‘సెల్ఫీ దిగానంతే.. ఆమెను ఇంకేం చేయలేదు’
ముంబయి: తనతోపాటు పనిచేసిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నమోదైన కేసుకు సంబంధించి తొలిసారి ది వైరల్ ఫీవర్(టీవీఎఫ్) సీఈవో అరునాభ్ కుమార్ స్పందించాడు. తనను అనవసరం ఈ కేసులో ఇరికించారని అన్నారు. అసలు తాను ఏ తప్పు చేయలేదని చెప్పారు. గత కొద్ది రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న ఆయనకు దిండోషి సెషన్స్ కోర్టు యాంటిసిపేటరీ బెయిలిచ్చింది. అంతకుముందు పోలీసులకు అరునాభ్ ఎలాంటి వాంగ్మూలం ఇచ్చాడంటే..
‘నేను 2016 మే 26న ఆమె(కేసు పెట్టిన బాధితురాలు)ను కలిశాను. ఓ ప్రోమో షూట్ చేసేందుకు ఆమె అక్కడికి వచ్చింది. ఎందుకంటే ఆమె డైరెక్టర్. నా ఆఫీసులోని మూడు చోట్ల షూటింగ్ చేశాం. తొలి షాట్‌ను గ్రౌండ్ ఫ్లోర్‌లో, రెండో షాట్ సెకండ్ ఫ్లోర్, మూడోషాట్ టెర్రస్‌పై తీశాం. ప్రతి షాట్‌కు దుస్తులు మార్చాలని ఆమె నాతో చెప్పింది. అయితే, నేను చాలా బిజీ పర్సన్‌ని అయినందున ఏం చేసైనా షూటింగ్ త్వరగా ముగించాలని కోరాను.
ఆ రోజు నాకు ఆమె రెండు టీ షర్ట్‌లు, ఒక కుర్తా ఇచ్చింది. మూడు షాట్‌లకు మూడు వేర్వేరు వేసుకోవాలని కోరింది. ఆ తర్వాత నాకు సంబంధించిన షూటింగ్ అయిపోయింది. అక్కడే నా దుస్తులు మార్చుకున్నాను. ఆ సమయంలో అక్కడ చాలా మంది ఉన్నారు. ఆమె ఒక్కతే ఏం లేదు. నేనెప్పుడు ఆమె ముందు నా దుస్తులు తీయలేదు.. ఆమెకు చెడుగా సైగలు చేయలేదు. నాకు ఆ రోజు ఆలస్యం అవుతుండటంతో అక్కడే మార్చుకున్నాను.
అప్పుడు నాకు ఎలాంటి దురుద్దేశం కూడా లేదు. షూటింగ్ పూర్తయ్యాక జూన్ 8న, 2016న మేం పార్టీ ఏర్పాటుచేసుకున్నాం. ఆమె నిర్ణయించిన ప్రాంతంలోనే పార్టీ చేశాం. పార్టీ ప్రారంభమైంది. అప్పుడే నేను ఆమెతో ఒక సెల్ఫీ దిగాను. ఆమె ఆ సమయంలో ఏమనలేదు కూడా. ఇంతకుమించి నేను ఏనాడు ఆమెకు ఒక మెస్సేజ్‌గానీ, ఫోన్‌గానీ చేయలేదు. లైంగిక వేధింపులు అనేవి కేవలం ఉద్దేశ పూర్వకంగా చేసిన ఆరోపణలే.. నేనసలు ఏం తప్పు చేయలేదు’ అని ఆయన పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రికార్డయింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ టీవీఎఫ్ సంస్థలో డైరెక్టర్‌గా పనిచేసిన మహిళ అరునాభ్ కుమార్ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.