Sakshi News home page

భారత అనుకూల వైఖరి గెలిపించేనా?

Published Sat, Dec 30 2023 3:30 AM

Nawaz Sharif is hoping to win the 2024 general elections - Sakshi

అనుకున్నట్టే జరిగితే, 2024 ఫిబ్రవరిలో పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికలు జరగాలి! ఇప్పుడున్న అంచనా ప్రకారం, నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌(ఎన్ ) మెజారిటీ సాధిస్తుంది. ప్రధానిగా మూడు దఫాలు కూడా పదవీకాలం ముగియకుండానే ఆయన తప్పుకోవాల్సి వచ్చింది.

మిలిటరీ, న్యాయవ్యవస్థ రెండూ కుమ్మక్కై తన ప్రభుత్వాన్ని ఎలా పడదోశాయో చెబుతున్న షరీఫ్‌ ప్రకటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భారత్‌తో కనీస స్థాయి సంబంధాలు కలిగి ఉండాలన్న వాదన వినిపించే భారమిప్పుడు కూడా ఆయనే మోస్తున్నారని చెప్పాలి. ఇది షరీఫ్‌ బలమని కొందరి నమ్మకం. కొందరు బలహీనతగానూ చూస్తున్నారు.  అలాగని షరీఫ్‌ గద్దెనెక్కగానే అంతా సమూలంగా మారిపోతుందని కూడా కాదు.

మిలిటరీ, న్యాయవ్యవస్థ రెండూ కుమ్మక్కై తన ప్రభుత్వాన్ని ఎలా పడదోశాయో వివ రిస్తూ పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఇటీవలి కాలంలో చేస్తున్న ప్రకటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం పాక్‌లో ఉన్న పరిస్థితులు, 2024 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్న నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌(ఎన్ ) పార్టీని దృష్టిలో పెట్టుకుంటే ఈ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం లభిస్తుంది. ఇంకో రెండు నెలల్లో, అంటే 2024 ఫిబ్రవరిలో అక్కడ సాధారణ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అటు మిలిటరీ, ఇటు నవాజ్‌ షరీఫ్‌ అంగీకరిస్తున్న విషయం ఏదైనా ఉందీ అంటే అది మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్  ఖాన్ ను ఎలాగైనా అధికారానికి దూరంగా ఉంచాలన్నది!

భారత్‌లోనే ఎక్కువ ఆసక్తి
ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, షరీఫ్‌ ప్రకటనలకు పాక్‌లో కంటే భారత్‌లోనే ఎక్కువ ఆదరణ లభించడం. ఎందుకిలా? పాకిస్తాన్‌లో అధికార పక్షానికి భిన్నంగా చేసే వ్యాఖ్యలు, వార్తలు సెన్సార్‌కు గురవుతాయి కాబట్టి అని కొందరు అంటారు. అయితే, పాకిస్తాన్ లో చాలా అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. మీడియా కూడా వాటిని జనానికి చేర్చుతుంటుంది.

కానీ ప్రధాన మీడియా వర్గాలు ముట్టుకోకూడదనుకున్న అంశాలకు సోషల్‌ మీడియా వేదికగా నిలుస్తోంది. బహుశా మనం దూరం నుంచి పాక్‌ వ్యవహారాలను గమనిస్తూంటాం కాబట్టి... మన దృష్టంతా అక్కడ మిలిటరీకీ, ప్రభుత్వానికీ మధ్య ఉన్న వివాదాలపైనే ఉంటుంది. నవాజ్‌ షరీఫ్‌ ఇలాంటి విషయాల్లో పాతికేళ్లుగా కేంద్ర బిందువుగా నిలిచారు. ప్రధానిగా ఉన్న మూడు దఫాలు కూడా పదవీ కాలం ముగి యకుండానే వేర్వేరు కారణాల వల్ల ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. మిలిటరీ కుట్రలు లేదా మిలిటరీ–న్యాయవ్యవస్థ కుమ్మక్కులతో అన్నమాట!

పాకిస్తాన్‌లో షరీఫ్‌ ఇటీవలి ప్రకటనలను కొంచెం భిన్నమైనదృష్టితో చూస్తారేమో. నవాజ్‌ షరీఫ్‌ నడిపే రాజకీయాలకు ఇలాంటి ప్రకటనలే ఆధారం. ఇందులో సందేహం ఏమీ లేదు. మిలిటరీ వ్యతి రేకతను ఒక అంశంగా నిత్యం ఉంచుతారు ఆయన. కానీ రాజకీయ వైచిత్రి ఏమిటంటే, ఇప్పుడు మిలిటరీతో కలిసిపోయి అధికారంలోకి వచ్చేందుకు షరీఫ్‌ ప్రయత్నిస్తూండటం! ఇమ్రాన్  ఖాన్  తప్పటడు గులు, అతడి అనుచరుల చేష్టల పుణ్యమా అని షరీఫ్, మిలిటరీ మధ్య రాజీ కుదిరిపోయింది.

అయినప్పటికీ ప్రస్తుతం షరీఫ్‌ ఒక రకమైన ఇబ్బందికరమైన స్థితిలోనే ఉన్నాడని చెప్పాలి. ఒకవేళ  ప్రజల్లో మిలి టరీపై వ్యతిరేకత అంటూ ఉంటే దాని ఫలాలు అనుభవించేది ఇమ్రాన్‌ ఖానే అవుతాడు కానీ షరీఫ్‌ కాదు. ఈ నేపథ్యంలోనే భారత్‌తో సంబంధాల విషయమై షరీఫ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగాకొంత ప్రాధాన్యం ఏర్పడుతోంది. అలాగని షరీఫ్‌ గద్దెనెక్కగానే అంతా సమూలంగా మారిపోతుందని కూడా ఏమీ కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఎన్నికల సీజన్ , అంతే!

మార్పులపై తీవ్రమైన అంచనాలు!
పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏవో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయన్న అంచనాలైతే బల పడుతున్నాయి. దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే పాక్‌లోనూ ఎన్నికల ప్రక్రియ మూడు దశల్లో పూర్తవుతుంది. ఇప్పు డున్న సాధారణ అంచనా ప్రకారం షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (ఎన్ ) మెజారిటీ సాధిస్తుంది. షరీఫ్‌ను నాలుగోసారి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమైందని కూడా చాలామంది అనుకుంటున్నారు.

ఇమ్రాన్  ఖాన్  విషయానికి వస్తే జైల్లో ఉన్న ఈ మాజీ ప్రధానికి చెందిన పార్టీ ముక్కలు ముక్కలై ఉంది. పార్టీలో ఒకప్పుడు దిగ్గజాలుగా ఉన్నవారు ఇప్పుడు మాకేంసంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వీరు గతంలో ఇమ్రాన్ వైపు మొగ్గిన సందర్భంలోనూ మిలిటరీకి వ్యతిరేకంగా ఉండాల్సి వస్తుందని ఊహించి ఉండరు. వీరిని మినహాయిస్తే మిగిలిన మద్దతు దారులు అనేక రకాల ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. వీరిలో ఎందరు ఎన్నికల్లో పోటీకి దిగుతారన్నది కూడా అనుమానమే. 

ఇంకోపక్క ఈ వాదనకు ప్రతివాదనలు రెండు వినిపిస్తున్నాయి. ఏవీ కొట్టిపారేసేవి కాదు. అవేమిటంటే... ఇమ్రాన్ ఖాన్‌కు ఇప్పటికీ ప్రజల్లో ఆదరణ ఉందన్న అంశం మొదటిది. ఆయన ఆశీస్సులున్న నేతలు కచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తారన్నది రెండో విషయం. నవాజ్‌ షరీఫ్‌ చరిత్రను తరచి చూస్తే అతడేమంత నమ్మదగ్గ వ్యక్తి కాదని ఆర్మీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవి చాలాకాలంగా ఉన్నవే. గతంలో ఇమ్రాన్  ఖాన్ కు చేసినట్లే ఇప్పుడు కూడా నవాజ్‌కు అడ్డంగా ఉన్న ప్రతిపక్షాలన్నింటినీ తొలగిస్తే గతానుభ వాలు మళ్లీ ఎదురు కావన్న గ్యారెంటీ ఏమిటని ఆర్మీ వర్గాల్లో కొందరు సందేహిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే చాలామంది చెబుతున్నదేమిటంటే... వచ్చే ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ రాదూ, హంగ్‌ ఏర్పడుతుందీ అని! తద్వారా పగ్గాలు ఆర్మీ ఆధీనంలోనే ఉంటాయని భావిసు ్తన్నారు. ఆసక్తికరమైన ఇంకో విషయం గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఈ రెండు వాదనలకు బలం చేకూరుతూండగానే... అసలు ఎన్నికలే జరగవన్న మూడో వాదన కూడా మొదలైంది. ఒకవేళ జరిగినా అవి ఫిబ్రవరిలో కాకుండా, బాగా జాప్యం  తరువాతేనని అంటున్నారు.

అసలు విషయాలు వేరే...
ఇప్పటివరకూ చెప్పుకొన్న అంచనాలు ఎన్నికలు జరిగేంతవరకూ కొనసాగడం గ్యారెంటీ. కానీ వీటిన్నింటికంటే అతి ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఎదు ర్కోవాల్సిన సవాళ్లు ఇవి. దయనీయ స్థితిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ వీటిల్లో ఒకటైతే, అంతర్గత భద్రత రెండోది. అఫ్గానిస్తాన్‌లో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతూండటం కూడా పాక్‌కు ఒక సవాలే. వచ్చే ఏడాది పాక్‌ భవిష్యత్తును నిర్ణయించేవి ఈ మూడు అంశాలే అన్నా అతిశయోక్తి లేదు.

నవాజ్‌ షరీఫ్‌ ప్రకటనల్లో భారత్‌ ప్రస్తావన తరచూ వస్తోంది. పైగా ఈ వ్యాఖ్యలు రెచ్చగొట్టేవి కాదు. సానుకూలంగా ఉన్నవే. భారత్‌తో కనీస స్థాయి సంబంధాలు కలిగి ఉండాలన్న వాదన వినిపించే భారమిప్పుడు ఈయనే మోస్తున్నారని చెప్పాలి. ఇది షరీఫ్‌ బలమని కొందరి నమ్మకం. కొందరు బలహీనతగానూ చూస్తున్నారు. ఈ చర్చలో మనమూ భాగస్వాములం కాగలమా? ఎన్నికల ఫలితాల తరువాత కానీ అర్థం కాదు. భారత్, పాక్‌ సంబంధాలిప్పుడు కీలక దశలో ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు.

ఈసారి ఉగ్రవాదం, కశ్మీర్, వ్యూహాత్మకంగా ఇరుదేశాల మధ్య ఉన్న అపనమ్మకం వంటివి మును పటిలాగానే సమస్యను పీటముడి స్థాయికి తీసుకొచ్చాయి. ఇరువైపుల నుంచి చొరవ, చేతలు రెండూ ఉంటేగానీ ఈ పీటముడి విడిపడదు. ఒక్కటైతే నిజం. ఈ పీటముడి పూర్తిగా విడిపోకపోయినా, కనీసంకొంత వదులుగానైతే తప్పకుండా మారాలి. ఈ దిశగా భారత దేశమే చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనపరచాలి. దక్షిణాసియా రాజకీయాల్లో, భారత పాకిస్తాన్‌ చరిత్రలోనూ ఇదేమీ తెలియని అంశమైతే కాదు.

- టి.సి.ఎ. రాఘవన్
వ్యాసకర్త పాకిస్తాన్‌లో భారత మాజీ హై కమిషనర్‌(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో) 

Advertisement

What’s your opinion

Advertisement