‘పొరుగు దేశాలు చల్లగా ఉండాలి. వాటితో మనకు సుహృద్భావ సంబంధాలు ఉండాలి’ అనేది భారత విదేశాంగ విధానం ముఖ్యసూత్రం. ఇప్పుడు పశ్చిమాన సరిహద్దు దేశం పాకిస్తాన్ రాజకీయ అశాంతిని చుట్టుముట్టే పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాక్ మాజీ ప్రధాని, మాజీ క్రికెట్ స్టార్ ఇమ్రాన్ ఖాన్‌ను పారామిలిటరీ రేంజర్లు దేశ రాజధాని ఇస్లామాబాద్‌లోని హైకోర్టు ముందు అరెస్టు చేయడంతో సంక్షోభం తీవ్రమౌతోంది. కిందటేడాది ఏప్రిల్ మొదటివారం పాక్ కేంద్ర చట్టసభ నేషనల్ అసెంబ్లీలో నాటి ప్రధాని ఇమ్రాన్ మెజారిటీ కోల్పోవడంతో మన దాయాది దేశంలో రాజకీయ సంక్షోభం మొదలైంది.
మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి షెహబాజ్ నాయకత్వాన రెండు ప్రధాన పార్టీల (పాకిస్తాన్ ముస్లింలీగ్–ఎన్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ)తో కూడిన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏడాది కాలంగా అధికారంలో ఉన్న ప్రస్తుత పాక్ కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచీ సమస్యలు ఎదుర్కొంటూనే ఉంది. 2022 ఆగస్ట్ మాసంలో వచ్చిన వరదలు దేశంలో మున్నెన్నడూ కనీవినీ ఆర్థిక సంక్షోభానికి దారితీశాయి. ఈ వరదలు దేశంలో తీవ్ర ఆహార కొరత సృష్టించడంతో పాటు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాయి.
ఆహార ధాన్యాల కొరత..
ఇటీవలి రంజాన్ మాసంలో ఆహార ధాన్యాల కొరత, ఆర్థిక సమస్యలు ప్రజలను కుంగదీశాయి. ఈ నేపథ్యంలో పాత కేసులకు సంబంధించి మాజీ ప్రధాని, ప్రధాన ప్రతిపక్షం పాకిస్తాన్ తెహరీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) నేతను అరెస్టు చేయడంతో పాక్ ప్రధాన నగరాలు భగ్గుమన్నాయి. జాతీయ రాజకీయాల్లో పాక్ ఆర్మీ తెరవెనుక నుంచి క్రియాశీల పాత్ర పోషించడం జగమెరిగిన సత్యం. కొత్త పాక్ ఆర్మీ చీఫ్ పై ఇమ్రాన్ ఆరోపణలు, ఆర్మీతో విభేదాలు దేశ రాజకీయాలను మరిన్ని చిక్కుల్లోకి నెట్టే ప్రమాదం కనిపిస్తోంది.
నిన్నటి అరెస్టు తర్వాత సర్వశక్తిమంతమైన పాక్ ఆర్మీ ఉన్నతాధికారుల కార్యాలయాలపై ఇమ్రాన్ అనుచరులు, అభిమానులు చేసిన దాడులు పాక్ ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. అసలే ఆర్థిక, సామాజిక సమస్యలు తీవ్రమైన సమయంలో మాజీ ప్రధాని, మంచి జనాకర్షణ శక్తి ఉన్న ఇమ్రాన్ అరెస్టు పాకిస్తాన్‌ను ‘అగ్నిగుండం’లోకి నెట్టివేసే ప్రమాదం ఉందని భారత రక్షణ, రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
1947 నుంచీ నాలుగు యుద్ధాలు..
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ దాయాది దేశాలైన ఇండియా, పాకిస్తాన్ మధ్య నాలుగు (1947–48, 1965, 1971, 1999) యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాల వల్ల రెండు దేశాలకూ ఆర్థికంగా నష్టమే జరిగింది. అయినా, ఎప్పటికప్పుడు పాకిస్తాన్‌తో శాశ్వత శాంతి కోసమే భారత్ ప్రయత్నిస్తోంది. 1947 ఆగస్ట్ 14 వరకూ ఒకే దేశంగా ఉన్న ఈ రెండు దక్షిణాసియా దేశాలు కశ్మీర్ కారణంగా 20వ శతాబ్దంలో పోరుకు తలపడడం దురదృష్టకర పరిణామం. మతం ఆధారంగా జరిగిన దేశ విభజన పర్యవసానాల వల్ల ఇప్పటికీ రెండు దేశాలూ మానసికంగా బాధపడుతూనే ఉన్నాయి. 1947కు ముందు అంటే బ్రిటిష్ ఇండియాలోని అవిభక్త పంజాబ్‌లో జన్మించిన (ఈ ప్రాంతాలు ఇప్పుడు పాక్ పంజాబ్‌లో చేరి ఉన్నాయి) ముగ్గురు నేతలు గుల్జారీలాల్ నందా, ఇందర్ కుమార్ గుజ్రాల్, డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ప్రధానులుగా పనిచేశారు.
రెండు సర్వసత్తాక దేశాలుగా విడిపోయి 75 ఏళ్లు దాటినాగాని భారత్, పాక్ దేశాల మధ్య దౌత్య, సాంస్కృతిక, ఇతర సంబధాలు కొనసాగుతున్నాయి. వేలాది సంవత్సరాల అనుబంధం ఉన్న పాకిస్తాన్ ప్రశాంతంగా, సుభిక్షంగా ఉంటేనే దానికి ఆనుకుని ఉన్న అతిపెద్ద సరిహద్దుదేశం ఇండియాకు కూడా మంచిదని భారత ప్రజలు భావిస్తున్నారు. భూభాగంలో, జనాభాలో పాకిస్తాన్ కన్నా చాలా పెద్దదైన భారత దేశం పెద్ద మనుసుతో పాకిస్తాన్ ప్రస్తుత రాజకీయ సంక్షోభం నుంచి త్వరగా కోలుకుని బయటపడాలని ఆశిస్తోంది. 22 కోట్ల ప్రజలున్న పాక్‌లో శాంతి, సుస్థిరత 142 కోట్ల ప్రజలు నివసించే భారతదేశానికి కొండంత బలం. పొరుగు ఇంట మంటలు ఎప్పుడూ మన ఇంటికి క్షేమం కాదని నమ్మే భారత ప్రజల విశ్వాసం ఎంతో విలువైనది.
విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ, రాజ్యసభ ఎంపీ.
ఇది కూడా చదవండి: సోరెన్‌తో నితీశ్ భేటీ
Comments
Please login to add a commentAdd a comment