Kiev
-
Russia-Ukraine war: క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా
కీవ్: దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. సోమవారం ఉదయం నుంచి పలు నగరాల్లోని మౌలిక వనరులు, విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా వివిధ రకాలైన 40 వరకు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో కనీసం 31 మంది చనిపోగా మరో 154 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కీవ్‌లోని చిన్నారుల ఆస్పత్రి సహా పలు నివాస ప్రాంతాలపై క్షిపణులు పడటంతో భారీగా పేలుళ్లు సంభవించాయి. పలు చోట్ల మంటలు వ్యాపించాయి. రాజధాని కీవ్‌లోని 10 జిల్లాలకు గాను ఏడు జిల్లాల్లో జరిగిన దాడుల్లో 14 మంది చనిపోగా పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. మూడంతస్తుల నివాస భవనం పూర్తిగా ధ్వంసమైంది. మరో నగరం క్రివ్యి రిహ్‌లో 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో 47 మంది గాయపడ్డారు. కీవ్‌లోని రెండంతస్తుల చిన్నారుల ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఆపరేషన్ థియేటర్, ఆంకాలజీ విభాగం దెబ్బతిన్నాయి. ఆస్పత్రిలోని పదంతస్తుల ప్రధాన భవనం కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. ఘటన నేపథ్యంలో ఆస్పత్రిలో వారందరినీ ఖాళీ చేయిస్తున్నారు. ఆస్పత్రిపై దాడిలో ఏడుగురు చిన్నారులు సహా 16 మంది గాయపడినట్లు మేయర్ విటాలి క్రిట్్చకో చెప్పారు. ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉందని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యా ప్రయోగించిన క్షిపణుల్లో ధ్వని కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణించగల హైపర్సోనిక్ కింఝాల్ మిస్సైళ్లు కూడా ఉన్నాయని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. మొత్తం 40 క్షిపణుల్లో 30 వరకు కూల్చి వేశామని, వీటిలో కింఝాల్ రకానివి 11 ఉన్నాయని పేర్కొంది. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించేందుకు గల అవకాశాల్ని పరిశీలించేందుకు వాషింగ్టన్లో నాటో దేశాలు మంగళవారం భేటీ అవుతున్న వేళ రష్యా భారీ దాడులకు పూనుకుందని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, ఆస్పత్రిపై దాడిని జర్మనీ, చెక్ రిపబ్లిక్ తీవ్రంగా ఖండించాయి. అయితే, తాము ఉక్రెయిన్ రక్షణ, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపామని రష్యా ఆర్మీ పేర్కొంది. ఉక్రెయిన్ క్షిపణి రక్షణ వ్యవస్థల వల్లే ఆస్పత్రికి నష్టం వాటిల్లినట్లు తెలిపింది. -
కీవ్‌పై భారీగా డ్రోన్ల దాడి
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పైకి రష్యా భారీ స్థాయిలో డ్రోన్ల దాడికి పాల్పడింది. 2022లో తమపై దురాక్రమణ మొదలయ్యాక రష్యా పాల్పడిన అతిపెద్ద డ్రోన్ దాడిగా ఉక్రెయిన్ మిలటరీ పేర్కొంది. శనివారం ఉదయం రాజధానితోపాటు చుట్టుపక్కల ప్రాంతాలపైకి రష్యా ప్రయోగించిన 75 ఇరాన్ తయారీ షహీద్ డ్రోన్లలో 66 డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. వేకువజామున 4 గంటలకు మొదలై దాదాపు ఆరు గంటలపాటు కొనసాగిన ఈ దాడుల్లో పలు భవనాలు ధ్వంసం కాగా 11 ఏళ్ల బాలుడు సహా అయిదుగురు పౌరులు గాయపడ్డారు. -
కీవ్‌పై రష్యా క్షిపణుల వర్షం
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా సైన్యం మరోసారి విరుచుకుపడింది. సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. రష్యా సైన్యం ప్రయోగించిన 11 బాలిస్టక్, క్రూయిజ్ క్షిపణులను తాము కూల్చివేశామని ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ప్రకటించారు. వాటి శకలాలు నగరంలో అక్కడక్కడా చెల్లాచెదురుగా పడిపోయాయని, దట్టమైన పొగ కమ్ముకుందని చెప్పారు. రష్యా దాడుల్లో కీవ్‌లో ఒకరు గాయపడినట్లు సమాచారం. రష్యా సేనలు తొలుత ఆదివారం రాత్రి దాడులు ప్రారంభించాయి. జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొందరు అండర్‌గ్రౌండ్ రైల్వే స్టేషన్లలో తలదాచుకున్నారు. కొంత విరామం తర్వాత సోమవారం ఉదయం మళ్లీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. రష్యా క్షిపణి దాడుల నేపథ్యంలో చిన్నారులు భయాందోళనలతో బాంబు షెల్టర్ వైపు పరుగులు తీస్తున్న వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఉక్రెయిన్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని లాంగ్–రేంజ్ మిస్సైళ్లు ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ దాడుల్లో ఉక్రెయిన్‌కు చెందిన కమాండ్ పోస్టులు, రాడార్లు, ఆయుధాలు ధ్వంసమయ్యాయని పేర్కొంది. కీవ్‌లో క్షిపణుల దాడి భయంతో మెట్రో స్టేషన్లో దాక్కున్న స్థానికులు -
కీవ్‌పై మరోసారి పేట్రేగిన రష్యా
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ శనివారం ఉదయం భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. డ్నిప్రొవ్స్కీ ప్రాంతంలోని కీలకమైన మౌలిక వసతులే లక్ష్యంగా రష్యా ఈ దాడులకు ఒడిగట్టినట్లు భావిస్తున్నామని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. క్షిపణి దాడులతో పలు ప్రాంతాల్లో 18 వరకు భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల మంటలు లేచాయి. ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొంది. కీవ్‌పై జనవరి ఒకటో తేదీ తర్వాత రష్యా దాడులు జరపడం ఇదే ప్రథమం. అంతకుముందు ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్‌లోని పారిశ్రామిక ప్రాంతంపై రష్యా రెండు ఎస్–300 క్షిపణులను ప్రయోగించిందని ఆ ప్రాంత గవర్నర్ తెలిపారు. కీలక నగరం సొలెడార్ తమ అధీనంలోకి వచ్చిందంటూ రెండు రోజుల క్రితం రష్యా ప్రకటించగా, ఉక్రెయిన్ కొట్టిపారేసిన విషయం తెలిసిందే. రాజధాని కీవ్, ఇతర నగరాలను లక్ష్యంగా చేసుకొని రష్యా క్షిపణి దాడులకు తెగబడుతుండడంతో ఉక్రెయిన్‌కు అండగా నిలవడానికి బ్రిటన్ ముందుకొచ్చింది. ట్యాంకులు, శతఘ్ని వ్యవస్థలను ఉక్రెయిన్‌కి పంపిస్తామని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శనివారం నాడు హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో సునాక్ మాట్లాడారు. అనంతరం బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఛాలెంజర్ 2 ట్యాంకులు, ఇతర శతఘ్ని వ్యవస్థ సాయంగా అందిస్తామని సునాక్ హామీ ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే ఎన్ని ట్యాంకులు పంపిస్తారో, ఎప్పటిలోగా అవి ఉక్రెయిన్ చేరుకుంటాయో వెల్లడించలేదు. బ్రిటీష్ ఆర్మీ చాలెంజర్ 2 ట్యాంకులు నాలుగు వెంటనే పంపిస్తారని, మరో ఎనిమిది త్వరలోనే పంపిస్తారంటూ బ్రిటన్ మీడియా తెలిపింది. ఉక్రెయిన్‌లో మౌలికసదుపాయాలను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులకు తెగబడుతోంది. -
కీవ్‌పై రష్యా భీకర దాడులు
కీవ్: వ్యూహాత్మకంగా కీలకమైన క్రిమియా వంతెనపై జరిగిన బాంబు పేలుడును ఉగ్ర చర్యగా అభివర్ణించిన రష్యా.. ఉక్రెయిన్ వ్యాప్తంగా సోమవారం వరుసగా రెండో రోజు భీకర దాడులు కొనసాగించింది. కొద్ది నెలలుగా ప్రశాంతంగా ఉన్న రాజధాని కీవ్ సహా నగరాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. దాడులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉదయం ఏకధాటిగా నాలుగు గంటలపాటు సైరన్లు మోగాయి. దాడుల్లో కనీసం 10 మంది మృతి చెందగా 60 మంది వరకు గాయపడినట్లు సమాచారం. కీలక ఇంధన, సైనిక వ్యవస్థలను టార్గెట్‌గా గగనతలం, సముద్రం, భూమిపై నుంచి తమ సైన్యం దాడులు సాగించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ ఉగ్రదాడులు కొనసాగిస్తే అందుకు తామిచ్చే జవాబు అత్యంత కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. అంతకుముందు ఆయన సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. మరో పరిణామం..రష్యా, బెలారస్ ఉమ్మడి బలగాలను మోహరించనున్నట్లు బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో ప్రకటించారు. బెలారస్‌పై దాడి చేసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అయితే, బలగాలను ఎక్కడ మోహరించేదీ లుకషెంకో వివరించలేదు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో పోరాటం కొనసాగుతున్నా రాజధాని కీవ్‌లో జనజీవనం యథాప్రకారం కొనసాగుతోంది. కీవ్ ప్రజలు కొద్ది నెలలుగా ప్రశాంతతకు అలవాటుపడ్డారు. సోమవారం ఉదయం ఆ పరిస్థితి మారిపోయింది. ఒక్కసారిగా మొదలైన సైరన్ల మోతతో జనం ఉలిక్కిపడ్డారు. బాంబు షెల్టర్లలోకి పరుగులు తీశారు. అధికారులు రైలు సర్వీసులను రద్దు చేశారు. జనం రైల్వే స్టేషన్లనే షెల్టర్లుగా చేసుకున్నారు. -
Russia Ukraine war: కీవ్‌లో క్షిపణుల మోత
కీవ్: ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు రాకెట్ లాంచర్లు, అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేస్తుండడం పట్ల రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీకార చర్యలు ప్రారంభించింది. పశ్చిమ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేయడమే లక్ష్యంగా రష్యా సైన్యం ఆదివారం తెల్లవారుజామునే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. గత ఐదు వారాలుగా ప్రశాంతంగా ఉన్న కీవ్ మిస్సైళ్ల మోతతో దద్దరిల్లిపోయింది. ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు అందజేసిన యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. తమ సైన్యం అత్యంత కచ్చితత్వం కలిగిన లాంగ్ రేంజ్ మిస్సైళ్లు ప్రయోగించిందని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. యూరప్ దేశాలు ఇచ్చిన టీ–72 యుద్ధ ట్యాంకులు, ఇతర సైనిక వాహనాలు నామరూపాల్లేకుండా పోయాయని పేర్కొంది. అయితే, ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఖండించింది. కీవ్‌లో రైల్వే స్టేషన్లు, ఇతర మౌలిక సదుపాయాలపైనా రష్యా సైన్యం దాడులకు పాల్పడింది. రష్యా క్షిపణులు కీవ్ సమీపంలోని డార్నిట్స్కీ, డినిప్రోవ్స్కీ జిల్లాలను వణికించాయి. కీవ్‌కు 350 కిలోమీటర్ల దూరంలోని అణు విద్యుత్ కేంద్రంపై క్రూయిజ్ మిస్సైల్‌ను ప్రయోగించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్లో పలు నగరాలు, గ్రామాలపై రష్యా సైన్యం మిస్సైళ్లు ప్రయోగించింది. గిర్స్కీలో 13, లీసిచాన్‌స్క్‌లో 5 ఇళ్లు దెబ్బతిన్నాయి. క్రామటోర్‌స్క్‌లోనూ వైమానిక దాడులు కొనసాగాయి. ఖర్కీవ్‌లోని చెర్కాస్కీ తీస్కీ గ్రామంలో రష్యా దళాలు ఫాస్ఫరస్ ఆయుధాలు ప్రయోగించాయని ఉక్రెయిన్ ఆరోపించింది. డోన్బాస్లో కీలకమైన సీవిరోడోంటెస్క్ సిటీలో 80శాతం మేర రష్యా సేనలు ఆక్రమించుకున్నాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మృతిచెందిన ఇరు పక్షాల సైనికుల మృతదేహాలను పరస్పరం మార్చుకొనే ప్రక్రియ అధికారికంగా ప్రారంభమయ్యింది. దక్షిణ జపొరిఝాజియాలో 160 మృతదేహాలను మార్చుకున్నట్లు ఉక్రెయిన్ యంత్రాంగం ప్రకటించింది. దయచేసి యుద్ధం ఆపండి: పోప్ ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఇకనైనా ఆపాలని పోప్ ఫ్రాన్సిస్ రష్యాకు మళ్లీ విజ్ఞప్తి చేశారు. ‘దయచేసి ప్రపంచాన్ని నాశనం చేయకండి’ అని ఆదివారం ఆయన విన్నవించారు. యుద్ధం కారణంగా బాధితులుగా మారుతున్న ప్రజల రోదనలు వినాలని ఉక్రెయిన్, రష్యా అధినేతలను పోప్ కోరారు. -
Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో యూఎస్ నేతలు
వాషింగ్టన్: అమెరికా సెనేట్‌లో రిపబ్లికన్ నేత మిచ్ మెకొనెల్‌తో పాటు పలువురు రిపబ్లికన్ సెనేటర్లు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఆకస్మిక పర్యటన జరిపారు. అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ గెలిచేవరకు మద్దతు కొనసాగిస్తామన్నారు. రిపబ్లికన్ నేతలతో సమావేశ వీడియోను జెలెన్స్కీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఉక్రెయిన్‌కు 4000 కోట్ల డాలర్ల ప్యాకేజీకి వచ్చే వారం అమెరికా కాంగెస్ర్ ఆమోదం లభించే అవకాశముందని సమాచారం. మరోవైపు యూరోవిజన్ సంగీత కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఉక్రెయిన్‌లో జరుపుతామని జెలెన్స్కీ ప్రకటించారు. కుదిరితే మారియుపోల్‌లో నిర్వహిస్తామన్నారు. డొనెట్స్క్పై పూర్తి ఫోకస్ ఉక్రెయిన్‌లోని పలు నగరాల నుంచి సేనలను ఉపసంహరించిన రష్యా తన దృష్టిని తూర్పున డొనెట్స్క్పై కేంద్రీకరించింది. దీంతో తమ దేశం దీర్ఘకాలిక యుద్ధ దశలోకి ప్రవేశిస్తోందని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సి రెజినికోవ్ ప్రకటించారు. తూర్పు ప్రాంతంలో పలు నగరాలపై రష్యా పట్టు కొనసాగుతోంది. అక్కడ తాము తాజాగా ఆరు నగరాలు/గ్రామాలను పునఃస్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఖర్కివ్ నగరాన్ని దాదాపు గెలిచామని జెలెన్స్కీ అన్నారు. సివర్స్కీ డోనెట్స్ నది వద్ద ఎవరికి విజయం లభిస్తుందనేది ఉక్రెయిన్ భవిష్యత్తును నిర్ధారితమవుతుందని మిలటరీ నిపుణులు అంటున్నారు. యుద్ధంలో రష్యా భారీగా నష్టపోతోందని బ్రిటన్ పేర్కొంది. నాటోలో చేరుతాం: ఫిన్లాండ్ ఉక్రెయిన్‌పై దాడితో ఆందోళన చెందుతున్నామని, అందువల్ల నాటోలో చేరతామని ఫిన్లాండ్ పునరుద్ఘాటించింది. స్వీడన్ కూడా ఇదే బాటలో పయనించేలా కన్పిస్తున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫిన్లాండ్ ప్రెసిడెంట్ నినిస్టోతో ఫోన్లో మాట్లాడారు. నాటోలో చేరడం తప్పిదమవుతుందంటూ నచ్చజెప్పే యత్నం చేశారు. ఫిన్లాండ్–రష్యా సంబంధాలను ఇది దెబ్బతీస్తుందని ఘాటుగా హెచ్చరించారు. -
Russia-Ukraine war: తూర్పున దాడి ఉధృతం
ఇర్పిన్: ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై రష్యా దాడులను తీవ్రం చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ముట్టడి విఫలమైన తర్వాత రష్యా తన దృష్టిని తూర్పు ఉక్రెయిన్‌వైపు మరలించింది. ఈ ప్రాంతంలో ఉక్రెయిన్‌కు కీలకమైన పరిశ్రమలున్నాయి. దీన్ని స్వాధీనం చేసుకుంటే ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయవచ్చని రష్యా భావిస్తోంది. డోన్బాస్ ప్రాంతంలో రష్యా కాల్పులు అధికమయ్యాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మారియుపోల్‌లో ఇప్పటికీ ఉంటున్న పౌరులు మరిన్ని ఇక్కట్లు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆ నగరంలోని స్టీల్‌ప్లాంట్‌పై రష్యా దాడి ముమ్మరమైనట్లు శాటిలైట్ చిత్రాలు చూపుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌లో ఐరాస చీఫ్ గుటెరస్ పర్యటన కొనసాగుతోంది. యుద్ధంలో అధిక మూల్యం చెల్లించేది చివరకు సామాన్య ప్రజలేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధనేరాల గురించి మాట్లాడాల్సివస్తే, అసలు యుద్ధమే నేరమని చెప్పాలన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌కు సహాయం కొనసాగిస్తామని బల్గేరియా కొత్త ప్రధాని భరోసా ఇచ్చారు. రష్యా పౌర నివాసాలపై దాడులకు దిగుతోందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. తమ అధీనంలో ఉన్న ఖెర్సాన్ నగరంలో పేలుళ్లు జరిగాయని రష్యా తెలిపింది. పోరు కొనసాగించేందుకు తమకు మరిన్ని ఆయుధాలందించాలని ఉక్రెయిన్ మిత్ర దేశాలను కోరింది. నాటో సాయం 800 కోట్ల డాలర్లు ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు నాటో దేశాలు దాదాపు 800 కోట్ల డాలర్ల సాయం అందించాయని నాటో చీఫ్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. నాటోలో చేరాలనుకుంటే ఫిన్లాండ్, స్వీడన్‌ను సాదరంగా స్వాగతిస్తామని చెప్పారు. రష్యాతో యుద్ధం సంవత్సరాలు కొనసాగినా, తాము ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తామన్నారు. కొత్త శతాబ్దిలో యుద్ధాలు ఆమోదయోగ్యం కావని ఐరాస చీఫ్ గుటెరస్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధంలో నేరాలపై ఐసీసీతో విచారణకు తాను మద్దతిస్తానన్నారు. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను ఆయన సందర్శించారు. -
Russia-Ukraine war: తూర్పున తాడోపేడో
కీవ్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కీలక దశకు చేరింది. తూర్పున డోన్బాస్ వేదికగా నిర్ణాయక యుద్ధానికి తెర లేస్తోంది. 47 రోజుల పై చిలుకు యుద్ధంలో రాజధాని కీవ్ సహా దేశంలో ఏ కీలక ప్రాంతాన్నీ ఆక్రమించలేకపోయిన రష్యా, డోన్బాస్ ప్రాంతంపై ఎలాగైనా పూర్తి పట్టు సాధించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు అక్కడ కూడా రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్ సర్వశక్తులూ కూడదీసుకుంటోంది. కొత్త జనరల్ అలెగ్జాండర్ ద్వొర్నికోవ్ సారథ్యంలో డోన్బాస్‌పై భీకర దాడులకు రష్యా సైన్యం ఇప్పటికే తెర తీసింది. వాటిని ఒకట్రెండు రోజులుగా ఉక్రెయిన్ దీటుగా తిప్పికొడుతోందని ఇంగ్లండ్ పేర్కొంది. ఈ క్రమంలో డోన్బాస్లోనూ రష్యా భారీగా యుద్ధ ట్యాంకులను, ఆయుధాలను, సాయుధ వాహనాలను నష్టపోయిందని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో రానున్న కొద్ది వారాలు అత్యంత కీలకమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ అన్నారు. తమకు మరింత సాయుధ, ఆర్థిక సాయం చేయాలని పాశ్చాత్య దేశాలకు విజ్ఞప్తి చేశారు. ‘‘మాకు కావాల్సిన సాయుధ సంపత్తి జాబితాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఇప్పటికే ఇచ్చాం. అవి అందజేసి చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఆయన ముందుంది’’ అన్నారు. భారీగా పౌర మరణాలు ఉక్రెయిన్ కీలక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను నాశనం చేసినట్టు రష్యా సోమవారం ప్రకటించింది. దింప్రో నగర శివార్లలో నాలుగు ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ లాంచర్లను క్రూయిజ్ మిసైళ్లతో ధ్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ తెలిపారు. దాడుల్లో 25 మంది దాకా ఉక్రెయిన్ సైనికులు మరణించారన్నారు. ఒక్క మారియుపోల్‌లోనే ఇప్పటిదాకా 20 వేల మందికి పైగా అమాయక పౌరులు మరణించారని నగర మేయర్ చెప్పారు. ఉక్రెయిన్‌పై ఈయూ చర్చలు ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం, మరింత సాయంపై ఈయూ విదేశాంగ మంత్రులు సోమవారం సుదీర్ఘంగా చర్చించారు. మామూలుగా ఏళ్లూ పూళ్లూ పట్టే సభ్యత్వ ప్రక్రియను కొద్ది వారాల్లోపే తేల్చేస్తామని ఐరోపా కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వొండొర్ లెయన్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. ఈయూలో మాల్డోవాకు సభ్యత్వంపైనా చర్చ జరిగింది. ఉక్రెయిన్‌కు ఇప్పుడు విదేశీ మద్దతు మరింతగా కావాలని జర్మనీ విదేశాంగ మంత్రి అభిప్రాయపడ్డారు. -
ఉక్రెయిన్ తిప్పికొడుతోంది
కీవ్: ఉక్రెయిన్‌పై నెలకు పైగా సాగిస్తున్న యుద్ధంలో రష్యా సేనలు క్రమంగా వెనకడుగు వేస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. రష్యా సైన్యం ఆక్రమించిన చాలా పట్టణాలు, గ్రామాలను ఉక్రెయిన్ దళాలు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాయి. కీవ్, చెర్నిహివ్ ప్రాంతాల్లో, ఇతర చోట్ల కనీసం 30కి పైగా సెటిల్మెంట్లను ఇప్పటికే విముక్తం చేసినట్టు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. కీవ్, పరిసర ప్రాంతాల నుంచి రష్యా దళాలు భారీ స్థాయిలో వెనక్కు వెళ్లడం శనివారం కూడా కొనసాగింది. 700కు పైగా సాయుధ వాహనాలు కీవ్ నుంచి బెలారస్ దిశగా వెనుదిరుగుతూ కన్పించాయి. అయితే అవి వెనక్కు వెళ్లడం లేదని, తూర్పున డోన్బాస్‌పై భారీ దాడి కోసమే బయల్దేరుతున్నాయని ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు అనుమానిస్తున్నాయి. పైగా రష్యా దళాలు వెనక్కు వెళ్తూ వీలైన చోటల్లా మందుపాతరలు అమర్చాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్‌కు మరో 30 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను అందజేయనున్నట్టు అమెరికా ప్రకటించింది. వీటిలో లేజర్ గైడెడ్రాకెట్ సిస్టమ్స్, మానవరహిత విమానాలు, నైట్ విజన్ పరికరాలు, సాయుధ వాహనాలు తదితరాలుంటాయని పేర్కొంది. మరోవైపు శుక్రవారం రష్యా, ఉక్రెయిన్ బృందాల మధ్య జరిగిన వీడియో కాన్ఫరెన్స్ చర్చలు ఏ మేరకు పురోగతి సాధించిందీ తెలియరాలేదు. కానీ ఉక్రెయిన్ తమ దేశంపై దాడులు చేస్తోందన్న వార్తలు చర్చలకు ఆటంకం కలిగిస్తాయని పుతిన్ అధికార ప్రతినిధి ద్మత్రీ పెస్కోవ్ అన్నారు. కీవ్‌ను సందర్శించాలని ఆలోచిస్తున్నట్టు పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. ఇక మారియుపోల్ సహా పలు నగరాల్లో రష్యా విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. యువకులను ఏడాది పాటు సైనిక విధుల్లోకి తీసుకునే వార్షిక కార్యక్రమానికి రష్యా శుక్రవారం శ్రీకారం చుట్టింది. లక్షన్నర మందిని రిక్రూట్ చేసుకోవాలన్నది లక్ష్యమని చెప్తున్నారు. రష్యాకు ఆయుధాల కొరత రష్యా వద్ద పలు కీలక ఆయుధాలు దాదాపుగా నిండుకున్నాయని ఇంగ్లండ్ రక్షణ వర్గాలు చెబుతున్నాయి. వాటిని ఇప్పుడప్పుడే భర్తీ చేసుకునే అవకాశాలు కూడా లేవంటున్నాయి. హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు, క్రూయిజ్ మిసైళ్ల కొరత రష్యాను తీవ్రంగా వేధిస్తున్నట్టు చెప్పాయి. పలు కీలక విడి భాగాలను ఉక్రెయిన్ నుంచే రష్యా దిగుమతి చేసుకుంటోందని సమాచారం. 2014 క్రిమియా యుద్ధానంతరం రష్యాకు ఆయుధాల ఎగుమతిని ఉక్రెయిన్ బాగా తగ్గించింది. యుద్ధ నేపథ్యంలో నెలకు పైగా అవి పూర్తిగా ఆగిపోయాయి. ఇంగ్లండ్ స్టార్‌స్ట్రీక్ మిసైల్‌తో రష్యా హెలికాప్టర్ కూల్చివేత ఇంగ్లండ్‌లో తయారైన స్టార్‌స్ట్రీక్ మిసైల్ సాయంతో రష్యా ఎంఐ–28ఎన్ హెలికాప్టర్‌ను లుహాన్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ కూల్చేసింది. మిసైల్ ఢీకొట్టడంతో హెలికాప్టర్ రెండు ముక్కలై నేలకూలిన వీడియో వైరల్‌గా మారింది. ధ్వని కంటే మూడు రెట్ల వేగంతో దూసుకెళ్లే ఈ లేజర్ గైడెడ్ మిసైల్ సిస్టమ్ తక్కువ ఎత్తులో వెళ్లే హెలికాప్టర్లను 100 శాతం కచ్చితత్వంతో నేలకూలుస్తుంది. పైగా ఇది చాలా తేలిగ్గా ఉంటుంది గనుక ఎక్కడికైనా సులువుగా మోసుకెళ్లవచ్చు. భుజం మీది నుంచి కూడా ప్రయోగించవచ్చు. స్టార్‌స్ట్రీక్ ప్రయోగంపై రష్యా మండిపడింది. ఇకపై ఇంగ్లండ్ ఆయుధ సరఫరాల నౌకలు, వాహనాలను లక్ష్యం చేసుకుని దాడులకు దిగుతామని హెచ్చరించింది. -
Russia-Ukraine War: కీవ్ పరిసరాల్లో భీకర పోరు
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ పరిసరాల్లో గురువారం భీకర పోరు కొనసాగింది. దీంతో సైనిక కార్యకలాపాల తగ్గింపు ప్రతిపాదన ముసుగులో రష్యా తన సేనలను పునరేకీకరిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా డోన్బాస్ ప్రాంతంలో భారీగా మోహరింపులు చేస్తోందని, వీటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ ప్రకటించారు. మరోవైపు మారియుపోల్ నుంచి ప్రజలను తరలించేందుకు పలు బస్సులను ఆ నగరానికి పంపారు. నగరం నుంచి పౌర తరలింపు కోసం పరిమిత కాల్పుల విరమణకు రష్యా అంగీకరించింది. శుక్రవారం ఇరుపక్షాల మధ్య మరోదఫా ఆన్లైన్ చర్చలు జరగనున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఇప్పటికే నగరం నుంచి పలువురు వలస పోవడంతో నగర జనాభా 4.3 లక్షల నుంచి లక్షకు దిగివచ్చింది. వీరిని కూడా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 45 బస్సులను ఇక్కడికి పంపామని ఉక్రెయిన్ ఉప ప్రధాని చెప్పారు. చెర్నోబిల్ నుంచి రష్యా బలగాలు వెనుదిరిగాయని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. రష్యా వెనక్కు తగ్గలేదు ముందుగా అంగీకరించినట్లు రష్యా వెనక్కు తగ్గడం లేదని నాటో జనరల్ స్టోల్టెన్‌బర్గ్ సైతం ఆరోపించారు. బలగాల ఉపసంహరణ ముసుగులో రష్యా తన బలగాలకు సరఫరాలందించడం, కావాల్సిన ప్రాంతాల్లో మోహరించడం చేస్తోందన్నారు. ఒకపక్క డోన్బాస్‌పై దాడికి దిగుతూనే మరోపక్క కీవ్ తదితర నగరాలపై రష్యా ఒత్తిడి పెంచుతోందని నాటో ఆరోపించింది. రష్యా చాలా పరిమితంగా బలగాల తరలింపు చేపట్టిందని బ్రిటన్ కూడా ఆరోపించింది. ఉక్రెయిన్‌పై దాడికి దిగి రష్యా తప్పు చేసిందన్న యూఎస్ వ్యాఖ్యలను రష్యా తోసిపుచ్చింది. ఏప్రిల్ 1 నుంచి కొత్తగా 1, 34, 500 మందిని సైన్యంలో చేర్చుకునే ఆదేశాలపై అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. వ్యూహాత్మక తప్పిదం ఉక్రెయిన్‌పై దాడికి దిగాలనుకోవడం పుతిన్ చేసిన వ్యూహాత్మక తప్పిదమని, దీని వల్ల రష్యా బలహీనపడిందని, ప్రపంచదేశాల మధ్య ఏకాకిగా మారిందని వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది. రష్యా మిలటరీ పుతిన్‌ను తప్పుదోవ పట్టించి యుద్ధానికి దించిందని, దీనివల్ల ప్రస్తుతం పుతిన్‌కు మిలటరీ అగ్రనాయకులకు మధ్య పొరపచ్చాలు వచ్చాయని వైట్‌హౌస్ ప్రతినిధి కేట్బీడింగ్ఫీల్డ్ చెప్పారు. రష్యాపై ఆంక్షలను, ఉక్రెయిన్‌కు సాయాన్ని అమెరికా కొనసాగిస్తుందన్నారు. రష్యాలో నాయకత్వ మార్పును బైడెన్ కోరుకోలేదని చెప్పారు. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ భారత్ పర్యటనకు వచ్చారు. శుక్రవారం ఆయన ప్రధాని మోదీతో, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమవుతారు. ఎస్400 మిసైల్ వ్యవస్థలోని భాగాలతో పాటు పలు మిలటరీ హార్డ్‌వేర్‌ను సకాలంలో అందించాలని లావ్రోవ్ను భారత్ కోరనుందని సమాచారం. తొలినుంచి ఉక్రెయిన్ సంక్షోభ విషయంలో భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తోంది. చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలకు సూచిస్తోంది. -
Russia Ukraine war: ఆశలపై నీళ్లు!
కీవ్: తాజా చర్చల నేపథ్యంలో ఉక్రెయిన్ సంక్షోభానికి తెర పడవచ్చన్న ఆశలపై రష్యా నీళ్లు చల్లింది. మంగళవారం నాటి చర్చల్లో పెద్ద పురోగతేమీ లేదంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ పెదవి విరిచారు. ఉక్రెయిన్ తన ప్రతిపాదనలను చర్చల సందర్భంగా లిఖితపూర్వకంగా తమ ముందుంచింది తప్ప అంతకంటే పెద్దగా ఏమీ జరగలేదన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు బుధవారం తీవ్రస్థాయిలో కొనసాగాయి. కీవ్, చెర్నిహివ్ నగరాల్లో సైనిక మోహరింపులను తగ్గిస్తామని చెప్పినా అవి దాడులతో మోతెక్కిపోయాయి. చెర్నిహివ్‌పైనా భీకర దాడులు కొనసాగినట్టు నగర మేయర్ చెప్పారు. దాడుల్ని తగ్గిస్తామన్న హామీని రష్యా నిలబెట్టుకోలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ మండిపడ్డారు. బుధవారం ఆయన నార్వే పార్లమెంటును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. యూరప్ భవితవ్యాన్ని నిర్ణయించే యుద్ధంలో తాము ఒంటరిగా పోరాడుతున్నామని వాపోయారు. అయితే, తటస్థంగా ఉండేందుకు ఉక్రెయిన్ అంగీకరించడం ద్వారా తమ ప్రధాన డిమాండ్లలో ఒకదానికి ఒప్పుకుందని చర్చల్లో రష్యా బృందానికి నేతృత్వం వహించిన వ్లాదిమిర్ మెడిన్స్కీ అన్నారు. అణ్వస్త్రరహితంగా దేశంగా కొనసాగడం వంటి ప్రతిపాదనలన్నింటినీ చర్చల సందర్భంగా సమర్పించిందన్నారు. సెంట్రల్ ఉక్రెయిన్‌లో మరో రెండు సైనిక ఆయుధాగారాలను లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైళ్లతో ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ చెప్పారు. ప్రకటించింది. మైకోలేవ్‌లోని ఉక్రెయిన్ ప్రత్యేక దళాల ప్రధాన కార్యాలయాన్ని డోనెట్స్క్ ప్రాంతంలోని ఆయుధ డిపోను ఇస్కండర్ మిసైళ్లతో ధ్వంసం చేశామన్నారు. ఉక్రెయిన్ నుంచి వలసలు 40 లక్షలు దాటినట్టు ఐరాస వెల్లడించింది. మరో కల్నల్ మృతి రష్యా మోటరైజ్డ్ రైఫిల్ బ్రిగేడ్ కల్నల్ డెనిస్ కురిలోను ఖర్కీవ్ వద్ద హతమార్చినట్టు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. దీంతో రష్యా కోల్పోయిన కల్నల్ ర్యాంక్ అధికారుల సంఖ్య 8కి పెరిగింది. నేడు భారత్‌కు లావ్రోవ్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురు, శుక్రవారాల్లో భారత్‌లో పర్యటించనున్నారు. రష్యా చమురు దిగుమతులకు రూపాయి–రూబుల్ పద్ధతిలో చెల్లింపులు చేయాలని ఆయన ప్రతిపాదించనున్నారు. ఇప్పటికే సరఫరా ఒప్పందాలు కుదిరిన మిలిటరీ హార్డ్‌వేర్, ఎస్–400 మిసైల్ వ్యవస్థ విడిభాగాలను సకాలంలో అందించాల్సిందిగా భారత్ కోరే అవకాశముంది. లావ్రోవ్ ప్రస్తుతం చైనాలో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. ఇంగ్లండ్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రుస్ కూడా గురువారం భారత్ రానున్నారు. అమెరికా జాతీయ భద్రతా ఉప సలహాదారు దలీప్‌సింగ్, జర్మనీ విదేశాంగ, భద్రతా వ్యవస్థ సలహాదారు జెన్స్ ప్లాట్నర్ బుధవారమే భారత్ చేరుకున్నారు. రష్యా చమురుకు గుడ్‌బై: పోలండ్ రష్యా నుంచి చమురు దిగుమతులకు ఈ ఏడాది చివరికల్లా పూర్తిగా మంగళం పాడతామని పోలండ్ ప్రధాని మాటెజ్ మొరావికి ప్రకటించారు. బొగ్గు దిగుమతులను మే కల్లా నిలిపేస్తామని చెప్పారు. ఇతర యూరప్ దేశాలు తమ బాటలో నడవాలని సూచించారు. అమెరికా, సౌదీ, ఖతర్, కజాకిస్థాన్, నార్వే తదితర దేశాల నుంచి చమురు, గ్యాస్ దిగుమతులను పెంచుకునేందుకు టెర్మినళ్లను విస్తరించేందుకు పోలండ్ చర్యలు చేపట్టింది. జర్మనీ కూడా రష్యా దిగుమతులను వీలైనంతగా తగ్గించుకుంటామని చెప్పింది. గ్యాస్, చమురు, బొగ్గు తదితర రష్యా దిగుమతులకు రూబుల్స్‌లో చెల్లింపులు చేయాలన్న పుతిన్ డిమాండ్‌ను యూరప్ దేశాలు నిరాకరించడం తెలిసిందే. అయినా రష్యా మాత్రం రూబుల్స్ చెల్లింపు పథకానికి రూపకల్పన చేస్తోంది. దీని వివరాలను త్వరలో వెల్లడిస్తామని పుతిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ చెప్పారు. యుద్ధ నష్టాలను పుతిన్‌కు చెప్పలేదు ఉక్రెయిన్‌తో యుద్ధం వల్ల రష్యాకు జరుగుతున్న సైనిక, ఆర్థిక నష్టాలను కప్పిపుచ్చడం ద్వారా పుతిన్‌ను ఆయన సలహాదారులు తప్పుదోవ పట్టించారని అమెరికా నిఘా విభాగం అభిప్రాయపడింది. ‘‘బహుశా నిజం తెలిస్తే పుతిన్ ఎలా స్పందిస్తారోనని వాళ్లు భయపడి ఉంటారు. ఆయనకు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలిసొస్తున్నాయి. దాంతో సీనియర్ సైనికాధికారులకు, పుతిన్‌కు మధ్య టెన్షన్ నెలకొంది’’ అని చెప్పుకొచ్చింది. -
మ్యాగజైన్ స్టోరీ 26 March 2022
-
Ukraine Russia War: కీవ్‌లో కల్లోలం.. ఏ క్షణంలోనైనా
కీవ్ నుంచి సాక్షి ప్రతినిధి: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను ఎలాగైనా స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా నగరంలో రష్యా సైన్యం కల్లోలమే సృష్టిస్తోంది. రష్యా బలగాలు ప్రస్తుతం కీవ్‌కు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో మోహరించి ఉన్నాయి. ఏ క్షణంలోనైనా నగరంపైకి వచ్చిపడతాయని వార్తలు వస్తున్నాయి. కవరేజీలో భాగంగా కీవ్‌లో ఉన్న ‘సాక్షి’ ప్రతినిధికి అడుగడుగునా యుద్ధ బీభత్సాన్ని కళ్లకు కట్టే హృదయ విదారక దృశ్యాలే కన్పించాయి. నగరంలోని 33 లక్షల జనాభాలో మూడొంతుల మంది ఇప్పటికే వలసబాట పట్టినట్టు చెబుతున్నారు. నగరంపైకి నిత్యం బాంబులు, క్షిపణులు దూసుకొస్తూనే ఉన్నాయి. ఆవాస ప్రాంతాలను కూడా లక్ష్యం చేసుకుని విచక్షణారహితంగా దాడులు జరుగుతున్నాయి. నగర నడిమధ్యలో ఉన్న అతి పెద్ద షాపింగ్ మాల్ రెట్రోవిల్లా భవనం దాడిలో నేలమట్టమైంది. కీవ్‌ను వీలైనంత త్వరగా ఆక్రమించి తన అనుకూల కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం రష్యా లక్ష్యంగా కన్పిస్తోంది. కీవ్‌ను ఇప్పటికే అన్నివైపుల నుంచీ సైన్యం చుట్టుముట్టిందని స్థానిక ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు. ఏ క్షణంలోనైనా నగరంపై అది విరుచుకుపడుతుందని ఆందోళన చెందుతున్నారు. నగరంపై రష్యా దాడిని అడ్డుకోవడానికి ఉక్రెయిన్ సైన్యం శాయశక్తులా ప్రయత్నిస్తోంంది. హైవేలు, ఇతర రోడ్లపై ప్రతి 200 నుంచి 300 మీటర్ల దూరంలో ఒకటి చొప్పున బారికేడ్లు ఏర్పాటు చేశారు. చదవండి: (Russia-Ukraine war: రణరంగంలో రసాయనాయుధాలు!) -
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం
కీవ్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం. దాదాపు నెల రోజుల యుద్ధంలో ప్రధానంగా ఆత్మరక్షణకే పరిమితమైన ఉక్రెయిన్ తాజాగా రష్యా దళాలపై ఎదురుదాడికి దిగుతోంది! మంగళవారం హోరాహోరీ పోరులో రాజధాని కీవ్ శివార్లలో వ్యూహాత్మకంగా కీలకమైన మకరీవ్ నుంచి రష్యా సేనలను వెనక్కు తరిమి దాన్ని స్వాధీనం చేసుకుంది. దీంతో కీలకమైన స్థానిక హైవేపై ఉక్రెయిన్ సైన్యానికి తిరిగి పట్టు చిక్కింది. వాయవ్య దిక్కు నుంచి కీవ్‌ను చుట్టముట్టకుండా రష్యా సైన్యాన్ని అడ్డుకునే వెసులుబాటు కూడా దొరికింది. అయితే బుచా, హోస్టొమెల్, ఇర్పిన్ తదితర శివారు ప్రాంతాలను మాత్రం రష్యా సైన్యం కొంతమేరకు ఆక్రమించగలిగిందని ఉక్రెయిన్ రక్షణ శాఖ పేర్కొంది. ఎలాగోలా కీవ్‌ను చేజిక్కించుకునేందుకు యుద్ధం మొదలైనప్పటి నుంచీ రష్యా విశ్వప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం కూడా బాంబు, క్షిపణి దాడులతో కీవ్, శివార్లు, పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. ఈ నేపథ్యంలో నగరంలో కర్ఫ్యూను బుధవారం దాకా పొడిగించారు. మారియుపోల్‌లో వినాశనం కీలక రేవు పట్టణం మరియుపోల్‌లో రష్యా గస్తీ బోటును, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. నగరాన్ని ఆక్రమించేందుకు రష్యా సైన్యాలు చేస్తున్న ప్రయత్నాలను నిరంతరం తిప్పికొడుతున్నట్టు చెప్పింది. నగర వీధుల్లో శవాలు గుట్టలుగా పడున్నాయని నగరం నుంచి బయటపడ్డ వాళ్లు చెప్తున్నారు. మారియుపోల్‌లోనే కనీసం 10 వేల మందికి పైగా పౌరులు మరణించి ఉంటారని భావిస్తున్నారు! మూడో వంతుకు పైగా ప్రజలు ఇప్పటికే నగరం వదిలి పారిపోయారు. ప్రధానంగా నగరాలే లక్ష్యంగా రష్యా సేనలు వైమానిక, భూతల దాడులను తీవ్రతరం చేస్తున్నాయి. అయితే రష్యా సేనలకు ఎక్కడికక్కడ తీవ్ర ప్రతిఘటనే ఎదురవుతోంది. ఉక్రెయిన్ సేనలు మెరుపుదాడులతో వాటిని నిలువరిస్తున్నాయి. యుద్ధం వల్ల ఇప్పటికే కోటి మంది దాకా ఉక్రేనియన్లు నిరాశ్రయులయ్యారు. దేశ జనాభాలో ఇది దాదాపు నాలుగో వంతు. వీరిలో కనీసం 40 లక్షలకు పైగా దేశం వీడారు. యుద్ధాన్ని నివారించేందుకు తమతో కలిసి రావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోరారు. తాజా పరిస్థితిపై నేతలిద్దరూ ఫోన్లో చర్చించారు. రష్యా గెలుపు అసాధ్యమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. ఈ సమస్యకు చర్చలతో మాత్రమే పరిష్కారం సాధ్యమన్నారు. ఉక్రేనియన్లు నరకం చవిచూస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. రష్యా గ్యాస్ వదులుకోలేం: జర్మనీ రష్యాపై ఆంక్షల పరంపర కొనసాగుతున్నా, ఆ దేశం నుంచి ఇంధన సరఫరాలను వదులుకోలేమని జర్మనీ స్పష్టం చేసింది. ఈ విషయంలో తమ వైఖరిలో ఏ మార్పూ లేదని జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ మంగళవారం చెప్పారు. పలు యూరప్ దేశాలు రష్యా గ్యాస్‌పై తమకంటే ఎక్కువగా ఆధారపడ్డాయన్నారు. తమ ఇంధన అవసరాలను ఇతర మార్గాల్లో తీర్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశామని చెప్పారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో కలిసి రష్యాను కఠినాతి కఠినమైన ఆంక్షలతో ఇప్పటికే కుంగదీస్తున్నామని గుర్తు చేశారు. జర్మనీ గ్యాస్ అవసరాల్లో దాదాపు సగం రష్యానే తీరుస్తున్న విషయం తెలిసిందే. -
Russia-Ukraine war: ప్రధాన నగరాలే టార్గెట్
కీవ్/లెవివ్/మాస్కో/వాషింగ్టన్: ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై రష్యా సైన్యం క్షిపణులతో విరుచుకుపడుతోంది. రాజధాని కీవ్ శివార్లతో పాటు పశ్చిమాన లెవివ్ సిటీపై శుక్రవారం ఉదయం భీకర దాడులు జరిపింది. లెవివ్ నడిబొడ్డున బాంబుల మోత మోగించింది. కొన్ని గంటలపాటు దట్టమైన పొగ వ్యాపించింది. క్షిపణి దాడుల్లో ఎయిర్‌పోర్టు సమీపంలో యుద్ధ విమానాల మరమ్మతు కేంద్రం, బస్సుల మరమ్మతు కేంద్రం దెబ్బతిన్నాయి. రష్యా నల్ల సముద్రం నుంచి లెవివ్‌పై క్షిపణులను ప్రయోగిస్తోంది. రెండు క్షిపణులను నేలకూల్చామని ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. క్రామాటోర్స్క్ సిటీలో ఇళ్లపైనా క్షిపణులు వచ్చి పడుతున్నాయి. ఖర్కీవ్‌లో మార్కెట్లను కూడా వదలడం లేదు. చెర్నిహివ్‌లో ఒక్కరోజే 53 మృతదేహాలను మార్చురీలకు తరలించారు. మారియుపోల్‌లో బాంబుల మోతతో జనం బెంబేలెత్తిపోతున్నారు. బాంబు దాడులకు గురైన థియేటర్ నుంచి 130 మంది బయటపడగా 1,300 మంది బేస్మెంట్లో తలదాచుకున్నట్లు భావిస్తున్నారు. రష్యా కల్నల్, మేజర్ మృతి ఉక్రెయిన్ సైన్యం దాడుల్లో పెద్ద సంఖ్యలో రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కల్నల్ సెర్గీ సుఖరెవ్, మేజర్ సెర్గీ క్రైలోవ్ కూడా వీరిలో చనిపోయినట్టు రష్యా అధికారిక టెలివిజన్ కూడా దీన్ని ధ్రువీకరించింది. రష్యా ఇప్పటిదాకా 7,000 మందికి పైగా సైనికులను కోల్పోయినట్టు సమాచారం. బైడెన్‌కు జెలెన్స్కీ కృతజ్ఞతలు తమకు అదనపు సైనిక సాయం అందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్ సైనిక సామర్థ్యాన్ని రష్యా సరిగా అంచనా వేయలేకపోయిందన్నారు. ఆపేయండి: హాలీవుడ్ దిగ్గజం ఆర్నాల్డ్ ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని ప్రఖ్యాత హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగ్గర్ రష్యాకు సూచించారు. పుతిన్ స్వార్థ ప్రయోజనాల కోసం రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందన్నారు. ‘‘నా తండ్రి కూడా కొందరి మాయమాటలు నమ్మి హిట్లర్ తరపున రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్నారు. భౌతికంగా, మానసికంగా గాయపడి ఆస్ట్రియాకు తిరిగొచ్చారు’’ అన్నారు. మానవత్వం చూపాల్సిన సమయం: భారత్ రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్‌లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయని, సామాన్యులు మృత్యువాత పడుతున్నారని ఐరాసలో భారత శాశ్వత రాయబారి తిరుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. నిరాశ్రయులను తక్షణమే ఆదుకోవాల్సిన అవసరముందని భద్రతా మండలి భేటీలో ఆయనన్నారు. భారత్ తనవంతు సాయం అందిస్తోందని గుర్తుచేశారు. ఉక్రెయిన్‌లో సామాన్యులు చనిపోతుండడం తీవ్ర ఆందోళనకరమని ఐరాస పొలిటికల్ చీఫ్, అండర్ సెక్రెటరీ జనరల్ రోజ్మేరీ డికార్లో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సి ఉందన్నారు. రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్‌లో 60.6 లక్షల మంది నిరాశ్రయులైనట్లు ఐక్యరాజ్యసమితి మైగ్రేషన్ ఏజెన్సీ వెల్లడించింది. ఉక్రెయిన్‌తో చర్చల్లో పురోగతి: రష్యా ఉక్రెయిన్‌తో తాము జరుపుతున్న చర్చల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తోందని రష్యా తరపు బృందానికి సారథ్యం వహిస్తున్న వ్లాదిమిర్ మెడిన్స్కీ శుక్రవారం చెప్పారు. ఉక్రెయిన్‌కు తటస్థ దేశం హోదా ఉండాలని తాము కోరుతున్నామని, ఈ విషయంలో ఒక ఒప్పందానికి ఇరుపక్షాలు దగ్గరగా వచ్చినట్లు వెల్లడించారు. నాటోలో చేరాలన్న ఉక్రెయిన్ ఉద్దేశం పట్ల ఇరు దేశాల మధ్య భేదాభిప్రాయాలు క్రమంగా తగ్గిపోతున్నాయన్నారు. ర్యాలీలో పాల్గొన్న పుతిన్ రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం రాజధాని మాస్కోలో భారీ ర్యాలీలో స్వయంగా పాల్గొన్నారు. ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా ద్వీపకల్పం రష్యాలో విలీనమై 8 ఏళ్లయిన సందర్భంగా మాస్కోలోని లుఝ్నికీ స్టేడియం చుట్టూ ఈ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 2 లక్షల మంది హాజరయ్యారు. ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్న తమ సైనిక బలగాలపై ఈ సందర్భంగా పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఉక్రెయిన్‌లో నాజీయిజంపై పుతిన్ పోరాడుతున్నారని వక్తలన్నారు. రష్యా చమురుపై జర్మనీ ఆంక్షలు! ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్న రష్యాకు ముకుతాడు వేయక తప్పదన్న సంకేతాలను జర్మనీ ఇచ్చింది. రష్యా నుంచి చమురు దిగుమతులపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తామని జర్మనీ విదేశాంగ మంత్రి అనాలెనా బెయిర్‌బాక్ చెప్పారు. చమురు కోసం తాము రష్యాపై ఆధారపడుతున్నప్పటికీ ఇది మౌనంగా ఉండే సమయం కాదన్నారు. క్లిష్ట సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌లో ఫోన్లో దాదాపు గంటపాటు మాట్లాడారు. ఉక్రెయిన్‌లో కాల్పులు విరమణకు వెంటనే అంగీకరించాలని కోరారు. -
ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దూకుడు.. చర్చలంటూనే ముట్టడి
కీవ్/వాషింగ్టన్: ఒకవైపు చర్చలు.. మరోవైపు క్షిపణుల మోతలు. ఉక్రెయిన్–రష్యా మధ్య ప్రస్తుతం ఇదీ పరిస్థితి. ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు విరుచుకుపడుతన్నాయి. దండయాత్ర మొదలై మూడు వారాలవుతున్నా ఇంకా లక్ష్యం పూర్తికాకపోవడంతో అసహనంగా ఉన్న రష్యా సైన్యం దూకుడు పెంచింది. ప్రధానంగా రాజధాని కీవ్‌పై దృష్టి పెట్టింది. కీవ్ చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు నగరం లోపల సైతం బుధవారం రష్యా బలగాలు నిప్పుల వర్షం కురిపించాయి. సెంట్రల్ కీవ్‌లో 12 అంతస్తుల ఓ అపార్టుమెంట్ భవనం మంటల్లో చిక్కుకుంది. చివరి అంతస్తు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. సమీపంలోని భవనం కూడా ధ్వంసమయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్లు తెలిసింది. కీవ్ శివార్లపైనా రష్యా భీకర దాడులు సాగిస్తోంది. బుచాతోపాటు జైటోమిర్ పట్టణంపై బాంబులు ప్రయోగించింది. కీవ్‌కు ఉత్తరంవైపు 80 కిలోమీటర్ల దూరంలోని ఇవాంకివ్ నగరాన్ని రష్యా పూర్తిగా స్వాధీనం చేసుకుంది. బెలారస్ సరిహద్దుల్లోని ఉక్రెయిన్ భూభాగాలపై పట్టు సాధించింది. రష్యా నావికా దళం మారియుపోల్, ఒడెశా పట్టణాలపై దాడులు జరిపినట్లు ఉక్రెయిన్ అధికార వర్గాలు తెలిపాయి. రష్యా సేనలను తమ బలగాలు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. రష్యా అధీనంలో ఉన్న ఖేర్సన్ ఎయిర్‌పోర్టు, ఎయిర్‌బేస్‌పై తమ సైన్యం దాడి చేసిందని, రష్యా హెలికాప్టర్లు, సైనిక వాహనాలను ధ్వంసం చేసిందని తెలిపింది. రెండో పెద్ద నగరమైన ఖర్కీవ్‌లోకి రష్యా జవాన్లు అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నట్లు వివరించింది. ఉక్రెయిన్‌కు చెందిన 111 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 160 డ్రోన్లు, 1,000కి పైగా మిలటరీ ట్యాంకులతోపాటు ఇతర వాహనాలను తమ సైనికులు ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ ప్రకటించారు. ► ఉక్రెయిన్ నుంచి తమ దేశానికి ఇప్పటిదాకా 47,153 మంది శరణార్థులుగా వచ్చారని, వీరిలో 19,069 మంది మైనర్లు ఉన్నారని ఇటలీ బుధవారం వెల్లడించింది. ► ఉక్రెయిన్‌తో జరుపుతున్న చర్చల్లో.. ఆ దేశ సైన్యానికి తటస్థ హోదా కోసం తాము ఒత్తిడి పెంచుతున్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పారు. ఉక్రెయిన్ భద్రతకు హామీనిస్తూ అక్కడి సైన్యానికి తటస్థ హోదా ఉండాలని తాము సూచిస్తున్నామని తెలిపారు. ► ఉక్రెయిన్‌కు సైనిక బలగాలను పంపించే ఉద్దేశం తమకు లేదని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ మరోసారి స్పష్టం చేశారు. ► చెర్నీహివ్ నగరంలో ఆహారం కోసం బారులు తీరిన ప్రజలపై రష్యా కాల్పులు జరిపిందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. ఈ కాల్పుల్లో 10 మంది పౌరులు మృతిచెందారని తెలిపారు. ► తమ దేశంలో మరో మేయర్, ఉప మేయర్‌ను రష్యా సైన్యం అపహరించిందని రష్యా విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఆరోపించారు. అమెరికా సాయం వెంటనే కావాలి రష్యాపై జరుగుతున్న యుద్ధంలో అమెరికా సాయం మరింత కావాలని జెలెన్స్కీ కోరారు. తమకు వెంటనే సాయం అందించాలంటూ అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)కు విన్నవించారు. ఈ మేరకు జెలెన్స్కీ విజ్ఞప్తిని అమెరికా పార్లమెంట్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. మిలటరీ ఆపరేషన్ సక్సెస్: పుతిన్ ఉక్రెయిన్‌లో తమ సైనిక చర్చ విజయవంతమైందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. తమ దేశంపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ‘కౌన్సిల్ ఆఫ్ యూరప్’ ఖండించింది. తమ కౌన్సిల్ నుంచి రష్యాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్–రష్యా శాంతి ప్రణాళిక! యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఉక్రెయిన్–రష్యా దేశాలు శాంతి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. కాల్పుల విరమణ, ‘నాటో’లో చేరాలన్న ఆకాంక్షలను ఉక్రెయిన్ వదులుకుంటే రష్యా దళాలు పూర్తిగా వెనక్కి తగ్గడం, సైనిక బలగాల సంఖ్యను కుదించుకోవడానికి ఉక్రెయిన్ అంగీకారం.. వంటివి ఈ ప్రణాళికలో ఉన్నాయని తెలియజేసింది. యుద్ధం ఆపాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపాలని ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్(ఐసీజే).. రష్యాను ఆదేశించింది. రష్యాపై ఉక్రెయిన్ ఐసీజేకు రెండు వారాల క్రితమే ఫిర్యాదు చేయడం తెల్సిందే. ఈ కేసులోనే కోర్టు రష్యాను ఆదేశించింది. ఈ కేసులో ఐసీజేలో భారతీయ న్యాయమూర్తి దల్వీర్ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటేయడం గమనార్హం. -
ఉక్రెయిన్‌లో రష్యా బాంబుల మోత
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా బాంబుల మోత మోగిస్తోంది. రాజధాని కీవ్ సహా పలు కీలక నగరాలపై రష్యా సైన్యం దాడులు సోమవారం మరింత పదునెక్కాయి. కీవ్‌ను ఆక్రమించేందుకు రష్యా దళాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. నగరాన్ని, శివార్లను లక్ష్యం చేసుకుని క్షిపణులు, బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దాంతో ఇర్పిన్, బుచా, హోస్టొమెల్ వంటి శివారు ప్రాంతాలు దద్దరిల్లిపోతున్నాయి. దాడుల్లో నగరంలోని ఒక పెద్ద అపార్ట్మెంట్ కూలిపోగా ప్రపంచంలోనే అతి పెద్ద రవాణా విమానాలు తయారు చేసే కీవ్‌లోని ఆంటొనోవ్ ఫ్యాక్టరీ దెబ్బ తిన్నది. ప్లాంటులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మారియుపోల్, మైకోలెయివ్, ఖర్కీవ్ సహా పలు నగరాలు దాడుల ధాటికి అల్లాడుతున్నాయి. మైకోలెయివ్, ఖర్కీవ్‌ల్లో రష్యా వైమానిక దాడుల్లో పలు నివాస భవనాలు, రివైన్ ప్రాంతంలో ఓ టీవీ టవర్ నేలమట్టమయ్యాయి. పౌర మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఒక్క మారియుపోల్‌లోనే కనీసం 2,500 మందికి పైగా యుద్ధానికి బలైనట్టు నెక్స్టా మీడియా పేర్కొంది. ఉక్రెయిన్ నుంచి వలసలు 28 లక్షలు దాటాయని ఐరాస పేర్కొంది. సంక్షోభంపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్, చైనా విదేశాంగ శాఖ సలహాదారు యాంగ్ జీచీ రోమ్‌లో చర్చలు జరిపారు. మా అంచనాలు తప్పుతున్నాయి: రష్యా యుద్ధం తాము ఆశించినట్టుగా సాగడం లేదని రష్యా తొలిసారి అంగీకరించింది. తమ సేనలు అనుకున్న దానికంటే నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయని రష్యా నేషనల్ గార్డ్స్ చీఫ్ విక్టర్ జొలొటోవ్ అన్నారు. మరోవైపు రష్యా జీఆర్యూ మిలిటరీ ఇంటలిజెన్స్ అధికారి కెప్టెన్ అలెక్సీ గుల్చక్ సోమవారం మారియుపోల్‌లో దాడుల్లో మరణించారు. దీంతో యుద్ధంలో ఇప్పటిదాకా మరణించిన రష్యా సైనికాధికారుల సంఖ్య 12కు చేరింది. ఎటూ తేల్చని నాలుగో రౌండ్ చర్చలు భీకర దాడుల మధ్యే సోమవారం రష్యా, ఉక్రెయిన్ మధ్య సోమవారం నాలుగో రౌండ్ చర్చలు జరిగాయి. గంటల తరబడి జరిగిన చర్చలు చెప్పుకోదగ్గ ఫలితమేదీ లేకుండానే ముగిశాయి. ముట్టడిలో ఉన్న నగరాలకు సాయం అందించడం తదితరాలకే చర్చలు పరిమితమైనట్టు సమాచారం. చర్చలు మంగళవారం కొనసాగనున్నాయి. శాంతి, కాల్పుల విరమణ, తక్షణం సైన్యాల ఉపసంహరణ, భద్రత హామీలను తమ ప్రధాన డిమాండ్లుగా ఉంచినట్టు ఉక్రెయిన్ చెప్పింది. చైనా సైనిక సాయం కోరిన రష్యా! ఉక్రెయిన్‌పై పట్టు సాధించేందుకు మిత్రదేశం చైనాను రష్యా సైనిక సాయం అర్థిస్తోందని అమెరికా సీనియర్ అధికారి ఒకరన్నారు. ఆయుధాలు, సైనిక సామాగ్రి కోరుతోందని వెల్లడించారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షల భయంతో చైనా ఎటూ తేల్చుకోలేకపోతోందని సమాచారం. ఇది తప్పుడు ప్రచారమని, చైనాతో పాటు రష్యా కూడా ఖండించింది. ఆహార విపత్తును ఎదుర్కొంటాం: ఐరాస చూçస్తుండగానే ఉక్రెయిన్ శ్మశానంగా మారిపోతోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆవేదన వెలిబుచ్చారు. అణు యుద్ధ ప్రమాదం వెన్నులో చలి పుట్టిస్తోందన్నారు. ప్రపంచ ఆహార భద్రతపైనా యుద్ధం పెను ప్రభావం చూపుతోందన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆహార, ఇంధన విపత్తు స్పందన కూటమిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 30 వేల సైన్యంతో నాటో విన్యాసాలు ఉక్రెయిన్‌పై రష్యా దాడితో అంతర్జాతీయంగా నానాటికీ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నాటో భారీ బల ప్రదర్శనకు దిగింది. యూరప్, ఉత్తర అమెరికా నుంచి 25కు పైగా సభ్య దేశాలకు చెందిన 30 వేల మంది సైనికులు, 200 యుద్ధ విమానాలు, 50కి పైగా యుద్ధ నౌకలతో ఉత్తర నార్వేలో సోమవారం భారీ కవాతు జరిపింది. ఇది యుద్ధానికి చాలా ముందే ఖరారైన షెడ్యూల్ అని, రష్యాకూ వీటిపై సమాచారముందని నార్వే చెప్పింది. రెండేళ్లకోసారి జరిగే ఈ విన్యాసాలు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 1న ముగియాలి. ప్రత్యక్ష చర్చలు జరపాలి: భారత్ యుద్ధం ఆగాలని ఐరాసలో భారత ప్రతినిధి ఆర్.రవీంద్ర ఆకాంక్షించారు. ఇరు దేశాలు ప్రత్యక్షంగా చర్చలు ప్రారంభించాలని కోరారు. ఆయన సోమవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్‌తో తాము సంప్రదింపులు కొనసాగిస్తామని అన్నారు. ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాలు, దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను అన్ని దేశాలు గౌరవించాలని సూచించారు. నిండు చూలాలు దుర్మరణం రష్యా దాడికి ఓ నిండు చూలాలు బలైన వైనం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. మారియుపోల్‌లో ఓ ప్రసూతి ఆస్పత్రిపై జరిగిన దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. అంబులెన్సుతో తరలిస్తుండగా నొప్పితో అల్లాడుతున్న వీడియో వైరలైంది. హుటాహుటిన మరో ఆస్పత్రికి తరలించి సిజేరియన్ చేసినా లాభం లేకపోయింది. పాప దక్కదని అర్థమయ్యాక ‘నన్ను చంపేయండి’ అంటూ ఆమె రోదించిన తీరు డాక్టర్లను కూడా కలచివేసింది. నాతో ఫైటింగ్‌కు రా పుతిన్‌కు ఎలాన్ మస్క్ చాలెంజ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనతో ద్వంద్వ యుద్ధానికి రావాలని టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ సవాలు చేశారు. ఉక్రెయిన్ను పందెంగా ఒడ్డాలంటూ ట్వీట్ చేశారు. పుతిన్‌కు వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ లేకపోవడంతో, తన సవాలుకు రష్యా అధ్యక్షుని అధికారిక అకౌంట్ ద్వారా స్పందించాలని సూచించారు. ‘‘నాతో ఫైటింగ్‌కు ఒప్పుకుంటారా?’’ అని పుతిన్‌ను ప్రశ్నించారు. అందులో పుతిన్, ఉక్రెయిన్ పేర్లను రష్యన్లో రాశారు. యుద్ధం వల్ల ఇంటర్నెట్ సేవలకు దూరమైన ఉక్రెయిన్‌కు తన స్టార్‌లింక్ కంపెనీ శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని మస్క్ అందజేయడం తెలిసిందే. -
Russia-Ukraine war: భీకర పోరు
మారియుపోల్/లెవివ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం 18వ రోజుకు చేరుకుంది. రష్యా సైన్యం భీకర దాడులు కొనసాగిస్తోంది. రాజధాని కీవ్‌తోపాటు ముఖ్య నగరాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా క్షిపణులతో నిప్పుల వర్షం కురిపిస్తోంది. సైనిక స్థావరాలనే కాదు, సాధారణ నివాస గృహాలను కూడా విడిచిపెట్టడం లేదు. కీవ్, మారియుపోల్‌లో పరిస్థితి భీతావహంగా మారింది. కాల్పుల మోత ఆగకపోవడంతో పౌరుల తరలింపు సాధ్యం కావడంలేదు. నీరు, ఆహారం, అత్యవసర ఔషధాలు అందక జనం హాహాకారాలు చేస్తున్నారు. ఎప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక బంకర్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మారియుపోల్‌లో విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా నిలిచిపోయింది. రాజధాని కీవ్ చుట్టూ రష్యా సైన్యం మోహరించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మైఖేలో పొడొల్యాక్ చెప్పారు. కీవ్‌పై రష్యా సైన్యం చాలావరకు పట్టు సాధించిందని తెలిపారు. రాజధానిని ప్రత్యర్థుల కబంధ హస్తాల నుంచి కాపాడుకొనేందుకు జనం సిద్ధమవుతున్నారని వెల్లడించారు. పశ్చిమ ఉక్రెయిన్‌లోని లెవివ్ నగర సమీపంలో ఉన్న యారోవివ్ సైనిక శిక్షణా కేంద్రంపై ఆదివారం ఉదయం రష్యా గగనతల దాడుల్లో 35 మంది మరణించారు. మరో 57 మంది గాయపడ్డారు. పోలండ్ సరిహద్దుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న యారోవివ్ మిలటరీ రేంజ్‌పై రష్యా సైన్యం రాకెట్లు ప్రయోగించిందని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. దీన్ని యారోవివ్ ఇంటర్నేషనల్ పీస్‌కీపింగ్, సెక్యూరిటీ సెంటర్గానూ పిలుస్తారు. అమెరికా సైనికాధికారులు ఇక్కడ ఉక్రెయిన్ సైన్యానికి స్వయంగా శిక్షణ ఇస్తుంటారు. ఈ మిలటరీ రేంజ్లో నాటో దేశాల సైనిక విన్యాసాలు జరుగుతుంటాయి. అయితే, యారోవివ్ శిక్షణా కేంద్రంలో మాటువేసిన 180 మంది విదేశీ కిరాయి సైనికులను హతమార్చామని, విదేశీ ఆయుధాలను ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. ఆయుధాలు సమకూర్చుకోవడానికి ఉక్రెయిన్‌కు మరో 20 కోట్ల డాలర్లు అందజేస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం అందజేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యా హెచ్చరించింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలు తెచ్చే నౌకలను పేల్చేస్తామని వెల్లడించింది. నకిలీ రిపబ్లిక్లను సృష్టిస్తే సహించం తమ దేశాన్ని ముక్కలు చేయడానికి రష్యా తమ భూభాగంలో నకిలీ రిపబ్లిక్లను సృష్టించేందుకు కుట్ర పన్నుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. డొనెట్స్క్, లుహాన్స్క్ తరహా అనుభవాలను పునరావృతం కానివ్వబోమన్నారు. ఖేర్సన్ ప్రాంతాన్ని రిపబ్లిక్‌గా మార్చేందుకు రష్యా ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందన్నారు. మానవతా కారిడార్ల ద్వారా 1,25,000 మందిని దేశం నుంచి క్షేమంగా బయటకు పంపించామని వివరించారు. మరో మేయర్‌ను అపహరించిన రష్యా! దినిప్రొరుడ్నె నగర మేయర్ యెవ్హెన్ మాట్‌వెయెవ్‌ను ఆదివారం రష్యా సైనికులు కిడ్నాప్ చేశారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులేబా ఆరోపించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇప్పటికే మెలిటోపోల్ సిటీ మేయర్ ఇవాన్ ఫెడోరోవ్‌ను రష్యా సైన్యం అపహరించినట్లు వార్తలు రావడం తెలిసిందే. భారత ఎంబసీ పోలండ్‌కు మార్పు ఉక్రెయిన్‌లో పరిస్థితులు భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉక్రెయిన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని(ఎంబసీ) పొరుగు దేశం పోలండ్‌కు తాత్కాలికంగా మార్చాలని నిర్ణయించింది. రాజధాని కీవ్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ సిబ్బంది ఇప్పటికే లెవివ్ నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. రష్యా దాడుల్లో అమెరికా జర్నలిస్టు మృతి ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని ఇర్పిన్లో రష్యా దాడుల్లో ప్రఖ్యాత ‘ద న్యూయార్క్ టైమ్స్’లో పనిచేసిన బ్రెంట్ రెనాడ్(51) మృతి చెందినట్లు ‘కీవ్ ఇండిపెండెంట్’ పత్రిక ఆదివారం వెల్లడించింది. మరో ఇద్దరు అమెరికా జర్నలిస్టులు గాయపడ్డారని తెలియజేసింది. అమెరికాకు చెందిన బ్రెంట్ రెనాడ్ సినీ దర్శకుడిగానూ పని చేస్తున్నారు. నాటో జోలికొస్తే ప్రతిదాడులే: అమెరికా ఉక్రెయిన్–నాటో దేశాల సరిహద్దుల్లో రష్యా దాడులకు దిగితే ప్రతిదాడులు చేస్తామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, తాజా పరిణామాలపై జేక్ సలీవన్, చైనా విదేశాంగ విధానం సీనియర్ సలహాదారు యాంగ్ జీచీ సోమవారం రోమ్‌లో చర్చలు జరుపనున్నారు. గూగుల్ ఉన్నతాధికారులకు బెదిరింపులు పుతిన్‌కు వ్యతిరేకంగా ఓట్లను నమోదు చేసే ఒక యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించాలని రష్యా అధికారులు గూగుల్ మహిళా ఉన్నతాధికారిని బెదిరించారు. ఈ యాప్‌ను 24 గంటల్లో తొలగించకుంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరించడంతో కంపెనీ ఆమెను ఒక హోటల్‌కు తరలించింది. కానీ కేజీబీ ఏజెంట్లు అక్కడకు వచ్చి మరోమారు బెదిరించారని తెలిపింది. దీంతో స్మార్ట్ ఓటింగ్ యాప్ గంటల్లో ప్లేస్టోర్ నుంచి మాయమైంది. తనకు ఇలాంటి బెదిరింపులే తమకూ వచ్చాయని యాపిల్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఉక్రెయిన్‌తో చర్చల్లో పురోగతి: రష్యా ఇరుదేశాల మధ్య యుద్ధంపై ఉక్రెయిన్‌తో జరుగుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి లభించిందని రష్యా తరపు ప్రతినిధి లియోనిడ్ స్లట్స్కీ ఆదివారం చెప్పారు. చర్చల ప్రారంభం నాటితో పోలిస్తే ఇప్పుడు స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోందని అన్నారు. ఉక్రెయిన్–రష్యా ప్రతినిధుల మధ్య బెలారస్ సరిహద్దులు ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలు ఇలాగే సానుకూల ధోరణితో కొనసాగితే రెండు దేశాల నడుమ ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని స్లట్స్కీ వివరించారు. ఆశ్రయమిస్తే నెలకు 350 పౌండ్లు ఉక్రెయిన్ శరణార్థులకు ఇళ్లల్లో ఉచితంగా వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తే నెలకు 350 పౌండ్లు చొప్పున భత్యం అందజేస్తామని యూకే హౌసింగ్ సెక్రెటరీ మైఖేల్ గోవ్ చెప్పారు. కనీసం 6 నెలలపాటు ఆశ్రయం కల్పించాల్సి ఉంటుందన్నారు. ఉక్రెయిన్ నుంచి ఎంతోమంది ప్రాణభయంతో తరలివస్తున్నారని, ఒక్కొక్కరి అవసరాలను తీర్చడానికి గాను స్థానిక కౌన్సిళ్లకు 10 వేల పౌండ్లుచొప్పున ఇస్తామన్నారు. శరణార్థులకు వైద్య సేవలు, వారి పిల్లల స్కూళ్ల ఫీజులు సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు ఆసక్తి ఉన్నవారు సోమవారం నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. శరణార్థులు మూడేళ్లపాటు ఉండొచ్చని తెలిపారు. -
Ukraine-Russia War: దిగ్బంధంలో కీవ్
లెవివ్/వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఉధృతమవుతున్నాయి. ఉక్రెయిన్ సైనికులతోపాటు స్థానికుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ రష్యా సైన్యం దూసుకుపోతోంది. కీలక నగరాలపై పట్టు సాధించడానికి గగనతలం నుంచి బాంబుల వర్షం కురిపిస్తోంది. రాజధాని కీవ్‌కు ఇతర ప్రాంతాలతో సంబంధాలను ఆక్రమించేందుకు ఈశాన్యంగా చుట్టుముడుతోంది. కీవ్ శివార్లలో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. మరోవైపు పోర్టు సిటీ మారియుపోల్‌లో చిన్నారులతో సహా 80 మందికి పైగా పౌరులు తలదాచుకున్న మసీదుపై రష్యా సైన్యం శనివారం క్షిపణులతో భీకర దాడికి దిగింది. మారియుపోల్‌లో యుద్ధ మరణాలు 1,500 దాటినట్లు మేయర్ కార్యాలయం ప్రకటించింది. కీవ్ పరిధిలోని పెరెమోహా గ్రామంలో పౌరులను తరలిస్తున్న వాహన కాన్వాయ్‌పై రష్యా బాంబు దాడి జరగడంతో ఏడుగురు పౌరులు మరణించారు. మైకోలైవ్ నగరంలోనూ రష్యా బీభత్సం సృష్టిస్తోంది. దాడిలో క్యాన్సర్ ఆసుపత్రి, నివాస సముదాయాలు దెబ్బతిన్నాయని అధికారులు చెప్పారు. మారియుపోల్ తూర్పు శివారు ప్రాంతాలను రష్యా సైన్యం పూర్తిగా స్వాధీనం చేసుకుందని ఉక్రెయిన్ ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్ వలసలు 26 లక్షలు దాటినట్టు సమాచారం. యుద్ధం ఆపాలంటూ పోప్ ఫ్రాన్సిస్ ట్వీట్ చేశారు. జర్మనీ చాన్స్‌లర్ స్కోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. కాల్పులు విరమించాలని కోరారు. మరో మేజర్ జనరల్ మృతి యుద్ధంలో రష్యా మరో సైనిక ఉన్నతాధికారిని కోల్పోయింది. మారియుపోల్‌లో తమ దాడిలో రష్యా మేజర్ జనరల్ ఆండ్రీ కొలేస్నికోవ్ చనిపోయినట్టు ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. రష్యా ఇప్పటికే ఇద్దరు మేజర్ జనరల్స్‌ను పోగొట్టుకోవడం తెలిసిందే. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వారిని ఆదుకోవడానికి ప్రత్యేక కారిడార్ల ఏర్పాటు కోసం ఉక్రెయిన్, రష్యాలతో చర్చిస్తున్నట్టు ఐరాస చెప్పింది. 12,000 మంది అమెరికా సైనికులు రష్యాతో సరిహద్దులున్న లాత్వియా, ఎస్తోనియా, లిథువేనియా, రొమేనియా తదితర దేశాలకు 12,000 మంది సైనికులను పంపినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ గెలవలేరన్నారు. రష్యాకు ఎదురొడ్డి ఉక్రెయిన్ ప్రజలు అసామాన్య ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. అయితే ఈ యుద్ధంలో తాము భాగస్వాములం కాబోమన్నారు. నాటో సభ్య దేశాల భూభాగాలను కాపాడుకునేందుకు రష్యా సరిహద్దులకు 12,000 అమెరికా సైనికులను పంపించినట్టు చెప్పారు. ఉక్రెయిన్ సైన్యంలోకి... స్నైపర్ వలీ ‘రష్యాపై జరుగుతున్న యుద్ధంలో మాకు సహాయం చేయండి’ అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన విజ్ఞప్తి పట్ల కెనడా మాజీ సైనికులు సానుకూలంగా స్పందించారు. కెనడా రాయల్ 22వ రెజిమెంట్‌కు చెందిన పూర్వ సైనికులు ఉక్రెయిన్ సైన్యంలో చేరారు. వీరిలో ప్రపంచంలోనే అత్యుత్తమ స్నైపర్ వలీ కూడా ఉన్నారు. రష్యా అన్యాయమైన యుద్ధం చేస్తోందని, అందుకే ఉక్రెయిన్‌కు అండగా రంగంలోకి దిగానని వలీ చెప్పారు. గతంలో ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదులపై పోరాడిన కుర్దిష్ దళాలకు వలీ సాయం అందించారు. వలీ ఒక్కరోజులో కనీసం 40 మందిని హతమార్చగలడంటారు. 2017 జూన్‌లో ఇరాక్‌లో 3,540 మీటర్ల దూరంలో ఉన్న ఐసిస్ జిహాదిస్ట్‌ను సునాయాసంగా కాల్చి చంపాడు. మెలిటోపోల్ మేయర్ కిడ్నాప్ మెలిటోపోల్ మేయర్‌ను రష్యా సైనికులు అపహరించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. రష్యా సైన్యం ఐసిస్ ఉగ్రవాదుల్లా రాక్షసంగా ప్రవర్తిస్తోందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను బందీలుగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. రష్యాపై పోరాటం కొనసాగించాలని ఉక్రెయిన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మేయర్‌ను రష్యా జవాన్లు కిడ్నాప్ చేస్తున్న వీడియోను ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ప్రతినిధి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మీ పిల్లలను యుద్ధానికి పంపొద్దు..రష్యా తల్లులకు జెలెన్స్కీ విజ్ఞప్తి ‘దయచేసి మీ పిల్లలను యుద్ధ రంగానికి పంపకండి, వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టకండి’ అని రష్యా మహిళలకు జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. సాధారణ ప్రజలను ఉక్రెయిన్‌లో యుద్ధంలోకి దించేందుకు రష్యా ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఉద్యోగాలిస్తాం, కేవలం సైనిక శిక్షణ ఇస్తాం అనే మాటలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మొద్దని కోరారు. యుద్ధంలో తమ సైనికులు 1,300 మంది అమరులయ్యారని వెల్లడించారు. కీవ్‌ను స్వాధీనం చేసుకొనేందుకు అమాయకులను రష్యా పొట్టన పెట్టుకుంటోందని ఆరోపించారు. సంక్షోభానికి ముగింపు పలకడానికి ఇజ్రాయెల్‌లోని జెరూసలేంలో చర్చిద్దామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు జెలెన్స్కీ ప్రతిపాదించినట్లు సమాచారం. -
రష్యాకు లొంగిపోయిన తొలి ఉక్రెయిన్ నగరం
కీవ్: ఉక్రెయిన్‌పై యుద్ధం నానాటికీ ఉగ్రరూపు దాలుస్తోంది. దేశంలోని పలు నగరాలపై రష్యా సైన్యం కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుపడుతోంది. పెద్దపెట్టున బాంబులు, క్షిపణి దాడులతో హడలెత్తిస్తోంది. రాజధాని కీవ్‌పై బాంబుల వర్షమే కురిపిస్తోంది. ఎక్కడ చూసినా చెలరేగుతున్న మంటలతో నగరం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. యుద్ధం మొదలైన 8 రోజుల అనంతరం ఎట్టకేలకు ఒక నగరాన్ని రష్యా ఆక్రమించుకోగలిగింది. 3 లక్షల జనాభా ఉండే కీలకమైన రేవు పట్టణమైన ఖెర్సన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు రష్యా సైన్యం ప్రకటించింది. స్థానిక పాలనా యంత్రాంగం కూడా దీన్ని ధ్రువీకరించింది. బేషరతుగా లొంగిపోయి రష్యా సైన్యానికి సహకరించాలంటూ ప్రజలకు నగర మేయర్ పిలుపునిచ్చారు. కీవ్‌తో పాటు పలు ఇతర నగరాలపైనా రష్యా భారీగా విరుచుకుపడుతోంది. దేశంలో రెండో అతి పెద్ద నగరమైన ఖర్కీవ్‌పై దాడులను తీవ్రతరం చేసింది. దాంతో ఇక్కడినుంచి జనం తండోపతండాలుగా పారిపోతూ కన్పిస్తున్నారు. వారితో రైల్వేస్టేషన్లన్నీ కిక్కిరిసిపోయాయి. మరో కీలక రేవు పట్టణం మారిపోల్ కూడా బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. అక్కడి విద్యుత్కేంద్రాలు ఇతర మౌలిక సదుపాయాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురుస్తోంది. కరెంటు లేక నగరం అంధకారంలో మునిగిపోయింది. ఆహారం, తాగునీరు లేక జనం అల్లాడుతున్నారు. టెలిఫోన్ సేవలు కూడా దాదాపుగా స్తంభించిపోయాయి. ఇక ఖెర్సన్‌ను ఆక్రమించిన రష్యా సేనలు అక్కడినుంచి మరో రేవు పట్టణం మైకోలెవ్ దిశగా కదులుతున్నాయి. భారీ కాన్వాయ్‌లు తమకేసి దూసుకొస్తున్నాయని నగర మేయర్ ధ్రువీకరించారు. రష్యా నావికా దళం కూడా యుద్ధ రంగంలోకి కదులుతోంది. సముద్రంతో పాటు నేలపైనా దూసుకుపోగల వాహనాలు సముద్ర మార్గంలో ఒడెసా తీరంకేసి కదులుతున్నట్టు ఉక్రెయిన్ సైన్యం పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్ నుంచి వలసలు 10 లక్షలు దాటిపోయాయి. దేశ జనాభాలో 2 శాతానికి పైగా ఇప్పటికే సరిహద్దులు దాటారని ఐరాస అంచనా వేసింది. పోరాడుతున్న ఉక్రెయిన్ రష్యా దళాలను ఉక్రెయిన్ సేనలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. గెరిల్లా తరహా యుద్ధ వ్యూహాలతో ప్రతి చోటా అడుగడుగునా ఆటంకపరుస్తున్నాయి. సైన్యం చొచ్చుకురాకుండా అడ్డుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ వాడుకుంటున్నాయి. నగరాలకు దారితీసే నేమ్ బోర్డులను మార్చడం, తారుమారు చేయడం, బ్రిడ్జీలను పేల్చేయడం తదితర చర్యలకు దిగుతున్నాయి. మరోవైపు యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 9 వేలకు పైగా రష్యా సైనికులను మట్టుబెట్టిన్టట్టు ఉక్రెయిన్ సైనిక జనరల్ కార్యాలయం ఫేస్బుక్ పోస్టులో పేర్కొంది. రష్యాకు చెందిన సైనిక ఉన్నతాధికారి మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవెట్సికీని తమ స్నైపర్ చంపేశాడని ఉక్రెయిన్ చెప్పింది. తమపై దండయాత్ర రష్యా అనుకున్న రీతిలో సాగడం లేదనేందుకు ఇదే నిదర్శనమంది. రష్యా ఫైటర్ జెట్‌ను ఒకదానిన కూల్చేసినట్టు కూడా ప్రకటించింది. ఆండ్రీ రష్యా సెంట్రల్ మిలటరీ జిల్లా 41వ సీఏఏకు డిప్యుటీ కమాండర్. ఆయన మరణాన్ని రష్యా ధ్రువీకరించలేదు. రష్యా సైన్యాలను తమ యోధులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. బాంబులు, క్షిపణులు, రాకెట్ లాంచర్లతో కూడిన భారీ దాడిని కీవ్ మరో రోజు తట్టుకుని నిలిచిందన్నారు. దాంతో దిక్కుతోచక యుద్ధ విమానాల ద్వారా భారీ దాడులకు రష్యా దిగుతోందన్నారు. ఉక్రేనియన్లు గ్యాంగ్స్టర్లు యుద్ధం ఆపేదే లేదు: పుతిన్ ఉక్రెయిన్లను భయంకరమైన గ్యాంగ్స్టర్లుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభివర్ణించారు. ఉక్రెయిన్ సైనికులు నియో నాజీలని, పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. అక్కడి అమాయాకులను కాపాడేందుకు రష్యా సైన్యం తీవ్రంగా పోరాడుతోందని చెప్పుకున్నారు. ఏదేమైనా పట్టించుకోబోనని, అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు చివరిదాకా పోరును కొనసాగిస్తామని టీవీలో మాట్లాడుతూ ప్రకటించారు. దాడిని ఆపే ఉద్దేశమే లేదని అంతకుముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఫోన్ సంభాషణలో పుతిన్ స్పష్టం చేశారు. పుతిన్ తీరు సరిగా లేదని మాక్రాన్ కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. ‘‘మీరు భారీ తప్పిదానికి పాల్పడుతున్నారు. పైగా మిమ్మల్ని మీరే మోసగించుకుంటున్నారు’’ అని చెప్పారంటున్నారు. పౌరులను పోనిద్దాం రెండో దఫా చర్చల్లో రష్యా, ఉక్రెయిన్ త్వరలో మళ్లీ సమావేశానికి అంగీకారం కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండో దఫా చర్చలు బెలారస్ సమీపంలో పోలండ్ సరిహద్దుల వద్ద గురువారం జరిగాయి. చర్చల సందర్భంగా ఇరు దేశాలూ తమ డిమాండ్లపై పట్టుబట్టినట్టు సమాచారం. అయితే పౌరులు యుద్ధ క్షేత్రాల నుంచి సురక్షితంగా తరలి వెళ్లేందుకు సహకరించాలని, అందుకు వీలుగా ఆయా చోట్ల తాత్కాలికంగా కాల్పులను విరమించాలని అంగీకారానికి వచ్చినట్టు చెబుతున్నారు. దీనిపై మరోసారి సమావేశమై చర్చించాలని నిర్ణయించినట్టు రష్యా తరఫున చర్చల్లో పాల్గొన్న పుతిన్ సలహాదారు వ్లాదిమిర్ మెడిన్స్కీ తెలిపారు. చర్చల్లో ఇరు దేశాలూ తమ తమ డిమాండ్లకు కట్టుబడ్డాయన్నారు. కొన్నింటిపై పట్టువిడుపులతో వ్యవహరించాలన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమైందని చెప్పారు. -
ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం
కీవ్: ఉక్రెయిన్‌పై దాడులను బుధవారం రష్యా మరింత ఉధృతం చేసింది. దేశంలోని రెండో పెద్ద నగరం ఖర్కీవ్‌పై బాంబులు, క్షిపణులతో మరింతగా విరుచుకుపడింది. పలు జనసమ్మర్ధ ప్రాంతాలపై విచక్షణారహితంగా దాడులకు దిగింది. ఉత్తర ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్‌లోనూ దాడులు మారణహోమం సృష్టిస్తున్నాయి. ఇక రాజధాని కీవ్ స్వాధీనమే లక్ష్యంగా మంగళవారం బయల్దేరిన 64 కిలోమీటర్ల పొడవైన భారీ రష్యా సైనిక కాన్వాయ్ నగరాన్ని అన్నివైపుల నుంచీ వ్యూహాత్మకంగా చుట్టుముడుతోంది. సైనిక స్థావరాలతో పాటు నివాసాలు, ఆవాస సముదాయాలు, మౌలిక వ్యవస్థలపై భారీగా బాంబు దాడులకు, క్షిపణి ప్రయోగాలకు దిగుతుండటంతో రోజంతా నగరం పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. దక్షిణాదిన తీర ప్రాంత నగరం మారిపోల్‌లోనూ ఇదే పరిస్థితి! పలు నగరాలు రష్యా అధీనంలోకి వెళ్లాయని వార్తలు వస్తున్నాయి. దాడుల భయంతో దేశవ్యాప్తంగా బంకర్లలో, పార్కింగ్ స్థలాల్లో, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్న వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వణికించే చలిలో కనీస రక్షణ ఏర్పాట్లు కూడా లేకపోవడంతో వారంతా గజగజ వణుకుతున్నారు. తిండీతిప్పలకూ గతి లేక అల్లాడిపోతున్నారు. ఇప్పటికే 2000 మందికి పైగా అమాయకులు యుద్ధానికి బలైనట్టు ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం ప్రకటించింది. ఉక్రెయిన్ నగరాలపై రష్యా వాయు, భూతల దాడులు భారీగా పెరిగాయని ఇంగ్లండ్ రక్షణ శాఖ పేర్కొంది. వలస బాట పట్టిన ఉక్రేనియన్ల సంఖ్య 9 లక్షలు దాటిందని ఐరాస వలసల ఏజెన్సీ పేర్కొంది. త్వరలో 10 లక్షలు దాటేస్తుందని ఆందోళన వెలిబుచ్చింది. మంటల్లో ఖర్కీవ్ రష్యా దాడుల ధాటికి ఖర్కీవ్ నిప్పుల కుంపటిలా మారుతోంది. నగరంలోని ప్రాంతీయ పోలీసు, నిఘా విభాగాల ప్రధాన కార్యాలయాలపై రష్యా దళాలు బుధవారం భారీగా బాంబుల వర్షం కురిపించాయి. ఇందులో కనీసం నలుగురు మరణించినట్టు సమాచారం. ఐదంతస్తుల పోలీసు విభాగం భవనం పై కప్పు దాడుల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. భవన శిథిలాలు పక్క వీధుల దాకా చెల్లాచెదురుగా పడ్డాయి. వీటికి సంబంధించిన వీడియో ఫుటేజీని పోలీసు విభాగం విడుదల చేసింది. వీటితో పాటు బుధవారం కూడా పలు నివాసాలు, ఆవాస సముదాయాలపై పెద్దపెట్టున బాంబులు, క్షిపణులు విరుచుకుపడ్డాయని సమాచారం. చెర్నిహివ్‌లో ఒక ఆస్పత్రిపై రెండు క్రూయిజ్ మిసైళ్లతో దాడి జరిగిందని నగర మేయర్ తెలిపారు. ప్రధాన భవనం పూర్తిగా దెబ్బ తినడంతో పాటు భారీగా ప్రాణ నష్టం జరిగిందని వెల్లడించారు. దాడుల తీవ్రత వల్ల గాయపడ్డ వారిని కనీసం తరలించే పరిస్థితి కూడా లేదని మారిపోల్ మేయర్ వాపోయారు. హోలోకాస్ట్ స్మారకం ధ్వంసం ఖర్కీవ్‌లో టీవీ టవర్‌పై మంగళవారం జరిగిన దాడిలో రెండో ప్రపంచయుద్ధం నాటి హోలోకాస్ట్ స్మారకం కూడా బాగా దెబ్బతిందని ఉక్రెయిన్ పేర్కొంది. 1941లో ఇక్కడ హిట్లర్ నాజీ సేనలు 33 వేల మందికి పైగా యూదులను రెండు రోజుల పాటు చిత్రహింసలు పెట్టి చంపాయి. దానికి గుర్తుగా నిర్మించిన స్మారకం రష్యా దాడిలో దెబ్బ తిన్నది. హసిడిక్ యూదులకు ప్రముఖ యాత్రా స్థలమైన ఉమన్ నగరంపై కూడా బాంబుల వర్షం కురిసింది. చివరికి యాత్రా స్థలాలను, చారిత్రక కట్టడాలను కూడా లక్ష్యంగా చేసుకుంటూ రష్యా నానాటికీ దిగజారి ప్రవర్తిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ దుయ్యబట్టారు. దాని తీరు మానవత్వానికే మాయని మచ్చ అని ఫేస్బుక్ పోస్టులో మండిపడ్డారు. ‘‘ఉక్రెయిన్ చరిత్రను, దాంతోపాటు మా ప్రజలందరినీ పూర్తిగా తుడిచిపెట్టేయాలని సైన్యాలకు మాస్కో నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. అందుకే ఇంతటి నైచ్యానికి ఒడిగడుతున్నారు’’ అని ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండించాలని, తమకు అన్నివిధాలా సాయం రావాలని ప్రపంచ దేశాలన్నింటికీ మరోసారి విజ్ఞప్తి చేశారు. 498 మంది మరణించారు: రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఇప్పటిదాకా 498 మంది రష్యా సైనికులు మరణించారని ఆ దేశం ప్రకటించింది. 1,597 మంది గాయపడ్డారని రక్షణ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనషెంకోవ్ వెల్లడించారు. తమకు భారీగా ప్రాణ నష్టం జరిగిందన్న వార్తలను కొట్టిపారేశారు. 2,870 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులను హతమార్చామన్నారు. 3,700 మందికి పైగా గాయపడ్డారని, 572 మంది యుద్ధ ఖైదీలుగా దొరికారని చెప్పారు. ఈ యుద్ధంలో తమ సైనికులు మరణించారని రష్యా అంగీకరించడం ఇదే తొలిసారి. మాల్డోవా మీదా దాడి? మిన్స్క్: ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన మాల్డోవాపై కూడా దాడికి రష్యా ప్రణాళిక వేస్తోందని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో అన్నారు. ఆ దేశ సెక్యూరిటీ కౌన్సిల్ భేటీలో ఆయన ఈ మేరకు చెప్పారు. సంబంధిత వీడియోను బెలారస్ ప్రభుత్వమే ఆన్లైన్లో పెట్టింది. దక్షిణ ఉక్రెయిన్‌లోని రేపు పట్టణమైన ఒడెసా గుండా మాల్డోవాపైకి రష్యా దండెత్తుతుందని లుకషెంకో చెప్పుకొచ్చారు. దీనిపై యూరప్ దేశాలు మరింత మండిపడుతున్నాయి. -
మేమున్న అపార్ట్‌మెంట్‌పై దాడి జరిగింది
కీవ్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నాను. ఇక్కడ బాంబుల మోతమోగుతోంది. భద్రతా సిబ్బంది నన్ను, మరో 40 మంది విద్యార్థులను మా అపార్ట్మెంట్ నుంచి దూరంగా ఓ బంకర్‌కు తరలించారు. తర్వాత గంటకే మా అపార్ట్ మెంట్ పక్కన ఉన్న మెట్రో స్టేషన్‌పై మిస్సైల్ దాడి జరిగింది. మా అపార్ట్మెంట్లో రెండంత స్తులు కూడా దెబ్బ తిన్నాయి. బంకర్లో భయం భయంగా ఉంటున్నాం. కరెంటు, నీటి వసతి, ఆహారం సరిగా లేదు. త్వరగా ఇండియాకు తీసుకెళ్లాలి. – గాజుల అభిషేక్, మదనపల్లి, మాక్లూరు మండలం, నిజామాబాద్ -
కీవ్ సమీపానికి రష్యా సేనలు
Ukraine conflict: ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలపై ప్రత్యక్ష దాడికి దిగిన రష్యా సేనలు శుక్రవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ సరిహద్దులకు వచ్చాయి. ఉక్రెయిన్‌లోని పలు నగరాలు, మిలటరీ బేస్‌లపై రష్యా వైమానిక దాడులు శుక్రవారం కూడా కొనసాగాయి. మూడు వైపుల నుంచి ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయి. ఉక్రెయిన్‌లో ప్రస్తుత ప్రభుత్వాన్ని తొలగించి తమకనుకూల ప్రభుత్వాన్ని కూర్చోబెట్టాలన్నదే పుతిన్ ప్రయత్నమని ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి. ఇందులో భాగంగా కీవ్ వైపు పుతిన్ తన బలగాలను నడిపిస్తున్నట్లు భావిస్తున్నారు. శుక్రవారం కీవ్ నగరంలో పలుచోట్ల పేలుళ్లు వినిపించాయి. పశ్చిమం వైపునుంచి కీవ్‌కు సంబంధాలను నిలిపివేశామని రష్యా బలగాలు తెలిపాయి. నీపర్ నదిపై వంతెన వద్ద 200 మంది ఉక్రెయిన్ సైనికులు రష్యా బలగాలను ఎదుర్కొంటున్నారు. కీవ్‌కు 60 కిలోమీటర్ల దూరంలోని ఇవాంకివ్ నగరంలో రష్యా బలగాలతో భీకరంగా పోరాటం జరిపినట్లు ఉక్రెయిన్ మిలటరీ తెలిపింది. కీవ్‌కు తూర్పున ఉన్న సుమే నగరంలోకి మాత్రం రష్యా బలగాలు ప్రవేశించాయి. మరోవైపు పాశ్చాత్య దేశాల నేతలు ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశమవుతున్నారు. పలు దేశాలు మరింత కఠినమైన ఆంక్షలను రష్యాపై విధించాయి. కీవ్‌కు దగ్గరలోని ఒక వ్యూహాత్మక ఎయిర్‌పోర్టును స్వాధీనం చేసుకున్నట్లు రష్యా బలగాలు ప్రకటించాయి. రష్యా గూఢచారులు కీవ్ సమీపంలో ఉన్నారని ఉక్రెయిన్ బలగాలు చెప్పాయి. నగరంలో పలుచోట్ల ఉక్రెయిన్ సైనికులు భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు. కీవ్‌పై దాడి తప్పక జరుగుతుందని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకన్ అభిప్రాయపడ్డారు. తామంతా భయం గుప్పిట్లో బతుకుతున్నామని ఉక్రెయిన్ ప్రజలు మీడియా ముందు వాపోయారు. రష్యా దాడి తప్పదన్న భయాలతో వేలాదిమంది పౌరులు అండర్‌గ్రౌండ్‌లో దాగారు. దీంతో పలుచోట్ల సబ్వే స్టేషన్లు నిండిపోయాయి. రష్యా టార్గెట్ నేనే రష్యా దాడి ప్రధాన లక్ష్యం తానేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. తాను దేశం విడిచిపోలేదని, కీవ్‌లోనే ఉంటానని ప్రకటించారు. యుద్ధంలో 137 మంది సైనికులు మరణించారని, 316 మంది పౌరులు గాయపడ్డారని చెప్పారు. తమ ప్రతిదాడిలో 400కు పైగా రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. రష్యా ఇంతవరకు అధికారిక మృతుల సంఖ్యను ప్రకటించలేదు. కేవలం తమ యుద్ధ విమానం ఒకటి మాత్రం కూలిపోయిందని, అదికూడా పైలెట్ తప్పిదం వల్ల జరిగిందని తెలిపింది. 25 మంది పౌరులు దాడిలో చనిపోయారని, లక్ష మంది నిరాశ్రయులయ్యారని, దాడి ముమ్మరమైతే 4 లక్షలమంది పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఐరాస వర్గాలు తెలిపాయి. యూరప్‌లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న అతిపెద్ద భౌగోళిక ముట్టడి ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు. యూరోపియన్ యూనియన్ నేతల సమావేశానికి జెలెన్స్కీ ఆన్లైన్లో హాజరవుతారు. ఉక్రెయిన్ నగరాలను తాము లక్ష్యంగా చేసుకోలేదని రష్యా ప్రకటించింది. అయితే పలు నగరాల్లో పౌర ఆవాసాలు దాడుల్లో ధ్వంసమైనట్లు ఉక్రెయిన్‌లోని పాత్రికేయులు చెప్పారు. వణికించిన పేలుళ్లు రాజధాని కీవ్ నగరం శుక్రవారం రష్యా బలగాల దాడులతో దద్దరిల్లింది. దీంతో ప్రజలంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. పలు నగరాలను స్వాధీనం చేసుకున్న రష్యా సేనలు ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కీవ్వైపు కదులుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టి తమకనుకూల ప్రభుత్వాన్ని ప్రతిష్టించడమే పుతిన్ లక్ష్యమని అమెరికా ఆరోపించింది. ఇందుకోసమే రష్యా సేనలు రాజధానిని లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపించింది. రష్యా ప్రయోగించిన ఒక రాకెట్ దెబ్బకు భారీ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయని కీవ్ మేయర్ తెలిపారు. ఇప్పటికే చెర్నోబిల్‌ను రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. దీంతో ఇక రష్యా దృష్టి పూర్తిగా కీవ్‌పై ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా దుర్మార్గ మార్గాన్ని ఎంచుకుందని కానీ తాము తమ స్వాతంత్య్రం కోసం పోరాడతామని జెలెన్స్కీ ప్రకటించారు. ఆయుధాలు వీడితే చర్చిద్దాం! ► ఉక్రెయిన్ను ఆక్రమించే యోచన లేదు ► రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ మాస్కో: ఉక్రెయిన్ సేనలు ఆయుధాలు వీడితే చర్చలకు తాము సిద్ధమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ శుక్రవారం ప్రకటించారు. తమ అధ్యక్షుడు పుతిన్ కోరినట్లు సైన్యం ఆయుధాలు వీడి స్పందిస్తే ఎప్పుడైనా చర్చిద్దామన్నారు. డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్, లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ (ఇటీవల రష్యా గుర్తించిన భూభాగాలు) విదేశాంగ మంత్రులతో చర్చల అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. తమ సైనిక చర్య కేవలం ఉక్రెయిన్ను డీనాజీఫై(నాజీలు లేకుండా చేయడం), డీమిలటరైజ్ ( నిస్సైనికీకరణ) చేసేందుకేనని, ఉక్రెయిన్ను ఆక్రమించేందుకు కాదని చెప్పారు. ‘‘ పుతిన్ పిలుపునకు స్పందించి ఉక్రెయిన్ తన పోరాటాన్ని నిలిపి వేసి, ఆయుధాలు వదిలేస్తే చర్చలకు తయారుగా ఉన్నాం. ఉక్రేనియన్లపై దాడి చేసి వారిని అణచివేయాలని ఎవరూ అనుకోవడం లేదు. ఉక్రేనియన్లకు తమ భవిష్యత్‌ను తామే నిర్ణయించుకునే అవకాశం ఇద్దాం.’’ అని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. చర్చలకు కొరత లేదని, కానీ చర్చల స్థానంలో కఠోర విధ్వంసం జరిగినప్పుడు, మిన్స్క్ ఒప్పందాల అమలులో రష్యా విఫలమైందని అసత్య ఆరోపణలు చేస్తున్నప్పుడు (ఇందులో పాశ్చాత్య దేశాలది ప్రముఖ పాత్ర), రష్యా దౌర్జన్యం చేస్తోందని ఆరోపిస్తూ ఈ దఫా అన్ని పరిమితులను దాటినప్పుడు చర్చలుండవన్నారు. బెలారస్‌కు బృందం ఉక్రెయిన్ అధికారులతో చర్చలకు ఒక బృందాన్ని బెలారస్‌కు పంపేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధికార వర్గాలు తెలిపాయి. ఏ కూటమిలో చేరకుండా తటస్థంగా ఉండేందుకు తాము సిద్ధమని జెలెన్స్కీ ప్రకటించిన నేపథ్యంలో పుతిన్ స్పందించినట్లు తెలిపాయి. అయితే వార్సా నగరానికి చర్చకు వస్తామని ఉక్రెయిన్ అధికారులు చెప్పారని అనంతరం ఎలాంటి సందేశం రాలేదని రష్యా వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ను డీమిలటరైజ్ చేయడం కోసమే తాము దాడి చేస్తున్నామని పుతిన్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే! ఉక్రెయిన్ సైనికులు ఆయుధాలు త్యజించి ఇళ్లకు వెళ్లాలని సూచించారు. రేపు మీకూ ప్రమాదమే! ‘మీరు మాకిప్పుడు సహాయం చేయకపోతే, రేపు యుద్ధం మీ తలుపు తడుతుంది’ అని జెలెన్స్కీ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. తమ పై పడే ప్రతి బాంబు యూరప్‌పై పడినట్లేనని ఆయన యూరోపియన్ యూనియన్ దేశాలకు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియదు. నేరుగా ఉక్రెయిన్ను ఆక్రమిస్తామని రష్యా చెప్పకపోయినా, ఉక్రెయిన్ను ఇలాగే వదిలేస్తే ఎప్పటికైనా నాటోలో చేరవచ్చని పుతిన్ భావిస్తున్నారు. అందుకే తమకు అనుకూల ప్రభుత్వం ఏర్పరచాలని యోచిస్తున్నారు. -
రష్యా ఆధీనంలోకి ఉక్రెయిన్ రాజధాని కీవ్