న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంతో పాకిస్తాన్ దాడులు నిర్వహించే అవకాశం ఉందని భావించిన కేంద్రం, పీఓకేలో భారీగా సైన్యాన్ని మోహరించింది. పాక్ నుంచి వచ్చే ఏ ప్రతిచర్యనైనా తిప్పికొట్టడానికి సైన్యం సిద్ధంగా ఉందని సైనికవర్గాలు తెలిపాయి. ఆర్మీ ప్రధానాధికారులంతా జమ్మూ కశ్మీర్‌లో జరుగుతున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. కశ్మీర్ లోయలో పాక్ హింసకు, ఐఈడీ పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఏ సమయంలోనూ పరిస్థితిని చేజారనివ్వమని ఓ సీనియర్ మిలిటరీ అధికారి తెలిపారు. 2016లో హిజ్బుల్ ముజాహిద్దీన్ నాయకుడు బుర్హాన్ వానిని హతం చేసినపుడు కశ్మీర్‌లోయలో దాదాపు నాలుగు నెలలకుపైనే అస్థిరత నెలకొంది. అలాంటి పరిస్థితులు మళ్లీ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. వైమానిక దళం కూడా అక్కడే ఉంటూ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది.
వారిని అదుపు చేయాలి: కేంద్రం
జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భద్రతా దళాలను మరింత అప్రమత్తతో ఉంచాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘జాతీయ ప్రయోజనాలు, దేశ భద్రతను బలోపేతం చేయడానికి కేంద్ర కేబినెట్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించేలా సాంఘిక వ్యతిరేక శక్తులు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. వాటిని అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మత పరమైన సున్నిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి.’ అని పేర్కొంది.
సైన్యం.. అప్రమత్తం
Published Tue, Aug 6 2019 3:33 AM | Last Updated on Tue, Aug 6 2019 3:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment