
ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన ఈడీ
చార్జిషిట్‌పై ఈ నెల 25న న్యాయస్థానంలో విచారణ
రూ. 2,000 కోట్ల ఆస్తులను కాజేయడానికి కుట్ర జరిగిందన్న ఈడీ
ఆ ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.5,000 కోట్లు ఉంటుందని వెల్లడి
ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని కాంగ్రెస్ మండిపాటు
నేడు ఈడీ కార్యాలయాల ఎదుట నిరసనలకు ఏఐసీసీ పిలుపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, ఎంపీలు సోనియా గాందీ, రాహుల్ గాం«దీతోపాటు ఇతర నిందితులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జిషిట్ దాఖలు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శామ్ పిట్రోడా, సుమన్ దూబే, సునీల్ భండారీతోపాటు యంగ్ ఇండియా, డాటెక్స్ మెర్కండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను చార్జిషిట్‌లో నిందితులుగా చేర్చింది.
రూ.2,000 కోట్ల విలువైన నేషనల్ హెరాల్డ్ ఆస్తులను దోచుకోవడానికి కుట్ర జరిగిందని, ప్రస్తుతం వాటి విలువ రూ.5,000 కోట్లు ఉంటుందని ఈడీ స్పష్టంచేసినట్లు సమాచారం. ఈ కేసులో సోనియా, రాహుల్ గాం«దీలను ఈడీ గతంలో పలుమార్లు విచారించింది. వారిపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడం మాత్రం ఇదే మొదటిసారి.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ)లోని వేర్వేరు సెక్షన్ల కింద ఈ నెల 9వ తేదీన ఈ చార్జిషీట్‌ను ఈడీ దాఖలు చేసింది. ఇందులో నంబర్–1గా సోనియా గాం«దీ, నెంబర్–2గా రాహుల్ గాంధీ పేర్లను ప్రస్తావించింది. ఈడీ చార్జిషీట్‌ను పరిశీలించిన ప్రత్యేక జడ్జి విశాల్ గాగ్నే దీనిపై తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు. మరోవైపు ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అని కాంగ్రెస్ ఆరోపించింది.
సుబ్రమణ్య స్వామి ఫిర్యాదుతో..
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది. వాటిని స్వాదీనం చేసుకుంటామని చెబుతూ ఆయా ఆస్తుల్లో ఉంటున్నవారికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో 2021లో ఈడీ విచారణ ప్రారంభమైంది. 2014 జూన్ 26న బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదును ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ పరిగణనలోకి తీసుకున్నారు.
మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఈడీ దర్యాప్తు చేపట్టింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోపాటు మోతీలావ్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ తదితరులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. నిందితులపై దర్యాప్తు చేపట్టడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయని పేర్కొంది. కోర్టులు ఆ పిటిషన్లను కొట్టివేశాయని, దర్యాప్తునకు అనుమతించాయని గుర్తుచేసింది.
సత్యమేవ జయతే: జైరామ్ రమేశ్
ఈడీ చార్జిషిట్‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ వేధింపులపై తాము మౌనంగా ఉండే ప్రసక్తే లేదని, కచ్చితంగా పోరాడుతామని స్పష్టంచేశారు. సత్యమేవ జయతే అంటూ మంగళవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. హెరాల్డ్ ఆస్తులను స్వా«దీనం చేసు కోవడం ప్రభుత్వ ప్రాయోజిత నేరమని విమర్శించారు. ప్రధాని, హోంమంత్రి బెదిరించాలని చూస్తే బెదిరిపోయే వారు ఎవరూ లేరని తేల్చిచెప్పారు. మరోవైపు సోనియా, రాహుల్‌పై చార్జిషిట్‌కు వ్యతిరేకంగా బుధవారం ఈడీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది.
ఏమిటీ నేషనల్ హెరాల్డ్ కేసు?
నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను 1938లో జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించారు. ఈ పత్రికను అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్) ప్రచురించింది. 2008లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పత్రిక మూతపడింది. నేషనల్ హెరాల్డ్‌కు దేశ రాజధాని ఢిల్లీతోపాటు ప్రధాన నగరాల్లో విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. 2010లో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఏర్పాటైంది. ఇందులో సోనియా గాం«దీ, రాహుల్ గాంధీలకు 38 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. రూ.2,000 కోట్లకుపైగా విలువైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను 2012లో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కేవలం రూ.50 లక్షలకు కొట్టేసిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు.