ఇరాక్‌లోని అయిన్ అల్ అసద్ వైమానిక స్థావరంలో క్షిపణి దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలు (వృత్తాల్లో)
టెహ్రాన్: అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు గురువారం నాటికి కొంత సడలాయి. అమెరికా, లేదా అమెరికన్లు లక్ష్యంగా ఎలాంటి దాడులకు పాల్పడవద్దని ఇరాన్ తన అనధికార సైనిక బృందాలకు సమాచారమిచ్చినట్లు తమకు నిఘా సమాచారం అందిందని అమెరికా పేర్కొంది. ఇరాన్ ఇదే తీరును భవిష్యత్తులో కొనసాగిస్తుందని భావిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ గురువారం వ్యాఖ్యానించారు. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన అనంతరం ట్రంప్ అమెరికా ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలోనూ శాంతి ప్రతిపాదన చేశారు. ఇరాన్‌లో అధికార మార్పిడి జరగాలని అమెరికా కోరుకోవడం లేదని, అధికారంలో ఉన్నవారి తీరు మారాలని కోరుకుంటోందని పెన్స్ వ్యాఖ్యానించారు.
ఇరాన్ క్షిపణి దాడుల్లో అమెరికా దళాలకు కానీ, ఇరాకీ దళాలకు కానీ ఎలాంటి ప్రాణ నష్టం కలగకపోవడం తమ దళాల సమర్ధవంతమైన సన్నద్ధత వల్లనే సాధ్యమైందన్నారు. ఇరాన్ గత 20 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, అలాంటి దేశంతో ఘర్షణ విషయంలో తామెప్పుడూ అన్ని విధాలుగా సిద్ధంగానే ఉంటామని పేర్కొన్నారు. ఇరాన్ టాప్ కమాండర్ సులేమానీ చనిపోయాక ప్రపంచం మరింత సురక్షితమైందన్నారు. కాగా, అమెరికాతో ఘర్షణకు సంబంధించి ఇరాన్ నుంచి విభిన్న ప్రకటనలు వెలువడ్డాయి. సులేమానీ హత్యకు భవిష్యత్తులో తీవ్రమైన ప్రతీకారం ఉంటుందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన ఉన్నతస్థాయి సైనికాధికారి అబ్దొల్లా అరాఘి వ్యాఖ్యానించారు.
వందలాది మిస్సైల్స్ ఉన్నాయి
ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై 13 క్షిపణులను ప్రయోగించామని ఇరాన్ వైమానిక దళ ఉన్నతాధికారి బ్రిగేడియర్ జనరల్ ఆమిర్ అలీ హజీజాదేహ్ వెల్లడించారు. తమవద్ద ఇంకా వందలాది క్షిపణులు ఉన్నాయన్నారు. క్షిపణి దాడులతో పాటు ఇరాక్‌లోని అమెరికా మిలటరీ మానిటరింగ్ సర్వీసెస్‌పై సైబర్ దాడి చేశామన్నారు. ఇరాన్ దాడిలో తమ సైనికులెవరూ చనిపోలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, అమెరికా మరో తప్పు చేస్తే ప్రతీకారం అత్యంత తీవ్రంగా ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ హెచ్చరించారు.
ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై జరిపిన దాడి న్యాయమైనదేనన్నారు. తమ అణు కార్యక్రమానికి సంబంధించి ఐరాస పర్యవేక్షకులకు సహకరించడం కొనసాగిస్తామన్నారు. రౌహానీ గురువారం బ్రిటన్ ప్రధాని జాన్సన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సులేమానీ హత్యను ఖండించాలని ఈ సందర్భంగా జాన్సన్‌ను కోరారు. సులేమానీ కృషి వల్లనే సిరియా, ఇరాక్‌ల్లో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను అణచివేయగలిగామని, ఆ కారణంగానే బ్రిటన్‌లో ప్రజలు శాంతిగా ఉంటున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బోరిస్ జాన్సన్‌తో రౌహానీ వ్యాఖ్యానించారు. గల్ఫ్‌లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని జాన్సన్ రౌహానీని కోరారు.
భారత్ ఆకాంక్ష
ఇరాన్ అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సాధ్యమైనంత త్వరగా తగ్గాలని భారత్ ఆకాంక్షించింది. గల్ఫ్‌లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొన్నారు. ఇరాన్, అమెరికాల మధ్య శాంతి నెలకొనేందుకు భారత్ తీసుకునే చర్యలను స్వాగతిస్తామని బుధవారం భారత్‌లో ఇరాన్ రాయబారి పేర్కొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment