attaks
-
నిలకడగా సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం
ముంబై: బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సైఫ్ అలీ ఖాన్(54)పై గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో నటుడికి తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో సంపన్నులు నివాసం ఉండే బాంద్రా వెస్ట్ ప్రాంతంలో ఉన్న సద్గురు శరణ్ భవనం 12వ అంతస్తులో సైఫ్ సొంత ఫ్లాట్‌లో గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో ఇంట్లో సైఫ్ భార్య కరీనాకపూర్ ఖాన్‌తో కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. దుండగుడి దాడిలో గాయపడి రక్తమోడుతున్న సైఫ్‌ను ఆయన పెద్ద కుమారుడు ఇబ్రహీం, పనిమనుషులు వెంటనే ఆటోలో సమీపంలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించడంతో ప్రాణాపాయం తప్పింది. రెండు బలమైన కత్తిపోట్లు సహా మొత్తం ఆరు చోట్ల గాయాలయ్యాయని డాక్టర్లు చెప్పారు. వెన్నుముక నుంచి 2.5 అంగుళాల కత్తి మొనను ఆపరేషన్ ద్వారా తొలగించారు. సైఫ్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. సైఫ్‌పై దాడిపట్ల బాలీవుడ్ నటులతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండాపోయిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రత్యేక బృందాలతో గాలింపు సైఫ్‌పై దాడి ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బాంద్రా పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రాత్రిపూట ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో సెక్షన్ 331(4), సెక్షన్ 311 కింద కేసు పెట్టారు. సాక్ష్యాధారాల కోసం సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. సైఫ్‌పై దాడి తర్వాత దుండగుడు మెట్లు దిగి పారిపోయినట్లు గుర్తించారు. వీపున తగిలించుకున్న ఓ బ్యాగ్‌తో అతడు పారిపోతున్న దృశ్యాలు ఆరో అంతస్తులో తెల్లవారుజామున 2.33 గంటల సమయంలో రికార్డయ్యాయి. స్థానికంగా మొబైల్ ఫోన్ల డేటాను పోలీసులు వడపోశారు. దుండుగుడి ఆచూకీ కనిపెట్టడానికి పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతడి ఫోటోను విడుదల చేశారు. దుండగుడి దాడిలో సైఫ్ పనిమనిషికి సైతం గాయాలయ్యాయి. దుండగుడితో జరిగిన పెనుగులాటలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. బాధితురాలి నుంచి పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. స్టేట్మెంట్ రికార్డు చేశారు. అసలేం జరిగింది? దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ఫ్లాట్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. సైఫ్, కరీనా దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఫ్లాట్‌లో నిద్రిస్తున్న సమయంలో అలికిడి వినిపించింది. అప్పటికే సైఫ్ చిన్నకుమారుడు జహంగీర్ గదిలో మాటువేసిన దుండగుడి కదలికలను పనిమనిషి గమనించి బిగ్గరగా కేకలు వేసింది. అలారం మోగించింది. దాంతో అతడు ఆమెపై కత్తి దూశాడు. ఈ శబ్దాలు వినిపించి నిద్రనుంచి మేల్కొన్న సైఫ్ అలీ ఖాన్ ఆ గదిలోకి వచ్చి దుండగుడిని అడ్డుకొనేందుకు ప్రయతి్నంచాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చాలాసేపు పెనుగులాట జరిగింది. వాగ్వాదం చోటుచేసుకుంది. సైఫ్‌ను దుండగుడు కత్తితో విచక్షణారహితంగా పొడిచి తక్షణమే మెట్ల మార్గం గుండా పరారయ్యాడు. ఫైర్ ఎగ్జిట్ ద్వారా అతడు సైఫ్ ఫ్లాట్‌లో ప్రవేశించినట్లు పోలీసులు చెప్పారు. సైఫ్ కుమారుడి గదిలో నాలుగు గంటలపాటు నిశ్శబ్దంగా నక్కి ఉండి, అవకాశం కోసం ఎదురు చూశాడని, అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగతనానికి ప్రయతి్నంచాడని తెలిపారు. కారు అందుబాటులో లేకపోవడంతో సైఫ్‌ను ఆయన కుమారుడు, సహాయకులు ఆటోలో ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడికి న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ లీనా జైన్, అనస్థీషియాలజిస్టు డాక్టర్ నిషా గాంధీ శస్త్రచికిత్స చేశారు. ఆరు చోట్ల గాయాలైనట్లు తెలిపారు. మెడ, వెన్నుముక భాగంలో సర్జరీ చేశారు. ఎడమ చెయ్యి, మెడ కుడి భాగంలో రెండు లోతైన గాయాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలో పూర్తిస్థాయిలో కోలుకుంటారని వెల్లడించారు. నిప్పులు చెరిగిన ప్రతిపక్షాలు మహారాష్ట్రలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణిస్తున్నాయని ఎన్సీపీ(శరద్ పవార్ అధ్యక్షుడు శరద్ పవార్ ఆరోపించారు. బాంద్రాలో ఇటీవలే ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడని, ఇప్పుడు సైఫ్‌పై దాడి జరిగిందని చెప్పారు. ఇవన్నీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. హోంశాఖ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్దే ఉందని, శాంతిభద్రతల పరిరక్షణపై ఇకనైనా దృష్టి పెట్టాలని సూచించారు. ముంబైలో ఎవరికీ రక్షణ లేదని శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. -
సిరియా సైనిక స్థావరాల్లో 80 శాతం ధ్వంసం
ఇజ్రాయెల్: సిరియాలోని వ్యూహాత్మక సైనిక స్థావరాల్లో 80 శాతం ప్రాంతాలపై దాడి చేసి ఆ దేశ సైనిక సామర్థ్యాలను చావుదెబ్బతీశామని ఇజ్రాయెల్ తెలిపింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పాలన అంతమైన కొద్ది రోజులకే సిరియాలోని వ్యూహాత్మక సైనిక స్థావరాలపై తమ సేనలు గురిపెట్టి పని పూర్తిచేశామని ఇజ్రాయెల్ తెలిపింది. గత 48 గంటల్లో 400కు పైగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం గురువారం ప్రకటించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌కు తూర్పున ఉన్న నిస్సైనీకరణ(బఫర్ జోన్) ప్రాంతంలోకి దళాలను పంపామని, 80 శాతం సిరియా సైనిక స్థావరాలను నేలమట్టంచేశామని వెల్లడించింది. ఆయుధ నిల్వలపై దాడి చేసి, అవి తిరుగుబాటుదారుల శక్తుల చేతుల్లో పడకుండా నిరోధించామని తెలిపింది. అన్ని రకాల ఆయుధాలు ధ్వంసం ‘‘అల్–బైదా పోర్టు, లటాకియా పోర్టు, డమాస్కస్, ఇతర కీలక నగరాల్లో శత్రు వుల యుద్ధవిమానాలను కూల్చే ఆయుధ వ్యవస్థలు, ఆయుధాగారాలకు చెందిన 15 నావికాదళ నౌకలను ధ్వంసం చేశాం. సముద్రతలంపై 80 నుంచి 190 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను చేధించేందుకు సముద్రతలం నుంచి ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణులను ధ్వంసంచేశాం. స్కడ్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, ఉపరితలం నుంచి సముద్రం వరకు, ఉపరితలం నుంచి గగనతలంలోకి, ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణు లు, మానవసహిత యుద్ధ వాహకాలు (యూఏవీ), యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, రాడార్లు, ట్యాంకులు, హ్యాంగర్లు తదితర వ్యూహాత్మక ఆస్తులను నిరీ్వర్యం చేశాం’’అని సిరియా సైన్యం పేర్కొంది. సిరియాలో 2011లో అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ వందలాది దాడులు చేసింది.అసద్ పతనంపై నెతన్యాహు ఏమన్నారంటే..అసద్ పాలన అంతమై రోజు చారిత్రాత్మకమైన రోజు అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఇరాన్, అసద్‌లకు ప్రధాన మద్దతుదారులైన హెజ్బొల్లాలను తాము చావు దెబ్బ కొట్టిన ఫలితమే అసద్ పాలన అంతానికి అసలు కారణమని ఆయన వ్యాఖ్యానించారు. అణచివేత పాలన నుంచి విముక్తి పొందాలనుకునేవారికి స్వేచ్ఛ, సాధికారత ఇజ్రాయెల్ కలి్పంచిందని ఆయన ఒక వీడియో ప్రకటనలో చెప్పారు. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్లను, ఇరాన్ మద్దతు ఉన్న పాలస్తీనా హమాస్ కీలక నేతలను, లెబనాన్ హెజ్బొల్లా సీనియర్ నాయకులను ఇజ్రాయెల్ వరసబెట్టి అనూహ్య దాడుల్లో అంతంచేయడం తెల్సిందే. -
ఇజ్రాయెల్ హై అలర్ట్
టెల్ అవీవ్: ఇరాన్ చేసే ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సన్నద్ధమైంది. ఎప్పుడు, ఎలా దాడి చేయనుందో కచ్చితంగా తెలియనప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం అత్యున్నత స్థాయి అప్రమత్తత ప్రకటించింది. అక్టోబర్ ఒకటో తేదీన ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పైకి విరుచుకుపడటం తెలిసిందే. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు కూడా ఇరాన్‌పై రెండు సార్లు దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ఇది ఇరాన్‌ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేసింది. ఇజ్రాయెల్‌పైకి దాడి చేసే శక్తి, ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనే సామర్ధ్యం ఈ దాడులతో దెబ్బతిన్నట్లు రూఢీ అయ్యింది. ‘ఇజ్రాయెల్ చేసిన దాడులను అతిగా చూపలేం, అలాగని తక్కువని చెప్పలేం’అని సాక్షాత్తూ ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీయే స్వయంగా వ్యాఖ్యానించడం గమనార్హం. అయినప్పటికీ, ఇరాన్ ప్రతీకారం తీర్చుకునే అవకాశాలున్నట్లు ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. -
కశ్మీర్లో స్థానికేతరులపై ముష్కరుల కాల్పులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకలు మళ్లీ పేట్రేగిపోయాయి. శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిపై టన్నెల్ నిర్మాణ పనుల ప్రాంతంలో ఉన్న ఒక వైద్యుడు, ఐదుగురు స్థానికేతర కార్మికులను చంపేశారు. గందేర్బల్లోని గుండ్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఘటన చోటుచేసుకుంది. పనులు చేస్తున్న స్థానిక, స్థానికేతర కార్మికులు, ఇతర సిబ్బందిపై ఇద్దరు ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులకు తెగబడినట్లు సమాచారం. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మరో ఐదుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. గాయపడిన మరో ఐదుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. మృతులను డాక్టర్ షెహనవాజ్, ఫహీమ్ నజిర్, కలీం, మహ్మద్ హనీఫ్, శశి అబ్రోల్, అనిల్ శుక్లా, గుర్మిత్ సింగ్‌లుగా గుర్తించారు. ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆప్రాంతాన్ని దిగ్బంధించి, గాలింపు చేపట్టాయి. కశ్మీర్ ఐజీ వీకే బిర్డి తదితర అధికారులు ఘటనాస్థలికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. ఘటనను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. ఉగ్రమూకలను వదిలేది లేదని స్పష్టం చేశారు. కాల్పుల ఘటనను సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఘటనలో మృతుల సంఖ్య పెరగొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, శుక్రవారం బుల్లెట్ గాయాలతో ఉన్న బిహార్‌కు చెందిన కార్మికుడి మృతదేçహాన్ని షోపియాన్ జిల్లాలో గుర్తించామని అధికారులు తెలిపారు. -
సూడాన్‌లో 85 మంది ఊచకోత
ఖార్టూమ్: సూడాన్‌లో పారా మిలటరీ మూకలు గురువారం సిన్నార్ రాష్ట్రంలోని జల్క్ని గ్రామంపై దాడిచేసి బాలికలను కిడ్నాప్ చేసేందుకు యత్నించగా గ్రామస్థులు ప్రతిఘటించారు. దీంతో మూకలు గ్రామాన్ని ఐదు రోజులపాటు ముట్టడించి 85 మందిని చంపేశారని మీడియా తెలిపింది. సిన్నార్ కోసం సైన్యం, మూకల మధ్య సాగుతున్న పోరుతో ఇన్నేళ్లలో 7.25 లక్షల మంది ప్రజలు వలస వెళ్లారు. -
సరిహద్దుల్లో పాక్ దుశ్చర్య..
న్యూఢిల్లీ/శ్రీశ్రీనగర్: సరిహద్దుల్లో పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీం(బ్యాట్) దాడికి చేసిన ప్రయత్నాన్ని భారత బలగాలు తిప్పి కొట్టాయి. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఎదురుకాల్పుల్లో ఒక పాకిస్తానీ యుడు హతం కాగా, మరో ఇద్దరు పీఓకేలోకి పరారయ్యారు. ఈ ఘటనలో ఒక జవాను నేలకొరగ్గా ఆర్మీ కెప్టెన్ సహా నలుగురు గాయపడ్డారు. శనివారం ఉదయం ప్రతికూల వాతావరణాన్ని అనువుగా మలుచుకుని బ్యాట్ సభ్యులు కుప్వారా జిల్లాలోని కామకారి సెక్టార్లో ఎల్వోసీని దాడి భారత భూభాగంలోకి ప్రవేశించారు. ట్రెహ్గామ్ సెక్టార్‌లోని కుంకడి ఫార్వర్డ్ పోస్ట్‌పైకి గ్రెనేడ్ విసిరి, కాల్పులకు తెగబడ్డారు. ఆర్మీ బలగా లు దీటుగా స్పందించాయి. రెండు పక్షాల మధ్య దాదాపు నాలుగు గంటలపాటు కాల్పులు కొనసాగాయి. బ్యాట్‌లోని ఒక పాకిస్తానీ హతం కాగా, మరో ఇద్దరు పీవోకేలోకి పలాయనం చిత్తగించారు. ఆర్మీ కెప్టెన్ సహా తీవ్రంగా గాయపడిన ఐదుగురిని వెంటనే శ్రీనగర్‌లో ఆర్మీ బేస్ ఆస్పత్రికి తరలించారు. రైఫిల్ మ్యాన్ మోహిత్ రాథోడ్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బ్యాట్‌లో సాధారణంగా సుశిక్షితులైన పాక్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్‌తోపాటు ఉగ్రవాదులు సభ్యులుగా ఉంటారు. అమానవీయ చర్యల కు పాల్పడుతూ నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంతతకు భంగం కలిగించడమే వీరి పని. కాగా, జమ్మూ ప్రాంతంలో ఉగ్ర ఘటనలు పెరిగిన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది.మోదీ కొత్త ప్రభుత్వంలో 14 ఉగ్రదాడులు: ప్రియాంకజమ్మూకశ్మీర్లో ఉగ్రమూకల దాడులు పెరిగిపోవడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన దాడిలో ఒక జవాను ప్రాణాలు కోల్పో వడం, మరో నలుగురు గాయపడటంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టాక 49 రోజుల్లో కశ్మీర్లో జరిగిన 14 ఉగ్రదాడుల్లో 15 సైనికులు అమరుల య్యా రన్నారు. ఉగ్రవాదం పీచమణిచేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. -
Paris Olympics: ఫ్రాన్స్‌లో దుండగుల దుశ్చర్య
పారిస్: ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న ఫ్రాన్స్‌లో గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసానికి పాల్పడ్డారు. హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటలకు క్రీడోత్సవాలు ప్రారంభం కాగా, దుండగుల దుశ్చర్య కారణంగా ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ఆలస్యంగా నడిచాయి. మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ సబ్స్టేషన్లపై దాడి చేశారు. కేబుళ్లు తెంపేశారు. ఫలితంగా ఫ్రాన్స్‌తోపాటు యూరప్‌లోని పలు ప్రాంతాల నుంచి పారిస్‌కు రైల్వే సేవలు నిలిపివేయాల్సి వచి్చంది. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైళ్లలో వెళ్లాల్సిన ఒలింపిక్ క్రీడాకారులను బస్సుల్లో పారిస్‌కు తరలించారు. ఒలింపిక్స్ ప్రారంభమైన రోజే పథకం ప్రకారం జరిగిన ఈ చర్యల వెనుక కుట్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వామపక్షవాద మిలిటెంట్లు లేదా పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు ఈ దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు. తమ డిమాండ్లను ప్రపంచం దృష్టికి తీసుకురావాలన్నదే వారి ఎత్తుగడ కావొచ్చని చెబుతున్నారు. అయితే, ఒలింపిక్ క్రీడలతో ఈ దాడులకు ప్రత్యక్ష సంబంధం లేదని భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. క్రీడలను అడ్డుకోవాలన్నది దుండగుల ఆలోచన కాకపోవచ్చని తెలిపారు. హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను స్తంభింపజేసిన దుండుగులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. నేరం రుజువైతే వారికి పదేళ్ల నుంచి 20 ఏళ్ల దాకా జైలు శిక్షపడే అవకాశం ఉందని చెప్పారు. తాజా ఘటనలపై ఫ్రాన్స్ ప్రధానమంత్రి గాబ్రియెల్ అటాల్ స్పందించారు. ఇవి ముందస్తు పథకం ప్రకారం జరిగిన దాడులేని చెప్పారు. ఉత్తర, తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి పారిస్‌కు దారితీసే రైలు మార్గాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారని తెలిపారు. పారిస్‌కు వెళ్లే రైళ్లను అడ్డుకోవాలన్నదే వారి ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. దుండగుల కోసం గాలింపు ప్రారంభమైందన్నారు. మధ్యాహ్నం తర్వాత రైళ్ల రాకపోకలు కొనసాగాయని రవాణా మంత్రి పాట్రిస్ వెర్‌గ్రిటే చెప్పారు. ఒలింపిక్స్ సందర్భంగా ముష్కరులు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందని ఫ్రాన్స్ నిఘా వర్గాలు నెల రోజుల క్రితమే హెచ్చరించాయి. -
కవ్వింపులు.. ఆపై గొడవలు
పెళ్లకూరు (తిరుపతి జిల్లా): పెళ్లకూరు మండలం చిల్లకూరులో టీడీపీ కార్యకర్త దుందుడుకు చర్యలతో గొడవ చోటుచేసుకుంది. టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడులతో సంబంధం లేని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణరెడ్డిపై అక్రమ కేసు నమోదైంది. వివాదాస్పద ఈ గ్రామంలో కొద్ది రోజులుగా పోలీసు పికెట్ ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అయితే గ్రామానికి చెందిన టీడీపీ నేత దువ్వూరు విజయసేనారెడ్డి టీడీపీ విజయం సాధించిన నేపథ్యంలో గురువారం రాత్రి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చాడు. గడ్డివాములు, చిన్న పిల్లలపై నిప్పు రవ్వలు పడ్డాయి. దీంతో అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు మురళి, మరి కొందరు విజయసేనారెడ్డితో మాట్లాడేందుకు వెళ్లారు. అక్కడ మాటామాటా పెరిగి వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల వారు దాడులకు పాల్పడటంతో పలువురు గాయపడ్డారు. నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వేర్వేరు వాహనాల్లో చికిత్స నిమిత్తం ఒక వర్గాన్ని శ్రీకాళహస్తికి, మరో వర్గాన్ని నాయుడుపేట ఆసుపత్రులకు తరలించారు. అదే సమయంలో సత్యనారాయణరెడ్డిపై కక్ష సాధించడం కోసం దాడుల్లో గాయపడిన రాకే‹Ùరెడ్డికి మద్దతుగా నాయుడుపేటకు చెందిన కొందరు టీడీపీ యువత పెళ్లకూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సత్యనారాయణరెడ్డి తమపై దాడి చేయించాడంటూ రాకే‹Ùరెడ్డి, విజయసేనారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇరు వర్గాల ఫిర్యాదులతో ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణరెడ్డితో పాటు ఆయన వర్గానికి చెందిన పిల్లిమిట్ట మురళి, వంశీకృష్ణ, ఆళ్ల చంద్రబాబు, సుజిత్, మణి, నాగార్జున్, చెంచయ్య, పుట్టయ్యలతో పాటు రాకే‹Ùరెడ్డి, విజయసేనారెడ్డిలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యనారాయణరెడ్డిని కూడా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో సంబంధంలేని సత్యనారాయణరెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. నాయుడుపేట రూరల్ సీఐ జగన్మోహన్రావు అత్యుత్సాహం వల్లే సత్యనారాయణరెడ్డిని అన్యాయంగా కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. అడిషనల్ ఎస్పీ జక్కా కులశేఖర్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని కేసు వివరాలను పరిశీలించారు. సత్యనారాయణరెడ్డితో పాటు మరో తొమ్మిది మందిని అరెస్టు చేసి సూళ్లూరుపేట కోర్టులో హాజరు పరిచారు. ఎన్నికల సమయంలో డబుల్ గేమ్ అడుతున్న సీఐని బదిలీ చేయాలని అప్పట్లో ఎమ్మెల్యే సంజీవయ్యకు సూచించడాన్ని మనసులో పెట్టుకొని అన్యాయంగా తనను కేసులో ఇరికించినట్లు సత్యనారాయణ రెడ్డి తెలిపారు. -
అమెరికాలో భారతీయుని దారుణ హత్య
న్యూయార్క్: అమెరికాలో భారతీయులు, భారతీయ అమెరికన్లపై దాడులు కొనసాగుతున్నాయి. పశ్చిమబెంగాల్‌కు చెందిన శాస్త్రీయ నృత్య కళాకారుడొకరిని దుండగులు కాల్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిస్సోరిలోని సెంట్ లూయీస్‌లో మంగళవారం ఈ దారుణం చోటుచేసుకుంది. బీర్భూమ్ జిల్లా సూరికి చెందిన అమర్నాథ్ ఘోష్(34) పీహెచ్డీ కోసం అమెరికాలోని వెళ్లారు. వాషింగ్టన్ వర్సిటీలో చేరారు. మంగళవారం ఉదయం 7.15 గంటల సమయంలో నడిచి వెళ్తుండగా సెంట్ లూయీస్ అకాడమీ సమీపంలో దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడి ఆయన అక్కడికకక్కడే చనిపోయారు. అమర్నాథ్కు తల్లిదండ్రులు, తోబుట్టువులు లేరు. ఆయన మృతి విషయం బంధువులకు ఆలస్యంగా చేరింది. కూచిపూడి, భరతనాట్యాల్లో నిపుణుడైన ఆయన బాలె నేర్చుకుంటూ పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తున్నట్లు ఆయన స్నేహితులు హిమా కుప్ప, రవి కుప్ప తెలిపారు. ఘోష్ మృతిపై షికాగోలోని భారత కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై స్థానిక పోలీసులు, యూనివర్సిటీ అధికారుల తో చర్చించింది. ఆయనను పొట్టన బెట్టుకున్న దుండగులను తక్షణమే పట్టుకోవాలని కోరింది. -
బీజేపీకి పెద్ద సవాల్‌గా ఎదిగాం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: బీజేపీకి రాజకీయాల్లో అతిపెద్ద సవాల్‌గా, కొరకరాని కొయ్యలా తయారయ్యాం కాబట్టే ఆప్‌పై బీజేపీ అన్ని వైపుల నుంచి దాడులు చేస్తోందని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల్లో తన ప్రభుత్వంపై పెట్టుకున్న విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా శనివారం కేజ్రీవాల్ ప్రసంగిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘‘ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీదే గెలుపు కావచ్చు. కానీ 2029 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం దేశానికి బీజేపీ నుంచి విముక్తి కలి్పస్తాం. ఆ బాధ్యత ఆప్ తన భుజస్కంధాలపై వేసుకుంది. సభలో ఆప్కే మెజారిటీ ఉందనేది స్పష్టం. అయితే ఆప్ ఎమ్మెల్యేలకు ఎరవేసి తమ వైపు లాక్కుని, ఆప్ సర్కార్‌ను కూల్చేద్దామని బీజేపీ కుట్ర పన్నింది. అందుకే ఈ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి వచ్చింది’’ అని కేజ్రీవాల్ స్పష్టంచేశారు. తర్వాత విశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో నెగ్గింది. -
Prime Minister Narendra Modi: విష వలయంలో కాంగ్రెస్
జైపూర్/రేవాడీ: కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఆ పార్టీ బంధుప్రీతి, వారసత్వ రాజకీయాల విష వలయంలో చిక్కుకుందని, అందుకే నాయకులంతా బయటకు వెళ్లిపోతున్నారని చెప్పారు. తనను వ్యతిరేకించడమే కాంగ్రెస్ ఏకైక అజెండాగా మారిపోయిందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్‌కు దశ, దిశ లేవు. భవిష్యత్తులో చేయాల్సిన అభివృద్ది పట్ల విజన్, రోడ్డు మ్యాప్ లేవు’’ అన్నారు. శుక్రవారం జైపూర్‌లో ‘వికసిత్ భారత్, వికసిత్ రాజస్తాన్’ సభనుద్దేశించి మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. రోడ్లు, రైల్వేలు, సౌర శక్తి, విద్యుత్ సరఫరా, తాగునీరు, పెట్రోలియం, సహజ వాయువు తదితర రంగాలకు చెందిన రూ.17,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వికసిత్ భారత్ అంటే... ప్రజలకు ఇచి్చన గ్యారంటీలను తాము అమలు చేస్తుంటే కొందరికి నిద్ర పట్టడం లేదని మోదీ అన్నారు. వికసిత్ భారత్, మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ వంటివి తాము ప్రారంభించిన పథకాలు కావడంతో వాటి గురించి కాంగ్రెస్ మాట్లాడడం లేదని ఆరోపించారు. మోదీ ఏం మాట్లాడినా, ఏం చేసినా కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని, దీనివల్ల దేశానికి భారీ నష్టం కలిగే అవకాశం ఉన్నా ఆ పార్టీ లెక్కచేయడం లేదని మండిపడ్డారు. ఇలాంటి ప్రతికూల రాజకీయాలు యువతకు ఏమాత్రం స్ఫూర్తిని ఇవ్వబోవని తేలి్చచెప్పారు. ఇటీవలే యూఏఈలో పర్యటించానని, భారత్ సాధిస్తున్న ప్రగతిని చూసి అక్కడి నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారని ప్రధాని మోదీ వెల్లడించారు. వికసిత్ భారత్ అంటే కేవలం కొన్ని పదాలు లేదా భావోద్వేగం కాదని వివరించారు. దేశంలో ప్రతి కుటుంబాన్ని సౌభాగ్యవంతంగా మార్చే, పేదరికాన్ని తొలగించే, ఉపాధి అవకాశాలు సృష్టించే, ఆధునిక వసతులు కలి్పంచే కార్యక్రమం అని తెలియజేశారు. తన దృష్టిలో యువత, మహిళలు, రైతులు, పేదలు అనే నాలుగు కులాలు మాత్రమే ఉన్నాయని ప్రధానమంత్రి మరోసారి వివరించారు. హరియాణాలోని రేవాడీలో ఎయిమ్స్‌కు మోదీ శంకుస్థాపన చేశారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. రాముడు కేవలం ఊహేనని, ఆయోధ్యలో ఆలయం అవసరం లేదని అన్న కాంగ్రెస్ ఇప్పుడు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తోందని ఎద్దేవా చేశారు. -
Pakistan General Elections 2024: ఇంటర్నెట్ బంద్..ఉగ్ర దాడులు
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్లో హింసాత్మక ఘటనల మధ్య సాధారణ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. మొత్తం 12.8 కోట్ల మంది ఓటర్ల కోసం 6.50 లక్షల మంది భద్రతా సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. పోలింగ్ నేపథ్యంలో గురువారం ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఆ వెంటనే అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలు పెట్టారు. శుక్రవారం ఉదయాని కల్లా ఫలితాల సరళిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఉగ్రదాడుల్లో ఆరుగురు మృతి ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్‌లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఆరుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. డేరా ఇస్మాయిల్ ఖాన్‌లోని కలాచి వద్ద భద్రతా సిబ్బంది వాహనాన్ని బాంబుతో పేలి్చన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఘటనలో నలుగురు జవాన్లు చనిపోయారు. మరో ఘటన..బలోచిస్తాన్‌లోని ఖరాన్‌లో మందుపాతర పేలి ఇద్దరు పోలీసులు చనిపోగా మరో ఏడుగురు గాయపడ్డారు. భద్రతా కారణాలు చూపుతూ అధికారులు ఇరాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దులను గురువారం మూసివేశారు. సరుకు రవాణా వాహనాలతోపాటు పాదచారులను సైతం అనుమతించలేదు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే మొబైల్, ఇంటర్నెట్ సరీ్వసులను దేశవ్యాప్తంగా నిలిపివేశారు. అయితే, రిగ్గింగ్‌ను యథేచ్ఛగా కొనసాగించేందుకే ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిపై ఎన్నికల కమిషనర్ సికందర్ సుల్తాన్ రజా స్పందిస్తూ ఉగ్రదాడులు జరిగితే బాధ్యతెవరిదని ప్రశ్నించారు. ఎన్నికలకు, ఇంటర్నెట్తో ఎటువంటి సంబంధం లేదన్నారు. మద్దతుదారుల మధ్య ఘర్షణ అటోక్ నియోజకవర్గంలో రెండు చోట్ల పీఎంఎల్–ఎన్, పీటీఐ పార్టీ మద్దతుదారుల మధ్య ఘర్షణతో పోలింగ్ 5 గంటలపాటు ఆగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది విధులకు రాకపోవడం, బ్యాలెట్ పేపర్లు చాలినన్ని అందకపోవడం, బ్యాలెట్ పేపర్లలో తప్పులు వంటి కారణాలతో చాలా చోట్ల పోలింగ్ ఆలస్యమైంది. బలోచిస్తాన్, ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్‌ల్లో వర్షం, అతిశీతల వాతావరణ పరిస్థితుల మధ్య చాలా చోట్ల ఓటేసేందుకు జనం బయటకు రాలేదు. -
Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో దాడులు.. 25 మంది దుర్మరణం
కీవ్: రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగంలో ఆదివారం ఒక మార్కెట్‌పై జరిగిన దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ సేనలే ఈ దాడులకు తెగబడినట్లు రష్యా ఆరోపిస్తోంది. దీనిపై ఉక్రెయిన్ ఇంకా స్పందించలేదు. డోనెట్స్క్ నగరం సమీపంలోని టెక్స్టిల్చిక్ ప్రాంత మార్కెట్‌పై జరిగిన ఈ దాడిలో 20 మందికిపైగా గాయపడ్డారు. మరోవైపు ఆదివారమే రష్యాలోని కింగ్‌సెప్ జిల్లాలోని ఉస్ట్–లూగా పోర్ట్ రసాయన రవాణా టెరి్మనల్ వద్ద రెండు భారీ పేలుళ్లు, తర్వాత భారీ అగి్నప్రమాదం జరిగిన నేపథ్యంలో ఈ సంఘటనలను రష్యా, ఉక్రెయిన్ల పరస్పర దాడులుగా అంతర్జాతీయ మీడియా అభివరి్ణస్తోంది. నాలుగు ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేయడం వల్లే రసాయన రవాణా టెర్మినల్ వద్ద గ్యాస్ ట్యాంక్ పేలిందని రష్యా స్థానిక మీడియా ఆరోపిస్తోంది. -
ఇరాన్‌పై పాక్ ప్రతీకార దాడి
ఇస్లామాబాద్: ఇరాన్ బుధవారం జరిపిన దాడులకు గురువారం పాక్ ప్రతీకారం తీర్చుకుంది. సరిహద్దులకు సమీపంలోని ఇరాన్ సియెస్తాన్–బలోచిస్తాన్ ప్రావిన్స్‌లో దాడులు జరిపింది. ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా రాకెట్లు, డ్రోన్లతో చేపట్టిన ‘ప్రెసిషన్ మిలటరీ స్ట్రయిక్స్’లో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలోచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్లకు చెందిన 9 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం ఉందని పాక్ ఆర్మీ వెల్లడించింది. ఈ ఘటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్‌కు తమ నిరసన తెలిపినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. పాక్ దాడుల్లో ఇరానేతర జాతీయులైన ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు చనిపోయినట్లు అధికార వార్తా సంస్థ ఇర్నా పేర్కొంది. పాక్ కేంద్రంగా పనిచేస్తూ తమ దేశంలో ఉగ్రదాడులకు తెగబడుతున్న జైష్ అల్–అదిల్ ఉగ్రసంస్థ స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణి దాడులతో బుధవారం విరుచుకుపడింది. ఈ దాడులకు నిరసనగా పాక్ తమ దేశంలోని ఇరాన్ రాయబారిని బహిష్కరించడంతోపాటు ఇరాన్‌లోని తమ రాయబారిని వెనక్కి పిలిపించుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ భూభాగంపై ఇరాన్ దాడులను భారత్ సమర్థించింది. ఉగ్రవాదాన్ని అంతమొందించాలన్న తమ వైఖరిలో మార్పు లేదని స్పష్టం చేసింది. ఇది ఆ రెండు దేశాలకు సంబంధించిన విషయమే అయినప్పటికీ, దేశాలు తమ ఆత్మరక్షణ కోసం తీసుకునే చర్యలను భారత్ అర్థం చేసుకుందని పేర్కొంది. -
బెంగాల్లో ఈడీ అధికారులపై దాడి
కోల్‌కతా: పశి్చమబెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మద్దతుదారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై విచక్షణా రహితంగా దాడికి దిగారు. ఘటనలో అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ పరిణామంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశాయి. అరాచకానికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని గవర్నర్ సీవీ ఆనంద బోస్ పేర్కొన్నారు. రేషన్ పంపిణీ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఈడీ అధికారులు సందేశ్‌ఖలిలోని టీఎంసీ నేత షేక్ షాజహాన్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా అక్కడికి చేరుకున్న షాజహాన్ మద్దతుదారులు రెచి్చపోయి ఈడీ అధికారులపై దాడికి తెగబడ్డారు. దాడిలో అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. షాజహాన్ అనుచరులు అధికారుల వాహనాల్నీ వదల్లేదు. వాటిని ధ్వంసం చేశారు. రక్షణగా వచి్చన కేంద్ర పారా మిలటరీ బలగాలపైనా దాడికి దిగారు. సోదాలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా సిబ్బందిపైనా దాడి చేశారు. వారి వాహనాల్ని తుక్కు చేశారు. గాయపడిన ఈడీ అధికారులు ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో అక్కడి నుంచి బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు అధికారులకు ఆస్పత్రిలో చికిత్స చేయించనున్నారు. రాష్ట్రమంత్రి జ్యోతిప్రియో మాలిక్‌కు షాజహాన్ సన్నిహితుడు. రేషన్ కేసులోనే గత ఏడాది మాలిక్ అరెస్టయ్యారు. షేక్ షాజహాన్‌పై ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి నివేదిక పంపినట్లు ఈడీ అధికారి ఒకరు పీటీఐకి చెప్పారు. ఘటనతో సంబంధమున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు రాష్ట్ర పోలీసులు చెప్పారు. సందేశ్‌ఖలి ఘటనను రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ తీవ్రంగా ఖండించారు. ఈడీ అధికారులపై దాడిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అనాగరిక చర్యను, విధ్వంసాన్ని ఆపాలని కోరారు. రాజ్యాంగానికి లోబడి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కేంద్ర అధికారులపై దాడి సమాఖ్య వ్యవస్థపై జరిగిన దాడిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్ పేర్కొన్నారు. ఘటనపై ఎన్ఐఏతో దర్యాప్తు చేయించి, రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ కోరారు. -
ఉక్రెయిన్‌పై మళ్లీ నిప్పుల వర్షం
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం మరోసారి భీకర స్థాయిలో విరుచుకుపడింది. చాలారోజుల తర్వాత అతిపెద్ద దాడికి పాల్పడింది. గురువారం రాత్రి నుంచి ఉక్రెయిన్‌లోని కీలకమైన లక్ష్యాలపై ఏకంగా 122 క్షిపణులు, 36 డ్రోన్లు ప్రయోగించింది. 18 గంటలపాటు జరిగిన ఈ దాడుల్లో 24 మంది సాధారణ పౌరులు మృతి చెందారని, దాదాపు 130 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్‌పై ఇదే అతిపెద్ద వైమానిక దాడి అని పేర్కొన్నాయి. రష్యా సైన్యం ప్రయోగించిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, షాహెద్ డ్రోన్లను చాలావరకు కూలి్చవేశామని ఉక్రెయిన్ సైనికాధికారి ఒకరు పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్–రష్యా నడుమ యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
army vehicles attacked: దాడి వెనుక పాక్, చైనా
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం ఆర్మీ వాహనాలపై దాడి వెనుక పాక్, చైనాల హస్తముందని రక్షణ శాఖ వర్గాలు అంటున్నాయి. లద్దాఖ్ సరిహద్దుల్లో భారీగా మోహరించిన ఆర్మీని మరోవైపు తరలించేలా భారత్‌పై ఒత్తిడి పెంచేందుకే ఆ రెండు దేశాలు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నాయి. కశ్మీర్ లోయలో ముఖ్యంగా పాక్ సరిహద్దుల్లో ఉన్న పూంఛ్, రాజౌరీ సెక్టార్లలో భారత ఆర్మీ లక్ష్యంగా ఇటీవల పెరిగిన ఉగ్ర దాడుల ఘటనలకు చైనా, పాకిస్తాన్ల ఉమ్మడి వ్యూహమే కారణమని చెబుతున్నాయి. ఆర్మీపై దాడుల ద్వారా భారత్‌ను రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ ఇప్పటికే పూంఛ్ అటవీ ప్రాంతాల్లోకి 25 నుంచి 30 మంది వరకు ఉగ్రవాదులను దొంగచాటుగా పంపించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. కశ్మీర్ వైపు దృష్టి మళ్లించేందుకే.. గల్వాన్ సంక్షోభం అనంతరం భారత్ లద్దాఖ్‌కు భారీగా సైన్యాన్ని తరలించడం చైనాకు రుచించడం లేదు. అందుకే తిరిగి కశ్మీర్ వైపు భారత్ దృష్టిని మళ్లించేందుకే, పాక్‌తో కుమ్మక్కయి పశ్చిమ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని రాజేసేందుకు పూనుకుంది. భారత్ 2020లో ప్రత్యేక శిక్షణ పొందిన రాష్ట్రీయ రైఫిల్స్ బలగాలను పూంఛ్ నుంచి లద్దాఖ్‌కు భారత్ తరలించింది. ఈ చర్యతో ఎంతో కీలకమైన లద్దాఖ్ ప్రాంతంలో చైనాపై భారత్‌దే పైచేయి అయ్యింది. అయితే, అదే సమయంలో పూంఛ్‌లో ఉగ్రవాదులను నిలువరించే వనరులు తక్కువపడ్డాయి. ఈ విషయం గ్రహించిన చైనా పూంఛ్‌లో పాక్‌కు దన్నుగా నిలుస్తూ ఉగ్ర చర్యలకు ఊతమివ్వసాగిందని రక్షణ రంగ నిపుణుడు కల్నల్ మనోజ్ కుమార్ చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో కడుపుమంట జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుపై చైనా, పాకిస్తాన్‌లు అసంతృప్తితో రగిలిపోతు న్నాయి. అందుకే, కశ్మీర్లో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉన్న పూంఛ్, రాజౌరీల్లో అశాంతిని ప్రేరేపించేందుకు కాచుక్కూర్చు న్నాయని రిటైర్డు కల్నల్ అజయ్ కొథియాల్ చెప్పారు. తాజాగా, సుప్రీంకోర్టు కూడా రద్దు సరైందేనని తీర్పు ఇవ్వడం ఆ రెండు దేశాలకు పుండుమీద కారం చల్లినట్లయిందన్నారు. ఇకపై జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు అవి ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశాలున్నాయన్నారు. అమెరికా తయారీ రైఫిళ్లు: గురువారం నాటి దాడికి తమదే బాధ్యతంటూ పాక్ కేంద్రంగా పనిచేసే లష్కరేతోయిబా అనుబంధ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్ఎఫ్) ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. దాడికి సంబంధించిన ఫొటోలను వారు సోషల్ మీడియాలో విడుదల చేశారు. వారి చేతుల్లో అమెరికా తయారీ అత్యాధునిక ఎం4 కార్బైన్ అసాల్ట్ రైఫిళ్లు కూడా కనిపిస్తున్నాయి. గతంలోనూ ఉగ్రవాదులు వీటిని వాడిన దాఖలాలున్నాయి. హెలికాప్టర్లు.. స్నైపర్ డాగ్స్ పూంచ్ జిల్లాలో అయిదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్న ముష్కరుల కోసం గాలింపు ముమ్మరమైంది. గురువారం మధ్యాహ్నం సురాన్‌కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధేరా కి గలి– బఫ్లియాజ్ మార్గంలో ఉన్న ధట్యార్ మోర్హ్ సమీపంలోని మలుపులో ఎత్తైన కొండపై ఉగ్రవాదులు పొంచి ఉన్నారు. బలగాలతో వెళ్తున్న రెండు వాహనాల వేగం బ్లైండ్ కర్వ్‌లో నెమ్మదించగానే ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో అయిదుగురు జవాన్లు నేలకొరగ్గా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ముష్కరులు ఇద్దరు జవాన్ల మృతదేహాలను ఛిద్రం చేయడంతోపాటు వారి వద్ద ఉన్న ఆయుధాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో ముగ్గురు లేదా నలుగురు ముష్కరులు పాల్గొని ఉంటారని ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)అధికారులు తెలిపారు. ఘటన అనంతరం పరారైన ఉగ్రవాదుల కోసం అటవీ ప్రాంతంలో హెలికాప్టర్లతో గాలిస్తున్నారు. ఉగ్రవాదుల జాడను పసిగట్టేందుకు స్నైపర్ జాగిలాలను రంగంలోకి దించారు. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని దిగ్బంధనం చేసిన బలగాలు శుక్రవారం ఉదయం నుంచి అణువణువూ శోధిస్తున్నాయి. -
President Droupadi Murmu: వారి త్యాగాలకు దేశం రుణపడింది
న్యూఢిల్లీ: ఇరవై రెండేళ్ల క్రితం పార్లమెంట్‌పై దాడి ఘటనలో అమరులైన భద్రతాబలగాలకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. బుధవారం పార్లమెంట్ దాడి మృతులకు ఆమె నివాళులర్పించారు. ‘‘ ప్రజాస్వామ్య దేవాలయంపైనే దాడికి తెగబడి అత్యున్నత స్థాయి రాజకీయనేతలను అంతంచేయాలని ఉగ్రవాదులు హేయమైన కుట్రపన్నారు. ఆ కుట్రను భారత భద్రతాబలగాలు వమ్ముచేసి ఆ క్రమంలో ప్రాణత్యాగంచేశాయి. ఆ ధైర్యశాలులకు నా నివాళులు. మాతృభూమి కోసం మీరు చేసిన ప్రాణత్యాగానికి దేశం సదా రుణపడి ఉంటుంది. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు సిద్ధమని అందరం ప్రతినబూనుదాం’’ అని సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. మానవాళికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదం ఏ దేశంలో ఏ రూపంలో ఉన్నాసరే దానిని సమూలంగా తుదముట్టించాలని వ్యాఖ్యానించారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రహ్లాద్ జోషి, పియూశ్ గోయల్, జితేంద్ర సింగ్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో అమరులకు నివాళులర్పించారు. అమరుల త్యాగాన్ని భారత్ సదా స్మరించుకుంటుందని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. త్యాగాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి: ప్రధాని పార్లమెంట్లో అమరులకు బుధవారం ప్రధాని మోదీ సైతం నివాళులర్పించారు. ‘‘ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరోచిత భద్రతా సిబ్బందికి నా హృదయపూర్వక నివాళులు. ఆపత్కాలంలో తెగువ చూపిన వారి త్యాగాలను యావత్ దేశం చిరస్థాయిగా గుర్తుంచుకుంటుంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. అమరులకు లోక్‌సభ నివాళులర్పించింది. లోక్‌సభ కార్యకలా పాలు బుధవారం మొదలవగానే స్పీకర్ బిర్లా మాట్లాడారు. ‘ ఉగ్రవాదులతో పోరాటంతో ప్రాణాలు కోల్పోయిన భద్రతా బలగాల కుటుంబాలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుంది. ఉగ్రవాదంపై భారత పోరు కొనసాగుతుంది’’ అని అన్నారు. ఈ సందర్భంగా సభ్యులంతా లేచి నిల్చుని కొద్దిసేపు మౌనం పాటించారు. -
Rajasthan Assembly elections 2023: అల్లర్లు, అవినీతిలో రాజస్తాన్ టాప్
జైపూర్: నేరాలు, అవినీతి, అల్లర్లలో రాజస్తాన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలోకి తీసుకెళ్లిందని ప్రధాని మోదీ ఎద్దేవాచేశారు. శనివారం రాజస్తాన్‌లోని భరత్పూర్, నాగౌర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి గెహ్లాత్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘ ఓవైపు విశ్వవిజేతగా భారత్ ప్రభవిస్తోంది. మరోవైపు రాజస్తాన్‌లో ఏం జరుగుతోందో మీకందరికీ తెల్సిందే. అల్లర్లు, నేరాల నమోదులో రాజస్తాన్ అగ్రపథంలో దూసుకుపోతోంది. బుజ్జగింపు రాజకీయాల కారణంగా సంఘ విద్రోహ శక్తులు స్వైరవిహారం చేస్తున్నాయి. అందుకే ఈసారి మీకు ఓట్లు వేయబోము అని మెజీషియన్‌కు ఓటర్లు చెప్పేశారు. ఈసారి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అదృశ్యమవుతుంది. డిసెంబర్ మూడున కాంగ్రెస్ మాయమవడం ఖాయం’’ అని గెహ్లోత్‌నుద్దేశిస్తూ మోదీ విమర్శించారు. చిన్నతనంలో తండ్రికి సాయపడుతూ గెహ్లోత్ మెజీషియన్‌గా దేశపర్యటన చేసిన సంగతి తెల్సిందే. ఈనెల 25వ తేదీన రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ మూడో తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. వారెక్కడుంటే నేరాలు అక్కడ ‘ ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు కొలువుతీరాయో అక్కడ నేరగాళ్లు, ఉగ్రవాదులు, అల్లర్లు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పెట్టిందిపేరు. ప్రజల జీవితాలను పణంగా పెట్టేందుకు ఎంతగా దిగజారేందుకైనా కాంగ్రెస్ సిద్ధం. అవినీతి పరాకాష్టకు చేరింది. ఈ ఐదేళ్ల కాంగ్రెస్ హయాంలో మహిళలు, దళితులపై నేరాలు ఎక్కువయ్యాయి. హోలీ, శ్రీ రామనవమి, హనుమాన్ జయంతి.. ఏ పర్వదినమైనా సరే రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా పండుగ జరుపుకున్నదే లేదు. ఎప్పుడూ అల్లరిమూకల దాడులు, ఘర్షణలు, వివాదాలు, కర్ఫ్యూ.. ఇవే రాజస్తాన్‌లో దర్శనిమిచ్చాయి. మహిళలు అబద్ధపు రేప్ కేసులు పెడుతున్నారని స్వయంగా సీఎం వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తి మహిళలను రక్షిస్తారా?. ఈయనకు ఒక్క నిమిషమైనా సీఎం కుర్చీలో కూర్చొనే హక్కు ఉందా?’’ అని మోదీ మండిపడ్డారు. ‘మగాళ్లు ఉన్న రాష్ట్రం కాబట్టే రాజస్తాన్‌లో రేప్‌లు ఎక్కువ అంటూ మంత్రి శాంతికుమార్ ధరివాల్ మాట్లాడతారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే నేతలు ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. అసెంబ్లీలో ఇంత దారుణంగా మాట్లాడినా ఈ మంత్రిపై ఎలాంటి శిక్షలు లేవు. ఎందుకంటే సీఎం రహస్యాలు ఈయనకు తెలుసు మరి. పైగా ఈయనకు రివార్డ్‌గా టికెట్ దక్కింది’’ అంటూ మోదీ వ్యాఖ్యానించారు. దళితుడు ఉన్నతాధికారి కావడం ఇష్టం లేదు ‘‘ దళితులపై కాంగ్రెస్ వివక్ష చూపుతోంది. డీగ్ జిల్లాకు చెందిన హీరాలాల్ సమరియా ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా బాధ్యతలు చేపట్టారు. ఆ పదవి స్వీకరించిన తొలి దళితుడు ఆయన. ఈయన ఎంపిక సమావేశాన్ని కాంగ్రెస్ బాయ్‌కాట్ చేసింది. దళిత అధికారి అంతటి ఉన్నతస్థాయికి చేరుకోవడం కాంగ్రెస్‌కు ఇష్టంలేదు. రాష్ట్రంలో నిత్యావసర సరకులు, ఇంధన ధరల పెరుగుదలకు గెహ్లోత్ సర్కారే కారణం. పొరుగు ఉన్న రాష్ట్రాల్లో కంటే రాజస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ.12 ఎక్కువ ధర. మేం అధికారంలోకి రాగానే ధరలను సమీక్షించి, సవరిస్తాం’’ అని మోదీ హామీ ఇచ్చారు. -
Israel-Hamas war: స్కూళ్లపై బాంబుల వర్షం
ఖాన్ యూనిస్ (గాజా): గాజాలో యుద్ధ తీవ్రత ఏ మాత్రమూ తగ్గుముఖం పట్టడం లేదు. ఇటు వసతుల లేమి, అటు ఇజ్రాయెల్ బాంబింగ్‌తో అక్కడి పాలస్తీనియన్ల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. కొద్ది రోజులుగా ఆస్పత్రులను దిగ్బంధిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం శనివారం స్కూళ్లపై విరుచుకుపడింది. పాలస్తీనా శరణార్థుల కోసం ఐరాస సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) నడుపుతున్న అల్ ఫలా స్కూల్‌పై జరిగిన దాడుల్లో 130 మందికి పైగా మరణించారు. గంటల వ్యవధిలోనే జబాలియా శరణార్థి శిబిరంలో వేలాది మంది తలదాచుకుంటున్న అల్ ఫకూరా స్కూల్‌పై యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించడంతో 100 మందికి పైగా మరణించినట్టు సమాచారం. అనంతరం బెయిట్ లాహియాలోని తల్ అల్ జాతర్ స్కూలు భవనం కూడా బాంబు దాడులతో దద్దరిల్లిపోయింది. మూ డు ఘటనల్లో వందలాది మంది పౌరులు దుర్మర ణం పాలైనట్టు చెబుతున్నారు. ఉత్తర గాజాలో ఓ భవనంపై జరిగిన దాడులకు ఒకే కుటుంబానికి చెందిన 32 మంది బలైనట్టు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో 19 మంది చిన్నారులున్నారని పేర్కొంది. దక్షిణ గాజాలో పెద్ద నగరమైన ఖాన్ యూనిస్ శివార్లలో నివాస భవనంపై జరిగిన దాడిలో కనీసం 26 మంది పౌరులు మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. నగరంలో పశి్చమవైపున జరిగిన మరో దాడిలో కనీసం 15 దాకా మరణించారు. మరోవైపు బాంబు, క్షిపణి దాడుల్లో పా లస్తీనా లెజిస్లేటివ్ కౌన్సిల్ భవనం కూడా పాక్షికంగా నేలమట్టమైనట్టు చెబుతున్నారు. ఇజ్రాయెల్ దాడులకు బలైన పాలస్తీనియన్ల సంఖ్య 12 వేలు దాటినట్టు హమాస్ ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇప్పటిదాకా 104 మంది ఐరాస సంస్థల సిబ్బంది కూడా యుద్ధానికి బలవడం తెలిసిందే. ఇంధన సరఫరా తాజాగా గాజాలోని అతి పెద్ద ఆస్పత్రి అల్ షిఫాను ఖాళీ చేయిస్తోంది. దాంతో రోగులు, సిబ్బంది, శరణార్థులు వందలాదిగా ఆస్పత్రిని వీడుతున్నారు. ఏ మాత్రమూ కదల్లేని పరిస్థితిలో ఉన్న 120 మందికి పైగా రోగులు, వారిని కనిపెట్టుకునేందుకు ఆరుగురు వైద్యులు, కొంతమంది సిబ్బంది మాత్రమే ప్రస్తుతం ఆస్పత్రిలో మిగిలినట్టు సమాచారం. తిండికి, నీటికి కూడా దిక్కు లేక గాజావాసుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. ఎక్కడ చూసినా ఆహారం కోసం ఘర్షణలు పరిపాటిగా మారాయి. వారిలో డీహైడ్రేషన్, ఆహార లేమి సంబంధిత సమస్యలు నానాటికీ పెరిగిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వెలిబుచి్చంది. గాజాకు నిత్యావసరాలతో పాటు ఇతర అవ్యవసర సరఫరాలన్నీ నెల రోజులుగా పూర్తిగా నిలిచిపోవడం తెలిసిందే. చలి తీవ్రత పరిస్థితిని మరింత విషమంగా మారుస్తోంది. కాకపోతే గాజాలో రెండు వారాలకు పైగా నిలిచిపోయిన ఇంటర్నెట్, ఫోన్ సేవలు శనివారం తిరిగి మొదలయ్యాయి. దాంతో అక్కడి పాలస్తీనియన్లకు అత్యవసర సేవలను పునరుద్ధరించేందుకు ఐరాస సంస్థలు సమాయత్తమవుతున్నాయి. గాజాకు తాజాగా భారీ పరిమాణంలో ఇంధన నిల్వలు కూడా అందినట్టు అవి వెల్లడించాయి. నోవా ఫెస్ట్ మృతులు 364 మంది ప్రస్తుత యుద్ధానికి కారణమైన అక్టోబర్ 7 నాటి హమాస్ మెరుపు దాడిలో ఇజ్రాయెల్‌లో 1,200 మంది దాకా దుర్మరణం పాలవడం తెలిసిందే. ఆ సందర్భంగా దేశ దక్షిణ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌ను హమాస్ మూకలు దిగ్బంధించి విచక్షణారహితంగా కాల్పులకు దిగాయి. ఆ మారణకాండకు 270 మంది బలైనట్టు ఇజ్రాయెల్ అప్పట్లో ప్రకటించింది. కానీ అందులో ఏకంగా 364 మంది మరణించారని ఆ దేశ మీడియా తాజాగా వెల్లడించింది. ఫెస్ట్‌లో పాల్గొన్న ఇజ్రాయెలీల్లో 40 మందికి పైగా మిలిటెంట్లకు బందీలుగా చిక్కినట్టు పేర్కొంది. పులి మీద పుట్రలా... ఉత్తర గాజాను ఇప్పటికే దాదాపుగా ఖాళీ చేయించిన ఇజ్రాయెల్ ఇప్పుడిక దక్షిణాదిపై దృష్టి పెట్టింది. దక్షిణ గాజాను కూడా తక్షణం ఖాళీ చేసి పశి్చమానికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అక్కడ దాడులను ఉధృతం చేస్తోంది. దాంతో దక్షిణ గాజాలోని లక్షలాది మంది పాలస్తీనియన్ల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఇజ్రాయెల్ ఆదేశాల నేపథ్యంలో 10 లక్షలకు పైగా ఉత్తర గాజావాసులు సర్వం కోల్పోయి చచ్చీ చెడీ దక్షిణానికి వెళ్లడం తెలిసిందే. దాంతో ఆ ప్రాంతమంతా ఒకవిధంగా అతి పెద్ద శరణార్థి శిబిరంగా మారి నానా సమస్యలకు నిలయమై విలవిల్లాడుతోంది. ఇప్పుడు మళ్లీ పశి్చమానికి వలస వెళ్లాలన్న ఆదేశాలు వారి పాలిట పులిమీద పుట్రలా మారుతున్నాయి. -
‘నాలుగు రోజుల్లో మధ్యప్రదేశ్‌లోనూ ఈడీ దాడులు’
భోపాల్: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో మాదిరిగానే మధ్యప్రదేశ్‌లో కూడా వచ్చే నాలుగు రోజుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బృందాలు సోదాలు జరిపే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ జోస్యం చెప్పారు. ఇటీవలే రాజస్తాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతాస్రా ఇంటిపై ఈడీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. పరీక్ష పేపర్ లీకేజీ కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలపై సోదాలు జరిపినట్లు ఈడీ తెలిపింది. ఆదివారం భోపాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో దిగ్విజయ్ సింగ్ ఈ దాడులను ప్రస్తావించారు. ఒకపక్క అధికారులను వేధిస్తున్న బీజేపీ నేతలు, మరోపక్క రాజస్తాన్ లో మాదిరిగా మధ్యప్రదేశ్‌లోనూ ఈడీ సోదా లు జరిపిస్తారని అన్నారు. దాడులు జరగటానికి అవకాశం ఉందంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతల పేర్లను ఆయన పేర్కొన్నారు. -
Karnataka Assembly elections 2023: ‘గరీబీ హఠావో’ అతిపెద్ద కుంభకోణం
శివాజీనగర: కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలపై అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ ప్రజలను హెచ్చరించారు. శనివారం కర్ణాటకలోని బెంగళూరు, బాగల్కోటె, బాదామిల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మాట్లాడారు. 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఇచ్చిన గరీబీ హఠావో హామీ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని పేర్కొన్నారు. ఈ ఒక్క పథకంతోనే కాంగ్రెస్ దేశవ్యాప్త ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఈ కుంభకోణం నేటికీ కొనసాగుతూనే ఉందన్నారు. ‘కాంగ్రెస్ అబద్ధాలు, వేధింపులపై కర్ణాటకలోని అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ నిషేధ విధానాలు, బుజ్జగింపు రాజకీయాలు అందరికీ తెలిసిపోయాయి. బీజేపీ ఉప్పెనలో కాంగ్రెస్ అబద్ధాలన్నీ కొట్టుకుపోతాయి. భారీ మెజారిటీతో బీజేపీకే మళ్లీ పట్టం కట్టాలని ప్రజలు నిశ్చయానికి వచ్చారు. లభిస్తున్న భారీ స్పందనను చూస్తే.. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోరాడుతున్నది ప్రజలే అని నాకు నమ్మకం కలుగుతోంది’అని ప్రధాని అన్నారు. బీజేపీ హయాంలో బీఎస్ యడియూరప్ప, ప్రస్తుతం సీఎం బొమ్మైల డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు తక్కువ కాలమే అయినా రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. ప్రధాని మోదీ అంతకుముందు బెంగళూరు నగరంలో భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు. రోడ్డుకు రెండు వైపులా నిలబడిన ప్రజలకు చేతులు ఊపుతూ ఆయన ముందుకు కదిలారు. దక్షిణ బెంగళూరులోని సోమేశ్వర్ భవన్ ఆర్బీఐ గ్రౌండ్ నుంచి మల్లేశ్వరంలోని సాంకే ట్యాంక్ వరకు 26 కిలోమీటర్ల మేర, 17 నియోజకవర్గాల మీదుగా చేపట్టిన ఈ రోడ్‌షో దాదాపు మూడు గంటలపాటు సాగింది. 85% కమీషన్లు కాంగ్రెస్‌కు అలవాటే ‘కర్ణాటకలో కాంగ్రెస్ పాలన దశాబ్దాలపాటు సాగింది. కానీ, అభివృద్ధే జరగలేదు. కాంగ్రెస్ అంటే.. పూర్తి అవినీతి, కుంభకోణం, 85% కమిషన్, ఉగ్రవాదులకు దాసోహం, బుజ్జగింపు వ్యవహారాలు, విభజన రాజకీయాలు’అని ప్రధాని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి రూ.1 విడుదలైతే ప్రజలకు 15 పైసలు అందుతుందని అప్పట్లో కాంగ్రెస్ మాజీ ప్ర«ధాని రాజీవ్ గాంధీ చెబుతుండేవారని గుర్తు చేశారు. అప్పటి నుంచే 85 శాతం కమీషన్ కాంగ్రెస్‌కు అలవాటైందని ఎద్దేవా చేశారు. తప్పుడు హామీలివ్వడం అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోవడం కాంగ్రెస్‌కు అలవాటేనన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో మాదిరిగానే కర్ణాటకలోనూ అధికారంలోకి వస్తే ప్రజలకిచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ బుట్టదాఖలు చేస్తుంది’అని చెప్పారు. మాజీ సీఎం, బాదామి బరిలో ఉన్న కాంగ్రెస్ నేత సిద్దరామయ్యపైనా ప్రధాని విమర్శలు గుప్పించారు. ‘గాలి ఎటువీస్తోందో సిద్దరామయ్య ఇప్పటికి గ్రహించే ఉంటారు. ఆయన ఇక్కడికి వస్తే.. గతంలో కనీస మౌలిక వసతులను ప్రజలకు ఎందుకు కల్పించలేకపోయారని నిలదీయండని పిలుపునిచ్చారు. ‘బీజేపీకి వస్తున్న ప్రజల ఆదరణ చూసి కాంగ్రెస్‌కు భయం మొదలైంది. అందుకే నిరంతరం ఆరోపణలు చేస్తున్నారు’అని అన్నారు. పేదల కష్టాలను అర్థం చేసుకోలేని కాంగ్రెస్‌వి నీచమైన విధానాలని ఆరోపించారు. బెంగళూరులో రోడ్‌షోలో ప్రజలకు మోదీ అభివాదం -
ఉగ్రవాదానికి కాంగ్రెస్ వెన్నుదన్ను
సాక్షి, బళ్లారి/తుమకూరు: ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆ పార్టీ ఉగ్రవాదానికి అండగా నిలుస్తోందని మండిపడ్డారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడమే కాదు, వారి ముందు సాగిలపడుతోందని ఆరోపించారు. కర్ణాటకలోని బళ్లారిలో శుక్రవారం ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ప్రసంగించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘ద కేరళ స్టోరీ’ చిత్రం గురించి ప్రస్తావించారు. సుందరమైన రాష్ట్రంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శక నిర్మాతలు చెబుతున్నారని అన్నారు. కాంగెస్ మాత్రం ఈ చిత్రాన్ని నిషేధించేందుకు ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు. కేరళలో చోటుచేసుకున్న ఉగ్ర కుట్రలను ‘ద కేరళ స్టోరీ’ చిత్రం బట్టబయలు చేస్తోందని ప్రశంసించారు. కేవలం ఒక రాష్ట్రంలో ముష్కర మూకల ఆగడాలు, మోసపూరిత విధానాలపై ఈ చిత్రం నిర్మించారని పేర్కొన్నారు. దేశాన్ని నాశనం చేసే ఉగ్రవాదానికి కాంగ్రెస్ అండగా నిలుస్తుండడం నిజంగా దురదృష్టకరమని చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నవారికి ఆ పార్టీ వత్తాసు పలుకుతోందని, వారితో తెరవెనుక రాజకీయ బేరసారాలు కొనసాగిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అసలు నైజం ఏమిటో కర్ణాటక ప్రజలు తెలుసుకోవాలని కోరారు. కర్ణాటకను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చాలంటే ఇక్కడ శాంతి భద్రతలు చాలా ముఖ్యమని ప్రధాని మోదీ చెప్పారు. ఉగ్రవాద రహిత రాష్ట్రంగా ఉండడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకున్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీకి కడుపు నొప్పి వస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధించబోతున్నామని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం తుమకూరులో భారీ రోడ్డు షోలో పాల్గొన్నారు. ఆ కుట్ర శబ్దాలు వినిపించవు మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఉగ్రవాదం కూడా స్వభావం మార్చుకుంటోందని, స్మగ్లింగ్, డ్రగ్స్ వ్యాపారం, మత ఘర్షణలకు ఉగ్రవాదంతో సంబంధం ఉంటోందని మోదీ గుర్తుచేశారు. గత కొన్నేళ్లలో కొత్తరకం ఉగ్రవాదం పుట్టుకొచ్చిందన్నారు. ఈ ఉగ్రవాదంలో సమాజాన్ని గుల్లబార్చే కుట్రల శబ్దాలు వినిపించవని చెప్పారు. నిశ్శబ్దంగానే కార్యకలాపాలు సాగిపోతుంటాయని, దీనిపై కోర్టులు కూడా ఆందోళన చెందుతున్నాయని పేర్కొన్నారు. -
ప్రతిపక్షాల ఆరోపణలు.. ఎంతమంది నేతలపై కేసులున్నాయో చెప్పిన ఈడీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్త.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). విపక్ష నేతలనే ఈడీ లక్ష్యంగా చేసుకుంటోందన్న ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో తమ కేసుల దర్యాప్తు తదితర వివరాలను సంస్థ తాజాగా ప్రకటించింది. తాము నమోదుచేసిన కేసుల్లో ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులు కేవలం 2.98 శాతమేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పష్టంచేసింది. అయితే మనీలాండరింగ్ చట్టం కింద నమోదైన ఈ 2.98 శాతం కేసుల్లో నేర నిరూపణ శాతం ఏకంగా 96 శాతం ఉండటం గమనార్హం. మనీ లాండరింగ్ నిరోధక చట్టం, ఫారెన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్ చట్టం, పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం(ఎఫ్ఈఓఏ)ల కింద ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు నమోదైన మొత్తం కేసుల తాలూకు తాజా స్థితిగతులను ఈడీ విడుదలచేసింది. ఈడీ గణాంకాల ప్రకారం... ► మనీ లాండరింగ్ చట్టం అమల్లోకి వచ్చాక ఇప్పటిదాకా మొత్తంగా 5,906 ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్– ఎఫ్ఐఆర్ లాంటిదే)లు నమోదుకాగా వాటిలో ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలపై దాఖలైన కేసులు కేవలం 176 (2.98 శాతం) ఉన్నాయి. ► అన్నింటిపై కోర్టుల్లో మొత్తంగా 1,142 అభియోగ పత్రాలు నమోదుచేశారు. 513 మందిని అరెస్ట్‌చేశారు. కేవలం 25 కేసుల విచారణ పూర్తయింది. 24 కేసుల్లో నిందితులు దోషులుగా తేలారు. అంటే మొత్తంగా 45 మందిని కోర్టులు దోషులుగా నిర్ధారించింది. అంటే 96 శాతం నేరనిరూపణ జరిగింది. ► 5,906 కేసుల్లో 531 కేసులకు సంబంధించి మాత్రమే సోదాలు, ఆకస్మిక తనిఖీలు జరిగాయి. అంటే కేవలం 9 శాతం కేసుల్లోనే సోదాలు చేశారు. ► మొత్తం కేసుల్లో ఇప్పటిదాకా ఆస్తుల జప్తు/అటాచ్‌మెంట్‌కు సంబంధించి 1,919 ఉత్తర్వులను ఈడీ జారీచేసింది. రూ.1,15,350 కోట్ల ఆస్తులను జప్తుచేసింది. ► ఫెమా చట్టం కింద దాదాపు 34 వేల కేసులు నమోదయ్యాయి. ► ఎఫ్ఈఓఏ చట్టం కింద 15 మందిపై కేసులు నమోదుకాగా తొమ్మిది మందిని పరారైన నేరగాళ్లుగా ప్రకటించారు. -
ప్రజాస్వామ్యంపై దారుణ దాడి
లండన్: నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కార్.. భారత ప్రజాస్వామ్య మౌలిక స్వరూపంపై దాడికి తెగబడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే కన్యాకుమారి నుంచి కశ్మీర్‌దాకా భారత్ జోడో యాత్రగా ముందుకు కదిలామని ఆయన వివరించారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న రాహుల్ శనివారం సాయంత్రం లండన్‌లోని ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(ఐజేఏ) కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. ‘ దేశ ప్రజాస్వామ్య మౌలిక స్వరూపం ప్రమాదంలో పడింది. అన్ని రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను మోదీ సర్కార్ ముమ్మరం చేసింది. దేశం గొంతు నొక్కాలని చూస్తున్న బీజేపీ యత్నాన్ని అడ్డుకునేందుకు భారత్ జోడో యాత్రగా ప్రజల వాణిని వినిపించాల్సిన అవసరం వచ్చింది. అందుకే యాత్ర చేపట్టాం. విపక్షాల ఐక్యత కోసం సంప్రతింపులు చురుగ్గా సాగుతున్నాయి. నిరుద్యోగిత, పెరిగిన ధరలు, మహిళలపై హింసతో పెల్లుబికిన ప్రజాగ్రహాన్ని తగ్గించేలా ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు కోసం కృషి జరుగుతోంది’ అని రాహుల్ అన్నారు. ‘ఇటీవల ముంబై, ఢిల్లీలో బ్రిటన్‌కు చెందిన బీబీసీ వార్తా సంస్థ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖతో సర్వే పేరిట ఆకస్మిక దాడులు చేయించి భయపెట్టి, కేంద్రం మీడియా గొంతు నొక్కాలని చూస్తోంది. బీబీసీ మోదీ సర్కార్ మాట వింటే సంస్థపై మోపిన తప్పుడు కేసులన్నీ మాయమవుతాయి’ అని ఆరోపించారు. ప్రతిష్ట దిగజార్చింది ఆయనే విదేశీ గడ్డపై భారత ప్రతిష్టను దిగజార్చేలా రాహుల్ మాట్లాడారని శుక్రవారం బీజేపీ చేసిన విమర్శలపై రాహుల్ బదులిచ్చారు. ‘ నా దేశాన్ని ఏనాడూ తక్కువ చేసి మాట్లాడలేదు. అది నా స్వభావం కూడా కాదు. ప్రధాని హోదాలో విదేశీ పర్యటనకు వెళ్లి మోదీయే ఆ పనిచేశారు. గత దశాబ్దకాలంలో భారత్ అభివృద్ధికి నోచుకోలేదని మోదీ అన్నారు. దేశ పురోగతికి పాటుపడిన ఇక్కడి ప్రజలను ఆయన అవమానించలేదా ? ’ అని ప్రశ్నించారు. -
బ్రెజిల్ ఆర్మీ చీఫ్‌పై వేటు
బ్రసిలియా: జనవరి 8వ తేదీన బ్రెజిల్ పార్లమెంట్, అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టుపై జరిగిన దాడుల నేపథ్యంలో బ్రెజిల్ ఆర్మీ చీఫ్ జనరల్ జులియో సీజర్ డి అర్రుడాపై వేటు పడింది. ఆయన స్థానంలో ఆగ్నేయ మిలటరీ కమాండ్ హెడ్ జనరల్ టామ్స్ మిగుయెల్ రిబిరో పయివా శనివారం నియమితులయ్యారు. మాజీ అధ్యక్షుడు బొల్సొనారో మద్దతుదారులుగా భావిస్తున్న వారు పాల్పడిన దాడికి సైనిక బలగాల్లో కొందరు అనుకూలంగా ఉన్నట్లు చేసిన వ్యాఖ్యలే జనరల్ జులియో కొంపముంచాయని భావిస్తున్నారు. అధ్యక్షుడు లులా డిసిల్వా ఈ పరిణామంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. -
మానసిక వికలాంగుల విద్యాలయంలో దారుణం.. అల్లరి చేస్తున్నాడని..
సాక్షి, తిరుపతి: రేణిగుంట మానసిక వికలాంగుల విద్యాలయంలో దారుణం చోటు చేసుకుంది. వైఎస్సార్‌కు జిల్లాకు చెందిన విద్యార్థిని సిబ్బంది చితకబాదారు. అల్లరి చేస్తున్నాడని విద్యార్థి వీపుపై దారుణంగా కొట్టారు. దీపావళి సందర్భంగా ఇంటికి తీసుకువెళ్లిన తల్లిదండ్రులు.. తమ బిడ్డ గాయాలు గమనించి జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రేణిగుంట అభయక్షేత్రం నిర్వాహకులపై తల్లిదండ్రులు మండి పడుతున్నారు. గతంలోనూ ఇదే తరహా ఘటనలు జరిగాయని స్థానికులు అంటున్నారు. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు ప్రసవం.. క్యాంటమ్ కంపెనీ బాత్రూమ్లో శిశువు కలకలం -
ఎందుకీ విద్వేషపు చిచ్చు ?
ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశాల్లో ఒకటిగా కెనడాకు పేరుంది. గతేడాది ప్రపంచ శాంతి సూచిలో ఆరో ర్యాంకు దక్కింది. నేరాలు, ఘర్షణలూ తక్కువే. రాజకీయంగా సుస్థిరమైన ప్రభుత్వం. అలాంటి దేశంలో భారతీయులకు భద్రత ఎందుకు లేదు? వారిపై విద్వేష నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి? కెనడాలో భారతీయులు జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్రం హెచ్చరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది...? కెనడాలో హిందూ, భారత్ వ్యతిరేక శక్తులు బలపడుతున్నాయి. ఇటీవల అక్కడ హిందూ దేవాలయాలపై వరసగా జరుగుతున్న దాడులు ఆందోళన పెంచుతున్నాయి. టొరంటోలోని స్వామినారాయణ మందిరంపై కొన్నాళ్ల క్రితం కొందరు దుండగులు దాడులు చేస్తూ ఖలిస్తాన్ జిందాబాద్, హిందూస్తాన్ ముర్దాబాద్ అంటూ చేసిన నినాదాలతో భారతీయులు ఉలిక్కిపడ్డారు. జూలైలో గ్రేటర్ టొరంటో ప్రాంతంలోని రిచ్మండ్ హిల్‌లో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వీటి వెనక ఖలీస్తాన్ ఉగ్రవాదుల హస్తముందని ఆధారాలున్నా కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం భారత్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది. అధికార లిబరల్ పార్టీ ఎంపీ, ప్రవాస భారతీయుడు చంద్ర ఆర్య వీటిని పార్లమెంటులో లేవనెత్తారు. భారత్‌పై, హిందూ మతంపై విద్వేషం వెళ్లగక్కుతున్నారన్నారు. ఖలిస్తానీల అడ్డా? కెనడా కొన్నేళ్లుగా ఖలిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత వ్యతిరేక అజెండాతో పని చేస్తున్న వీరంతా ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమం కోసం కెనడాను వాడుకుంటున్నారు. భారత్ నిషేధించిన సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) సెప్టెంబర్ 18న ఖలిస్తాన్ రిఫరెండాన్ని నిర్వహించింది. దీన్ని నిలిపేయాలని భారత్ కోరినా కెనడా పట్టించుకోలేదు. లౌకిక దేశమైన తాము ప్రజాభిప్రాయ సేకరణలను అడ్డుకోబోమని తేల్చి చెప్పింది. ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థలైన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్, ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ వంటివి కెనడా గడ్డ నుంచి భారత్‌లో మత ఘర్షణలకు ప్రయత్నిస్తున్నాయి. 2018 నుంచి కెనడాలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు పెరిగాయి. బ్రాంప్టన్‌లో గౌరీశంకర్, జగన్నాథాలయం, మిసిసాపలో హిందూ హెరిటేజ్ సెంటర్‌పై దాడులు జరిగాయి. ఇదంతా కెనడాలో ఉంటూ భారత్‌ను అస్థిరపరిచే కుట్రేనని గతేడాది అక్కడ పర్యటించిన జాతీయ దర్యాప్తు సంస్థ తేల్చింది. కెనడాలో భారతీయం కెనడాలో మొదట్నుంచి భారతీయుల ప్రాబల్యం ఎక్కువే. ప్రస్తుతం అక్కడ 16 లక్షల మంది (4 శాతం) భారతీయులున్నారు. వీరిలో లక్ష మందికి పైగా శాశ్వత పౌరసత్వముంది. ఎక్కువగా పంజాబీలే కెనడా వెళుతుంటారు. ఆ దేశంలో అత్యధికంగా మాట్లాడే 10 భాషల్లో పంజాబీ కూడా ఉంది. చట్టసభల్లోనూ భారతీయులు సత్తా చాటారు. 2015లో 21 మంది భారత సంతతికి వారు ఎంపీలయ్యారు. 2019లో 23కు పెరిగారు. కెనడా రక్షణ మంత్రి హర్జిత్ సింగ్ సజ్జన్ కూడా భారతీయ మూలాలున్న వ్యక్తే! జర భద్రం: కేంద్రం ‘‘కెనడాలో జాతి విద్వేష నేరాలు, వర్గ హింస, భారత్ వ్యతిరేక కార్యక్రమాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి అక్కడి భారతీయులంతా జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ విదేశాంగ శాఖ శుక్రవారం హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే ఒట్టావాలోని భారతీయ హైకమిషన్, టొరంటోలో దౌత్య కార్యాలయాలను సంప్రదించాలని సూచించింది. ఇటీవలి నేరాలపై సమగ్ర విచారణ జరపాలని కెనడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బొగ్గు కుంభకోణం: బెంగాల్ న్యాయ మంత్రిపై సీబీ‘ఐ’
న్యూఢిల్లీ/కోల్‌కతా: బొగ్గు కుంభకోణం వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ న్యాయ శాఖ మంత్రి మొలోయ్ ఘటక్ నివాసాల్లో సీబీఐ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. పశ్చిమ బర్దమాన్ జిల్లా అసన్సోల్లోని మూడు ఇళ్లు, కోల్‌కతాలోని రెండు ఇళ్లల్లో ఈ సోదాలు జరిగాయి. కోల్‌కతాలో ఘటక్ సన్నిహితుడికి చెందిన ఒక ఇంట్లో, దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్లో మరో ఇంట్లోనూ సోదాలు చేపట్టినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. అసన్సోల్లో ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్‌కు చెందిన గనిలో తవ్విన బొగ్గును కొందరు స్వాహా చేసినట్లు ఫిర్యాదు అందడంతో సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తోంది. మంత్రి మొలోయ్ ఘటక్‌ను కోల్‌కతాలోని ఆయన అధికారిక నివాసంలో సీబీఐ బృందం ప్రశ్నించింది. బొగ్గు స్మగ్లింగ్ కుంభకోణంలో మంత్రిపేరు తెరపైకి వచ్చిందని, ఇందులో ఆయన భాగస్వామ్యం ఉన్నట్లు తమకు సాక్ష్యాధారాలు లభించాయని అధికారులు పేర్కొన్నారు. మంత్రి నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించామని చెప్పారు. ఘటక్ వద్ద పనిచేస్తున్న చార్టెర్డ్ అకౌంటెంట్‌ను కూడా ప్రశ్నించామన్నారు. అసన్సోల్లో ఘటక్ ఇంట్లో బీరువా తాళాలు అందుబాటులో లేకపోవడంతో అధికారులు దాన్ని బద్దలు కొట్టినట్లు తెలిసింది. మంత్రి ఇళ్లల్లో సీబీఐ సోదాల సందర్భంగా కేంద్ర పారామిలటరీ సిబ్బంది భారీగా మోహరించారు. బొగ్గు స్మగ్లింగ్ కేసులో ఘటక్ గతంలో ఒకసారి ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. -
కోలీవుడ్‌లో సోదాల కలకలం
న్యూఢిల్లీ: పలువురు తమిళ సినీ నిర్మాతలు, ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్ల నివాసాల్లో ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ఇటీవల సోదాలు నిర్వహించిందని, ఈ సోదాల్లో రూ.200 కోట్లకుపైగా నల్లధనాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 2 నుంచి మూడు రోజులపాటు చెన్నై, మదురై, కోయంబత్తూరు, వెల్లూరు తదితర నగరాల్లో దాదాపు 40 చోట్ట సోదాలు జరిపినట్లు పేర్కొంది. లెక్కల్లో చూపని రూ.26 కోట్ల నగదుతోపాటు రూ.3 కోట్లకుపైగా విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేసింది. బహిర్గతం చేయని నగదు లావాదేవీలు, పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. తమిళ నిర్మాతలు కలైపులి ఎస్.థాను, అన్బుసెళియన్, ఎస్ఆర్ ప్రభు, జ్ఞానవేల్ రాజా తదితరులు కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. సదరు నిర్మాతలు సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తక్కువ చేసి చూపినట్లు అధికారులు గుర్తించారు. కొందరు డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి, ఆ సొమ్మును లెక్కల్లో చూపలేదని అధికారులు తేల్చారు. -
‘మహా’దారిలో జార్ఖండ్ ? కాంగ్రెస్ భయానికి కారణాలివీ...
జార్ఖండ్ మరో మహారాష్ట్ర కానుందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తుంది. మహారాష్ట్రలో 40 మంది పై చిలుకు ఎమ్మెల్యేలతో ముంబై నుంచి బిచాణా ఎత్తేసి వేరుకుంపటి పెట్టుకున్న శివసేన నేత ఏక్నాథ్ షిండేతో బీజేపీ రసవత్తర రాజకీయ నాటకం ఆడించింది. షిండే సీఎం పీఠమెక్కి, అప్పటిదాకా అధికారాన్ని పంచుకున్న ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమి ప్రతిపక్షానికి పరిమితం కావడంతో ఆ నాటకానికి తెరపడింది. కనీసం ఎంపీలనన్నా కాపాడుకుందామనుకున్న ఉద్ధవ్‌కు ఆ ముచ్చట కూడా తీరేట్టు లేదు. శివసేన ఎంపీ, అధికార ప్రతినిధి సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్టు చేయడం ఉద్ధవ్‌కు కోలుకోలేని దెబ్బే. ఈ పరిణామాలు కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు. బీజేపీ ఇప్పుడు జార్ఖండ్‌ను కూడా తమ సంకీర్ణం నుంచి లాక్కునే ప్రయత్నంలో ఉందని ఆ పార్టీ అనుమానిస్తోంది. అసలేం జరిగింది! ► జార్ఖండ్‌లో జేఎంఎంతో కాంగ్రెస్ అధికారాన్ని పంచుకుంటోంది. ఆ రాష్ట్రానికి చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గత ఆదివారం భారీ నగదుతో పశ్చిమబెంగాల్లో అరెస్టయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ వారిని పార్టీనుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చింది. ఇదంతా బీజేపీ కుట్రలో భాగమేనని కాంగ్రెస్ అనుమానిస్తోంది. ► జేఎంఎంతో అవినాభావ సంబంధాలున్న తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న బెంగాల్లో ఈ అరెస్టులు జరగడం గమనార్హం. ► ‘మహారాష్ట్ర కథ ముగిసింది. ఇక మిగిలింది జార్ఖండ్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్లే’నని బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి ఇటీవల వ్యాఖ్యానించడం కాంగ్రెస్ ఆందోళనలను మరింత పెంచుతోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కన్నేయడం బీజేపీకి ఇదేమీ కొత్త కాదని కాంగ్రెస్ దుయ్యబడుతోంది. చరిత్రే ఇందుకు సాక్ష్యమంటోంది. ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగించి అందరినీ దారికి తెచ్చుకోవడం బీజేపీకి అలవాటైన విద్యేనన్నది కాంగ్రెస్ ఆరోపణ. జార్ఖండ్ పరిణామాలే ఇందుకు తాజాఉదాహరణ అంటోంది కాంగ్రెస్. బీజేపీ మాత్రం వీటిని కట్టుకథలుగా కొట్టిపారేస్తోంది. జార్ఖండ్‌లో అవినీతి రాజ్యమేలుతోందని, ఎమ్మెల్యేల అరెస్టు దీన్ని నిరూపిస్తోందని చెబుతోంది. కాంగ్రెస్–బీజేపీ పరస్పర నిందారోపణలకు తోడు సంకీర్ణ భాగస్వామి జేఎంఎంతో సంబంధాలు బెడిసికొడుతుండటం కాంగ్రెస్‌ను కుంగదీస్తోంది. జేఎంఎం– కాంగ్రెస్ విభేదాలు ► జూన్‌లో రాజ్యసభ ఎన్నికలప్పుడు సంకీర్ణ ధర్మాన్ని అనుసరించి ఉమ్మడి అభ్యర్థిని పోటీలో నిలపాలన్న సోనియాగాంధీ విజ్ఞప్తిని సీఎం సోరెన్ పెడచెవిన పెట్టారు. సొంత అభ్యర్థిని బరిలోకి దించడంతో సోనియా కంగుతిన్నారు. ► రాష్ట్రపతి ఎన్నిక వేళ ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీతో పాటు ఇతర విపక్షాల నేతలు ఆయన వెంట నడిచారు. కానీ జేఎంఎం నేత సోరెన్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరయ్యారు. తద్వారా కాంగ్రెస్‌కు దూరం జరుగుతున్న సంకేతాలిచ్చారు. ఓటింగ్‌లోనూ అదే జరిగింది... కాంగ్రెస్ మద్దతిచ్చిన సిన్హాకు కాకుండా అధికార ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు సోరెన్ జై కొట్టారు. జార్ఖండ్‌లో గణనీయంగా ఉన్న గిరిజనులను సంతృప్తి పరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనూ ఏడెనిమిది మంది ముర్ముకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్టు తేలింది. ఆదివారం అరెస్టైన ముగ్గురు కూడా వారిలో ఉన్నట్టు వినికిడి. ఈ విభేదాలన్నీ ఒక ఎత్తయితే యశ్వంత్ సిన్హా నామినేషన్ వేసిన రోజే హేమంత్ సోరెన్ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలుసుకోవడం చర్చనీయంగా మారింది. తనపై ఉన్న కేసుల నుంచి బయట పడేందుకే హోం మంత్రితో ఆయన బేరాలాడుతున్నారనే మాటా వినిపించింది. సంకీర్ణం నుంచి కాంగ్రెస్‌ను తప్పించి బీజేపీతో జతకట్టాలంటూ సోరెన్‌పై తీవ్ర ఒత్తిడి ఉన్నట్టు కనిపిస్తోంది. ఇందుకు ఆయన లొంగిపోయినా ఆశ్చర్యం లేదు. జరగబోయేది అదేననేది విశ్లేషకుల అంచనా. సోరెన్‌పై కేసులివీ.. ► జార్ఖండ్ శాసనసభకు ఎన్నికైన సమయంలో సోరెన్ లాభదాయక పదవిలో కొనసాగుతున్నారనేది తొలి ఆరోపణ. ఇది ఎన్నికల సంఘం విచారణలో ఉంది. ► 2021లో గనుల మంత్రిగా ఉండగా ఓ గనుల లీజును తనకు తానే కేటాయించుకున్నారనేది మరో ఆరోపణ. ► షెల్ కంపెనీలతో సోరెన్‌కు సంబంధముందని కోర్టులో ఓ పిల్ పెండింగులో ఉంది. ► మైనింగ్ కేసులో జూలై 19న సోరెన్ సన్నిహితుడైన పంకజ్ మిశ్రాను ఈడీ అరెస్టు చేయడం కూడా ఆయన్ను చిక్కుల్లో పడేసింది. ► మైనింగ్‌కు సంబంధించినవే మరికొన్ని కేసులు కూడా సోరెన్‌పై పెండింగ్‌లో ఉన్నాయి. ఈ తలనొప్పుల నుంచి తప్పించుకోవడానికి సోరెన్ బీజేపీ వైపు చూస్తున్నారనేది విశ్లేషకుల అంచనా. అదే జరిగితే జార్ఖండ్ మరో మహారాష్ట్ర కావడానికి ఎంతో సమయం పట్టదు! ఎస్.రాజమహేంద్రారెడ్డి -
Russia-Ukraine war: తూర్పున తాడోపేడో
కీవ్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కీలక దశకు చేరింది. తూర్పున డోన్బాస్ వేదికగా నిర్ణాయక యుద్ధానికి తెర లేస్తోంది. 47 రోజుల పై చిలుకు యుద్ధంలో రాజధాని కీవ్ సహా దేశంలో ఏ కీలక ప్రాంతాన్నీ ఆక్రమించలేకపోయిన రష్యా, డోన్బాస్ ప్రాంతంపై ఎలాగైనా పూర్తి పట్టు సాధించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు అక్కడ కూడా రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్ సర్వశక్తులూ కూడదీసుకుంటోంది. కొత్త జనరల్ అలెగ్జాండర్ ద్వొర్నికోవ్ సారథ్యంలో డోన్బాస్‌పై భీకర దాడులకు రష్యా సైన్యం ఇప్పటికే తెర తీసింది. వాటిని ఒకట్రెండు రోజులుగా ఉక్రెయిన్ దీటుగా తిప్పికొడుతోందని ఇంగ్లండ్ పేర్కొంది. ఈ క్రమంలో డోన్బాస్లోనూ రష్యా భారీగా యుద్ధ ట్యాంకులను, ఆయుధాలను, సాయుధ వాహనాలను నష్టపోయిందని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో రానున్న కొద్ది వారాలు అత్యంత కీలకమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ అన్నారు. తమకు మరింత సాయుధ, ఆర్థిక సాయం చేయాలని పాశ్చాత్య దేశాలకు విజ్ఞప్తి చేశారు. ‘‘మాకు కావాల్సిన సాయుధ సంపత్తి జాబితాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఇప్పటికే ఇచ్చాం. అవి అందజేసి చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఆయన ముందుంది’’ అన్నారు. భారీగా పౌర మరణాలు ఉక్రెయిన్ కీలక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను నాశనం చేసినట్టు రష్యా సోమవారం ప్రకటించింది. దింప్రో నగర శివార్లలో నాలుగు ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ లాంచర్లను క్రూయిజ్ మిసైళ్లతో ధ్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ తెలిపారు. దాడుల్లో 25 మంది దాకా ఉక్రెయిన్ సైనికులు మరణించారన్నారు. ఒక్క మారియుపోల్‌లోనే ఇప్పటిదాకా 20 వేల మందికి పైగా అమాయక పౌరులు మరణించారని నగర మేయర్ చెప్పారు. ఉక్రెయిన్‌పై ఈయూ చర్చలు ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం, మరింత సాయంపై ఈయూ విదేశాంగ మంత్రులు సోమవారం సుదీర్ఘంగా చర్చించారు. మామూలుగా ఏళ్లూ పూళ్లూ పట్టే సభ్యత్వ ప్రక్రియను కొద్ది వారాల్లోపే తేల్చేస్తామని ఐరోపా కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వొండొర్ లెయన్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. ఈయూలో మాల్డోవాకు సభ్యత్వంపైనా చర్చ జరిగింది. ఉక్రెయిన్‌కు ఇప్పుడు విదేశీ మద్దతు మరింతగా కావాలని జర్మనీ విదేశాంగ మంత్రి అభిప్రాయపడ్డారు. -
గోరఖ్‌నాథ్ ఆలయం వద్ద కలకలం
గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ గోరఖ్‌నాథ్ ఆలయం వద్ద దుండగుడి హల్చల్తో కలకలం రేగింది. ముర్తజా అబ్బాసీ అనే ఐఐటీ గ్రాడ్యుయేట్ సోమవారం సాయంత్రం ప్రధాన ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించాడు. అడ్డుకున్న ఇద్దరు భద్రతా సిబ్బందిని వెంట తెచ్చుకున్న కొడవలితో గాయపరిచాడు. భద్రతాసిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిని ఉగ్రకుట్రగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆ సమయంలో భక్తులతో ఆలయ ప్రాంగణం నిండి ఉందని పోలీసులు తెలిపారు. పథకం ప్రకారమే అక్కడికి చేరుకున్న ముర్తజా ఆలయం లోపలికి ప్రవేశించి ఉంటే జరిగే పరిణామాన్ని ఊహించలేమన్నారు. అతడి వద్ద లభ్యమైన పత్రాలు సంచలనం కలిగించేవిగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ముర్తజాను స్థానిక కోర్టు రెండు వారాల జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించింది. ముర్తజా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని అతడి తండ్రి మునీర్ అంటున్నారు. -
పశ్చిమ ఉక్రెయిన్‌పై గురి
లెవివ్/న్యూయార్క్/లండన్: ఇన్నాళ్లూ ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాల్లో దాడులు సాగించిన రష్యా సైన్యం ఇప్పుడు తొలిసారిగా నాటో దేశాల సరిహద్దుల్లో ఉన్న పశ్చిమ ప్రాంతంపై గురిపెట్టింది. శుక్రవారం పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఎయిర్‌పోర్టులపై ఉధృతంగా వైమానిక దాడులు చేసింది. పశ్చిమ లట్స్క్ ఎయిర్‌ఫీల్డ్‌పై జరిగిన దాడిలో ఇద్దరు ఉక్రెయిన్ సైనికులు మరణించారని, ఆరుగురు గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. ఉక్రెయిన్‌లో ఏ ప్రాంతమూ సురక్షితం కాదన్న సంకేతం ఇవ్వాలన్నదే రష్యా ఉద్దేశమని భావిస్తున్నారు. దినిప్రో నగరంలో రష్యా దాడుల్లో ఒక పౌరుడు మరణించాడు. ఉక్రెయిన్ దక్షిణ, తూర్పు ప్రాంతాలపై రష్యా సైన్యం ఇప్పటికే పట్టు సాధించింది. ఉత్తర ప్రాంతంలో స్థానికుల నుంచి భారీ ప్రతిఘటన ఎదురవుతోంది. రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకొనేందుకు రష్యా వేగంగా ముందడుగు వేస్తోంది. నగర శివార్లలో నిలిచిపోయిన 64 కిలోమీటర్ల పొడవైన భారీ సైనిక వాహన శ్రేణి ముందుకు కదులుతోంది. కీవ్‌ను చుట్టుముట్టి, పూర్తిగా దిగ్బంధించేందుకు రష్యా ప్రయత్నిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్‌పై అత్యంత కచ్చితత్వంతో కూడిన లాంగ్రేంజ్ ఆయుధాలు ప్రయోగిస్తోందని రష్యా రక్షణ శాఖ చెప్పింది. ‘స్వచ్ఛంద సైనికులకు’ పుతిన్ అంగీకారం సిరియా నుంచి సైనిక బలగాలను ఉక్రెయిన్‌కు తరలిస్తామని రష్యా సంకేతాలిచ్చింది. రష్యా తరపున స్వచ్ఛందంగా పోరాడుతామంటూ మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి 16,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగూ చెప్పారు. వారిని సైన్యంలో చేర్చుకొనేందుకు అధ్యక్షుడు పుతిన్ అంగీకారం తెలిపారని వెల్లడించారు. రష్యా నుంచి తమ విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు టర్కీకి చెందిన పెగాసస్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్ నుంచి వలసలు ఇప్పటికే 25 లక్షలు దాటినట్టు ఐరాస శరణార్థుల విభాగం ప్రకటించింది. రష్యా ఉత్పత్తులపై భారీ టారిఫ్‌లు! వాణిజ్యం విషయంలో రష్యాకు ఉన్న ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా’ను తొలగించాలని అమెరికా, ఈయూ దేశాలు నిర్ణయించినట్లు తెలిసింది. ఇక రష్యాతో వాటి ‘శాశ్వత సాధారణ వాణిజ్య సంబంధాలు’ రద్దవుతాయి. రష్యా పార్లమెంట్ దిగువ సభ డ్యూమాలోని 386 మంది సభ్యులపై ఇంగ్లండ్ శుక్రవారం ఆంక్షలు విధించింది. -
శ్రీనగర్‌లో గ్రెనేడ్ దాడి.. నలుగురికి తీవ్రగాయాలు
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ సిటీలో ఉగ్రవాదులు గ్రెనేడ్ బాంబులతో దాడికి పాల్పడ్డారు. కాగా, వీరు స్థానికంగా ఉన్న హైస్ట్రీట్ వద్ద మంగళవారం సాయంత్రం బాంబు దాడికి తెగబడ్డారు. పోలీసుల ప్రకారం.. భద్రత సిబ్బందిని టార్గెట్‌గా చేసుకుని దాడి చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల బాంబు దాడితో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. అక్కడి ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. గ్రెనేడ్ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక భద్రత సిబ్బంది, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి భారీ ఎత్తున బలగాలను మోహరించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యంకోసం ఆసుపత్రికి తరలించారు. భద్రత అధికారులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఏవైన పేలుడు పదార్థాలు ఉన్నాయా.. అన్న కోణంలో పరిశీలిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, రిపబ్లిక్‌డే వేడుకలకు ఒక రోజు ముందు ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి ప్రస్తుతం తీవ్ర కలకలంగా మారింది. కాగా, ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టారు. Jammu & Kashmir | Grenade attack at Hari Singh High Street in Srinagar Details awaited. pic.twitter.com/ioU2AQABgh — ANI (@ANI) January 25, 2022 చదవండి: రైతుకు ఘోర అవమానం.. స్పందించిన ఆనంద్ మహీంద్రా -
సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై దాడి
డెహ్రాడూన్: కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై సోమవారం దుండగులు దాడి చేసి, నిప్పు అంటించారు. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్లో ఉన్న తన ఇంటిపై దాడి జరిగిందని, సంబంధిత ఫొటోలు, వీడియోలను ఆయన సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఇటీవల ఆయన ఆయోధ్యపై రచించిన పుస్తకంలో ‘హిందూత్వ’కు, తీవ్రవాద సంస్థలకు సారూప్యత ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇంటిపై దాడి చేసిన వ్యక్తుల చేతుల్లో బీజేపీ జెండాలు ఉన్నాయని ఖుర్షీద్ పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన ఇంటి కిటికీలు ధ్వంసం అయ్యాయని, ఓ డోర్‌కు దుండగులు నిప్పు పెట్టారని నైనిటాల్ ఎస్పీ జగదీశ్ చంద్ర వివరించారు. ఈ దాడితో సంబంధం ఉన్న 21 మంది దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడిలో ఖుర్షీద్ కుటుంబసభ్యులకు ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని పేర్కొన్నారు. ఇంటిపై జరిగిన దాడిని కాంగ్రెస్ సీనియర్ నేతలు శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ తదితరులు తీవ్రంగా ఖండించారు. -
ఇరాక్ ప్రధానిపై హత్యాయత్నం
బాగ్దాద్: ఇరాక్ ప్రధానమంత్రి ముస్తఫా–అల్–కదిమి హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆదివారం వేకువజామున కదిమి నివాసమే లక్ష్యంగా సాయుధ డ్రోన్లతో దాడి జరిగిందని, ఆయనకు ఎటువంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు. గత నెలలో వెలువడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ఇరాన్ మద్దతుగల మిలీషియాలు తిరస్కరించడంతో తలెత్తిన ఉద్రిక్తతలకు తాజా ఘటన ఆజ్యం పోసినట్లయింది. ప్రభుత్వ ఆఫీసులు, దౌత్య కార్యాలయాలతో అత్యధిక భద్రతా ఏర్పాట్లుండే గ్రీన్ జోన్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ప్రధాని నివాసంపై పేలుడు పదార్థాలు నిండిన రెండు డ్రోన్లతో జరిగిన దాడిలో కదిమి భద్రతా సిబ్బంది ఏడుగురు గాయపడినట్లు పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఇద్దరు అధికారులు అసోసియేటెడ్ ప్రెస్‌కు తెలిపారు. ‘దేవుని దయవల్ల నేను, నా ప్రజలు క్షేమంగా ఉన్నాం’అని ప్రధాని కదిమి దాడి అనంతరం ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా, దాడికి బాధ్యత తమదేనంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. ఇరాక్ ప్రధానిపై డ్రోన్ దాడిని అమెరికా, ఈజిప్టు, యూఏఈ ఖండించాయి. దేశంలో అక్టోబర్ 10వ తేదీన పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల నిర్వహణపై ఐరాస భద్రతామండలి కూడా హర్షం వ్యక్తం చేసింది. ఇరాన్ మద్దతున్న మిలీషియా గ్రూపులు మాత్రం రీకౌంటింగ్ చేపట్టాలంటూ గ్రీన్‌జోన్‌కు సమీపంలో టెంట్లు వేసుకుని నిరసనలు సాగిస్తున్నాయి. -
ఉగ్రవాదులు డ్రోన్లతో దాడిచేస్తే ఏంటి పరిస్థితి?
ఇన్నాళ్లూ భయపడిందే జరిగింది. ఉగ్రవాదుల చేతుల్లోకి డ్రోన్లు వెళితే ఎంత ముప్పు ఉంటుందో మనకి తెలిసివచ్చింది. నక్కజిత్తుల పాకిస్తాన్ ఇన్నాళ్లూ ఆయుధాల సరఫరాకి వాడిన డ్రోన్లను ఇప్పుడు ఏకంగా దాడులకే వినియోగించింది. ఇలాంటి కిల్లర్ డ్రోన్లతో మనకి ముప్పు ఎంత? వీటిని ఎదుర్కొనే యాంటీ డ్రోన్ టెక్నాలజీ సత్తా మనకి ఎంత? కీలకమైన రక్షణరంగ పరిశోధన సంస్థలు, సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు డ్రోన్లతో దాడిచేస్తే ఏంటి పరిస్థితి? అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ), వీటినే సింపుల్‌గా డ్రోన్లు అని పిలుస్తారు. ప్రకృతి వి పత్తుల సమయంలో సహాయ కార్యక్రమాలకి, మా రుమూల ప్రాంతాల్లో మందుల పంపిణీకి, విందు వినోదాల సమయాల్లో వీడియోలు తీయడానికి, ఉ పయోగపడే ఈ డ్రోన్ టెక్నాలజీని పాకిస్తాన్ తన ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తోంది. ప్రపంచ దేశాల్లో అమెరికా, యూకే, ఇజ్రాయెల్ తర్వాత మిలటరీ డ్రోన్లను పాకిస్తానే ఎక్కువగా వినియోగిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాతే జమ్మూ కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019, ఆగస్టు 5 చేసిన తర్వాత పాకిస్తాన్ భారత్‌ని ముప్పులోకి నెట్టేలా డ్రోన్ల వినియోగాన్ని అధికం చేసింది. అదే సంవత్సరం జమ్మూ కశ్మీర్, పంజాబ్ సరిహద్దుల్లో పాక్‌కు చెందిన డ్రోన్ల కదలికలు కనిపించాయి. సరిహద్లుల్లో నిఘా, యథేచ్ఛగా ఆయుధాలు మందుగుండు సామాగ్రి పంపిణీకి పాకిస్తాన్ డ్రోన్లను వినియోగిస్తోంది. డ్రోన్ల సహాయంతో ఆయుధాలను సరిహద్దులు దాటించి భారత భూభాగంలోని ఉగ్రవాదుల సమీపంలో జారవిడుస్తోంది. 2019లో ఆగస్టు 13న అమృత్సర్ సమీపంలోని మెహవా గ్రామం దగ్గర పాక్ డ్రోన్ కుప్పకూలిపోవడాన్ని భద్రతా అధికారులు గుర్తించారు. పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్లు ఎన్నోసార్లు వచ్చి ఆయుధాలు, మం దుగుండు సామగ్రిని సరఫరా చేశాయని పాక్‌కు చెందిన ఉగ్రవాదుల్ని విచారిస్తున్నప్పుడు తేలింది. 2020 జూన్‌లో జమ్మూలోని హీరానగర్‌లో పాక్ నిఘా డ్రోన్‌ని జవాన్లు కూల్చేశారు. 2020 సెప్టెంబర్‌లో అక్నూర్ సెక్టార్లో డ్రోన్ల ద్వారా పాక్ ఆయుధాలను జారవిడిచినట్టు తెలిసింది. డ్రోన్ దాడుల్ని ఎదుర్కోవడం ఎలా? పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల డ్రోన్ దాడులతో యాంటీ డ్రోన్ టెక్నాలజీపై మళ్లీ చర్చ మొదలైంది. ఈ టెక్నాలజీలో భారత్ ఇంకా వెనుకబడే ఉంది. మన గగనతలంలోకి ప్రవేశించే డ్రోన్లు రాడార్లకి అందడం లేదు. రాడార్లతో గుర్తించడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. థర్మల్ కెమెరాల సాయంతో గుర్తిస్తున్నా ప్రమాదం ముంచుకొచ్చేవరకు తెలియడం లేదు. డ్రోన్లను ఎదుర్కోవడానికి సాఫ్ట్‌కిల్, హార్డ్ కిల్ అనే రెండు రకాల టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. సాఫ్ట్ కిల్ టెక్నాలజీతో డ్రోన్లు మన గగనతలంలో ప్రవేశించకుండానే అడ్డుకొని వాటి వ్యవస్థని ఫ్రీజ్ చేయవచ్చును. ఇక హార్డ్‌కిల్ టెక్నాలజీతో డ్రోన్లను కూల్చేయవచ్చు. గత రెండేళ్లుగా సాఫ్ట్ కిల్ టెక్నాలజీని వాడాలని భారత్ ప్రయత్నిస్తున్నప్పటికీ విఫలమవుతూ వస్తోంది. ఇప్పుడు హార్డ్‌కిల్ వ్యవస్థపై కేంద్రం దృష్టి సారించింది. మన దేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఒ) సొంతంగా తయారు చేసిన యాంటీ డ్రోన్ వ్యవస్థని గత ఏడాది స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద వినియోగించారు. అయితే ఈ వ్యవస్థ కేవలం 2 నుంచి 3 కి.మీ. పరిధిలోకి వచ్చాకే డ్రోన్లను గుర్తించగలదు. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్‌కి చెందిన స్మార్ట్ షూట్ సంస్థతో యాంటీ డ్రోన్ వ్యవస్థ కొనుగోలుపై కేంద్రం చర్చలు జరుపుతోంది. ఇప్పటికైనా కేంద్రం డ్రోన్లు కొనుగోలుపై కాకుండా, యాంటీ డ్రోన్ టెక్నాలజీపై దృష్టి సారిస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ► ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 21 వేలకి పైగా మిలటరీ డ్రోన్లు ఉన్నట్టుగా అమెరికాకి చెందిన బార్డ్ కాలేజీ సెంటర్ ఫర్ స్టడీ ఆన్ డ్రోన్స్ అంచనా ► పదేళ్ల క్రితం 60 దేశాల్లో మిలటరీ డ్రోన్లు ఉంటే ఇప్పుడు ఈ దేశాల సంఖ్య 95కి పెరిగింది ► కదన రంగంలో వినియోగించే డ్రోన్లు ప్రస్తుతం 171 రకాలు ఉన్నాయి ► అమెరికా ఇజ్రాయెల్, యూకే, రష్యా, టర్కీ వంటి దేశాల తర్వాత పాకిస్తానే అత్యధికంగా మిలటరీ డ్రోన్లను వినియోగిస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లను పాక్ వాడుతోంది. ► ఇతర దేశాలకు డ్రోన్లను ఇజ్రాయెల్ అధికంగా ఎగుమతి చేస్తోంది. బ్రిటన్ నుంచి భారత్ వరకు గత ఎనిమిదేళ్లలో 460 కోట్ల డాలర్ల విలువైన డ్రోన్లను ఆ దేశం ఎగుమతి చేసింది. ► మొట్టమొదటిసారిగా 1982లో సిరియా వైమానిక స్థావరాలపై ఇజ్రాయెల్ డ్రోన్లతో దాడి చేసింది. ► ఇటీవల కాలంలో సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై యెమన్‌కి చెందిన హౌతి ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులు జరిపితే, ఇరాన్‌పై అమెరికా డ్రోన్లతోనే దాడులు సాగించింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఆసియన్ అమెరికన్లకి బైడెన్ అండ
అట్లాంటా: ఆసియన్ అమెరికన్లపై జరుగుతున్న హింసాత్మక దాడులు మనసుని కలిచి వేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులపై అమెరికన్లు అందరూ మౌనం వీడాలని పిలుపునిచ్చారు. అట్లాంటాలోని ఆసియా మసాజ్ పార్లర్లపై శ్వేతజాతీయుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మరణించడంతో అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌లు అట్లాంటా పర్యటనకు వచ్చారు. ఎమొరి యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న బైడన్ జాతి వివక్ష దాడులైనా, విదేశీయులంటే భయంతో కూడిన దాడులైనా ప్రజలందరూ మాట్లాడాలని, ప్రతిస్పందించాలని అన్నారు. ‘‘మౌనం వహించడం అన్నది అత్యంత సంక్లిష్టమైనది. మనం అలా ఉండకూడదు’’అని హితవు పలికారు. అంతకు ముందు ఆసియన్ అమెరికన్ ప్రజాప్రతినిధులతో బైడెన్, కమలా హ్యారిస్‌లు సమావేశమై చర్చించారు. ఆసియన్ అమెరికన్లకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆసియన్ అమెరికన్లలో నెలకొన్న భయభ్రాంతుల్ని చూస్తుంటే గుండె కరిగి నీరైపోతోందన్న బైడెన్ అమెరికా పౌరులందరూ విద్వేషాలు వీడాలని అన్నారు. కరోనా సంక్షోభం వచ్చాక ఆసియన్లపై ఓ విధమైన కసితో అమెరికా వ్యాప్తంగా దాడులు అధికమైపోతున్న విషయం తెలిసిందే. ‘‘ఆసియన్లపై దాడి చేస్తున్నారు. నిందిస్తున్నారు. వేధిస్తున్నారు. బలిపశువుల్ని చేస్తున్నారు. మాటలతో తూట్లు పొడుస్తున్నారు. భౌతిక దాడులకు దిగుతున్నారు. వాళ్లని ఏకంగా చంపేస్తున్నారు’’అని బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే తీసుకురానున్న కోవిడ్–19 హేట్ క్రైమ్స్ యాక్ట్‌కి తాను మద్దతునిస్తున్నట్టుగా బైడెన్ ప్రకటించారు. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే విద్వేషపూరిత నేరాలు జరిగినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మరింత చురుగ్గా పనిచేసే వీలు కలుగుతుందని వివరించారు. చూస్తూ ఊరుకోం: కమలా హ్యారిస్ అట్లాంటాలో కాల్పుల ఘటనపై విచారణ కొనసాగుతోందని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తెలిపారు. జాతి వివక్ష, విదేశీయులంటే భయం అమెరికాలో ఎప్పట్నుంచో ఉన్నాయని అన్నారు. తాను, అధ్యక్షుడు ఈ దాడుల్ని చూస్తూ మౌనంగా ఊరుకోమని హెచ్చరించారు. విద్వేషపూరిత నేరాలు, హింసాత్మక దాడులు, వివక్ష ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో ఉన్నా తాము వ్యతిరేకిస్తామన్నారు. ఈ దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరినీ అమెరికన్లుగానే గుర్తించాలని, మనలో ఒకరిగా చూడాలని కమలా హ్యారిస్ హితవు పలికారు. -
మోదీ దేశాన్నే అమ్మేస్తున్నారు
సహగంజ్: ప్రధాని మోదీ అతి పెద్ద ఆందోళన కారుడని, అల్లర్లను సృష్టించడంలో ఆయన ముందుంటారని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే ఘోరమైన భవిష్యత్ మోదీకి ఎదురవుతుందని జోస్యం చెప్పారు. హుగ్లీ జిల్లా సహగంజ్‌లో బుధవారం జరిగిన ర్యాలీలో మమత పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా విద్వేషాలను పెంచి పోషిస్తున్నారని, అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని గతవారం ఇదే చోట ఎన్నికల ర్యాలీలో పాల్గొని తృణమూల్ కాంగ్రెస్‌ని దోపిడీ పార్టీ అని విమర్శించారు.తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ కమీషన్ల ప్రభుత్వమని ప్రచారం చేయడానికి కట్ మనీ అంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలపై మమత ఎదురుదాడికి దిగారు. ‘‘మీరు ఏకంగా దేశాన్నే కోట్లాది రూపాయలకు అమ్మేస్తున్నారు. దానినేమని పిలవాలి. క్యాట్ మనీయా, ర్యాట్ మనీయా’’ అంటూ దీదీ వ్యంగ్య బాణాలు సంధించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల గేమ్‌లో తాను గోల్ కీపర్‌నని, బీజేపీ ఒక్క గోల్ కూడా చేయలేదని అన్నారు. -
తుదిదశ పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ దాష్టీకం
సాక్షి, అమరావతి/సాక్షి, గుంటూరు: మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో చవిచూసిన ఘోర పరాజయం.. నాలుగో విడత ఎన్నికల్లోనూ ఓటమి తప్ప దని తెలియడం.. వెరసి పల్లెపోరు తుదిదశలోను ఆదివారం టీడీపీ మద్దతుదారులు చెలరేగిపోయారు. కుట్రలకు తెరతీసి వీరంగం వేశారు. ఓవైపు పోలింగ్ ప్రక్రియకు విఘాతం కలిగించడంతో పాటు మరోవైపు శాంతిభద్రతల సమస్యలు తలె త్తేలా చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు తెగబ డ్డారు. తమకు ఓటు వేయకపోతే అంతుచూస్తా మంటూ ఎస్సీ, ఎస్టీ ఓటర్లను బెదిరించడంతోపాటు దాడులు చేశారు. మొదటి మూడు విడతల పోలింగ్‌లో ఓటమికి ప్రతిగా దాడులు కొనసాగి స్తున్నారు. వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్తను హత్యచేశారు. గుంటూరు జిల్లాలో దళితులపై దాడిచేశారు. ప్రకాశం జిల్లాలో మహిళ మీద దాడిచేసి ఇంట్లో సామగ్రి ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెండిళ్లపై దాడిచేసి, మొక్కజొన్న తోటను ధ్వంసం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లపైనా దాడి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామం ఐదో వార్డు ఏజెంట్ అన్నవరపు బాబురావుపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాబురావును ఆస్పత్రికి తరలించారు. దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ బాబురావు కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల ఎస్సీ కాలనీలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి వచ్చిన వృద్ధుడు నడవలేకపోవడంతో వైఎస్సార్సీపీ అభిమాన అభ్యర్థి తరఫున ఏజెంట్‌గా ఉన్న ఫకీరయ్య సాయం చేశారు. దీన్ని తప్పుబట్టిన టీడీపీ మద్దతుదార్ల ఏజెంట్లు ఫకీరయ్యతో వాగ్వాదానికి దిగడమేగాక కుర్చీతో ఆయనపై దాడిచేశారు. దీంతో ఫకీరయ్య వర్గీయులు ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాల మధ్య జరిగిన కుర్చీల దాడిలో ఫకీరయ్య గాయపడ్డారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి ఫకీరయ్యను ఆస్పత్రికి తరలించారు. దొంగ ఓట్లను.. ప్రశ్నించినందుకు.. సత్తెనపల్లి మండలం ఫణిదంలో టీడీపీ వర్గీయులు దొంగ ఓట్లు వేస్తున్నారని సమాచారం అందడంతో వైఎస్సార్సీపీ అభిమానులు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వారితో టీడీపీ వారు వాగ్వాదానికి దిగి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇరువర్గాల మధ్య మాటలు పెరగడంతో పోలీసులు లాఠీలు ఉపయోగించి చెదరగొట్టారు. లక్కరాజు గార్లపాడులో పోలింగ్ కేంద్రానికి 100 మీటర్లలోపు నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా చేరిన టీడీపీ నాయకులు.. వైఎస్సార్సీపీ అభిమానులతో వాగ్వాదానికి దిగారు. పెదకూరపాడు మండలం కంభంపాడు ఎస్సీ కాలనీకి చెందిన దివ్యాంగుడైన ప్రభాకర్‌తో ఆయన బంధువు సురేశ్ ఓటు వేయించి తీసుకెళుతుండగా పోలింగ్ కేంద్రం బయట ఉన్న టీడీపీ వర్గీయులు కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారు. దీంతో సురేశ్ పెదకూరపాడు పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ వర్గీయులపై ఫిర్యాదు చేశారు. ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టారు. తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువులంక గ్రామంలో రెండువర్గాల వారు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విశాఖ జిల్లా భీమిలి మండలం తాటిచూరు గ్రామంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక ఎస్ఐ ఒక గ్రామస్తుడిని కొట్టడంతో ఆగ్రహి ంచిన గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అమ రావతి మండలం ఉంగుటూరు పోలింగ్ కేంద్రం లోకి టీడీపీ వర్గీయులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశిస్తుండగా వైఎస్సార్సీపీ అభిమానులు అడ్డు కున్నారు. రెండువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఉంగుటూరు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన 15 మంది చావపాడులో ఓటు వేయడానికి రావడంతో వైఎస్సార్సీపీ అభిమానులు అడ్డుకున్నారు. నాలుగు కుటుంబాలపై దాడి సత్తెనపల్లి: దళితులు మా చెప్పుచేతల్లో ఉండాలి.. మాకే ఎదురు నిలబడతారా.. ఏమనుకుంటున్నారు.. అంటూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో నాలుగు దళిత కుటుంబాలపై టీడీపీ వర్గీయులు ఆదివారం రాత్రి దాడిచేశారు. లక్ష్మీపురం పంచాయతీలో వైఎస్సార్సీపీ అభిమాని ఆచంట సుబ్బారావు, టీడీపీ మద్దతుదారు వల్లెపల్లి శ్రీనివాసరావు సర్పంచి పదవికి పోటీచేశారు. ఈ ఎన్నికల్లో శ్రీనివాసరావు గెలవడంతో టీడీపీ వర్గీయులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. రెండు ట్రాక్టర్లతో విజయోత్సవం నిర్వహిస్తూ బాణసంచా కాల్చారు. దళితుల గృహాల వద్దకు రాగానే ‘మాకే ఎదురు నిలబడతారురా.., కులం తక్కువోళ్లు మేము చెప్పినట్టు చేయాలి..’ అంటూ కర్రలతో దాడులకు దిగారు. దీంతో ఎస్సీ కాలనీకి చెందిన నందం వెంకటేశ్వరరావు, నందం సాంబశివరావు, పి.బెంజిమన్, తారా జయమ్మ, కె.సామ్రాజ్యం గాయపడ్డారు. టీడీపీకి చెందిన మేడూరి కన్న, మేడూరి రవి, బొద్దులూరి చంద్రశేఖర్, పంచుమర్తి శ్రీనివాసరావు, బొద్దులూరి శేఖర్, బొత్తులూరి శ్రీను, కొర్లకుంట నరేంద్ర, బొద్దులూరి అశోక్, కనగాల సందీప్, గోగినేని రామకృష్ణ, అల్లంనేని ప్రసాద్, జి.రమేష్, కె.నరేంద్ర, బి.శ్రీను, మరో పదిమంది కర్రలు, రాళ్లతో దాడిచేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓడిపోయామని దాడి.. సత్తెనపల్లి మండలం పాకాలపాడులో ఆదివారం జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభిమాని తిప్పిరెడ్డి వెంకటరెడ్డి.. టీడీపీ మద్దతుదారుడు కె.సాంబయ్యపై 353 ఓట్ల మెజార్టీతో సర్పంచిగా ఎన్నికయ్యారు. అనంతరం వైఎస్సార్సీపీ అభిమానులు గ్రామంలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు చేస్తుండగా.. ఓటమి పాలైన సాంబయ్య తాలూకు కొందరు రాళ్లు రువ్వి ఘర్షణకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైఎస్సార్సీపీ అభిమాని కె.నర్సిరెడ్డి గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో వచ్చిన సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. వైఎస్సార్సీపీ కార్యకర్త హత్య ఎన్నికల్లో రాజీచేస్తావా.. అంటూ చంపేసిన టీడీపీ వర్గీయులు వైఎస్సార్ జిల్లాలో దారుణం బ్రహ్మంగారిమఠం: వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారిమఠం మండ లం ముడుమాల గ్రామంలో టీడీపీ వర్గీయులు ఆదివారం వైఎస్సార్సీపీ కార్యకర్త ముడుమాల భాస్కర్‌రెడ్డి (52)ని దారుణంగా హత్యచేశారు. బాధిత కుటుంబసభ్యులు, స్థానికుల కథనం మేరకు.. ముడుమాల, పలుగురాళ్లపల్లె పంచా యతీల సర్పంచులుగా వైఎస్సార్సీపీ అభిమా నులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు ఏకగ్రీవంగా ఎన్నిక కావడాన్ని జీర్ణించుకో లేని పలు గురాళ్లపల్లె పంచాయతీ జౌకుపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు మీసాల దుగ్గిరెడ్డి, ఆయన అనుచరులు ఆదివారం ముడుమాల, జౌకుపల్లె గ్రామాల మధ్యలో భాస్కర్‌రెడ్డితో ఘర్షణకు దిగారు. ‘నువ్వు రాజీచేస్తావా..’ అం టూ ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టారు. భాస్క ర్‌రెడ్డి కుప్పకూలిపోవడంతో వారు పారిపో యారు. ఈ విషయం తెలిసి భాస్కర్‌రెడ్డి కుటుం బసభ్యులు అక్కడికి చేరుకుని 108 వాహనంలో అతడిని బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బ్రహ్మంగారిమఠం పోలీసులు.. హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకుగురైన భాస్కర్‌రెడ్డి గుడిసెకు నిప్పు.. మొక్కజొన్న తోట ధ్వంసం కుప్పంరూరల్: చిత్తూరు జిల్లా కుప్పం నియోజక వర్గంలో పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీవారు దారుణంగా ఓడిపోవడంతో తట్టుకోలేని టీడీపీ వారు వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేస్తు న్నారు. కుప్పం మండలం గుడ్లనాయనపల్లి పం చాయతీ ఊరునాయునిపల్లెలో శనివారం రెండు ఇళ్ల మీద దాడిచేయడమేగాక గుడిసెకు నిప్పం టించారు. మొక్కజొన్న తోటను ధ్వంసం చేశారు. ఈ పంచాయతీ సర్పంచిగా వైఎస్సార్ï Üపీ అభిమాని ఝాన్సీరాణి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీన్ని జీర్ణించుకోలేని చంద్ర శేఖర్, పవన్‌కల్యాణ్, చంద్రబాబు, మురుగేష్, లక్ష్మీపతి, కదిరప్ప, మరో ఇద్దరు టీడీపీ వ్యక్తులు వైఎస్సార్సీపీ అభిమానులైన బాలాజీ, కృష్ణమూర్తి ఇళ్ల మీద దాడిచేశారు. కృష్ణమూర్తి పొలంలోని గుడిసెకు నిప్పుపెట్టి, మొక్కజొన్న తోటను ధ్వంసం చేశారు. భయాందోళనలకు గురైన కృష్ణమూర్తి, బాలాజీ ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువర్గాలను పిలిపించి దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ఆహుతైన కృష్ణమూర్తి గుడిసె, ధ్వంసమైన మొక్కజొన్న తోట మహిళపై దాడి.. ఇంట్లో సామగ్రి ధ్వంసం పొన్నలూరు: ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలోని తిమ్మపాలెంలో ఆదివారం తాను చెప్పిన వారికి ఓటు వేయలేదని ఓ మహిళపై గ్రామ టీడీపీ నాయకుడు దాడిచేశాడు. ఈ విషయమై బాధితురాలు బోడా మధుబాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు.. ఈనెల 17న జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఆమె తన ఓటు హక్కు వినియోగించుకుంది. ఈ పంచాయతీలో వైఎస్సార్సీపీ అభిమాన అభ్యర్థి విజయం సాధించారు. ఇది జీర్ణించుకోలేని స్థానిక టీడీపీ వ్యక్తులు రెండు రోజులుగా గ్రామంలో చిన్నచిన్న గొడవలకు దిగారు. ఈ క్రమంలో ఆదివారం బోడా శ్రీను.. వైఎస్సార్సీపీ మద్దతదారుడికి ఓటేశావంటు మధుబాలపై దాడిచేశాడు. దుర్భాషలాడుతూ ఆమె ఇంటి ముందు ఉన్న పందిరిని కూలదోసి, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశాడు. శ్రీను నుంచి తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఆమె కోరారు. ఇంటిపై దాడిచేసి కూలదోసిన పందిరి -
ఆలయాల్లో దాడులపై సిట్ బృందం తొలి భేటీ
సాక్షి, విజయవాడ: ఆలయాల్లో దాడులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం శనివారం తొలిసారిగా భేటీ అయ్యింది. సిట్ అధికారి అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఆలయాల్లో దాడులపై విచారణకు జిల్లాల్లో దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసింది. 2020 సెప్టెంబర్ నుంచి ఆలయాల్లో జరిగిన 23 ఘటనలపై సిట్ బృందం విచారణ చేయనుంది. వచ్చే వారం రెండో సారి సిట్ బృందం సమావేశం కానుంది. (చదవండి: విధ్వంసం ఘటనలపై ‘సిట్’ విచారణ) రాష్ట్రంలో ఆలయాలపై దాడుల ఘటనలపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసిన సంగతి విధితమే. ఏసీబీ అదనపు డైరెక్టర్‌గా ఉన్న ఐపీఎస్ అధికారి జీవీజీ అశోక్‌కుమార్ సిట్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. సిట్ బృందంలో మరో 15 మంది సభ్యులుంటారు.(చదవండి: ‘ఎస్ఈసీ నిర్ణయం ఆందోళనకు గురిచేసింది’) -
వాషింగ్టన్లో 15 రోజులు ఎమర్జెన్సీ
అగ్రరాజ్యం వణికిపోయింది. ప్రజాస్వామ్యం చిన్నబోయింది. ప్రపంచదేశాలు నివ్వెరపోయాయి. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్ తన అనుచరుల్ని రెచ్చగొట్టారు. అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను అడ్డుకోవాలంటూ ఉసిగొల్పారు. ఫలితంగా అమెరికాకి గుండెకాయ వంటి చట్టసభల సమావేశ భవనం క్యాపిటల్‌పై దాడి జరిగింది. కనీవినీ ఎరుగని హింసాకాండ చెలరేగింది. అమెరికా చరిత్రలో చీకటి రోజుగా మిగిలింది. అదే రోజు రాత్రి ప్రజాస్వామ్యానికి కొత్త వెలుగులు ప్రసరించేలా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను కాంగ్రెస్ ధ్రువీకరించింది. ఉపాధ్యక్షుడిని ప్రలోభపెట్టాలని చూసిన ట్రంప్ ఎత్తుగడలు ఫలించలేదు. చేసేదేమీలేక ట్రంప్ ఓటమిని అంగీకరించారు. ఈ మొత్తం ఘటనలో ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించిన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ హీరోగా నిలిస్తే, ట్రంప్ అవమానభారంతో జీరోగా మిగిలి అందరి ముందు తలవంచుకోవాల్సి వచ్చింది. వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే కనీవినీ ఎరుగని అసాధారణ ఘటన ఇది. ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలా మిగిలిపోయిన దుశ్చర్య ఇది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండదండలతో ఆయన అనుచరులు అమెరికా చట్టసభల సమావేశ భవనం క్యాపిటల్‌పై బుధవారం దాడి చేశారు. ఆగ్రహావేశాలతో రెచ్చిపోయి హింసాకాండకు దిగారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడానికి కాంగ్రెస్ ఉభయసభలు సమావేశమైన సమయంలో వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు అమెరికా జెండాలు చేతబూని వచ్చి ఆ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆందోళనకారుల్ని నిలువరించడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగం, కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ హింసాకాండ దాదాపు నాలుగు గంటల సేపు సాగింది. పోలీసుల కాల్పుల్లో ఒక మహిళ సహా నలుగురు మరణించారు. డజనుకి పైగా పోలీసులు గాయపడ్డారు. పదుల సంఖ్యలో ఆందోళనకారుల్ని వాషింగ్టన్ మెట్రోపాలిటన్ చీఫ్ పోలీసు రాబర్ట్ జే కాంటీ వెల్లడించారు. జాతీయ భద్రతా బలగాలు రంగంలోకి దిగాక పరిస్థితులు అదుపులోనికి వచ్చాయి. వాషింగ్టన్ మేయర్ మురీల్ బౌజర్ తొలుత రాత్రి పూట కర్ఫ్యూ ప్రకటించారు. ఆ తర్వాత 15 రోజుల పాటు అత్యవసర పరిస్థితుల్ని విధించారు. ప్రజాస్వామ్యంపై దాడి : బైడెన్ ట్రంప్ అనుచరుల దాడి ఘటనపై కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికా చరిత్రలో ఇదో చీకటి రోజు అని వ్యాఖ్యానించారు. ‘‘మన ప్రజాస్వామ్యంపై అసాధారణ స్థాయిలో దాడి జరిగింది. ఈ ఆధునిక కాలంలో ఎప్పుడూ ఇలాంటి దాడిని మనం చూడలేదు. మన స్వేచ్ఛపైనా, మన ప్రజాప్రతినిధులపైనా, మనకి రక్షణ కల్పించే పోలీసులపైనా, ప్రభుత్వ ఉద్యోగులపైనా దాడి జరిగింది’ అని బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అసలు సిసలు అమెరికా ఇది కాదని బైడెన్ అన్నారు. ‘‘క్యాపిటల్ భవనం దగ్గర జరిగిన భయానక దృశ్యాలు చూసి ఇదే అసలైన అమెరికా అనుకుంటే పొరపాటు. తీవ్రవాద భావాలు కలిగిన కొందరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. వారి సంఖ్య చాలా తక్కువ. ఇలాంటి ఘటనలకు ఇంక తెరపడాలి’’ అని అన్నారు. శాంతియుతంగా ప్రవర్తించాలంటూ ట్రంప్ వీడియో డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారుల్ని ప్రోత్సహిస్తూ క్యాపిటల్ భవనం దగ్గరకు వెళ్లండంటూ ట్వీట్లు పెట్టారు. ‘‘మీరు నింగీనేల ఏకమయ్యేలా పోరాడాలి. లేకపోతే మీకు మన దేశం దక్కదు’’, ‘‘బలహీనులెవరైనా ఉంటే బయటకు వచ్చేయండి బలవంతులకే ఇది సమయం’’ అని ట్వీట్లు చేశారు. ఎప్పుడైతే వారి దాడి హింసకు దారితీసిందో వెనక్కి తగ్గిన ఆయన శాంతి మంత్రం జపిస్తూ ఒక వీడియోని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. ‘‘ఈ ఎన్నికల ప్రక్రియ అంతా తప్పులతడకే. కానీ మనమేమీ చెయ్యలేం. అందరం శాంతియుతంగా వ్యవహరిద్దాం. అందరూ ఇళ్లకు వెళ్లపోండి’’ అంటూ తన అనుచరగణానికి ఆ వీడియోలో విజ్ఞప్తి చేశారు.అయితే ట్విట్టర్ ట్రంప్ ప్రోత్సహిస్తూ పెట్టిన ట్వీట్లను ఆయన ఖాతానుంచి తొలగించింది. 12 గంటల సేపు ట్రంప్ ఖాతాని లాక్ చేసింది. ఫేస్బుక్ కూడా ట్రంప్ అకౌంట్‌ని 24 గంటలు పాటు బ్లాక్ చేసింది. 4 గంటలు ఏం జరిగిందంటే... క్యాపిటల్ భవనాన్ని ముట్టడించడానికి అనూహ్యంగా, ఒక వెల్లువలా వచ్చిన నిరసనకారుల్ని చూసి పోలీసులు తేరుకునే లోపు వారంతా బ్యారికేడ్లు దూకి క్యాపిటల్ భవనం లోపలికి దూసుకుపోయారు. ట్రంప్ పేరున్న జెండాలు పట్టుకొని ఆయనకి అనుకూల నినాదాలు చేస్తూ సెనేట్ చాంబర్ అంతా కలియ తిరిగారు. కాంగ్రెస్ సభ్యుల్ని ఉద్దేశించి ‘‘వాళ్లంతా ఎక్కడ’’ అని ట్రంప్ మద్దతుదారుడు ఒకరు తలుపులు దబదబా బాదుతూ హాలంతా తిరిగాడు. కొందరు కిటికీలు బద్దలు కొట్టారు. మరికొందరు రూఫ్లపైకి ఎక్కారు. నానా బీభత్సం సృష్టించారు. దీంతో ప్రజాప్రతినిధులు, క్యాపిటల్ సిబ్బంది భయంతో వణికిపోయారు. కొందరు టేబుల్స్ కింద దాక్కున్నారు. మరికొందరు మోకాళ్లలో తలదూర్చి ప్రార్థనలు చేశారు. ఇంతలో మరికొందరు ఆందోళనకారులు ప్రిసైడింగ్ ఆఫీసర్ చైర్‌ని ఆక్రమించారు. సెనేట్‌లో వేదిక ఎక్కి గోల గోల చేశారు. ‘ట్రంప్ ఎన్నికల్లో గెలిచారు’ అంటూ గట్టిగా కేకలు వేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆందోళనకారులు ఆగలేదు. ముందుకు దూసుకువెళ్లారు. అప్పటికే కాంగ్రెస్ ఉభయసభల సమావేశానికి ఆధ్వర్యం వహిస్తున్న ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కుర్చీలోంచి లేచి వెళ్లిపోయారు. మైక్ పెన్స్, ఇతర ప్రజాప్రతినిధుల్ని పోలీసులు రహస్య సొరంగ మార్గం ద్వారా అదే భవనంలోని సురక్షిత ప్రాంతానికి తరలించారు. క్యాపిటిల్ భవనానికి తాళాలు వేసి బాష్పవాయువును ప్రయోగించారు. క్యాపిటల్ భవనంలో కాల్పులు : మహిళ మృతి ట్రంప్ మద్దతుదారులు వెనక్కి తగ్గకపోవడంతో కేంద్ర భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. పోలీసులు, కేంద్ర బలగాలు క్యాపిటల్ భవనాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. పరిస్థితుల్ని అదుపులోకి తీసుకురావడానికి కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పుల్లో తొలుత అశిల్ బబ్బిత్ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. తుపాకీ గుండు ఆమె ఛాతీలోకి దూసుకువెళ్లడంతో మరణించింది. అశిల్ అమెరికా వైమానిక దళంలో 14 ఏళ్లపాటు సేవలు అందించారు. ట్రంప్‌కి వీరాభిమాని అని ఆమె భర్త వెల్లడించారు. దాడి జరగడానికి ముందు రోజు ఆమె తన ట్విట్టర్ అకౌంట్లో ‘‘మమ్మల్ని ఎవరూ ఆపలేరు. వాళ్లు ప్రయత్నిస్తారేమో కానీ తుఫాన్ మొదలైంది. 24 గంటల్లోనే వాషింగ్టన్‌ను చుట్టుముట్టేస్తుంది’’ అని ట్వీట్ చేశారు. అశిల్తో పాటు పోలీసు కాల్పుల్లో మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. కావాలనే ఆందోళనకారుల్ని వదిలేశారా? కాంగ్రెస్ ఉభయ సభలు సమావేశమైన క్యాపిటల్ భవనం దగ్గర భద్రతా సిబ్బంది చూసీ చూడనట్టుగా ఆందోళనకారుల్ని వదిలేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ హింసాకాండకి సంబంధించిన వీడియోలో ట్రంప్ మద్దతుదారులు హాయిగా నడుచుకుంటూ లోపలికి వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. అప్పుడు వారిని అడ్డుకునే నాథుడే కనిపించలేదని సీఎన్ఎన్ చానల్ కథనాన్ని ప్రసారం చేసింది. బారికేడ్లు దాటుకుంటూ, కిటికీల్లోంచి దూరుతూ, గోడలు ఎక్కి ట్రంప్ మద్దతుదారులు నానా రచ్చ చేశారు. ‘‘ట్రంప్ మద్దతుదారులు దాడి చేస్తారని పోలీసులకి తెలుసు. హింసాకాండ జరుగుతుందని వారి కి ముందే తెలుసు. అయినప్పటికీ భద్రతా ఏర్పాట్లు సరిగా చెయ్యలేదు. క్యాపిటల్ భవనం దగ్గర భద్రతా ఏర్పాట్లలో డొల్లతనం బయటపడింది’’ అని అమెరికా పోలీసు శాఖకి చెందిన మాజీ అధికారి తిమోతి డిమాఫ్ అన్నారు. నేషనల్ గార్డ్స్ రంగంలోకి దిగిన తర్వాతే పరిస్థితులు అదుపులోనికి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. క్యాపిటల్ భవనం గోడ ఎక్కుతున్న ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై నుంచి ఆందోళనకారులపైకి తుపాకులు గురిపెట్టిన పోలీసులు -
అఫ్గాన్‌లో భద్రతా దళాల స్థావరంపై దాడిలో 24 మంది మృతి
కాబుల్: అఫ్గానిస్తాన్ భద్రతా బలగాలపై కొందరు వ్యక్తులు దాడులు జరిపారు. దక్షిణ అఫ్గాన్‌లోని జాబుల్లో ఉన్న స్థావరంపై శుక్రవారం జరిగిన ఈ దాడుల్లో భద్రతా దళాలకు చెందిన 24 మంది మృతి చెందారు. భద్రతా దళాలు నిద్రిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు సైనికులపై దాడికి పాల్పడినట్లు అఫ్గాన్ అధికారులు వివరించారు. ఈ ఘటనలో అఫ్గాన్ ఆర్మీ దళానికి చెందిన 14 మంది, 10 మంది పోలీసులు మరణించినట్లు తెలిపారు. మరో నలుగురు అధికారుల జాడ తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. -
కోవిడ్ మృతులు 1,500
బీజింగ్/టోక్యో/న్యూఢిల్లీ: చైనాలో ప్రమాదకర కోవిడ్–19 బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉన్న హుబే ప్రావిన్స్, తదితర ప్రాంతాల్లో ఒక్క రోజులోనే 121 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,500కు చేరుకుంది. అదేవిధంగా, చైనాలోని 31 ప్రావిన్స్‌ల్లో మరో 5,090 కేసులు కొత్తగా బయటపడగా వీటిలో 4,823 కేసులు వ్యాధి మూలాలు మొదట గుర్తించిన హుబే ప్రావిన్స్‌లోనివే కావడం గమనార్హం. దీంతో దేశం మొత్తమ్మీద బాధితుల సంఖ్య గురువారానికి 64,894కు చేరుకుంది. అలాగే, కోవిడ్ బాధితులకు వైద్య చికిత్సలు అందిస్తూ వైరస్ సోకిన 1,700 మంది ఆరోగ్య సిబ్బందిలో ఆరుగురు చనిపోయారని చైనా ప్రకటించింది. జపాన్ ఓడలో ముగ్గురు భారతీయులకు.. కోవిడ్–19 వైరస్ అనుమానంతో జపాన్ తీరంలో నిలిపేసిన ఓడలోని 3,711 మందిలో 218 కేసులను పాజిటివ్‌గా గుర్తించగా వీరిలో ముగ్గురు భారతీయులున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. డైమండ్ ప్రిన్సెస్ అనే ఈ ఓడలోని 138 భారతీయుల్లో 132 మంది సిబ్బంది కాగా, ఆరుగురు ప్రయాణికులున్నారు. దీంతోపాటు ఓడలోని కోవిడ్ నెగటివ్‌గా నిర్ధారించిన 11 మంది 80 ఏళ్లు పైబడిన వృద్ధులను జపాన్ అధికారులు శుక్రవారం బయటకు పంపించారు. టోక్యోకు చెందిన ఓ వృద్ధురాలు కోవిడ్‌తో మృతి చెందినట్లు జపాన్ తెలిపింది. భారత్‌లో పరిస్థితి అదుపులోనే.. దేశంలో కోవిడ్ (కరోనా) వ్యాప్తి నియంత్రణలోనే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ తెలిపారు. చైనాలోని వుహాన్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ముగ్గురు కేరళ విద్యార్థులకు వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని, వీరిలో ఒకరు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపారు. చైనా, హాంకాంగ్, థాయ్‌లాండ్, సింగపూర్ దేశాల నుంచి వచ్చే వారికి దేశంలోని 21 ఎయిర్‌పోర్టుల వద్ద స్క్రీనింగ్ కొనసాగుతుండగా, ఈ జాబితాలో జపాన్, దక్షిణకొరియాలను కూడా చేర్చినట్లు పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. -
ముందే చెప్పాం.. పట్టించుకోలేదు
న్యూఢిల్లీ: యూనివర్సిటీలో దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మూక గురించి పోలీసులకు ముందే సమాచారమిచ్చామని, అయినా వారు చర్యలు తీసుకోలేదని జేఎన్‌యూ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) ఆరోపించింది. ఈ నెల 5న మధ్యాహ్నం 3:00 గంటలకు వాట్సాప్‌లో పోలీసులకు మెసేజ్ పెట్టామని, ఆ మెసేజ్‌ను పోలీసులు 3:07 గంటలకు చూసి కూడా పట్టించుకోలేదని విద్యార్థి సంఘం తెలిపింది. ఈ దాడికి పాల్పడింది ఆరెస్సెస్‌కు చెందిన ఏబీవీపీ వర్గం వారేనని ఆరోపించింది. గత వారంలోకూడా తమ సంఘానికి చెందిన నాయకుల మీద వారు దాడిచేసినట్లు తెలిపింది. దాడికి ముందురోజు సాయంత్రం కూడా విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర యాదవ్‌పై దాడిచేశారని చెప్పింది. -
బుర్కినాఫాసోలో రక్తపాతం
ఔగడొగు: ఆఫ్రికా దేశం బుర్కినాఫాసో రక్తమోడింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు ఓ పట్టణంపై దాడి చేసి 35 మందిని చంపేశారు. ప్రతిగా సైన్యం జరిపిన దాడుల్లో 80 మంది ఉగ్రమూకలు హతమయ్యారు. సౌమ్ ప్రావిన్స్‌లోని అర్బిండాలో మంగళవారం ఉదయం బైక్‌లపై వచ్చిన ఉగ్రవాదులు పట్టణంలోని సైనిక క్యాంపుతోపాటు పౌరులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 35 మంది పౌరులు చనిపోగా 20 మంది సైనికులు, ఆరుగురు పౌరులు గాయపడ్డారు. మృతుల్లో 31 మంది మహిళలేనని ప్రభుత్వం తెలిపింది. వెంటనే రంగంలోకి దిగిన సైన్యం, వైమానిక దళం సాయంతో ఉగ్రవాదులపై భారీ ఎత్తున విరుచుకుపడింది. తమ దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు సైన్యం ప్రకటించింది. ఉగ్రదాడికి తామే కారణమంటూ ఎవరూ ప్రకటించుకోనప్పటికీ ఈ ప్రాంతంలో తరచూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న అల్ ఖాయిదా, ఐఎస్‌లే కారణమని భావిస్తున్నారు. బుర్కినాఫాసోతో మాలి, నైగర్ సరిహద్దులకు సమీపంలో గడిచిన ఐదేళ్లలో ఉగ్ర దాడుల్లో 700 మంది చనిపోయారు. 5.60 లక్షల మంది ప్రజలు భయంతో ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. దీంతో ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించేందుకు 4, 500 ఫ్రెంచి, 13 వేల ఐక్యరాజ్యసమితి బలగాలు పనిచేస్తున్నాయి. -
‘ఉల్లి’కి ముకుతాడేద్దాం
సాక్షి ప్రతినిధి, ఏలూరు, తాడేపల్లిగూడెం, సాక్షి, అమరావతి, కర్నూలు (అగ్రికల్చర్): ఉల్లి ధర ఎంతగా పెరిగినప్పటికీ ప్రజలు ఇబ్బంది పడకుండా రైతు బజార్లలో కిలో కేవలం రూ.25 చొప్పున విక్రయిస్తూనే, మరోవైపు మరింతగా మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అధికారులను ఆదేశించడంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు పలు శాఖల యంత్రాంగం రంగంలోకి దిగింది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా తరలిపోకుండా చర్యలు తీసుకుంటోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వ్యాపారులను కట్టడి చేసే చర్యలకు ఉపక్రమించింది. బహిరంగ మార్కెట్లో కిలో ధర రూ.100పైగా పలుకుతున్నా, ధరల స్థిరీకరణ నిధి ద్వారా అధిక ధరకు కొనుగోలు చేసి, కిలో కేవలం రూ.25 చొప్పున రైతు బజార్లలో ప్రజలకు విక్రయించడాన్ని కొనసాగిస్తోంది. ముఖ్యమంత్రి వరుస సమీక్షలలో ఇచ్చిన ఆదేశాలు, సూచనలతో మన రాష్ట్రంలో వినియోగదారులను ఏమాత్రం ఇబ్బంది కలుగకుండా ఉల్లి సరఫరా కొనసాగించడంపై లోతైన కసరత్తు జరిగింది. ఈ విషయంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగి, క్షేత్ర స్థాయికి వెళ్లి వివిధ కోణాల్లో సమస్యపై ఆరా తీసింది. కొంత మంది ట్రేడర్లు కృత్రిమ కొరత సృష్టిస్తూ, పొరుగు రాష్ట్రాలకు తరలిస్తుండటంతో పాటు ట్రేడింగ్‌లో అధిక ధర కొనసాగేలా వ్యవహరిస్తూ.. జిల్లాలకు అవసరమైన మేరకు సరఫరా చేయకపోవడాన్ని గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గురువారం రవాణా, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖలు ఐక్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాయి. మంత్రులు పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి వెంకటేశ్వరరావు (నాని)లు.. మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణతో ఫోన్లో మాట్లాడి ఉల్లి సరఫరా, ధరల నియంత్రణ మీద సమీక్షించారు. ఈ సమావేశంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ కె.రాజేంద్రనాథ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. మూడు నెలల క్రితమే స్పందించిన రాష్ట్రం కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా ఉల్లి లొల్లి చేస్తోంది. రోజు రోజుకూ ధరలు పెరిగిపోతుండటం పార్లమెంట్‌ను సైతం కుదిపేస్తోంది. ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో మార్కెట్లో కలకలం రేపుతోంది. దేశ వ్యాప్తంగా ప్రజల్లో అసహనం వ్యక్తమవుతుండటానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ఉల్లి ధరలపై సీఎం జగన్ మూడు సార్లు సమీక్షించారు. ధరల స్ధిరీకరణ నిధిని ఈ సమస్య పరిష్కారానికి వాడాలని ఆదేశించారు. దీంతో కర్నూలు మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేసి, సెప్టెంబరు 27 నుంచి రైతుబజార్లలో కిలో రూ.25కు విక్రయిస్తున్నాం. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఉల్లి ధర కిలో రూ.100 నుంచి రూ.140 వరకు ఉంది. ఈ నేపథ్యంలో అత్యధికంగా 2100 మెట్రిక్ టన్నుల దిగుమతికి ఇండెంట్ పెట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. ఈ ఉల్లిపాయలు ఈ నెల 12 లేదా 13న ముంబయి పోర్టుకు రానున్నాయి. కార్యాచరణ ఇలా.. ► ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించడంలో భాగంగా ఉల్లి అక్రమ నిల్వలపై మెరుపుదాడులు కొనసాగించాలి. ► నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలి. ► బిల్లులు లేకుండా ఉల్లి రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. చెక్‌పోస్టులు, డైలీట్రాన్స్‌పోర్టుల వద్ద తనిఖీలు నిర్వహించాలి. ► అన్ని రైతుబజార్లలో రాయితీపై ఉల్లి విక్రయాలు కొనసాగించాలి. అవసరమైతే ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు. విజిలెన్స్ విచారణలో తేలిందిదీ.. ► బయటి రాష్ట్రాల్లో డిమాండ్ పెరగడంతో మన అవసరాలు తీరకుండానే ఎక్కువగా తరలిస్తున్నారు. ► కర్నూలు జిల్లాలో పండే ఉల్లి పంటలో అత్యధికంగా తాడేపల్లిగూడెం వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారు. అక్కడి నుంచి బైపాస్‌లో బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ► వేలం పాటలో ఉల్లిని పాడుకున్న ఎగుమతి దారుల ప్రతినిధులు సరుకును గ్రేడింగ్ చేసి, సంచి మార్చి తరలిస్తున్నారు. ► కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు మాత్రమే ఎగుమతులను కట్టడి చేయడంతో బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఉల్లి సంగతులు ► రాష్ట్రం మొత్తానికి ప్రతి రోజు 800 టన్నుల ఉల్లి అవసరం అవుతోంది. ఈ లెక్కన ఏటా అటూ ఇటూ 3 లక్షల టన్నుల వినియోగం ఉంది. ► కర్నూలు జిల్లాలో ఏటా 5 లక్షల టన్నుల నుంచి 8 లక్షల టన్నుల వరకు ఉత్పత్తి అవుతోంది. ఇందులో 80 శాతం ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. ► తాడేపల్లిగూడెం మార్కెట్‌కు ఉల్లిని తీసుకెళ్తే అన్లోడ్ చేయకుండానే కొనుగోలు చేస్తున్నారు. వెంటనే నగదు ఇస్తుండటం వల్ల రైతులు అక్కడికి వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు. ► కర్నూలు మార్కెట్ కమిటీలో ఉల్లిని అమ్మకోవాలంటే నాలుగైదు రోజుల పాటు మార్కెట్లో వేచి ఉండాల్సిన పరిస్థితి (ఈ ఏడాది కాదు). ఆ లోపు ఉల్లి దెబ్బతినేది. అందువల్ల తాడేపల్లిగూడెం వెళ్లేవారు. ► మొత్తం పంటలో 35 శాతం పంటను మాత్రమే కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు తెస్తున్నారు. మిగతా పంటలో అత్యధికం పొలాల్లోనే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ► గత ఏడాది నవంబర్‌లో మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి 1.05 లక్షల టన్నుల ఉల్లి దిగుమతి అయింది. ఈ ఏడాది నవంబర్‌లో దిగుమతైంది కేవలం 47 వేల టన్నులు మాత్రమే. ► దేశంలో పండే పంటలో ఎక్కువ రోజులు నిల్వ ఉండనివి ఒక్క కర్నూలు ఉల్లిపాయలే. మహారాష్ట్ర ఉల్లి, తమిళనాడులో పండే సాంబారు ఉల్లిపాయలు 90 రోజులకు పైగా నిల్వ ఉంటాయి. ఎగుమతులు ఆపేయిస్తున్నాం దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత ఉంది. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఇప్పటికే ముఖ్యమంత్రి పలు చర్యలు తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు ఈ రోజు (గురువారం) కూడా సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశాం. పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేయకుండా చర్యలు తీసుకున్నాం. – పేర్ని వెంకట్రామయ్య(నాని), రవాణా శాఖ మంత్రి దిగుమతులు పెంచాం.. మన అవసరాలకు సరిపడా దిగుమతులపై చాలా రోజుల క్రితమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఇప్పటికే రైతు బజార్లలో రాయితీపై ధరపై విక్రయిస్తున్నాం. కిలోపై వంద రూపాయాలకు పైగా భారం పడుతున్నా ప్రజల కోసం ప్రభుత్వం భరిస్తోంది. త్వరలో దిగుబడితో పాటు, దిగుమతులు కూడా అందనున్నాయి. పరిస్థితి అదుపులోకి వస్తుంది. – కొడాలి వెంకటేశ్వరరావు (నాని), పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రభుత్వం దృష్టి సారించింది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉల్లి ధర పెరుగుదలపై లోతుగా పరిశీలించాం. పంట దిగుబడి తక్కువగా ఉండటానికి తోడు ట్రేడర్ల మాయాజాలం కూడా ఇందుకు కారణమవుతోందని ఇప్పుడిప్పుడే స్పష్టమవుతోంది. ఈ విషయంపై ఏం చేస్తే బావుంటుందో ప్రభుత్వానికి సూచించాం. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించకుండా ప్రభుత్వం దృష్టి పెట్టింది. రెండు నెలలుగా అక్రమ నిల్వదారులపై దాడులు చేసి, సరుకు స్వాధీనం చేసుకున్నాం. – కె.రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ డీజీ -
జేపీఆర్ విద్యాసంస్థలపై ఐటీ దాడులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని జేపీఆర్ విద్యాసంస్థలు, కార్యాలయాలు, యాజమాన్యం ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ గురువారం సోదాలు జరిపింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌కు సన్నిహితుడిగా పేరున్న జేపీఆర్ చెన్నైలో పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలలను నెలకొల్పారు. జేపీఆర్ గత ఏడాది మృతి చెందగా ఆయన కుమార్తె, అల్లుడు ఈ విద్యాసంస్థలను పర్యవేక్షిస్తున్నారు. గురువారం ఉదయం ఐటీ అధికారులు బృందాలుగా ఏర్పడి 30 చోట్ల మెరుపు దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా భారీగా లెక్క చూపని నగదు, అనేక ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. -
కర్ణాటక కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ సోదా
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వర, ఆ పార్టీ మాజీ ఎంపీ జాలప్ప కొడుకు రాజేంద్ర ఇళ్లు, ఆఫీస్‌లలో ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు గురువారం సోదాలు చేశారు. సిద్ధార్థ విద్యా సంస్థలను పరమేశ్వర కుటుంబం నిర్వహిస్తుండగా, ఆర్.ఎల్. జాలప్ప ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పేరుతో కర్ణాటకలోని కోలార్, దొడ్డబళ్లపురలో విద్యా సంస్థల్ని రాజేంద్ర నడుపుతున్నారు. ఈ మెడికల్ కాలేజీల్లో నిర్వహించిన నీట్ పరీక్షకు ఒకరికి బదులుగా మరొకరు హాజరై నీట్లో సీట్లు పొందేందుకు గాను విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ముడుపులు స్వీకరించాయని ఆదాయపన్ను శాఖ ఆరోపిస్తోంది. అందుకు సంబంధించి పన్ను ఎగవేతకు కూడా పాల్పడినట్లు ఈ విద్యాసంస్థలపై ఆరోపణలున్నాయి. పరమేశ్వరతో పాటుగా ఆయన సోదరుడు జి.శివప్రసాద్, అతని వ్యక్తిగత సహాయకుడు రమేశ్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు చేసింది. -
పోలీస్ స్టేషన్‌కు తుపాకులతో వచ్చి..
జైపూర్: సాయుధులైన పది మంది ఏకే–47 రైఫిల్‌తో పోలీస్‌స్టేషన్‌పై కాల్పులు జరిపి జైల్లో ఉన్న నిందితున్ని తమతో తీసుకెళ్లిన ఘటన రాజస్తాన్‌లోని అల్వార్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా విక్రమ్ గుజ్జర్ (28, పప్లాగా సుపరిచితుడు) వాహనంలో రూ. 30 లక్షలు పట్టుకున్నారు. అనంతరం డబ్బును సీజ్ చేసి పప్లాను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు ఆతన్ని విచారిస్తుండగా, సాయుధులైన దాదాపు 15 మంది దుండగులు ఏకే 47 రైఫిళ్లతో పోలీస్‌స్టేషన్‌లోకి ప్రవేశించారు. దాదాపు 45 రౌండ్లు కాల్పులు జరిపి పప్లాను తీసుకొని ఉడాయించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. తప్పించుకున్న వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి సుగన్ సింగ్ అన్నారు. హరియాణాకు చెందిన పప్లా మీద ఇప్పటికే అయిదు హత్యా నేర అభియోగాలున్నాయి. ఆయుధాలు ధరించిన ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంటాడు. అతడిపై రూ. లక్ష రివార్డు కూడా ఉంది. -
హాంకాంగ్ విమానాశ్రయంలో నిరసనలు
హాంకాంగ్: నిరసనకారుల సెగ హాంకాంగ్ విమానాశ్రయాన్ని తాకింది. విమానాశ్రయంలోకి ప్రవేశించిన నిరసనకారులు ఆ దేశ పోలీసులకు వ్యతిరేకంగా గళం విప్పారు. నల్లటి దుస్తులు ధరించి ఫ్లకార్డులు ప్రదర్శించారు. విమానాశ్రయం లోపల ఇంత పెద్ద స్థాయిలో ఆందోళనలు జరపడం ఇదే తొలిసారి. నిరసన తెలుపుతోన్న ఓ మహిళపై ఆదివారం పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తూ వారు ఆందోళన నిర్వహించారు. పోలీసుల దాడిలో రక్తమోడుతున్న మహిళ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దాడిలో మహిళ కంటిచూపు కోల్పోయిందని వారు ఆరోపించారు. ఆమెకు మద్దతుగా కంటికి బ్యాండేజీలు కట్టుకుని నిరసన తెలిపారు. హాంకాంగ్ పోలీసులకు మతి భ్రమించిందని, వారు తమ పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ‘హాంకాంగ్ పోలీసులు మమ్మల్ని చంపేస్తున్నారు’, ‘హాంకాంగ్ సురక్షిత స్థలం కాదు’, ‘హాంకాంగ్ ప్రజలారా మేల్కోండి.. భయపడాల్సిన అవసరం లేదు’ అని ఫ్లకార్డులు ప్రదర్శించారు. నల్లటి దుస్తులు ధరించిన వేలాది మంది నిరసనకారులతో విమానాశ్రయ ప్రాంగణ మంతా నలుపు రంగును పులముకున్నట్లు అయింది. నిరసనకారుల దెబ్బకు హాంకాంగ్ నుంచి బయలుదేరాల్సిన, అక్కడికి రావాల్సిన అన్ని విమానాలను రద్దు చేశారు. నిరసనకారులు ఉగ్రవాదులే: చైనా పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తున్న హాంకాంగ్ నిరసనకారులపై చైనా మండిపడింది. నిరసనకారుల చర్యలు ఉగ్రవాద చర్యల్లాగే ఉన్నాయని, ఇప్పుడిప్పుడే ఉగ్రవాదం పురుడు పోసుకుంటోందని వ్యాఖ్యానించింది. -
సైన్యం.. అప్రమత్తం
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంతో పాకిస్తాన్ దాడులు నిర్వహించే అవకాశం ఉందని భావించిన కేంద్రం, పీఓకేలో భారీగా సైన్యాన్ని మోహరించింది. పాక్ నుంచి వచ్చే ఏ ప్రతిచర్యనైనా తిప్పికొట్టడానికి సైన్యం సిద్ధంగా ఉందని సైనికవర్గాలు తెలిపాయి. ఆర్మీ ప్రధానాధికారులంతా జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. కశ్మీర్ లోయలో పాక్ హింసకు, ఐఈడీ పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఏ సమయంలోనూ పరిస్థితిని చేజారనివ్వమని ఓ సీనియర్ మిలిటరీ అధికారి తెలిపారు. 2016లో హిజ్బుల్ ముజాహిద్దీన్ నాయకుడు బుర్హాన్ వానిని హతం చేసినపుడు కశ్మీర్‌లోయలో దాదాపు నాలుగు నెలలకుపైనే అస్థిరత నెలకొంది. అలాంటి పరిస్థితులు మళ్లీ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. వైమానిక దళం కూడా అక్కడే ఉంటూ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. వారిని అదుపు చేయాలి: కేంద్రం జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భద్రతా దళాలను మరింత అప్రమత్తతో ఉంచాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘జాతీయ ప్రయోజనాలు, దేశ భద్రతను బలోపేతం చేయడానికి కేంద్ర కేబినెట్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించేలా సాంఘిక వ్యతిరేక శక్తులు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. వాటిని అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మత పరమైన సున్నిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి.’ అని పేర్కొంది. -
అమెరికాలో పూజారిపై దాడి
న్యూయార్క్: అమెరికాలో ఓ హిందూ పూజారిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్‌లోని ఫ్లోరల్ పార్క్ సమీపంలో జూలై 18న ఉదయం 11 గంటలకు (స్థానిక కాలమానం) స్వామి హరీశ్ చంద్ర పురీ అనే పూజారిపై ఓ వ్యక్తి దాడి చేయడంతో ఆయన గాయాలపాలయ్యారు. జాతి విద్వేషం కారణంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడికి పాల్పడిన 52 ఏళ్ల సెర్గియో గోవియా అనే వ్యక్తిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఫ్లోరల్ పార్క్ సమీపంలోని గ్లెన్ ఓక్స్‌లో శివ శక్తి పీఠం ఉంది. అక్కడి దగ్గర్లోని రోడ్డుపై హరీశ్ చంద్ర పూజారి వేష ధారణలోనే నడుచుకుంటూ వెళ్తుండగా, సెర్గియో వెనుక నుంచి వచ్చి హరీశ్ చంద్రపై పిడిగుద్దులు కురిపించాడు. ఆ దెబ్బలకు తాళలేక హరీశ్ చంద్ర ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ‘ఇది మా ప్రాంతం’ అని దాడి సమయంలో సెర్గియో అరిచినట్లు హరీశ్ చంద్ర పురీ చెప్పారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన నలుగురు మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్లు తమ స్వదేశాలకు వెళ్లిపోవాలని అన్నారు. ఈ తర్వాతే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ దాడిని ప్రతినిధుల సభలో సభ్యురాలైన గ్రేస్ మెంగ్ ఖండించారు. అమెరికాలో అల్పసంఖ్యాకులైన హిందువులకు తాను అండగా ఉంటాననీ, వివిధ దేశాల నుంచి వచ్చిన అనేకమంది మైనారిటీలు తన నియోజకర్గంలో ప్రశాంతంగా నివసిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. -
దేశవ్యాప్తంగా 50 చోట్ల సీబీఐ సోదాలు
న్యూఢిల్లీ: రూ.1,139 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసిన కేసులో సీబీఐ భారీ డ్రైవ్ చేపట్టింది. మంగళవారం దేశవ్యాప్తంగా ఏకకాలంలో 12 రాష్ట్రాల్లోని 18 నగరాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 61 చోట్ల సోదాలు చేపట్టింది. ఎస్బీఐ, సెంట్రల్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకులు చేసిన ఫిర్యాదుల మేరకు నమోదైన 17 కేసులకు సంబంధించిన వివిధ వాణిజ్య సంస్థల డైరెక్టర్లు, ప్రమోటర్లకు చెందిన ఇళ్లు, సంస్థలపై దాడులు జరిగాయి. పరారైన వజ్రాల వ్యాపారి జతిన్‌కి చెందిన ముంబైలోని విన్సమ్ గ్రూప్, తాయల్ గ్రూప్‌నకు చెందిన ఎస్కే నిట్, ఢిల్లీ కేంద్రంగా పనిచేసే నఫ్తోగజ్, ఎస్ఎల్ కన్జ్యూమర్, పంజాబ్‌లోని ఇంటర్నేషనల్ మెగా ఫుడ్‌పార్క్, సుప్రీం టెక్స్ మార్ట్ తదితరాలు లక్ష్యంగా సోదాలు చేపట్టినట్లు సీబీఐ తెలిపింది. గృహ రుణాల మంజూరులో అవకతవకలకు పాల్పడిన భువనేశ్వర్‌లోని యూనియన్ బ్యాంక్ శాఖ అధికారులపై మూడు కేసులు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. ఢిల్లీ, ముంబై, థానే, లూ«థియానా, వల్సాద్, పుణే, గయ, గుర్గావ్, చండీగఢ్, భోపాల్, సూరత్, కోలార్ తదితర నగరాల్లో చేపట్టిన ఈ సోదాల్లో 300 మంది అధికారులు పాల్గొన్నారని తెలిపింది. సీబీఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా నేతృత్వంలో చేపట్టిన తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని సీబీఐ పేర్కొంది. రూ.640 కోట్ల మేర మోసం జరిగి ఉంటుందని అంచనా వేసిన అధికారులు సోదాల తర్వాత ఈ మొత్తం రూ.1,139 కోట్ల వరకు ఉంటుందని తేల్చారు. ఈ మేరకు జితిన్ మెహతాపై 16వ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎగ్జిమ్ బ్యాంకును రూ.202 కోట్ల మేర మోసం చేసినట్లు ఇతనిపై ఇప్పటికే పలు కేసులున్నాయి. భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న ముంబైలోనూ అధికారులు సోదాలు కొనసాగించారు. -
17న వైద్యుల దేశవ్యాప్త సమ్మె
న్యూఢిల్లీ/కోల్‌కతా: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మూడురోజుల పాటు జరిగే వైద్యుల దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలను శుక్రవారం ప్రారంభించింది. పశ్చిమబెంగాల్లోని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో జూనియర్ వైద్యులపై దాడిని నిరసిస్తూ ఆందోళనలకు దిగిన వైద్యులకు సంఘీభావంగా ఈ ప్రదర్శనలు చేపట్టింది. అదేవిధంగా ఈ నెల 17న దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మెకు పిలుపునిచ్చింది. అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో అవుట్ పేషంట్ విభాగాలతో పాటు అత్యవసరం కాని వైద్య సేవలన్నిటినీ 24 గంటల పాటు నిలిపివేయాలని సూచించింది. అయితే అత్యవసర, క్యాజువాలిటీ సేవలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపింది. ఆస్పత్రుల్లో వైద్యులపై దాడులను నిరోధించేందుకు కేంద్ర చట్టం తేవాలనే తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఐఎంఏ లేఖ రాసింది. నిరసన కార్యక్రమాల్లో భాగంగా వైద్యులంతా నల్లబ్యాడ్జీలు ధరించాలని, ధర్నాలు, శాంతియాత్రలు నిర్వహించాలని సూచించింది. కోల్‌కతాలోని ఎన్ఆర్ఎస్ వైద్య కళాశాలలో డాక్టర్ పరిబాహ ముఖర్జీ తదితరులపై దాడిని ఖండిస్తున్నట్లు ఐఎంఏ సెక్రటరీ జనరల్ ఆర్వీ అశోకన్ చెప్పారు. నిందితులపై బెంగాల్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, రెసిడెంట్ డాక్టర్ల చట్టబద్ధమైన డిమాండ్లన్నిటినీ బేషరతుగా అంగీకరించాలని కోరారు. నాలుగో రోజుకు చేరిన సమ్మె ప్రభుత్వాసుపత్రుల్లో తమకు భద్రత కల్పించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరింది. సమ్మె విరమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హెచ్చరించినప్పటికీ వాటిని వైద్యులు బేఖాతరు చేశారు. వైద్యులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేంతవరకు విధుల్లో చేరేది లేదని తేల్చి చెప్పారు. మరోవైపు బెంగాల్ జూనియర్ డాక్టర్ల సమ్మెకు సంఘీభావంగా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రులకు చెందిన 100 మందికి పైగా సీనియర్ డాక్టర్లు రాష్ట్ర వైద్య విద్య సంచాలకులకు తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. కాగా వైద్యుల సమ్మెకు ముఖ్యమంత్రి మమత మేనల్లుడు, వైద్య విద్యార్థి కూడా అయిన అబేష్ బెనర్జీ మద్దతుగా నిలవడం విశేషం. బెంగాలీ నేర్చుకోవాల్సిందే కాంచ్‌రాపార: పశ్చిమ బెంగాల్లో నివసిస్తున్నవారు ఎవరైనా బెంగాలీలో మాట్లాడటం నేర్చుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. శుక్రవారం ఉత్తర 24 పరగణాల జిల్లా కాంచ్‌రాపార సభలో ఆమె మాట్లాడారు. ‘మనం బంగ్లా భాషను ముందుకు తీసుకురావాలి. ఢిల్లీ వెళ్లినప్పుడు హిందీ మాట్లాడతాం. నేను అలాగే చేస్తా. తమిళనాడు వెళ్లినప్పుడు నాకు తమిళ భాష తెలియదుగానీ కొన్ని పదాలు తెలుసు. అలాగే మీరు బెంగాల్వస్తే బెంగాలీలో మాట్లాడాల్సిందే’ అని అన్నారు. సమ్మె వెనుక బయటి వ్యక్తులు రాష్ట్రంలో వైద్యుల సమ్మె వెనుక కొందరు బయటి వ్యక్తుల ప్రమేయం ఉందని మమత అన్నారు. తాను గురువారం ఎస్ఎస్కేఎం ఆస్పత్రిని సందర్శించినప్పుడు ప్రభుత్వానికి, తనకు వ్యతిరేకంగా నినదిస్తున్నవారిలో కొందరు బయటివ్యక్తులను తాను చూశానని చెప్పారు. కొందరిలా వాస్తవాలు నిర్ధారించుకోకుండా తాను మాట్లాడనని ఆస్పత్రిని సందర్శించిన సినీ నిర్మాత అపర్ణాసేన్ను ఉద్దేశించి మమత వ్యాఖ్యలు చేశారు. -
మొజాంబిక్‌లో దాడి.. 16 మంది మృతి
మపుటో: తూర్పు ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో ఇస్లామిక్ తీవ్రవాదులు మంగళవారం 16 మందిని హతమార్చిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మొజాంబిక్‌లోని కాబో డెల్గాడో అనే ముస్లిం ఆధిక్య ప్రాంతంలో ఇస్లామిక్ తీవ్రవాదులు 2017 అక్టోబర్ నుంచి దాడులకు పాల్పడుతున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు కనీసం 200 మంది ప్రజలను చంపేశారు. వేలాది మంది ప్రజలు ఇళ్లు వదిలిపారిపోయారు. తాజాగా మంగళవారం మిత్సుబిషి ట్రక్కులో ప్రయాణికులు, సరుకులను వేసుకుని వెళ్తుండగా తీవ్రవాదులు దాడి చేశారు. ఇంట్లో తయారు చేసుకొచ్చిన పేలుడు పదార్థాలను తీవ్రవాదులు ట్రక్కుపై విసిరి, అనంతరం కాల్పులు ప్రారంభించారు. వాహనంలోనే ఎనిమిది మంది చనిపోయారనీ, కిందకు దిగి పారిపోతుండగా కాల్చడంతో మరో ఏడు మంది కూడా మరణించారనీ, మరో వ్యక్తి బుధవారం చనిపోయాడిన స్థానిక వ్యక్తి చెప్పారు. అఫ్గాన్‌లో కారుబాంబు దాడి కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం ఉదయం అమెరికా కాన్వాయ్ లక్ష్యంగా జరిగిన కారు బాంబు ఆత్మాహుతి దాడిలో నలుగురు పౌరులు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. అమెరికా భద్రతాదళ సిబ్బందిలోనూ నలుగురికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు చెప్పారు. గత రెండ్రోజుల్లో కాబూల్‌లో జరిగిన రెండో ఆత్మాహుతి దాడి ఇది. కాబూల్‌లోని యాకతోత్‌లోని భవనాలను అమెరికా, నాటో బలగాలు భద్రతగా ఉంటాయి. అక్కడికి దగ్గర్లోనే అఫ్గానిస్తాన్ జాతీయ భద్రతా దళాల భవనాలు కూడా ఉంటాయి. అమెరికా దళాల వాహనశ్రేణి వెళ్తుండగా తాలిబన్ ఉగ్రవాది కారుతో వెళ్లి ఢీకొట్టాడు. -
హరియాణా, బిహార్‌ల్లో ముస్లింలపై దాడులు
న్యూఢిల్లీ/బెగుసరాయ్: హరియాణలోని గుర్గావ్లో నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని ఓ ముస్లిం వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహ్మద్ బాకర్ ఆలం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ‘ఈ నెల 25న నేను సదర్ బజార్ ప్రాంతంలో ఉండగా నలుగురు మనుషులు నన్ను పిలిచారు. నేను తలపై టోపీ ధరించడం పట్ల వారు అభ్యంతరం తెలుపుతూ, నా టోపీ తీసేసి నన్ను చెంపదెబ్బలు కొట్టారు. భారత మాతకు జై అని అనమన్నారు. నేను వాళ్లు చెప్పినట్లు చేయడంతో మళ్లీ జై శ్రీరామ్ అని జపించమన్నారు. నేను తిరస్కరించడంతో వాళ్లు కర్రలు తీసుకుని నన్ను నిర్దాక్షిణ్యంగా కొట్టారు’ అని పేర్కొన్నాడు. మరో ఘటనలో బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లా బరియార్‌పూర్‌లో వీధి వ్యాపారి అయిన ముస్లిం వ్యక్తి మహ్మద్ ఖాసింను రాజీవ్ యాదవ్ అనే వ్యక్తి తుపాకీతో కాల్చాడు. ఇది విద్వేష దాడి అయ్యుండొచ్చని పోలీసులు సోమవారం చెప్పారు. ఆసుపత్రిలో ఖాసిం చికిత్స పొందుతున్న ఖాసిం, తనపై జరిగిన దాడిని ఓ వీడియోలో వివరించాడు. -
నా యుద్ధం ఉగ్రవాదంపై... విపక్షాల దాడి నాపై
అహ్మదాబాద్/అదాలజ్/ధర్: పొరుగుదేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమివేయాలని తాను యుద్ధం చేస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం తనపై దాడి చేయాలని చూస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. మంగళవారం ప్రధాని గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. ‘నేను ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తుండగా వాళ్లు (ప్రతిపక్షాలు) నన్ను దెబ్బకొట్టాలని చూస్తున్నారు. పేదరికంపై నేను పోరాడుతుండగా వాళ్లు చౌకీదార్‌ను తొలగించేందుకు చూస్తున్నారు. నిజాయతీపరుడైన ఈ చౌకీదార్‌తో వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వాళ్లు మోదీ హఠావో అంటూ అరుస్తున్నారు’ అని చెప్పారు. పాక్‌కు బుద్ధి చెప్పాం పాక్‌లోకి ప్రవేశించి ఉగ్రశిబిరాలపై దాడులు చేయడం ద్వారా ఆ దేశానికి తగ్గిన బుద్ధి చెప్పామని ప్రధాని అన్నారు. ‘పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పాక్‌లో ప్రవేశించి అక్కడి ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడం ద్వారా ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పాం. తీరు మారకుంటే తలెత్తే పరిణామాలేమిటో పాక్‌కు ముందే చెప్పాం’ అని అన్నారు. కానీ, ఎయిర్‌స్ట్రైక్ పాక్‌పై జరిగినా భారత్‌లో ఉన్న కొందరికి ఆ దెబ్బ తగిలిందని ఎద్దేవా చేశారు. ‘పుల్వామాకు ప్రతీకారంగా మనం చేసిన దాడిని ప్రపంచమంతా మద్దతు పలుకుతుండగా అత్యంత కల్తీ కూటమి(ప్రతిపక్ష మహాకూటమి) నేతలు మాత్రం పాక్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు’ అంటూ మండిపడ్డారు. రాహుల్ ‘ఆకలి బాధ’ వ్యాఖ్యలపై.. ఒక్క పూట కూడా ఖాళీ కడుపుతో నిద్రించని వారు మాత్రమే ఆకలి బాధ మానసికమైందని అంటారంటూ మోదీ ఎద్దేవా చేశారు. ‘పేదరికం పేరుతో ఓట్లు దండుకుని దేశాన్ని 55 ఏళ్లపాటు పాలించిన వీళ్లకు పేదరికం అనేది కేవలం మానసిక భావన’ అని 2013లో రాహుల్ చేసిన ప్రకటనను ఉదహరిస్తూ వ్యాఖ్యానించారు. అన్నీ ప్రభుత్వమే చేయాలనుకుంటున్నారు ‘ప్రభుత్వమే ప్రతీ పనినీ చేపట్టాలని ప్రజలు భావిస్తున్నారు. ఫలానా పనిని ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. ఇది కొత్త ఒరవడి’ అని అన్నారు. -
వివస్త్రను చేసి ఊరంతా పరుగెత్తించారు!
భదోహీ: ఈవ్‌టీజింగ్‌ను ప్రతిఘటించిన ఓ మహిళపై దాడిచేసిన పోకిరీలు, ఆమెను వివస్త్రను చేసి ఊరంతా పరుగెత్తించారు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని భదోహీ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గోపీగంజ్ ప్రాంతంలో ఉన్న ఓ ఊరిలో శనివారం బాధితురాలిని లాల్‌చంద్ర యాదవ్ అనే ఆకతాయి వేధించాడు. దీన్ని సదరు మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో యాదవ్ మరో ముగ్గురితో కలిసి ఆమెపై విచక్షణారహితంగా దాడిచేశారు. ఆతర్వాత ఆమెను వివస్త్రను చేసి ఊరంతా పరుగెత్తించారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. బాధితురాలు చికిత్స పొందుతోందని తెలిపారు. కేసు నమోదుచేయడంతో పాటు ఓ నిందితుడ్ని అరెస్ట్ చేశామన్నారు. -
బాబోయ్.. బిచ్చగాళ్లు!
విశ్వనగరం లక్ష్యంలో భాగంగా అధికారులు హైదరాబాద్‌ను ‘బెగ్గర్ ఫ్రీ’ నగరంగా మారుస్తామని సంకల్పం చెప్పుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా భాగ్యనగరాన్ని సందర్శించినప్పుడు ఆమె ప్రయాణించే మార్గాలు, మరికొన్ని ముఖ్యకూడళ్లలో యాచకులను నిరోధించి..వారికి పునరావాసంగా చర్లపల్లి జైలుకు తరలించారు. కొన్నాళ్లపాటు నగరవాసులకు వీరి బెడద తగ్గినా..మళ్లీ ఇది యాచకులకు నిజంగా బెగ్గర్..‘ఫ్రీ’ నగరంగా మారి వారి ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. మళ్లీ ప్రధాన కూడళ్లలో వారు రెచ్చి పోతున్నారు.వీరి ఆగడాలపై ‘సాక్షి’ సోమవారం జరిపిన విజిట్‌లో అనేక ఆసక్తికర అంశాలు కనిపించాయి. ప్రధా నంగా మొజంజాహీ మార్కెట్, లక్డీకాపూల్, సెక్రటేరియట్ చౌరస్తా, మెహిదీ పట్నం ప్రాంతాల్లో యాచకుల ఆగడాలు నగరవాసులను అవస్థల పాల్జేస్తున్నాయి. వాటిపై ప్రత్యేక కథనం... – సాక్షి, హైదరాబాద్ దాడులకూ వెనుకాడని ధోరణి.. నగరంలో దందా సాగిస్తున్నవారంతా దుర్భర పరిస్థితుల దృష్ట్యా యాచన చేసేవారు కారు. హరియాణా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి నగరానికి కుటుంబ సమేతంగా వచ్చి శివారుల్లో చిన్న చిన్న గుడారాలు వేసుకొని యాచన పేరిట దందా నడిపేదే వీరిలో అధికులు. వీరిలో పురుషులు ముందుగా రద్దీ కూడళ్లను ఎంపిక చేసుకొని భిక్షాటన కోసం తమవారు ఎవరు ఎక్కడ వెళ్లాలి అనేది నిర్ధారిస్తారు. మహిళలు, మధ్య వయస్కులు కీలక రహదారుల్లో వాహనాలను అడ్డగించి తమకు లేని కృత్రిమ వైకల్యాన్ని చూపి యాచిస్తుంటారు. కొంతమంది తమ చిన్నారులకు వైట్నర్ మత్తులో పెట్టి వారిని ఎత్తుకొని దీనంగా డబ్బులు అడుగుతుంటారు. ఒక్కోసారి ఎవరైనా విసుగెత్తి ద్విచక్ర వాహన దారులు వారి చర్యలను వ్యతిరేకిస్తే..వారిని తీవ్ర స్థాయిలో దూషించడమో, పరిస్థితులను బట్టీ తిరగ బడడమో చేస్తుంటారు. తమ చేతులకు కాళ్లకు ఉత్తుత్తి కట్లు, కాలినట్లు ఆయింట్మెంట్ పూతలు వేసుకొని జుగుప్సాకరంగా వాటిని ప్రదర్శిస్తూ ఇవతల వారిపై ఒత్తిడి తెస్తుంటారు.తమ కట్లు, లేదా దెబ్బలకు రుజువుగా వైద్య చీటీలు కూడా చూపి యాచన చేస్తున్నారు. ఇలా షాపుల వద్ద, చౌరస్తాల్లో వీరి ఆగడాలు పెరుగుతున్నా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి ఎదురవుతోంది. ఉదయం.. మధ్యాహ్నం.. సాయంత్రం.. వీరి కార్యకలాపాలు కూడా రోజంతా ఒకే మాదిరిగా సాగడం లేదు. వీరు వాస్తవానికి ఉదయం పూట వీధుల్లో గృహస్తుల వద్ద యాచన చేపట్టరు. అప్పుడు మనకు కనిపించేది తప్పని స్థితిలో భిక్షాటనను చేపడుతున్న వృద్ధులో, వికలాంగులో కనిపిస్తారు. ముఠా వర్గీయులంతా ఆ సమయంలో కూడళ్ల ఎంపిక ప్రణాళికలో ఉంటారు. వారి పెద్ద నిర్దేశించిన ప్రాంతాలు నిర్ణయించుకున్నాక ఉదయం 9.30 తర్వాత చేతులకు, కాళ్లకు ఇతరత్రానో మేకప్ కట్లు వేసుకొని వృత్తిలోకి దిగుతారు. ఎవరికి కేటాయించిన అడ్డాల్లో వారు యాచన ప్రారంభిస్తారు. ఇలా మధ్యాహ్నం 2గంటలకు వీరికి బ్రేక్ వుంటుంది. సాయంత్రం పూట మరో బృందం మరో తరహాలో మేకప్ వేసుకొని రంగంలోకి దిగుతుంది. ఇదీ వీరు సాగిస్తున్న నిత్య దందా. వీరికి అడ్డుకట్ట వేసే పోలీసులు, జీహెచ్ఎంసీ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండటంతో నగరవాసులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, కళాశాల విద్యార్థులు ఈ యాచక ముఠాల ఆగడాలతో ఇబ్బందులు పడుతున్నారు. ‘సాక్షి’ని వెంటాడిన ‘గార్డింగ్’ ముఠా... ఈ నయా యాచకుల ఆగడాల దృశ్యాలను ‘సాక్షి’ చిత్రీకరిస్తూ.. వారి బాధ ఏమిటి, దుస్థితి ఏమిటని ఆరా తీసే ప్రయత్నం చేసినప్పుడు మహిళా యాచకులకు దూరంగా ఉంటూ ‘రక్షకుల’ పాత్ర పోషిస్తున్న వారి పురుషులు కట్టెలతో దాడికి యత్నించడం వీరి దుశ్చర్యలకు ఓ ఉదాహరణ. భిక్షాటన చేస్తున్న కుటుంబీకులను ఎవరైనా ఆగ్రహంతో నిరోధించే ప్రయత్నం చేస్తే వారు ఇలాంటి ‘గార్డింగ్’ ముఠా చేతుల్లో చావు దెబ్బలు తినాల్సిందే. రోడ్లపై ప్రయాణిస్తున్న వారు కూడా రద్దీ వేళల్లోనో, వారి పనుల ఒత్తిళ్లలోనూ వారితో లేని పోని వివాదాలు ఎందుకని చేతిలో ఉన్నది పడేసి వెళ్లి పోతుంటారు.అలా కాకుండా వారి చర్యలను ప్రశ్నిస్తే..వెంటనే ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న పురుషులు దూకుడుగా కట్టెలతో రంగంలోకి దిగుతుంటారు. భయానక వాతావరణం సృష్టించి రభస చేస్తారు. ఇక నగరానికి చుట్టూ ఉన్న ఔటర్ ప్రాంతంలో కూడా యాచకుల దందా సాగుతోంది. ఈ ముఠాలు కూడా తమ కంటూ కొన్ని అడ్డాలు పెట్టుకొని అందులోకి వేరే వారు రాకుండా ముందే రింగ్ అవుతుంటారు. దీన్ని అతిక్రమిస్తే వారిలో వారు పర స్పరం దాడు లకు పాల్పడటం రివాజుగా మారుతోంది. ఇలా ఇటీవల నాంపల్లి రైల్వే స్టేషను పరిధిలో రెండు యాచక వర్గాల మధ్య జరిగిన దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో ఎవరైనా వారిని నివారించే ప్రయత్నం చేస్తే వారంతా ఏకమై నచ్చజెప్పిన వారిపై దాడులకు దిగుతుంటారు. నిరోధం.. నిలిచి పోయింది ఎందుకు? సుమారు ఏడాది కిందట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా నగరంలో పర్యటించినప్పుడు అధికార యంత్రాం గం ప్రతిష్టాత్మకంగా భావించి ఓ ప్రత్యేక డ్రైవ్ ద్వారా యాచకులను నిరోధించింది. వారిని పోలీసులు పట్టుకొని చర్లపల్లి జైలుకు తరలించారు. అనంతరం జీహెచ్ఎంసీ ఉన్నత అధికారులు కూడా బెగ్గింగ్ ఫ్రీ సిటీ కోసం కొన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. అయినా నగరంలో వారి సంఖ్య తగ్గలేదు. పునరావాస చర్యలు లేవు. అసలు ఎవరు బాధ్యత తీసుకోవాలి..తీసుకుంటే వారి పునరావాసం ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేక నిధులు, బాధ్యతలు లేక పోవడంతో అధికార యంత్రాంగం కూడా తమకెందుకులే అనే నిర్లిప్త ధోరణిలో వ్యవహరిస్తోంది. ఇదే అభిప్రాయాన్ని పేరుచెప్పడానికి ఇష్టపడని ఓ జీహెచ్ఎంసీ అధికారి వెల్లడించారు. తమకు ఒక దిశా నిర్దేశం, నిర్దిష్ట ప్రణాళిక లేనప్పుడు తాము మాత్రం ఏం చేస్తామని ఎదురు ప్రశ్నించారు. పోలీసులు కూడా వీరిపై చర్యలకు ఉపక్రమిస్తున్నా అది తాత్కాలికమే అవుతోంది. ఒక్కో మారు వారూ యాచకులనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న ఉదంతాలూ ఉన్నాయి. ఈ పరిస్థితులను తక్షణం చక్కదిద్దాల్సిన ఆవశ్యకత ఉందని నగర వాసులు కోరుతున్నారు. -
సుప్రీంకోర్టుపైనే నిందలు వేస్తున్నారు!
రాయ్‌బరేలీ / ప్రయాగ్‌రాజ్: ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై సుప్రీంకోర్టు నుంచి క్లీన్‌చీట్ లభించిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ విపక్ష కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం తప్పుడు వివరాలు సమర్పించినందున రఫేల్ కేసును మళ్లీ విచారించాలని కాంగ్రెస్ నేతలు కోరడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును అబద్ధాలకోరుగా చిత్రీకరించేందుకు యత్నిస్తోందని విమర్శించారు. దేశ భద్రతాబలగాలు పటిష్టం కావడం ఇష్టంలేని శక్తులతో ఆ పార్టీ జతకడుతోందని ఆరోపించారు. ‘కొందరు వ్యక్తులు కేవలం అబద్ధాలనే నమ్ముతారు.. దాన్నే ఇతరులకు వ్యాప్తి చేస్తారు’ అంటూ రామచరితమానస్‌ను ఉటంకించారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆదివారం సోనియాగాంధీ నియోజకవర్గం రాయ్‌బరేలీలో రూ.1,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం రాయ్‌బరేలీతో పాటు ప్రయాగ్ రాజ్(అలహాబాద్)లో నిర్వహించిన బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఖత్రోచీ, మిషెల్ మామయ్యలు లేరు.. ‘సుప్రీంకోర్టును అబద్ధాల కోరుగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. వీళ్ల దృష్టిలో రక్షణశాఖ, రక్షణమంత్రి, ఐఏఎఫ్ అధికారులు, ఫ్రాన్స్ ప్రభుత్వం.. ఇలా అందరూ అబద్ధాలు చెప్పేవారే. తాజాగా వీళ్లకు సుప్రీంకోర్టు అబద్ధాలు చెబుతున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు భారత భద్రతాబలగాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంటే, మరోవైపు మాత్రం కొన్ని శక్తులు దేశాన్ని ఎలాగైనా బలహీనపర్చేందుకు కంకణం కట్టుకున్నాయి. కొందరు నేతల వ్యాఖ్యలకు పాకిస్తాన్ నుంచి ప్రశంసలు లభించడం వెనుక అర్థం ఏమిటి?’ అని మోదీ ప్రశ్నించారు. బోఫోర్స్, అగస్టా కుంభకోణాలను ప్రస్తావిస్తూ..‘కాంగ్రెస్ నేతలు అదేపనిగా ఎందుకు అబద్ధాలు చెబుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా. బీజేపీ ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఒప్పందాల్లో ఖత్రోచీ(బోఫోర్స్ మధ్యవర్తి), మిషెల్(అగస్టా మధ్యవర్తి) వంటి మామయ్యలు లేరనా? ఆ మిషెల్ మామయ్యను కూడా భారత్‌కు పట్టుకొచ్చాం’ అని అన్నారు. సుప్రీంకోర్టు జడ్జీలనే బెదిరించారు.. ‘ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ఓ పార్టీ(కాంగ్రెస్) తాము చట్టం, న్యాయానికి అతీతులమనీ, దేశం, ప్రజల కంటే గొప్పవాళ్లమని భావిస్తోంది. తమ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోని ప్రతీ రాజ్యాంగ సంస్థలను, వ్యవస్థలను వాళ్లు నాశనం చేశా రు. ఇందులోభాగంగా భారత న్యాయవ్యవస్థను సైతం బలహీనపర్చేందుకు ప్రయత్నా లు జరిగాయి’ అని మోదీ విమర్శించారు. రైతుల సమస్యలు పట్టించుకోలేదు.. ‘జవాన్లు, రైతుల్లో ఎవ్వరినీ కాంగ్రెస్ పట్టించుకోలేదు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఆరునెలైనా రుణమాఫీ కాలేదు. అంతేకాకుండా రైతులకు అరెస్ట్ వారెంట్లు జారీచేస్తున్నారు’ అని తెలిపారు. -
వంశీచంద్‌రెడ్డిపై దాడి
ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి పోలింగ్‌బూత్ వద్ద శుక్రవారం ఉదయం కల్వకుర్తి నియోజకవర్గ కాం గ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటనలో ఆయన గాయపడ్డారు. దీంతో ఆయనకు ఆమనగల్లు ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి అనంతరం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. జంగారెడ్డిపల్లిలోని పోలింగ్‌బూత్ వద్దకు వంశీచంద్‌రెడ్డి చేరుకుని క్యూలో ఉన్న ఓటర్లకు అభివాదం చేస్తూ బూత్ లోపలికి వెళ్లారు. దీనికి బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. క్యూలో ఉన్న వారికి కాంగ్రెస్‌కు ఓటేయమని వంశీచంద్‌రెడ్డి ప్రచారం చేశారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. తాను అభ్యర్థినని పోలింగ్‌బూత్‌లోకి వెళ్లడానికి అనుమతి ఉందని చెప్పడంతో ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పోలింగ్ బూత్‌లోకి దూసుకువచ్చి ఆయనతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని వంశీ చంద్‌ను బయటకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అక్కడే ఉన్న వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. జాతీయ రహదారిపై రాస్తారోకో బీజేపీ కార్యకర్తల దాడిలో వంశీచంద్‌రెడ్డి గాయపడ్డారని తెలియడంతో కాంగ్రెస్, టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో ఆమనగల్లు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ఆయనను నిమ్స్‌కు తరలించిన అనంతరం జాతీయ రహదారిపైకి చేరుకున్న నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించా రు. సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐ మల్లీశ్వర్‌లు, పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని కాం గ్రెస్, టీడీపీనేతలను సముదాయించారు. నిమ్స్‌లో నేతల పరామర్శ నిమ్స్‌లో చేరిన వంశ్చంద్ను కాంగ్రెస్ నేతలు జైపాల్‌రెడ్డి, వీహెచ్, కేవీపీ, కోదండరెడ్డి, టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి పరామర్శించారు. చికిత్స అనంతరం వంశీచంద్‌రెడ్డి ప్రైవేట్ అంబులెన్స్‌లో ఓటు వేసేందుకు స్వగ్రామానికి వెళ్లారు. చికిత్స తీసుకుంటున్న వంశీచంద్‌రెడ్డి -
వాద్రా సంబంధీకులపై ఈడీ దాడులు
న్యూఢిల్లీ: రక్షణ ఒప్పందాల్లో కమీషన్లు తీసుకున్నారన్న ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా సంబంధీకుల ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఢిల్లీ, బెంగళూరులోని పలుచోట్ల శుక్రవారం ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. వాద్రా, మరో వ్యక్తికి చెందిన సంస్థల్లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రక్షణ కొనుగోళ్ల ఒప్పందాల్లో వారు కమీషన్లు తీసుకున్నట్లు అనుమానిస్తున్నామని, ఆ డబ్బుతో వారు విదేశాల్లో ఆస్తులు కొన్నట్లు ఆరోపణలున్నాయని తెలిపారు. వారి ఇళ్లల్లోనే సోదాలు జరపడానికి తగిన సాక్ష్యాలు సేకరించినట్లు చెప్పారు. అయితే ఎవరి ఇళ్లపై దాడులు జరిపినదీ, ఏ రక్షణ ఒప్పందం కింద ఈ చర్యలు తీసుకున్నదీ వెల్లడించలేదు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో మధ్యవర్తి క్రిస్టియన్ మైకేల్‌ను యూఏఈ భారత్‌కు అప్పగించిన నాలుగు రోజుల తరువాత ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీకి ఓటమి భయం: కాంగ్రెస్ తాజా సోదాలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో మోదీ..వాద్రాపై రాజకీయ కక్షకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఇలాంటి చర్యలకు తాము భయపడేది లేదని తేల్చిచెప్పింది. వాద్రా లాయర్ జ్యోతి ఖైతాన్ కూడా ఈడీ అధికారుల తీరును తప్పుపట్టారు. సెర్చ్ వారంట్లు లేకుండానే ఈడీ అధికారులు వాద్రా సంబంధీకుల ఇళ్లలోకి ప్రవేశించి లోపలి నుంచి తాళం వేశారని ఆరోపించారు. ఈ చర్య వెనక ప్రభుత్వ పాత్ర ఉండొచ్చని సందేహం వ్యక్తం చేశారు. లేని సాక్ష్యాల్ని సృష్టించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. -
యూపీలో రెచ్చిపోయిన గోరక్షక ముఠా
బులంద్‌షహర్: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో గోరక్షక ముఠా రెచ్చిపోయింది. ఓ మతానికి చెందిన ప్రజలు ఆవును చంపేశారని ఆరోపిస్తూ రోడ్డును దిగ్బంధించి ఆందోళనకు దిగింది. ట్రాఫిక్‌ను పునరుద్ధరించడానికి అక్కడకు చేరుకున్న పోలీసులపై రాళ్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా స్థానిక పోలీస్ ఔట్‌పోస్ట్‌తో పాటు పలు వాహనాలకు నిప్పంటించింది. ఈ ఘటనలో పోలీస్ ఇన్స్పెక్టర్తో పాటు మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. మీరట్ జోన్ అదనపు డీజీపీ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. ‘బులంద్ షహర్ జిల్లా మెహౌ గ్రామం దగ్గర సోమవారం ఆవు కళేబరం కనిపించింది. దీంతో ఓ మతానికి చెందినవారు ఆవును చంపేశారని ఆరోపిస్తూ హిందుత్వ సంస్థల సభ్యులు కొందరు ఆ ఎముకల్ని ట్రాక్టర్లో వేసుకుని ఛింగర్వతి పోలీస్‌స్టేషన్ దగ్గరకు తీసుకొచ్చారు. తర్వాత బులంద్‌షెహర్–గఢ్ రాష్ట్ర రహదారిని దిగ్బంధించారు. దీంతో జిల్లా కలెక్టర్ అనూజ్ కుమార్, సబ్‌డివిజినల్ మేజిస్ట్రేట్ అవినాశ్ కుమార్ రంగంలోకి దిగి ఆందోళనకారులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. అంతలోనే ఒక్కసారిగా రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. పోలీస్ ఔట్‌పోస్ట్‌తో పాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ సందర్భంగా దుండగుల దాడిలో ఇన్స్పెక్టర్ సుబోధ్ కుమార్ మరణించారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమిత్ అనే యువకుడు చనిపోయాడు. -
అడ్డంకులు, ఆలస్యం వారి నైజం
గుర్‌గ్రామ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. అడ్డంకులు సృష్టించడం ద్వారా ప్రాజెక్టులను జాప్యం చేసి ప్రజలను మోసగించిందని విమర్శించారు. సోమవారం ఆయన హరియాణా రాష్ట్రం గుర్‌గ్రామ్ జిల్లాలోని 83 కిలోమీటర్ల కుండ్లి–మనేసర్–పల్వాల్ (కేఎంపీ) ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు. అనంతరం సుల్తాన్‌పూర్‌లో జరిగిన సభలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 3.2 కిలోమీటర్ల వల్లభ్‌గఢ్– ముజేసర్ మెట్రో రైల్ లింక్ ప్రారంభోత్సవం, పల్వాల్ జిల్లాలో శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘హర్యానా ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన రోజు. చేపట్టిన పనిని దృఢ సంకల్పంతో పూర్తి చేయడమనే మా ప్రభుత్వ వైఖరితోపాటు గత పాలకులు ఇదే పనిని అసంపూర్తిగా వదిలేసిన తీరును మనం ఇక్కడ గమనించాలి. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 9 ఏళ్ల క్రితమే ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడల సమయంలోనే పూర్తి కావాల్సి ఉంది. కానీ, అలా జరగలేదు. 12 ఏళ్లు పట్టింది. అంచనా వ్యయం రూ.1,200 కోట్ల నుంచి భారీగా పెరిగిపోయింది. కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో (సీడబ్ల్యూజీ కుంభకోణం) జరిగిందే, ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలోనూ చోటుచేసుకుంది. అవాంతరాలు కల్పించడం, తప్పుదోవ పట్టించడం, ఆలస్యం చేయడం (అట్కానా, భట్కానా, లట్కానా) గత పాలకుల నైజం. దీనివల్ల రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రజల డబ్బు వృథా కావడంతోపాటు, ప్రజలకు అన్యాయం ఎలా జరిగిందో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 135 కిలోమీటర్ల పొడవైన కేఎంపీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.6,400 కోట్లు వెచ్చించింది. దీనిలోని 52 కిలోమీటర్ల రహదారి 2016లోనే అందుబాటు లోకి వచ్చింది. వల్లభ్‌గఢ్– ముజేసర్ మెట్రో రైల్ లింక్ నిర్మాణానికి రూ.580 కోట్లు ఖర్చు కాగా, శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి రూ.989 కోట్లు కేటాయించారు. జాతీయ రాజధాని ప్రాంతంలోని కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి రావడంతో ఢిల్లీకి వాహనాల రాకపోకల రద్దీ గణనీయంగా తగ్గడంతోపాటు రాజధాని ప్రాంతంలో కాలుష్యం కూడా తగ్గుముఖం పట్టనుంది. పూర్తికాని కేఎంపీతో ముప్పు: కాంగ్రెస్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అసంపూర్తి కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వేను చట్టవిరుద్ధంగా ప్రారంభించి ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల సమయంలో తక్షణ లబ్ధి పొందే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ ఎక్స్‌ప్రెస్‌వేపై రాకపోకలను ప్రారంభించారని విమర్శించింది. -
కాంగ్రెస్‌లో బయటి అధ్యక్షులు చాలామంది ఉన్నారు
న్యూఢిల్లీ: నెహ్రూ–గాంధీ కుటుంబానికి సంబంధంలేని చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తెలిపారు. ఇలాంటి విషయాలను వదిలేసి రాఫెల్ ఒప్పందం, నిరుద్యోగం, మూకహత్యలు, యాంటీ రోమియా గూండాలు, ఉగ్రదాడులు, బీజేపీ హయాంలో రైతుల ఆత్మహత్యలపై స్పందించాలని ప్రధాని మోదీకి చురకలు అంటించారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఐదేళ్లు గాంధీయేతర వ్యక్తికి కేటాయించాలన్న మోదీ సవాల్‌పై ఆయన ఈ మేరకు స్పందించారు. బీఆర్ అంబేడ్కర్, లాల్‌బహదూర్ శాస్త్రి, కామరాజ్ నాడార్, మన్మోహన్ సింగ్, పట్టాభి సీతారామయ్య, పీవీ నరసింహారావు వంటి హేమాహేమీ నేతలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారని చిదంబరం గుర్తుచేశారు. -
దాడి మీడియా లక్ష్యంగా కాదు: మావోలు
రాయ్‌పూర్: దూరదర్శన్ కెమెరామన్ అచ్యుతానంద్ సాహు, మరో ఇద్దరు మీడియా సిబ్బందితో పాటుగా పోలీసులపై ఈ నెల 30న జరిగిన దాడికి బాధ్యత వహిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. మావోయిస్టు దర్భా డివిజన్ కమిటీ కార్యదర్శి సాయినాథ్ పేరుతో రెండు పేజీల లేఖను ఆ పార్టీ వెల్లడించింది. ఆ దాడి మీడియా లక్ష్యంగా జరిగింది కాదని, పోలీసుల లక్ష్యంగానే దాడి జరిగినట్లు పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి మీడియా వ్యక్తులు వచ్చేటప్పుడు పోలీసులను వెంటపెట్టుకురావొద్దని ఆ పార్టీ కోరింది. అక్టోబర్ 30న నక్సల్స్ జరిపిన దాడిలో ముగ్గురు పోలీసులు, దూరదర్శన్ కెమెరామన్ అచ్యుతానంద్ సాహు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పోలీసులే లక్ష్యంగా దాడి చేస్తే చేతిలో కెమెరా పట్టుకున్న అచ్యుతానంద్ సాహుపై కూడా మావోయిస్టులు కాల్పులెందుకు జరిపారని ఆ రాష్ట్ర స్పెషల్ డైరెక్టర్ జనరల్ డీఎం అవస్థి తీవ్రంగా స్పందించారు. -
హింసాత్మక చర్యలకు పాల్పడకండి
అహ్మదాబాద్: హిందీ మాట్లాడే వలసదారుల భద్రత కోసం అదనపు బలగాలను మోహరించామనీ, సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన హిందీ భాషీయులు తిరిగి గుజరాత్‌కు రావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విజ్ఞప్తి చేసింది. హిందీ మాట్లాడేవారిపై దాడులకు పాల్పడిన 431 మందిని ఇప్పటికే అరెస్టు చేశామంది. ఎలాంటి హింసాత్మక చర్యలకూ పాల్పడొద్దని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ప్రజలను కోరారు. గుజరాత్లో జరిగిన ఓ అత్యాచార ఘటన వల్ల అక్కడక్కడ జరిగిన దాడుల నేపథ్యంలో దాదాపు 20 వేల మంది హిందీ మాట్లాడే వలస కూలీలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. అయితే గత 48 గంటల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోలేదని రూపానీ తెలిపారు. వలస కూలీల భద్రత కోసం పరిశ్రమల ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు రాష్ట్ర హోంమంత్రి ప్రదీప్‌సిన్హా జడేజా తెలిపారు. సెప్టెంబర్ 28న గుజరాత్‌లోని సాబర్కాంఠా జిల్లాలో 14 నెలల బాలికపై అత్యాచారం జరిగింది. రూపానీతో మాట్లాడిన నితీశ్ గుజరాత్లో హిందీ మాట్లాడేవారిపై జరుగుతున్న దాడుల విషయమై సీఎం విజయ్ రూపానీతో బిహార్ సీఎం నితీశ్‌కుమార్ మాట్లాడారు. ఈ దాడులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాలికపై జరిగిన దాడిని ఖండించారు. నిందితుడికి శిక్ష పడాల్సిందేనని, అయితే ఒక్కరు చేసిన తప్పునకు మొత్తం వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడుల చేయడం సరికాదన్నారు. దాడుల గురించి గుజరాత్ సీఎంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోన్ చేసి మాట్లాడారు. వారి భద్రతపై అక్కడి ప్రభుత్వం పూర్తి భరోసా ఇచ్చిందని యోగి చెప్పారు. -
‘భాగీదార్’.. అభినందనే..!
లక్నో: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనను ‘చౌకీదార్–భాగీదార్’ అంటూ చేసిన విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. తనను భాగీదార్ అని పిలవడాన్ని అభినందన (మెచ్చుకోలు)గా స్వీకరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. శనివారం లక్నోలో మూడు కేంద్ర ప్రథకాల తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘ఈ మధ్య కొందరు నన్ను.. చౌకీదార్ (కాపలాదారు) కాదు భాగీదార్ (వాటాదారు) అని అంటున్నారు. నన్ను వాటాదారు అన్నందుకు సంతోషంగా ఉంది. పేదల కష్టాల్లో భాగస్వామిగా ఉన్నందుకు ఆనందిస్తున్నా. ఈ ఆరోపణలను గౌరవంగా భావిస్తున్నా. పేదలు, శ్రామికులు, ఓ బాధపడుతున్న తల్లి, ప్రకృతి ప్రకోపానికి గురైన పేద రైతు, ఎర్రటి ఎండలో, ఎముకలు కొరికే చలిలో దేశరక్షణలో నిమగ్నమైన జవాను ఎదుర్కొంటున్న కష్టాల్లో భాగస్వామిగా ఉండటం గొప్ప విషయం. వైద్య అవసరాల కోసం ఉన్న భూమిని అమ్ముకున్న ఓ పేద కుటుంబంలో భాగస్వామిని’ అని పేర్కొన్నారు. 2022 కల్లా దేశవ్యాప్తంగా ఇళ్లు లేని పేదలకు నివాసాన్ని కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతోనూ ఆయన మాట్లాడారు. తన ప్రసంగంలోనూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలనే ప్రస్తావించారు. పట్టణాల్లో ప్రజాజీవనాన్ని మెరుగుపరిచేందుకు పరిశోధనశాలగా లక్నోను మార్చారంటూ మాజీ ప్రధాని వాజ్‌పేయిని ప్రశంసించారు. తమ ప్రభుత్వం దేశ యువత కోసం ఐదు ‘ఈ’ (ఈజ్ ఆఫ్ లివింగ్ (జీవనానుకూల), ఎడ్యుకేషన్ (విద్య), ఎంప్లాయ్మెంట్ (ఉపాధి), ఎకానమీ (ఆర్థిక), ఎంటర్టైన్మెంట్ (వినోదం)) ల మంత్రంతో ముందుకెళ్తోందన్నారు. ఆదివారం లక్నోలో జరగనున్న దాదాపు రూ. 60వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ప్రధాని పాల్గొననున్నారు. అంతకుముందు ఆయన పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొననున్నారు. -
వేబ్రిడ్జి మోసాలపై తూనికలశాఖ కొరడా!
సాక్షి, హైదరాబాద్: వేబ్రిడ్జిల్లో మోసాలపై తూనికలు కొలతలశాఖ కొరడా ఝళిపించింది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా తూనికల కొలతలశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ‘వేబ్రిడ్జిలో తూకం తగ్గుతోంది’ అని ఈ నెల 18న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. తూకంలో మోసం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న 35 వేబ్రిడ్జిలపై తూనికలు, కొలతల శాఖ అధికారులు కేసు నమోదు చేసి సీజ్ చేశారు. రీజినల్ డిప్యూటీ కంట్రోలర్ శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ జగన్మోహన్ నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో ఆటోనగర్‌లోని పంతంగి వేబ్రిడ్జి, సాగర్ రింగ్‌రోడ్డులోని జై హనుమాన్ వే బ్రిడ్జి, కర్మన్‌ఘాట్‌లోని ఫైసల్ వేబ్రిడ్జి, శంషాబాద్‌లోని రామధర్మకాంట, గోల్డెన్ వేబ్రిడ్జిల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని గుర్తించారు. జై హనుమాన్ వేబ్రిడ్జి వద్ద తనిఖీలో యజమాని, కంప్యూటర్ ఆపరేటర్, లారీ డ్రైవర్లు కుమ్మకైన విషయం వెలుగు లోకి రావడంతో అధికారులు నివ్వెరపోయారు. దీనిపై వారు మరింత లోతుగా తనిఖీలు చేశారు. కంప్యూటర్లో ఎంత బరువు నమోదు చేస్తే అంతే వేబ్రిడ్జి తూకం చూపించేట్టుగా చేయడాన్ని అధికారులు గుర్తించారు. -
దళితులపై నేరాలు ఎనిమిదింతలు
ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం–1989 కింద నిందితుల్ని తక్షణ అరెస్ట్ చేయరాదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 2006తో పోల్చుకుంటే 2016 నాటికి దళితుల(ఎస్సీ)పై నేరాలు 746 శాతం (8 రెట్లు) పెరిగాయని ఇండియా స్పెండ్ అనే సంస్థ తెలిపింది. ఇక ఆదివాసీల(ఎస్టీ)పై నేరాల సంఖ్య ఈ పదేళ్లలో 1,160 శాతం(12 రెట్లు) పెరిగాయని వెల్లడించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) 2016లో విడుదల చేసిన గణాంకాలను విశ్లేషించిన అనంతరం ఈ నివేదికను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశజనాభాలో 20.1 కోట్ల మంది(16.6 శాతం) దళితులు, 10.4 కోట్ల మంది(8.6 శాతం) ఆదివాసీలు ఉన్నారు. మధ్యప్రదేశ్ టాప్ 2006–16 మధ్య దేశవ్యాప్తంగా దళితులపై 4,22,799 నేరాలు జరిగాయి. గోవా, కేరళ, ఢిల్లీ, గుజరాత్, బిహార్, మహారాష్ట్ర, జార్ఖండ్, సిక్కిం రాష్ట్రాల్లో ఈ నేరాల సంఖ్య 10 రెట్లు పెరిగిందని ఆ సంస్థ వెల్లడించింది. దళితులపై జరిగిన నేరాల్లో మధ్యప్రదేశ్(43.4%), గోవా (43.2%), రాజస్తాన్(42%) రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయంది. ఇక ఆదివాసీలపై 37.5% నేరాలతో కేరళ తొలిస్థానంలో నిలవగా, అండమాన్–నికోబార్ దీవులు (21%), ఆంధ్రప్రదేశ్ (15.4%) తర్వాతి స్థానాల్లో నిలిచాయంది. దేశవ్యాప్తంగా ఈ పదేళ్లలో ఆదివాసీలపై 81,322 నేరాలు జరగగా.. వాటిలో అత్యధికం కేరళ, కర్ణాటక, బిహార్ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయంది. పోలీస్స్టేషన్లలో ఆదివాసీలకు సంబంధించి 405 పెండింగ్ కేసులతో ఏపీ మొదటిస్థానంలో నిలిచిందంది. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ,ఎస్టీలపై జరుగుతున్న నేరాల్లో దోషుల సంఖ్య 10 శాతానికి మించడం లేదని తెలిపింది. కొండలా పేరుకుపోతున్న కేసులు దళితులు, ఆదివాసీలపై ఈ పదేళ్లలో నేరాలు పెరిగినప్పటికీ.. పోలీస్స్టేషన్లు, కోర్టుల్లో అదే స్థాయిలో కేసుల పరిష్కారం జరగడంలేదని నివేదిక స్పష్టం చేసింది. దళితుల ఫిర్యాదులపై పోలీస్స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులు ఈ పదేళ్లలో 99 శాతం పెరిగాయని, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు 50 శాతం పెరిగాయని తెలిపింది. 4,311 పెండింగ్ కేసులతో బిహార్ దేశంలోనే తొలిస్థానంలో ఉంది. తప్పుడు కేసులు అంతంతే: దళితులు నిందితులపై పెట్టిన తప్పుడు కేసు ల సంఖ్యలో ఈ పదేళ్లలో ఎలాంటి పెరుగుదల లేదని ఆ నివేదిక తెలిపింది. 2006–16 మధ్య దళితులు పెట్టిన కేసుల్లో 5,347 తప్పుడు కేసులుగా తేలాయంది. వీటిలో రాజస్తాన్ 2,632 కేసులతో ముందుంది. శిక్షపడుతున్న సందర్భాలు చాలా తక్కువ దేశవ్యాప్తంగా దళితులు, ఆదివాసీలపై నేరాలకు పాల్పడిన ఘటనల్లో దోషులుగా తేలుతున్నవారి సంఖ్య 30 శాతానికి మించడం లేదు. దళితులపై జరిగిన నేరాల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 2006లో 28 శాతం ఉండగా, 2016 నాటికి 26 శాతానికి పడిపోయిందని ఆ నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కిం, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, ఒడిశా, గుజరాత్, తమిళనాడు, గోవా, కేరళ రాష్ట్రాల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 10 శాతానికి మించడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే 2006లో ఆదివాసీలపై నేరాల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 28 శాతం ఉండగా, 2016 నాటికి ఇది 21 శాతానికి పడిపోయిందని పేర్కొంది. పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేయడం, విచారణలో జాప్యం, బాధితులకు రక్షణ లేకపోవడం, ఎస్సీ, ఎస్టీ చట్టంలో సరైన సెక్షన్ల కింద కేసు నమోదుచేయకపోవడం కారణంగానే చాలామంది నేరస్తులు శిక్షపడకుండా తప్పించుకుంటున్నారంది. –సాక్షి నేషనల్ డెస్క్ -
ఫ్రాన్స్‌లో ఉగ్రదాడి..ముగ్గురు మృతి
-
ఫ్రాన్స్‌లో ఉగ్రదాడి
పారిస్: అనుమానిత ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాది ఒకరు ఫ్రాన్స్‌లో పేట్రేగిపోయాడు. ఒక్కరోజే మూడు చోట్ల దాడులకు పాల్పడి ముగ్గురిని బలిగొన్నాడు. తొలుత ఓ కారును హైజాక్ చేసి అందులో ప్రయాణిస్తున్న వ్యక్తిని చంపి డ్రైవర్‌ను గాయపరిచాడు. ఆ తరవాత జాగింగ్ చేస్తున్న పోలీసు అధికారిపై కాల్పులకు దిగాడు. ఆ తర్వాత ఓ సూపర్ మార్క్‌ట్‌లోకి ప్రవేశించి కాల్పులకు ఒడిగట్టి ఇద్దరిని హత్య చేశాడు. మరికొందరిని బందీలుగా తీసుకుని సుమారు మూడు గంటల పాటు తీవ్ర కలకలం సృష్టించాడు. చివరకు పోలీసుల కాల్పుల్లో సూపర్ మార్కెట్లోనే హతమ య్యాడు. కార్కసోన్, దాని సమీపంలోని ట్రెబ్స్ పట్టణాల్లో శుక్రవారం ఉదయం ఐఎస్ సాయుధుడు ఈ వరస దాడులకు పాల్పడ్డాడు. నిందితుడు మొరాకో పౌరుడని విచారణాధికారులు గుర్తించారు. అతను ఉగ్రవాదుల వాచ్ లిస్టులో ఉన్నట్లు తెలిసింది. ఈ దాడులను తీవ్రమైనవిగానే పరిగణిస్తున్నామని ఫ్రాన్స్ ప్రధాని ప్రకటించారు. దుండగుడు ఐఎస్ కోసం పనిచేస్తున్నట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. -
లంబాడీల ‘ఆత్మగౌరవ ర్యాలీ’
కొత్తగూడెం: రాష్ట్రంలో లంబాడీలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన బంజారా జేఏసీ నాయకులు, కార్యకర్తలు గురువారం లక్ష్మీదేవిపల్లి నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ‘ఆత్మగౌరవ ర్యాలీ’ నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎస్పీ అంబర్‌కిషోర్ ఝాకు వినతిపత్రాలు అందజేశారు. అన్నదమ్ముల్లా కలసి ఉన్న లంబాడీలు, కోయలు, గోండుల మధ్య గొడవలు లేపుతూ శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నారని లంబాడీ నాయకులు వ్యాఖ్యానించారు. -
పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాలి
– ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం – ఆర్‌యూలో ఏఐఎస్ఎఫ్ మౌన దీక్ష కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించి బుద్ధిచెప్పాలని ఏబీవీపీ జిల్లా కోకన్వీనర్ మహేంద్ర కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సోమవారం ఉగ్రవాదుల దాడిలో అమరులైన 17 మంది జవాన్లకు ఏబీవీపీ ఆధ్వర్యంలో సంతాపం తెలిపారు. అనంతరం రాజ్‌విహార్‌లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. పాకిస్తాన్‌కు భారత సైన్యాన్ని ఎదురుకునే శక్తి లేక దొంగచాటు దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. పాక్ చర్యలను ప్రపంచ దేశాలు ఖండించాలని, ఆ దేశానికి సహాయ సహకారాలను నిలిపి వేయాలని కోరారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి గణేష్, సెంట్రల్ జోన్ ఇన్చార్జి భరత్, నగర సహాయ కార్యదర్శి హర్మన్రెడ్డి, నాయకులు రఫీ, మధు, రామదాసు, లక్ష్మణ్ పాల్గొన్నారు. ఆర్‌యూలో ఏఐఎస్ఎఫ్ మౌన దీక్ష ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ రాయలసీమ యూనివర్సిటీలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు. అమరులైన జవాన్లకు ప్రిన్సిపాల్ కార్యాలయం ఎదుట సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మహేంద్ర మాట్లాడుతూ..ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్ర దాడిలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఉసేన్‌బాషా, రామకష్ణ, కష్ణమూర్తి, శంకరాచారి, ఉస్మాన్ పాల్గొన్నారు. -
మట్కా గ్యాంగ్‌లపై పోలీసుల దాడులు
నంద్యాల: నంద్యాల ప్రాంతంలోని మట్కా గ్యాంగ్‌లపై పోలీసులు దాడులు చేసి 8మందిని అరెస్ట్ చేశారు.రూ.లక్షను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం డీఎస్పీ హరినాథరెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. స్థానిక బైర్మల్‌వీధి పాత దీపక్ లాడ్జి ప్రాంతంలోని ఇంట్లో మట్కా ఆర్గనైజర్ గొల్ల శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో సహా గ్యాంగ్‌ను నడుపుతున్నట్లు సమాచారం అందడంతో రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి, వన్‌టౌన్ ఎస్ఐ రమణ దాడులను నిర్వహించారని చెప్పారు. గొల్ల శ్రీనివాసులుతో పాటు అతని భార్య పుష్పావతమ్మను అరెస్ట్ చేసి రూ.74,900, రెండు సెల్ఫోన్లను, మట్కా చీటిలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మట్కా బీటర్లు షేక్‌అక్బర్(రాణి మహారాణి ఏరియా) నుంచి రూ.6,300, కొప్పరి ఏసుదాసు, దాట్ల వెంకటేశ్వర్లు(కొత్తపల్లె) నుంచి రూ.7950, అల్ల బ్రహ్మానందరెడ్డి(పొన్నాపురం) నుంచి రూ.3100, షేక్‌జాకీర్(నందమూరినగర్) నుంచి రూ.2400, కమ్మకాపు అశోక్ (వీసీకాలనీ) నుంచి రూ.5600 నగదును, మట్కా చీటిలను, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దాడులు నిర్వహించిన సీఐ మురళీధర్, ఎస్ఐలు గోపాల్‌రెడ్డి, రమణా, హెడ్‌కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, సుధీష్, కానిస్టేబుళ్లు మల్లికార్జున, నాగరాజు, శ్రీనివాసులు, చంద్రశేఖర్, మద్దిలేటి, భూమా కుమారిలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.