పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ( ఫైల్ ఫోటో )
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ మిస్సైల్ మిస్‌ఫైర్ వివాదంపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి స్పందించారు. ఆ ఘటన జరిగిన వెంటనే తమ దేశం ఘాటుగా ప్రతిస్పందించగలిగేదని అన్నారు. అయితే.. అలా చేయకుండా తమ వైఖరికి భిన్నంగా ఓపిక పట్టామని చెప్పారు. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను, దేశాన్ని శక్తిమంతం చేసుకుంటామని పేర్కొన్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని హఫీజాబాద్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ర్యాలీలో ఇమ్రాన్ పైవిధంగా స్పందించారు.
కాగా, మార్చి 9న భారత్‌కి చెందిన సూపర్-సోనిక్ ఫ్లయింగ్ క్షిపణి సూరత్‌గఢ్ నుంచి పాకిస్తాన్ భూభాగంవైపు దూసుకుపోయిన సంగతి తెలిసిందే. పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్ చున్ను నగర సమీపంలో అది కూలింది. అయితే, ఈప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ సమీపంలోని గోడ మాత్రం ధ్వంసమైంది. దీనిపై భారత రక్షణ శాఖ ఇప్పటికే వివరణ ఇచ్చింది. సాధారణ నిర్వహణ ప్రక్రియ జరగుతుండగా ప్రమాదవశాత్తు పాకిస్థాన్‌వైపు క్షిపణి దూసుకుపోయిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
(చదవండి: బ్రహ్మోస్ మరింత శక్తివంతం)
ఈ క్షిపణి పాకిస్తాన్‌లో ల్యాండ్ అవ్వడానికి ముందు గగనతలంలో సుమారు 100 కి.మీ పైగా వేగంతో దాదాపు 40 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించిందని పేర్కొంది. సాంకేతిక లోపం కారణంగా ఈ సంఘటన జరిగిందని తీవ్ర విచారం వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక భారత్ స్పందనపై పాకిస్తాన్ విదేశాంగశాఖ కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత్ వివరణ సరిగా లేదని, ఘటనపై ఉమ్మడి దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. అనుకోని ప్రమాదమే అయితే, క్షిపణి లాంచ్ కాగానే వెంటనే చెప్పాలి కదా! అని ప్రశ్నించింది.
(చదవండి: మాటలు జాగ్రత్త! తేడా వస్తే అంతే.. ఇలా వచ్చి అలా తలపై కోడిగుడ్డుతో...)
Comments
Please login to add a commentAdd a comment