
స్వర్గం ఎలా ఉంటుందో ఎవడికి తెలుసు?. ఎవరో వర్ణిస్తే కానీ ఊహించుకోవడం తప్పించి!. ఒకవేళ అది భూమ్మీద గనుక ఉంటే.. అది అచ్చం ‘వనాటు’(Vanuatu)లాగే ఉంటుందని లలిత్ మోదీ అంటున్నారు. ఐపీఎల్ సృష్టికర్త కారణంగా ఇప్పుడు ఈ దేశం పేరు తెగ వినిపించేస్తుండగా.. దాని గురించి వెతికే వాళ్ల సంఖ్యా ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఆర్థిక నేరగాడికి అభియోగాలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ 2010లో దేశం విడిచి లండన్ పారిపోయారు. అయితే ఆయన్ని వెనక్కి రప్పించే ప్రయత్నాలు భారత్ ముమ్మరంగా చేయగా.. ఆయన తెలివిగా వనాటు పౌరసత్వం పొందారు. అయితే ఈ విషయం తెలియడంతో ఆ దేశం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది. ఇది ఇక్కడితోనే ఆగలేదు. లలిత్ మోదీ పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు వనాటు ప్రధాని జోథం నపాట్ స్వయంగా ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడిన కాసేపటికే.. ఎక్స్ వేదికగా లలిత్ ఓ పోస్ట్ చేశారు.
‘‘వనాటు ఒక అందమైన దేశం, స్వర్గంలా ఉంది. మీ పర్యటనల జాబితాలో దీన్ని చేర్చాల్సిందే’’ అని సందేశం ఉంచారు. దీంతో నెటిజన్స్ ఆయన కామెంట్ సెక్షన్‌లో సరదా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వనాటు అందాల గురించి ఆరా తీస్తున్నారు.

వనాటు.. ఎక్కడుంది?
ఉత్తర ఆస్ట్రేలియాకు 1,750 కిలోమీటర్ల దూరంలో దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఉంది ఈ ద్వీప దేశం. మొత్తం 83 చిన్న చిన్న ద్వీపాల సముదాయంగా వై(Y) ఆకారంలో ఉంటుందీ దేశం. ఇందులో 65 ద్వీపాల్లో మాత్రమే ప్రజలు జీవిస్తున్నారు. ఎఫేట్ ఐల్యాండ్‌లో ఉండే పోర్టువిల్లా నగరం ఆ దేశ రాజధాని. పశ్చిమంగా ఫిజీ దేశం, ఇతర దిక్కుల్లో సాలామాన్ ద్వీపాలు, న్యూ కాలేడోనియా ఉన్నాయి. ఒకప్పుడు బ్రిటిష్‌ఫ్రెంచ్ సంయుక్త పాలనలో ఇది బానిస దేశంగా ఉండేది. 1980 జులై 30న వనాటు స్వాతంత్రం పొందింది. కరెన్సీ వనాటు వాటు. ప్రస్తుత జనాభా దాదాపు మూడున్నర లక్షలు. ‘‘దేవుడితో మేం నిలబడతాం’’ అనేది ఆ దేశపు నినాదం.

అగ్నిపర్వతాలు.. భూకంపాల నేల
ఈ ద్వీప దేశంలో అగ్నిపర్వతాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని క్రియాశీలకంగా కూడా ఉన్నాయి. సంవత్సరంలో సుదీర్ఘంగా వేసవి వాతావరణంతో పొడిగా ఉంటుంది అక్కడ. అయితే నవంబర్-ఏప్రిల్ మధ్య వర్షాలు, తుపాన్లు సంభవిస్తుంటాయి. ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉండడం మూలంగా భూ కంపాలు షరామాములుగా మారాయి. అయితే కిందటి ఏడాది డిసెంబర్‌లో 7.3 తీవ్రతతో వచ్చిన భూకంపం ఆ దేశానికి తీవ్ర నష్టం కలిగించింది. ఈ భూకంపంలో 14 మంది చనిపోగా.. 265 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అందాల లోకం..
వనాటులో ఉన్న వృక్ష, జంతు సంపద అత్యంత అరుదైంది. ఈ భూమ్మీద ఎక్కడా కనిపించని జీవ జాతులు ఉన్నాయక్కడ. ఎటు చూసినా.. దట్టమైన అడవులు, జలపాతాలు, అందమైన సముద్రం.. నిర్మానుష్యమైన తీరాలు, కొన్ని ద్వీపాల్లో లాగున్లూ.. ఓ ప్రత్యేక అనుభూతిని పంచుతాయి. సహజ సౌందర్యం, జీవ వైవిధ్యం.. వనాటును ప్రపంచ పర్యాటక జాబితాలో ‘ప్యారడైజ్ ఆఫ్ ది ఎర్త్’గా నిలబెట్టాయి.


టూరిజం కోసమే..
టూరిజం, వ్యవసాయం ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ వనరులు. అలాగే జనాభాలో గ్రామీణ జనాభా ఎక్కువ. 80 శాతం వ్యవసాయమే చేస్తుంటారు. కావా పంట ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంది. పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయం ఆ దేశ జీడీపీలో 65 శాతంగా ఉంది. పర్యాటకం మీద ఆధారపడిన ప్రజలు కావడంతో.. పర్యాటకులను మర్యాదలతో ముంచెత్తారు. అలాగే.. సంప్రదాయాలకు అక్కడి ప్రజలు పెద్ద పీట వేస్తుంటారు. పెంటెకాస్ట్ ఐల్యాండ్‌లో స్థానికులు ల్యాండ్ డైవింగ్ క్రీడ నిర్వస్తుంటారు. బొంగులలాంటి నిర్మాణలను ఎత్తుగా పేర్చి.. చెట్ల తీగలతో సాయంతో బంగీ జంప్‌లా కిందకు దూకుతారు. ఎవరి తల భూమికి మొదట తాకితే వాళ్లు విజేతలు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు చేసే ఈ ప్రయత్నాల్లో.. పాపం ఒక్కోసారి ప్రాణాలు పొగొట్టుకుంటారు కూడా.

పన్నులు లేవు, కానీ..
వనాటులో ఎలాంటి పన్నులు విధించరు. ఈ కారణంగా అంతర్జాతీయ నియంత్రణ సంస్థలు ఈ దేశంపై ప్రత్యేక దృష్టి సారించాయి. అదే టైంలో.. వనాటు ఆర్థిక నేరాలకు అడ్డా కూడా. మనీలాండరింగ్‌కు సంబంధించిన చట్టాలు కూడా అక్కడ బలహీనంగా ఉండడమే ప్రధాన కారణం.
ఆర్థిక నేరాలతో పాటు డ్రగ్స్.. ఆయుధాల అక్రమ రవాణాలకు ఇది అడ్డాగా మారింది. ఈ కారణంగానే పైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ దేశాన్ని గ్రే లిస్ట్‌లో చేర్చింది. అలాగే.. 2017లో వెలుగు చూసిన ప్యారడైజ్ పేపర్స్ లీక్.. అక్కడి అక్రమ సంపద వ్యవహారాలను బయటపెట్టింది. ఇక.. 2001 ఏప్రిల్‌లో అప్పటి ప్రధాని బరాక్ సోప్ ఫోర్జరీ కేసులో చిక్కుకున్నారు. భారత్‌కు చెందిన వ్యాపారవేత్త అమరేంద్ర నాథ్ ఘోష్‌కు వందల కోట్ల విలువ చేసే పైనాన్షియల్ గ్యారెంటీలను అనధికారికంగా కట్టబెట్టారని బరాక్‌పై అభియోగాలు వచ్చాయి. ఈ కారణంతో ఆయన అదే ఏడాది తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే.. ప్రపంచం దృష్టిలో ఏర్పడిన ఈ మచ్చని.. కఠిన చట్టాల ద్వారా తొలగించుకునే పనిలో ఉంది ఈ సుందర ద్వీప దేశం.
Comments
Please login to add a commentAdd a comment