blind cricket
-
భారత్‌లో మహిళల అంధుల టీ20 ప్రపంచకప్.. పాక్ మ్యాచ్‌లు నేపాల్‌లో!
మహిళల విభాగంలో తొలిసారిగా భారత్ అంధుల టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది జరిగే ఈ టోర్నీని నిర్వహించనున్నారు. అయితే, పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లను హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. భారత్‌లో ఆడేందుకు మహిళల పాకిస్తాన్ అంధుల జట్టుకు ఏమైనా వీసా సమస్యలు వస్తే... నేపాల్ లేదంటే శ్రీలంకలో వారి మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మేరకు ప్రపంచ అంధుల క్రికెట్ మండలి (డబ్ల్యూబీసీసీ) తమ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో నిర్ణయించింది.ముల్తాన్‌లో సమావేశంముల్తాన్లో జరిగిన ఈ ఏజీఎంలో 11 సభ్య దేశాల ప్రతినిధులు ప్రత్యక్షంగా హాజరయ్యారు. భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ బోర్డుల ప్రతినిధులు వర్చువల్ (ఆన్లైన్)గా పాల్గొన్నారు. పురుషుల విభాగంలో అంధుల టీ20 ప్రపంచకప్‌ను 2027లో నిర్వహించనున్నారు. ఇక వేదిక, తేదీలను వచ్చే ఏడాది జరిగే ఏజీఎమ్‌లో ఖరారు చేస్తారు. గతేడాదే ఆతిథ్య హక్కుల్ని భారత్‌కు కట్టబెట్టారని భారత అంధుల క్రికెట్ సంఘం (సీఏబీఐ) అధ్యక్షుడు జీకే మహంతేశ్ తెలిపారు.ఖర్చులన్నీ భారత బోర్డు భరిస్తుందిఅయితే, తటస్థ వేదికపై పాక్ ఆడితే ఇందుకు సంబంధించిన ఖర్చులన్నీ భారత బోర్డు భరిస్తుందని ఆయన వెల్లడించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లకు సీఏబీఐ అనుబంధ సంఘం కాదు. ఇది పూర్తిగా ప్రపంచ అంధుల క్రికెట్ మండలి (డబ్ల్యూబీసీసీ) గొడుగుకింద పనిచేస్తుంది.ప్రపంచం చాంపియన్‌గా తొలిసారి పాక్ఇదిలా ఉంటే.. సొంతగడ్డపై పురుషుల అంధుల క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2024 టైటిల్‌ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా డిఫెండింగ్ చాంపియన్ భారత్ పాక్ పర్యటనకు వెళ్లలేదు. పాకిస్తాన్‌కు ఇది సానుకూలాంశంగా మారింది. ఈ క్రమంలో ముల్తాన్‌లో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి పాక్ కొత్త చాంపియన్‌గా అవతరించింది. ఇప్పటికి నాలుగు సార్లు ఈ టోర్నీని నిర్వహించగా మూడుసార్లు భారత్ ట్రోఫీని గెలుచుకుంది. తొలి రెండు ప్రయత్నాల్లో ఫైనల్లో పాక్‌ను, ఆఖరిగా బంగ్లాను ఓడించి విజేతగా నిలిచింది. -
టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా పాకిస్తాన్
పాకిస్తాన్ అంధుల క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఇవాళ (డిసెంబర్ 3) జరిగిన ఫైనల్లో పాక్ బంగ్లాదేశ్‌పై 10 వికెట్ల తేడాతో గెలుపొంది, తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది. ముల్తాన్ (పాకిస్తాన్) వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఆరిఫ్ హుస్సేన్ (54) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో బాబర్ అలీ రెండు వికెట్లు పడగొట్టగా.. మొహమ్మద్ సల్మాన్, మతివుల్లా తలో వికెట్ దక్కించుకున్నారు.140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్.. కేవలం 11 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఓపెనర్ నిసార్ అలీ అజేయమై అర్ద సెంచరీతో (72) సత్తా చాటగా.. మరో ఓపెనర్ మొహమ్మద్ సఫ్దార్ అజేయమైన 47 పరుగులు చేసి తన జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. 12 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో పాక్ టైటిల్ గెలవడం ఇదే మొదటిసారి. ఈ టోర్నీ జరిగిన మూడు ఎడిషన్లలో (2012, 2017, 2022) టీమిండియా విజేతగా నిలిచింది.టోర్నీ తొలి ఎడిషన్ ఫైనల్లో పాకిస్తాన్‌పై 29 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్.. రెండో ఎడిషన్ ఫైనల్లోనూ పాక్‌పై 9 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. 2022 ఎడిషన్ ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్‌ను ఓడించి హ్యాట్రిక్ టైటిళ్లు సొంతం చేసుకుంది. ఎట్టకేలకు పాక్ నాలుగో ప్రయత్నంలో సొంతగడ్డపై టైటిల్ సాధించింది. ఈ ఎడిషన్‌లో భారత్ పాల్గొనలేదు. భద్రతా కారణాల దృష్ట్యా భారత ప్రభుత్వం టీమిండియాను పాక్‌కు పంపలేదు. -
పాక్‌కు షాక్.. అంధుల టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలిగిన భారత్
ఈనెల (నవంబర్) 23 నుంచి పాకిస్తాన్లో జరగాల్సిన అంధుల టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా వైదొలిగింది. ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో టీమిండియా ఈ మెగా టోర్నీని బాయ్‌కాట్ చేసింది. టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలుగుతున్న విషయాన్ని భారత అంధుల క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి శైలేంద్ర యాదవ్ ధృవీకరించారు. ఇండియా టుడేతో ఆయన మాట్లాడుతూ.. అంధుల టీ20 ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్‌కు వెళ్లడానికి భారత ప్రభుత్వం (విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) అనుమతి నిరాకరించిందని తెలిపారు. తొలుత ఈ టోర్నీలో పాల్గొనేందుకు క్రీడా మంత్రిత్వ శాఖ నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేసింది. అయితే చివరి నిమిషంలో పాక్ పర్యటనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒప్పుకోలేదు. భారత అంధుల క్రికెట్ సంఘానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి లిఖితపూర్వమైన ఆదేశాలు రావాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత్‌తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కూడా పాల్గొనడం లేదు. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు ఈ టోర్నీలో భారత్ పాల్గొనకపోవడంతో పాకిస్తాన్‌కు వాక్ ఓవర్ లభిస్తుంది. ఈ టోర్నీలో భారత్ పాల్గొనకపోయినా ఎలాంటి నష్టం లేదని పాకిస్తాన్ అంధుల క్రికెట్ కౌన్సిల్ (PBCC) తెలిపింది. తమవరకైతే భారత ఆటగాళ్లకు వీసాలు జారీ చేశామని పీబీసీసీ పేర్కొంది.కాగా, అంధుల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. ఈ టోర్నీ జరిగిన మూడు ఎడిషన్లలో (2012, 2017, 2022) టీమిండియానే విజేతగా నిలిచింది. 2022 ఎడిషన్ ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్‌పై 120 పరుగుల తేడాతో గెలుపొంది మూడోసారి జగజ్జేతగా నిలిచింది.ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ కోసం భారత్ పాక్‌లో పర్యటించబోదని బీసీసీఐ ఐసీసీకి తేల్చి చెప్పంది. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాక్‌లో పర్యటించడం సాధ్యం కాదని బీసీసీఐ ఖరాఖండిగా చెప్పింది. తటస్థ వేదికపై తమ మ్యాచ్‌లు నిర్వహిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని బీసీసీఐ అంటుంది. దీనికి పాక్ అంగీకరించడం లేదు. తాజాగా భారత అంధుల క్రికెట్ టీమ్ టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల కిందట భారత ప్రభుత్వం పురుషుల కబడ్డీ టీమ్‌ను కూడా పాకిస్తాన్‌కు పంపలేదు. -
Zahara Begum: చూపున్న మనసు
మనసుకు చూపు ఉంటే ఎదుటి వారి కష్టం కనపడుతుంది. మనసుకు స్పందన ఉంటే ఎదుటివారి సాయం కోసం మార్గం వేస్తుంది. జహారా బేగంకు అలాంటి మనసు ఉంది. అందుకే ఆమె అంధుల కోసం పని చేస్తూ ఉంది. అంధుల క్రికెట్‌కు ప్రోత్సాహం అందిస్తోంది. వారి మేచ్‌లు నిర్వహిస్తోంది. ఆ సేవకు ‘క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్’కు చైర్ పర్సన్‌గా నియమితురాలైంది. జహారా పరిచయం. ‘మనలో ఎవరైనా ఎప్పుడైనా అంధులు కావచ్చు. దృష్టి పోతే జీవితం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అందుకే దృష్టి లేని వారి గురించి ఎవరికి తోచినంత వారు పని చేయాలి’ అంటుంది జహారా బేగం. తెనాలికి చెందిన జహారా తన తల్లి తాహెరా పేరున ‘తాహెరా ఫౌండేషన్’ స్థాపించి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అలాగే బెంగళూరు, హైదరాబాద్‌లలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది. ‘నేను నాలుగో క్లాస్‌లో ఉండగా నా క్లాస్మేట్ ఒకమ్మాయి మధ్యాహ్నం పూట ప్రసాదం తెచ్చుకుని తినేది. అన్నం ఉండేది కాదు. ఆ అమ్మాయి కోసం నేను మా అమ్మతో చెప్పి బాక్స్ తీసుకెళ్లేదాన్ని. చిన్నప్పటి నుంచి ఎందుకో ఎదుటివారికి సాయం చేయాలనే గుణం నాలో ఉంది. ఆ గుణాన్ని వయసు పెరిగే కొద్దీ కాపాడుకున్నాను’ అంటుంది జహారా. ఆటలంటే ఇష్టం ‘మాది గుంటూరు. చిన్నతనం నుంచి ఆటలంటే ఇష్టం. బాస్కెట్‌బాల్ జాతీయస్థాయి ప్లేయర్‌గా ఆడాను. గుంటూరు మహిళా బాస్కెట్‌బాల్ జట్టు మాతోనే మొదలైంది. అయితే చదువులో కూడా చురుగ్గా ఉండి బాపట్లలో అగ్రికల్చర్ బీఎస్సీ చేశాను. ఆ తర్వాత అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసి పీహెచ్డీ కోసం జర్మనీలో కొంత రీసెర్చి చేశాను. అక్కడి నుంచి తిరిగొచ్చాక నా మాతృమూర్తి పేరుతో తాహెరా ట్రస్ట్ ప్రారంభించి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సేవల్లో మమేకమయ్యాను. ఆ సమయంలోనే బెంగళూరులోని ‘సమర్థనం ట్రస్ట్ ఫర్ బ్లైండ్’ చేస్తున్న పని నాకు నచ్చింది. వారితో కలిసి అంధుల కోసం పని చేయసాగాను. బెంగళూరులో విమెన్ బ్లైండ్ క్రికెట్ వర్క్‌షాపును నిర్వహించాను’ అని తెలిపిందామె. అంధుల కోసం ‘అంధుల క్రీడలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చేవారు చాలా తక్కువ. అంధుల క్రికెట్‌కు ప్రోత్సాహం అందించేవారూ తక్కువే. వారికోసం నేనెందుకు ఏదైనా చేయకూడదు అనుకున్నాను. అప్పటినుంచి నా చేయూత నిరవధికంగా సాగింది. అంతేకాదు, ‘క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా’ (సీఏబీఐ)లోనూ, ‘టి20 వరల్డ్ కఫ్ క్రికెట్ ఫర్ బ్లైండ్–2017’ పోటీల సమయంలోనూ చురుగ్గా పని చేసే అవకాశం కలిగింది. దాంతో ఇప్పుడు క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీబీబీఏపీ) ఛైర్‌పర్సన్‌గా నియమితురాలినయ్యాను. ఇది నాకు సంతోషంగా ఉంది’ అని తెలిపిందామె. అంధుల టి20 ‘2017లో దేశంలోని మెట్రో నగరాల్లో 2వ అంధుల టి20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీలను సీఏబీఐ నిర్వహించింది. పది దేశాల జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆర్గనైజింగ్ కమిటీ ఇన్చార్జ్గా నేను రెండు మ్యాచ్‌లను ఆంధ్ర, తెలంగాణలో నిర్వహించేందుకు చొరవ చూపాను. అలాగే ‘తొలి విమెన్స్ నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ ఫర్ బ్లైండ్ – 2019’ న్యూఢిల్లీలో జరిగింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ (సీఏబీఏపీ)కి నిధుల కొరత, స్పాన్సర్లు లేకపోవటం, క్రీడాకారిణుల లేమి గమనించాను. దాంతో ఆంధ్రప్రదేశ్ అంధ మహిళల క్రికెట్ జట్టు రూపకల్పనకు పూనుకున్నా. అనంతపురంలో రాష్ట్రస్థాయి అంధ మహిళల క్రికెట్ శిక్షణ శిబిరం నిర్వహించాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంధ మహిళల క్రికెట్ జట్టు ఎంపికకు సహకారం అందించాను.. ఇటీవల యూకేలో జరిగిన ఐబీఎస్ఏ టోర్నమెంటులో విజేతగా నిలిచిన ఇండియా జట్టులో మా శిక్షణలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపిందామె. అంధుల క్రికెట్ గురించి.... ‘అంధుల క్రికెట్ ఢిపరెంట్‌గా ఉంటుంది. బ్యాట్, వికెట్లు అన్నీ ఒకలాగే ఉంటాయి. బంతి మాత్రం వైవిధ్యంగా తయారు చేస్తారు. ఇందులో ఉండే బేరింగ్స్ చేసే శబ్దాన్ని ఆధారంగా బాట్స్మెన్ ఆడతారు. బౌలింగ్ సాధారణ క్రికెట్లోలా భుజంపైనుంచి కాకుండా దిగువ నుంచి వేస్తారు. క్రికెట్ జట్టులో బీ1, బీ2, బీ3 అనే మూడు కేటగిరీల వారుంటారు. బౌలరు, బ్యాట్స్‌మెన్ పూర్తిగా అంధులై ఉంటారు. మిగిలినవారు పాక్షికంగా అంధులు. వీరు ఆడే మైదానం 50 గజాలు మాత్రమే. నిబంధనలన్నీ మామూలే. సీఏబీఐలో 25 వేల మంది సభ్యులున్నారు’ అని తెలిపిందామె. తన సేవా కార్యక్రమాలను అమెరికాకు కూడా విస్తరించిన జహారా అక్కడ చిన జీయర్ నేత్రాలయం కోసం నిధులు సేకరించడంతో తనవంతు సహకారం అందించారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి. -
IBSA World Games 2023: భారత్‌కు సిల్వర్ మెడల్
తొలి బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్ ఫైనల్లో భారత పురుషుల అందుల క్రికెట్ జట్టుకు నిరాశ ఎదురైంది. మెగా ఈవెంట్లో భాగంగా శనివారం పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో రజత పతకాన్ని భారత్ తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 184 పరుగులు సాధించింది. భారత ఇన్నింగ్స్‌లో డాక్టర్ టోంపాకీ(76) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సల్మాన్(48 నాటౌట్) మునీర్(41 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌లతో పాక్‌ను ఛాంపియన్‌గా నిలిపారు. కాగా భారత బౌలర్లు ఎక్స్‌ట్రాస్ రూపంలో ఏకంగా 42 ఇవ్వడం గమానార్హం. ఇక అంతకుముందు భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు మాత్రం చరిత్ర సృష్టించింది. ఫైనల్లో టీమిండియా.. ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి విశ్వవిజేతగా అవతరించింది. తద్వారా గోల్డ్‌మెడల్‌ను తమ ఖాతాలో భారత్ వేసుకుంది. దీంతో ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్ తొలి ఛాంపియన్‌గా టీమిండియా రికార్డులకెక్కింది. చదవండి: మూడో వన్డేలోను పాకిస్తాన్‌దే విజయం -
చరిత్ర సృష్టించిన భారత క్రికెట్ జట్టు
విశ్వవేదికపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. బర్మింగ్హమ్ వేదికగా జరిగిన తొలి ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్‌లో టైటిల్ కైవసం చేసుకుని భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఇవాళ (ఆగస్ట్ 26) జరిగిన ఫైనల్లో టీమిండియా.. ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి, జగజ్జేతగా అవతరించింది. వర్షం అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేయగా.. భారత్ 3.3 ఓవర్లలో కేవలం ఒకే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించి (వర్షం కారణంగా భారత లక్ష్యాన్ని 42 పరుగులకు కుదించారు) స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్ తొలి ఛాంపియన్‌గా టీమిండియా చరిత్రపుటల్లోకెక్కింది. ఈ టోర్నీలో అజేయ జట్టుగా నిలిచిన భారత్.. ఫైనల్స్‌తో కలుపుకుని ఆసీస్‌పై 3 సార్లు, ఇంగ్లండ్‌పై 2 సార్లు గెలుపొందింది. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల విభాగంలో సైతం భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. సెమీస్‌లో భారత్.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి, టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో భారత్.. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. -
చరిత్ర సృష్టించిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు
భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. IBSA వరల్డ్ గేమ్స్‌లో అంధుల క్రికెట్ గత వారమే అరంగేట్రం చేయగా.. ఫైనల్స్ బెర్త్ ఖరారు చేసుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డుపుటల్లోకెక్కింది. బర్మింగ్‌హామ్ వేదికగా టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ మీట్లో టీమిండియా వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలపై విజయాలు సాధించి, తుదిపోరుకు అర్హత సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి, వరల్డ్ గేమ్స్‌లో తమ ప్రస్తానాన్ని అద్భుతంగా ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా.. ఆస్ట్రేలియాను 59/6కి కట్టడి, అనంతరం సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో హెచ్ గంగవ్వ 60 బంతుల్లో 117 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 268/2 స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 185 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నిన్న (ఆగస్ట్ 23) జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ 163 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసి, వరల్డ్ గేమ్స్‌లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఫైనల్స్‌కు చేరింది. శనివారం జరుగబోయే టైటిల్ పోరుకు ముందు భారత్ ఇంగ్లండ్‌తో తమ చివరి లీగ్ మ్యాచ్ (గురువారం) ఆడనుంది. ఫైనల్స్‌లో భారత ప్రత్యర్ధి ఖరారు కావల్సి ఉంది. మరోవైపు ఇదే ఈవెంట్ పురుషుల విభాగంలోనూ భారత్ సెమీస్‌కు చేరుకుంది. శుక్రవారం టీమిండియా ఈ మ్యాచ్ ఆడనుంది. సెమీ ఫైనల్లో భారత్ గెలిస్తే, ఫైనల్స్‌లో దాయాది పాకిస్థాన్‌తో తలపడుతుంది. -
టీ20 వరల్డ్‌కప్-2022 గెలిచిన టీమిండియా.. ఫైనల్లో బంగ్లాదేశ్‌పై విజయం
T20 World Cup For Blind: భారత అంధుల క్రికెట్ టీమ్ వరుసగా మూడసారి టీ20 వరల్డ్‌కప్ కైవసం చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ (డిసెంబర్ 17) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్.. బంగ్లాదేశ్‌ను 120 తేడాతో ఓడించి జగజ్జేతగా అవతరించింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. సునీల్ రమేశ్ (63 బంతుల్లో 136), అర్జున్ కుమార్ రెడ్డి (50 బంతుల్లో 100 నాటౌట్) సెంచరీలతో రెచ్చిపోవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 278 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. భారత బౌలర్లలో లలిత్ మీనా, అజయ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. Many congratulations to team India for winning the T20 World Cup for blind. pic.twitter.com/fbLge7UQVi — Mufaddal Vohra (@mufaddal_vohra) December 17, 2022 కాగా, టీ20 వరల్డ్‌కప్‌ను భారత్ గెలవడం ఇది వరుసగా మూడసారి. 2012లో జరిగిన ఇనాగురల్ టోర్నీలో భారత్ పాకిస్తాన్‌ను ఖంగుతినిపించి, తొలిసారి ఈ ఫార్మాట్లో ఛాంపియన్‌గా నిలిచింది. అనంతరం 2017లో జరిగిన రెండో ఎడిషన్‌లోనూ భారత్ ఫైనల్లో పాకిస్తాన్ ఓడించి రెండోసారి జగజ్జేతగా అవతరించింది. తాజాగా జరిగిన టోర్నీలో గెలవడం ద్వారా భారత్ హ్యాట్రిక్ వరల్డ్‌కప్‌లు సాధించింది. హ్యాట్రిక్ వరల్డ్‌కప్‌లు సాధించిన టీమిండియా వన్డే ఫార్మాట్లో జరిగే వరల్డ్‌కప్‌లను కూడా రెండుసార్లు (2014, 2018) కైవసం చేసుకుంది. ఈ రెండుసార్లు కూడా భారత్.. ఫైనల్లో పాకిస్తాన్‌పైనే విజయం సాధించింది. -
ప్రపంచ కప్ గెలిపించినా పట్టించుకోరా?
మాచర్ల: అజయ్ కుమార్ రెడ్డి... ఆంధ్రప్రదేశ్ క్రికెటర్... అంతేకాదు భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ కూడా... రెండుసార్లు (2012లో, 2014లో) తన అద్వితీయ ప్రతిభతో భారత జట్టుకు టి20, వన్డే ప్రపంచకప్ టైటిల్స్ దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. మరో రెండుసార్లు (2017, 2018లో) కెప్టెన్ హోదాలో భారత జట్టును ముందుండి నడిపించి టి20, వన్డే వరల్డ్ కప్‌లలో విజేతగా నిలిపాడు. అయినప్పటికీ అతని విజయాలను గుర్తించే వారు కరువయ్యారు. అంధత్వం ప్రతిభకు అడ్డుకాదని... పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించిన అజయ్ కుమార్‌కు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు దక్కకపోవడం గమనార్హం. నాలుగేళ్లుగా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అజయ్... ఆంధ్రప్రదేశ్‌లో అంధుల కోసం ప్రత్యేక క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయాలని సంకల్పించాడు. ఈ విషయంలో తనకు ప్రభుత్వం సహాయం చేయాలని కోరేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి కొల్లూరి రవీంద్ర ద్వారా అనేకసార్లు ప్రయత్నించాడు. కానీ మంత్రి రవీంద్ర భారత జట్టు కెప్టెన్ అభ్యర్థనను పట్టించుకోలేదు. జాతీయ జట్టు కెప్టెన్‌గా తనకు కనీస గౌరవం ఇవ్వకపోవడం ఎంతో బాధ కలిగించిందని ‘సాక్షి’తో అజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అత్యంత వెనుకబడిన పల్నాటి ప్రాంతం నుంచి, అందునా పేద కుటుంబం నుంచి ఎంతో కష్టపడి పైకొచ్చి జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న తనతో పాటు అంధ క్రికెటర్లను ఆదరించకపోవడం తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని 27 ఏళ్ల అజయ్ అన్నాడు. ప్రభుత్వం క్రీడాకారులందరినీ ఒకేలా ఆదరించాలని... చూపు లేని క్రీడాకారులను చిన్నచూపు చూడరాదని ప్రభుత్వ క్రీడాధికారులకు విజ్ఞప్తి చేశాడు. నాలుగేళ్ల ప్రాయంలో తలుపు గడి తగలడంతో అజయ్ ఎడమ కంటి చూపును పూర్తిగా కోల్పోయాడు. కుడి కన్నుతో అతను కేవలం రెండు మీటర్ల దూరంలో ఉన్న వాటిని మాత్రమే చూడగలడు. చిన్నతనంలోనే చూపు కోల్పోయినా అతని ఆత్మవిశ్వాసం మాత్రం దెబ్బతినలేదు. తోటి వారు అంధుడు అని ఎగతాళి చేస్తుంటే అజయ్ అవేమీ పట్టించుకోలేదు. కేవలం తన పట్టుదలను నమ్ముకున్నాడు. నరసరావుపేటలోని అంధుల స్కూల్లో ప్రవేశం పొంది చదువులోనే కాదు క్రికెట్ ఆటలోనూ ప్రావీణ్యం సంపాదించాడు. 2006లో ఆంధ్రప్రదేశ్ అంధుల క్రికెట్ జట్టులో చోటు సంపాదించిన అతను 2010లో తొలిసారి భారత జట్టులోకి ఎంపికయ్యాడు. అదే ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో రెండు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు గెల్చుకున్నాడు. 2012లో తొలిసారి జరిగిన అంధుల టి20 ప్రపంచకప్‌లో భారత్‌కు టైటిల్ దక్కడంలో అజయ్ కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 33 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 2014లో భారత జట్టు కెప్టెన్‌గా ఎంపికైన అజయ్ తన నాయకత్వ పటిమతో భారత్‌కు అదే ఏడాది ఆసియా టి20 కప్ టైటిల్‌ను... 2017లో టి20, 2018లో వన్డే వరల్డ్ కప్ టైటిల్స్‌ను అందించాడు. -
అంధ క్రికెటర్‌కు ఆర్థిక సహాయం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన భారత అంధుల క్రికెట్ జట్టులో సభ్యుడైన మహేందర్ వైష్ణవ్‌కు టీటీఎల్ జట్ల యజమానులు రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఉప్పల్‌లో టీటీఎల్ ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో మహేందర్‌కు ఈ చెక్‌ను రంగారెడ్డి రైజర్స్ జట్టు యజమాని చాముండేశ్వరీనాథ్ అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు పాల్గొన్నారు. చాముండేశ్వరీనాథ్ క్రీడాకారులను ప్రోత్సహించడం ఇదేం తొలిసారి కాదు. అంతకుముందు 1972 నుంచి పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులకు తలా 15 లక్షల చొప్పున మొత్తం రూ. 1.75 కోట్లను అందించాడు. ఇందుకోసం చాముండి, భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ చెరో 50 లక్షలు ఇవ్వగా... మిగతా 75 లక్షలను ఇతరుల నుంచి సేకరించారు. తాజాగా ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్‌లో కాంస్యం సాధించిన బుద్ధా అరుణరెడ్డికి శిక్షణ కోసం రూ.6.5 లక్షలు ప్రోత్సాహకాన్ని అందజేశారు. -
అంధుల క్రికెట్లో మనోడి సత్తా
సాక్షి, మాచర్ల: అంధుల క్రికెట్లో గుంటూరు జిల్లా మాచర్ల వాసి ఇల్లూరి అజయ్‌కుమార్‌రెడ్డి సత్తా చాటుతున్నాడు. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తూ అరుదైన విజయాలు అందిస్తున్నాడు. గతేడాది అజయ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో టీ20 వరల్డ్‌కప్ సాధించిన భారత జట్టు, ఈసారి వన్డే వరల్డ్ కప్‌ను సైతం కైవసం చేసుకుంది. శనివారం దుబాయ్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టికరిపించి వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది. అజయ్‌కుమార్‌రెడ్డి 1990 జూన్ 3న జన్మించాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. నాలుగేళ్ల వయసులో తలుపు గడియ తగిలి అజయ్‌కుమార్ కుడి కన్ను పూర్తిగా కోల్పోగా, ఎడమ కన్ను పాక్షికంగా దెబ్బతింది. అయినప్పటికీ ఆత్మస్థైర్యంతో అంధుల పాఠశాలలో విద్యనభ్యసించాడు. క్రికెట్‌పై ఆసక్తితో పట్టుదలగా సాధన చేసి అంచెలంచెలుగా ఎదిగాడు. 2017లో అంధుల టీ–20 జట్టుకు నాయకత్వం వహించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర వహించాడు. తాజాగా మరోసారి సత్తాచాటి దేశానికి వన్డే వరల్డ్ కప్ సాధించాడు. ప్రస్తుతం అజయ్‌కుమార్‌రెడ్డి గుంటూరులో ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. -
అజేయ... జయ... జయహే...
ఎదురుగా భారీ లక్ష్యం... ప్రత్యర్థి పాకిస్తాన్... పైగా తుది సమరం... అయినా భారత్ వెరవలేదు... ఒత్తిడిని అధిగమించింది... చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది... అంధుల ప్రపంచకప్ టైటిల్‌ను రెండోసారి దేశానికి కానుకగా ఇచ్చింది. షార్జా : భారత అంధుల క్రికెట్ జట్టు మరోసారి సత్తా చాటింది. షార్జాలో శనివారం జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తెలుగు వాడైన అజయ్‌కుమార్ రెడ్డి సారథ్యంలో టోర్నీ ఆసాంతం అజేయంగా నిలిచిన భారత్... వరుసగా రెండోసారి కప్ సొంతం చేసుకుంది. ఫైనల్లో 309 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో భారత్‌కు ఓపెనర్లు వెంకటేష్ (35), ప్రకాష్ (44) మంచి పునాది వేశారు. మిడిలార్డర్లో సునీల్ రమేష్ (93) అద్భుత ఇన్నింగ్స్, కెప్టెన్ అజయ్‌కుమార్‌రెడ్డి (62) సమయోచిత బ్యాటింగ్‌తో జట్టు విజయ తీరాలకు చేరింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బదర్ మునీర్ (57) అర్ధ సెంచరీ, రియాసత్ ఖాన్ (48), కెప్టెన్ నిసార్ అలీ (47) రాణించడంతో పాక్ నిర్ణీత 40 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. బౌలింగ్‌లో ఒక వికెట్ తీయడంతో పాటు బ్యాటింగ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన సునీల్ రమేష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. ఉత్కంఠను అధిగమించి... ఓపెనర్లు ఓవర్‌కు 10కిపైగా పరుగులు సాధించి మెరుపు ఆరంభాన్నిచ్చినా... భారత ఇన్నింగ్స్‌లో సునీల్ రమేష్ ఆటే హైలైట్‌గా నిలిచింది. జట్టు కీలక వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన అతడు ధనాధన్ ఆటతీరుతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గేలా చేశాడు. కేవలం 67 బంతుల్లోనే 93 పరుగులు సాధించాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ అజయ్‌కుమార్ చక్కటి సహకారం అందించాడు. అయితే... విజయానికి 18 బంతుల్లో 16 పరుగులు అవసరమైన సందర్భంలో ఉత్కంఠ చోటుచేసుకుంది. మహేందర్ (6), గణేశ్ (5), సోను (0) వెంటవెంటనే వెనుదిరగడంతో భారత్ 8 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో... ప్రత్యర్థి బౌలర్ వేసిన వైడ్ బంతి బౌండరీకి వెళ్లడంతో మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. అంధుల జట్టు ప్రపంచకప్ టైటిల్ గెలవడం ఇది రెండోసారి. 2014లో తొలిసారి ప్రపంచకప్ నెగ్గింది. ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో నిలిచింది. గతంలో పాకిస్తాన్ రెండుసార్లు, దక్షిణాఫ్రికా ఒకసారి నెగ్గాయి. గతేడాది టి20 వరల్డ్‌కప్ సైతం భారత్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సీఈవో డేవిడ్ రిచర్డ్సన్, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్, భారత మాజీ కీపర్ సయ్యద్ కిర్మాణీ ప్రత్యక్షంగా వీక్షించారు. వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కెప్టెన్ అజయ్‌కుమార్ రెడ్డితో పాటు డి.వెంకటేశ్వర రావు, టి. దుర్గారావు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కాగా...మహేందర్ వైష్ణవ్ తెలంగాణ వాసి కావడం విశేషం. భారత జట్టుకు నా అభినందనలు. వారు దేశం గర్వించేలా చేశారు. వారు నిజమైన చాంపియన్లు. –ట్వీటర్లో ప్రధాని మోదీ కప్ గెలవడంలో భారత ఆటగాళ్లు కనబరిచిన ప్రతిభ అసామాన్యం. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ విజయం క్రీడాకారులందరికీ ప్రేరణగా నిలుస్తుంది. –వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ -
అంధుల క్రికెట్ జట్టుకు మోదీ బ్యాట్
ఢిల్లీ: ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన అంధుల క్రికెట్ జట్టు సభ్యులు మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసారు. ఈ సందర్భంగా మోదీ వారిని అభినందించారు. ఇలాంటి విజయాలు భవిష్యత్తులో మరిన్ని సాధించాలని ఆకాక్షించారు. టీం సభ్యులు ఆటోగ్రాఫ్ లతో కూడిన బ్యాట్, బాల్, మోదీ పేరు గల జెర్సీని మోదీకి అందజేశారు. మోదీ కూడా తన సంతకం గల బ్యాట్, బంతిని జట్టు సభ్యులకు కానుకగా ఇచ్చారు. గత నెల 8న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ గెలిచిన విషయం తెలిసిందే. -
సెమీస్‌లో భారత్
భువనేశ్వర్: మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన భారత్ అంధుల టి20 ప్రపంచకప్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో గెలిచింది. 10 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్ ఏడు విజయాలు సాధించి 21 పాయింట్లతో పాకిస్తాన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. లీగ్ దశలో టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఆరు వికెట్లకు 136 పరుగులు చేసింది. భారత్ కేవలం తొమ్మిది ఓవర్లలో వికెట్ నష్టపోయి 140 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. స్కోరు 136 వద్ద సమంగా ఉన్నపుడు బౌండరీతో భారత్ విజయాన్ని అందుకుంది. ఇన్నింగ్స్ మూడో బంతికే ఓపెనర్ ఇక్బాల్ జాఫర్ పరుగులేమీ చేయకుండా అవుటవ్వగా... సుఖ్రామ్ (25 బంతుల్లో 56 నాటౌట్; 11 ఫోర్లు), కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి (28 బంతుల్లో 75 నాటౌట్; 14 ఫోర్లు) రెండో వికెట్‌కు అజేయంగా 140 పరుగులు జత చేశారు. బుధవారం విజయవాడలో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో నేపాల్‌తో భారత్ ఆడుతుంది. -
భారత్ శుభారంభం
న్యూఢిల్లీ: అంధుల టీ 20 క్రికెట్ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ శుభారంభం చేసింది. సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 129 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 280 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆ తరువాత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 150 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. భారత ఆటగాళ్లలో ఓపెనర్లు ప్రకాశ్ జే(96), కేతన్ పటేల్(98) రాణించి భారీ స్కోరులో సహకరించారు. అటు బౌలింగ్ లో ఆకట్టుకుని వికెట్ తీసిన కేతన్ పటేల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
భారత టి20 అంధుల జట్టులో మనోళ్లు ముగ్గురు
కెప్టెన్‌గా అజయ్‌కుమార్ రెడ్డి జనవరి 28 నుంచి ప్రపంచకప్ ముంబై: స్వదేశంలో జరిగే ప్రపంచకప్ టి20 అంధుల క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు క్రికెటర్లకు స్థానం లభించింది. గుంటూరు జిల్లాకు చెందిన అజయ్ కుమార్ రెడ్డి జట్టుకు నాయకత్వం వహించనుండగా... టి. దుర్గా రావు (నల్లగొండ), డి. వెంకటేశ్వర రావు (విశాఖపట్నం) ఇతర సభ్యులుగా ఉన్నారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 12 వరకు జరిగే ఈ టోర్నమెంట్ ఫైనల్‌కు బెంగళూరు వేదికగా నిలుస్తుంది. జనవరి 5 నుంచి ఇండోర్‌లో జట్టుకు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. విజేత జట్టుకు రూ. 20 లక్షలు, రన్నరప్ జట్టుకు రూ. 15 లక్షల ప్రైజ్‌మనీ ఇస్తారు. భారత్‌తోపాటు ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, నేపాల్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు పాల్గొంటున్నాయి. 2012లో పాకిస్తాన్లో జరిగిన తొలి టి20 అంధుల ప్రపంచకప్‌లో భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. భారత టి20 అంధుల జట్టు: అజయ్ కుమార్ రెడ్డి (కెప్టెన్), ప్రకాశ జయరామయ్య (వైస్ కెప్టెన్), దీపక్ మలిక్, రాంబీర్ సింగ్, సుఖ్రామ్ మాఝీ, టి.దుర్గా రావు, ఆర్.సునీల్, డి.వెంకటేశ్వర రావు, గణేశ్భాయ్ ముహుంద్కర్, ఫైజల్, ఫర్హాన్, కేతన్భాయ్ పటేల్, జఫర్ ఇక్బాల్, సోనూ గోల్కర్, అనీష్ బేగ్, ప్రేమ్‌కుమార్. -
‘అంధుల క్రికెట్‌కు బీసీసీఐ గుర్తింపు ఇవ్వాలి’
సాక్షి, న్యూఢిల్లీ: అంధుల క్రికెట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గుర్తింపు ఇచ్చి... నిధులు కేటాయిస్తే భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తామని... ఇటీవల ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత జట్టులోని ఆంధ్రప్రదేశ్ సభ్యుడు అజయ్ ధీమా వ్యక్తం చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో అంధుల క్రికెట్ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలని అతను కోరాడు. సహచర సీనియర్ క్రీడాకారుడు వెంకటేశ్‌తో కలిసి ప్రతిభ ఉండి బయటకు రాలేకపోతున్న క్రీడాకారులను అన్వేషించి శిక్షణ ఇస్తామన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన అంధుల ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో విజేతగా నిలిచిన భారత జట్టులో తనతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు... తెలంగాణ నుంచి ఒక క్రీడాకారుడు ఉన్నాడని తెలిపాడు. భారత జట్టులోని తెలంగాణ క్రికెటర్ మధు మాట్లాడుతూ... అంధుల క్రికెట్ భారత జట్టుకు ఎంపిక కావడం, ప్రపంచ కప్‌ను సాధించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడు. అంధులైన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని కోరాడు.