missile strike
-
Israel-Hamas war: దిగ్బంధంలో ఆస్పత్రులు
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: దక్షిణ గాజాకు బారులు కట్టిన జనం.. హమాస్ మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. వీధుల్లో భూతల పోరాటాలు.. ఆసుపత్రులను చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సైనికులు.. గాజా స్ట్రిప్‌లో ప్రస్తుత దృశ్యమిదీ. గాజా సిటీలోని నాలుగు పెద్ద ఆసుపత్రులపై ఇజ్రాయెల్ సైన్యం గురిపెట్టింది. హమాస్ కమాండ్ సెంటర్లు అక్కడే ఉన్నాయని, వాటిని ధ్వంసం చేయక తప్పదని తేల్చిచెప్పింది. శుక్రవారం తెల్లవారుజామునే నాలుగు ఆసుపత్రుల సమీపంలో క్షిపణి దాడులు చేసింది. గాజాలో అతిపెద్దదైన అల్–షిఫా ఆసుపత్రి ప్రాంగణంలో 24 గంటల వ్యవధిలో ఐదుసార్లు క్షిపణులు ప్రయోగించింది. కొన్ని వార్డులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇంట్లో కంటే ఆసుపత్రిలోనే భద్రత ఉంటుందని ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వేలాది మంది జనం తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని క్షణమొక యుగంలా కాలం గడిపారు. అల్–ఫిఫా హాస్పిటల్ వద్ద జరిగిన దాడుల్లో ఒకరు మరణించారని, మరికొందరు గాయపడ్డారని గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. కానీ, తమ సైన్యం దాడుల్లో 19 మంది మిలిటెంట్లు హతమయ్యారని, వీరిలో హమాస్ కీలక కమాండర్, ప్లాటూన్ కమాండర్ సైతం ఉన్నారని ఇజ్రాయెల్ వెల్లడించింది. 20 రాకెట్ లాంచర్లు నిల్వ చేసిన హమాస్ షిప్పింగ్ కంటైనర్‌ను ధ్వంసం చేశామని తెలియజేసింది. గాజాసిటీలోని నాలుగు ఆసుపత్రుల చుట్టూ ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు మోహరించాయి. ఇజ్రాయెల్ సేనలు గాజా నగరంలోకి మున్ముందుకు చొచ్చుకొస్తున్నాయి. గాజాసిటీలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయగా, 20 పాలస్తీనియన్లు మరణించారని స్థానిక అధికారులు చెప్పారు. మృతులు 11,078.. క్షతగాత్రులు 27,000 ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 11,078 మంది మరణించారని, వీరిలో 4,506 మంది చిన్నారులు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. 27,000 మంది గాయపడ్డారని తెలిపింది. మరో 2,650 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారంతా ఇప్పటికే మృతిచెంది ఉండొచ్చని తెలుస్తోంది. వలస వెళ్తున్నవారిపై వైమానిక దాడులు! ఉత్తర గాజా నుంచి జనం దక్షిణ గాజాకు చేరుకోవడానికి వీలుగా ఇజ్రాయెల్ సైన్యం ప్రతిరోజూ దాదాపు 4 గంటలపాటు దాడులకు విరామం ఇస్తోంది. ఇకపై నిత్యం విరామం అమల్లో ఉంటుందని ఇజ్రాయెల్ వెల్లడించింది. గత ఐదు రోజుల్లో 1,20,000 మంది దక్షిణ గాజాకు వెళ్లిపోయారు. వారిపైనా వైమానిక దాడులు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈజిప్టు నుంచి గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందుతోంది. ఆహారం, నిత్యావసరాలు, ఔషధాలతోప్రతిరోజు దాదాపు 100 వాహనాలు గాజాకు చేరుకుంటున్నాయి. మరోవైపు, హమాస్ మిలిటెంట్లపై దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహూ పునరుద్ఘాటించారు. గాజాలో హమాస్ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసేవరకూ అవి కొనసాగుతాయన్నారు. ఉత్తర గాజా.. భూమిపై నరకం గాజాపై ఇజ్రాయెల్ సైన్యం నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతోంది. మిలిటెంట్ల స్థావరాలతోపాటు సాధారణ జనవాసాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభం కాగా, గాజాలో ఇప్పటికే దాదాపు 50 శాతం ఇళ్లు నేలమట్టం అయ్యాయి. శిథిలాలుగా మారిపోయాయి. ప్రధానంగా ఉత్తర గాజాలో పరిస్థితి భీతావహంగా మారింది. ఈ ప్రాంతం మరుభూమిని తలపిస్తోంది. ఐక్యరాజ్యసమితి హ్యూమానిటేరియన్ ఆఫీసు ఉత్తర గాజాను ‘భూమిపై నరకం’గా అభివరి్ణంచిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. -
మాట తప్పిన రష్యా.. ప్రకటన చేసిన గంటల్లోనే ఉక్రెయిన్‌పై దాడి
ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే రష్యా బాంబుల మోత మోగించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని క్రామాటోర్క్స్ నగరంపై రష్యా వైమానిక దాడికి పాల్పడినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ సమయం 36 గంటల పాటు కొనసాగనుండగా.. నిబంధనలు ఉల్లంఘించిన రష్యా దళాలు క్రామాటోర్క్స్ నగరాన్ని రెండుస్లార్లు మిస్సైల్స్‌తో విరుచుపడినట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్ గగనతలంలో వైమానిక సైరన్లు వినపడినట్లు తెలిపారు. ఈ దాడిలో ఓ నివాస భవనం దెబ్బతిందని అయితే అందులో ప్రజలు ఎవరూ లేరని పేర్కొన్నారు. కాగా రష్యాలో ఆర్థడాక్స్ క్రిస్మస్ కోసం ఉక్రెయిన్‌లో 36 గంటల కాల్పుల విరమణ పాటించాలని పుతిన్ తమ సైన్యానికి ఆదేశాలుజారీ చేసిన విషయం తెలిసందే. స్థానిక కాలమానం ప్రకారం జనవరి 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి జనవరి 7 అర్థరాత్రి 12 వరకు 36 గంటలపాటు కాల్పుల విరమణ పాటించాలని రష్యా రక్షణ మంత్రిని ఆదేశించారు. ఉక్రెయిన్ భూభాగంలో ఎలాంటి దాడులు చేయొద్దని గురువారం పేర్కొన్నారు. ప్రాచీన జూలియన్ క్యాలెండర్ ప్రకారం రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి ఆధ్వర్యంలో ప్రతిఏటా జనవరి 7వ తేదీన క్రిస్టమస్ వేడుకలు జరుగుతాయి. అయితే రష్యాతోపాటు ఉక్రెయిన్లోనూ నివసిస్తున్నవారు కూడా జనవరి 7తేదీన ఆర్థడాక్స్ క్రిస్మస్ జరుపుకుంటారు. ఇదిలా ఉండగా 10 నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఇరు దేశాల సైన్యంతోసహా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. -
Al Zawahiri: అల్‌ఖైదా చీఫ్ హతంపై బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: డ్రోన్ దాడితో అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా ముట్టుబెట్టిన విషయం తెలిసిందే. దీనిపై అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం చేయకుండానే ఉగ్రవాదాన్ని కూకటివెేళ్లతో పెకలించివేయవచ్చు అనేందుకు జవహరి ఘటనే నిదర్శనమన్నారు. అతని మృతితో 9/11 దాడుల బాధిత కుటుంబాలకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అలాగే ఒక్క పౌరుని ప్రాణాలకు కూడా హాని లేకుండా జవహరిని అంతం చేసినందుకు అధ్యక్షుడు జో బైడెన్ పాలనాయంత్రాంగంపై ప్రశంసల వర్షం కురిపించారు ఒబామా. ఈ క్షణం కోసం రెండు దశాబ్దాలుగా నిర్విరామంగా కృషి చేసిన అమెరికా నిఘా వర్గాలను కొనియాడారు. More than 20 years after 9/11, one of the masterminds of that terrorist attack and Osama bin Laden’s successor as the leader of al-Qaeda – Ayman al-Zawahiri – has finally been brought to justice. — Barack Obama (@BarackObama) August 2, 2022 కాబూల్‌లో తన కుటుంబసభ్యులతో కలిసి ఓ ఇంట్లో ఉన్న అల్ జవహరి బాల్కనీలోకి వచ్చినప్పుడు డ్రోన్లతో క్షిపణిదాడులు చేసింది అమెరికా. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. జో బైడెన్ ఈ విషయాన్ని సోమవారం వెల్లడించారు. అతని మృతితో 9/11 ఘటన బాధితుల కుటుంబాలకు న్యాయం చేసినట్లయిందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన నిఘా వర్గాలను కొనియాడారు. 9/11 ఘటన అనంతరం ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఆఫ్గానిస్థాన్‌లో రెండు దశాబ్దాల పాటు యుద్ధం చేశాయి అమెరికా బలగాలు. అఫ్గాన్ సైన్యానికి కూడా శిక్షణ ఇచ్చాయి. అయితే గతేడాదే అమెరికా బలగాలను ఉపసంహరించారు జో బైడెన్. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు యుద్ధం చేయాల్సిన అవసరం లేదని ఒబామా అన్నారు. చదవండి: రెండు దశాబ్దాల వేట.. అల్ ఖైదా చీఫ్‌ను అమెరికా ఎలా మట్టుబెట్టిందంటే? -
Russia Ukraine war: రష్యాపై ఆంక్షలకు ఈయూ ఆమోదం
కీవ్/మాస్కో: రష్యా నుంచి చమురు దిగుమతిపై నిషేధంతో సహా పలు ఆంక్షలను యూరోపియన్ యూనియన్(ఈయూ) శుక్రవారం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. రాబోయే ఆరు నెలల్లో రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని ఈయూ ప్రధాన కార్యాలయం వెల్లడించింది. ఇతర పెట్రోలియం ఉత్పత్తులపై నిషేధాన్ని వచ్చే ఎనిమిది నెలల్లో పూర్తిగా నిషేధిస్తామని పేర్కొంది. హంగేరి, చెక్ రిపబ్లిక్, స్లొవేకియా, బల్గేరియా, క్రొయేషియా తదితర దేశాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా కొన్ని మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపింది. ఈ ఏడాది ఆఖరు నాటికి రష్యా నుంచి చమురు దిగుమతులను 90 శాతం నిలిపేస్తామని ఈయూ నేతలు ప్రకటించారు. అంతర్జాతీయ బ్యాంకు లావాదేవీలకు వేదిక అయిన ‘స్విఫ్ట్’ వ్యవస్థను రష్యా ఉపయోగించుకోకుండా ఈయూ ఇప్పటికే కట్టడి చేసింది. రష్యా టీవీ చానళ్లను కూడా ఈయూ నిషేధించింది. రష్యా క్రూర దాడులు: జెలెన్స్కీ తూర్పు డోన్బాస్లో భీకర యుద్ధం కొనసాగుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. రష్యా క్రూరంగా దాడులు చేస్తోందని ఆరోపించారు. సీవిరోడోంటెస్క్‌లో రష్యా దాడులను తిప్పికొట్టడంలో తాము కొంత పురోగతి సాధించామని అన్నారు. సమీపంలోని లీసిచాన్స్క్, బఖ్‌ముత్‌లో పరిస్థితి సంక్లిష్టంగానే ఉందని తెలిపారు. పలు నగరాలు, పట్టణాలపై రష్యా సేనలు క్షిపణి దాడులు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. డోన్బాస్లో రష్యా అనుకూల వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల నుంచి జనాన్ని సమీకరించి, యుద్ధ రంగంలోకి దించుతున్నారని జెలెన్స్కీ ఆరోపించారు. సాధారణ ప్రజలను ముందు వరుసలో ఉంచి, వారి వెనుక రష్యా సైనికులు వస్తున్నారని వెల్లడించారు. మున్ముందు మరింత సిగ్గుమాలిన, హేయమైన పరిణామాలను చూడబోతున్నామని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌కు అత్యాధునిక రాకెట్ సిస్టమ్స్ ఇచ్చేందుకు అంగీకరించిన అమెరికాకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. లీసిచాన్స్క్.. 60 శాతం ధ్వంసం తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు ప్రధాన నగరాల్లో ఒకటైన లీసిచాన్‌స్క్‌లో రష్యా సేనలు క్షిపణుల మోత మోగిస్తున్నాయి. సిటీలో 60 శాతం మౌలిక సదుపాయాలు, నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. రష్యా నిరంతర దాడుల వల్ల విద్యుత్, సహజ వాయువు, టెలిఫోన్; ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయినట్లు స్థానిక అధికారి ఒలెగ్జాండ్రా జైకా చెప్పారు. బఖ్ముత్–లీసిచాన్స్క్ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతోందన్నారు. లీసిచాన్స్క్ నుంచి ఇప్పటిదాకా 20,000 మంది పౌరులకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. గతంలో ఇక్కడ 97,000 జనాభా ఉండేది. షోల్జ్‌తో ఉక్రెయిన్ పార్లమెంట్ స్పీకర్ భేటీ ఉక్రెయిన్ పార్లమెంట్ స్పీకర్ రుస్లాన్ స్టెఫాన్చుక్ జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్‌తో బెర్లిన్‌లో సమావేశమయ్యారు. తమ పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడాలని కోరారు. జర్మనీ పార్లమెంట్ సమావేశంలో స్టెఫాన్చుక్ పాల్గొన్నారు. జర్మనీ పార్లమెంట్ స్పీకర్ బెయిర్బెల్ బాస్ ఆయనకు స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌లో పౌర మరణాలు 4,945: ఐరాస రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్‌లో 9,094 మంది సాధారణ పౌరులు బాధితులుగా మారారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం తాజా నివేదికలో వెల్లడించింది. 4,149 మంది ప్రాణాలు కోల్పోయారని, 4,945 మంది క్షతగాత్రులయ్యారని తెలియజేసింది. బలమైన పేలుడు సంభవించే ఆయుధాల వల్లే ఎక్కువ మంది మరణించారని, గాయపడ్డారని పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం భారీ వైమానిక దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. రష్యా ప్రారంభించిన యుద్ధంలో తమ దేశంలో 243 మంది చిన్నారులు బలయ్యారని, 446 మంది గాయాలపాలయ్యారని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం వివరించింది. -
Russia-Ukraine War: చర్చలకు చరమగీతం
వాషింగ్టన్: మారియుపోల్‌లో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, రష్యా ఇలాగే దాడులు కొనసాగిస్తే చర్చలకు అవకాశం ఇకపై ఉండదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మారియుపోల్‌లో మిగిలిన ఉక్రేనియులను రష్యా సైన్యం చుట్టుముట్టిందన్నారు. తాము తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. అయితే మారియుపోల్‌లో రష్యా విధ్వంసం దరిమిలా ఇకపై ఆ నగరం గతంలోలాగా ఉండకపోవచ్చని వాపోయారు. ఇటీవల కాలంలో రష్యాతో శాంతి కోసం చర్చలు జరిపామని, కానీ తాజా ఘటనలు చర్చలకు చరమగీతం పాడతాయని హెచ్చరించారు. ప్రస్తుతం మారియుపోల్ నగరం దాదాపు రష్యా హస్తగతమైనట్లు తెలుస్తోంది. కానీ అజోవస్టాల్ స్టీల్ మిల్ ప్రాంతంలో మిగిలిన ఉక్రెయిన్ సైనికులు ప్రతిఘటన కొనసాగిస్తున్నారు. వీరంతా ఆయుధాలు వదిలి లొంగిపోతే ప్రాణభిక్ష పెడతామని రష్యా సైన్యం ప్రకటించింది. మారియుపోల్‌లో ఉన్నవారి రక్షణ గురించి బ్రిటన్, స్వీడన్ నేతలతో మాట్లాడినట్లు జెలెన్స్కీ చెప్పారు. యుద్ధంలో రష్యాకు చెందిన మేజర్ జనరల్ వ్లాదిమిర్ ఫ్రోలోవ్ మరణించారు. మారియుపోల్‌లో తుదిదాకా పోరాడతామని ఉక్రెయిన్ ప్రధాని షైమ్హల్ ప్రకటించారు. బాంబింగ్ ఉధృతి పెరిగింది మాస్క్వా మునక తర్వాత రష్యా తన మిసైల్ దాడులను మరింత ముమ్మరం చేసింది. ఖార్కివ్ నగరంపై దాడుల్లో ఐదుగురు మరణించారు. రష్యా సేనల దురాగతాలను ఖండించాలని అంతర్జాతీయ సమాజాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. తమకు మరిన్ని ఆయుధాలందించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎల్వివ్ నగరంపై రష్యా జరిపిన మిసైల్ దాడిలో ఏడుగురు పౌరులు మరణించారని ఉక్రెయిన్ తెలిపింది. ఇప్పటివరకు ఈ నగరంతో సహా దేశ పశ్చిమభాగంపై రష్యా దాడులు పెద్దగా జరపలేదు. దీంతో చాలామంది ప్రజలు ఇక్కడ తలదాచుకున్నారు. కానీ తాజాగా ఈ నగరంపై కూడా రష్యా దాడుల ఉధృతి పెరిగింది. నగరంలోని మిలటరీ స్థావరాలు, ఆటోమెకానిక్ షాపుపై రష్యా దాడులు జరిపినట్లు నగర మేయర్ ఆండ్రీ చెప్పారు. దాడుల్లో ఒక హోటల్ తీవ్రంగా దెబ్బతిన్నదన్నారు. కీవ్‌కు దక్షిణాన ఉన్న వాసైల్కివ్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఈ నగరంలో ఒక మిలటరీ బేస్ ఉంది. ఉక్రెయిన్‌లోని ఆయుధ స్థావరాలను, రైల్వే తదితర మౌలికసదుపాయాలను రష్యా లక్ష్యంగా చేసుకొని దాడులు ముమ్మరం చేస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పుడు డోన్బాస్లో పెద్దగా ప్రతిఘటన ఎదురుకాదన్నది రష్యా ఆలోచనగా చెబుతున్నారు. రష్యా సైతం తాము పలు మిలటరీ టార్గెట్లపై దాడులు జరిపినట్లు ప్రకటించింది. మానవీయ కారిడార్లపై రష్యా దాడి చేస్తున్నందున పౌరుల తరలింపును నిలిపివేశామని ఉక్రెయిన్ పేర్కొంది. డోన్బాస్ నుంచి పారిపోతున్న నలుగురు పౌరులను రష్యా సేనలు కాల్చిచంపాయని ఆరోపించింది. ఆయా నగరాల నుంచి పౌరుల తరలింపునకు సహకరించాలని రష్యాను కోరింది. కీవ్ ముట్టడి విఫలమైన దరిమిలా డోన్బాస్‌పై పట్టుకు రష్యా తీవ్రంగా యత్నిస్తోంది. మారియుపోల్ ఆక్రమణ ఈ దిశగా కీలక ముందడుగని నిపుణులు పేర్కొన్నారు. నగరంపై దాడిలో దాదాపు 21వేల మంది చనిపోయిఉంటారని ఉక్రెయిన్ తెలిపింది. ప్రస్తుతం అక్కడ దాదాపు లక్షమంది ప్రజలు ఉన్నట్లు అంచనా. సిద్ధమవుతున్న సిరియా ఫైటర్లు ఉక్రెయిన్‌లో రష్యా తరఫున పోరాడేందుకు సిరియా ఫైటర్లు సిద్ధమవుతున్నారు. సుహైల్ ఆల్ హసన్ డివిజన్‌కు చెందిన ఫైటర్లతో పాటు మాజీ సైనికులు, తిరుగుబాటుదారులు రష్యాకు మద్దతుగా రంగంలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో రష్యా యుద్ధనీతి మారుతుందంటున్నారు. జనరల్ అలెగ్జాండర్‌ను ఉక్రెయిన్‌పై యుద్ధ దళపతిగా పుతిన్ నియమించిన సంగతి తెలిసిందే! గతంలో ఈయనకు సిరియాలో పనిచేసిన అనుభవం ఉంది. ఇంతవరకు దాదాపు 40వేలమంది సిరియన్లు రష్యాతో కలిసి పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు మానవహక్కుల కార్యకర్తలు తెలిపారు. అయితే సిరియా ప్రభుత్వం మాత్రం ఈ వార్తలను ఖండించింది. -
రష్యా ప్రతీకార దాడులు
కీవ్/లండన్: నల్ల సముద్రంలో తమ కీలక యుద్ధనౌక మాస్క్వాను కోల్పోయిన రష్యా తీవ్ర ప్రతీకారంతో రగిలిపోతోంది. శనివారం ఉక్రెయిన్‌పై క్షిపణి దాడులను ఉధృతం చేసింది. తీర్పు ప్రాంతంతోపాటు రాజధాని కీవ్‌పై దృష్టి పెట్టింది. కీవ్ పరిసరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. కీవ్ చుట్టుపక్కల ఇప్పటివరకు 1,000కి పైగా మరణించారని ఉక్రెయిన్ చెప్పింది. యుద్ధంలో 3,000 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారని, 10,000 మందికిపైగా గాయపడ్డారని వెల్లడించింది. గత 24 గంటల్లో 8 ప్రాంతాలపై రష్యా విరుచుకుపడినట్లు చెప్పింది. తూర్పున డొనెట్స్క్, లుహాన్స్క్, ఖర్కీవ్, సెంట్రల్ ఉక్రెయిన్‌లోని డినిప్రోపెట్రోవ్స్క్, పొల్టావా, కిరోవోహ్రాడ్, దక్షిణాన మైకోలైవ్, ఖేర్సన్‌పై దాడులకు పాల్పడినట్లు వెల్లడించింది. కీవ్ సమీపంలోని డార్నియిట్స్కీపై భారీగా దాడులు జరిగాయి. ఎస్‌యూ–35 ఎయిర్‌క్రాఫ్ట్ బాంబుల వర్షం కురిపించింది. ఖర్కీవ్‌పై రాకెట్ దాడుల్లో ఏడు నెలల చిన్నారి సహా ఏడుగురు మరణించారు. ఒలెగ్జాండ్రియాలోని ఎయిర్‌ఫీల్డ్‌పై శుక్రవారం రాత్రి రష్యా క్షిపణిని ప్రయోగించిందని నగర మేయర్ చెప్పారు. లుహాన్స్క్లో దాడుల్లో ఒకరు మరణించారు. సెవెరోండోన్టెస్క్, లీసీచాన్‌స్క్‌లో దాడుల్లో గ్యాస్ పైప్లైన్లు దెబ్బతిన్నాయి. ఒక చమురు శుద్ధి కర్మాగారం ధ్వంసమయ్యింది. రష్యాకు పరాభవం తప్పదు: జెలెన్స్కీ రష్యా దాడుల నుంచి దేశ ప్రజలను కాపాడుకొనేందుకు చేయాల్సిందంతా చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పునరుద్ఘాటించారు. ఆక్రమణదారులకు పరాభవం తప్పదన్నారు. తమ దేశం ఎన్నటికీ రష్యా వశం కాబోదని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు చాలవు రష్యాపై విధించిన ఆంక్షలు చాలవని జెలెన్స్కీ అన్నారు. రష్యా చమురును నిషేధించాలని ప్రపంచ దేశాలను కోరారు. యుద్ధం ఆగాలంటే అన్ని దేశాలు రష్యాతో ఆర్థిక సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని చెప్పారు. ► మారియూపోల్ పునర్నిర్మాణానికి సాయమందిస్తానని ఉక్రెయిన్ కుబేరుడు రినాట్ అఖ్మెటోవ్ ప్రకటించారు. దేశంలో అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ ‘మెటిన్‌వెస్ట్’ యజమాని అయిన అఖ్మెటోవ్కు మారియూపోల్‌లో రెండు ఉక్కు పరిశ్రమలున్నాయి. ► సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో వందలాది మంది రష్యాకు అనుకూలంగా భారీ ప్రదర్శన చేపట్టారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని సూచించే ‘జెడ్’ అక్షరమున్న టీ షర్టులు ధరించారు. పుతిన్ చిత్రాలతో కూడిన ప్లకార్డులను చేబూనారు. ఐరాస మానవ హక్కుల మండలి నుంచి రష్యాను బహిష్కరించే తీర్మానానికి మద్దతుగా సెర్బియా ఓటేయడాన్ని జనం వ్యతిరేకిస్తున్నారు. రష్యాపై ఎలాంటి ఆంక్షలు విధించని ఒకే ఒక్క యూరప్ దేశం సెర్బియా. యూకే ప్రధాని, మంత్రులపై రష్యా నిషేధం ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆయన మంత్రివర్గ సహచరులతో పాటు పలువురు నేతలపై నిషేధం విధిస్తున్నట్టు రష్యా విదేశాంగ మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో యూకే ప్రభుత్వం రష్యాపై ఆంక్షలు విధించినందుకు ప్రతిచర్యగా ఈ నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. నిషేధానికి గురైన వారిలో భారత సంతతికి చెందిన ఆర్థిక మంత్రి రిషి సునక్, హోంమంత్రి ప్రీతీ పటేల్ కూడా ఉన్నారు. రష్యా ప్రభుత్వం ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై కూడా ఇలాంటి నిషేధమే విధించింది. -
Russia-Ukraine war: మాస్క్వా మునిగింది
కీవ్: గురువారం భారీగా దెబ్బతిన్న రష్యా ప్రఖ్యాత యుద్ద నౌక మాస్క్వా చివరకు సముద్రంలో మునిగిపోయింది. దెబ్బతిన్న నౌకను దగ్గరలోని నౌకాశ్రయానికి తరలిస్తుండగా మధ్యలోనే మునిగిపోయినట్లు రష్యా ప్రకటించింది. బ్లాక్‌సీ ఫ్లీట్‌కే తలమానికమైన నౌక మునిగిపోవడం రష్యాకు మరింత కోపం తెప్పించింది. దీంతో ఇకపై ఉక్రెయిన్ రాజధానిపై మరిన్ని మిసైల్ దాడులు జరుపుతామని ప్రకటించింది. రష్యా సరిహద్దు భూభాగంపై ఉక్రెయిన్ జరుపుతున్న మిలటరీ దాడులకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నామని రష్యా రక్షణశాఖ ప్రకటించింది. మాస్క్వా మిస్సైల్ క్రూయిజర్ ప్రత్యేకతలు ► రష్యా నేవీలో ఉన్న మూడు అట్లాంటా క్లాస్ గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్లలో ఇది ఒకటి ► సిబ్బంది సంఖ్య: 680 ► పొడవు: 186 మీటర్లు ► గరిష్ట వేగం: 32 నాటికల్ మైళ్లు(59 కి.మీ.) ఆయుధ సంపత్తి ► 16 యాంటీ షిప్ వుల్కన్ క్రూయిజ్ మిస్సైళ్లు ► ఎస్–300 లాంగ్ రేంజ్ మెరైన్ వెర్షన్ మిస్సైళ్లు ► షార్ట్ రేంజ్ ఒస్సా మిస్సైళ్లు ► రాకెట్ లాంచర్స్, గన్స్, టార్పెడోస్ తూర్పు ఉక్రెయిన్ వైపు రష్యా బలగాలు మరలడంతో కీవ్‌లో జనజీవనం సాధారణస్థాయికి చేరుకుంటోంది. అయితే తాజా హెచ్చరికల నేపథ్యంలో తిరిగి బంకర్లలో తలదాచుకోవాల్సివస్తుందని నగర పౌరులు భయపడుతున్నారు. మాస్క్వా మునకకు అగ్ని ప్రమాదమే కారణమని రష్యా పేర్కొంది. అయితే తమ మిసైల్ దాడి వల్లనే నౌక మునిగిందని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. వీరి వాదన నిజమైతే ఇటీవల కాలంలో ఒక యుద్ధంలో మునిగిన అతిపెద్ద నౌక మాస్క్వా కానుంది. ఇది రష్యాకు ఒకరకమైన ఓటమిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. 5 కాదు 50 రోజులు ఉక్రెయిన్ ఆక్రమణకు గట్టిగా ఐదు రోజులు పడుతుందని రష్యా భావించిందని, కానీ 50 రోజులైనా రష్యా దాడులను తట్టుకొని నిలిచామని ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ వీడియో సమావేశంలో చెప్పారు. మాస్క్వా మునక గురించి పరోక్షంగా ప్రస్తావించారు. పోరాడాలని ఉక్రేనియన్లు నిర్ణయించుకొని 50 రోజులైందన్నారు. యుద్ధారంభంలో చాలామంది ప్రపంచ నేతలు తనకు దేశం విడిచి వెళ్లమని సలహా ఇచ్చారని, కానీ ఉక్రేనియన్లను వారు తక్కువగా అంచనా వేశారని చెప్పారు. 50 రోజులు ఎదురునిలిచి పోరాడుతున్నందుకు దేశప్రజలు గర్వించాలన్నారు. అయితే మరోవైపు మారియూపోల్‌పై రష్యా పట్టుబిగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నగరాన్ని రష్యా సేనలు దాదాపు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయని, అక్కడ ప్రజలు ఆహారం, నీరు దొరక్క అలమటిస్తున్నారని మీడియా వర్గాలు తెలిపాయి. నగరంలో రష్యా సైనికుల అకృత్యాలకు త్వరలో ఆధారాలు లభిస్తాయని, చాలా శవాలను రష్యన్లు రహస్యంగా ఖననం చేశారని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. రష్యా సేనలు బొరోవయా ప్రాంతంలో పౌరులు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిపి 7గురిని పొట్టనబెట్టుకున్నారని చెప్పారు. వీటిని రష్యా ఖండించింది. మాస్క్వాకు అణు వార్‌హెడ్స్? గురువారం నల్ల సముద్రంలో మునిగిన రష్యా యుద్ధ నౌక మాస్క్వాపై రెండు అణు వార్ హెడ్స్ అమర్చిఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే మునిగిన ప్రాంతంలో పర్యావరణ ప్రమాదం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై వెంటనే విచారణ జరపాలన్న డిమాండ్ చేశారు. బ్రోక్ యారో ఘటన ( ఒక ప్రమాదంలో అణ్వాయుధాలుండడం)ను తేలిగ్గా తీసుకోకూడదన్నారు. సిబ్బందిలో చాలామంది మరణించే ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిలో 58 మంది మాత్రమే బతికారని, 452 మంది మునిగిపోయారని రష్యా బహిష్కృత నేత పొనొమరేవ్ ఆరోపించారు. మాస్క్వా మునకపై అడ్మిరల్ ఐగొర్ ఓసిపోవ్ను అరెస్టు చేశారని ఉక్రెయిన్ మీడియా పేర్కొంది. 20 వేల రష్యా సైనికులు మృతి? ఇప్పటిదాకా ఏకంగా 20 వేల మంది రష్యా సైనికులను చంపినట్టు ఉక్రెయిన్ తాజాగా ప్రకటించింది. 160కి పైగా యుద్ధ విమానాలు, 200 హెలికాప్టర్లు, 800 ట్యాంకులు, 1,500కు పైగా సాయుధ వాహనాలు, 10 నౌకను ధ్వంసం చేసినట్టు పేర్కొంది. 2,000కు పైగా ఉక్రెయిన్ యుద్ధ ట్యాంకులను తాము నాశనం చేశామని రష్యా తెలిపింది. నాటోలో చేరితే తీవ్ర పర్యవసానాలు తప్పవని ఫిన్లాండ్, స్వీడన్లను తీవ్రంగా హెచ్చరించింది. స్వదేశానికి 10 లక్షల మంది ఉక్రేనియన్లు యుద్ధం ముగియనప్పటికీ ఉక్రెయిన్ నుంచి వలస వెళ్లిన వారిలో దాదాపుగా 10 లక్షల మంది స్వదేశానికి తిరిగొచ్చారు. ఇప్పుడప్పుడే రావొద్దని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా వారు పట్టించుకోవడం లేదు. కొద్ది రోజులుగా రోజుకు 30 వేల మంది దాకా తిరిగొస్తున్నట్టు సమాచారం. పోలండ్, రుమేనియా తదితర దేశాల సరిహద్దుల్లో ఉక్రెయిన్‌లోకి రావడానికి ప్రజలు భారీగా క్యూ కట్టారు. కీవ్ చుట్టుపక్కల 900 మందికిపైగా మృతి కీవ్: ఉక్రెయిన్ రాజధాని నగరం చుట్టూ మోహరించిన రష్యన్ సేనలు వెనక్కుమరలడంతో అక్కడ వారు చేసిన ఘోరాలు బయటపడుతున్నాయి. కీవ్ పరిసర ప్రాంతాల్లో 900 మందికి పైగా పౌరుల మృతదేహాలను కనుగొన్నట్లు స్థానిక పోలీసు అధికారి అండ్రీ చెప్పారు. చాలాచోట్ల మృతదేహాలు రోడ్లపై పడిపోయి ఉన్నాయని, కొన్ని చోట్ల అరకొర పూడ్చివేతలున్నాయని చెప్పారు. వీరిలో 95 శాతం మంది తుపాకీ గాయాలతో మరణించినట్లు తెలుస్తోందన్నారు. ఈ దేహాలను ఫొరెన్సిక్ పరీక్షలకు పంపామని తెలిపారు. ఎక్కువగా కీవ్‌కు సమీపంలోని బుచాలో 350 మృతదేహాలు దొరికినట్లు వివరించారు. -
Russia-Ukraine war: ప్రధాన నగరాలే టార్గెట్
కీవ్/లెవివ్/మాస్కో/వాషింగ్టన్: ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై రష్యా సైన్యం క్షిపణులతో విరుచుకుపడుతోంది. రాజధాని కీవ్ శివార్లతో పాటు పశ్చిమాన లెవివ్ సిటీపై శుక్రవారం ఉదయం భీకర దాడులు జరిపింది. లెవివ్ నడిబొడ్డున బాంబుల మోత మోగించింది. కొన్ని గంటలపాటు దట్టమైన పొగ వ్యాపించింది. క్షిపణి దాడుల్లో ఎయిర్‌పోర్టు సమీపంలో యుద్ధ విమానాల మరమ్మతు కేంద్రం, బస్సుల మరమ్మతు కేంద్రం దెబ్బతిన్నాయి. రష్యా నల్ల సముద్రం నుంచి లెవివ్‌పై క్షిపణులను ప్రయోగిస్తోంది. రెండు క్షిపణులను నేలకూల్చామని ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. క్రామాటోర్స్క్ సిటీలో ఇళ్లపైనా క్షిపణులు వచ్చి పడుతున్నాయి. ఖర్కీవ్‌లో మార్కెట్లను కూడా వదలడం లేదు. చెర్నిహివ్‌లో ఒక్కరోజే 53 మృతదేహాలను మార్చురీలకు తరలించారు. మారియుపోల్‌లో బాంబుల మోతతో జనం బెంబేలెత్తిపోతున్నారు. బాంబు దాడులకు గురైన థియేటర్ నుంచి 130 మంది బయటపడగా 1,300 మంది బేస్మెంట్లో తలదాచుకున్నట్లు భావిస్తున్నారు. రష్యా కల్నల్, మేజర్ మృతి ఉక్రెయిన్ సైన్యం దాడుల్లో పెద్ద సంఖ్యలో రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కల్నల్ సెర్గీ సుఖరెవ్, మేజర్ సెర్గీ క్రైలోవ్ కూడా వీరిలో చనిపోయినట్టు రష్యా అధికారిక టెలివిజన్ కూడా దీన్ని ధ్రువీకరించింది. రష్యా ఇప్పటిదాకా 7,000 మందికి పైగా సైనికులను కోల్పోయినట్టు సమాచారం. బైడెన్‌కు జెలెన్స్కీ కృతజ్ఞతలు తమకు అదనపు సైనిక సాయం అందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్ సైనిక సామర్థ్యాన్ని రష్యా సరిగా అంచనా వేయలేకపోయిందన్నారు. ఆపేయండి: హాలీవుడ్ దిగ్గజం ఆర్నాల్డ్ ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని ప్రఖ్యాత హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగ్గర్ రష్యాకు సూచించారు. పుతిన్ స్వార్థ ప్రయోజనాల కోసం రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందన్నారు. ‘‘నా తండ్రి కూడా కొందరి మాయమాటలు నమ్మి హిట్లర్ తరపున రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్నారు. భౌతికంగా, మానసికంగా గాయపడి ఆస్ట్రియాకు తిరిగొచ్చారు’’ అన్నారు. మానవత్వం చూపాల్సిన సమయం: భారత్ రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్‌లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయని, సామాన్యులు మృత్యువాత పడుతున్నారని ఐరాసలో భారత శాశ్వత రాయబారి తిరుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. నిరాశ్రయులను తక్షణమే ఆదుకోవాల్సిన అవసరముందని భద్రతా మండలి భేటీలో ఆయనన్నారు. భారత్ తనవంతు సాయం అందిస్తోందని గుర్తుచేశారు. ఉక్రెయిన్‌లో సామాన్యులు చనిపోతుండడం తీవ్ర ఆందోళనకరమని ఐరాస పొలిటికల్ చీఫ్, అండర్ సెక్రెటరీ జనరల్ రోజ్మేరీ డికార్లో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సి ఉందన్నారు. రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్‌లో 60.6 లక్షల మంది నిరాశ్రయులైనట్లు ఐక్యరాజ్యసమితి మైగ్రేషన్ ఏజెన్సీ వెల్లడించింది. ఉక్రెయిన్‌తో చర్చల్లో పురోగతి: రష్యా ఉక్రెయిన్‌తో తాము జరుపుతున్న చర్చల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తోందని రష్యా తరపు బృందానికి సారథ్యం వహిస్తున్న వ్లాదిమిర్ మెడిన్స్కీ శుక్రవారం చెప్పారు. ఉక్రెయిన్‌కు తటస్థ దేశం హోదా ఉండాలని తాము కోరుతున్నామని, ఈ విషయంలో ఒక ఒప్పందానికి ఇరుపక్షాలు దగ్గరగా వచ్చినట్లు వెల్లడించారు. నాటోలో చేరాలన్న ఉక్రెయిన్ ఉద్దేశం పట్ల ఇరు దేశాల మధ్య భేదాభిప్రాయాలు క్రమంగా తగ్గిపోతున్నాయన్నారు. ర్యాలీలో పాల్గొన్న పుతిన్ రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం రాజధాని మాస్కోలో భారీ ర్యాలీలో స్వయంగా పాల్గొన్నారు. ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా ద్వీపకల్పం రష్యాలో విలీనమై 8 ఏళ్లయిన సందర్భంగా మాస్కోలోని లుఝ్నికీ స్టేడియం చుట్టూ ఈ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 2 లక్షల మంది హాజరయ్యారు. ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్న తమ సైనిక బలగాలపై ఈ సందర్భంగా పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఉక్రెయిన్‌లో నాజీయిజంపై పుతిన్ పోరాడుతున్నారని వక్తలన్నారు. రష్యా చమురుపై జర్మనీ ఆంక్షలు! ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్న రష్యాకు ముకుతాడు వేయక తప్పదన్న సంకేతాలను జర్మనీ ఇచ్చింది. రష్యా నుంచి చమురు దిగుమతులపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తామని జర్మనీ విదేశాంగ మంత్రి అనాలెనా బెయిర్‌బాక్ చెప్పారు. చమురు కోసం తాము రష్యాపై ఆధారపడుతున్నప్పటికీ ఇది మౌనంగా ఉండే సమయం కాదన్నారు. క్లిష్ట సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌లో ఫోన్లో దాదాపు గంటపాటు మాట్లాడారు. ఉక్రెయిన్‌లో కాల్పులు విరమణకు వెంటనే అంగీకరించాలని కోరారు. -
మిస్సైల్ ప్రమాదం.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన
పాకిస్థాన్ భూభాగంలోకి భారత్ మిస్సైల్ దూసుకెళ్లిన ఘటన రచ్చ రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వంకతో పాక్, భారత్‌పై రెచ్చిపోయి ఆరోపణలు చేయగా.. భారత్ మాత్రం పొరపాటున జరిగిందంటూ కూల్‌గా తప్పు ఒప్పేసుకుంది. ఈ తరుణంలో Missile Mishap మిస్సైల్ ఘటనపై పార్లమెంట్ సాక్షిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు. మంగళవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ.. మార్చి 9న రాత్రి ఏడు గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని వివరించారు. మిస్సైల్ యూనిట్లో రోజూవారీ తనిఖీలు నిర్వహిస్తుండగా.. పొరపాటున ఒక మిస్సైల్ దూసుకెళ్లింది. తర్వాతే అది పాక్ భూభాగంలో పడిందని తెలిసింది. ఈ ఘటన జరగడం విచారకం. కానీ, ఎలాంటి నష్టం జరగనందుకు సంతోషం. పాక్ ఆరోపిస్తున్నట్లు ఈ ఘటనను.. మేం తమాషాగా చూడట్లేదు. మా ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంది. అందుకే పొరపాటు ఎలా జరిగిందోత తెలుసుకునేందుకు.. అత్యున్నత విచారణకు ఆదేశించాం. విచారణ జరిగితే.. అసలు కారణం ఏంటో తెలిసేది’’ అని రాజ్‌నాథ్ తెలిపారు. ఈ ఘటనతో భారత క్షిపణి వ్యవస్థపై అనుమానాలు అక్కర్లేదన్న రక్షణ మంత్రి.. అది అత్యంత సురక్షితమైనదని సభకు హామీ ఇచ్చారు. ‘‘మా భద్రతా విధానాలు, ప్రోటోకాల్‌లు అత్యధిక క్రమాన్ని కలిగి ఉంటాయి. ఎప్పటికప్పుడు సమీక్షించబడతాయి. మన సాయుధ దళాలు సుశిక్షితమైనవి అని స్పష్టం చేశారు. We give highest priority to safety&security of our weapon system. If any shortcoming found in this context, it'll immediately be rectified. I'd like to assure the House that our missile system is highly reliable & safe. Our safety procedure & protocols are high level: Defence Min pic.twitter.com/4miUumF5Na — ANI (@ANI) March 15, 2022 2005 ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాల క్షిపణి పరీక్షలు గనుక నిర్వహిస్తే.. మూడు రోజుల ముందు తెలియజేయడంతో పాటు, ఇరు దేశాలకు ఇబ్బందులు తలెత్తకుండా, నష్టం జరగకుండా నిర్ణీత వ్యవధిలోనే ఆ పరీక్షలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. కానీ, గత బుధవారం సాయంత్రం సిస్రా(హర్యానా) వైపు నుంచి సూపర్సోనిక్ మిస్సైల్ ఒకటి 124 కిలోమీటర్ల అవతల పాక్ సరిహద్దులో కూలింది. మియా చన్ను సమీపంలో అది పడిపోయిందని, ఇది పాకిస్తాన్ గగనతలాన్ని ఉల్లంఘించడమే అని భారత్‌పై ఆగ్రహం వెల్లగక్కింది పాకిస్థానీ వైమానిక దళానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్స్ సెంటర్. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందని పాక్ ఆరోపణల తర్వాత భారత్ వివరణ ఇచ్చుకుంది. భారత్ చెప్పింది కదా పాక్ భూభాగంలోకి మిస్సైల్ దూసుకెళ్లిన ఘటనపై అమెరికా స్పందించింది. అది ప్రమాదం అని భారత్ చెప్పింది కదా.. పైగా దర్యాప్తునకు ఆదేశించింది. మరేం ఉద్దేశాలు ఉండకపోవచ్చనేం భావిస్తున్నాం. ఇంతకు మించి ఈ పరిస్థితుల్లో ఏం చెప్పలేం. అని భద్రతా కార్యదర్శి నెడ్ ప్రైస్ మీడియాకు తెలిపారు. -
భారత్ మిస్సైల్ మిస్‌ఫైర్.. ‘యాక్షన్ వేరేలా ఉండేది.. కానీ, కామ్‌గా ఉన్నాం’
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ మిస్సైల్ మిస్‌ఫైర్ వివాదంపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి స్పందించారు. ఆ ఘటన జరిగిన వెంటనే తమ దేశం ఘాటుగా ప్రతిస్పందించగలిగేదని అన్నారు. అయితే.. అలా చేయకుండా తమ వైఖరికి భిన్నంగా ఓపిక పట్టామని చెప్పారు. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను, దేశాన్ని శక్తిమంతం చేసుకుంటామని పేర్కొన్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని హఫీజాబాద్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ర్యాలీలో ఇమ్రాన్ పైవిధంగా స్పందించారు. కాగా, మార్చి 9న భారత్‌కి చెందిన సూపర్-సోనిక్ ఫ్లయింగ్ క్షిపణి సూరత్‌గఢ్ నుంచి పాకిస్తాన్ భూభాగంవైపు దూసుకుపోయిన సంగతి తెలిసిందే. పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్ చున్ను నగర సమీపంలో అది కూలింది. అయితే, ఈప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ సమీపంలోని గోడ మాత్రం ధ్వంసమైంది. దీనిపై భారత రక్షణ శాఖ ఇప్పటికే వివరణ ఇచ్చింది. సాధారణ నిర్వహణ ప్రక్రియ జరగుతుండగా ప్రమాదవశాత్తు పాకిస్థాన్‌వైపు క్షిపణి దూసుకుపోయిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. (చదవండి: బ్రహ్మోస్ మరింత శక్తివంతం) ఈ క్షిపణి పాకిస్తాన్లో ల్యాండ్ అవ్వడానికి ముందు గగనతలంలో సుమారు 100 కి.మీ పైగా వేగంతో దాదాపు 40 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించిందని పేర్కొంది. సాంకేతిక లోపం కారణంగా ఈ సంఘటన జరిగిందని తీవ్ర విచారం వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక భారత్ స్పందనపై పాకిస్తాన్ విదేశాంగశాఖ కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత్ వివరణ సరిగా లేదని, ఘటనపై ఉమ్మడి దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. అనుకోని ప్రమాదమే అయితే, క్షిపణి లాంచ్ కాగానే వెంటనే చెప్పాలి కదా! అని ప్రశ్నించింది. (చదవండి: మాటలు జాగ్రత్త! తేడా వస్తే అంతే.. ఇలా వచ్చి అలా తలపై కోడిగుడ్డుతో...) -
రష్యాకు లొంగిపోయిన తొలి ఉక్రెయిన్ నగరం
కీవ్: ఉక్రెయిన్‌పై యుద్ధం నానాటికీ ఉగ్రరూపు దాలుస్తోంది. దేశంలోని పలు నగరాలపై రష్యా సైన్యం కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుపడుతోంది. పెద్దపెట్టున బాంబులు, క్షిపణి దాడులతో హడలెత్తిస్తోంది. రాజధాని కీవ్‌పై బాంబుల వర్షమే కురిపిస్తోంది. ఎక్కడ చూసినా చెలరేగుతున్న మంటలతో నగరం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. యుద్ధం మొదలైన 8 రోజుల అనంతరం ఎట్టకేలకు ఒక నగరాన్ని రష్యా ఆక్రమించుకోగలిగింది. 3 లక్షల జనాభా ఉండే కీలకమైన రేవు పట్టణమైన ఖెర్సన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు రష్యా సైన్యం ప్రకటించింది. స్థానిక పాలనా యంత్రాంగం కూడా దీన్ని ధ్రువీకరించింది. బేషరతుగా లొంగిపోయి రష్యా సైన్యానికి సహకరించాలంటూ ప్రజలకు నగర మేయర్ పిలుపునిచ్చారు. కీవ్‌తో పాటు పలు ఇతర నగరాలపైనా రష్యా భారీగా విరుచుకుపడుతోంది. దేశంలో రెండో అతి పెద్ద నగరమైన ఖర్కీవ్‌పై దాడులను తీవ్రతరం చేసింది. దాంతో ఇక్కడినుంచి జనం తండోపతండాలుగా పారిపోతూ కన్పిస్తున్నారు. వారితో రైల్వేస్టేషన్లన్నీ కిక్కిరిసిపోయాయి. మరో కీలక రేవు పట్టణం మారిపోల్ కూడా బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. అక్కడి విద్యుత్కేంద్రాలు ఇతర మౌలిక సదుపాయాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురుస్తోంది. కరెంటు లేక నగరం అంధకారంలో మునిగిపోయింది. ఆహారం, తాగునీరు లేక జనం అల్లాడుతున్నారు. టెలిఫోన్ సేవలు కూడా దాదాపుగా స్తంభించిపోయాయి. ఇక ఖెర్సన్‌ను ఆక్రమించిన రష్యా సేనలు అక్కడినుంచి మరో రేవు పట్టణం మైకోలెవ్ దిశగా కదులుతున్నాయి. భారీ కాన్వాయ్‌లు తమకేసి దూసుకొస్తున్నాయని నగర మేయర్ ధ్రువీకరించారు. రష్యా నావికా దళం కూడా యుద్ధ రంగంలోకి కదులుతోంది. సముద్రంతో పాటు నేలపైనా దూసుకుపోగల వాహనాలు సముద్ర మార్గంలో ఒడెసా తీరంకేసి కదులుతున్నట్టు ఉక్రెయిన్ సైన్యం పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్ నుంచి వలసలు 10 లక్షలు దాటిపోయాయి. దేశ జనాభాలో 2 శాతానికి పైగా ఇప్పటికే సరిహద్దులు దాటారని ఐరాస అంచనా వేసింది. పోరాడుతున్న ఉక్రెయిన్ రష్యా దళాలను ఉక్రెయిన్ సేనలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. గెరిల్లా తరహా యుద్ధ వ్యూహాలతో ప్రతి చోటా అడుగడుగునా ఆటంకపరుస్తున్నాయి. సైన్యం చొచ్చుకురాకుండా అడ్డుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ వాడుకుంటున్నాయి. నగరాలకు దారితీసే నేమ్ బోర్డులను మార్చడం, తారుమారు చేయడం, బ్రిడ్జీలను పేల్చేయడం తదితర చర్యలకు దిగుతున్నాయి. మరోవైపు యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 9 వేలకు పైగా రష్యా సైనికులను మట్టుబెట్టిన్టట్టు ఉక్రెయిన్ సైనిక జనరల్ కార్యాలయం ఫేస్బుక్ పోస్టులో పేర్కొంది. రష్యాకు చెందిన సైనిక ఉన్నతాధికారి మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవెట్సికీని తమ స్నైపర్ చంపేశాడని ఉక్రెయిన్ చెప్పింది. తమపై దండయాత్ర రష్యా అనుకున్న రీతిలో సాగడం లేదనేందుకు ఇదే నిదర్శనమంది. రష్యా ఫైటర్ జెట్‌ను ఒకదానిన కూల్చేసినట్టు కూడా ప్రకటించింది. ఆండ్రీ రష్యా సెంట్రల్ మిలటరీ జిల్లా 41వ సీఏఏకు డిప్యుటీ కమాండర్. ఆయన మరణాన్ని రష్యా ధ్రువీకరించలేదు. రష్యా సైన్యాలను తమ యోధులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. బాంబులు, క్షిపణులు, రాకెట్ లాంచర్లతో కూడిన భారీ దాడిని కీవ్ మరో రోజు తట్టుకుని నిలిచిందన్నారు. దాంతో దిక్కుతోచక యుద్ధ విమానాల ద్వారా భారీ దాడులకు రష్యా దిగుతోందన్నారు. ఉక్రేనియన్లు గ్యాంగ్స్టర్లు యుద్ధం ఆపేదే లేదు: పుతిన్ ఉక్రెయిన్లను భయంకరమైన గ్యాంగ్స్టర్లుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభివర్ణించారు. ఉక్రెయిన్ సైనికులు నియో నాజీలని, పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. అక్కడి అమాయాకులను కాపాడేందుకు రష్యా సైన్యం తీవ్రంగా పోరాడుతోందని చెప్పుకున్నారు. ఏదేమైనా పట్టించుకోబోనని, అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు చివరిదాకా పోరును కొనసాగిస్తామని టీవీలో మాట్లాడుతూ ప్రకటించారు. దాడిని ఆపే ఉద్దేశమే లేదని అంతకుముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఫోన్ సంభాషణలో పుతిన్ స్పష్టం చేశారు. పుతిన్ తీరు సరిగా లేదని మాక్రాన్ కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. ‘‘మీరు భారీ తప్పిదానికి పాల్పడుతున్నారు. పైగా మిమ్మల్ని మీరే మోసగించుకుంటున్నారు’’ అని చెప్పారంటున్నారు. పౌరులను పోనిద్దాం రెండో దఫా చర్చల్లో రష్యా, ఉక్రెయిన్ త్వరలో మళ్లీ సమావేశానికి అంగీకారం కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండో దఫా చర్చలు బెలారస్ సమీపంలో పోలండ్ సరిహద్దుల వద్ద గురువారం జరిగాయి. చర్చల సందర్భంగా ఇరు దేశాలూ తమ డిమాండ్లపై పట్టుబట్టినట్టు సమాచారం. అయితే పౌరులు యుద్ధ క్షేత్రాల నుంచి సురక్షితంగా తరలి వెళ్లేందుకు సహకరించాలని, అందుకు వీలుగా ఆయా చోట్ల తాత్కాలికంగా కాల్పులను విరమించాలని అంగీకారానికి వచ్చినట్టు చెబుతున్నారు. దీనిపై మరోసారి సమావేశమై చర్చించాలని నిర్ణయించినట్టు రష్యా తరఫున చర్చల్లో పాల్గొన్న పుతిన్ సలహాదారు వ్లాదిమిర్ మెడిన్స్కీ తెలిపారు. చర్చల్లో ఇరు దేశాలూ తమ తమ డిమాండ్లకు కట్టుబడ్డాయన్నారు. కొన్నింటిపై పట్టువిడుపులతో వ్యవహరించాలన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమైందని చెప్పారు. -
ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం
కీవ్: ఉక్రెయిన్‌పై దాడులను బుధవారం రష్యా మరింత ఉధృతం చేసింది. దేశంలోని రెండో పెద్ద నగరం ఖర్కీవ్‌పై బాంబులు, క్షిపణులతో మరింతగా విరుచుకుపడింది. పలు జనసమ్మర్ధ ప్రాంతాలపై విచక్షణారహితంగా దాడులకు దిగింది. ఉత్తర ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్‌లోనూ దాడులు మారణహోమం సృష్టిస్తున్నాయి. ఇక రాజధాని కీవ్ స్వాధీనమే లక్ష్యంగా మంగళవారం బయల్దేరిన 64 కిలోమీటర్ల పొడవైన భారీ రష్యా సైనిక కాన్వాయ్ నగరాన్ని అన్నివైపుల నుంచీ వ్యూహాత్మకంగా చుట్టుముడుతోంది. సైనిక స్థావరాలతో పాటు నివాసాలు, ఆవాస సముదాయాలు, మౌలిక వ్యవస్థలపై భారీగా బాంబు దాడులకు, క్షిపణి ప్రయోగాలకు దిగుతుండటంతో రోజంతా నగరం పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. దక్షిణాదిన తీర ప్రాంత నగరం మారిపోల్‌లోనూ ఇదే పరిస్థితి! పలు నగరాలు రష్యా అధీనంలోకి వెళ్లాయని వార్తలు వస్తున్నాయి. దాడుల భయంతో దేశవ్యాప్తంగా బంకర్లలో, పార్కింగ్ స్థలాల్లో, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్న వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వణికించే చలిలో కనీస రక్షణ ఏర్పాట్లు కూడా లేకపోవడంతో వారంతా గజగజ వణుకుతున్నారు. తిండీతిప్పలకూ గతి లేక అల్లాడిపోతున్నారు. ఇప్పటికే 2000 మందికి పైగా అమాయకులు యుద్ధానికి బలైనట్టు ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం ప్రకటించింది. ఉక్రెయిన్ నగరాలపై రష్యా వాయు, భూతల దాడులు భారీగా పెరిగాయని ఇంగ్లండ్ రక్షణ శాఖ పేర్కొంది. వలస బాట పట్టిన ఉక్రేనియన్ల సంఖ్య 9 లక్షలు దాటిందని ఐరాస వలసల ఏజెన్సీ పేర్కొంది. త్వరలో 10 లక్షలు దాటేస్తుందని ఆందోళన వెలిబుచ్చింది. మంటల్లో ఖర్కీవ్ రష్యా దాడుల ధాటికి ఖర్కీవ్ నిప్పుల కుంపటిలా మారుతోంది. నగరంలోని ప్రాంతీయ పోలీసు, నిఘా విభాగాల ప్రధాన కార్యాలయాలపై రష్యా దళాలు బుధవారం భారీగా బాంబుల వర్షం కురిపించాయి. ఇందులో కనీసం నలుగురు మరణించినట్టు సమాచారం. ఐదంతస్తుల పోలీసు విభాగం భవనం పై కప్పు దాడుల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. భవన శిథిలాలు పక్క వీధుల దాకా చెల్లాచెదురుగా పడ్డాయి. వీటికి సంబంధించిన వీడియో ఫుటేజీని పోలీసు విభాగం విడుదల చేసింది. వీటితో పాటు బుధవారం కూడా పలు నివాసాలు, ఆవాస సముదాయాలపై పెద్దపెట్టున బాంబులు, క్షిపణులు విరుచుకుపడ్డాయని సమాచారం. చెర్నిహివ్‌లో ఒక ఆస్పత్రిపై రెండు క్రూయిజ్ మిసైళ్లతో దాడి జరిగిందని నగర మేయర్ తెలిపారు. ప్రధాన భవనం పూర్తిగా దెబ్బ తినడంతో పాటు భారీగా ప్రాణ నష్టం జరిగిందని వెల్లడించారు. దాడుల తీవ్రత వల్ల గాయపడ్డ వారిని కనీసం తరలించే పరిస్థితి కూడా లేదని మారిపోల్ మేయర్ వాపోయారు. హోలోకాస్ట్ స్మారకం ధ్వంసం ఖర్కీవ్‌లో టీవీ టవర్‌పై మంగళవారం జరిగిన దాడిలో రెండో ప్రపంచయుద్ధం నాటి హోలోకాస్ట్ స్మారకం కూడా బాగా దెబ్బతిందని ఉక్రెయిన్ పేర్కొంది. 1941లో ఇక్కడ హిట్లర్ నాజీ సేనలు 33 వేల మందికి పైగా యూదులను రెండు రోజుల పాటు చిత్రహింసలు పెట్టి చంపాయి. దానికి గుర్తుగా నిర్మించిన స్మారకం రష్యా దాడిలో దెబ్బ తిన్నది. హసిడిక్ యూదులకు ప్రముఖ యాత్రా స్థలమైన ఉమన్ నగరంపై కూడా బాంబుల వర్షం కురిసింది. చివరికి యాత్రా స్థలాలను, చారిత్రక కట్టడాలను కూడా లక్ష్యంగా చేసుకుంటూ రష్యా నానాటికీ దిగజారి ప్రవర్తిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ దుయ్యబట్టారు. దాని తీరు మానవత్వానికే మాయని మచ్చ అని ఫేస్బుక్ పోస్టులో మండిపడ్డారు. ‘‘ఉక్రెయిన్ చరిత్రను, దాంతోపాటు మా ప్రజలందరినీ పూర్తిగా తుడిచిపెట్టేయాలని సైన్యాలకు మాస్కో నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. అందుకే ఇంతటి నైచ్యానికి ఒడిగడుతున్నారు’’ అని ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండించాలని, తమకు అన్నివిధాలా సాయం రావాలని ప్రపంచ దేశాలన్నింటికీ మరోసారి విజ్ఞప్తి చేశారు. 498 మంది మరణించారు: రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఇప్పటిదాకా 498 మంది రష్యా సైనికులు మరణించారని ఆ దేశం ప్రకటించింది. 1,597 మంది గాయపడ్డారని రక్షణ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనషెంకోవ్ వెల్లడించారు. తమకు భారీగా ప్రాణ నష్టం జరిగిందన్న వార్తలను కొట్టిపారేశారు. 2,870 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులను హతమార్చామన్నారు. 3,700 మందికి పైగా గాయపడ్డారని, 572 మంది యుద్ధ ఖైదీలుగా దొరికారని చెప్పారు. ఈ యుద్ధంలో తమ సైనికులు మరణించారని రష్యా అంగీకరించడం ఇదే తొలిసారి. మాల్డోవా మీదా దాడి? మిన్స్క్: ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన మాల్డోవాపై కూడా దాడికి రష్యా ప్రణాళిక వేస్తోందని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో అన్నారు. ఆ దేశ సెక్యూరిటీ కౌన్సిల్ భేటీలో ఆయన ఈ మేరకు చెప్పారు. సంబంధిత వీడియోను బెలారస్ ప్రభుత్వమే ఆన్లైన్లో పెట్టింది. దక్షిణ ఉక్రెయిన్‌లోని రేపు పట్టణమైన ఒడెసా గుండా మాల్డోవాపైకి రష్యా దండెత్తుతుందని లుకషెంకో చెప్పుకొచ్చారు. దీనిపై యూరప్ దేశాలు మరింత మండిపడుతున్నాయి. -
సరికొత్త టెక్నాలజీ అభివృద్ధి చేసిన డీఆర్డీఓ
సాక్షి, న్యూఢిల్లీ: శత్రు క్షిపణి దాడుల నుంచి నౌకాదళ నౌకలను రక్షించేందుకు ‘అడ్వాన్స్డ్ చాఫ్ టెక్నాలజీ’ని ’రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ’(డీఆర్డీవో) అభివృద్ధి చేసింది. డీఆర్డీవోకు చెందిన ‘డిఫెన్స్ లాబొరేటరీ జోధ్‌పూర్’(డీఎల్‌జే) ఈ కీలక పరిజ్ఞానాన్ని దేశీయంగా అభివద్ధి చేసి షార్ట్ రేంజ్ చాఫ్ రాకెట్ (ఎస్‌ఆర్‌సీఆర్), మీడియం రేంజ్ చాఫ్ రాకెట్ (ఎంఆర్‌సీఆర్), లాంగ్ రేంజ్ చాఫ్ రాకెట్ (ఎల్‌ఆర్‌సీఆర్) అనే మూడు రకాల రాకెట్లను రూపొందించింది. నౌకాదళ గుణాత్మక అవసరాలను తీర్చేలా వీటిని డీఎల్‌జే తీర్చిదిద్దింది. ఈ మూడు విభాగాల రాకెట్లను భారత నౌకాదళం ఇటీవల అరేబియా సముద్రంలో పరీక్షించింది. శత్రు రాడార్, రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారిత క్షిపణుల నుంచి రక్షణ నౌకలను రక్షించేందుకు చాఫ్ పరిజ్ఞానాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా శత్రువుల భవిష్యత్ దాడులను ఎదుర్కొనే నైపుణ్యాన్ని డీఆర్డీవో సాధించింది. ఈ విజయాన్ని సాధించిన డీఆర్డీఓ, నౌకాదళాన్ని, డిఫెన్స్ ఇండస్ట్రీని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ అభినందించారు. నౌకాదళ నౌకల రక్షణ పరిజ్ఞాన్ని దేశీయంగా అభివృద్ధి చేయడంలో పాల్గొన్న శాస్త్రవేత్తలను డీఆర్డీవో ఛైర్మన్ డా.జి. సతీష్ రెడ్డి ప్రశంసించారు. తక్కువ వ్యవధిలో దీన్ని అభివృద్ధి చేయడానికి డీఆర్డీవో చేసిన ప్రయత్నాలను నౌకాదళ ఉప అధిపతి అడ్మిరల్ జి.అశోక్ కుమార్ కూడా అభినందించారు. DRDO has developed an Advanced Chaff Technology to safeguard the naval ships against enemy missile attack. The three variants namely Short Range Chaff Rocket, Medium Range Chaff Rocket, and Long Range Chaff Rocket met Indian Navy’s qualitative requirements. #AtmaNirbharBharat pic.twitter.com/T1RVu3elaK — DRDO (@DRDO_India) April 5, 2021 చదవండి: డిజిటల్ చెల్లింపులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
పొరపాటున కూల్చేశాం
టెహ్రాన్/వాషింగ్టన్: ఉక్రెయిన్ విమానాన్ని తాము పొరపాటున కూల్చేశామని ఇరాన్ ఎట్టకేలకు శనివారం అంగీకరించింది. మానవ తప్పిదం కారణంగా పేలిన క్షిపణులు బోయింగ్ 737ను ఢీకొన్నాయని, ఫలితంగా అది కుప్పకూలిపోయి 176 మంది మరణాలకు కారణమైందని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ప్రకటించారు. తాము జరిపిన సైనిక విచారణలో తప్పిదం విషయం తెలిసిందని చెప్పారు. అయితే ఈ ప్రమాదానికి తమకు సంబంధం లేదని ఇరాన్ ఇన్నిరోజులూ చెప్పింది. ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సులేమానీని అమెరికా డ్రోన్ దాడిలో చంపేయడం, ఇందుకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో వరుస దాడులు జరపడం.. ఆ వెంటనే కొంత సమయానికే ఈ ఘటన చోటు చేసుకోవడంతో దీనిపై సర్వత్రా చర్చ మొదలైంది. శత్రువని అనుకున్నాం... శత్రువులకు సంబంధించిన విమానం అనుకోవడం వల్లనే పొరబాటున ఉక్రెయిన్ విమానాన్ని క్షిపణులతో కూల్చేయాల్సి వచ్చిందని ఇరాన్ మిలటరీ వర్గాలు అంగీకరించాయి. మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపడుతున్నామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ వెల్లడించారు. ఈ తప్పుకు కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మృతుల్లో అధికులు ఇరాన్– కెనడా ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారు కాగా, ఉక్రెయిన్ దేశస్తులు కొందరు ఉన్నారు. కెనడా ప్రధాని ట్రూడో స్పందిస్తూ.. బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేయగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బాధ్యులను శిక్షించాలని, మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని కోరారు. అతన్నీ చంపాలనుకుంది ఇరాన్ సైనిక జనరల్ సులేమానీని చంపిన రోజే మరో ఇరాన్ కమాండర్‌ను కూడా అమెరికా చంపాలనుకుందని, అయితే ఆ వ్యూహం విఫలమైందని అమెరికా అధికారులు తెలిపారు. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్ కోర్ కమాండర్ అబ్దుల్ రెజా షహ్లైని అమెరికా తుదముట్టించాలనుకుంది. ఈ గ్రూపును కూడా అమెరికా ఇప్పటికే ఉగ్రవాద జాబితాలో చేర్చింది. ఇద్దరు నాయకుల మరణాలు ఒకేరోజు జరిగితే ఇరాన్ బలగాలు నీరుగారిపోతాయని అమెరికా భావించింది. అందుకే అబ్దుల్ రెజాను కూడా చంపేందుకు అమెరికా అధ్యక్షుడు అనుమతి ఇచ్చారు. అయితే యెమెన్‌లో ఉన్న ఆయన అమెరికా నుంచి తప్పించుకోగలిగారు. షియా మిలిటెంట్ గ్రూపులకు అబ్దుల్ రెజా ఆయుధాలు, నిధులు సమకూర్చుతున్నట్లు అమెరికా ప్రకటించింది. అతడు చేస్తున్న వ్యవహారాల గురించి చెప్పిన వారికి భారీ మొత్తం ఇస్తామని కూడా ప్రకటించింది. అమెరికాకు వ్యతిరేకంగా, ఉగ్రవాదులకు స్వర్గధామమైన యెమెన్‌లో అబ్దుల్ రెజాను చంపేందుకు తమ దేశం వేసిన ప్రణాళికను తాము చూశామని, అయితే అది విఫలమైనందున మరిన్ని విషయాలు చెప్పడంలేదని పెంటగాన్ అధికార ప్రతినిధి, నేవీ కేడర్‌కు చెందిన రెబెకా రెబరిచ్ తెలిపారు. -
సడలిన ఉద్రిక్తత
టెహ్రాన్: అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు గురువారం నాటికి కొంత సడలాయి. అమెరికా, లేదా అమెరికన్లు లక్ష్యంగా ఎలాంటి దాడులకు పాల్పడవద్దని ఇరాన్ తన అనధికార సైనిక బృందాలకు సమాచారమిచ్చినట్లు తమకు నిఘా సమాచారం అందిందని అమెరికా పేర్కొంది. ఇరాన్ ఇదే తీరును భవిష్యత్తులో కొనసాగిస్తుందని భావిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ గురువారం వ్యాఖ్యానించారు. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన అనంతరం ట్రంప్ అమెరికా ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలోనూ శాంతి ప్రతిపాదన చేశారు. ఇరాన్లో అధికార మార్పిడి జరగాలని అమెరికా కోరుకోవడం లేదని, అధికారంలో ఉన్నవారి తీరు మారాలని కోరుకుంటోందని పెన్స్ వ్యాఖ్యానించారు. ఇరాన్ క్షిపణి దాడుల్లో అమెరికా దళాలకు కానీ, ఇరాకీ దళాలకు కానీ ఎలాంటి ప్రాణ నష్టం కలగకపోవడం తమ దళాల సమర్ధవంతమైన సన్నద్ధత వల్లనే సాధ్యమైందన్నారు. ఇరాన్ గత 20 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, అలాంటి దేశంతో ఘర్షణ విషయంలో తామెప్పుడూ అన్ని విధాలుగా సిద్ధంగానే ఉంటామని పేర్కొన్నారు. ఇరాన్ టాప్ కమాండర్ సులేమానీ చనిపోయాక ప్రపంచం మరింత సురక్షితమైందన్నారు. కాగా, అమెరికాతో ఘర్షణకు సంబంధించి ఇరాన్ నుంచి విభిన్న ప్రకటనలు వెలువడ్డాయి. సులేమానీ హత్యకు భవిష్యత్తులో తీవ్రమైన ప్రతీకారం ఉంటుందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన ఉన్నతస్థాయి సైనికాధికారి అబ్దొల్లా అరాఘి వ్యాఖ్యానించారు. వందలాది మిస్సైల్స్ ఉన్నాయి ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై 13 క్షిపణులను ప్రయోగించామని ఇరాన్ వైమానిక దళ ఉన్నతాధికారి బ్రిగేడియర్ జనరల్ ఆమిర్ అలీ హజీజాదేహ్ వెల్లడించారు. తమవద్ద ఇంకా వందలాది క్షిపణులు ఉన్నాయన్నారు. క్షిపణి దాడులతో పాటు ఇరాక్‌లోని అమెరికా మిలటరీ మానిటరింగ్ సర్వీసెస్‌పై సైబర్ దాడి చేశామన్నారు. ఇరాన్ దాడిలో తమ సైనికులెవరూ చనిపోలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, అమెరికా మరో తప్పు చేస్తే ప్రతీకారం అత్యంత తీవ్రంగా ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ హెచ్చరించారు. ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై జరిపిన దాడి న్యాయమైనదేనన్నారు. తమ అణు కార్యక్రమానికి సంబంధించి ఐరాస పర్యవేక్షకులకు సహకరించడం కొనసాగిస్తామన్నారు. రౌహానీ గురువారం బ్రిటన్ ప్రధాని జాన్సన్‌తో ఫోన్లో మాట్లాడారు. సులేమానీ హత్యను ఖండించాలని ఈ సందర్భంగా జాన్సన్‌ను కోరారు. సులేమానీ కృషి వల్లనే సిరియా, ఇరాక్‌ల్లో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను అణచివేయగలిగామని, ఆ కారణంగానే బ్రిటన్‌లో ప్రజలు శాంతిగా ఉంటున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బోరిస్ జాన్సన్‌తో రౌహానీ వ్యాఖ్యానించారు. గల్ఫ్‌లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని జాన్సన్ రౌహానీని కోరారు. భారత్ ఆకాంక్ష ఇరాన్ అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సాధ్యమైనంత త్వరగా తగ్గాలని భారత్ ఆకాంక్షించింది. గల్ఫ్‌లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొన్నారు. ఇరాన్, అమెరికాల మధ్య శాంతి నెలకొనేందుకు భారత్ తీసుకునే చర్యలను స్వాగతిస్తామని బుధవారం భారత్‌లో ఇరాన్ రాయబారి పేర్కొన్న విషయం తెలిసిందే. -
ఉత్తర కొరియావైపు కదిలిన అమెరికా దండు
-
‘అమెరికాది క్షమించరాని తప్పు.. ఢీకొడతాం’
-
ఉత్తర కొరియావైపు కదిలిన అమెరికా దండు
వాషింగ్టన్: ఇప్పటికే సిరియాపై దాడితో ఒక్కసారిగా ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసిన అమెరికా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. అమెరికా నేవికి చెందిన యుద్ధవిమానాల వాహక నౌకాదళాన్ని ఉత్తర కొరియావైపు పంపించింది. గత కొద్ది రోజులుగా అణుకార్యక్రమాలను ఆపివేయాలని చెబుతున్నప్పటికీ బుద్ధి మార్చుకోకుండా వ్యవహరిస్తున్న ఆ దేశానికి తన పవరేమిటో చూపించేందుకు నావికాదళాన్ని కొరియా ద్వీపంవైపుగా నడిపిస్తున్నట్లు అమెరికా అధికారులు చెప్పారు. అమెరికా చేస్తున్న ఈ పనితో మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. సిరియాపై దాడిని ఖండించినా ఇప్పుడిప్పుడే ఆ వ్యవహారం సర్దుమణుగుతున్న తరుణంలో అమెరికా మరింత దూకుడుగా తీసుకున్న ఈ నిర్ణయం కొంత ఆందోళనలో పడేసింది. ఇప్పటికే అమెరికా దాడిని ఉత్తర కొరియా తీవ్రంగా ఖండించడంతోపాటు తమ సైనిక, ఆయుధ సంపత్తిని మరింత మెరుగుపరుచుకుంటామని, ఎలాంటి దాడినైనా ఎదుర్కొంటామని ప్రకటించిన ప్రస్తుత తరుణంలో అమెరికా యుద్ధనౌక అటుగా వెళ్లడం టెన్షన్ పూరిత వాతావరణం నెలకొంది. ‘అమెరికా పసిఫిక్ కమాండ్ ఉత్తర ప్రాంతంలో ఉన్న కార్ల్ విన్సన్ దాడి గ్రూపును పశ్చిమ పసిఫిక్‌లో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించాం’ అని అమెరికా పసిఫిక్ కమాండ్ కమాండర్, అధికార ప్రతినిధి దేవ్ బెన్హామ్ తెలిపారు. -
‘అమెరికాది క్షమించరాని తప్పు.. ఢీకొడతాం’
ప్యాంగ్యాంగ్: సిరియాపై అమెరికా క్షిపణుల దాడిని ఉత్తర కొరియా ఖండించింది. ఒక సార్వభౌమాధికార దేశంపై అమెరికా చేసిన ఈ దాడి ఏమాత్రం సమ్మతించదగినది కాదని పేర్కొంది. అమెరికా చేసిన ఈ చర్యతో తమ మిలటరీ విభాగాన్ని మరింత అభివృద్ది చేసుకోవాలని అర్థమైందంటూ వివాదాస్పద వ్యాఖ్యను చేసింది. ‘సిరియాపై అమెరికా చేసిన క్షిపణి దాడి క్షమించరానిది. ఒక సార్వభౌమ దేశంపై అమెరికా చేసిన దాడిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి మాకు చేసిన హెచ్చరికగా భావిస్తున్నాం. ఇలాంటి దాడులు ఏక్షణమైనా తమపై జరగొచ్చని అమెరికా పరోక్షంగా తెలిపింది. అందుకే మేం సైనిక సంపత్తిని పెంచుకోవడంపై మరింత వేగాన్ని పెంచుతాం. తగిన సమయం వచ్చినప్పుడు తగిన విధంగా బదులిస్తాం’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 6న 59 క్షిపణులను అమెరికా సిరియా వైమానిక స్థావరాలపై ప్రయోగించిన విషయం తెలిసిందే. కెమికల్ దాడులకు ప్రతీకారంగానే తాము ఈ దాడి చేసినట్లు అమెరికా ప్రకటించింది. మరోపక్క, ఈ దాడితో చైనాకు, ఉత్తర కొరియాకు పరోక్షంగా అమెరికా హెచ్చరికలు చేసిందంటూ కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికాను మరింత రెచ్చగొట్టేలా ఉత్తర కొరియా తాజా ప్రకటన చేసింది.