ఇస్లామాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. రష్యా నుంచి ఇంధనాన్ని రాయితీపై కొనుగోలు చేయాలనే భారత్ నిర్ణయాన్ని ఇమ్రాన్ కొనియాడారు. అమెరికా ఒత్తిడిని తట్టుకుని ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రష్యా చమురును రాయితీపై దిగుమతి చేసిందని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు శనివారం ట్వీట్ చేశారు.
క్వాడ్‌లో భారత్ సభ్య దేశం అయినప్పటికీ అమెరికా ఒత్తిడిని తట్టుకుని ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రష్యా నుంచి చమురును రాయితీతో దిగుమతి చేసింది. భారత్ స్వతంత్ర విదేశాంగ విధానంలో పనిచేస్తోంది’ అని ఇమ్రాన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా గతంలో పాకిస్థాన్‌లో తమ ప్రభుత్వం కూడా ఇలాగే ప్రజల ప్రయోజనాల కోసమే కృషి చేసిందని ప్రస్తావించారు.
చదవండి: ఆస్ట్రేలియాలో అధికారం చేపట్టిన లేబర్ పార్టీ
ఇక పాకిస్థాన్ ప్రస్తుతం ప్రభుత్వంపై ఇమ్రాన్ ఖాన్ విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నేతృత్వంలోని ప్రభుత్వం వల్ల పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని మండిపడ్డారు. పాక్ ఆర్థిక వ్యవస్థ తలాతోక లేని కోడిలా నడుస్తోందని, షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలోని మీర్ జాఫర్లు, మీర్ సాదిక్‌లు బాహ్య దేశాల బలవంతపు ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారని విమర్శించారు. కాగా అంతకముందు కూడా ఇమ్రాన్ ఖాన్ భారత్‌ను పలుమార్లు ప్రశంసించారు. భారత్‌ను ఏ దేశం శాసించలేదని, అక్కడి రాజకీయాల్లోనూ బయటి శక్తుల జోక్యం ఉండదన్నారు. భారత్‌కు తమ దేశ ప్రజల సంక్షేమమే ముఖ్యమని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment