స్వదేశంలో జరిగే ప్రపంచకప్ టి20 అంధుల క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు.
కెప్టెన్‌గా అజయ్‌కుమార్ రెడ్డి
జనవరి 28 నుంచి ప్రపంచకప్
ముంబై: స్వదేశంలో జరిగే ప్రపంచకప్ టి20 అంధుల క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు క్రికెటర్లకు స్థానం లభించింది. గుంటూరు జిల్లాకు చెందిన అజయ్ కుమార్ రెడ్డి జట్టుకు నాయకత్వం వహించనుండగా... టి. దుర్గా రావు (నల్లగొండ), డి. వెంకటేశ్వర రావు (విశాఖపట్నం) ఇతర సభ్యులుగా ఉన్నారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 12 వరకు జరిగే ఈ టోర్నమెంట్ ఫైనల్‌కు బెంగళూరు వేదికగా నిలుస్తుంది. జనవరి 5 నుంచి ఇండోర్‌లో జట్టుకు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు.
విజేత జట్టుకు రూ. 20 లక్షలు, రన్నరప్ జట్టుకు రూ. 15 లక్షల ప్రైజ్‌మనీ ఇస్తారు. భారత్‌తోపాటు ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, నేపాల్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు పాల్గొంటున్నాయి. 2012లో పాకిస్తాన్‌లో జరిగిన తొలి టి20 అంధుల ప్రపంచకప్‌లో భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది.
భారత టి20 అంధుల జట్టు: అజయ్ కుమార్ రెడ్డి (కెప్టెన్), ప్రకాశ జయరామయ్య (వైస్ కెప్టెన్), దీపక్ మలిక్, రాంబీర్ సింగ్, సుఖ్‌రామ్ మాఝీ, టి.దుర్గా రావు, ఆర్.సునీల్, డి.వెంకటేశ్వర రావు, గణేశ్‌భాయ్ ముహుంద్కర్, ఫైజల్, ఫర్హాన్, కేతన్‌భాయ్ పటేల్, జఫర్ ఇక్బాల్, సోనూ గోల్కర్, అనీష్ బేగ్, ప్రేమ్‌కుమార్.