
వనౌతు ప్రధాని జొథమ్ ఆదేశాలు
పోర్ట్ విలా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మాజీ వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి ఇటీవల జారీ చేసిన పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని పసిఫిక్ ద్వీప దేశం వనౌతు ప్రధానమంత్రి జొథమ్ నపట్ తమ అధికారులను ఆదేశించారు. పరారీలో ఉన్న ఈ నిందితుడు భారత్‌కు అప్పగింత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు.
ఐపీఎల్ సారథిగా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలను లంచంగా తీసుకున్నాడన్న ఆరోపణలపై దర్యాప్తు విభాగాలు విచారణ చేపట్టాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు 2010లో దేశం వీడిన లలిత్ లండన్‌లో ఉంటున్నాడు. అయితే, ఇటీవల వనౌతు పాస్‌పోర్టు పొందిన లలిత్ మోదీ తన భారత పాస్‌పోర్టును లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయానికి అప్పగిస్తూ దరఖాస్తు చేసుకున్నాడు. ఒకవేళ, ఈ దరఖాస్తును భారత ప్రభుత్వం ఆమోదిస్తే మోదీ లండన్‌లో చట్ట విరుద్ధంగా ఉంటున్న వ్యక్తి అవుతాడు. ఈ పరిణామాల నేపథ్యంలో వనౌతు ప్రధాని కార్యాలయం నుంచి సోమవారం తాజా ప్రకటన వెలువడటం గమనార్హం.
లలిత్ పాస్‌పోర్టు దరఖాస్తు పరిశీలన సమయంలో ఇంటర్‌పోల్ వంటి అంతర్జాతీయ వ్యవస్థల నుంచి అతడిపై జారీ చేసిన ఎటువంటి నోటీసులు లేని విషయాన్ని అధికారులు గమనించారని చెప్పారు. అయితే, ఇటీవల అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా లలిత్ పాస్‌పోర్ట్ రద్దు చేయాలని సిటిజన్‌షిప్ కమిషన్‌ను ఆదేశించినట్లు చెప్పారు. లలిత్ మోదీపై అలెర్ట్ నోటీసు ఇవ్వాలంటూ భారత్ ప్రభుత్వం చేసిన వినతులను సరైన ఆధారాల్లేవంటూ ఇంటర్‌పోల్ 24 గంటల్లో రెండుసార్లు తోసిపుచ్చిందని చెప్పారు. అయితే, అతడు భారత్‌కు అప్పగించకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయం స్పష్టమైనందునే పాస్‌పోర్టు రద్దుకు ఆదేశాలిచ్చినట్లు వనౌతు ప్రధాని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment