ఇక ఇజ్రాయెల్ బాంబుల మోత!
త్వరలో ఇరాన్ అణుకేంద్రాలపై దాడులు?
ట్రంప్-నెతన్యాహు భేటీతో మారుతున్న పశ్చిమాసియా ముఖచిత్రం.
ప్రపంచంలో బాంబులన్నిటికీ ‘మాత’ అనదగ్గ అత్యంత శక్తిమంతమైన అతి పెద్ద బాంబు అది. అణ్వస్త్రం/అణ్వాయుధం/అణుబాంబు కోవలోకి రాని నాన్-న్యూక్లియర్ బాంబు అది. పూర్తి పేరు- GBU-43/B మాసివ్ ఆర్డినన్స్ ఎయిర్ బ్లాస్ట్ బాంబ్. ఈ జీపీఎస్ గైడెడ్ బాంబు ఇజ్రాయెల్ అమ్ములపొదిలో చేరబోతోందా? దాన్ని అమెరికా నుంచి బహుమతిగా ఇజ్రాయెల్ స్వీకరించబోతోందా?..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుతో మొన్న సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ చర్చల దరిమిలా అమెరికా నుంచి ‘మోబ్’ ఇజ్రాయెల్ చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ తనను అంతమొందించే పక్షంలో ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా చేయాలంటూ ఇప్పటికే తాను శ్వేతసౌధానికి సూచనప్రాయ ‘అప్పగింతలు’ పూర్తిచేసినట్టు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ తాజాగా ‘అణ్వాయుధాల ఊపు’ మీదున్న నేపథ్యంలో ఇప్పుడు ‘మోబ్’ వార్త పశ్చిమాసియాను కలవరపెడుతోంది.
యేండ్లు, పూండ్లు కాకుండా నెలల వ్యవధిలోనే అతి త్వరగా అణ్వస్త్రాన్ని తయారుచేసే మార్గాలను ఇరాన్ శాస్త్రవేత్తలు చురుగ్గా అన్వేషిస్తున్నట్టు ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ఓ వార్తాకథనం ప్రచురించిన నేపథ్యంలో ఇరాన్ అణు పరిశోధనా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేయాడానికే ‘మోబ్’ను అమెరికా పంపుతోందని తెలుస్తోంది. 30 అడుగుల పొడవైన ‘మోబ్’ విషయానికొస్తే.. ఈ బాంబులో 11 టన్నుల పేలుడు పదార్థం (టీఎన్టీ- ట్రైనైట్రోటోలీన్) ఉంటుంది. దీని పేలుడు ప్రభావానికి 300 మీటర్ల వెడల్పున పెద్ద గొయ్యి ఏర్పడుతుంది.
🇺🇲🇮🇱 Reports are emerging that the U.S. is planning to transfer the world's most powerful non-nuclear bombs, the MOAB ("Mother of All Bombs"), to Israel.
The MOAB weighs 11 tons and is capable of destroying deeply buried bunkers, such as Iran's nuclear facilities. Since George… pic.twitter.com/B8Toh3IT2o— OSINTRadar (@osintradar01) February 6, 2025
తొలిసారిగా 2003లో పరీక్షించిన ఈ బాంబును 2017లో అఫ్గానిస్థాన్లో ‘ఇసిస్’ బంకర్లు లక్ష్యంగా ప్రయోగించారు. భారీ విస్ఫోటనాన్ని కలిగించే ‘మోబ్’… భవనాలను నేలమట్టం చేయగలదు. భూగర్భ సొరంగాల్లోని లక్ష్యాలను 200 అడుగుల లోతు వరకు ఛేదించగలదు. భూమి కంపించి.. అగ్నిగోళం ప్రజ్వరిల్లి.. మిన్ను విరిగి మన్ను మీద పడినట్టుగా ‘మోబ్’ ఇంపాక్ట్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు!.
-జమ్ముల శ్రీకాంత్.
Comments
Please login to add a commentAdd a comment