలిపింది కరుణ. ఆమె ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇల్లు కూడా నివాస యోగ్యంగా లేదు. ఇన్ని ప్రతికూలతల్లోనూ ప్రతిభ చూపుతోంది కరుణ.

ఆరు దేశాలతో...
అంధ మహిళల టి20 వరల్డ్‌ కప్‌లో మొత్తం ఆరు దేశాలు  పాల్గొంటున్నాయి. ఢిల్లీ, బెంగళూరుల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఆస్ట్రేలియా,  పాకిస్తాన్, శ్రీలంక, నే పాల్, అమెరికా, ఇంగ్లాండ్‌ జట్లు కలిసి 21 లీగ్‌ మేచ్‌లు, 2 సెమీ ఫైనల్స్, ఒక ఫైనల్‌ను ఆడనున్నారు. ఈ వరల్డ్‌ కప్‌లో మన దేశం కప్పు గెలవాలని, మన కరుణ గొప్ప ప్రతిభ చూ పాలని కోరుకుందాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement