సీఈఓపై లైంగిక వేధింపుల కేసు
సోషల్ మీడియాలో విపరీతంగా ఫిర్యాదులు.. మహిళల నుంచి లెక్కలేనన్ని కంప్లయింట్లు.. దాంతో ఒకప్పటి ఐఐటీ గ్రాడ్యుయేట్, 'ద వైరల్ ఫీవర్' (టీవీఎఫ్) సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అరుణబ్ కుమార్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. గుర్తుతెలియని మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అరుణబ్ కుమార్‌పై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అతడిపై ఫిర్యాదులు ఎవరు చేశారో వెల్లడించని పోలీసులు.. ఇంకా అరుణబ్‌ను అరెస్టు కూడా చేయలేదు.
అతడిపై సెక్షన్ 354 ఎ (లైంగిక వేధింపులకు పాల్పడటం), 509 (అసభ్య పదాలు, చేష్టలు, చర్యల ద్వారా ఒక మహిళ గౌరవానికి భంగం కలిగించడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ అశ్విని సనప్ తెలిపారు. వాస్తవానికి అతడిపై అత్యాచారయత్నం కేసు పెట్టాలని రిజ్వాన్ సిద్దిఖీ అనే న్యాయవాది పోలీసులను కోరారు. అయితే మహిళలు ఎవరూ వ్యక్తిగతంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయకపోవడంతో ఆ కేసు పెట్టలేకపోయినట్లు పోలీసులు తెలిపారు.
తాను 2014 నుంచి 2016 వరకు టీవీఎఫ్‌లో పనిచేసినప్పుడు కుమార్ తనను లైంగికంగా వేధించాడని ఒక మహిళ ఓ బ్లాగులో రాసింది. ఆ పోస్టింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో ఇంకా చాలామంది తాము కూడా అలాగే అతడి వేధింపులకు గురయ్యామని అక్కడ రాశారు. అయితే టీవీఎఫ్ సంస్థ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ముందుగా బ్లాగ్ రాసింది ఎవరో తెలుసుకుని, తప్పుడు ఆరోపణలు చేసినందుకు వాళ్లపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పింది.