
కరచాలనంతోనూ షాక్ కొడుతుంది
ఛైర్ పట్టుకుంటే చప్పున షాక్ తగులుతుంది
డోర్‌నాబ్ ముట్టుకున్నా చిన్నపాటి షాక్ అనుభూతి
మీరెప్పుడైనా నిలబడి సరదాగా అప్పటిదాకా మాట్లాడుతున్న వ్యక్తితో వీడ్కోలు చెప్పబోతూ కరచాలనం ఇస్తే చేతికి షాక్ కొట్టిందా?. ఎవరో కూర్చున్న కుర్చిని వెనక్కో ముందుకో లాగబోతూ పట్టుకుంటే టప్పున షాక్ కొట్టిందా?. గుండ్రంగా వెండిరంగులో మెరిసే డోర్‌నాబ్‌ను పట్టుకోగానే చిన్నపాటి షాక్‌కు గురయ్యారా?. ఈ కరెంట్ ఎక్కడి నుంచి వచ్చిందనే డౌట్ మీలో ఉండిపోతే అలాంటి సైన్స్ ప్రియుల కోసం పరిశోధకులు కొన్ని సమాధానాలను సిద్ధంచేశారు. చదివేద్దామా మరి !!
ఉపరితలం చేసే మేజిక్కు
ప్రతి వస్తువులో కణాలకు విద్యుదావేశశక్తి దాగి ఉంటుంది. అయితే ఆయా వస్తువుల ఉపరితలాల ఎలక్ట్రిక్ స్థిరత్వం అనేది వాతావరణాన్ని తగ్గట్లు మారతుంది. అంటే గాలిలో తేమ పెరగడం, తగ్గడం, ఎండాకాలం, వర్షాకాలం వంటి సందర్భాల్లో వస్తువుల ఉపరితల ఎలక్టిక్ స్థిరత్వం దెబ్బతిని అసమతుల్యత ఏర్పడుతుంది. ఉదాహరణకు ఒక ప్లాస్టిక్ కుర్చిని తీసుకుంటే దాని ఉపరితల ఎలక్టిక్ ఛార్జ్ అనేది ఎండాకాలంలో ఒకలా, చలికాలంలో మరోలా ఉంటుంది.
అదే సమయంలో పాలిస్టర్, ఉన్ని ఇలా విభిన్న వస్త్రంతో తయారైన దుస్తులు ధరించి మనిషి శరీర ఉపరితల ఎలక్ట్రిక్ చార్జ్ సైతం భిన్నంగా ఉంటుంది. చలికాలంలో వాతావరణం చల్లబడటంతో గాలిలో తేమ శాతం తగ్గుతుంది. చల్లటి గాలి అధిక తేమను పట్టి ఉంచలేదు. దీంతో చల్లటి గాలి తగిలిన ప్లాస్టిక్ కుర్చీ ఉపరితలంలో అసమాన ఎలక్ట్రిక్ చార్జ్ ఉంటుంది.
దీనిని విభిన్న ఎలక్టిక్ ఛార్జ్ ఉన్న మనిషి హఠాత్తుగా పట్టుకుంటే సమస్థాయికి తీసుకొచ్చేందుకు అత్యంత స్వల్పస్థాయిలో విద్యుత్‌కణాలు అటుఇటుగా రెప్పపాటు కాలంలో ప్రయాణిస్తాయి. ఉపరితలంలో కదిలే ఆ విద్యుత్ కణాల ప్రవాహ స్పర్శ తగిలి మనం షాక్ కొట్టిన అనుభూతిని పొందుతాం. మనిషి, ఇంకో మనిషికి షేక్ హ్యాండ్ ఇచి్చనప్పుడు కూడా ఇదే భౌతిక శాస్త్ర దృగ్విషయం జరుగుతుంది. అందుకే కొందరు మనుషుల్ని పొరపాటున పట్టుకున్నా మనకు వెంటనే షాక్ కొడుతుంది. అంతసేపు ఒకరు కూర్చున్న ఛైర్‌ను పట్టుకున్నా షాక్ రావడానికి అసలు కారణం ఇదే.
చలికాలంలోనే ఎక్కువ!
మిగతా కాలంతో పోలిస్తే చలికాలంలో వాతావరణంలో గాలిలో తేమ మారుతుంది. ముఖ్యంగా మనం కొద్దిసేపు ఆరుబయట గడిపి లోపలికి రాగానే అంతసేపు పాలిస్టర్, నైలాన్ వంటి సింథటిక్ దుస్తుల ధరించిన మన శరీర ఉపరితల చార్జ్ అనేది ధనావేశంతో లేదా రుణావేశంతో ఉంటుంది. గదిలోకి వచ్చి వెంటనే అక్కడి మనుషుల్ని, ఛైర్, డోర్‌నాబ్ వంటి వాటిని పట్టుకుంటే అవి అప్పటికే వేరే గాలి వాతావరణంలో భిన్నమైన ఆవేశంతో ఉంటాయి కాబట్టి మనకు షాక్ కొట్టే అవకాశాలే ఎక్కువ. తేమలేని గాలిలో చలికాలంలో ఈ షాక్ ఘటనలు ఎక్కువగా, తేమ అధికంగా ఉండే ఎండాకాలంలో ఈ షాక్ ఘటనలు తక్కువగా చూస్తుంటాం. దీనిని మనం పట్టుకునే, తగిలి, ముట్టుకునే వస్తువుల ఉపరితల ధనావేశం, రుణావేశమే కారణం.
దీనిని తప్పించుకోలేమా?
ఈ తరహా పరిస్థితుల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. మన శరీర ఉపరితల అత్యంత సూక్ష్మస్థాయి విద్యుత్‌స్థాయిలు ఒకేలా ఉండేలా చర్మానికి లోషన్ లాంటివి రాసుకోవచ్చు. సింథటిక్ వస్త్రంతో చేసిన దుస్తులకు బదులు సహజసిద్ధ కాటన్ దుస్తులు ధరించడం మంచిది. నేల, గడ్డిపై నడిచేటప్పుడు స్టాటిక్ విద్యుత్‌కు గురికాకుండా ఉండాలంటే చెప్పులు, షూ లాంటివి ధరించకుండా చెప్పుల్లేకుండా నడవండి. ఇకపై మీరెప్పుడైనా ఇంట్లో సాధారణ పరిస్థితుల్లో ఇలాంటి షాక్‌కు గురైతే సరదాగా తీసుకోండి. అద్భుత, విచిత్ర సైన్స్‌కు మీరూ సాక్షీభూతంగా నిలిచామని సంబరపడండి.
స్టాటిక్ షాక్ ప్రమాదమా?
స్థిర విద్యుత్‌తో మని షికి దైనందిన జీవితంలో ఎలాంటి ప్రమాదంలేదు. సెకన్ వ్యవధిలో షాక్ అనుభూతి వచ్చి పోతుంది. కానీ మండే స్వభావమున్న వస్తువుల సమీపంలో, అత్యంత సున్నితమైన ఎల్రక్టానిక్ వస్తువుల వద్ద మనిషికి స్టాటిక్ విద్యుత్ ప్రాణహాని కల్గించే అవకాశాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా గ్యాస్ స్టేషన్లు, కంప్యూటర్ చిప్ తయారీ కర్మాగారాల్లో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ చాలా ప్రమాదకరం.
– సాక్షి, నేషనల్ డెస్క్