నాలుగు యుద్ధాలు | Indo-Pakistan Wars | Sakshi
Sakshi News home page

నాలుగు యుద్ధాలు

Published Tue, Aug 6 2019 4:41 AM | Last Updated on Tue, Aug 6 2019 5:17 AM

Indo-Pakistan Wars - Sakshi

1947 పీఓకే జననం
ఈ యుద్ధాన్ని మొట్టమొదటి కశ్మీర్‌ యుద్ధమని కూడా పిలుస్తారు. దేశ విభజనకు ముందు అతి పెద్ద సంస్థానంగా ఉన్న జమ్మూ కశ్మీర్‌ హిందూ మతానికి చెందిన మహారాజా హరిసింగ్‌ పాలనలో ఉండేది. 1947 దేశ విభజన సమయంలో సంస్థానాల విలీనాన్ని బ్రిటీష్‌ పాలకులు వారి ఇష్టానికే వదిలిపెట్టారు. భారత్‌లో కలుస్తారా, పాక్‌లో కలుస్తారా ? లేదంటే స్వతంత్రంగా ఉంటారా అన్నది వారే నిర్ణయించుకోవాలని తెలిపారు. రాజా హరిసింగ్‌ భారత్‌లో ఎక్కడ కలుస్తారోనన్న ఆందోళనతో పాకిస్తాన్‌ 1947 అక్టోబర్‌లో కశ్మీర్‌పై దండయాత్ర చేసింది.

ఇస్లాం ఆదివాసీలు పాక్‌ ఆర్మీ అండదండ చూసుకొని కశ్మీర్‌పై దాడికి దిగాయి. దీంతో మహారాజా హరిసింగ్‌ కశ్మీర్‌ ప్రాంతాన్ని భారత్‌లో కలుపుతానని ప్రకటించి మన దేశ సైనిక సాయాన్ని అభ్యర్థించారు. ఇరు వర్గాల మధ్య పోరు కొన్నాళ్లు సాగింది. కశ్మీర్‌లో అత్యధిక భాగాన్ని పాక్‌ ఆక్రమించుకుంది. అప్పుడే పాక్‌ ఆక్రమిత కశ్మీర్, వాస్తవాధీన రేఖ ఏర్పడ్డాయి. చివరికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించాయి. కశ్మీర్‌ లోయలో రెండింట మూడు వంతుల భాగం భారత్‌ కిందకి వచ్చాయి. ఇక పాక్‌ ఆక్రమించుకున్న ప్రాంతాన్ని ఆజాద్‌ కశ్మీర్‌ గిల్జిట్‌ బల్టిస్తాన్‌ అని పిలుస్తారు.  

1965 పాక్‌ పలాయనం
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటుకు పాక్‌ 1965లో భారీ కుట్రకు తెరతీసింది. ఆపరేషన్‌ గిబ్రాల్టర్‌ పేరుతో భారత్‌లో మారణహోమం సృష్టించడానికి పన్నాగాలు రచించింది. దీంతో భారత్‌ పశ్చిమ పాకిస్తాన్‌పై పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించింది. మొత్తం 17 రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో ఇరుపక్షాలకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధికంగా యుద్ధట్యాంకులు వినియోగించింది ఈ యుద్ధంలోనే. దీనినే రెండో కశ్మీర్‌ యుద్ధం అని కూడా పిలుస్తారు. ఈ యుద్ధంలో కొద్ది రోజులకే పాక్‌ తోక ముడిచింది. పాకిస్తాన్‌ మీద భారత్‌ పైచేయి సాధించింది. అదే సమయంలో అమెరికా, రష్యా దౌత్యపరమైన జోక్యంతో యుద్ధం నిలిచిపోయింది. తాష్కెంట్‌ డిక్లరేషన్‌ అమల్లోకి వచ్చింది.

1971 బంగ్లా విముక్తి
ఈ యుద్ధంలో వాస్తవానికి కశ్మీర్‌ ప్రమేయం ప్రత్యక్షంగా లేకపోయినా పాక్‌కు అత్యంత నష్టం కలిగించింది, భారత్‌ కశ్మీర్‌లో తిరిగి కొంత భాగాన్ని ఆక్రమించుకుంది ఈ యుద్ధంతోనే. పశ్చిమ, తూర్పు పాకిస్తాన్‌ల మధ్య సంక్షోభం తలెత్తడంతో తూర్పు పాకిస్తాన్‌ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌) పాలకుడు షేక్‌ ముజ్బీర్‌ రెహ్మాన్‌కు అండగా భారత్‌ నిలబడింది. బంగ్లాదేశ్‌ విముక్తి కోసం పాక్‌తో యుద్ధం చేసింది. పాక్‌ ప్రభుత్వ ఆగడాలు భరించలేని బెంగాలీలు బంగ్లాదేశ్‌ విముక్తి కోసం పోరు బాట పట్టారు. వారికి అండగా నిలిచిన భారత్‌పైకి పాకిస్తాన్‌ యుద్ధానికి దిగింది.

ఎన్నో ప్రాంతాలపై దాడులు మొదలు పెట్టింది. భారత్‌ ఆర్మీ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆ సమయంలోనే పాక్‌ అధీనంలో ఉన్న కశ్మీర్‌లో 5,795 చదరపు మైళ్ల భాగాన్ని మన సైన్యం కైవసం చేసుకుంది. రెండువారాల పాటు ఉ«ధృతమైన పోరాటం తర్వాత బంగ్లాదేశ్‌ విముక్తి జరిగింది. ఆ తర్వాత కుదుర్చుకున్న లాహోర్‌ ఒప్పందంలో భాగంగా భారత్‌ కశ్మీర్‌లో తాను సొంతం చేసుకున్న భాగాన్ని పాక్‌కు తిరిగి ఇచ్చేసింది. ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని, కశ్మీర్‌లో శాంతి నెలకొల్పాలనే భారత్‌ ఆ నిర్ణయం తీసుకుంది.  

1999 కార్గిల్‌ చొరబాటు
1999 మొదట్లో పాకిస్తాన్‌ దళాలు వాస్తవాధీన రేఖ వెంబడి కశ్మీర్‌లోకి చొచ్చుకువచ్చాయి. కార్గిల్‌ జిల్లాలో అత్యధిక భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పాక్‌ చొరబాట్లను అడ్డుకోవడానికి ఈసారి పెద్ద ఎత్తున మిలటరీ చర్యకి భారత్‌ దిగింది. రెండు నెలల పాటు ఇరు దేశాల మధ్య పోరు సాగింది. పాక్‌ ఆక్రమించుకున్న ప్రాంతాలన్నింటినీ భారత్‌ మిలటరీ తిరిగి తన అధీనంలోకి తెచ్చుకోవడం మొదలు పెట్టింది. పాక్‌ ఆక్రమించుకున్న ప్రాంతంలో 75 నుంచి 80శాతం వరకు తిరిగి భారత్‌ అధీనంలోకి వచ్చేశాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ తీవ్రత ఎక్కువైపోతూ ఉండడంతో పాకిస్తాన్‌ను వెనక్కి తగ్గమంటూ అమెరికా దౌత్యపరమైన ఒత్తిడిని పెంచింది. అప్పటికే పాక్‌ సైనికుల్లో నైతిక స్థైర్యం దెబ్బతింది. 4 వేల మంది వరకు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్థికంగా కూడా ఆ దేశం బలహీనపడిపోయింది. భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న పాక్‌ యుద్ధాన్ని నిలిపివేసింది. అలా కార్గిల్‌ యుద్ధంతో భారత్‌ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement