Russia Ukraine War Updates: Ukraine Major City Kherson Is In Russian Hands - Sakshi
Sakshi News home page

రష్యాకు లొంగిపోయిన తొలి ఉక్రెయిన్‌ నగరం

Published Fri, Mar 4 2022 5:15 AM | Last Updated on Fri, Mar 4 2022 7:38 PM

Russia bombards Ukraine urban areas as armed convoy stalls - Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌పై యుద్ధం నానాటికీ ఉగ్రరూపు దాలుస్తోంది. దేశంలోని పలు నగరాలపై రష్యా సైన్యం కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుపడుతోంది. పెద్దపెట్టున బాంబులు, క్షిపణి దాడులతో హడలెత్తిస్తోంది. రాజధాని కీవ్‌పై బాంబుల వర్షమే కురిపిస్తోంది. ఎక్కడ చూసినా చెలరేగుతున్న మంటలతో నగరం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. యుద్ధం మొదలైన 8 రోజుల అనంతరం ఎట్టకేలకు ఒక నగరాన్ని రష్యా ఆక్రమించుకోగలిగింది. 3 లక్షల జనాభా ఉండే కీలకమైన రేవు పట్టణమైన ఖెర్సన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు రష్యా సైన్యం ప్రకటించింది. స్థానిక పాలనా యంత్రాంగం కూడా దీన్ని ధ్రువీకరించింది. బేషరతుగా లొంగిపోయి రష్యా సైన్యానికి సహకరించాలంటూ ప్రజలకు నగర మేయర్‌ పిలుపునిచ్చారు. కీవ్‌తో పాటు పలు ఇతర నగరాలపైనా రష్యా భారీగా విరుచుకుపడుతోంది. దేశంలో రెండో అతి పెద్ద నగరమైన ఖర్కీవ్‌పై దాడులను తీవ్రతరం చేసింది. దాంతో ఇక్కడినుంచి జనం తండోపతండాలుగా పారిపోతూ కన్పిస్తున్నారు. వారితో రైల్వేస్టేషన్లన్నీ కిక్కిరిసిపోయాయి.

మరో కీలక రేవు పట్టణం మారిపోల్‌ కూడా బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. అక్కడి విద్యుత్కేంద్రాలు ఇతర మౌలిక సదుపాయాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురుస్తోంది. కరెంటు లేక నగరం అంధకారంలో మునిగిపోయింది. ఆహారం, తాగునీరు లేక జనం అల్లాడుతున్నారు. టెలిఫోన్‌ సేవలు కూడా దాదాపుగా స్తంభించిపోయాయి. ఇక ఖెర్సన్‌ను ఆక్రమించిన రష్యా సేనలు అక్కడినుంచి మరో రేవు పట్టణం మైకోలెవ్‌ దిశగా కదులుతున్నాయి. భారీ కాన్వాయ్‌లు తమకేసి దూసుకొస్తున్నాయని నగర మేయర్‌ ధ్రువీకరించారు. రష్యా నావికా దళం కూడా యుద్ధ రంగంలోకి కదులుతోంది. సముద్రంతో పాటు నేలపైనా దూసుకుపోగల వాహనాలు సముద్ర మార్గంలో ఒడెసా తీరంకేసి కదులుతున్నట్టు ఉక్రెయిన్‌ సైన్యం పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్‌ నుంచి వలసలు 10 లక్షలు దాటిపోయాయి. దేశ జనాభాలో 2 శాతానికి పైగా ఇప్పటికే సరిహద్దులు దాటారని ఐరాస అంచనా వేసింది.

పోరాడుతున్న ఉక్రెయిన్‌
రష్యా దళాలను ఉక్రెయిన్‌ సేనలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. గెరిల్లా తరహా యుద్ధ వ్యూహాలతో ప్రతి చోటా అడుగడుగునా ఆటంకపరుస్తున్నాయి. సైన్యం చొచ్చుకురాకుండా అడ్డుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ వాడుకుంటున్నాయి. నగరాలకు దారితీసే నేమ్‌ బోర్డులను మార్చడం, తారుమారు చేయడం, బ్రిడ్జీలను పేల్చేయడం తదితర చర్యలకు దిగుతున్నాయి. మరోవైపు యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 9 వేలకు పైగా రష్యా సైనికులను మట్టుబెట్టిన్టట్టు ఉక్రెయిన్‌ సైనిక జనరల్‌ కార్యాలయం ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొంది. రష్యాకు చెందిన సైనిక ఉన్నతాధికారి మేజర్‌ జనరల్‌ ఆండ్రీ సుఖోవెట్సికీని తమ స్నైపర్‌ చంపేశాడని ఉక్రెయిన్‌ చెప్పింది. తమపై దండయాత్ర రష్యా అనుకున్న రీతిలో సాగడం లేదనేందుకు ఇదే నిదర్శనమంది.  రష్యా ఫైటర్‌ జెట్‌ను ఒకదానిన కూల్చేసినట్టు కూడా ప్రకటించింది. ఆండ్రీ రష్యా సెంట్రల్‌ మిలటరీ జిల్లా 41వ సీఏఏకు డిప్యుటీ కమాండర్‌. ఆయన మరణాన్ని రష్యా ధ్రువీకరించలేదు. రష్యా సైన్యాలను తమ యోధులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. బాంబులు, క్షిపణులు, రాకెట్‌ లాంచర్లతో కూడిన భారీ దాడిని కీవ్‌ మరో రోజు తట్టుకుని నిలిచిందన్నారు. దాంతో దిక్కుతోచక యుద్ధ విమానాల ద్వారా భారీ దాడులకు రష్యా దిగుతోందన్నారు.

ఉక్రేనియన్లు గ్యాంగ్‌స్టర్లు
యుద్ధం ఆపేదే లేదు: పుతిన్‌
ఉక్రెయిన్లను భయంకరమైన గ్యాంగ్‌స్టర్లుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అభివర్ణించారు. ఉక్రెయిన్‌ సైనికులు నియో నాజీలని, పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. అక్కడి అమాయాకులను కాపాడేందుకు రష్యా సైన్యం తీవ్రంగా పోరాడుతోందని చెప్పుకున్నారు. ఏదేమైనా పట్టించుకోబోనని, అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు చివరిదాకా పోరును కొనసాగిస్తామని టీవీలో మాట్లాడుతూ ప్రకటించారు. దాడిని ఆపే ఉద్దేశమే లేదని అంతకుముందు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఫోన్‌ సంభాషణలో పుతిన్‌ స్పష్టం చేశారు. పుతిన్‌ తీరు సరిగా లేదని మాక్రాన్‌ కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. ‘‘మీరు భారీ తప్పిదానికి పాల్పడుతున్నారు. పైగా మిమ్మల్ని మీరే మోసగించుకుంటున్నారు’’ అని చెప్పారంటున్నారు.

పౌరులను పోనిద్దాం
రెండో దఫా చర్చల్లో రష్యా, ఉక్రెయిన్‌
త్వరలో మళ్లీ సమావేశానికి అంగీకారం

కీవ్‌: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య రెండో దఫా చర్చలు బెలారస్‌ సమీపంలో పోలండ్‌ సరిహద్దుల వద్ద గురువారం జరిగాయి. చర్చల సందర్భంగా ఇరు దేశాలూ తమ డిమాండ్లపై పట్టుబట్టినట్టు సమాచారం. అయితే పౌరులు యుద్ధ క్షేత్రాల నుంచి సురక్షితంగా తరలి వెళ్లేందుకు సహకరించాలని, అందుకు వీలుగా ఆయా చోట్ల తాత్కాలికంగా కాల్పులను విరమించాలని అంగీకారానికి వచ్చినట్టు చెబుతున్నారు. దీనిపై మరోసారి సమావేశమై చర్చించాలని నిర్ణయించినట్టు రష్యా తరఫున చర్చల్లో పాల్గొన్న పుతిన్‌ సలహాదారు వ్లాదిమిర్‌ మెడిన్‌స్కీ తెలిపారు. చర్చల్లో ఇరు దేశాలూ తమ తమ డిమాండ్లకు కట్టుబడ్డాయన్నారు. కొన్నింటిపై పట్టువిడుపులతో వ్యవహరించాలన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమైందని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement