లైంగిక వేధింపుల ఆరోపణలు.. సీఈవో రిజైన్
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులు ఆరోపణలు రావడంతో ది వైరల్ ఫివర్(టీవీఎఫ్) సీఈవో అర్నాబ్ కుమార్ బాధ్యతలకు గుడ్‌బై చెప్పారు. ఇక నుంచి సంస్థకు తాను మార్గ నిర్దేశకుడిగానే వ్యవహరిస్తానని చెప్పారు. ఆయన స్థానంలో కొత్త సీఈవోగా దావల్ గుసెయిన్ బాధ్యతలు చేపడతారని చెప్పారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
‘నాపై వ్యక్తిగత దాడి జరుగుతున్నందున సంస్థ ప్రతిష్టకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉన్నందున సీవీవో బాధ్యతల నుంచి నేను తప్పుకుంటున్నాను. నేను వ్యక్తికంటే సంస్థ గొప్పదని నమ్ముతాను’ అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. సంస్థకు మెంటర్‌గా మాత్రం అందుబాటులో ఉంటానని చెప్పారు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన అర్నాబ్ కుమార్ 2011లో టీవీఎఫ్ అనే వెబ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థను ప్రారంభించారు. అయితే, ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ అదే సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగిణి ఆరోపణలు చేసింది. దీంతో దానికి బాధ్యత వహిస్తూ తాజాగా బాధ్యతల నుంచి తప్పుకున్నారు.