లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీఎఫ్ మాజీ సీఈవో అరుణాబ్ కుమార్‌పై వెర్సోవా పోలీసులు మరో చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు.
ముంబై: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీఎఫ్ మాజీ సీఈవో అరుణాబ్ కుమార్‌పై వెర్సోవా పోలీసులు మరో చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. అరుణాబ్ కుమార్‌పై పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వెనుకభాగంలో తనను అసభ్యంగా తడిమాడంటూ మలద్‌కు చెందిన 31 ఏళ్ల మహిళ ఆయనపై సెక్షన్ 354 (ఏ) కింద లైంగిక వేధింపుల కేసు నమోదుచేసింది. దీంతో అరుణాబ్‌పై పోలీసులు రెండో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. మొదటి కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ వెంటనే బెయిల్‌పై విడుదల అయ్యారు.
తనపై పలు లైంగిక వేధింపులు ఆరోపణలు రావడంతో అరుణాబ్ కుమార్ టీవీఎఫ్ కంపెనీ సీఈవో పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. 2014లో టీవీఎఫ్ స్టూడియోలో తాను అరుణాబ్ కుమార్‌ను కలిశానని, తాము స్నేహితులు కాకపోయినప్పటికీ, సన్నిహితంగా వ్యవహరిస్తూ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, పండ్లు నీకు ఇష్టమా? అని అడుగుతూ.. మెడ నుంచి నడుము వరకు చేతితో అకస్మాత్తుగా తడిమాడని, దీంతో షాక్ తిన్న తాను వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ కేసులో బలమైన ఆధారాలు లేవని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన 45 పేజీల చార్జ్‌షీట్‌ను తాజాగా దాఖలు చేశారు.