ఎదురుగా భారీ లక్ష్యం... ప్రత్యర్థి పాకిస్తాన్... పైగా తుది సమరం... అయినా భారత్ వెరవలేదు... ఒత్తిడిని అధిగమించింది... చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది... అంధుల ప్రపంచకప్ టైటిల్‌ను రెండోసారి దేశానికి కానుకగా ఇచ్చింది.
షార్జా : భారత అంధుల క్రికెట్ జట్టు మరోసారి సత్తా చాటింది. షార్జాలో శనివారం జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తెలుగు వాడైన అజయ్‌కుమార్ రెడ్డి సారథ్యంలో టోర్నీ ఆసాంతం అజేయంగా నిలిచిన భారత్... వరుసగా రెండోసారి కప్ సొంతం చేసుకుంది. ఫైనల్లో 309 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో భారత్‌కు ఓపెనర్లు వెంకటేష్ (35), ప్రకాష్ (44) మంచి పునాది వేశారు. మిడిలార్డర్‌లో సునీల్ రమేష్ (93) అద్భుత ఇన్నింగ్స్, కెప్టెన్ అజయ్‌కుమార్‌రెడ్డి (62) సమయోచిత బ్యాటింగ్‌తో జట్టు విజయ తీరాలకు చేరింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బదర్ మునీర్ (57) అర్ధ సెంచరీ, రియాసత్ ఖాన్ (48), కెప్టెన్ నిసార్ అలీ (47) రాణించడంతో పాక్ నిర్ణీత 40 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. బౌలింగ్‌లో ఒక వికెట్ తీయడంతో పాటు బ్యాటింగ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన సునీల్ రమేష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది.
ఉత్కంఠను అధిగమించి...
ఓపెనర్లు ఓవర్‌కు 10కిపైగా పరుగులు సాధించి మెరుపు ఆరంభాన్నిచ్చినా... భారత ఇన్నింగ్స్‌లో సునీల్ రమేష్ ఆటే హైలైట్‌గా నిలిచింది. జట్టు కీలక వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన అతడు ధనాధన్ ఆటతీరుతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గేలా చేశాడు. కేవలం 67 బంతుల్లోనే 93 పరుగులు సాధించాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ అజయ్‌కుమార్ చక్కటి సహకారం అందించాడు. అయితే... విజయానికి 18 బంతుల్లో 16 పరుగులు అవసరమైన సందర్భంలో ఉత్కంఠ చోటుచేసుకుంది. మహేందర్ (6), గణేశ్ (5), సోను (0) వెంటవెంటనే వెనుదిరగడంతో భారత్ 8 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో... ప్రత్యర్థి బౌలర్ వేసిన వైడ్ బంతి బౌండరీకి వెళ్లడంతో మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. అంధుల జట్టు ప్రపంచకప్ టైటిల్ గెలవడం ఇది రెండోసారి. 2014లో తొలిసారి ప్రపంచకప్ నెగ్గింది. ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో నిలిచింది. గతంలో పాకిస్తాన్ రెండుసార్లు, దక్షిణాఫ్రికా ఒకసారి నెగ్గాయి. గతేడాది టి20 వరల్డ్‌కప్ సైతం భారత్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సీఈవో డేవిడ్ రిచర్డ్‌సన్, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్, భారత మాజీ కీపర్ సయ్యద్ కిర్మాణీ ప్రత్యక్షంగా వీక్షించారు. వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కెప్టెన్ అజయ్‌కుమార్ రెడ్డితో పాటు డి.వెంకటేశ్వర రావు, టి. దుర్గారావు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కాగా...మహేందర్ వైష్ణవ్ తెలంగాణ వాసి కావడం విశేషం.
భారత జట్టుకు నా అభినందనలు. వారు దేశం గర్వించేలా చేశారు. వారు నిజమైన చాంపియన్లు. –ట్వీటర్‌లో ప్రధాని మోదీ
కప్ గెలవడంలో భారత ఆటగాళ్లు కనబరిచిన ప్రతిభ అసామాన్యం. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ విజయం క్రీడాకారులందరికీ ప్రేరణగా నిలుస్తుంది.
–వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment