ఉక్రెయిన్ నుంచి పోలండ్‌కు చేరుకున్నాక కంటతడి పెట్టుకున్న తల్లిని ఓదారుస్తున్న కూతురు
కీవ్: ఉక్రెయిన్‌పై దాడులను బుధవారం రష్యా మరింత ఉధృతం చేసింది. దేశంలోని రెండో పెద్ద నగరం ఖర్కీవ్‌పై బాంబులు, క్షిపణులతో మరింతగా విరుచుకుపడింది. పలు జనసమ్మర్ధ ప్రాంతాలపై విచక్షణారహితంగా దాడులకు దిగింది. ఉత్తర ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్‌లోనూ దాడులు మారణహోమం సృష్టిస్తున్నాయి. ఇక రాజధాని కీవ్ స్వాధీనమే లక్ష్యంగా మంగళవారం బయల్దేరిన 64 కిలోమీటర్ల పొడవైన భారీ రష్యా సైనిక కాన్వాయ్ నగరాన్ని అన్నివైపుల నుంచీ వ్యూహాత్మకంగా చుట్టుముడుతోంది. సైనిక స్థావరాలతో పాటు నివాసాలు, ఆవాస సముదాయాలు, మౌలిక వ్యవస్థలపై భారీగా బాంబు దాడులకు, క్షిపణి ప్రయోగాలకు దిగుతుండటంతో రోజంతా నగరం పేలుళ్లతో దద్దరిల్లిపోయింది.
దక్షిణాదిన తీర ప్రాంత నగరం మారిపోల్‌లోనూ ఇదే పరిస్థితి! పలు నగరాలు రష్యా అధీనంలోకి వెళ్లాయని వార్తలు వస్తున్నాయి. దాడుల భయంతో దేశవ్యాప్తంగా బంకర్లలో, పార్కింగ్ స్థలాల్లో, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్న వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వణికించే చలిలో కనీస రక్షణ ఏర్పాట్లు కూడా లేకపోవడంతో వారంతా గజగజ వణుకుతున్నారు. తిండీతిప్పలకూ గతి లేక అల్లాడిపోతున్నారు. ఇప్పటికే 2000 మందికి పైగా అమాయకులు యుద్ధానికి బలైనట్టు ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం ప్రకటించింది. ఉక్రెయిన్ నగరాలపై రష్యా వాయు, భూతల దాడులు భారీగా పెరిగాయని ఇంగ్లండ్ రక్షణ శాఖ పేర్కొంది. వలస బాట పట్టిన ఉక్రేనియన్ల సంఖ్య 9 లక్షలు దాటిందని ఐరాస వలసల ఏజెన్సీ పేర్కొంది. త్వరలో 10 లక్షలు దాటేస్తుందని ఆందోళన వెలిబుచ్చింది.
మంటల్లో ఖర్కీవ్
రష్యా దాడుల ధాటికి ఖర్కీవ్ నిప్పుల కుంపటిలా మారుతోంది. నగరంలోని ప్రాంతీయ పోలీసు, నిఘా విభాగాల ప్రధాన కార్యాలయాలపై రష్యా దళాలు బుధవారం భారీగా బాంబుల వర్షం కురిపించాయి. ఇందులో కనీసం నలుగురు మరణించినట్టు సమాచారం. ఐదంతస్తుల పోలీసు విభాగం భవనం పై కప్పు దాడుల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. భవన శిథిలాలు పక్క వీధుల దాకా చెల్లాచెదురుగా పడ్డాయి. వీటికి సంబంధించిన వీడియో ఫుటేజీని పోలీసు విభాగం విడుదల చేసింది.
వీటితో పాటు బుధవారం కూడా పలు నివాసాలు, ఆవాస సముదాయాలపై పెద్దపెట్టున బాంబులు, క్షిపణులు విరుచుకుపడ్డాయని సమాచారం. చెర్నిహివ్‌లో ఒక ఆస్పత్రిపై రెండు క్రూయిజ్ మిసైళ్లతో దాడి జరిగిందని నగర మేయర్ తెలిపారు. ప్రధాన భవనం పూర్తిగా దెబ్బ తినడంతో పాటు భారీగా ప్రాణ నష్టం జరిగిందని వెల్లడించారు. దాడుల తీవ్రత వల్ల గాయపడ్డ వారిని కనీసం తరలించే పరిస్థితి కూడా లేదని మారిపోల్ మేయర్ వాపోయారు.
హోలోకాస్ట్ స్మారకం ధ్వంసం
ఖర్కీవ్‌లో టీవీ టవర్‌పై మంగళవారం జరిగిన దాడిలో రెండో ప్రపంచయుద్ధం నాటి హోలోకాస్ట్ స్మారకం కూడా బాగా దెబ్బతిందని ఉక్రెయిన్ పేర్కొంది. 1941లో ఇక్కడ హిట్లర్ నాజీ సేనలు 33 వేల మందికి పైగా యూదులను రెండు రోజుల పాటు చిత్రహింసలు పెట్టి చంపాయి. దానికి గుర్తుగా నిర్మించిన స్మారకం రష్యా దాడిలో దెబ్బ తిన్నది. హసిడిక్ యూదులకు ప్రముఖ యాత్రా స్థలమైన ఉమన్ నగరంపై కూడా బాంబుల వర్షం కురిసింది.
చివరికి యాత్రా స్థలాలను, చారిత్రక కట్టడాలను కూడా లక్ష్యంగా చేసుకుంటూ రష్యా నానాటికీ దిగజారి ప్రవర్తిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ దుయ్యబట్టారు. దాని తీరు మానవత్వానికే మాయని మచ్చ అని ఫేస్‌బుక్ పోస్టులో మండిపడ్డారు. ‘‘ఉక్రెయిన్ చరిత్రను, దాంతోపాటు మా ప్రజలందరినీ పూర్తిగా తుడిచిపెట్టేయాలని సైన్యాలకు మాస్కో నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. అందుకే ఇంతటి నైచ్యానికి ఒడిగడుతున్నారు’’ అని ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండించాలని, తమకు అన్నివిధాలా సాయం రావాలని ప్రపంచ దేశాలన్నింటికీ మరోసారి విజ్ఞప్తి చేశారు.
498 మంది మరణించారు: రష్యా
ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఇప్పటిదాకా 498 మంది రష్యా సైనికులు మరణించారని ఆ దేశం ప్రకటించింది. 1,597 మంది గాయపడ్డారని రక్షణ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనషెంకోవ్ వెల్లడించారు. తమకు భారీగా ప్రాణ నష్టం జరిగిందన్న వార్తలను కొట్టిపారేశారు. 2,870 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులను హతమార్చామన్నారు. 3,700 మందికి పైగా గాయపడ్డారని, 572 మంది యుద్ధ ఖైదీలుగా దొరికారని చెప్పారు. ఈ యుద్ధంలో తమ సైనికులు మరణించారని రష్యా అంగీకరించడం ఇదే తొలిసారి.
మాల్డోవా మీదా దాడి?
మిన్స్‌క్: ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన మాల్డోవాపై కూడా దాడికి రష్యా ప్రణాళిక వేస్తోందని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో అన్నారు. ఆ దేశ సెక్యూరిటీ కౌన్సిల్ భేటీలో ఆయన ఈ మేరకు చెప్పారు. సంబంధిత వీడియోను బెలారస్ ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో పెట్టింది. దక్షిణ ఉక్రెయిన్‌లోని రేపు పట్టణమైన ఒడెసా గుండా మాల్డోవాపైకి రష్యా దండెత్తుతుందని లుకషెంకో చెప్పుకొచ్చారు. దీనిపై యూరప్ దేశాలు మరింత మండిపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment