
ట్రంప్‌ను విమర్శించినందుకే
శాన్‌జోస్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, కోస్టారికా మాజీ అధ్యక్షుడు ఆస్కార్ అరియాస్ (84) వీసాను అమెరికా రద్దు చేసింది. దీనిపై అరియాస్ ఆశ్చర్యం వెలిబుచ్చారు. రద్దుకు కారణమేమిటో తనకు తెలియదని కోస్టారికా రాజధాని శాన్ జోస్‌లో మీడియాతో అన్నారు. ‘‘వీసా రద్దు చేస్తున్నట్టు అమెరికా అధికారులు మెయిల్ పంపారు. కానీ ఈ విషయమై ఎలాంటి వివరణా ఇవ్వలేదు’’అని చెప్పారు.
‘‘అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును రోమన్ చక్రవర్తితో పోలుస్తూ నేను బహిరంగ విమర్శలు చేశా. నేను అధ్యక్షుడిగా ఉండగా చైనాతో కోస్టారికా దౌత్య బంధాన్ని పునరుద్ధరించా. బహుశా ఇవన్నీ కారణమై ఉంటాయి’’అని అభిప్రాయపడ్డారు. సెంట్రల్ అమెరికాలో ఘర్షణల నివారణకు చేసిన కృషికి అరియాస్‌కు 1987లో నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఆయన 1986–1990, 2006–2010 మధ్య ఎనిమిదేళ్లు కోస్టారికా అధ్యక్షుడిగా ఉన్నారు. రెండో పదవీకాలంలో అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ప్రోత్సహించారు. 2007లో తైవాన్‌కు దూరమై చైనాతో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నారు.
కోస్టారికా అధ్యక్షుడు రోడ్రిగో చావెజ్ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి దేశంలో 5జీ సదుపాయాల అభివృద్ధి పనుల నుంచి చైనా సంస్థలను పక్కన పెట్టారు. దీన్ని వ్యతిరేకించిన ముగ్గురు కోస్టారిక చట్టసభ సభ్యుల వీసాలను అమెరికా రద్దు చేసింది. ఈ పరిణామాలపై అరియాస్ మండిపడ్డారు. అమెరికా ఒత్తిడికి రోడ్రిగో లొంగుతున్నారని సోషల్ మీడియా వేదికగా దుయ్యబట్టారు. ‘‘ఒక చిన్న దేశం అమెరికాతో విభేదించడం సులువు కాదు. అందులోనూ అమెరికా అధ్యక్షుడు రోమన్ చక్రవర్తిలా ప్రవర్తిస్తూ మిగతా ప్రపంచానికి ఏం చేయాలో, ఏం చేయొద్దో పొద్దస్తమానం చెబుతున్నప్పుడు మరింత కష్టం’’అంటూ ఎద్దేవా చేశారు. కోస్టారికాకు చెందిన మరో ప్రతిపక్ష శాసనసభ్యురాలి వీసాను కూడా అమెరికా మంగళవారం రద్దు చేసింది.