
గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ గోరఖ్‌నాథ్ ఆలయం వద్ద దుండగుడి హల్‌చల్‌తో కలకలం రేగింది. ముర్తజా అబ్బాసీ అనే ఐఐటీ గ్రాడ్యుయేట్ సోమవారం సాయంత్రం ప్రధాన ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించాడు. అడ్డుకున్న ఇద్దరు భద్రతా సిబ్బందిని వెంట తెచ్చుకున్న కొడవలితో గాయపరిచాడు. భద్రతాసిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిని ఉగ్రకుట్రగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆ సమయంలో భక్తులతో ఆలయ ప్రాంగణం నిండి ఉందని పోలీసులు తెలిపారు.
పథకం ప్రకారమే అక్కడికి చేరుకున్న ముర్తజా ఆలయం లోపలికి ప్రవేశించి ఉంటే జరిగే పరిణామాన్ని ఊహించలేమన్నారు. అతడి వద్ద లభ్యమైన పత్రాలు సంచలనం కలిగించేవిగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ముర్తజాను స్థానిక కోర్టు రెండు వారాల జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించింది. ముర్తజా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని అతడి తండ్రి మునీర్ అంటున్నారు.