
అమెరికా విద్యా సంస్థల ప్రశ్న
విద్యార్థి వీసాల రద్దుపై అభ్యంతరాలు
కారణాలేమిటో బయటపెట్టండి
డీహెచ్‌ఎస్‌కు 15 విద్యా సంస్థల లేఖ
విదేశీ విద్యార్థుల వీసాలను ట్రంప్ సర్కారు ఎడాపెడా రద్దు చేస్తుండటాన్ని అమెరికన్లు కూడా హర్షించడం లేదు. ఈ ధోరణి అంతిమంగా అమెరికాకే తీవ్ర నష్టం చేకూరుస్తుందన్న ఆందోళన నానాటికీ తీవ్రతరమవుతున్నాయి. ఈ విషయమై అక్కడి విద్యా సంస్థలే గళమెత్తుతున్నాయి. అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎడ్యుకేషన్ (ఏసీఈ)తో పాటు మరో 15 సంస్థలు బాధిత విదేశీ విద్యార్థుల తరఫున రంగంలోకి దిగాయి.
ఏ కారణాలూ చూపకుండా వారి వీసాలను రద్దు చేయడం, సంబంధిత యూనివర్సిటీలకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే వారి స్టూడెంట్ ఎక్స్‌చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సి స్టం (సెవిస్) రికార్డులను గల్లంతు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. దీనిపై తక్షణం వివరణ ఇవ్వాలంటూ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) వి భాగానికి సంయుక్తంగా ఓ లేఖ రాశాయి. డీహెచ్‌ఎస్ మంత్రి క్రిస్టీ నోయెమ్‌తో పాటు విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు కూడా లేఖ ప్రతిని పంపాయి.
విద్యార్థి వీసాల రద్దుకు సంబంధించి పూర్తి వివరాలు బయట పెట్టాల్సిందేనని ఏసీఈ అధ్యక్షుడు టెడ్ మిషెల్ డిమాండ్ చేశారు. ‘‘స్వీయ డీపో ర్టేషన్ ద్వారా దేశం వీడండంటూ విద్యార్థులకు వస్తున్న ఈ మెయిళ్లు, మెసేజీల ద్వా రా మాత్రమే విషయం తెలుస్తోంది. అందుకు కారణాలైనా చెప్పకపోవడం మరీ దారుణం. ఇది చాలా ఆందోళనకరమైన విషయం.
అభ్యంతరకర సోషల్ మీడియా కార్యకలాపాలకు, డాక్యుమెంటేషన్ తప్పిదాలకు, చివరికి ట్రాఫిక్ ఉల్లంఘనలకు కూడా వీసాలు రద్దు చేస్తున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న తప్పిదాలకు కూడా ఇంతటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం దారుణం’’అంటూ ఆయన ఆక్షేపించారు. ‘‘మీ తీరుతో అమెరికావ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇది మన దేశానికి కూడా మంచిది కాదు’’అని ఆవేదన వెలిబుచ్చారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జాతీయ భద్రత పేరిట విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా అత్యంత కఠినంగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. ఇప్పటిదాకా కనీసం 300 మందికి పైగా పాలస్తీనా సానుభూతిపరులైన విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్టు రూబి యో ఇటీవల వెల్లడించారు. గతంలో ఏ కారణంతోనైనా విద్యార్థి వీసాలను రద్దు చేసినా విద్యాభ్యాసం పూర్తయ్యేదాకా అమెరికాలో ఉండేందుకు వీలుండేది. ఇప్పుడు మాత్రం వీసా రద్దుతో పాటు సెవిస్ రికార్డులను కూడా శాశ్వతంగా తుడిచిపెడుతుండటంతో బాధిత విద్యార్థులు తక్షణం అమెరికాను వీడటం తప్ప మరో మార్గం లేకుండా పోతోంది.
వర్సిటీల్లోనూ ఆందోళన
విద్యార్థి వీసాల రద్దు అమెరికా యూనివర్సిటీలను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. చాలాసార్లు ఈ ఉదంతాలు తమ దృష్టికి కూడా రావడం లేదని ప్రఖ్యాత హార్వర్డ్ వర్సిటీ పేర్కొంది. ‘‘మేం స్వయంగా పూనుకుని మా విద్యార్థుల రికార్డులను పరిశీలించాల్సి వస్తోంది. మా వర్సిటీకీ చెందిన ముగ్గురు విద్యార్థులతో పాటు ఇటీవలే విద్యాభ్యాసం ముగించుకున్న మరో ఇద్దరి వీసాలను రద్దు చేసినట్టు తెలియగానే వారికి న్యాయ సాయాన్ని సిఫార్సు చేశాం’’అని వెల్లడించింది.
అరిజోనా స్టేట్ వర్సిటీలో 50 మంది విదేశీ విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదరైంది. వారి వీసాల రద్దుకు కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. నార్త్ ఈస్టర్న్ వర్సిటీలోనూ 40, కాలిఫోర్నియా వర్సిటీలో 35 మంది విద్యార్థుల వీసాలు కూడా రద్దయ్యాయి. ఇలాంటి పరిస్థితులను గతంలో ఎన్నడూ చూడలేదని మసాచుసెట్స్ వర్సిటీ చాన్స్‌లర్ వాపోయారు.
విదేశీ విద్యార్థులే కీలకం
అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో విదేశీ విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024లో వారినుంచి అమెరికాకు ఏకంగా 4,380 కోట్ల డాలర్ల మేరకు ఆదాయం సమకూరినట్టు ‘ఓపెన్ డోర్స్’నివేదిక పేర్కొంది. అమెరికా వర్సిటీల్లో ఉన్నతవిద్య పూర్తి చేసుకుంటున్న విదేశీ విద్యార్థులను, ముఖ్యంగా భారతీయులను అమెరికా ఐటీ సంస్థలు కళ్లు చెదిరే వేతనాలిచ్చి మరీ తీసుకుంటున్నాయి.
కొన్నేళ్లలోనే ఆ సంస్థలకు వాళ్లు వెలకట్టలేని ఆస్తిగా మారుతున్నారు. ‘అమెరికా ఫస్ట్’పేరిట విదేశీ విద్యార్థులపై వేధింపులు ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాల నుంచి అగ్ర రాజ్యానికి దశాబ్దాలుగా కొనసాగుతున్న మేధో వలసకు అడ్డుకట్ట పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది అంతిమంగా అమెరికాకే తీవ్ర నష్టమని అక్కడి విద్యా సంస్థలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్