రష్యా సైన్యం హత్యాకాండకు బలైన భర్త మృతదేహం వద్ద మహిళ విలపిస్తున్న దృశ్యం
కీవ్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కీలక దశకు చేరింది. తూర్పున డోన్బాస్ వేదికగా నిర్ణాయక యుద్ధానికి తెర లేస్తోంది. 47 రోజుల పై చిలుకు యుద్ధంలో రాజధాని కీవ్ సహా దేశంలో ఏ కీలక ప్రాంతాన్నీ ఆక్రమించలేకపోయిన రష్యా, డోన్బాస్ ప్రాంతంపై ఎలాగైనా పూర్తి పట్టు సాధించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు అక్కడ కూడా రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్ సర్వశక్తులూ కూడదీసుకుంటోంది. కొత్త జనరల్ అలెగ్జాండర్ ద్వొర్నికోవ్ సారథ్యంలో డోన్బాస్‌పై భీకర దాడులకు రష్యా సైన్యం ఇప్పటికే తెర తీసింది.
వాటిని ఒకట్రెండు రోజులుగా ఉక్రెయిన్ దీటుగా తిప్పికొడుతోందని ఇంగ్లండ్ పేర్కొంది. ఈ క్రమంలో డోన్బాస్‌లోనూ రష్యా భారీగా యుద్ధ ట్యాంకులను, ఆయుధాలను, సాయుధ వాహనాలను నష్టపోయిందని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో రానున్న కొద్ది వారాలు అత్యంత కీలకమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు. తమకు మరింత సాయుధ, ఆర్థిక సాయం చేయాలని పాశ్చాత్య దేశాలకు విజ్ఞప్తి చేశారు. ‘‘మాకు కావాల్సిన సాయుధ సంపత్తి జాబితాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఇప్పటికే ఇచ్చాం. అవి అందజేసి చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఆయన ముందుంది’’ అన్నారు.
భారీగా పౌర మరణాలు
ఉక్రెయిన్ కీలక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను నాశనం చేసినట్టు రష్యా సోమవారం ప్రకటించింది. దింప్రో నగర శివార్లలో నాలుగు ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ లాంచర్లను క్రూయిజ్ మిసైళ్లతో ధ్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ తెలిపారు. దాడుల్లో 25 మంది దాకా ఉక్రెయిన్ సైనికులు మరణించారన్నారు. ఒక్క మారియుపోల్‌లోనే ఇప్పటిదాకా 20 వేల మందికి పైగా అమాయక పౌరులు మరణించారని నగర మేయర్ చెప్పారు.
ఉక్రెయిన్‌పై ఈయూ చర్చలు
ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం, మరింత సాయంపై ఈయూ విదేశాంగ మంత్రులు సోమవారం సుదీర్ఘంగా చర్చించారు. మామూలుగా ఏళ్లూ పూళ్లూ పట్టే సభ్యత్వ ప్రక్రియను కొద్ది వారాల్లోపే తేల్చేస్తామని ఐరోపా కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వొండొర్ లెయన్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. ఈయూలో మాల్డోవాకు సభ్యత్వంపైనా చర్చ జరిగింది. ఉక్రెయిన్‌కు ఇప్పుడు విదేశీ మద్దతు మరింతగా కావాలని జర్మనీ విదేశాంగ మంత్రి అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment