హెచ్ఐవీ ఉందని.. భార్యాపిల్లల్ని చంపేశాడు
తనను కబళించిన ఎయిడ్స్.. కుటుంబ సభ్యులకు కూడా సోకిందని.. విషయం నలుగురికీ తెలిస్తే పరువుపోతుందని భావించి భార్యాపిల్లల్ని సజీవదహనం చేశాడో ఐఐటీ గ్రాడ్యుయేట్. అనంతరం తాను ఆత్మహత్య చేసుకోవాలనుకొని ఆస్పత్రి పాలయ్యాడు. అయితే చివరికి వైద్యుల పరీక్షల్లో అతనికి హెచ్ఐవీ లేదని తేలింది! ప్రస్తుతం చికిత్స పొందుతున్న అతను.. తాను చేసింది ఘోర తప్పిదమని విలపిస్తూ అసలేం జరిగిందో చెప్పాడు..
'నా పేరు ప్రవీణ్ మన్వర్. ఐఐటీ గ్రాడ్యూయేట్ను. మధ్యప్రదేశ్‌లోని బెతుల్ సిటీలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. నా భార్యపేరు శిల్ప. ఇద్దరు పిల్లలు.. శర్వాణి (9), ప్రణీతి (2) . ఆనందంగా సాగుతోన్న మా జీవితంలో అల్లకల్లోలం చెలరేగడానికి కారణం గతంలో నేను చేసిన ఓ భారీ పొరపాటు..! ఉద్యోగ నిమిత్తం అప్పుడప్పుడూ ఢిల్లీ టూర్‌కు పోయేవాణ్ణి. అలా అక్కడి రెడ్ లైట్ ఏరియాకు వెళ్లడం అలవాటైంది.
ఎంత వద్దనుకున్నా ఆ అలవాటును మానుకోలేకపోయా. రెండు నెలల కిందట నా నోటిలో చిన్న పుండైంది. రోజులు గడిచేలోగా అది పెద్ద కురుపుగా మారింది. సడన్‌గా బరువు కోల్పోయాను కూడా. గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఈ లక్షణాలన్నీ హెచ్ఐవీ పాజిటివ్వేనని అర్థమైంది. రహస్యంగా ఓ ప్రైవేటు డయాగ్నస్టిక్స్ సెంటర్‌కు వెళ్లి రక్తపరీక్ష చేయించుకున్నా. రిజల్ట్స్ 'పాజిటివ్' అని తేలింది. షాక్‌కు గురైన నేను చాలా రోజులపాటు నాలో నేనే కుమిలిపోతూ ఆత్మహత్యకు ప్రయత్నించా. కానీ వీలుకాలేదు.
మరోవైపు తన అనుమానం నిజం కావద్దని భగవంతుడికి చేసిన ప్రార్థనలు ఫలించలేదు. భయపడిందే జరిగింది.. ఓ రోజు నా భార్యా పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. వాళ్లకు కూడా హెచ్ఐవీ పాజిటివ్ లక్షణాలే కనిపించాయి. దీంతో ధైర్యం చేసి నా భార్య శిల్పకు విషయం మొత్తం చెప్పా.
మొదట ఏడ్చి, గగ్గోలు పెట్టిన ఆమె.. రెండో రోజుకు నన్ను ఓదార్చింది. 'చస్తే అందరం కలిసే చద్దాం' అంది. నొప్పిలేకుండా ఆత్మహత్య చేసుకోవడం ఎలాగో గూగుల్‌లో సెర్చ్ చేశాం. వివరాలు దొరకలేదు. ఫిబ్రవరి 28న పిల్లల్ని వెంటబెట్టుకొని అమరావతి వెళ్లాం. అక్కడే అందరం ఉరి వేసుకొని చావాలనేది మా పథకం. అయితే పసి పిల్లలకు ఉరివేయడానికి మా ఇద్దరి చేతులూ ముందుకు రాలేదు. దాంతో ఆ ప్లాన్ ను తాత్కాలికంగా విరమించుకున్నా ఆత్మహత్యా ప్రయత్నాల్ని మాత్రం ఆపలేదు.
మార్చి 4న అమరావతి నుంచి మా సొంతూరు బెతుల్ కు బయలుదేరాం. కారులో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించా. స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ కావాలనే ఓ చెట్టును ఢీకొట్టా. పిల్లలు, శిల్పా, నేను సృహతప్పి పడిపోయాం. కొద్ది నిమిషాలకు నాకు మెలకువొచ్చింది. పగిలిన కిటికీ అద్దంలోంచి బయటికొచ్చిన నేను.. అగ్గి పుల్ల వెలిగించి కారును తగలబెట్టాను. అప్పుడే కళ్లు తెరిచిన పిల్లలు 'అమ్మా.. మంటలు..' అంటూ ఆర్తనాదాలు చేయడం నాకు వినిపిస్తూనే ఉంది. కానీ వాళ్లను కాపాడే ప్రయత్నం చేయలేదు. కాసేపట్లో నేనూ చనిపోవాలనుకున్నా.. కానీ ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని నన్ను ఆస్పత్రికి చేర్చారు. బయటికి వెళ్లిన తర్వాతైనా నేను చావాల్సిన వాడినే. కచ్చితంగా చనిపోతా' అంటూ తన గాథను వివరించాడు ప్రవీణ్ మన్వర్.
అయితే గురువారం వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ప్రవీణ్ కు ఎయిడ్స్ లేదని తేలింది. ఈ విషయం చెప్పినప్పుడు అతని ముఖంలో ఎలాంటి భావం కనిపించలేదని పోలీసులు చెప్పారు. ప్రవీణ్‌పై హత్యకేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఓ 'తప్పిదం' మూడు నిండు అమాయక ప్రాణాలు బలికావటం విషాదకరం.