వచ్చేనెల 13 నుంచి ఖోఖో ప్రపంచకప్
బరిలో 24 దేశాలు
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే ప్రప్రథమ ఖోఖో ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. భారత్ ఆతిథ్యమిచ్చే ఈ గ్రామీణ క్రీడ మెగా ఈవెంట్‌లో పురుషుల విభాగంలో చిరకాల ప్రత్యర్థుల మధ్య జనవరి 13న జరిగే తొలి మ్యాచ్‌తో ప్రపంచకప్‌కు తెరలేవనుంది. 13 నుంచి 19 వరకు జరిగే ఈ ఈవెంట్లో 24 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో 21 పురుషుల జట్లు, 20 మహిళా జట్లు బరిలోకి దిగుతాయి. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే పోటీకి ముందుగా అట్టహాసంగా ప్రారంబోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రపంచకప్ సీఈఓ విక్రమ్ దేవ్ డోగ్రా తెలిపారు.
బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘13 నుంచి 16వ తేదీ వరకు లీగ్ దశ మ్యాచ్‌లు జరుగుతాయి. 17న నాలుగు క్వార్టర్ ఫైనల్స్ పోటీలు నిర్వహిస్తాం. మరుసటి రోజే (18) సెమీఫైనల్స్, ఇరు విభాగాల్లో 19న జరిగే ఫైనల్స్‌తో టోర్నీ ముగుస్తుంది’ అని అన్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంతో పాటు గ్రేటర్ నోయిడాలోని ఇండోర్ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగనున్నాయి.
ఈ టోర్నీ కోసం జవహర్‌లాల్ స్టేడియంలో ప్రస్తుతం భారత పురుషులు, మహిళా జట్ల ప్రాబబుల్స్‌కు శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఇందులో నుంచి తుది జట్లను త్వరలోనే ప్రకటిస్తామని భారత ఖోఖో సమాఖ్య (కేకేఎఫ్‌ఐ) అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ చెప్పారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మెగా ఈవెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. 615 మంది ప్లేయర్లు, 125 మంది సహాయ సిబ్బందికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment