వికటించిన స్నేహం చిగురించేనా? | The survival of millions of Hindus in Bangladesh is in question | Sakshi
Sakshi News home page

వికటించిన స్నేహం చిగురించేనా?

Published Wed, Dec 18 2024 3:29 AM | Last Updated on Wed, Dec 18 2024 3:29 AM

The survival of millions of Hindus in Bangladesh is in question

అంతర్జాతీయ పరిణామాలెప్పుడూ స్థిరంగా ఉండవు. నిన్న మొన్నటి వరకు భారత్‌ నుంచి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు పొందిన పొరుగుదేశంబంగ్లాదేశ్‌లో మారిన అంతర్గత రాజకీయ పరిస్థితులు భారత్‌కు ఆందోళనకరంగా మారాయి. అక్కడి హిందువులపై దాడులు జరగడం వికటించిన స్నేహానికి నిదర్శనం. 

పాకిస్తాన్‌ నుంచి తమ దేశానికి రావడానికి ఉన్న వీసా నిబంధనను కూడా బంగ్లాదేశ్‌ సడలించింది. దేశ ద్వారాలను బార్లా తెర వడం వల్ల ఉగ్ర మూకలు స్థిర నివాసం ఏర్పరచుకొనే ప్రమాదం ఉంది.

భద్రతాపరంగా ఇది కూడా భారత్‌కు ఆందోళనకరమే. స్వతంత్ర దేశంగాబంగ్లాదేశ్‌ ఏర్పడటంలో భారత్‌ పోషించిన పాత్ర చరిత్రాత్మకం. అలాంటి బంధమున్న దేశంతో తగిన విధంగా స్పందించి పరిస్థితులను చక్కబెట్టాలి.

బంగ్లాదేశ్‌లో ఆగస్ట్‌ మాసంలో జరిగిన రాజకీయ విపరిణామాల కారణంగా ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా కట్టుబట్టలతో దేశం నుంచి పారిపోయి భారత్‌లో తలదాచుకొంటున్నారు. అప్పటినుంచీ భారత్, బంగ్లాదేశ్‌ మధ్య దాదాపు 5 దశాబ్దాల పాటు కొనసాగుతూ వచ్చిన స్నేహ సంబంధాలు ఒక్కసారిగా దెబ్బతిన్నట్లయ్యింది. 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం చేసి, స్థానిక ప్రజల ఆకాంక్షల మేరకు ఓ స్వతంత్ర దేశంగా బంగ్లాదేశ్‌ ఏర్పడటంలో భారత్‌ పోషించిన పాత్ర చారిత్రాత్మకం.అందుకు భారత్‌ ఎంతో త్యాగం చేసింది. ఆ తర్వాత కూడా బంగ్లాదేశ్‌ పునర్‌ నిర్మాణంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందించింది. తమకు స్వేచ్ఛను కల్పించినందుకు బంగ్లాదేశీయులకు సైతం భారత్‌ పట్ల గౌరవాభిమానాలు నిన్నమొన్నటి వరకు అవిచ్ఛిన్నంగా కొన సాగాయి.

మారిన పరిస్థితులు
ఇరు దేశాల మధ్య చక్కటి స్నేహ సంబంధాలు కొనసాగుతున్న తరుణంలో... బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాలతో పరిస్థి తులు తలకిందులయ్యాయి. 17 కోట్ల జనాభా కలిగిన బంగ్లాదేశ్‌లో దాదాపు కోటిన్నరకు పైగా హిందువులు ఉన్నారు. బౌద్ధులు, క్రైస్తవులు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. గత 4 నెలలుగా బంగ్లా దేశ్‌లోని హిందూ ఆలయాలు, హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. 

ఆర్థిక రంగంలో నోబెల్‌ బహుమతి గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వం ఈ దాడులను నిరోధించకపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. బంగ్లాదేశ్‌లో చోటు చేసుకొంటున్న పరిణామాలపై విదేశీ (ఇండియా) మీడియా వక్రభాష్యం చెబుతోందంటూ యూనస్‌ ఈ హింసను సమర్థించుకోవటానికి తాపత్రయపడుతున్నారు. 

పొరుగునున్న బంగ్లాదేశ్‌ ఒక్కసారిగా ప్రత్యర్థిగా మారడాన్ని భారత్‌ నిశితంగానే పరిశీలిస్తోంది. పార్లమెంట్‌లో అధికార బీజేపీ సభ్యులు ఈ అంశంపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మ«థురకు ప్రాతినిధ్యం వహిస్తున్న సినీ నటి హేమ మాలిని హిందువులపై జరుగుతున్న దాడులను ఎత్తిచూపడంతో పాటు, సాధువు చిన్మయి కృష్ణదాస్‌ను అరెస్ట్‌ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఆశ్చర్యకరంగా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులతో తమకు సంబంధమే లేనట్టు వ్యవహరిస్తోంది. బంగ్లాదేశ్‌తో 2,216 కిలోమీటర్ల సరిహద్దును పంచుకొంటున్న పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ సైతం... ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించడం లేదు. 

ఆ ద్వేషమే భారత్‌ వ్యతిరేకతకు కారణం
ప్రధాన ప్రతిపక్షాలన్నీ బహిష్కరించిన జాతీయ ఎన్నికలలో ఈ ఏడాది గెలిచిన షేక్‌ హసీనా మూడవ పర్యాయం ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కొన్ని వర్గాల ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకొన్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రతిఫలించని ఆ ఎన్నికలలో హసీనా గెలుపును మెజారిటీ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని హసీనా, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అవామీ లీగ్‌ పార్టీ ప్రముఖులు పెద్ద ఎత్తున అధికార దుర్విని యోగానికీ, అవినీతికీ పాల్పడ్డారన్న క్రోధంతో ప్రజలు ఉన్నారు. 

పైగా, దేశంలో నిరుద్యోగం పెరుగుతుండగా స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలకు చెందిన వారికి ఉద్యోగాలలో రిజర్వేషన్లుఅందించాలన్న హసీనా ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల కోపం అగ్గి మీద గుగ్గిలం చల్లినట్లయింది. ఒక దశలో దేశాభివృద్ధి రేటులో ఆసియాలోనే అగ్రగామిగా ఉన్న తమ దేశం క్రమంగా హసీనా పరివారం అవినీతి, అసమర్థత కారణంగా పాతాళానికి పడిపోయిందన్న ఆగ్రహమూ ఏర్పడింది. ఈ అంశాలు బంగ్లా ‘యువత’ను వీధుల్లోకొచ్చి ఉద్యమించేందుకు పురిగొల్పాయి. 

సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించకుండా ఉద్యమకారుల్ని అణచివేయడానికి ప్రభుత్వం సిద్ధపడటంతో పరిస్థితి చేయిదాటింది. యువత తిరుగుబాటు చేసి ప్రధాని నివాసాన్ని ముట్టడించి పాల్పడిన విధ్వంసాన్ని యావత్‌ ప్రపంచం చూసి నివ్వెరపోయింది. సకాలంలో షేక్‌ హసీనా, ఆమె సోదరి ఇద్దరూ తప్పించుకొని భారత్‌ చేరుకోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. 

షేక్‌ హసీనాకు ఆశ్రయం ఇచ్చిన భారత్‌ను బంగ్లాదేశీయులు తప్పుపడుతున్నారు. భారత్‌పై వారు గుడ్డి వ్యతిరేకత ప్రదర్శించడానికి అదే కారణమని చెప్పాలి. ఆ వ్యతిరేకత కాస్తా హిందువుల పట్ల ద్వేష భావంగా  రూపాంతరంచెందింది. దాంతో ఉద్యమకారులు హసీనా నివాసంపై దాడి చేశాక దేశంలోని హిందువులపైన, హిందువుల ప్రార్థనా మందిరాలపైన విరుచుకుపడి విధ్వంసం సృష్టించారు. 

దేశం విడిచిన షేక్‌ హసీనాకు అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాలు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించగా, భారత్‌ మాత్రం సాదరంగా ఆహ్వానించి ఆమెకు అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. హసీనా ప్రభుత్వం స్థానంలో మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం ఎంతవరకూ వెళ్లిందంటే బంగ్లాదేశ్‌ జాతి పితగా పిలిచే షేక్‌ హసీనా తండ్రి ముజీబుర్‌ రహమాన్‌ చిహ్నాలను తొలగిస్తోంది.

 కరెన్సీ నోట్లపై ఆయన బొమ్మ ఉన్నందున, పాత కరెన్సీని తొలగించి దాని స్థానంలో ఆయన బొమ్మ లేకుండా కొత్త కరెన్సీని మరో 6 నెలల్లో చలామణీలోకి తెస్తోంది. కొత్తగా ముద్రించే కరెన్సీ నోట్ల మీద హసీనాపై చేపట్టిన తిరుగుబాటు చిత్రాలను ముద్రించనున్నట్లుబంగ్లా సెంట్రల్‌ బ్యాంకు ప్రకటించడం సంచలనం కలిగించింది.

పాక్‌తో సన్నిహితంగా బంగ్లా  
పాకిస్తాన్‌ నుంచి తమ దేశానికి రావడానికి ఉన్న వీసా నిబంధనను బంగ్లాదేశ్‌ సడలించినట్లుగా వార్తలొచ్చాయి. ఇదొక అనూహ్య పరిణామం. ఒకవిధంగా, బంగ్లాదేశ్‌ తన కన్నును తానే పొడుచు కొన్నట్లు భావించాలి. పాకిస్తాన్‌తో స్నేహ సంబంధాలను నెరపు కోవడాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. కానీ, తమ దేశ ద్వారాలను బార్లా తెరవడం వల్ల ఉగ్రవాద మూకలు దేశంలోకి ప్రవేశించి స్థిర నివాసం ఏర్పరచుకొనే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్, భారత సరిహద్దుల వెంబడి 3 బెటాలియన్ల రక్షణ దళాలను (బీఎస్‌ఎఫ్‌) మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

నిజానికి గత నాలుగైదు నెలలుగా భారత్‌ దౌత్యపరంగా అనేక దేశాలకు మరింత చేరువైంది. చైనా అండ చూసుకొని తోక జాడించాలనుకొన్న ‘మాల్దీవులు’ మళ్లీ తప్పు సరిదిద్దుకొని భారత్‌కు స్నేహహస్తం చాచింది. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్‌ మాసంలో రష్యా, ఆ తర్వాత నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాలలో పర్యటించి ఆ దేశాలతో గల ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్ఠం చేశారు. మరోపక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆఫ్రికా దేశాలలో పర్యటించడం వల్ల ఆ దేశాలతో భారత్‌ వ్యాపార, వాణిజ్య సంబంధాలు విస్తరించాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. 

నేడు ప్రపంచంలోనే భారత్‌ ఓ బలీయమైన దేశంగా, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, పాలస్తీనా–ఇజ్రాయెల్‌ యుద్ధాలను నిలువరించగలిగిన సామర్థ్యం గల దేశంగా పరిగణించబడుతున్న తరుణంలో చిరకాల మిత్రదేశం బంగ్లాదేశ్‌తో వైరం ఏర్పడటం ఆందోళనకరమే. 142 కోట్ల ప్రజల భద్రతకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకు పూచీ పడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. బంగ్లాదేశ్‌లో ఉన్న లక్షలాది మంది హిందువుల మనుగడ ప్రశ్నార్థకం కాకముందే భారత ప్రభుత్వం తగు విధంగా స్పందించి వారి పూర్తి రక్షణకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.

- వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు
- డా‘‘ ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement