former president
-
అసద్ భార్యకు లుకేమియా
సిరియా తాజా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ భార్య అస్మా లుకేమియా (బ్లక్ క్యాన్సర్)తో పోరాడుతున్నారు. వ్యాధి తీవ్రత దృష్ట్యా ఆమె బతికే అవకాశాలు సగమేనని సమాచారం. ఇన్ఫెక్షన్ ముప్పును తగ్గించేందుకు ఆమెను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆస్మా 2019లో రొమ్ము కేన్సర్ బారిన పడ్డారు. వ్యాధి నుంచి పూర్తిగా బయట పడ్డట్టు ఏడాది చికిత్స తరువాత ప్రకటించారు. కానీ కొంతకాలానికే ఆమెకు బ్లడ్ కేన్సర్ ఉన్నట్టు తేలింది. అస్మా తల్లిదండ్రులు సిరియావాసులు. ఆమె 1975లో లండన్‌లో జన్మించారు. ఆమెకు బ్రిటిష్–సిరియా పౌరసత్వముంది. లండన్‌లోని కింగ్స్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్, ఫ్రెంచ్ సాహిత్యం చదివారు. 2000 డిసెంబర్లో బషర్‌ను పెళ్లాడారు. వారికి ముగ్గురు పిల్లలు సిరియాలో తిరుగుబాటు మొదలైనప్పటి నుంచే ఆస్మా తన పిల్లలతో కలిసి లండన్ వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. ఇటీవల తిరుగుబాటు సేనలు దేశాన్ని ఆక్రమించుకోవడంతో అసద్ పదవీచ్యుతుడవడం తెలిసిందే. కుటుంబంతో సహా ఆయన రష్యాలో దలదాచుకుంటున్నారు. అయితే మాస్కో జీవితంపై అస్మా అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. దేశం వీడి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి కోరుతూ రష్యా కోర్టుకు ఆమె పెట్టుకున్న దరఖాస్తును అధికారులు పరిశీలిస్తున్నారు. అసద్ నుంచి విడాకుల కోసం కూడా అస్మా దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలొచ్చినా వాటిని రష్యా ఖండించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అసద్ భార్య విడాకుల పిటిషన్
మాస్కో: పదవీచ్యుత సిరియా అధ్యక్షుడు బషర్ అల్–అసద్ భార్య ఆస్మా(49) విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రష్యాను వీడి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కూడా ఆమె అభ్యర్థించారు. ఆమె దరఖాస్తును మాస్కోలోని న్యాయస్థానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నెలారంభంలో తిరుగుబాటుదార్లు అసద్ ప్రభుత్వాన్ని కూలదోయడం, అధ్యక్షుడు రష్యాకు కుటుంబం సహా పలాయనం కావడం తెలిసిందే. రష్యా ప్రభుత్వం ఆ కుటుంబానికి ఆశ్రయం కల్పించింది. అయితే, వారిపై పలు ఆంక్షలను విధించింది. అసద్, ఆయన కుటుంబీకులను మాస్కో వీడి వెళ్లరాదని, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనరాదని కట్టడి చేసింది. అసద్ తమ వద్ద దాచిన 270 కిలోల బంగారం, సుమారు రూ.17 వేల కోట్ల ధనంతోపాటు, మాస్కోలోని 18 అపార్టుమెంట్లు తదితర ఆస్తులను రష్యా ప్రభుత్వం స్తంభింపజేసినట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్మా అల్–అసద్ రష్యాలో ఉండేందుకు అంగీకరించడం లేదని, పుట్టి పెరిగిన లండన్ వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారని సమాచారం. సిరియన్ల కుటుంబంలో లండన్‌లో జన్మించిన ఆస్మా అక్కడే చదువుకున్నారు. 25 ఏళ్ల వయస్సులో 2000వ సంవత్సరంలో సిరియా వెళ్లారు. అదే ఏడాది అసద్‌తో ఆమె వివాహమైంది. ఆమెకు ద్వంద పౌరసత్వం ఉంది. ఇలా ఉండగా, అసద్ సోదరుడు మహెర్ అల్–అసద్ అతడి కుటుంబానికి రష్యా అధికారికంగా ఆశ్రయం కల్పించలేదు. ఆయన దరఖాస్తు పరిశీలనలో ఉందని చెబుతున్నారు. మహెర్ కుటుంబాన్ని గృహ నిర్బంధంలో ఉంచి, ఆస్తుల్ని స్తంభింపజేసినట్లు చెబుతున్నారు. -
చిలీ మాజీ అధ్యక్షురాలికి ఇందిరా శాంతి బహుమతి
న్యూఢిల్లీ: 2024 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ప్రముఖ మానవ హక్కుల నేత, చిలీ మాజీ దేశాధ్యక్షురాలు మిచెల్ బాచెలెట్ అందుకోనున్నారు. ఇందిరా గాంధీ శాంతి బహుమతి అంతర్జాతీయ జ్యూరీ చైర్మన్, మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ శుక్రవారం ఈ విషయం ప్రకటించారు. ప్రపంచ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి కోసం పాటుపడే వారిని ఈ అవార్డుతో గౌరవిస్తారు. ఐరాస మహిళా విభాగం వ్యవస్థాపక డైరెక్టర్‌గా, ఐరాస మానవ హక్కుల హై కమిషనర్‌గా, చిలీ అధ్యక్షురాలిగా లింగ సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం స్వదేశంలో, అంతర్జాతీయంగా మిచెల్ ఎంతగానో కృషి చేశారని ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ పేర్కొంది. -
అట్లాంటాలో ట్రంప్ ప్రచారం.. ర్యాలీలో పాల్గొన్న భారతీయ అమెరికన్ ఓటర్లు
-
ట్రంప్ భద్రతలో వైఫల్యం
వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జూలైలో హత్యాయత్నం జరిగిన ర్యాలీలో భద్రతా వైఫల్యాలను యూఎస్ సీక్రెట్ సర్వీస్ అంగీకరించింది. తమ సమీక్షలో వెల్లడైన వైఫల్యాలను శుక్రవారం వివరించింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ నిర్వహించిన ఔట్‌డోర్ కార్యక్రమంలో షూటర్ థామస్ మాథ్యూ క్రూక్స్ కాల్పులు జరపడం, కుడి చెవికి గాయంతో ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం తెలిసిందే. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఈ ర్యాలీలో కాల్పుల్లో ఇద్దరు గాయపడగా, అగి్నమాపక సిబ్బంది మరణించారు. కాల్పులు జరిపిన క్రూక్స్‌ను సీక్రెట్ సరీ్వస్ సిబ్బంది కాల్చి చంపారు. ఈ ఘటన తరువాత సీక్రెట్ సరీ్వస్ డైరెక్టర్ కింబర్లీ చీట్లే రాజీనామా చేశారు. సీక్రెట్ సరీ్వస్ ఏజెంట్లు సెలవులో వెళ్లారు. దీనిపై సమీక్ష నిర్వహించిన సీక్రెట్ సర్వీస్ ప్రణాళిక, దాని అమలులో లోపాలను గుర్తించిందని తాత్కాలిక డైరెక్టర్ రోనాల్డ్ రోవ్ జూనియర్ తెలిపారు. అడ్వాన్స్ టీంలోని కొందరు చాలా శ్రద్ధగా వ్యవహరించగా, మరికొందరి అలసత్వం భద్రతా ప్రోటోకాల్స్ ఉల్లంఘనకు దారితీసిందన్నారు. హెచ్చరికలు లేవు.. స్థానిక యంత్రాంగంతో పేలవమైన కమ్యూనికేషన్, మొబైల్ పరికరాలపై అతిగా ఆధారపడటం, సమాచారం పక్కదారి పట్టడం వంటి సమస్యలను గుర్తించామని రోవ్ తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం సుమారు 18:10 గంటలకు కౌంటర్ స్నైపర్ రెస్పాన్స్ ఏజెంట్‌కు సీక్రెట్ సరీ్వస్ సెక్యూరిటీ రూమ్ కాల్ చేసి.. ఏజీఆర్ భవనం పైకప్పుపై ఒక వ్యక్తి ఉన్నట్లు తెలిపింది. అయితే సీక్రెట్ సరీ్వస్ రేడియో నెట్వర్క్ ద్వారా ఆ కీలక సమాచారం ప్రసారం కాలేదు. ఏదైనా ఘటన జరిగినప్పుడు దానికి ప్రతిస్పందించేందుకు కాక, ఏదీ జరగకుండా నివారించేందుకు సీక్రెట్ సర్వీస్‌కు అదనపు నిధులు, సిబ్బంది, పరికరాలు అవసరం... ట్రంప్‌పై హత్యాయత్నాన్ని దర్యాప్తు చేస్తున్న కాంగ్రెషనల్ టాస్‌్కఫోర్స్ తెలిపింది. ఉద్యోగులను జవాబుదారీ చేయడం విషయంలో రోవ్‌ను అనుసరించాలని, స్వతంత్ర దర్యాప్తునకు సహకరించాలని, సీక్రెట్ సరీ్వస్‌లో అలసత్వానికి స్థానం ఉండకూడదని సూచించింది. అధ్యక్షుడితో సమాన భద్రత.. గత వారాంతంలో ఫ్లోరిడాలోని వెస్ట్‌పామ్ బీచ్‌లోని గోల్ఫ్‌కోర్స్‌లో ట్రంప్‌పై రెండోసారి హత్యాయత్నం జరగడంతో భద్రతకు డిమాండ్ పెరిగింది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షులతో సమానంగా అధ్యక్ష అభ్యర్థులకు సీక్రెట్ సరీ్వస్ భద్రతను పెంచే బిల్లును అమెరికా ప్రతినిధుల సభ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. సెనేట్‌లో ఓటింగ్, అధ్యక్షుడు జో బైడెన్ సంతకం పూర్తయితే ఈ బిల్లు చట్టరూపం దాల్చుతుంది. అయితే ట్రంప్‌కు ఇప్పుడు అధ్యక్షుడితో సమానమైన రక్షణ కలి్పస్తున్నామని రోవ్ చెప్పారు. సీక్రెట్ సర్వీస్ పనిచేసే వాతావరణానికి ముప్పు విపరీతంగా ఉందని ఆదివారం జరిగిన ఘటన రుజువు చేస్తోందని రోవ్ అన్నారు. ఇక ఫ్లోరిడాలో గన్‌మెన్ ట్రంప్‌వైపు చూడను కూడా చూడలేదని, ముందే అతన్ని అరెస్టు చేశామని తెలిపారు. -
మళ్లీ చర్చా.. ఆ చాన్సే లేదు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో మరో డిబేట్లో పాల్గొనబోనని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన బిగ్ డిబేట్లో డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్‌పై తాను గెలిచానని, ఆమె ఓడిపోయినందునే మరో చర్చ అంటున్నారని తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో గురువారం ప్రకటించారు. జూన్‌లో అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన మొదటి డిబేట్, ఆ తర్వాత హ్యారిస్‌తో మంగళవారం జరిగిన డిబేట్‌ను ప్రస్తావిస్తూ ఇక మూడోది ఉండబోదని స్పష్టం చేశారు. గెలుపు తనదేనని, సర్వేలు కూడా అదే చెబుతున్నాయని ట్రంప్ చెప్పారు. కాగా, ప్రధాన మీడియా సంస్థల సర్వేల ఫలితాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. బిగ్ డిబేట్‌ను చూసిన వారిలో 63 శాతం మంది కమలా హారిస్ గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేయగా, 37 శాతం మంది మాత్రమే ట్రంప్ వైపు మొగ్గు చూపారని సీఎన్ఎన్ సర్వే వెల్లడించిన సంగతి తెలిసిందే. -
పెరూ మాజీ అధ్యక్షుడు ఫుజిమొరి కన్నుమూత
లిమా (పెరూ): పెరూ మాజీ అధ్యక్షుడు అల్బెర్టో ఫుజిమొరి బుధవారం రాజధాని లిమాలో కన్నుమూశారు. దీర్ఘ కాలంగా క్యాన్సర్‌తో పోరాడి మరణించారని ఆయన కుమార్తె కీకో ఫుజిమొరి ‘ఎక్స్’లో ప్రకటించారు. విద్యావేత్త నుంచి పెరూ రాజకీయాల్లోకి మెరుపులా వచ్చిన ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాయి. అవే సంస్కరణలు ఆయన్ను చిక్కుల్లోకీ నెట్టాయి. వామపక్షాల సహకారంతో అధికారంలోకి వచ్చి తిరుగుబాటుదారులపై తీవ్రమైన అణచివేతను అమలు చేశారు. చివరకు దేశం నుంచి పారిపోయి, ఆ తరువాత జైలు పాలై.. తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. పరిస్థితి విషమించడంతో 86 ఏళ్ల వయసులో మృతి చెందారు. 2026 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ చేయాలని తన తండ్రి భావిస్తున్నారంటూ కొన్ని నెలల క్రితం కీకో ప్రకటించడం గమనార్హం.ఆర్థిక వ్యవస్థ బలోపేతం.. పెరూ స్వాతంత్య్ర దినం 1938 జూలై 28వ తేదీన రాజధాని లిమాలో ఫుజిమొరి జని్మంచారు. ఈయన కు టుంబం జపాన్ నుంచి వలస వచ్చింది. గణిత శాస్త్రవేత్త, వ్యవసాయ ఇంజనీర్ అయిన ఫుజిమొరి 1990 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయనెవరికీ తెలియదు. తన ప్రచార ర్యాలీల్లో ట్రాక్టర్ నడుపుతూ అందరినీ ఆకట్టుకున్నారు. వామపక్షాల భారీ మద్దతుతో ప్రఖ్యాత రచయిత మారియో వర్గాస్ లోసాను ఓడించి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ద్రవ్యోల్బణం తగ్గిస్తానన్న హామీతో అధికారంలోకి వచి్చన ఫుజిమొరి రెండో వారంలోనే నిత్యావసరాలపై సబ్సిడీలను ఎత్తివేయడం ‘ఫుజీ–షాక్’గా పేరుగాంచింది. డజన్ల కొద్దీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించారు. వాణిజ్య సుంకాలను తగ్గించారు. ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు పెరూ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి. లాటిన్ అమెరికాలో అత్యంత స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా మారడానికి పునాదులు వేశాయి. ఇక స్వేచ్ఛా–మార్కెట్ సంస్కరణలు, కఠినమైన ఉగ్రవాద వ్యతిరేక చట్టాల అమలు కోసం రాజ్యాంగాన్ని పునర్నిరి్మంచారు. వ్యతిరేకత.. అణచివేత.. కేసులు.. 1992లో పార్లమెంట్‌పైకి యుద్ధ ట్యాంకులను ఉపయోగించడంతో పెరూ ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత పెరిగింది. పదేళ్ల పాలనలో అవినీతి కుంభకోణాలు కూడా ప్రజలను ఆయనకు వ్యతిరేకంగా మార్చాయి. అయినా రెండోసారి అధికారంలోకి వచ్చాక తిరుగుబాటుదారులపై తీవ్రమైన అణచివేత, నిర్బంధం అమలు చేశారు. 2000లో మూడోసారి గెలిచిన తరువాత ఫుజిమొరి ఉన్నత సలహాదారు, గూఢచారి చీఫ్ వ్లాదిమిరో మాంటెసినోస్ రాజకీయ నాయకులకు లంచం ఇస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో ఫుజిమొరి తన పూరీ్వకుల జపాన్‌కు పారిపోయారు. టోక్యో నుంచి ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖ పంపారు. రెండు దేశాల పౌరసత్వం ఉన్న ఆయన.. ఆ తరువాత జపాన్ సెనేటర్ పదవికి పోటీపడి ఓడిపోయారు. షైనింగ్ పాత్ మిలిటెంట్ల అణచివేతకు ఆదేశించారనే ఆరోపణలతో ఫుజిమొరిపై పలు కేసులు నమోదయ్యాయి. 25 ఏళ్ల జైలు శిక్ష 2005లో పెరూకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 2007లో చిలీ వచి్చన ఆయన్ను అక్కడి అధికారులు 2009లో పెరూకు అప్పగించారు. పలు కేసుల్లో దోషిగా 25 ఏళ్ల జైలుపాలయ్యారు. తరచూ అనారోగ్యం పాలవ్వడంతో క్షమాభిక్ష కోసం అప్పీలు చేశారు. అయితే జైలు నుంచి బయటకు రావడానికి అదో ఎత్తుగడగా ప్రత్యర్థులు తోసిపుచ్చారు. అప్పటి అధ్యక్షుడు పెడ్రో పాబ్లో కుజిన్స్కి 2017లో ఫుజిమొరికి క్షమాభిక్ష ప్రసాదించారు. కొన్ని నెలల తరువాత కుజిన్‌స్కీ అభిశంసనకు గురయ్యారు. పెరూ న్యాయస్థానం ఫుజిమొరి క్షమాభిక్షను రద్దు చేసి, ప్రత్యేక జైలుకు పంపింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయనకు 2023లో కోర్టు క్షమాభిక్షను పునరుద్ధరించింది. అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే మొదటి భార్య సుసానాతో విభేదాలు రావడంతో విడిపోయారు. తరువాత ఆయన కుమార్తె కీకోను ప్రథమ మహిళగా నియమించారు. ఆమె మూడుసార్లు పెరూ అధ్యక్ష పదవికి పోటీ పడి, ఓడిపోయారు. కుమారుడు కెంజో కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. -
రైసీ దుర్మరణం వెనుక కుట్ర లేదు: ఇరాన్ ఆర్మీ
టెహ్రాన్: హెలికాప్టర్ కుప్పకూలి ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం పాలవ్వడానికి ప్రతికూల వాతావరణమే కారణమని తేలింది. ఈ మేరకు ఆ దేశ ఆర్మీ ఆధ్వర్యంలోని దర్యాప్తు కమిటీ ఇచ్చిన తుది నివేదికను ఉటంకిస్తూ ఇరాన్ అధికారిక టీవీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. దట్టమైన పొగమంచువల్లే రైసీ హెలికాప్టర్ కూలిపోయిందని తెలిపింది. దీంతో హెలికాప్టర్ ప్రమాదంలో ప్రధాని రైసీ మరణించడం వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉండొచ్చన్న అనుమానాలకు తెరపడింది. ఈ ఏడాది మేలో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఇరాన్‌లోని అజర్బైజాన్ పర్వతప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రధాని రైసీ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ దుర్ఘటన జరిగినప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తలు తారాస్థాయిలో ఉండటంతో ఇజ్రాయెల్ పాత్రపై అనుమానాలు రేకెత్తాయి. -
USA Presidential Elections 2024: ట్రంప్‌పై హత్యాయత్నం
పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా దుండగుడు కాల్పులకు తెగబడటంతో ట్రంప్ తల వెనుకగా దూసుకెళ్తున్న తూటా. ఆయనపై మొత్తం నాలుగైదు రౌండ్లకు పైగా కాల్పులు జరిగాయి.షికాగో/వాషింగ్టన్: అమెరికా చరిత్రపై మరో రక్తపు మరక. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (78)పై హత్యా యత్నం జరిగింది. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో గెలిచి మరోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు రిపబ్లికన్ల అభ్యరి్థగా సర్వశక్తులూ ఒడ్డుతున్న ఆయన ఈ ప్రాణాంతక దాడి నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం పెన్సిల్వేనియాలోని బట్లర్ టౌన్లో ఔట్‌డోర్ ఎన్నికల ర్యాలీలో ఉండగా ఈ ఘోరం జరిగింది. భారీగా హాజరైన మద్దతుదారులు, అభిమానులను ఉద్దేశించి సాయంత్రం ఆరు గంటలకు ట్రంప్ ప్రసంగం మొదలు పెట్టారు. అప్పటికే సమీప గోడౌన్‌పై నక్కిన ఓ దుండగుడు ఏఆర్ శ్రేణి ఆటోమేటిక్ అసాల్ట్ రైఫిల్‌తో ట్రంప్‌పైకి కనీసం ఐదు రౌండ్లకు పైగా కాల్పులు జరిపాడు. దాంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. అరుపులు, కేకలు, ఆక్రందనలు, పారిపోతున్న జనాలతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఒక తూటా ట్రంప్ కుడి చెవి పై భాగాన్ని గాయపరిచింది. మరిన్ని తూటాలు ఆయన తలకు అతి సమీపం నుంచి దూసుకెళ్లాయి. ట్రంప్ బాధతో తన చెవిని చేత్తో పట్టుకుంటూనే తూటాల నుంచి తప్పించుకునేందుకు వెంటనే డయాస్ కిందకు వంగారు. ఆలోపే సీక్రెట్ సరీ్వస్ సిబ్బంది టంప్ర్ను చుట్టుముట్టి రక్షణ కవచంలా నిలిచారు. చెవి నుంచి కుడి చెంప మీదుగా రక్తమోడుతున్న ట్రంప్‌ను హుటాహుటిన వేదిక నుంచి తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టి సురక్షితంగా తరలించారు. వేదికను వీడుతూ ట్రంప్ పిడికిలి బిగించి పైకెత్తి, సభికులనుద్దేశించి ‘ఫైట్’ అని పదేపదే భావోద్వేగంతో బిగ్గరగా నినాదాలు చేశారు. వారు కూడా తమ నేతకు మద్దతుగా ఫైట్ అంటూ పెద్దపెట్టున ప్రతి నినాదాలు చేశారు. అక్కణ్నుంచి ట్రంప్‌ను హుటాహుటిన పిట్స్బర్గ్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కారెక్కే ముందు కూడా ట్రంప్ మరోసారి పిడికిలి బిగించి నినాదాలు చేశారు. ఈ మొత్తం ఉదంతానికి సంబంధించిన వీడియో ప్రపంచమంతటా వైరలవుతోంది. ట్రంప్ క్షేమంగా ఉన్నట్టు అనంతరం ఆయన ప్రచార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దుండగుని కాల్పుల్లో సభికుల్లో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమీప భవనాలపై మోహరించి ఉన్న సీక్రెట్ సరీ్వస్ స్నైపర్లు తక్షణం స్పందించి దుండగున్ని కాల్చి చంపారు. అతన్ని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకునిగా గుర్తించారు. అతను కాల్పులకు తెగబడేందుకు కారణం తెలియాల్సి ఉంది. అమెరికా వంటి అగ్ర రాజ్యంలో మాజీ అధ్యక్షుని స్థాయి నేతపై ఇంత సమీపం నుంచి కాల్పులు జరగడం ఘోర భద్రతా వైఫల్యమేనంటున్నారు. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతోంది. ట్రంప్‌పై దాడితో ప్రపంచం నివ్వెరపోయింది. హత్యా యత్నాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రధాని నరేంద్ర మోదీతో సహా దేశాధినేతలంతా ఈ ఘటనను ఖండించారు.దేవుడే కాపాడాడు: ట్రంప్ ప్రాణాంతక దాడి నుంచి తనను భగవంతుడే రక్షించాడని ట్రంప్ అన్నారు. కాల్పుల ఘటనపై తన సొంత సోషల్ మీడియా ‘ట్రూత్’లో ఆయన స్పందించారు. కాల్పుల్లో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘‘నిర్భయంగా ముందుకెళ్దాం. ఈ సమయంలో అమెరికన్లమంతా మరింత సమైక్యంగా నిలబడాల్సిన అవసరముంది. అమెరికన్లుగా మన వ్యక్తిత్వాన్ని చాటాల్సిన, దుష్టశక్తి గెలవకుండా అడ్డుకోవాల్సిన సమయమిది. మిమ్మలి్న, మన దేశాన్ని నేను త్రికరణశుద్ధిగా ప్రేమిస్తున్నా. త్వరలో విస్కాన్సిన్ సభ ద్వారా మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’’ అని రిపబ్లికన్ పార్టీ మూడు రోజుల సదస్సును ఉద్దేశించి అన్నారు. ఈ సదస్సులో అధ్యక్ష అభ్యరి్థని అధికారికంగా ప్రకటించనుండటం తెలిసిందే.120 మీటర్ల నుంచే కాల్పులు ట్రంప్‌పై కాల్పుల ఘటనపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కేవలం 120 నుంచి 150 మీటర్ల దూరం నుంచి కాల్పులు జరిగినట్టు ప్రాథమికంగా తేలింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉండే అమెరికా మాజీ అధ్యక్షునిపైకి ఇంత సమీపం నుంచి కాల్పులు జరపడం నమ్మకశ్యం కాని విషయమని ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ కెవిన్ రోజెక్ అన్నారు. అంతమంది భద్రతా సిబ్బంది రక్షణలో ఉన్న ట్రంప్‌పైకి దుండగుడు అన్ని రౌండ్ల పాటు కాల్పులు జరపగలగడం వింతగా ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘దుండగుడు అంత సమీపానికి ఎలా రాగలిగాడు, ఎవరు సహకరించారు వంటి కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతుంది’’ అని చెప్పారు.దుండగుడు రిపబ్లికన్ ఓటరే ట్రంప్‌పై కాల్పులకు తెగబడ్డ థామస్ మాథ్యూ క్రూక్స్ రిపబ్లికన్ పార్టీ ఓటరుగా నమోదు చేసుకున్నట్టు తేలడం విశేషం. అయితే 2021లో డెమొక్రటిక్ పార్టీ అనుబంధ విభాగానికి 15 డాలర్ల విరాళం ఇచి్చనట్టు కూడా వెల్లడైంది. కొద్ది రోజుల ముందే ట్రంప్‌ను ద్వేషిస్తూ, రిపబ్లికన్ పార్టీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడట. క్రూక్స్ది పెన్సిల్వేనియాలో పిట్స్బర్గ్ శివార్లలోని బెథెల్ పార్క్ అని తేలింది. బతికుంటే ఈ నవంబర్‌లో అతను తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేవాడు. మృతదేహం వద్ద గుర్తింపు కార్డుల వంటివేవీ లభించకపోవడంతో అతన్ని గుర్తించడం ఏజెంట్లకు కష్టంగా మారింది. దాంతో చివరికి డీఎన్ఏ పరీక్ష చేసి గుర్తించారు.దుండగుని ముందస్తు ఏర్పాట్లు! ట్రంప్‌పై కాల్పులకు తెగబడేందుకు దుండగుడు ముందుగానే పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నట్టు భావిస్తున్నారు. దాడికి పాల్పడ్డ గోడౌన్ వంటి భవనం ర్యాలీకి అతి సమీపంలో ఉంది. దానిపైకి చేరుకునేందుకు ఒక నిచ్చెన కూడా ఏర్పాటు చేసి ఉంది. అతని మృతదేహం పక్కన పలు రకాలైన ప్యాకేజీలను పోలీసులు గుర్తించారు. వాటిలో పేలుడు పదార్థాలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భీతావహంగా ఘటనా స్థలి ట్రంప్‌పై హత్యా యత్నం జరిగిన బట్లర్ కేవలం 13 వేల జనాభా ఉండే చిన్న పట్టణం. పశి్చమ పెన్సిల్వేనియాలో పిట్స్బర్గ్కు 33 మైళ్ల దూరంలో ఉంటుంది. ఆరుబయట మైదాన ప్రదేశంలో ర్యాలీ జరిగింది. తన మార్కు ఎర్ర టోపీ, నల్ల సూటులో ట్రంప్ వేదికపైకి చేరుకుని ప్రసంగం మొదలు పెట్టారు. అమెరికాలోకి అక్రమ వలసలు పెరిగిపోయాయంటూ చార్ట్ సాయంతో వివరిస్తుండగా కాల్పులు మొదలయ్యాయి. దాంతో అంతా ప్రాణభయంతో కేకలు వేశారు. తూటాలను తప్పించుకునేందుకు నేలపై పడుకుండిపోయారు. ఆ ప్రదేశమంతా భీతావహంగా మారింది. ట్రంప్‌ను సురక్షితంగా తరలించాక కూడా చాలాసేపటిదాకా జనం నేలపై పడుకునే కని్పంచారు. అనంతరం భద్రతా సిబ్బంది రంగప్రవేశం చేసి ర్యాలీ వేదికను అదుపులోకి తీసుకున్నారు.ముందే చూసిన జనం...! ట్రంప్‌పై కాల్పులకు దిగిన దుండగుడు క్రూక్స్‌ను తాము ముందే చూసినట్టు సభికుల్లో పలువురు వెల్లడించారు. అతడు గోడౌన్‌పై నెమ్మదిగా కదులుతూ ట్రంప్‌కు వీలైనంత సమీపంగా వచి్చనట్టు ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కాల్పులకు ముందే క్రూక్స్ చేతిలో తుపాకీని స్పష్టంగా చూసినట్టు మరో ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. ‘‘దేవుడా! అతని చేతిలో తుపాకీ ఉందంటూ అరిచా. అంతలోనే కాల్పులకు తెగబడటంతో వెంటనే నేలపై పడుకుని తలెత్తి చూశా. ఏజెంట్ల తూటాలకు అతని తల పేలిపోవడాన్ని కళ్లారా చూశా’’ అని చెప్పుకొచ్చాడు. పెరిగిన ట్రంప్ విజయావకాశాలు! అధ్యక్ష ఎన్నికల రేసులో ఇప్పటికే దూసుకుపోతున్న ట్రంప్ విజయావకాశాలు కాల్పుల ఉదంతం నేపథ్యంలో మరింతగా పెరిగినట్టు చెబుతున్నారు. ఆయన విజయావకాశాలు గత 24 గంటల్లోనే 8 శాతం పెరిగి ఏకంగా 70 శాతానికి చేరినట్టు రాజకీయ అంచనాల వేదిక పాలీమార్కెట్ పేర్కొంది. అంతటి ప్రాణాపాయ పరిస్థితిలోనూ ట్రంప్ అత్యంత వీరోచితంగా వ్యవహరించారంటూ అన్నివైపుల నుంచీ ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘‘తల పక్కనుంచి తూటాలు దూసుకెళ్లాయి. ఒకటి చెవిని ఛిద్రం చేసింది. అయినా ట్రంప్ అస్సలు భయపడలేదు. ప్రాణాలు కాపాడుకోవడానికి మోకాళ్లపై పాక్కుంటూ పోవడం వంటివేవీ చేయలేదు. ఏ మాత్రం వెరవకుండా తిరిగి లేచి నుంచున్నారు. భద్రతా సిబ్బందిని నిలువరించి మరీ పిడికిలి బిగించి పోరాట నినాదాలు చేశారు’’ అంటూ పలువురు మద్దతుదారులు ప్రశంసిస్తున్నారు.ట్రంప్‌తో మాట్లాడిన బైడెన్ హత్యా యత్నంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విస్మయం వెలిబుచ్చారు. ఈ దారుణ ఘటనను అంతా తీవ్రంగా ఖండించాల్సిన అవసరముందన్నారు. ట్రంప్ క్షేమంగా ఉండటం పట్ల హర్షం వెలిబుచ్చారు. ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం బైడెన్ ప్రజలనుద్దేశించి కూడా మాట్లాడారు. ఇలాంటి హింసకు అమెరికాలో తావు లేదన్నారు. షెడ్యూల్ ప్రకారం వారాంతాన్ని గడిపేందుకు బైడెన్ డెలావెర్ వెళ్లాల్సి ఉన్నా పర్యటన రద్దు చేసుకుని వైట్‌హౌస్‌కు తిరిగొచ్చారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో పాటు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జార్జి బుష్, డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీ నేతలు తదితరులు కూడా దాడిని తీవ్రంగా ఖండించారు.మోదీ ఖండన ట్రంప్‌పై హత్యా యత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో హింసకు తావు లేదని స్పష్టం చేశారు. ‘‘నా మిత్రుడు ట్రంప్‌పై దాడి పట్ల తీవ్రంగా ఆందోళన చెందా. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దేశాధినేతలు మాక్రాన్ (ఫ్రాన్స్), స్టార్మర్ (బ్రిటన్), ఆల్బనీస్ (ఆస్ట్రేలియా), మెలోనీ (ఇటలీ), కిషిడా (జపాన్), ట్రూడో (కెనడా), జెలెన్స్కీ (ఉక్రెయిన్), నెతన్యాహూ (ఇజ్రాయెల్) తదితరులు కూడా దాడిని తీవ్రంగా ఖండించారు.ఎప్పుడు ఏమి జరిగిందంటేఅమెరికా స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఆరింటికి ర్యాలీని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగం మొదలైంది. తర్వాతేం జరిగిందంటే... 6:11:33 – ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఒక తూటా కుడి చెవికి తాకడంతో బాధతో ముఖాన్ని తడుముకున్నారు 6:11:35 – తూటాల నుంచి తప్పించుకునేందుకు డయాస్ కిందికి వంగారు. ‘గెట్ డౌన్’ అని అరుస్తూ భద్రతా సిబ్బంది పోడియంపైకి దూసుకొచ్చారు. రక్షణ కవచంలా ట్రంప్‌ను చుట్టుముట్టారు. అంతలో మరిన్ని తూటాలు దూసుకొచ్చాయి. 6:11:41 – ‘ఏం చేస్తున్నాం మనం? ఏం జరుగుతోంది?’ అంటూ మహిళా ఏజెంట్ కేకలు. జనం కేకలు, అరుపులు. అంతటా గందరగోళం 6:11:50 – మళ్లీ కాల్పుల చప్పుడు. ఒక మహిళ ఆక్రందన 6:11:58 – ‘‘స్పేర్ (కారు) దగ్గరికి కదలండి’’ అంటూ ట్రంప్ భద్రతా ఏజెంట్ల పరస్పర హెచ్చరికలు 6:12:06 – ‘హాక్ఐ (కౌంటర్ అటాక్ టీం) వచ్చేసింది, కారు వైపు వెళ్దాం’ అన్న భద్రతా సిబ్బంది6:12:09 – సిద్ధంగా ఉండాలంటూ కార్లోని సిబ్బందికి సూచనలు6:12:21 – షూటర్ చనిపోయాడని నిర్ధారించుకున్న ట్రంప్ భద్రతా సిబ్బంది6:12:22 – కారువైపు కదిలేందుకు సేఫేనా అంటూ ఏజెంట్ల ఆరా6:12:23 – ‘అంతా సేఫ్, కారువైపు పదండి’ అన్న మరో ఏజెంట్. ట్రంప్‌ను పైకి లేపిన సిబ్బంది.6:12:35 – అంతా ఓకే అని ట్రంప్‌కు చెప్పిన ఏజెంట్లు6:12:36 – తన షూ వేసుకోనివ్వాలన్న ట్రంప్6:12:37 – ‘ఆగండి సర్. మీ తలంతా రక్తం’ అని ట్రంప్‌తో ఓ ఏజెంట్6:12:39 – ‘సర్, మనం కారువైపు కదలాలి’ అన్న మరో ఏజెంట్ 6:12:47 – ‘ఆగండి, ఆగండి’ అంటూ భద్రతా సిబ్బందిని నిలువరించిన ట్రంప్. జనంకేసి చూస్తూ పిడికిలి బిగించి ‘ఫైట్’ అంటూ బిగ్గరగా నినాదాలు. అంతే బిగ్గరగా బదులిచి్చన జనం 6:12:54 – ‘మనమిక వెళ్లాలి’ అంటూ ట్రంప్‌ను కారుకేసి తీసుకెళ్లిన భద్రతా సిబ్బంది. మరోసారి నినాదాలు చేస్తూ కార్లో కూర్చున్న ట్రంప్జుయ్మంటూ తూటాలు దూసుకెళ్తున్న శబ్దాలు స్పష్టంగా విని్పంచాయి. ఏదో జరుగుతోందని అనుకునేంతలో ఓ తూటా నా కుడి చెవి పై భాగాన్ని ఛిద్రం చేసింది. చర్మం తెగిపోయింది. విపరీతంగా రక్తం కారింది. ఏం జరుగుతోందో అప్పటికి నాకర్థమైంది. అమెరికా వంటి దేశంలో ఇలాంటి చర్య జరగడం అనూహ్యం. గాడ్ బ్లెస్ అమెరికా– తనపై కాల్పులను ఉద్దేశించి సొంత సోషల్ మీడియా ‘ట్రూత్’లో డొనాల్డ్ ట్రంప్ -
Hush money case: డొనాల్డ్ ట్రంప్ దోషి
న్యూయార్క్/వాషింగ్టన్: ఒక కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(77) అప్రతిష్ట మూటగట్టుకున్నారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు 1.30 లక్షల డాలర్లు అక్రమంగా చెల్లించి, బిజినెస్ రికార్డులు తారుమారు చేసిన కేసులో న్యూయార్క్ కోర్టు ఆయనను దోషిగా తేలి్చంది. ట్రంప్‌పై నమోదైన 34 తీవ్ర అభియోగాలన్నీ రుజువయ్యాయని వెల్లడించింది. జూలై 11న న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వడంతోపాటు శిక్ష ఖరారు చేయనుంది. ఈ వ్యవహారంలో ట్రంప్‌కు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. శిక్ష పడినప్పటికీ.. మరో ఆరు నెలల్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ పోటీ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు కాబోవని అంచనా వేస్తున్నారు. న్యూయార్క్ కోర్టు తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. కోర్టు బయట ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ న్యాయమూర్తి అవినీతికి పాల్పడి తప్పుడు తీర్పు ఇచ్చారని విమర్శించారు. ఇక్కడేం జరిగిందో ప్రజలకు తెలుసని చెప్పారు. అసలైన తీర్పును నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రజలు ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు. తాను నిజాయతీపరుడినని, ఎలాంటి తప్పూ చేయలేదని పేర్కొన్నారు. అమెరికా కోసం, అమెరికా రాజ్యాంగం కోసం పోరాటం కొనసాగిస్తానని వెల్లడించారు. ఈ పోరాటంలో అంతిమ విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. హష్ మనీ కేసులో దోషిగా తేలిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ నిబ్బరంగానే కనిపించారు. కోర్టులో నిశ్శబ్దంగా ఉండిపోయారు. తుది తీర్పు వచ్చేదాకా బెయిల్‌పై బయటే ఉంటారు. జూలై 11న శిక్ష ఖరారు కానుంది. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారైంది. జూలై 15న మిల్వాకీలో రిపబ్లికన్ జాతీయ సదస్సులో ట్రంప్ అభ్యరి్థత్వాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(81)తో డొనాల్డ్ ట్రంప్ తలపడతారు. కోర్టు తీర్పుపై బైడెన్–కమలా హారిస్ ప్రచార విభాగం ప్రతినిధి, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మైఖేల్ టైలర్ హర్షం వ్యక్తం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని న్యూయార్క్ కోర్టు తేల్చిచెప్పిందని అన్నారు ఏమిటీ కేసు? శృంగార తార స్టార్మీ డేనియల్‌తో ట్రంప్ సన్నిహితంగా గడిపినట్లు వార్తలొచ్చాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరు విప్పితే తనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ట్రంప్ అడ్డదారి ఎంచుకున్నారు. ఆమె నోరు మూయించేందుకు 1.30 లక్షల డాలర్లు తన లాయర్ ద్వారా చెల్లించారు. ఎన్నికల ప్రచారం కోసం పారీ్టకి అందిన విరాళాల నుంచే ఈ సొమ్మును స్టార్మీ డేనియల్‌కు చేరవేశారు. అక్రమ చెల్లింపులను కప్పిపుచ్చడానికి బిజినెస్ రికార్డులను తారుమారు చేశారు. ఈ వ్యవహారమంతా బహిర్గతం కావడంతో అమెరికాలో గగ్గోలు మొదలైంది. ట్రంప్‌పై విచారణ అధికారులు 34 అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో న్యూయార్క్ కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. 22 మంది సాక్షులను న్యాయస్థానం ప్రశ్నించింది. ఎన్నికల చట్టాన్ని ట్రంప్ ఉల్లంఘించారని, పోర్న్ స్టార్‌కు చెల్లించిన సొమ్మును కోర్టు ఖర్చుల కింద చూపించారని ప్రాసిక్యూటర్లు వాదించారు. ట్రంప్ తనతో ఏకాంతంగా గడిపిన మాట నిజమేనని స్టార్మీ డేనియల్ కోర్టుకు ఇచి్చన వాంగ్మూలంలో అంగీకరించారు. గురువారం 12 మంది న్యాయమూర్తుల ప్యానెల్ చరిత్రాత్మక తీర్పు వెలువరించింది.ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయొచ్చా? న్యూయార్క్ కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ట్రంప్ భవితవ్యంపై పడింది. కోర్టు ఆయనకు జైలు శిక్ష గానీ, జరిమానా గానీ విధిస్తే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా? చట్టపరంగా అది సాధ్యమేనా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం చూస్తే నేరస్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకొనే నిబంధన ఏదీ లేదని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయాకు చెందిన న్యాయశాస్త్ర ప్రొఫెసర్ రిచర్డ్ ఎల్.హసెన్ చెప్పారు. చట్టపరంగా ఇప్పుడు ట్రంప్ అభ్యరి్థత్వానికి వచ్చే ముప్పేమీ లేదని అన్నారు.కారాగారమా? గృహ నిర్బంధమా? ⇒ ట్రంప్‌పై 34 అభియోగాలు రుజువయ్యాయి. ఒక్కో అభియోగానికి గరిష్టంగా నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష, 5 వేల డాలర్ల దాకా జరిమానా విధించే అవకాశం ఉంది. ⇒ జైలు శిక్ష కాకుండా జరిమానా, ప్రొబేషన్/సామాజిక సేవను శిక్షగా విధించవచ్చు. ప్రొబేషన్ శిక్ష విధిస్తే ప్రొబేషన్ అధికారి ఎదుట ట్రంప్ తరచుగా హాజరు కావాల్సి ఉంటుంది. కండీషనల్ డిశ్చార్జి అనే శిక్ష వేస్తే ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాల్సిన అవసరం ఉండదు. ⇒ గృహ నిర్బంధం విధించే అవకాశం సైతం లేకపోలేదు. అప్పుడు ట్రంప్ తన ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. ఆయన చుట్టూ ఎల్రక్టానిక్ నిఘా పెడతారు. హౌజ్ అరెస్టు అయితే ట్రంప్ నాలుగు గోడల మధ్య నుంచే ఎన్నికల ప్రచారం చేయాలి. ⇒ ట్రంప్ జైలుకెళ్తారా? అంటే కచ్చితంగా చెప్పలేమని న్యాయ నిపుణులు అంటున్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కోర్టు ఆయనకు జైలుశిక్ష విధించకుండా కేవలం జరిమానాతో సరిపెట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. రాజకీయ దురుద్దేశాలతోనే నాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ఇది హష్మనీ వ్యవహారం కాదు. ఇది బహిర్గతం చేయకూడదనే ఒక ఒప్పందం మాత్రమే. పూర్తిగా చట్టబద్ధంగానే జరిగింది. ఇలాంటివి అమెరికాలో సర్వసాధారణమే. ప్రత్యర్థులు నన్ను ఇలా ఇరికించారంటే వారు ఇక ఎవరినైనా ఇరికించగలరు. నాపై తప్పుడు కేసు పెట్టి, ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారు. వారి ఆటలు సాగవు – డొనాల్డ్ ట్రంప్ -
పొత్తు చిచ్చు.. కాంగ్రెస్‌ను వీడిన బిహార్ మాజీ చీఫ్
పాట్నా: లోక్‌సభ ఎన్నికలకు ముందు బిహార్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆర్జేడీతో పొత్తును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అనిల్ శర్మ పార్టీని వీడారు. ఆర్జేడీతో వినాశకరమైన పొత్తులో కాంగ్రెస్ పార్టీ ఇరుక్కుపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ విలేకరుల సమావేశంలో అనిల్ శర్మ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటన చేశారు. వివాదాస్పద మాజీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్‌ను ఇటీవల ఆర్భాటంగా పార్టీలోకి చేర్చుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. “ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీలో దురదృష్టవశాత్తూ ప్రజాస్వామ్యం కనిపించదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా రాహుల్ గాంధీ లేదా అతని సన్నిహితుడు కేసీ వేణుగోపాల్‌ను సంప్రదించకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోలేరు” అని శర్మ ఆరోపించారు. దాదాపు దశాబ్ద కాలంలో పార్టీని వీడిన నాల్గవ మాజీ బిహార్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శర్మ నిలిచారు. 2018లో అశోక్ చౌదరి పార్టీని వీడి జేడీయూలో చేరారు. అంతకుముందు, 2015లో రామ్ జతన్ సిన్హా కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు. అంతకు ముందు సంవత్సరం, మెహబూబ్ అలీ కైజర్ ఎల్జేపీలో చేరారు. "నేను 1985లో కాంగ్రెస్‌లో చేరాను. దాదాపు నాలుగు దశాబ్దాలలో రెండుసార్లు సంస్థాగత పదవులను నిర్వహించాను. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాను. నేనెప్పుడూ టిక్కెట్ కోసం గానీ, శాసన మండలి బెర్త్ కోసం గానీ లాబీయింగ్ చేయలేదు. అలాగే కాంగ్రెస్‌ను వీడే ముందు మరే ఇతర పార్టీలో అవకాశాలను అన్వేషించలేదు" అని అనిల్ శర్మ చెప్పుకొచ్చారు. -
రెండు దశల్లో ‘జమిలి’ ఎన్నికలు
న్యూఢిల్లీ: ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమరి్పంచింది. రామ్‌నాథ్ కోవింద్‌తోపాటు కమిటీ సభ్యులైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎన్.కె.సింగ్, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ కాశ్యప్, లోక్‌సభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ముర్మును నివేదిక అందజేశారు. జమిలి ఎన్నికలపై 18,629 పేజీల ఈ నివేదికలో ఉన్నత స్థాయి కమిటీ కీలక సిఫార్సులు చేసింది. రెండంచెల విధానాన్ని సూచించింది. తొలుత లోక్‌సభ, అన్ని రాష్ట్రాల శాసనసభలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత 100 రోజుల్లోగా అన్ని రకాల స్థానిక సంస్థలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది. జమిలి ఎన్నికలతో అభివృద్ధి వేగవంతం అవతుందని, దేశానికి మేలు జరుగుతుందని ఉద్ఘాటించింది. ఈ ఎన్నికల కోసం కోవింద్ కమిటీ రాజ్యాంగానికి మొత్తం 18 సవరణలు సూచించింది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే.... రామ్‌నాథ్ కోవింద్ కమిటీని 2023 సెప్టెంబర్ 23న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ 191 రోజులపాటు విస్తృత పరిశోధన సాగించింది. భాగస్వామ్యపక్షాలు, నిపుణులతో సంప్రదింపులు జరిపింది. దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బెల్జియం తదితర దేశాల్లో అమల్లో ఉన్న జమిలి ఎన్నికల ప్రక్రియలను అధ్యయనం చేసింది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే కోవింద్ కమిటీ సిఫార్సుల చేసిందని అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఈ సిఫార్సుల ప్రకారం రాజ్యాంగానికి కనిష్ట సవరణలతో జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని పేర్కొన్నాయి. 32 పార్టీల మద్దతు జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోవింద్ కమిటీ సేకరించింది. అభిప్రాయం చెప్పాలంటూ 62 పార్టీలకు సూచించగా, 47 పార్టీలు స్పందించాయి. ఇందులో 32 పార్టీలు జమిలికి జైకొట్టాయి. 15 పార్టీలు వ్యతిరేకించాయి. మిగిలిన 15 పార్టీలు స్పందించలేదు. బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఏఐఏడీఎంకే, బిజూ జనతాదళ్, మిజో నేషనల్ ఫ్రంట్, శివసేన, జనతాదళ్(యూ), శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీలు మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, సీపీఎం, సీపీఐ, ఎంఐఎం, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, నాగా పీపుల్స్ ఫ్రంట్, సమాజ్‌వాదీ పార్టీ వంటివి వ్యతిరేకించాయి. త్వరలో లా కమిషన్ నివేదిక ఏకకాలంలో ఎన్నికలపై లా కమిషన్ త్వరలో తన నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. 2029 నుంచి జమిలి ఎన్నికలు ప్రారంభించాని లా కమిషన్ సిఫార్సు చేయబోతున్నట్లు సమాచారం. లోక్‌సభ, శాసనసభలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ సూచించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కోవింద్ కమిటీ సిఫార్సులు ► లోక్‌సభలో హంగ్, అవిశ్వాస తీర్మానం వంటి సందర్భాలు ఎదురైనప్పుడు మళ్లీ తాజాగా ఎన్నికలు నిర్వహించాలి. కొత్త సభను ఏర్పాటు చేయాలి. ► ఎన్నికలు జరిగి కొత్తగా కొలువుదీరిన లోక్‌సభ ఐదేళ్లు కొనసాగదు. అంతకంటే ముందున్న సభ గడువు ఎన్నాళ్లు మిగిలి ఉంటుందో అప్పటివరకు మాత్రమే కొత్త సభ మనుగడ సాగిస్తుంది. ► రాష్ట్రాల శాసనసభలు లోక్‌సభ కాల వ్యవధి ముగిసేవరకు(ముందుగా రద్దయితే తప్ప) పనిచేస్తాయి. ► జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 83(పార్లమెంట్ కాల వ్యవధి), ఆర్టికల్ 172(శాసనసభ కాల వ్యవధి)కు సవరణ చేయాలి. ► ఆర్టికల్ 83, ఆర్టికల్ 172కు సవరణ చేయడానికి రాష్ట్రాల అమోదం అవసరం లేదు. ► జమిలి ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల ఎన్నికల సంఘాలతో సంప్రదించి ఒక ఉమ్మడి ఓటరు జాబితా, ఓటరు గుర్తింపు కార్డులు రూపొందించాలి. ఇందుకోసం ఆర్టికల్ 325కి సవరణ చేయాల్సి ఉంటుంది. ► స్థానిక సంస్థలతో ఏకకాలంలో ఎన్నికల కోసం ఆర్టికల్ 324ఏను సవరించాలి. ► ఆర్టికల్ 325, ఆర్టికల్ 324ఏకు సవరణ చేయాలంటే రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి. ► ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతిఏటా ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతోంది. విలువైన సమయం వృథా అవుతోంది. జమిలి ఎన్నికలతో ఇలాంటి సమస్యలు పరిష్కరించవచ్చు. ► జమిలి ఎన్నికల కోసం ప్రభుత్వం ఒక పటిష్టమైన చట్టబద్ధ యంత్రాంగాన్ని రూపొందించాలి. -
‘బాయ్‌కాట్’ దెబ్బ గట్టిగా తగిలింది: మాల్దీవుల మాజీ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: మాల్దీవులపై భారత్ ఇచ్చిన బాయ్‌కాట్ కాల్‌పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఇచ్చిన బాయ్‌కాట్ పిలుపుతో మాల్దీవుల పర్యాటకంపై భారీ ప్రభావం పడిందని చెప్పారు. ఈ విషయమై ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న నషీద్ మీడియాతో మాట్లాడారు. ‘భారత్ బాయ్‌కాట్ పిలుపు మాల్దీవుల పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. దీనిపై నేను చాలా ఆందోళన చెందుతున్నాను. ఇందుకు క్షమాపణలు చెబుతున్నాను. హాలీడేస్‌కు భారత ప్రజలు మాల్దీవులకు రావాలని కోరుకుంటున్నాను. మా ఆతిథ్యంలో ఎలాంటి తేడాలుండవు. భారత్, మాల్దీవుల సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలి. ఈ పర్యటనలో ప్రధాని మోదీని కూడా కలిశాను. నేను మోదీకి పెద్ద మద్దతుదారును. ఆయనకు ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను’అని నషీద్ తెలిపారు. మాల్దీవుల నుంచి భారత సైన్యం వైదొలగాలని ప్రస్తుత అధ్యక్షుడు మహ్మద్ మిజ్జు తీసుకున్న నిర్ణయంపైనా నషీద్ స్పందించారు. దీనిపై ఇరు దేశాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాగా, చైనా మద్దతుదారుగా పేరున్న ప్రస్తుత మాల్దీవుల ప్రధాని మిజ్జు ఈ నెల 10లోగా భారత సైన్యం మాల్దీవులను విడిచి వెళ్లాలని డెడ్‌లైన్ పెట్టిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. గాజాలో దారుణం.. తిండి కోసం ఎదురు చూస్తున్నవారిపై పారాచూట్ -
సొంత బ్రాండ్ షూస్ విడుదల చేసిన ట్రంప్
ఫిలడెల్ఫియా: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత బ్రాండ్ షూస్‌ను విడుదల చేశారు. ఆదివారం ఫిలడెల్ఫియాలో కన్వెన్షన్ సెంటర్లో వాటిని ప్రదర్శించారు. బంగారు వర్ణం షూలు 399 డాలర్లకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు విక్టరీ47 అనే సెంటును కూడా విడుదల చేశారు. ఆస్తుల విలువను ఎక్కువ చేసి చూపిన నేరానికి కోర్టు ఏకంగా 35.5 కోట్ల డాలర్ల భారీ జరిమానా విధించిన మరునాడే ట్రంప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ బరిలోకి దిగనున్నారు. -
హెలికాప్టర్ క్రాష్.. చిలీ మాజీ అధ్యక్షుడి మృతి
సాంటియాగో: చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా (74) హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. పినేరా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దక్షిణ చిలీలోని ఓ సరస్సులో కూలిపోయింది. ప్రమాదం జరిగినపుడు హెలికాప్టర్లో పినేరాతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ప్రమాదంలో పినేరా ఒక్కరే మృతిచెందగా మిగతావారు గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌ను పినేరానే స్వయంగా నడిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. పినేరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చిలీ ఆర్మీ ప్రకటించింది. చిలీ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పినేరా తొలిసారి 2010 నుంచి 2014 వరకు, రెండోసారి 2018 నుంచి 2023 వరకు దేశాధ్యక్షుడిగా పదవిలో ఉన్నారు. బిలియనీర్ అయిన పినేరా చిలీలోని అత్యంత ధనికుల్లో ఒకరు. ఆయన మృతి పట్ల దక్షిణ అమెరికా దేశాధినేతలతో పాటు పలువురు ఇతర దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఇదీ.. చదవండి..పాక్ ఎన్నికల బరిలో ఆమె అంతంతే -
One Nation, One Election: జమిలి ఎన్నికలపై సూచనలివ్వండి
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి సూచనలివ్వాలంటూ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ కమిటీ ప్రజలను కోరింది. దేశంలో లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరపడానికి చట్ట పరమైన పరిపాలనా ఫ్రేమ్‌వర్క్‌లో చేపట్టాల్సిన మార్పులను తెలపాలని పిలుపునిచ్చింది. జనవరి 15వ తేదీలోగా అందిన సూచనలను పరిశీలనకు పరిగణిస్తామని ఒక నోటీసులో తెలిపింది. సూచనలను onoe.gov.in వెబ్సైట్లో పోస్టు చేయాలని సూచించింది. లేదా sc& hlc@gov.in కి మెయిల్ చేయవచ్చని వివరించింది. ఈ నోటీసును ఆరు జాతీయ పార్టీలకు, 33 రాష్ట్ర పార్టీలు, ఏడు గుర్తింపు పొందని రిజిస్టర్డ్ పార్టీలకు పంపినట్లు తెలిపింది. ఇదే అంశంపై లా కమిషన్ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటామంది. -
రోసాలిన్ కార్టర్ కన్నుమూత
అట్లాంటా(అమెరికా): మానసిక వైద్య సంస్కరణల కోసం అహరి్నశలు కృషిచేసిన మాజీ అమెరికా అధ్యక్షుడి భార్య, మానవతావాది రోసాలిన్ కార్టర్ కన్నుమూశారు. కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యం, మతిమరుపు సమస్యలతో బాధపడుతున్న 96 ఏళ్ల రోసాలిన్ ఆదివారం జార్జియా రాష్ట్రంలోని ప్లేన్స్ నగరంలో స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ‘నాకు అత్యవసరమైన ప్రతిసారీ సరైన సలహాలిచి్చంది. చక్కని మార్గదర్శిగా ఉంటూ జీవితాంతం తోడుగా నిలిచింది’ అని 99 ఏళ్ల భర్త జిమ్మీ కార్టర్ పేర్కొన్నారు. -
One Nation, One Poll: జమిలి ఎన్నికలు...కోవింద్‌తో లా కమిషన్ భేటీ
న్యూఢిల్లీ: ‘ఒక దేశం–ఒకేసారి ఎన్నికలు’ అంశంపై ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని ఉన్నత స్థాయి కమిటీతో కేంద్ర లా కమిషన్ బుధవారం భేటీ అయింది. లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు రాజ్యాంగానికి చేయాల్సిన సవరణలు తదితరాలతో కూడిన రోడ్ మ్యాప్‌ను కమిటీ ముందు ఉంచింది. లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలను ఒకేసారి జరిపే సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా లా కమిషన్‌ను కేంద్ర న్యాయ శాఖ ఇప్పటికే పురమాయింది. వాటితో పాటు మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలను ఒకేసారి జరిపే సాధ్యాసాధ్యాల పరిశీలన బాధ్యతను కోవింద్ కమిటీకి అప్పగించింది. ఈ అంశంపై లా కమిషన్ రూపొందిస్తున్న నివేదిక ఇంకా తుది రూపు సంతరించుకోవాల్సి ఉందని సమాచారం. ఒక దేశం–ఒకేసారి ఎన్నికలు అంశంపై అభిప్రాయాలు, సూచనలు 3 నెలల్లో చెప్పాలంటూ రాజకీయ పార్టీలకు కోవింద్ కమిటీ తాజాగా లేఖలు రాసింది. ఆరు జాతీయ పార్టీలు, 33 రాష్ట్ర పార్టీలు, ఏడు నమోదైన గుర్తింపు లేని పార్టీలకు లేఖలు వెళ్లాయి. దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల పదవీకాలాలను పొడిగించడం, తగ్గించడం వంటి చర్యల ద్వారా 2029లో వాటికి సైతం లోక్‌సభతో పాటే ఎన్నికలు జరిపేందుకు అవసరమైన విధాన రూపకల్పనలో లా కమిషన్ ప్రస్తుతం తలమునకలైంది. -
ANR 100th Birthday Celebrations: నాగేశ్వరరావుగారు నట విశ్వవిద్యాలయం
‘‘తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్లు అని ఎప్పుడూ చెబుతుంటాను. తన జీవితాన్ని ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవడం నాగేశ్వరరావుగారిలోని గొప్పతనం. అమరశిల్పి జక్కన్న, విప్రనారాయణ, తెనాలి రామకృష్ణ, మహా కవి కాళిదాసు.. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎలాంటి సినిమాలో అయినా ఒదిగి΄ోయేవారు. నాగేశ్వరరావుగారు ఒక పెద్ద నటనా విశ్వ విద్యాలయం. ఈ రోజు పరిశ్రమలోకి వచ్చిన ప్రతిఒక్కరూ ఆ విశ్వ విద్యాలయంలో విద్యార్థిననుకుని, ఆ గుణగణాలను అందిపుచ్చుకుంటే భవిష్యత్‌కు మంచి ప్రణాళికలు వేసుకున్నట్లవుతుంది’’ అన్నారు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బుధవారం (సెప్టెంబరు 20) ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావుగారు మహానటులు.. మహా మనిషి. సినిమా రంగంలో విలువలు పాటించిన వ్యక్తి నాగేశ్వరరావుగారు. అవతలివాళ్లు నేర్చుకోదగ్గ కొన్ని మంచి సంప్రదాయాలు, విలువల్లో ఆయన జీవించి, నటించి మనకు చూపించారు. ఆ మార్గంలో ప్రయాణిస్తే అదే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి. నాగేశ్వరరావుగారు పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి, జీవిత చరమాంకంలోనూ నటిస్తూనే ఉన్నారు. కొంతమంది జీవిత కాలంలో జీవిస్తారు. జీవిత కాలం పూర్తయిన తర్వాత కూడా జీవించే మహానుభావులు కొందరు. వారిలో అక్కినేని నాగేశ్వరరావుగారు అగ్రగణ్యులు. ఆయన మంచి నటులే కాదు.. పరిణతి చెందిన గొప్ప ఆశావాది కూడా. ఆయన నాస్తికుడు. గొప్ప తాత్త్వికుడు. ఆయన పెద్దగా చదువుకోలేదని అంటారు. కానీ జీవితాలను చదివారు. జీవితంలో ఆయన ΄ోరాటం చేశారు.. జీవితాన్ని ప్రేమించారు.. ఆస్వాదించారు. జీవితంలో నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెట్టి చూపించారు’’ అని అన్నారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘1950 సమయంలో నాగేశ్వరరావుగారు సినిమాల్లో నటించడంప్రారంభించాక, సొంతిల్లు కట్టుకోవడానికి ముందే మద్రాస్ విశ్వ విద్యాలయానికి పాతికవేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పాతిక వేలు ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయానికి కూడా పాతిక వేలు విరాళం ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. 1959లోలక్ష రూపాయల విరాళం ఇచ్చి గుడివాడ కళాశాలను నిలబెట్టారు. నాలాంటివారు ఎందరో చదువుకోగలిగారు. ఆ విధంగా ఆప్రాంతంలో సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఓ విప్లవానికి ఆయన నాంది పలికారు’’ అన్నారు. డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ – ‘‘అక్కినేని నాగేశ్వరరావుగారి కష్టం, కళల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ ఆయన్ను ఓ లెజెండ్‌ని చేశాయి. యువ నటీనటులకు నాగార్జునగారు స్ఫూర్తి అని నా ఫ్రెండ్స్ సర్కిల్స్‌లో చెబుతుంటారు. నాగార్జునగారేమో తన తండ్రి చూపించిన మార్గంలో నడిచానని చెబుతుంటారు’’ అన్నారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఎవరి విగ్రహాన్ని అయినా చూస్తే.. ఆయన ఓ మహానుభావుడు... ఆయన మనతో లేరనే భావన నా మనసులో చిన్నతనం నుంచే ముద్రపడింది. ఏ విగ్రహం చూసినా నాకు అదే అనిపించేది. అందుకే వెంకయ్యనాయుడుగారు ఆవిష్కరించేంతవరకూ నేను నాన్నగారి విగ్రహాన్ని చూడలేదు. చూడబుద్ధి కాలేదు. ఎందుకంటే నాన్నగారు మాతో లేరనే విషయాన్ని అంగీకరించాల్సి వస్తుందేమోనని... శిల్పి వినీత్ ఈ విగ్రహాన్ని అద్భుతంగా చెక్కాడు. నాన్నగారు అద్భుతమైన జీవితాన్ని జీవించారు. తరతరాలుగా గుర్తుపెట్టుకునే పాత్రలు చేసిన నటుడు. కోట్లమంది తెలుగు ప్రజలు, అభిమానులు ప్రేమించిన వ్యక్తి.. ఇలా వివిధ రకాలుగా నాన్నగారు అందరికీ తెలుసు. మాకు మాత్రం నాన్నగారు మా గుండెలను ప్రేమతో నింపిన వ్యక్తి. నన్ను, నా తోబుట్టువులను, మా పిల్లలను.. అందర్నీ చల్లగా చూసిన వ్యక్తి. మాకు మనసు బాగున్నా, బాగోలేకున్నా నాన్నగారి దగ్గరికి వెళ్లి కూర్చుంటే చాలు అన్నీ సర్దుకునేవి. అన్నపూర్ణ స్టూడియోస్ నాన్నగారికి నచ్చిన స్థలం. నచ్చిన చోట విగ్రహం పెడితేప్రాణ ప్రతిష్ఠ చేసినట్లు అంటారు. సో.. ఆయన ప్రాణంతో మా దగ్గరే ఉన్నారని,ప్రాణంతో మా మధ్యనే నడుస్తున్నారని అనుకుంటున్నాము. నా ఆలోచనల్లోనే కాదు.. ప్రతి ఒక్కరి ఆలోచనల్లో నాన్నగారు ఎప్పటికీ జీవించే ఉంటారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినవారికి, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన నాన్నగారి అభిమానులకు ధన్యవాదాలు’’ అన్నారు. ఏయన్నార్ పెద్ద కుమారుడు వెంకట్ అక్కినేని మాట్లాడుతూ– ‘‘మనిషి ఎంత కీర్తి సంపాదించినా, ఎంత ధనం గడించినా తలగడ మీద తల పెట్టగానే నిద్ర΄ోవడం అనే ఆస్తి, సౌకర్యం ఏ ధనం ఇవ్వలేదు. ఏయన్నార్‌గారు తలగడ మీద తల పెట్టగానే హాయిగా నిద్ర΄ోయేవారు. 1974లో బైపాస్ సర్జరీ జరిగింది. సర్జరీ ముందు రోజు నర్సు నిద్రకోసం మాత్ర ఇస్తే తీసుకోలేదు. ఏ మాత్ర వేసుకోకుండానే హాయిగా నిద్ర΄ోయారు. ఆ తర్వాత ఆయన జీవితం అందరికీ తెలిసిందే. నాకు మరుజన్మ అంటూ ఉంటే ఆయన సన్నిధిలోనే ఉండాలనుకుంటున్నాను. అన్నపూర్ణ సంస్థ, ఏయన్నార్ ఫిల్మ్ స్కూల్, కాలేజీ, ఆయన చిత్రాలు, ఫ్యాన్స్ తీపి గుర్తులు’’ అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావు గారు ఒక గ్రంథం. ఆయన ‘మరపురాని మనుషులు’ సినిమాకు అసోసియేట్‌గా చేశాను. అన్నపూర్ణ సంస్థలో ఎన్నో సినిమాల్లో నటించాను’’ అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘రైతు కుటుంబంలో పుట్టి అద్భుతమైన స్థితికి చేరుకున్న వ్యక్తి నాగేశ్వరరావుగారు. మహానట వృక్షం. కళాకారులకు గొప్ప వరం. స్వయంశిల్పి. స్నేహశీలి. అద్భుతమైన క్రమశిక్షణ కలిగిన వ్యక్తి’’ అన్నారు. ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘ఓ వేడుకలో నాగేశ్వరరావుగారితో మాట్లాడే అవకాశం లభించింది. స్టార్ అయిన మీరు ‘మిస్సమ్మ’ సినిమాలో కమెడియన్‌గా ఎందుకు చేశారు? అని ఆయన్ను అడిగాను. ‘దేవదాసు’ తర్వాత అన్నీ తాగుబోతు పాత్రలే వస్తున్నాయని, ఇమేజ్ మార్చుకోక΄ోతే ఇబ్బందవుతుందేమోనని, ఆ పాత్రను తానే అడిగి మరీ చేశానని చె΄్పారు. నాగేశ్వరరావుగారికి ఆయనపై ఆయనకు ఉన్న నమ్మకానికి నమస్కారం చేయాలనిపించింది’’ అన్నారు. జయసుధ మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావుగారితో ఎక్కువ సినిమాలు చేయడం నా అదృష్టం. క్రమశిక్షణతో పాటు ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు. ఏయన్నార్ కుమార్తె నాగ సుశీల మాట్లాడుతూ– ‘‘అందరికీ పండగలు ఉంటాయి. కానీ మా అక్కినేని అభిమానులకు నాన్నగారి జయంతే పండగ. అభిమానుల ్ర΄ోత్సాహం వల్లే ఈ కార్యక్రమం సాధ్యమైంది. అమ్మానాన్నలు మేం ఎప్పుడూ కలిసే ఉండాలని కోరుకునేవారు. అలా మేమందరం కలిసే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేశాం’’ అన్నారు. సుశాంత్ మాట్లాడుతూ– ‘‘తాతగారు తన జీవితంలో కృతజ్ఞతకు విలువ ఇచ్చేవారు. ఇండస్ట్రీలో తారా స్థాయికి ఎదిగిన ఆయనకు కళామతల్లికి తిరిగి ఇవ్వాలని ఉండేది. అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్, ఏయన్నార్ నేషనల్ అవార్డు, అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా.. ఇలా ఎన్నో ఆయన కృతజ్ఞతలోంచి వచ్చిన ఆలోచనలే’’ అన్నారు. ‘‘నాగేశ్వరరావుగారి విగ్రహం పనులను నాకు అప్పగించిన అక్కినేని కుటుంబ సభ్యులకు ధన్య వాదాలు. దాదాపు ఐదున్నర నెలలు వర్క్ చేశాం’’ అన్నారు విగ్రహ రూపకర్త వినేష్ విజయన్. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఏయన్నార్గారంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ పెద్ద, ఓ గొప్ప నటుడు, క్లాసిక్ ఐకాన్‌గా పరిచయం. ఆయన చిత్రాలు, ఆయన చేసిన ప్రయోగాలు ప్రేరణ కలిగించే కేస్ స్టడీగా చాలా మంది ఫిల్మ్ స్కూల్స్‌లో చదువుతుంటారు. ఈ జాబితాలో నేనూ ఉన్నాను. తాతగారితో నేను కలిసి నటించడం నా అదృష్టం. మన పుట్టుక మన చేతిలో ఉండదు. అలాంటిది అక్కినేని నాగేశ్వరరావుగారి మనవడిగా పుట్టడం నా అదృష్టం’’ అని అన్నారు. తాత ఏయన్నార్‌కు అఖిల్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అమల, సుప్రియ, సుమంత్.. ఇలా అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, శ్రీకాంత్, మంచు విష్ణు, నాని, నాజర్, అనుపమ్ ఖేర్, అల్లు అరవింద్, అశ్వినీదత్, సి. కల్యాణ్, కేఎల్ నారాయణ, ‘దిల్’ రాజు, చినబాబు, నాగవంశీ, బి. గోపాల్, వైవీఎస్ చౌదరి, పి. కిరణ్, గుణ్ణం గంగరాజు, విజయ చాముండేశ్వరి తదితరులు పాల్గొని, అక్కినేని నాగేశ్వరరావుకి నివాళులు అర్పించారు. -
రామ్‌నాథ్ కోవింద్‌తో న్యాయ శాఖ ఉన్నతాధికారుల భేటీ
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ చీఫ్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం న్యాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కమిటీ ఎజెండాపై చర్చించారు. న్యాయ శాఖ కార్యదర్శి నితిన్ చంద్ర, శాసన కార్యదర్శి రీటా వశిష్ట తదితరులు కోవింద్‌ను కలిశారు. జమిలి ఎన్నికల విషయంలో అధ్యయనం చేయాల్సిన అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. చట్టపరమైన విషయాలపై చర్చించుకున్నారు. ఉన్నత స్థాయి కమిటీకి నితిన్ చంద్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’పై అధ్యయనం కోసం 8 మంది సభ్యులతో హైలెవెల్ కమిటీని నియమిస్తూ కేంద్రం శనివారం ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలను సైతం ఒకేసారి నిర్వహించాలనికేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. -
ట్రంప్ మగ్ షాట్:మస్క్ రియాక్షన్ అదిరిపోయింది!
Elon Musk On Donald Trump అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ "నెవర్ సరెండర్" మగ్షాట్పై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ,ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ స్పందించారు. ఇది "నెక్స్ట్ లెవెల్" అంటూ ట్వీట్ చేశారు. ట్రంప్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఈ కామెంట్ పోస్ట్ చేశారు. (బిల్ తీసుకుంటే చాలు..కోటి రూపాయలు మీవే!) Next-level https://t.co/E81JKWTJPS — Elon Musk (@elonmusk) August 25, 2023 జార్జియాలోని ఫుల్టన్ కౌంటీ జైలు వద్ద గురువారం రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ జార్జియాలో అరెస్టు తర్వాత గురువారం ట్విటర్(ఎక్స్) లో తన పోలీసు మగ్‌షాట్‌ను పోస్ట్ చేసారు. జనవరి 2021 నుండి ప్లాట్‌ఫారమ్‌పై అతని తొలి పోస్ట్ కావడం విశేషం. ట్విటర్‌నుంచి బ్యాన్ తరువాత గత ఏడాది అక్టోబర్‌లో ట్విటర్‌ను కొనుగోలు చేసిన అనంతరం మస్క్ 2022 నవంబరులో ట్రంప్ ట్విటర్ అకౌంట్‌ను పునరుద్ధరించారు. (ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తోంది...సూపర్ అప్‌కమింగ్ కార్లు ) కాగా 2020 సంవత్సరంలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో జోక్యం, కుట్రపూరితంగా వ్యవహరించడం వంటి కేసులు నమోదైన నేపథ్యంలో ట్రంప్ పోలీసులకు సరెండర్ అయ్యారు. అయితే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమంతట తాముగా పోలీసులు ఎదుట లొంగిపోయినా కూడా అక్కడ అరెస్ట్ కిందే లెక్క. అలా అమెరికా చరిత్రలోనే ఫొటోతో సహా(మగ్‌షాట్) పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. -
ట్రంప్‌పై నేరాభియోగాలు
మియామి: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఒకదాని తర్వాత మరొకటి కేసుల ఉచ్చు బిగుస్తోంది. ప్రభుత్వానికి చెందిన అత్యంత రహస్య పత్రాల కేసులో ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఒక మాజీ అధ్యక్షుడిపై ఫెడరల్ జ్యూరీ నేరుగా అభియోగాలు నమోదు చేయడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ కేసులో 13 తేదీ మంగళవారం మియామి కోర్టుకు హాజరు కావాలని సమన్లు కూడా అందాయి. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఒక మాజీ అధ్యక్షుడికి దేశంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని తాను ఎన్నడూ ఊహించలేదన్నారు. అమెరికా చరిత్రలో ఇదో చీకటి రోజుగా అభివర్ణించారు. దేశం ఎంతగా దిగజారిపోతున్నా, అందరం కలిసి అమెరికా గ్రేట్ ఎగైన్ అని నిరూపిద్దామని తన అభిమానులకి పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వానికి జరుగుతున్న పోరులో ముందంజలో ఉన్న ట్రంప్ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తూ ఉండడం రాజకీయంగా ఆయనకి గట్టి ఎదురు దెబ్బగానే చెప్పాలి. నిన్నటికి నిన్న పోర్న్ స్టార్‌కి ముడుపులు చెల్లించిన కేసులో నేరాభియోగాలు ఎదుర్కొన్న ట్రంప్ ఈ సారి ఏకంగా ఫెడరల్ జ్యూరీ అభియోగాలనే నేరుగా ఎదుర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా 2021లో గద్దె దిగిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన రహస్య పత్రాలను ఆర్కీవ్స్‌కు అప్పగించకుండా ఫ్లోరిడాలో తన ఎస్టేట్‌కు తరలించారని ట్రంప్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే రుజువైతే వందేళ్లు జైలు రహస్య పత్రాల కేసులో గూఢచర్య చట్టం కింద డొనాల్డ్ ట్రంప్‌పై ఏడు అంశాల్లో అభియో గాలు నమోదయ్యాయి. ప్రభుత్వానికి చెందిన రహస్య పత్రాలను ఉద్దేశపూర్వకంగా తన దగ్గర ఉంచుకోవడం, న్యాయ ప్రక్రియను అడ్డుకో వడానికి కుట్ర, నిజాయితీ లేకుండా డాక్యుమెంట్లను దాచిపెట్టడం, తన గుట్టు బయటపడకుండా పథక రచన, తప్పుడు ప్రకటనలు జారీ చేయడం వంటి అంశాల్లో అభియోగాలు నమోదయ్యాయి. ఇవి రుజువైతే ట్రంప్‌కి గరిష్టంగా వందేళ్లు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ అభియోగాలు ఎలాంటి అడ్డంకి కాకపోయినప్పటికీ రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ అభ్యర్థిత్వానికి ఎంత మద్దతు లభిస్తుందా అన్న అనుమానాలైతే ఉన్నాయి. -
ముద్దాయి ట్రంప్!...రిపబ్లికన్ల నుంచి మద్దతు ఎంత?
న్యూయార్క్: అమెరికా చరిత్రలో రాజకీయంగా మరో పెను సంచలనానికి తెరలేచింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందే చెప్పినట్టుగా ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయి. పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ (స్టెఫానీ గ్రెగరీ క్లిఫర్డ్)తో లైంగిక సంబంధాలు బయటపెట్టకుండా ఉండేందుకు ఆమెకు డబ్బులు చెల్లించి అనైతిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారన్న ఆరోపణల కేసులో డొనాల్డ్ ట్రంప్‌పై అభియోగాలు నమోదయ్యాయి. న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ గ్రాండ్ జ్యూరీ నేరాభియోగాలు నమోదు చేసినట్టుగా ధ్రువీకరించింది. ట్రంప్ లాయర్లతో కేసు విచారణను పర్యవేక్షిస్తున్న మన్‌హట్టన్ అటార్నీ జనరల్ అల్విన్ బ్రాగ్ మాట్లాడారు. ట్రంప్ లొంగిపోవడానికి సహకరించాలని కూడా బ్రాగ్ సూచించారు. దీంతో ట్రంప్ క్రిమినల్ కేసు విచారణను ఎదుర్కోవడంతో పాటు ఇలాంటి నేరాభియోగాలు ఎదుర్కొన్న మొట్టమొదటి మాజీ అధ్యక్షుడిగా అపఖ్యాతిని మూటకట్టుకున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి వైట్‌హౌస్‌లోకి అడుగు పెట్టాలని కలలు కంటున్న వేళ నేరాభియోగాలు నమోదు కావడం నైతికంగా ట్రంప్‌కు ఎదురు దెబ్బ తగిలినట్టయింది. తనను అరెస్ట్ చేస్తారని, అదే జరిగితే రిపబ్లికన్ శ్రేణు లు, తన అభిమానులు దేశవ్యాప్తంగా ఘర్షణలకు దిగాలని కూడా గత వారం ఆయన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వేలి ముద్రలు, ఫొటో తీసుకొని... ట్రంప్ కోర్టులో లొంగిపోతే ఆయన అరెస్ట్ ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ న్యూయార్క్ అధికారులకి సహకరిస్తారని ఆయన తరఫు లాయర్ స్పష్టం చేయడంతో ఆయనపై ఎలాంటి అరెస్ట్ వారెంట్లు జారీ చేయలేదు. ప్రస్తుతం ఫ్లోరిడాలో ఉన్న ట్రంప్‌కి సొంతంగా విమా నం ఉంది. న్యూయార్క్‌లో ఏదైనా విమానాశ్రయానికి తన విమానంలో వెళ్లి అక్కడ్నుంచి మన్‌హట్టన్ కోర్టు హాలుకి కారులో వెళతారు. మంగళవారం నాడు ట్రంప్ కోర్టు ఎదుట లొంగిపోయే అవకాశాలున్నాయి. సర్వసాధారణంగా సామాన్య నిందితుల్ని కోర్టులో హాజరు పరచాలంటే వారికి సంకెళ్లు వేసి నడిపించుకుంటూ తీసుకువెళతారు. కానీ ట్రంప్ దేశానికి మాజీ అధ్య క్షుడు కావడంతో అలా జరిగే అవకాశాల్లేవు. మీడి యా కవరేజీకి అవకాశం లేకుండా ట్రంప్‌ని ప్రత్యేక ద్వారం నుంచి లోపలికి అనుమతించే అవకాశాలున్నా యి. క్రిమినల్ కేసులో అభియోగాలు నమోదు కావడంతో ట్రంప్ వేలిముద్రలు, పోలీసు రికా ర్డుల కోసం ఆయన ఫొటో తీసుకుంటారు. న్యాయమూర్తి ఎదుట హాజరు పరచడానికి ముందు ట్రంప్‌ని ప్రత్యేక సెల్లో ఉంచే బదులుగా వేరే ఒక గదిలో ఉంచుతారు. ఒక్కసారి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచిన తర్వాత ఈ కేసు పురోగతి ఎలా ఉండబోతుందన్నది తెలుస్తుంది. బెయిల్ లభిస్తుందా? ట్రంప్‌పై నేరాభియోగాలు మోపిన న్యూయార్క్ జ్యూరీ ఆ అభియోగాల పత్రాన్ని సీల్ వేసి ఉంచింది. ట్రంప్‌ను అరెస్ట్ చేసిన తర్వాతే సీల్ విప్పుతారు. ఈ కేసుని విచారించే న్యాయమూర్తి స్వయంగా కోర్టు హాలులో నేరాభియోగాలను చదివి వినిపిస్తారు. ఆయనపై ఏయే సెక్షన్ల కింద ఎలాంటి అభియోగాలు నమోదయ్యాయో అప్పుడే అందరికీ తెలుస్తుంది. ఆ అభియోగాలను బట్టి ఆయనకు బెయిల్ లభిస్తుందా, లేదా అన్నది స్పష్టమవుతుంది. ట్రంప్‌పై ప్రయాణపరమైన ఆంక్షలుంటాయా, లేదా వంటివన్నీ కూడా ఆయన న్యాయమూర్తి ఎదుట హాజరైన తర్వాతే తేలుతాయి. ఈ కేసులో దోషిగా తేలితే ట్రంప్‌కు నాలుగేళ్ల కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. భారీగా జరిమానా కూడా విధిస్తారని కొందరు న్యాయనిపుణులు చెబుతున్నారు. రిపబ్లికన్ల నుంచి మద్దతు ఎంత? రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ తనపై మోపిన అభియోగాలను రాజకీయంగా అనుకూలంగా మార్చుకునే వ్యూహాల్లో ఉన్నారు. అమెరికా చరిత్రలో అనూహ్యమైన ఈ పరిణామాన్ని రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని ప్రచారం చేయడానికి ట్రంప్ మద్దతుదారులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ట్రంప్‌పై అభియోగాలను ప్రాసిక్యూషన్ రుజువు చెయ్యలేకపోతే ట్రంప్ తన ఇమేజ్ మరింత పెరుగుతుందన్న భావనలో ఉన్నారు. అయితే రిపబ్లికన్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ మద్దతుదారులు ఈ కేసు వల్ల అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీకి జరిగే లాభంపై ఇప్పట్నుంచే లెక్కలు వేస్తున్నారు. ‘‘ఇది చాలా చిన్న కేసు. ట్రంప్‌ను వేధించడానికే ఈ కేసుని బయటకు తెచ్చారు’’అని న్యూహ్యాంప్‌షైర్‌లో రిపబ్లికన్ పార్టీ చీఫ్ గ్రెగ్ హగ్ వ్యాఖ్యానించారు. ట్రంప్ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి కావాలంటే పార్టీలో 25 నుంచి 30 శాతం కంటే ఎక్కువ మంది ఆయనకు మద్దతు పలకాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అది కష్టమని ప్రత్యర్థి శిబిరం భావిస్తోంది. నేరాభియోగాలు ఎదుర్కొన్నా, శిక్షపడి జైలుకి వెళ్లినా ఎన్నికల్లో పోటీ చేయకూడదని అమెరికన్ రాజ్యాంగంలో నిబంధనలు లేవు. కానీ అలాంటి వ్యక్తిని అధ్యక్ష అభ్యర్థిని చేస్తే అనవసరంగా పార్టీ పరువు పోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేరాభియోగాలతో ట్రంప్ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయి మరో అభ్యర్థి, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్‌కు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయమైతే వినిపిస్తోంది. రాజకీయ అణచివేత: ట్రంప్ రాజకీయంగా తనను అణచివేయడానికి డెమొక్రాట్లు ఈ కుట్రకు పాల్పడ్డారని ట్రంప్ ఆరోపించారు. తనపై అభియోగాలు నమోదైన విషయం తెలిసిన వెంటనే ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఇదంతా రాజకీయ అణచివేత. దేశ చరిత్రలో ఎన్నికల పరంగా ఉన్నత స్థాయిలో జరుగుతున్న జోక్యం ఇది. రాజకీయ ప్రత్యర్థుల్ని శిక్షించడానికి న్యాయవ్యవస్థని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. నన్ను లొంగదీసుకోవడానికి డెమొక్రాట్లు అబద్ధాలు చెప్పారు. మోసాలు చేశారు. దొంగతనాలకు పాల్పడ్డారు. చివరికి ఇలాంటి అనూహ్యమైన చర్యకి దిగారు. ఒక అమాయకుడిపై అభియోగాలు నమోదు చేశారు. అధ్యక్షుడు జో బైడెన్ ఏం చెబితే మన్‌హట్టన్ జ్యూరీ అదే చేస్తోంది’’అని ట్రంప్ ఆ ప్రకటనలో విరుచుకుపడ్డారు. మరోవైపు ట్రంప్ తరఫు లాయర్లు ఆయన ఏ తప్పు చేయలేదని దీనిని న్యాయపరంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కేసు నేపథ్యం ఇదీ.. 2016 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తనతో ఉన్న లైంగిక సంబంధాలను బయటపెట్టకుండా ఉండేందుకు పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌ను డబ్బులిచ్చి ప్రలోభ పెట్టారన్న ఆరోపణలున్నాయి. అధ్యక్షుడిగా తన పరువు తీయకుండా ఉండడానికి ట్రంప్ లక్షా 30 వేల డాలర్లను అప్పట్లో తన లాయర్ మైఖేల్ కొహెన్ ద్వారా ముట్టజెప్పినట్టు డేనియల్స్ ఆరోపించారు. ఆ ఒప్పందం చెల్లదంటూ 2018లో ఆమె కోర్టుకెక్కారు. 2006 సంవత్సరంలో తనకు 27 ఏళ్ల వయసున్నప్పుడు ఒక గోల్ఫ్‌కోర్టులో ట్రంప్ పరిచయమయ్యారని, తనతో గడిపితే ఆయన నిర్వహించే రియాల్టీ షో ’ది అప్రెంటీస్’లో అవకాశం ఇస్తానని ఆశ కల్పించారని కొన్ని ఇంటర్వ్యూల్లో ఆమె చెప్పారు. ఆ తర్వాత తరచూ ఫోన్లో మాట్లాడేవారని 2007లో కలిసినప్పుడు ట్రంప్‌తో సన్నిహితంగా గడపడానికి నిరాకరించానని, అందుకే తనకు ఆ షో లో అవకాశం ఇవ్వకుండా ముఖం చాటేశారని తెలిపారు. ఈ విషయాన్ని బయట ఎక్కడా వెల్లడించవద్దని బెదిరించేవారని డేనియెల్స్ ఆరోపించారు. అయితే ట్రంప్ ఆమె ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఇప్పుడు జ్యూరీ అభియోగాలు నమోదు చేయడంతో డేనియెల్స్ తన మద్దతుదారులందరికీ ధన్యవాదాలు చెప్పారు. తనకు ఎన్నో సందేశాలు వస్తున్నా స్పందించలేకపోతున్నానని, సంబరాలు కూడా చేసుకోలేకపోతున్నానని ట్వీట్ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏపీ విద్యా వ్యవస్థ భేష్.. స్విట్జర్లాండ్ మాజీ అధ్యక్షుడు ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయని, ప్రత్యేకించి విద్యా వ్యవస్థ అద్భుతమని స్విట్జర్లాండ్ మాజీ దేశాధ్యక్షుడు ఇగ్నా జియో క్యాసిస్ కొనియాడారు. జెనీవా నగరంలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఫోరం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో విద్యా వ్యవస్థ పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. అయితే ఇండియాలోని ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. ఆ రాష్ట్రంలో పేద విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు మంచి ఫలితాలిస్తున్నాయని కొనియాడారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేశారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఉన్నాయన్నారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే సమకూర్చుతోందని, ఇది గర్వించదగ్గ విషయం అని అన్నారు. కొంత కాలం తర్వాత ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులుగా నిలుస్తారని ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ అందరి వల్లా కాదని, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి ఉన్న వారికే సాధ్యమవుతుందని చెప్పారు. ఆకట్టుకున్న ఏపీ స్టాల్ ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల స్టాల్ పలువురిని ఆకట్టుకుంది. స్వయంగా దేశాధ్యక్షుడే ఏపీ విద్యా విధానాలపై ప్రశంసలు వ్యక్తం చేయడంతో స్విట్జర్లాండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ పాట్రిసియా దన్జీ స్టాల్‌ను సందర్శించారు. ప్రభుత్వ పథకాల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఏపీలో ఎడ్యుకేషన్ కోసం నాడు–నేడులో తీసుకున్న నిర్ణయాలు, అమలవుతున్న తీరు, విద్యా ప్రమాణాలు మెరుగుదల.. తదితర విషయాలపై ఆయన ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు. డిజిటల్ లెర్నింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్‌లో భాగంగా విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్‌ల పంపిణీ, పాఠశాలల ఆధునికీకరణ, డిజిటల్ బోర్డుల ఏర్పాటు, ఆధునిక పద్ధతుల్లో విద్యా బోధన తదితర కార్యక్రమాలన్నీ పేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తాయని కొనియాడారు. ఇలాంటి సౌకర్యాలు కల్పించడంతో సమాజంలో అన్ని వర్గాల వారు విద్యనభ్యసిస్తారని చెప్పారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లో న్యూట్రిషన్ ఫుడ్ అందించడం మంచి పరిణామం అన్నారు. చదవండి: టీడీపీకి పుట్టగతులుండవని ‘ఈనాడు’ భయం లైబ్రరీ, ప్లేగ్రౌండ్స్, హైజెనిక్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్, యూనిఫాం, స్టేషనరీ కిట్స్, బుక్స్ అందిస్తున్న విధానం చాలా బాగుందన్నారు. ‘ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ యాక్సెస్ టు ఆల్’ విధానం చాలా నచ్చిందన్నారు. ఏపీ స్టాల్‌ను ఇంటర్నేషనల్ యూనిసెఫ్ ప్రోగ్రామ్స్ స్పెషలిస్ట్ అతెనా లౌబాచెర్ సందర్శించారు. గరŠల్స్ ఎడ్యుకేషన్ విధానంతో అసమానతలను రూపుమాపవచ్చని అభినందించారు. డిజిటల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా బైజూస్ ద్వారా అందిస్తున్న విద్యా విధానం నూతన పద్ధతుల్లో గొప్పగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇండియా నుండి ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యుడు వున్నవ షకిన్ కుమార్ పాల్గొన్నారు. -
ఆ పాలన నేర్పిన పాఠాలెన్నో!
అధికారాంతమున చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్ అని నానుడి. పాకిస్తాన్ సైనిక నాయకుడిగా, ఆ పైన పాలకుడిగా చక్రం తిప్పిన జనరల్ పర్వేజ్ ముషారఫ్‌కు ఇది అక్షరాలా వర్తిస్తుంది. అధికారం పోయాక పరాయి దేశానికి పలాయనమై, ఆఖరికి అరుదైన వ్యాధితో ఆదివారం నిస్సహాయంగా కన్నుమూయాల్సి వచ్చింది. సైనిక దిగ్గజాలు అయూబ్, జియాల బాటలో నడిచి, పాకిస్తాన్‌ను నేరుగా పాలించే స్థాయికి ఎదిగిన ఈ జనరల్ మూటగట్టుకున్న అప్రతిష్ఠ అపారం. ఆ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ హఠాత్తుగా స్తంభించింది ఆయన వల్లే. 1999 నాటి కుట్రలో ప్రధాని నవాజ్ షరీఫ్ నుంచి అధికారం హస్తగతం చేసుకొని, ‘ఛీఫ్ ఎగ్జిక్యూటివ్’గా, ఆ పైన సైనికాధ్యక్షుడిగా, చివరకు పౌర అధ్యక్షుడిగా తొమ్మిదేళ్ళ కాలం దేశాన్ని గుప్పెట్లో పెట్టుకొన్నారు. ఆఖరికి మెడ మీద అభిశంసన కత్తితో 2008లో అంత శక్తిమంతమైన అధినేత కూడా గద్దె దిగారు. అనేక వివాదాలు ముసిరిన ముషారఫ్ పాలన చిత్రమైన పరస్పర వైరుద్ధ్యాల గాథ. అవిభజిత భారతావనిలో ఢిల్లీలో పుట్టిన ఈ జనరల్ సైనికకుట్రకు పాల్పడినప్పుడు ప్రజా ప్రభుత్వాల అవి నీతితో విసిగిన పాక్ పౌరసమాజం సంతోషించింది. ఆ సంతోషం తొందరలోనే ఆవిరైంది. పాక్ భద్రతా పరిస్థితిని చిక్కుల్లో పడేసిన పాపం ముషారఫ్‌దే. తీవ్రవాదంపై పోరులో ఆయన ద్వంద్వ నీతి ఆ దేశాన్ని నిప్పుల కుంపటి చేస్తే, ఆ రాజకీయ దుశ్చర్యలో తానే దగ్ధమైన దుఃస్థితి. దాయాది దేశంలో మరణశిక్ష పడ్డ ఏకైక సైనిక పాలకుడనే దుష్కీర్తీ ఆయనదే. 2007లో రెండోసారి ఎమర్జెన్సీ విధించి, రాజద్రోహానికి పాల్పడ్డారన్న కారణంపై మరణశిక్ష పడింది. వైద్యచికిత్సకంటూ 2016లో దేశం విడిచి దుబాయ్ చేరి, అక్కడే స్వీయప్రవాసంలో తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ముషారఫ్ వ్యవహారమంతా ఓ నిగూఢ ప్రహేళిక. నిరంకుశ పాలన సాగిస్తూనే, ఉదారవాద సంస్కరణలూ తెచ్చారు. మీడియా వర్ధిల్లడానికి వీలు కల్పించిందీ ఆయనే. ఆనక అవి తనకు అడ్డం తిరిగాక వాటి నోరు మూయించేందుకు ప్రయత్నించి, భంగపడ్డదీ ఆయనే. 1999 మేలో సైనిక ప్రధానాధికారిగా దుందుడుకుగా కార్గిల్ యుద్ధానికి కారణమై, పాక్ పరువు తీసిందీ ఆయనే. అదే అక్టోబర్‌లో కరాచీలో తన విమానం దిగనివ్వని ప్రధాని నవాజ్ షరీఫ్‌ను సాగనంపి, ఎమర్జెన్సీ విధించి పగ్గాలు చేపట్టి, ఆనక 2001లో ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ నుంచి దేశాధ్యక్షుడై, భారత్‌తో శాంతి ప్రయత్నాలు చేసిందీ ఆయనే. ఆ మాటకొస్తే ఆయన హయాంలోనే అయిదేళ్ళు భారత్, పాక్‌ల మధ్య శాంతి నెలకొంది. చిత్రంగా ఈ సైనిక నియంత ఏలుబడిలోనే 2003–04ల్లో సియాచిన్, కశ్మీర్ వివాదం దాదాపు పరిష్కారమయ్యే దాకా వెళ్ళింది. ఆఖరున ఆ అవకాశం చేజారింది. 1999 నుంచి తొమ్మిదేళ్ళు పాక్‌ను పాలించిన శక్తిమంతమైన దేశాధినేత ముషారఫ్. అధ్యక్షుడైన కొద్దినెలలకే ‘తీవ్రవాదంపై పోరు’ అంటూ దోస్తీ చేసిన అమెరికాని సైతం బురిడీ కొట్టించిన తంత్రం ఆయనది. అల్‌ఖాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ కోసం అగ్రరాజ్యం జల్లెడ పడుతుంటే, అతణ్ణి పెరట్లోనే పెట్టుకొని కాలక్షేపం చేయగలిగారు. అలా ఇటు తీవ్రవాద విషనాగుతో, అటు 9/11 ఘటనతో తీవ్రవాదంపై శివాలెత్తుతున్న అమెరికాతో ఏకకాలంలో నెయ్యం నెరిపారు. ఈ కత్తి మీద సాము వికటించి, పాలు పోసిన పామే కాటేసింది. దేశాన్ని అమెరికాకు అమ్మేస్తున్నాడంటూ తీవ్రవాద బృందాలు రెండుసార్లు ఆయన ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాయి. దేశంలో రాజ్యాంగ వ్యవస్థను పట్టాలు తప్పేలా చేయడం సహా ఆయన ఘోర తప్పిదాలు అనేకం. రాజకీయ మనుగడ కోసం వివిధ మతతత్త్వ పార్టీలతోనూ జట్టు కట్టారు. ఆఖరికి 2006లో బలూచ్ నేత అక్బర్ ఖాన్ బుగ్తీని హతమార్చడంతో బలూచిస్తాన్‌లో దిగజారిన పరిస్థితి ఇప్పటికీ సాధారణ స్థితికి రానే లేదు. బుగ్తీ హత్యతో ఆరంభమైన ముషారఫ్ పతనం దేశ ప్రధాన న్యాయమూర్తిని పక్కకు తప్పించాలన్న విఫలయత్నంతో వేగవంతమైంది. 2008లో కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ అభిశంసనకు సిద్ధమవడంతో అవమానకరమైన రీతిలో ముందుగానే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరో మూడు నెలలకు 26/11 ముంబయ్ దాడులతో భారత్ కూడా పాఠం నేర్చుకుంది. సైనిక నియంతతోనో, సైనాధ్యక్షుడితోనో మాట్లాడినంత మాత్రాన దాయాదితో సంబంధాలు మెరుగవడానికి అన్ని వర్గాలూ కలిసొస్తాయనుకుంటే అంతకన్నా అవివేకం లేదన్న చేదు నిజం తెలిసొచ్చింది. ఇక, 2010లో ముషారఫ్ పెట్టిన ‘ఆల్ పాకిస్తాన్ ముస్లిమ్ లీగ్’ సైతం అనేక ఇతర ఏకవ్యక్తి రాజకీయ పార్టీల లానే అచిరకాలంలోనే తెర మరుగైంది. దేశ సమస్యల్ని పరిష్కరించగల సత్తా సైన్యానికే ఉందని గుడ్డిగా నమ్మిన పాక్ సైనిక నేతల్లో కడగొట్టువాడైన ముషారఫ్ కష్టాలు కొనితెచ్చారు. ఇస్లామాబాద్‌లో అధికార కేంద్రంగా ఆనాటి నుంచి సైన్యం సాగిస్తున్న ఆటకు ఇప్పటికీ తెరపడనే లేదు. ఆయన హయాంలో జరిగిన అనేక నిర్ణయాలే ఇవాళ్టికీ పాక్ రాజకీయ, ఆర్థిక, భద్రతా రంగాల ముఖచిత్రం ఇలా మిగలడానికి కారణం. నేడు రాజకీయ అనిశ్చితి, తీవ్రవాదుల ఎదురుదాడి మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తానీ పాలక శిష్టవర్గం, పౌరులు, సైన్యం ముషారఫ్ శకం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం. ఆయన తప్పొప్పులు పాకిస్తానే కాదు.. పొరుగుదేశమైన మనతో సహా ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. ఎక్కడైనా, ఎప్పుడైనా రాజకీయాల్లో సైనిక జోక్యం దుష్పరిణామాలు అంత తొందరగా ఆగవు. -
కరడుగట్టిన సైనిక నియంత.. ‘కార్గిల్’ విలన్
భారత గడ్డపై పుట్టి, కార్గిల్ యుద్ధంతో మనల్ని దొంగదెబ్బ తీసిన తెంపరి ముషారఫ్! కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ అంశంగా మార్చడానికే అందుకు తెగించినట్టు తన ఆత్మకథ ‘ఇన్ ద లైన్ ఆఫ్ ఫైర్’లో రాసుకున్నారు కూడా. నాటి ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కూడా తెలియకుండా ముషారఫ్ స్వయంగా పథక రచన చేసిన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం మిగిలింది. 1999 మే 3న మొదలైన యుద్ధం జూలై 26న ముగిసింది. భారత్ 527 మంది సైనికులను కోల్పోగా 4,000 మందికిపైగా పాక్ జవాన్లు హతమయ్యారు. ఢిల్లీలో పుట్టి... పర్వేజ్ ముషారఫ్ 1943 ఆగస్టు 11న నాటి ఉమ్మడి భారతదేశ రాజధాని ఢిల్లీలో సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. మాతృ భాష ఉర్దూ. 1947లో దేశ విభజనతో ఆయన కుటుంబం పాకిస్తాన్‌లోని కరాచీకి తరలివెళ్లింది. తండ్రి సయీద్ ముషారఫుద్దీన్ ఉద్యోగరీత్యా ముషారఫ్ 1956 దాకా టర్కీలో ఉన్నారు. తర్వాత కరాచీ, లాహోర్లలో చదువుకున్నారు. 1961లో పాకిస్తాన్ మిలటరీ అకాడమీలో చేరారు. 1964లో ఆర్టిలరీ రెజిమెంట్‌లో అడుగుపెట్టారు. 1971లో కంపెనీ కమాండర్‌గా భారత్–పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. తర్వాత సైన్యంలో అంచెలంచెలుగా ఎదిగారు. 1998లో నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ ఆయన్ను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా నియమించారు. ‘జాయింట్ చీఫ్స్ స్టాఫ్ కమిటీ’ చైర్మన్‌గా 1999 ఏప్రిల్ 9న అదనపు బాధ్యతలు సైతం అప్పగించారు. నియంత పాలన పాక్, భారత్ ప్రధాన మంత్రులు షరీఫ్, వాజ్‌పేయి మధ్య 1999 ఫిబ్రవరి 21న చరిత్రాత్మక లాహోర్ శాంతి ఒప్పందం కుదిరిన కొన్ని నెలలకే కార్గిల్ యుద్ధానికి ముషారఫ్ తెగబడ్డారు. దీనిపై ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొన్నారు. తనను తొలగించేందుకు నవాజ్ షరీఫ్ ప్రయత్నించడంతో 1999 అక్టోబర్‌లో సైనిక కుట్రతో ఆయన్ను గద్దె దింపారు. పాకిస్తాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రకటించుకుని పాలకునిగా మారారు. 2001లో దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. తొమ్మిదేళ్లపాటు పాలించారు. ఉగ్రవాదంపై యుద్ధం పేరిట అమెరికాతో చేతులు కలిపారు. మితవాద, ప్రగతిశీల ఇమేజీ కోసం ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలను నిషేధించి వాటి ఆగ్రహానికి గురయ్యారు. ముషార్రఫ్‌పై పలుమార్లు హత్యాయత్నాలూ జరిగాయి. 2008లో తప్పనిసరిగా పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తానని ప్రకటించారు. ఎన్నికల తర్వాతి పరిణామాల్లో రాజీనామా చేసి దుబాయ్ పారిపోయారు. 2013 మార్చిలో తిరిగొచ్చి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించినా అనర్హత వేటు పడింది. నవాజ్ గెలిచాక ముషార్రఫ్‌పై మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య సహా పలు కేసులు నమోదయ్యాయి. 2019లో ప్రత్యేక కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూత
బీజింగ్: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్(96) బుధవారం కన్నుమూశారు. లుకేమియాతో బాధపడుతున్న ఆయన కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. అంతర్గత అవయవాలు పూర్తిగా పనిచేయకుండా పోవడం వల్ల షాంఘైలో బుధవారం మధ్యాహ్నం 12.13 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచినట్లు జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఆయన మృతిని ప్రకటిస్తూ కమ్యూనిస్టుపార్టీ ఆఫ్ చైన్, పార్లమెంట్, మంత్రివర్గం, ఆర్మీ జారీ చేసిన ఓ లేఖను ప్రచురించింది. ‘పార్టీకి, సైన్యానికి, చైనా జాతికి జియాంగ్ జెమిన్ మరణం తీరని లోటు. ఆయన మరణం మాకు తీవ్ర వేదనను మిగిల్చింది. జెమిన్ మంచి వ్యూహకర్త, గొప్ప దౌత్యవేత్త, పార్టీ అత్యున్నత నాయకుడు.’ అని లేఖలో పేర్కొన్నారు. జెమిన్ మృతితో సంతాప దినంగా ప్రకటించారు. చైనా జాతీయ పతాకాన్ని అవనంత చేయనున్నట్లు సీసీటీవి పేర్కొంది. 1989లో తియానాన్మెన్ స్క్వేర్ ఘటన తర్వాత డెంగ్ షావోపింగ్ నుంచి జియాంగ్ జెమిన్ అధికార పగ్గాలు చేపట్టారు. అప్పటికే అంతర్జాతీయంగా చైనా పరపతి దెబ్బతిన్నది. దానిని తిరిగి గాడినపెట్టిన ఘనత జియాంగ్ జెమిన్‌కే చెందుతుంది. హాంకాంగ్‌పై పట్టు సాధించటం, 2008 ఒలింపిక్స్ బిడ్‌ను గెలుచుకోవటం, ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగస్వామి కావడం వంటి కీలక పరిణామాలు ఆయన హయాంలోనే జరిగాయి. ఇదీ చదవండి: చీటింగ్ చేస్తున్నాడనే అనుమానం.. ప్రియుడి ఇంటిని తగలెట్టిన ప్రేయసి -
మీడియా సాక్షిగా చైనా మాజీ అధ్యక్షుడి జింటావో గెంటివేత!
బీజింగ్: చైనాలో కమ్యూనిస్టు పార్టీ సదస్సు ముగింపు సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. చైనా మాజీ అధ్యక్షుడు హూ జింటావో (79)ను మీడియా సాక్షిగా హాల్ నుంచి గెంటేశారు. జిన్‌పింగ్ పక్కన ఇతర అత్యున్నత స్థాయి నేతలతో పాటు ముందు వరుసలో కూర్చుని ఉన్న ఆయనతో ఇద్దరు వచ్చి కాసేపు మాట్లాడారు. చివరికి జింటావో అయిష్టంగానే వారితో పాటు వెళ్లిపోయారు. దాంతో పార్టీ నాయకులంతా బిత్తరపోయారు. మీడియాను హాలోలోకి అనుమతించాక అందరి ముందే ఇదంతా జరగడం యాదృచ్ఛికం కాదని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 2012లో జింటావో నుంచే జిన్‌పింగ్ చైనా అధ్యక్ష పగ్గాలు స్వీకరించడం గమనార్హం! Another clip of the moments leading up to the original Hu videohttps://t.co/CkoALIH52A — Danson Cheong (@dansoncj) October 22, 2022 ఇక్కడ చదవండి: జిన్‌పింగ్ మూడోస్సారి! -
చైనా కమ్యునిస్ట్ పార్టీ ముగింపు వేడుకలో అనూహ్య ఘటన... వీడియో వైరల్
చైనాలో అధికార కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీ 20వ జాతీయ సదస్సు ఈనెల 16న అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈమేరకు శనివారం కాంగ్రెస్ పార్టీ ముగింపు వేడుకలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఐతే అనుహ్యంగా చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావో ముగింపు వేడుకుల నుంచి నిష్క్రమించి బయటకు వచ్చేశారు. అకస్మాత్తుగా హు జింటావో పైకి లేచి సెక్యూరిటీ సాయంతో బయటకు వెళ్లిపోవడంతో అక్కడున్నవారంతా షాక్‌తో అయోమయంగా చూస్తుండిపోయారు. అదీగాక ఆయన గత ఆదివారం కాంగ్రెస్ పార్టీ సదస్సు ప్రారంభ వేడుకలో కూడా కాస్త అస్వస్థతకు గురైనట్లు కనిపించారు. ఇదిలా ఉండగా..ఐదేళ్లకు ఒకసారి జరిగే కాంగ్రెస్ పార్టీ సదస్సు రాజ్యంగ సవరణలతో ముగిసింది. ఆ సదస్సులో తన పార్టీ రాజ్యంగ సవరణలో తైవాన్ స్వాతంత్య్రాన్ని అడ్డుకోవడం వ్యతిరేకించటంవంటి తీర్మానాన్ని ప్రధానంగా పొందుపరిచింది. అంతేగాదు ఆ సమావేశంలో ముచ్చటగా మూడోసారి జిన్‌పింగ్‌కి అధికారం కట్టబట్టేందుకు పార్టీ సిద్దమైంది కూడా. ఈ మేరకు పార్టీ సెంట్రల్ కమీటీ తోపాటు పార్టీ సభ్యులందరూ ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఐతే ఈ ముగింపు వేడుకలో మాజీ అధ్యక్షుడు హు జుంటావో నిష్క్రమించడం అందర్నీ షాక్‌కి గురి చేసింది Drama in China as former president Hu Jintao is escorted out of the closing ceremony pic.twitter.com/AzsqUJWuFx — Dan Banik (@danbanik) October 22, 2022 (చదవండి: జిన్‌పింగ్‌కు మూడోసారి పట్టం) -
2024 ఎన్నికల్లో పోటీ చేస్తా
న్యూజెర్సీ: అగ్రరాజ్యం అమెరికాలో 2024లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీచేస్తానన్న సంకేతాలను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. తాను పోటీలో ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, ఎన్నికల్లో కచ్చితంగా ముందంజలో నిలుస్తానని అన్నారు. ఆయన తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. తన పాలనలో భారత్‌తో దృఢమైన సంబంధాలు ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. భారత్‌కు తనకంటే అమెరికా అధ్యక్షుడిగా గొప్ప మిత్రుడు గతంలో ఎన్నడూ దొరకలేదని వ్యాఖ్యానించారు. ఈ విషయం ప్రధాని మోదీని అడిగితే బాగా తెలుస్తుందని అన్నారు. ఇండియాతో, నరేంద్ర మోదీతో తనకు చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని చెప్పారు. మోదీతో తనకు చాలాకాలంగా పరిచయం ఉందని.. మోదీ, తాను మంచి స్నేహితులమని పేర్కొన్నారు. ఆయన గొప్ప వ్యక్తి, ప్రధానిగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. నిజానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం అంత సులభం కాదని పేర్కొన్నారు. అమెరికాలోని భారతీయ సమాజం తనకు అండగా నిలుస్తోందని డొనాల్డ్ ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. -
శ్రీలంకకు తిరిగొచ్చిన ‘గొటబయ’.. ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం!
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయేందుకు కారణమై, ప్రజాగ్రహంతో దేశం విడిచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స స్వదేశం తిరిగివచ్చారు. ఈ ఏడాది జూలై 13న దేశం విడిచి మాల్దీవులకు వెళ్లారు. అక్కడి నుంచి సింగపూర్ పారిపోయిన గొటబయ సుమారు ఏడు వారాల తర్వాత శనివారం తెల్లవారుజామున దేశంలో అడుగుపెట్టారు. బ్యాంకాక్ నుంచి వయా సింగపూర్ మీదుగా కొలంబోలోని బందారనాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి శనివారం వచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ సందర్భంగా ఆయన పార్టీకి చెందిన పలువురు చట్టసభ్యులు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని స్వాగతం పలికారు. భారీ భద్రత నడుమ ఎయిర్పోర్ట్ నుంచి మాజీ అధ్యక్షుడిగా ఆయనకు కేటాయించిన ప్రభుత్వ అధీనంలోని భవనానికి చేరుకున్నారు గొటబయ. 2019లో శ్రీలంక అధ్యక్ష పదవిని చేపట్టారు గొటబయ రాజపక్స. అయితే, దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తటంతో ప్రజలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలు తీవ్రమవటం వల్ల జులై 9న అధ్యక్ష భవనం నుంచి పరారయ్యారు. నాలుగు రోజుల తర్వాత మిలిటరీ జెట్‌లో మాల్దీవులకు వెళ్లారు. అక్కడి నుంచి సింగపూర్ చేరుకున్నారు. తర్వాత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రెండు వారాలకు దౌత్య వీసా ద్వారా థాయిలాండ్‌కు వెళ్లారు. ఇదీ చదవండి: అమెరికాలో సెటిల్ కావడానికి ప్లాన్ చేసిన గొటబయా రాజపక్స! -
అమెరికాలో సెటిల్ కావడానికి ప్లాన్ చేసిన గొటబయా రాజపక్స!
కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయా రాజపక్స అమెరికాలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. యూఎస్ గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారని శ్రీలంక పత్రిక డైలీ మిర్రర్ వెల్లడించింది. గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి గొట బయా అర్హుడే. ఎందుకంటే ఆయన భార్య రోమా కు అమెరికా పౌరసత్వం ఉంది. భార్య, కుమారుడితో కలిసి అమెరికాలో స్థిరపడాలని గొటబయా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఓ హోటల్లో భార్యతో కలిసి ఉంటున్నారు. ఈ నెల 25న శ్రీలంకకు తిరిగివచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది నవంబర్ వరకూ థాయ్లాండ్లోనే ఉండిపోవాలని తొలుత అనుకున్నప్పటికీ స్వదేశానికి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
ప్లీజ్ గోటబయను అక్కడే ఉండనివ్వండి... అభ్యర్థించిన శ్రీలంక
కొలంబో: శ్రీలంకలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభానికి కారణం గోటబయే నంటూ నిరసనకారులు ఆయన అధికార నివాసాన్ని చుట్టుముట్టడంతో ఆయన మాల్దీవులకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఐతే మాల్దీవులో కూడా శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు నిరసన సెగ తగలడంతో పలాయనం చిత్తగించక తప్పలేదు. దీంతో ఆయన గత నెల జులై 14 నుంచి సింగపూర్‌లో 14 రోజుల పర్యాటక వీసాపై అక్కడే ఉంటున్నారు. ఐతే ఆ వీసా గడువు ఆగస్టు 11తో ముగియనుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం రాజపక్సను మరో 14 రోజులు అక్కడే ఉండనివ్వండి అంటూ సింగపూర్ అధికారులను అభ్యర్థించినట్లు సమాచారం. దీంతో ఆయన మరికొన్ని రోజులు సింగపూర్‌లోనే గడపనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు గోటబయ జులై 15న రాజీనామ చేసినట్లు శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ మహింద అబేవర్ధన బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన దేశాన్ని వదిలి పారిపోయిన తదుపరి గోటబయ స్థానంలో ఆయన పార్టీ ఆశీస్సులతోనే రణిల్ విక్రమసింఘే శ్రీలంక కొత్త అధక్ష్యుడిగా ఎన్నికయ్యారు. (చదవండి: వేగంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు...లాక్డౌన్ దిశగా అడుగులు) -
‘కోవిడ్ కూడా ముంచింది’
కొలంబో: శ్రీలంక సంక్షోభానికి ఇతర అంశాలతో పాటు కోవిడ్ మహమ్మారి కూడా ఒక‡ కారణమని మాజీ అధ్యక్షుడు గొటబయా రాజపక్స చెప్పారు. కోవిడ్ వల్ల దేశం చాలా నష్టపోయిందని తాను పంపిన రాజీనామా లేఖలో నిందించారు. కోవిడ్ కారణంగా లాక్డౌన్లు విధించడంతో దేశం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిందన్నారు. సంక్షోభం నుంచి దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించేందుకు తన శాయశక్తులా కృషిచేశానన్నారు. సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి అన్ని పార్టీలతో కూడిన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎంతో ప్రయత్నం చేశానని తెలిపారు. రాజపక్స రాసిన ఆ లేఖను శనివారం పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో సెక్రటరీ జనరల్ ధామ్మిక దస్సనాయకే చదివి వినిపించారు. పార్టీ నాయకుల ఆకాంక్ష మేరకే తాను రాజీనామా చేశానని, భవిష్యత్‌లో దేశానికి ఉత్తమ సేవలు అందించాలని అనుకుంటున్నానని రాజపక్స ఆ లేఖలో రాశారు. తదుపరి అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ షురూ నూతన దేశాధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను పార్లమెంటు ప్రారంభించింది. జూలై 20న జరగబోయే అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన అధికారిక ప్రక్రియను ప్రారంభించడానికి పార్లమెంట్ శనివారం సమావేశమైంది. సమావేశంలో పార్లమెంటు అధ్యక్ష పదవికి ఎన్నికలు 20న జరుగుతాయని, 19న నామినేషన్లు తనకు సమర్పించాలని దస్సనాయకే అన్నారు. ఎక్కువ మంది బరిలో ఉంటే 20న సభలో ఓటింగ్ ఉంటుంది. అధికార పార్టీ తరఫున తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న రణిల్ విక్రమసింఘె, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సజిత ప్రేమదాస, జేవీపీ నాయకుడు అనుర కుమార దిస్సనాయకె, అధికార ఎస్ఎల్పీపీ చీలికపక్షం నాయకుడు దల్లాస్ అలహప్పెరుమ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. శ్రీలంక జనాభాలో 28శాతం అంటే 60 లక్షల మందికిపైగా ఆహార కొరతని ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వెల్లడించింది. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారనున్నాయని హెచ్చరించింది. ఆహారం, మందులు, వంట గ్యాస్, పెట్రోల్ చివరికి టాయిలెట్ పేపర్ దిగుమతి చేసుకోలేని పరిస్థితుల్లోకి దేశం వెళ్లిపోయిందని యూఎన్ తెలిపింది. -
ట్రంప్ సోషల్ మీడియా యాప్ ఆరంభం
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సామాజిక మాధ్యమ యాప్ ‘ ట్రూత్ సోషల్’ సోమవారం ప్రారంభమైంది. గతంలో ట్రంప్ విద్వేష పోస్టులు చేస్తున్నారంటూ ప్రఖ్యాత సామాజిక మాధ్యమాలు ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్‌లు ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలను నిషేధించడం తెల్సిందే. దీంతో తన మద్దతుదారులకు సొంత సోషల్ మీడియా యాప్ ద్వారా చేరువవుతానని ట్రంప్ గతంలో ప్రకటించాడు. ఈ నేపథ్యంలో యాపిల్ యాప్ స్టోర్‌లో ట్రూత్ సోషల్ అందుబాటులోకి వచి్చంది. గతంలోనే కోరుకున్న వారికి తాజాగా యాప్ సబ్‌స్రై్కబ్ సౌకర్యం కల్పించారు. కొత్త వారికి మరో 10 రోజుల్లో అవకాశమిస్తారు. అయితే, యాప్ ప్రారంభమైన కొద్ది సేపటికే లాగిన్ చిక్కులొచ్చాయి. వచ్చే నెలదాకా సమస్య తీరదని వార్తలొచ్చాయి. ఈ యాప్ కోసం సోషల్‌మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉండటంతో యాపిల్ ర్యాంకింగ్స్ ప్రకారం సోమవారం అమెరికాలో టాప్ ఫ్రీ యాప్ జాబితాలో ఈ యాప్ అగ్రస్థానంలో నిలిచింది. -
ఎన్నికల్లో అధిక ఖర్చు: సర్కోజీని దోషిగా తేల్చిన కోర్టు
పారిస్: ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీని ఆ దేశంలోని ఓ కోర్టు దోషిగా తేల్చింది. ఎన్నికల ప్రచారంలో నిర్ణయించిన మొత్తం కన్నా ఎక్కువ మొత్తం ఖర్చు చేయడం ద్వారా ఆయన నేరానికి పాల్పడినట్లు తేల్చింది. శిక్షగా ఏడాదిపాటు గృహ నిర్బంధంలోనే ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. ఎల్రక్టానిక్ మానిటరింగ్ బ్రేస్లెట్ ధరించి ఇంట్లో ఉండాలని తీర్పు చెప్పింది. ఈ శిక్షను ఆయన తిరిగి అప్పీల్ చేసే అవకాశం ఉంది. 2007 నుంచి 2012 వరకు అధ్యక్షుడిగా పని చేసిన సర్కోజీ, 2012 ఎన్నికల్లో నిర్ణయించిన ఆర్థిక మొత్తం కన్నా రెండింతలు ఎక్కువ ఖర్చు చేశారని కోర్టు తేలి్చంది. -
లొంగిపోయిన జాకబ్ జుమా
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా తాజాగా అధికారుల ఎదుట లొంగిపోయారు. అరెస్టు చేయడానికి న్యాయస్థానం విధించిన డెడ్‌లైన్‌కు కొన్ని నిమిషాల ముందు లొంగుబాటు ప్రక్రియ ముగిసింది. ఆయన 2009 నుంచి 2019 వరకూ దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా పనిచేశారు. పదవీ కాలంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. జాకబ్ జుమాకు వ్యతిరేకంగా ఫిర్యాదు అందడంతో కేసులు నమోదయ్యాయి. విచారణ కమిషన్ ముందు హాజరు కావాలని దక్షిణాఫ్రికా రాజ్యాంగ న్యాయస్థానం ఆదేశించగా, ఆయన అందుకు నిరాకరించారు. దీంతో కోర్టు ధిక్కరణ కింద జుమాకు న్యాయమూర్తి 15 నెలల జైలు శిక్ష విధించారు. బుధవారం అర్ధరాత్రి లోగా లొంగిపోవాలని ఆదేశించారు. లేకపోతే అరెస్టు తప్పదని స్పష్టం చేశారు. దీంతో చేసేదిలేక జాకబ్ జుమా లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత పోలీసు అధికారులు తనపట్ల అనుచితంగా ప్రవర్తించారని జుమా ఆరోపించారు. జుమాకు జైలు శిక్ష విధిస్తూ రాజ్యాంగ న్యాయస్థానం ఇచ్చిన తీర్పునుసవాలు చేస్తూ ఆయన తరపు న్యాయవాదులు గురువారం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. అయితే, హైకోర్టులో జుమాకు ఉశపమనం దక్కే అవకాశాలు తక్కువేనని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
బ్లాటర్పై మళ్లీ నిషేధం
జ్యూరిక్ (స్విట్జర్లాండ్): అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్పై మళ్లీ నిషేధం విధించారు. జరిమానా కూడా కట్టమన్నారు. తన పరిపాలన దక్షతతో ‘ఫిఫా’ను ఆర్థిక పరిపుష్టి చేసిన బ్లాటర్ అదే సమయంలో స్వామి కార్యాన్ని, స్వకార్యాన్ని నెరవేర్చుకునే పనిలో ఆర్థిక అవకతవకలు చేశారు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. దీనిపై విమర్శలు వెలువెత్తడంతో దర్యాప్తు చేసిన ‘ఫిఫా’ ఎథిక్స్ కమిటీ అధికార దుర్వినియోగం, ఆర్థిక అవకతవకలు నిజమేనని తేల్చింది. దీంతో గతంలోనే ఆరేళ్ల నిషేధం విధించారు. ఇదింకా ముగియనే లేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో గత నిషేధం పూర్తవుతుంది. దీనికి ఏడు నెలల ముందే 85 ఏళ్ల మాజీ అధ్యక్షుడిపై మరో దఫా నిషేధాన్ని విధిస్తున్నట్లు ‘ఫిఫా’ బుధవారం ప్రకటించింది. అలాగే 10 లక్షల స్విస్ ఫ్రాంక్స్ (రూ. 7 కోట్ల 75 లక్షలు) జరిమానా కూడా విధించింది. గత డిసెంబర్లో బ్లాటర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించి కోమాలోకి వెళ్లిపోయారు. ఇటీవలే కాస్త కుదుటపడి కోమా నుంచి బయటపడినప్పటికీ నిషేధం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. ఈ అవకతవకల్లో భాగమైన ‘ఫిఫా’ మాజీ కార్యదర్శి వాల్కేపై 2025 అక్టోబర్ వరకు నిషేధం ఉంది. ఆయనపై ఏకంగా పదేళ్ల నిషేధం విధించారు. -
ట్రంప్ అభిశంసనపై విచారణ మొదలు
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక మాజీ అధ్యక్షుడి అభిశంసనపై సెనేట్‌లో విచారణ మొదలైంది. ట్రంప్‌పై విచారణ అర్ధరహితం అంటూ రిపబ్లికన్ పార్టీ చేసిన వాదన ఓటింగ్‌లో వీగిపోయింది. ట్రంప్‌పై అభిశంసన విచారణ రాజ్యాంగబద్ధమేనంటూ సెనేట్ 56–44 ఓట్ల తేడాతో విచారణకు ఓకే చెప్పింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు విచారణకు మద్దతు పలికారు. క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి ఘటనలో ట్రంప్‌ని ముద్దాయిగా తేల్చడం, అలాంటి వ్యక్తికి రిపబ్లికన్లు కొమ్ము కాస్తున్నారని ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసమే డెమొక్రాట్లు అభిశంసన తీర్మానంపై విచారణకు పట్టుపట్టారు. దీంతో రెండోసారి అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడిగా, పదవి నుంచి దిగిపోయాక అభిశంసన ఎదుర్కొన్న వ్యక్తిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోతారు. అభిశంసన తీర్మానం సెనేట్‌లో నెగ్గే అవకాశం లేదు. సెనేట్‌లో రెండింట మూడు వంతుల మెజార్టీ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తేనే తీర్మానం పాస్ అవుతుంది. అంటే 100 మంది సభ్యులున్న సభలో 67 మంది ఓట్లు వెయ్యాలి. రెండు పార్టీలకూ చెరి 50 మంది సభ్యుల బలం ఉంది. మరో ఆరుగురు రిపబ్లికన్లు అభిశంసనకు అనుకూలంగా ఉండడంతో 56 మంది అవుతారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే సభ చైర్మన్ కమలా హ్యారిస్ తన ఓటు వినియోగించుకుంటారు. ఏది ఏమైనా 67 మంది సభ్యుల మద్దతు లభించే అవకాశాలైతే లేవు. క్యాపిటల్ భవనం దాడి వీడియోలే ఆయుధం క్యాపిటల్‌పై దాడిని ట్రంప్ ప్రోత్సహించారన్న అభియోగాలపైనే అభిశంసన ప్రక్రియ కొనసాగుతుంది. సంబంధిత వీడియోలను వినియోగించాలని డెమొక్రాట్లు వ్యూహరచన చేస్తున్నారు. ఈ విచారణ సందర్భంగా ట్రంప్ ఆందోళనకారుల్ని ఎలా రెచ్చగొట్టారో వీడియోల ద్వారా సభ సాక్షిగా నిరూపించడానికి సభ్యులు కసరత్తు చేస్తున్నారు. ఈ దాడికి సంబంధించి ట్రంప్‌ని బోనులు పెట్టడమే లక్ష్యంగా తాము ముందుకు వెళతామని సెనేట్‌లో ఇంపీచ్మెంట్ మేనేజర్ జామీ రాస్కిన్ చెప్పారు. అభిశంసనపై వాదనలు వినిపించుకోవడానికి ఇరుపక్షాలకు 16 గంటల చొప్పున సమయం కేటాయిస్తారు. అనంతరం సెనేట్ సభ్యులకు ఇరుపక్షాల్ని ప్రశ్నించడానికి నాలుగు గంటల సమయం కేటాయిస్తారు. అది పూర్తయి చర్చలు జరిగాక అభిశంసనపై ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. ట్రంప్ అభిశంసనపై మాట్లాడుతున్న హౌజ్ ఇంపీచ్మెంట్ మేనేజర్ జేమీ రస్కిన్ -
అపరిపక్వత, సౌందర్యం, చిత్తశుద్ధి!
బరాక్ ఒబామా... అమెరికా మాజీ అధ్యక్షుడిగా, మాజీ సైనికుడిగా మనందరికీ చిరపరిచితమైన పేరిది. రచయితగా ఆయన గురించి తెలిసింది కొంతే. కానీ...‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’పేరుతో ఒబామా ఈ కొరతను తీర్చేశారు. 17న విడుదల కానున్న ఈ పుస్తకంలో అగ్రరాజ్యానికి తొలి నల్లజాతి అధ్యక్షుడిగా తన అనుభవాలను దేశాధినేతలు, రాజకీయ పార్టీల నాయకులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. లోతైన అధ్యయనం.. క్లుప్తత... కాసింత హాస్యం కలబోసి ఆయన ఎవరి గురించి ఏమన్నారంటే..? ధైర్యం లేని, అపరిపక్వమైన నాణ్యత! కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గాంధీ వంశ వారసుడు రాహుల్ గాంధీని బరాక్ ఒబామా అధైర్యంతో కూడిన, అపరిపక్వమైన నాణ్యత కలిగిన నాయకుడిగా తన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో వర్ణించారు. ఇదే అంశాన్ని ఇంకాస్త వివరిస్తూ.. ‘‘రాహుల్‌గాంధీ ఓ విద్యార్థి అనుకుంటే... చదవాల్సిందంతా చదివి టీచర్ దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్న వాడిలా కనిపిస్తాడు. కానీ.. చదివిన విషయంపై పట్టు సాధించాలన్న అభిరుచి, మోహం రెండింటిలో ఏదో ఒకటి లోపించినట్లు అనిపిస్తుంది’’అని వ్యాఖ్యానించారు. అందం ఆమె సొంతం ‘‘చార్లీ క్రైస్ట్, రామ్ ఎమ్మాన్యుల్ వంటి మగవాళ్ల అందం గురించి అందరూ చెబుతూంటారు. మహిళల సౌందర్యం గురించి మాత్రం వాళ్లూ వీళ్లు చెప్పేది తక్కువే. ఒకట్రెండు సందర్భాలను మినహాయిస్తే సోనియాగాంధీ విషయంలోనూ ఇదే జరిగింది.’’అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా..కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురించి చేసిన వ్యాఖ్య ఇది. నిష్పాక్షికత..చిత్తశుద్ధి దేశంలో ఆర్థిక సరళీకరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తిగా.. పదేళ్లపాటు దేశ ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్‌ను బరాక్ ఒబామా అమెరికా రక్షణ శాఖ మాజీ మంత్రి రాబర్ట్ గేట్స్‌తో పోల్చారు. ఇద్దరూ దయతో కూడిన నిష్పాక్షికత కలిగిన వారని, వారి చిత్తశుద్ధి, సమగ్రతలూ ఎన్నదగ్గ లక్షణాలని కొనియాడారు. కండల వీరుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనకు కండల వీరుడిని గుర్తుకు తెస్తాడని ఆయన శరీరాకృతి అద్భుతమని ఒబామా వ్యాఖ్యానించారు. షికాగో రాజకీయాల్లోని తెలివైన రాజకీయ నేతల మాదిరిగా పుతిన్ వ్యవహారం ఉంటుందని ఒబామా వర్ణించారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రష్యాతో సంబంధాలు అంత గొప్పగా లేకపోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. కొన్నిసార్లు కష్టమే అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ గురించి మాజీ అధ్యక్షుడు, సహచర డెమోక్రాట్ అయిన బరాక్ ఒబామా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బైడెన్ మంచి మనిషి, నిజాయితీ కలవాడు అంటూనే.. కొన్నిసార్లు తనకు కావాల్సింది దక్కలేదు అనుకుంటే ఇబ్బందికరంగా మారగలగడని అన్నారు. తనకంటే తక్కువ వయసున్న బాస్‌తో (ఒబామా) వ్యవహరించేటప్పుడు ఈ నైజం మరింత ఎక్కువవుతుందని అన్నారు. ఒబామా అధ్యక్షుడిగా ఉండగా బైడెన్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. వైట్‌హౌస్‌లో నల్లవాడిని చూసి భయపడ్డారు అమెరికా అధ్యక్షుడిగా ఓ నల్లజాతీయుడు వైట్‌హౌ స్లో అడుగుపెట్టడం లక్షల మంది శ్వేతజాతీయుల కు భీతి కలిగించిందని, వీళ్లంతా రిపబ్లికన్ పార్టీలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న దుష్టశక్తులని ఒబామా తన పుస్తకంలో తెలిపారు. నల్లజాతీయుడి గా తనను వ్యతిరేకించిన వారు జినోఫోబియా (ఇతర జాతీయులపై తీవ్రమైన భయం)తో బాధపడే వారేనని, మేధావితనం అన్నా వీరికి అంతగా నచ్చదని, నిత్యం కుట్ర సిద్ధాంతాలను పట్టుకు వేళ్లాడేవారు, నల్లజాతి వారు ఇతరులపై ద్వేషం ఉన్న వారు తనను వైట్‌హౌస్‌లో ఓర్వలేక పోయారని ఒబామా వివరించారు. ఇలాంటి వారందరికీ డొనాల్డ్ ట్రంప్ అమృతాన్ని అందిస్తాన ని హామీ ఇచ్చి గద్దెనెక్కారని విమర్శించా రు. డొనాల్డ్ ట్రంప్ పదవి నుంచి వైదొలగినా అమెరికా రాజకీయాల్లోని విభేదాల అగాధాన్ని పూడ్చలేవని ఒబామా వ్యాఖ్యానించారు. అమెరికా అంటే ఏమిటి? అది ఎలా ఉండాలన్న భావనల విషయం లో మౌలికంగా ఉన్న అభిప్రాయ భేదాలు ఈ సంక్లిష్టపరిస్థితికి కారణమని.. దీనివల్ల ప్రజాస్వా మ్య వ్యవస్థ కూడా సంక్షోభంలో పడినట్లు కనిపిస్తోందని ఒబామా ప్రస్తుత రాజకీయ పరిస్థితి ని విశ్లేషించారు. రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఇద్దరూ ఒకప్పుడు నమ్మకముంచిన వ్యవస్థలు, విలువలు, ప్రక్రియలపై నమ్మకం కోల్పోయేలా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమిలీ ముఖంలో ఏమీ కనిపించేది కాదు ఎన్నికల ప్రచారంలో భాగంగా అయోవాలోని తన సిబ్బందిలో ఒకరైన ఎమిలీ గురించి ఒబామా వ్యాఖ్యానిస్తూ... ‘‘ఎమిలీ ముందు నా వాక్చాతుర్యం, విమర్శలు మొత్తం కుప్పకూలిపోయేవి. కనురెప్ప వేయకుండా.. ఏ రకమైన భావం కనిపించకుండా ఎమిలీ చూపులు ఉండేవి. ఇక లాభం లేదనుకుని ఆమె ఏం చెబితే అది చేసేందుకు ప్రయత్నించేవాడిని’’అన్నారు. అంతేకాదు.. అలాస్కా గవర్నర్, రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన సారా పాలిన్ ప్రభుత్వ పాలనకు సంబంధించి ఏం మాట్లాడేదో తనకు అస్సలు అర్థమయ్యేది కాదని ఒబామా వ్యాఖ్యానించారు. వైవాహిక జీవితంపై.. అధ్యక్షుడిగా తనపై అందరి దృష్టి ఉండటం..పదవి తాలూకూ ఒత్తిడి, విపరీతమైన భద్రత భార్య మిషెల్ ఒబామాకు నిస్పృహ కలిగించేదని బరాక్ ఒబామా తన పుస్తకంలో రాసుకున్నారు. తాము వైట్‌హౌస్ నాలుగు గోడల మధ్య బందీ అయిపోయామన్న భావన మిషెల్లో కనిపించేదని తెలిపారు. ‘‘జీవితంలో మిషెల్ ఎన్ని విజయాలు సాధించినా, ప్రాచుర్యం పొందినప్పటికీ ఆమెలో ఏదో తెలియని ఒక టెన్షన్ కనిపించేది. కంటికి కనిపించని యంత్రపు రొదలా ఉండేది ఆ టెన్షన్. రోజంతా పనిలో నిమగ్నమైన నా గురించో... కుటుంబం మొత్తమ్మీద వస్తున్న రాజకీయ విమర్శలో, కుటుంబ సభ్యులు కూడా తనకు రెండో ప్రాధాన్యత ఇస్తున్నారన్న భావనో ఉండేది’’ అని వివరించారు. ఎ ప్రామిస్డ్ ల్యాండ్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (2009 – 2017) రాసుకున్న జ్ఞాపకాల దొంతర ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో తన బాల్యంతోపాటు రాజకీయంగా ఎదిగిన వైనం వంటి పలు అంశాలు ఉన్నాయి. 2008లో అధ్యక్ష పదవి కోసం నడిపిన చారిత్రక ఎన్నికల ప్రచారం వివరాలు, అధ్యక్షుడిగా తన అనుభవాలను ఈ 768 పేజీల పుస్తకంలో పొందుపరిచారు. అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఒబామా ప్రస్థానాన్ని రెండు భాగాలుగా ప్రచురించనుంది. తొలి భాగమైన ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ నవంబర్ 17న విడుదల కానుంది. రెండో భాగం ప్రచురణ సమయం నిర్ణయించాల్సి ఉంది. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామాల పుస్తకాల కోసం దాదాపు రూ.485 కోట్లు చెల్లించినట్లు సమాచారం. వైట్‌హౌస్‌లో తన అనుభవాలన్నింటినీ మిషెల్ ఇప్పటికే ‘బికమింగ్’పేరుతో ప్రచురితమైన పుస్తకంలో వెల్లడించారు. మైక్రోఫోన్, జాక్స్ లేని ఫోన్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడిగా తనకు ఒకసారి బ్లాక్‌బెర్రీ ఫోన్ ఇచ్చారని, కానీ అందులో మైక్రోఫోన్, హెడ్‌ఫోన్ జాక్స్ రెండింటిని తొలగించిన తరువాతే తనకు ఇచ్చారని ఒబామా ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో తెలిపారు. ఆ ఫోన్ ద్వారా తాను భద్రతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అనుమతించిన 20 మందితో మాట్లాడే సౌకర్యం ఉండేదని వివరించారు. మైక్రోఫోన్, హెడ్‌ఫోన్ జాక్స్ రెండూ లేకపోవడంతో పసిపిల్లలకు ఇచ్చే డమ్మీఫోన్ మాదిరిగా ఉండేదని సరదాగా వ్యాఖ్యానించారు. – సాక్షి, హైదరాబాద్ -
బైడెన్ కోసం బరాక్ ప్రచారం
మకాన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చేవారం డెమొక్రాట్ అభ్యర్థి జోబైడెన్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. పెన్సిల్వేనియా, ఫిలిడెల్ఫియాల్లో ఈనెల 21న బైడెన్, కమలా హారిస్ తరఫున ఒబామా ప్రచారం సాగిస్తారని బైడెన్ ప్రచార బృందం ప్రకటించింది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న రెండు మార్లు బైడెన్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో ఒబామా నేరుగా ప్రచారానికి రావడం ఇదే తొలిసారి. ఎన్నికల ర్యాలీల్లో ప్రజలను పెద్దపెట్టున ఆకర్షించే సత్తా డెమొక్రాట్లలో ఒబామాకే ఉందని పరిశీలకుల అంచనా. తన కారణంగా బైడెన్‌కు బ్లాక్ అమెరికన్లు, తటస్థుల మద్దతు పెరగవచ్చని భావిస్తున్నారు. అమెరికన్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని ఒబామా ఇటీవల పిలుపునిచ్చారు. కరోనాపై ట్రంప్ నిర్లక్ష్యాన్ని ఒబామా గతంలో నిశితంగా విమర్శించారు. -
అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య మాజీ అధ్యక్షుడికి రెండేళ్ల జైలు
పారిస్: అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) మాజీ అధ్యక్షుడు లామినే డియాక్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. రష్యా డోపీలను నిషేధించకుండా పోటీల్లో పాల్గొనేలా అవినీతికి పాల్పడటంతో పారిస్ కోర్టు 87 ఏళ్ల డియాక్‌ను దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసింది. సెనెగల్ దేశానికి చెందిన ఆయన 1999 నుంచి 2015 వరకు సుదీర్ఘకాలం పాటు ఐఏఏఎఫ్‌లోనే అత్యంత ప్రభావవంతమైన అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారించిన కోర్టు జైలుశిక్షతోపాటు 5 లక్షల యూరోలు (రూ. 4 కోట్ల 34 లక్షలు) జరిమానా కూడా విధించింది. శిక్ష ఖరారు చేస్తున్న సమయంలో డియాక్ కోర్టులోనే ఉన్నారు. ఆయన అవకతవకలు, అవినీతి ఉదంతాలపై ఈ శిక్షను విధిస్తున్నట్లు మహిళా న్యాయమూర్తి తీర్పును చదివి వినిపించారు. రష్యా డోపీలకు ఉద్దేశపూర్వకంగానే అండదండలు అందించినట్లు కోర్టు తేల్చిందని ఆమె చెప్పారు. -
ప్రణబ్‌కు ప్రముఖుల నివాళి
‘‘ప్రణబ్ ముఖర్జీ ఒక దిగ్గజం. మాతృదేశానికి యోగిలాగా సేవ చేశారు. భరతమాత ప్రియతమ పుత్రుడి మరణానికి దేశమంతా దుఃఖిస్తోంది. ఆధునికతను, సాంప్రదాయంతో మేళవించిన మనీషి భారత రత్న ప్రణబ్. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.’’ – రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ ‘‘దేశం ఒక పెద్దమనిషిని కోల్పోయింది. కష్టించే గుణం, క్రమశిక్షణ, అంకితభావంతో ఆయన కిందిస్థాయి నుంచి దేశంలో రాజ్యాంగబద్ధమైన అత్యున్నత స్ధాయికి ఎదిగారు. సుదీర్ఘ ప్రజాసేవలో ఆయన నిర్వహించిన ప్రతిపనికీ గౌరవం తెచ్చారు. ఓం శాంతి.’’ – ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘‘2014లో ఢిల్లీకి నేను వచ్చినప్పటినుంచి ప్రణబ్ దార్శనికత, ఆయన ఆశీస్సులు నాకు మద్దతుగా నిలిచాయి. ఆయనతో అనుబంధం ఎప్పటికీ గుర్తుంటుంది. రాష్ట్రపతి భవన్‌ను వైజ్ఞానిక, శాస్త్రీయ, సాంస్కృతిక కేంద్రంగా ఆయన మార్చారు. కీలక విధాన నిర్ణయాల్లో ఆయన సలహాలను ఎన్నటికీ మరువలేను. దేశ అభివృద్ధి పథంలో ఆయన ముద్ర స్పష్టంగా ఉంటుంది. ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా ఆయన్ని అన్ని రాజకీయ పక్షాలు గౌరవించేవి. సమాజంలో అన్ని వర్గాల అభిమానం చూరగొన్న వ్యక్తి భారతరత్న ప్రణబ్’’ – ప్రధాని నరేంద్ర మోదీ ‘‘ప్రణబ్ చేపట్టిన అన్ని పదవులకు వన్నె తెచ్చారు. అన్ని రాజకీయ పక్షాలనేతలతో సుహృద్భావనతో మెలిగేవారు. అంకితభావంతో దేశానికి సేవ చేశారు. ఐదుదశాబ్దాలుగా అటు దేశం, ఇటు కాంగ్రెస్ పార్టీ పయనంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన లేని లోటు తీర్చలేదని, ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలు ఎంతో అమూల్యమైనవి.’’ – కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ‘‘ప్రణబ్ లేరన్న వార్త తీవ్ర విచారం కలిగించింది. ఆయన మరణంతో స్వతంత్ర భారతావనికి చెందిన ఒక గొప్పనాయకుడిని దేశం కోల్పోయింది. ఆయనతో కలిసి ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది. ఆ సమయంలో ఆయన మేధస్సు, విజ్ఞానం, వివిధ ప్రజా విషయాలపై ఆయన అనుభవం నుంచి ఎంతో నేర్చుకున్నాను.’’ – మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ‘‘ప్రణబ్ ముఖర్జీ మృతి తీవ్ర వేదన కలిగిస్తోంది. అంకిత భావంతో దేశానికి సేవ చేసిన అనుభవజ్ఞుడు. ఆయన సుదీర్ఘ ప్రజా జీవిత ప్రయాణం దేశానికే గర్వకారణం. దేశ రాజకీయ యవనికపై ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఓం శాంతి.’’ – హోం మంత్రి అమిత్‌షా ‘‘ భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం బాధాకరం. దేశానికి ఆయన అనేక రూపాల్లో అంకితభావంతో సేవలనందించారు. అన్నిపార్టీలు ఆయన మేధస్సును గౌరవించేవి.’’ – బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ‘‘ ప్రణబ్ ముఖర్జీ లేరన్న వార్తతో దేశం తీవ్రవేదన చెందింది. దేశప్రజలతో పాటు ఆయనకు నా నివాళి. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.’’ – కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ‘‘ దేశప్రయోజనాలకే ప్రణబ్ పెద్దపీట వేసేవారు. రాజకీయ అస్పృశ్యతను ఆయన దరిచేరనీయలేదు. ఆర్ఎస్ఎస్కు ఆయన ఒక మార్గదర్శి. సంఘ్‌కు ఆయన లేని లోటు పూడ్చలేనిది.’’ – ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ‘‘ ప్రణబ్ ముఖర్జీ ఒక పరిపూర్ణ పెద్దమనిషి. ఆయనతో ఎంతో అనుబంధం ఉండేది. ఆయన మృతికి నా నివాళి.’’ – లతా మంగేష్కర్ ‘‘ భారత్ ఒక దిగ్గజ రాజకీయవేత్తను, గౌరవనీయుడైన నాయకుడిని కోల్పోయింది.’’ – అజయ్‌దేవగన్ ‘‘దశాబ్దాలుగా ప్రణబ్ దేశానికి సేవలనందించారు.ఆయన మృతి తీవ్ర విచారకరం.’’ – సచిన్ టెండూల్కర్ ‘‘ దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఆయన కుటుంబానికి నా సానుభూతి.’’ – విరాట్‌కోహ్లీ -
సొంత ఊరిపై మమకారం
కోల్‌కతా: ఢిల్లీలో చక్రం తిప్పిన ప్రణబ్ ముఖర్జీ సొంతూరితో ఉన్న అనుబంధాన్ని మాత్రం ఎన్నడూ మరువలేదు. పశ్చిమ బెంగాల్‌లోని బీర్బూమ్ జిల్లాలోని మిరాటి గ్రామంలో ప్రణబ్ పుట్టారు. మిరాటిలోని మట్టిరోడ్ల నుంచి రాజకీయ పండితుడి దాకా...అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ దాకా ఆయన ప్రస్థానం కొనసాగినా సొంతూరితో ఉన్న అనుబంధం మరింత బలపడిందే తప్ప తరిగిపోలేదు. ఆయన ఎక్కడ ఉన్నా ఏటా దుర్గాపూజ సమయంలో మాత్రం సొంతూళ్లోనే ఉంటారు. ధోతి, కండువాతో సంప్రదాయ వస్త్రధారణలో ఆయన దుర్గాదేవికి హారతి ఇస్తారు. గత ఏడాది కూడా ప్రణబ్ దసరా సమయంలో అక్కడే గడిపారు. అయితే, చాలా ఏళ్ల తర్వాత ఈసారి ఆ గ్రామం ఆయన లేకుండానే దుర్గా పూజను జరుపుకోనుంది. ఆయన మరణంతో ఈ గ్రామం మూగబోయింది. ఆయన సీనియర్ మంత్రి అయినా లేక రాష్ట్రపతి అయినా ఈ గ్రామ ప్రజలకు మాత్రం ప్రణబ్ దానే. ఢిల్లీ నుంచి ఫోన్ చేసేవారు... ఆయన ఇంట్లో జరిగే దుర్గాపూజ మా గ్రామంలో జరిగే అతిపెద్ద పండుగ. ఈ పర్వదినాల్లో ఐదురోజుల పాటు ఆయన ఇంట్లోనే అందరూ భోజనాలు చేస్తారు. ఇకపై మిరాటిలో జరిగే దుర్గాపూజ మాత్రం మునుపటిలా ఉండదు అని ప్రణబ్ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన చటోరాజ్ చెప్పారు. ఆయన ఢిల్లీ నుంచి ఫోన్ చేసి అన్ని సవ్యంగా జరుగుతున్నాయా లేదా అని అడిగేవారు. ప్రణబ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి గ్రామస్తులంతా ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు. ప్రణబ్ వెంటిలేటర్‌పై చికిత్స తీసుకునేముందు తన గ్రామం నుంచి పనసపండు తీసుకురమ్మని చెప్పారని ఆయన కొడుకు అభిజిత్ ముఖర్జీ ఇటీవల చెప్పారు. తాను ఆగస్టు 3న కోల్‌కతా నుంచి మిరాటికి వెళ్లి 25 కిలోల పనసపండును రైల్లో ఢిల్లీకి తీసుకెళ్లానన్నారు. ప్రణబ్ ఎంతో ఇష్టంగా ఆ పండును తిన్నారని పేర్కొన్నారు. -
బహుముఖ ప్రజ్ఞాశాలి... ప్రణబ్‌దా!
న్యూఢిల్లీ: బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రణబ్ ముఖర్జీ. దాదాపు 5 దశాబ్దాల క్రియాశీల రాజకీయ జీవితం ఆయన సొంతం. చివరగా, అత్యున్నత రాజ్యాంగ పదవి ఆయన రాష్ట్రపతిగా 2012 నుంచి 2017 వరకు విధులు నిర్వర్తించారు. అన్ని పార్టీలకు ఆమోదనీయ నేతగా ఆయన ఆ పదవి చేపట్టారు. 2019లో అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’పొందారు. కాంగ్రెస్ పార్టీలో, పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రణబ్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరు గాంచారు. ఇందిరాగాంధీ నుంచి సోనియాగాంధీ వరకు.. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నేతగా, కుడి భుజంగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన విదేశాంగ, రక్షణ, ఆర్థిక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా సంస్కరణల అమలుకు సాయమందించారు. తండ్రి సమరయోధుడు 1935 డిసెంబర్ 11న అప్పటి బ్రిటిష్ ఇండియాలో భాగమైన బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉన్న మిరాటి గ్రామంలో(ప్రస్తుతం పశ్చిమబెంగాల్లోని బీర్బుమ్ జిల్లాలో ఉంది) ఒక బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో ప్రణబ్ ముఖర్జీ జన్మించారు. తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి ముఖర్జీ, కమద కింకర్ ముఖర్జీ. తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు. 1952–64 మధ్య పశ్చిమబెంగాల్ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ తరఫున సభ్యుడిగా ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ కలకత్తా యూనివర్సిటీలో ఎంఏ(చరిత్ర), ఎంఏ(రాజనీతి శాస్త్రం), ఎల్ఎల్బీ చదివారు. మొదట డిప్యూటీ అకౌంటెంట్ జనరల్(పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్) కార్యాలయంలో యూడీసీగా ఉద్యోగంలో చేరారు. ఆ తరువాత కలకత్తాలోని విద్యాసాగర్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సాధించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు జర్నలిస్ట్‌గా కొంతకాలం పనిచేశారు. 1969 నుంచి అప్రతిహతంగా.. 1969లో ప్రణబ్ ముఖర్జీ క్రియాశీల రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ సమయంలో జరిగిన మిడ్నాపుర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి వీకే కృష్ణమీనన్ విజయంలో ప్రణబ్ కీలక పాత్ర పోషించారు. ఆయన సామర్థ్యా న్ని కాంగ్రెస్ నాయకురాలు, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గుర్తించి, పార్టీలో చేర్చుకున్నారు. 1969 జూలైలో రాజ్యసభకు పంపించారు. ఆ తరువాత 1975, 1981, 1993, 1999ల్లోనూ ఎగువ సభకు ఎన్నికై, పలుమార్లు సభా నాయకుడిగా విశేష సేవలందించారు. రాజకీయాల్లో ఇందిరాగాంధీ ఆశీస్సులు, తన సామర్ధ్యంతో అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 1973లో తొలిసారి కేంద్రంలో సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత వివిధ శాఖలు నిర్వహించి, 1982లో కీలకమైన ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్‌ను ఆర్బీఐ గవర్నర్‌గా నియమించింది ప్రణబ్ ముఖర్జీనే కావడం విశేషం. 1978లోనే సీడబ్ల్యూసీ సభ్యుడయ్యారు. ఇందిరాగాంధీ కేబినెట్లో నంబర్ 2గా ప్రణబ్ ప్రఖ్యాతి గాంచారు. అయితే, ఇందిరాగాంధీ హత్య అనంతరం పరిస్థితులు తారుమారయ్యాయి. పార్టీలో, ప్రభుత్వంలో ప్రణబ్‌ను పక్కనపెట్టడం ప్రారంభమైంది. చివరకు, ఆయనను పశ్చిమబెంగాల్ పీసీసీ వ్యవహారాలు చూసుకొమ్మని కలకత్తాకు పంపించేశారు. ► ప్రణబ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్‌లలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులుగా ఉన్నారు. ► దేశంలో అత్యున్నత పురస్కారం భారత రత్నతో పాటు, పద్మ విభూషణ్, ఉత్తమ పార్లమెంటేరియన్, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ఇండియా అవార్డులు ఆయన్ను వరించాయి. ► ప్రపంచంలోని వివిధ విశ్వవిద్యాలయాలు ఆయనకు ఐదు గౌరవ డాక్టరేట్స్‌ను ప్రదానం చేశాయి. కుటుంబం ప్రణబ్‌కు మొత్తం ముగ్గురు సంతానం. ఇద్ద రు కుమారులు... ఇంద్రజిత్, అభిజిత్. కూతు రు షర్మిష్ట. రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం లో షర్మిష్ట కీలకమైన సందర్భాల్లో తండ్రికి తోడుగా ఉన్నారు. ప్రణబ్ అర్ధాంగి సువ్ర ముఖర్జీ 2015లో మరణించారు. 47 ఏళ్లకే ఆర్థికమంత్రి అపారమైన జ్ఞాపకశక్తి, లోతైన విషయపరిజ్ఞానం, సమకాలీన అంశాలపై విస్తృత అవగాహన, పదునైన మేధోశక్తి... ప్రణబ్‌ను విశిష్టమైన రాజకీయవేత్తగా నిలిపాయి. 1982లో ఆయన 47 ఏళ్లకే ఆర్థికమంత్రి అయ్యారు. దేశ చరిత్రలో అత్యంత పిన్నవయస్కుడైన ఆర్థికమంత్రిగా గుర్తింపు పొందారు. విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక, వాణిజ్య శాఖలను చూశారు. ఇన్ని కీలకశాఖలను చూసిన తొలి రాష్ట్రపతి ప్రణబే. ముగ్గురు ప్రధానమంత్రులు... ఇంధిరాగాంధీ, పీవీ నరసింçహారావు, మన్మోహన్‌ల వద్ద పనిచేసిన అరుదైన గుర్తింపు పొందారు. ప్రధానమంత్రిగా పనిచేయకుండా... లోక్‌సభ నాయకుడిగా 8 ఏళ్లు పనిచేసిన ఏకైక నేత. 1980–85 ఏళ్లలో రాజ్యసభలో సభానాయకుడిగా ఉన్నారు. 2004–2012 మధ్యకాలంలో మొత్తం 39 మంత్రివర్గ ఉపసంఘాలు (గ్రూప్స్ ఆఫ్ మినిస్టర్స్) ఉండగా... వీటిలో ఏకంగా ఇరవై నాలుగింటికి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వం వహించారు. విస్తృత ఏకాభిప్రాయాన్ని నిర్మించడంలో దిట్ట. పార్టీలకతీతంగాఅందరి విశ్వాసం చూరగొన్నారు. ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన ప్రణబ్‌కు స్వాతంత్య్రానంతర దేశ రాజకీయ చరిత్ర, పాలనా వ్యవహారాలు కొట్టినపిండి. దీంతో దేశ అభివృద్ధిపథంలో కీలకపాత్ర పోషించారు. 2005లో ప్రణబ్ రక్షణమంత్రిగా ఉన్నపుడే భారత్– అమెరికా రక్షణ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. సహ చట్టం, జాతీయ ఆహారభద్రతా చట్టం, ఆధార్, మెట్రో రైలు ప్రాజెక్టులు లాంటి మన్మోహన్ సర్కారు నిర్ణయాల్లో ఆయనది ముఖ్యభూమిక. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన ఏడాది తర్వాత జూన్, 2018లో నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి సంచలనం సృష్టించారు. 2019లో బీజేపీ ప్రభుత్వం ప్రణబ్‌ముఖర్జీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించింది. ప్రధాని కాలేకపోయారు 1986లో సొంతంగా రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్ అనే ఒక రాజకీయ పార్టీని ప్రణబ్ స్థాపించారు. 1987లో జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రణబ్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. రాజీవ్‌గాంధీతో సయోధ్య అనంతరం 1989లో ఆ పార్టీని ఆయన కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 1991లో రాజీవ్ హత్య తరువాత కేంద్ర రాజకీయాల్లో మళ్లీ ప్రణబ్ క్రియాశీలకం అయ్యారు. ప్రధాని పీవీ నరసింహారావు ఆయనను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఆ తరువాత కీలకమైన విదేశాంగ శాఖ అప్పగించారు. సోనియా రాజకీయాల్లోకి రావడానికి ప్రణబ్ వ్యూహమే కారణమని భావిస్తారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను సోనియా స్వీకరించిన తరువాత, ప్రణబ్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2004లో ప్రధాని పదవిని సోనియా నిరాకరించిన సమయంలో ప్రధానిగా అనుభవజ్ఞుడైన ప్రణబ్ పేరే ప్రముఖంగా వినిపించింది. కానీ అనూహ్యంగా మన్మోహన్ ప్రధాని అయ్యారు. మన్మోహన్ కేబినెట్లోనూ ప్రణబ్ కీలకంగా ఉన్నారు. 2007లోనే ప్రణబ్‌ను రాష్ట్రపతిని చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ కేబినెట్లో ఆయన సేవలు అవసరమని భావించి, ఆ ఆలోచనను విరమించుకున్నారు. 2012లో రాష్ట్రపతి పదవిని స్వీకరించే వరకు కాంగ్రెస్‌తోనే అనుబంధం కొనసాగింది. ఏకంగా 23 ఏళ్ల పాటు సీడబ్ల్యూసీలో ఉన్నారు. మూడోసారి... కలిసొచ్చింది ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినా... ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలనే బలమైన కోరిక మాత్రం ప్రణబ్ దాకు చాలాకాలం సాకారం కాలేదు. 1977లో మాల్దా నుంచి, 1980లో బోల్పూర్ నుంచి లోక్‌సభకు పోటీచేసిన ప్రణబ్‌ముఖర్జీ ఓటమిపాలయ్యారు. తర్వాత 2004 దాకా ఆయన ప్రత్యక్ష ఎన్నికల జోలికి పోలేదు. మూడు కారణాలతో తాను మళ్లీ ఎన్నికల గోదాలోకి దిగానని దాదా తన ‘ది కొయలిషన్ ఇయర్స్’పుస్తకంలో రాసుకున్నారు. ‘రాజ్యసభ సభ్యుడు మంత్రి కాగానే సాధ్యమైనంత తొందరగా లోక్‌సభకు ఎన్నిక కావడం మంచిదనేది నెహ్రూ విధానం. ఇదెప్పుడూ నా దృష్టిలో ఉండేది. రెండోది... 1984 తర్వాత ప్రతి ఎన్నికల్లో జాతీయ ప్రచార కమిటీ సారథిగా బాధ్యతలు నిర్వర్తించాను. ప్రచార కమిటీకి చైర్మన్‌గా ఉంటూ ప్రజాతీర్పును ఎదుర్కొనకపోతే ఎట్లా? అనేది నా మదిని తొలుస్తుండేది. మూడోది... నేను పోటీచేయాల్సిందేనని బెంగాల్ కాంగ్రెస్ శ్రేణుల నుంచి గట్టి డిమాండ్ వచ్చింది. అందుకే 2004లో ముర్షిదాబాద్ నుంచి బరిలోకి దిగా’అని చెప్పుకొచ్చారు. రెండుసార్లు ఎంపీగా చేసిన అబుల్ హస్నత్ ఖాన్ (సీపీఎం) ఆయన ప్రత్యర్థి. స్థానిక బీడీ కార్మికుల్లో బాగా పట్టున్న నేత. గెలుస్తానని స్వయంగా తనకే నమ్మకం లేనప్పటికీ... ప్రణబ్‌ను ముచ్చటగా మూడోసారి అదృష్టం వరించింది. దాదాపు 36 వేల మెజారిటీతో ఆయన గెలుపొందారు. చెప్పుకోదగిన విషయం ఏమిటంటే... పదవీకాలం ముగియగానే మళ్లీ రాజ్యసభకు పంపిస్తానని సోనియాగాంధీ అప్పటికే ఆయనకు హామీ ఇచ్చారు. పైగా ఓట్ల లెక్కింపు కోసం ప్రణబ్ ముర్షిదాబాద్‌కు వెళుతున్నపుడు... ఓటమి ఖాయమయ్యే దాకా వేచి ఉండొద్దు. సాధ్యమైనంత త్వరగా ఢిల్లీ వచ్చేయమని సోనియా చెప్పారట. నాలుగో పుస్తకం... రాష్ట్రపతిగా తన ప్రయాణాన్ని ప్రణబ్ ముఖర్జీ చాలా విపులంగా అక్షరబద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరు 11వ తేదీన ఆయన జయంతిని పురస్కరించుకొని ఈ పుస్తకం... ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ను విడుదల చేస్తామని ప్రచురణ సంస్థ రూపా పబ్లికేషన్స్ సోమవారం వెల్లడించింది. ఇది ప్రణబ్ రాసిన నాలుగో పుస్తకం. ఇంతకుముందు ఆయన... ‘ది డ్రమటిక్ డికేడ్ (2014), ది టర్బులెంట్ ఇయర్స్ (2016), ది కొయలిషన్ ఇయర్స్ (2017)లను రాశారు. రాష్ట్రపతి భవన్ పనితీరుపై సమగ్ర అవగాహన కల్పించడమే కాకుండా, అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన, నోట్లరద్దు... వంటి అంశాల్లో అసలేం జరిగిందో తాజా పుస్తకం వివరిస్తుందని రూపా పబ్లికేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘సర్జికల్ స్ట్రయిక్స్, ప్రధాని నరేంద్ర మోదీతో, ఎన్డీయే ప్రభుత్వంతో ప్రణబ్ సంబంధాలపై కూడా ఇందులో వివరించారని తెలిపింది. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల పనితీరుపై కూడా ఆయన తన అభిప్రాయాలను ఇందులో వెల్లడించారు. 2019లో రెండోసారి ఎన్నికల్లో గెలిచాక ప్రధాని మోదీకి మిఠాయి తినిపిస్తున్న ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతి కోవింద్ నుంచి భారతరత్న పురస్కారాన్ని స్వీకరిస్తున్న ప్రణబ్ దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో ప్రణబ్ -
ఇంకా వెంటిలేటర్‌పైనే ప్రణబ్
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి వైద్య బృందం శనివారం తెలిపింది. ఆయన పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని, వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. ‘ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఆయనను ఇంటెన్సివ్ కేర్‌లో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం. వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణ కొనసాగుతోంది’ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. (చదవండి : ‘నాన్న కచ్చితంగా మళ్లీ జెండాను ఆవిష్కరిస్తారు’) ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందుతోంది. -
వెంటిలేటర్‌పైనే ప్రణబ్
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆయన కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ తెలిపారు. ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందుతోంది. అయితే, పరిస్థితి దిగజారలేదనీ, ఆయన కీలక అవయవాలన్నీ నిలకడగానే పనిచేస్తున్నాయని కుమార్తె శర్మిష్ఠ శుక్రవారం చెప్పారు. ‘వైద్యపరమైన అంశాల జోలికి వెళ్లడం లేదు. రెండు రోజులుగా మా నాన్న ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. అయితే, నిలకడగా మాత్రం ఉంది. ఆయన నేత్రాలు వెలుతురుకు కాస్తంత స్పందించడం కనిపిస్తోంది’అని ట్విట్టర్లో శర్మిష్ఠ ముఖర్జీ పేర్కొన్నారు. ‘ప్రణబ్ ముఖర్జీ బాహ్య స్పర్శకు, చికిత్సకు స్పందిస్తున్నారు. 96 గంటల అబ్జర్వేషన్ సమయం నేటితో పూర్తవుతోంది’అని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్లో తెలిపారు. ‘దేశ ప్రజల నుంచి నేను ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగానే పొందాను..అని మా నాన్న ప్రణబ్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. దయచేసి ఆయన కోసం ప్రార్థించండి’అని అభిజిత్ కోరారు. -
కోమాలోనే ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, ప్రస్తుతం ఆయన కోమాలోకి వెళ్లిపోయారని న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరెల్ ఆసుపత్రి గురువారం తెలిపింది. ప్రణబ్ చికిత్సకు మెల్లిగా స్పందిస్తున్నారని, పరిస్థితి నిలకడగా ఉందని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ తెలిపారు. ‘నా తండ్రి ఒక పోరాటయోధుడు. చికిత్సకు నెమ్మదిగా స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించాల్సిందిగా శ్రేయోభిలాషులను కోరుతున్నాను’అని అభిజిత్ ట్వీట్ చేశారు. మెదడులో ఏర్పడ్డ అడ్డంకిని తొలగించేందుకు ప్రణబ్ ఆగస్టు 10న ఆసుపత్రిలో చేరగా ఆయనకు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అదే రోజు ఆయనకు మెదడు శస్త్రచికిత్స జరిగింది. మరోవైపు ప్రణబ్ మరణించారన్న వదంతులు ప్రబలడంతో ఆయన కుమారుడు అభిజిత్ వాటిని కొట్టిపారేశారు. ‘‘మా తండ్రి శ్రీ ప్రణబ్ బతికే ఉన్నారు. పేరు ప్రఖ్యాతులున్న జర్నలిస్టులే ఊహాగానాలు, తప్పుడు వార్తలు ప్రసారం చేయడం భారత మీడియా రంగం నకిలీ వార్తల ఫ్యాక్టరీగా మారిందన్న ఆరోపణలకు అద్దం పట్టేదిలా ఉంది’’అని ట్వీట్ చేశారు. ‘‘మా తండ్రికి సంబంధించి వస్తున్న వార్తలన్నీ వదంతులే. ఆసుపత్రి నుంచి వచ్చే సమాచారం కోసం ఫోన్ అందుబాటులో ఉంచాల్సిన అవసరమున్న నేపథ్యంలో ఎవరూ.. మరీ ముఖ్యంగా మీడియా మిత్రులు నన్ను సంప్రదించవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నా’’అని ప్రణబ్ కుమార్తె షర్మిష్ట ట్వీట్ చేశారు. -
ప్రణబ్ ముఖర్జీ : ఎంత నొప్పితో బాధపడుతున్నా..
కోల్‌కతా : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అయితే ఎంతో నొప్పిని సైతం ఓర్చుకొని ప్రశాంతంగా ప్రణబ్ కనిపించేవారని 13 ఏళ్ల క్రితం ఆయనకు వైద్యం చేసిన డాక్టర్ బసుదేవ్ మొండాల్ అన్నారు. '' 2007లో ముర్షిదాబాద్ నుంచి కోల్‌కతా వెళ్తుండగా నాడియా జిల్లాలో ప్రణబ్ ముఖర్జీ కారు ప్రమాదానికి గురైంది. ఓ ట్రక్కును ఢీ కొట్టడంతో కారు ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో అప్పటి విదేశాంగ మంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ తలకు బలమైన గాయమైంది. వెంటనే ఆయన్ను దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ సిటీ స్కాన్, ఎక్స్ రే వంటి సౌకర్యాలు లేనందున ఆయన్ని మా నర్సింగ్ హోంకు తీసుకువచ్చారు. (మరింత క్షీణించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం) అంతకుముందే నాకు పరిస్థితిని వివరించి అన్ని సౌకర్యాలు ఉండేలా ఏర్పాటు చేయాల్సిందిగా ఫోన్ రావడంతో చాలా అలర్ట్ అయ్యాను. అన్నీ సిద్ధం చేశాను. ఆ సమయంలో ముఖర్జీ తలకు బలమైన గాయం కావడంతో తీవ్రంగా బాధపడుతున్నప్పటికీ పైకి మాత్రం చాలా ప్రశాంతంగా, వినయంగా కనిపించారు. ఇక పరీక్షలు అదృష్టవశాత్తూ ఆయనకు అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నాం. ఆ తర్వాత అయన్ని అక్కడినుంచి కోల్‌కతా లోని ఓ ప్రైవేటు ఆసుప్రతికి తరలించారు. ఈ ఘటన జరిగిన ఐదేళ్ల తర్వాత 2016లో ఓ కార్యక్రమం సందర్భంగా ప్రణబ్ ముఖర్జీని ఆహ్వనించడానికి వెళ్లాను. అప్పటికీ ఆయన రాష్ర్టపతిగా ఉన్నారు. నన్ను చూడగానే గుర్తుపట్టి, చాలా ఆప్యాయంగా పలకరించారు. నా సేవలను గుర్తిచేస్తూ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా కార్యక్రమానికి హాజరవుతానన్న వాగ్ధానాన్ని కూడా నిలబెట్టుకున్నారు'' అంటూ డాక్టర్ మొండల్ ప్రణబ్ ముఖర్జీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇక బ్రెయిన్ సర్జరీ అనంతరం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించిన సంగతి తెలిసిందే. మెదడులో ఒక చోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ప్రణబ్‌కు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. 84 ఏళ్ల ప్రణబ్ డాక్టర్ల సూచన మేరకు సోమవారం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స నిర్వహించే ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. (మాజీ రాష్ట్రపతికి కరోనా పాజిటివ్ ) -
ప్రణబ్ ఆరోగ్యం విషమమే
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతం లోని ఆసుపత్రిలో ప్రణబ్ 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మొదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్–19 పరీక్షలు జరపగా పాజిటివ్‌గా తేలింది. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆసుపత్రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. మాజీ రాష్ట్రపతి త్వరగా కోలుకోవా లని ఆయన స్వగ్రామమైన బెంగాల్‌లోని మిరిటీలో మూడు రోజులుగా మృత్యుంజయ మంత్ర జపం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా..ప్రణబ్ ముఖర్జీకి ఏది మంచిదైతే భగవంతుడు తనకు అదే ఇవ్వాలని కుమార్తె షర్మిష్ట ముఖర్జీ వ్యాఖ్యానించారు. దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’అందుకున్న ఏడాదికే ఆయన ఆరోగ్యం విషమంగా మారడం తనను బాధిస్తోందని కాంగ్రెస్ నేత కూడా అయిన షర్మిష్ట తెలిపారు. -
మరింత క్షీణించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
న్యూఢిల్లీ : బ్రెయిన్ సర్జరీ అనంతరం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ప్రణబ్‌కు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ప్రణబ్ ఆరోగ్యంపై మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే ఆయన ఆరోగ్యంపై నిపుణుల వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని అన్నారు. కాగా మాజీ రాష్ట్రపతికి సోమవారం బ్రెయిన్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. మెదడులో ఒక చోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. (ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం) అనారోగ్యానికి గురైన 84 ఏళ్ల ప్రణబ్ డాక్టర్ల సూచన మేరకు సోమవారం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స నిర్వహించే ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. (మాజీ రాష్ట్రపతికి కరోనా పాజిటివ్ ) -
ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సోమవారం బ్రెయిన్ సర్జరీ జరిగింది. మెదడులో ఒకచోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. అనారోగ్యానికి గురైన 84 ఏళ్ల ప్రణబ్ డాక్టర్ల సూచన మేరకు సోమవారం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స నిర్వహించే ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ‘ప్రణబ్‌కు బ్రెయిన్ క్లాట్‌ను తొలగించేందుకు శస్త్రచికిత్స జరిగింది. ఆయన పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. వెంటిలేటర్‌పై ఉన్నారు’అని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. కీలక అవయవాల పనితీరు నిలకడగా ఉందని, నిపుణులైన వైద్య బృందం ఆయన్ను నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపాయి. దాదాకు కరోనా పాజిటివ్ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కోవిడ్–19 బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోమవారం ఆయనే స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. గత వారంలో తనను సంప్రదించిన వారందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లడం లేదా కోవిడ్–19 పరీక్షలు చేయించుకోవడమో చేయాలని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కూడా అయిన ఆయన విజ్ఞప్తి చేశారు. 2012–17 మధ్యకాలంలో ప్రణబ్ రాష్ట్రపతిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్ఆర్ ఆస్పత్రికి వెళ్లి ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆయన కూతురు షర్మిష్టకు ఫోన్ చేసి ప్రణబ్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, అశోక్ గహ్లోత్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర మంతి పీయూష్ గోయల్ తదితర నేతలు మాజీ రాష్ట్రపతికి త్వరగా స్వస్థత చేకూరాలని ఆకాంక్షించారు. -
మాజీ రాష్ట్రపతికి కరోనా పాజిటివ్
-
మాజీ రాష్ట్రపతికి కరోనా పాజిటివ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ దిగ్గజం ప్రణబ్ ముఖర్జీ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. వేరే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లినపుడు తనకు కరోనా నిర్దారణ అయిందని ప్రణబ్ ట్వీట్ చేశారు. గతవారం రోజుల్లో తనతో సన్నిహితంగా మెలిగిన వారు స్వీయ నిర్బంధాన్ని పాటించాలని, పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం అందించిన సమాచారం ప్రకారం వరుసగా నాలుగో రోజూ 62 వేలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,064 పాజిటివ్ కేసులతో 22 లక్షల కేసులను అధిగమించిందని, 44 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయని పేర్కొంది. అయితే రికవరీ రేటు 69.33 శాతంగా ఉందని, మరణాల రేటు కొత్త కనిష్టాన్ని (2 శాతం) చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. On a visit to the hospital for a separate procedure, I have tested positive for COVID19 today. I request the people who came in contact with me in the last week, to please self isolate and get tested for COVID-19. #CitizenMukherjee — Pranab Mukherjee (@CitiznMukherjee) August 10, 2020 -
కరోనా పోరులో ట్రంప్ విఫలం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోవిడ్–19పై పోరాటంలో పూర్తిగా విఫలమయ్యారని ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ట్రంప్ వ్యవహరించిన తీరు విపత్తుని మరింత గందరగోళంగా మార్చిందని విమర్శించారు. వైట్‌హౌస్‌లో తనతో కలిసి పనిచేసిన సిబ్బందితో శుక్రవారం రాత్రి ఒబామా మాట్లాడారు. దీనిని అమెరికా మీడియా ప్రముఖంగా ప్రసారం చేసింది. సమర్థవంతమైన పాలకులు అధికారంలో ఉన్నప్పటికీ కరోనా వంటి ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కోవడం కత్తి మీద సామేనని, అలాంటిది నాకేంటి అన్న ధోరణిలో అధ్యక్షుడు ఉండడంతో అగ్రరాజ్యం కొంప మునిగిందని ఒబామా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనాతో వచ్చే ముప్పేమీ లేదని ఫిబ్రవరిలో వాదించిన ట్రంప్, మార్చికల్లా అది ఎంతో ప్రమాదకరమైందని అన్నారని ఇలా ఊగిసలాట ధోరణిలోనే ఆయన కాలం గడిపేశారని విమర్శించారు. కరోనాని ట్రంప్ ఎదుర్కొన్న తీరు ఈ విపత్తుని మరింత గందరగోళానికి గురి చేసి అందరిలోనూ తీవ్రమైన నిరాశ నిస్పృహలను నింపిందని ఒబామా విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ నవంబర్‌లో జరగనుండగా ట్రంప్‌పై డెమొక్రాట్ అయిన ఒబామా తీవ్రంగా విమర్శలు చేయడం చర్చకు దారితీసింది. వైట్‌హౌస్ సభ్యులతో మాట్లాడుతూ ఒబామా పదే పదే డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్‌కు మద్దతునివ్వాలని కోరారు. క్వారంటైన్లో వైట్‌హౌస్ సిబ్బంది వైట్‌హౌస్‌లో కరోనాపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ సిబ్బందిలో ముగ్గురు క్వారంటైన్లోకి వెళ్లారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ ఆంటోని ఫాసీతో పాటు మరో ఇద్దరు ముందు జాగ్రత్తగా క్వారంటైన్లోకి వెళ్లారు. ► కరోనాతో అమెరికాలో 24 గంటల్లో 1,568 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 80 వేలకి చేరువలో ఉంది. ళీ దక్షిణ కొరియా ఆంక్షలు సడలించడంతో నైట్ క్లబ్స్‌కి వెళ్లిన 50 మందికి కరోనా సోకింది. దీంతో ప్రభుత్వం క్లబ్బులను మూసివేయాలని వెంటనే ఆదేశాలిచ్చింది. ► చైనాలో కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. వూహాన్లో కూడా ఒక కేసు నమోదు అయింది. చైనాలో ఏప్రిల్ 28 తర్వాత ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ► రష్యాలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటేసింది. గత 24 గంటల్లోనే 11 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. -
ముషారఫ్ శవాన్నైనా మూడ్రోజులు వేలాడదీయండి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఉరిశిక్షకు ముందే మరణిస్తే అతడి శరీరాన్ని అయినా మూడ్రోజులు ఉరికి వేలాడదీయాల్సిందేనని ఆ దేశ ప్రత్యేక కోర్టు గురువారం స్పష్టంచేసింది. దేశద్రోహం కేసులో పాకిస్తాన్ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన 167 పేజీల తీర్పు కాపీలో ‘అతడు చేసిన ప్రతి దానికి ఉరికి వేలాడాల్సిందే. ఒకవేళ ఉరికి ముందే మరణించినా వేలాడదీయాల్సిందే’ అంటూ జస్టిస్ వఖార్ అహ్మద్ సేథ్ తీర్పు రాశారు. అధ్యక్షుడు, ప్రధాని, పార్లమెంటుతో పాటు ఇతర ప్రభుత్వ భవనాలకు దగ్గరగా ఉండే డీ–చౌక్ (డెమోక్రసీ చౌక్) వద్ద అతడి మృతదేహం మూడు రోజుల పాటు వేలాడాలని చెప్పారు. ప్రస్తుతం ముషారఫ్ దుబాయ్‌లో ఉన్నారు. -
ఉక్కు మనిషి ముగాబే కన్నుమూత!
హరారే: జింబాబ్వే మాజీ అధ్యక్షుడు, ఉక్కు మనిషిగా పేరు సంపాదించిన రాబర్ట్ ముగాబే కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. 37 ఏళ్ల పాటు జింబాబ్వేని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ముగాబే నియంతృత్వ పోకడల్ని భరించలేక చివరకు ఆయనకు అండదండగా ఉన్న సైన్యమే 2017లో ఆయనను పదవీచ్యుతుడిని చేసింది. ఆ అవమాన భారంతో కుంగిపోయిన ఆయన మంచం పట్టారు. గత ఏప్రిల్‌లో ఆయనను సింగపూర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ‘ జింబాబ్వే పితామహుడు రాబర్ట్ ముగాబే మనకిక లేరు’ అని దేశ అధ్యక్షుడు ఎమ్మర్సన్ మన్‌గాగ్వా ట్విట్టర్లో వెల్లడించారు. నాడు స్వాతంత్య్రం కోసం గెరిల్లా పోరు బ్రిటిష్ పరిపాలనలో ఉన్న రొడేషియాలో (ఇప్పటి జింబాబ్వే) 1924వ సంవత్సరం ఫిబ్రవరి 21న ముగాబే జన్మించారు. చిన్నప్పట్నుంచి విప్లవ భావాలు కలిగిన ముగాబే 1964లో బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారు. అందుకు 10 సంవత్సరాలకుపైగా విచారణ లేకుండానే జైలు జీవితం అనుభవించారు. జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్(జాను)కి వ్యవస్థాపక సభ్యుడైన ముగాబే ఆ తర్వాత 1973లో దానికి అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత ఏడాది జైలు నుంచి విడుదలై తెల్లదొరల పాలనలో ఉన్న రొడేషియా విముక్తి కోసం గెరిల్లా తరహా పోరాటాలు చేశారు. సంక్షోభ సమయాల్లో సంప్రదింపులు జరపడంలో అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగిన ముగాబే ఆ తర్వాత రాజకీయంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆయన పోరాటాల ఫలితంగా జింబాబ్వే స్వతంత్ర దేశమయింది. 1980లో జరిగిన తొలి ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యంతో అధికారంలోకి వచ్చారు. ఒక స్వాతంత్య్ర వీరుడిగా నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడటంతో పాటు, స్వాతంత్య్రం వచ్చాక నల్లజాతీయులకు ఆరోగ్యం, విద్య అందేలా అవిరళ కృషి చేశారు. తొలి 20 ఏళ్లలో మంచి పరిపాలనా దక్షుడిగా పేరుతెచ్చుకున్నారు. 2000వ సంవత్సరం నుంచే ముగాబే పతనం మొదలైంది. అధికారం కోల్పోతానేమోనన్న అభద్రతా భావంలో ఆయన నియంతలా మారారు. 2000లో ముగాబే తెచ్చిన భూ సంస్కరణ విధానాలు బెడిసి కొట్టి ఆర్థిక వ్యవస్థ దిగజారి పోయింది. తెల్లజాతీయుల నుంచి భూములు లాక్కున్నారు. సైన్యం అండతో 17 ఏళ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఫలితంగా రాజకీయ అస్థిరత, ఆర్థిక మాంద్యం ఆ దేశాన్ని వణికించేశాయి. 37 ఏళ్ల పాటు అధికారంలో ఉండడంతో ప్రజల్లోనూ అసమ్మతి పేరుకుపోయింది. వయోభారంతో ఇక పదవిలో కొనసాగలేనని భావించిన ముగాబే 2017లో తన భార్య గ్రేస్‌కు అధ్యక్ష పీఠం అప్పగించే ప్రయత్నం చేశారు. ఇది తెలుసుకున్న ఆర్మీ ఆయనపై తిరుగుబాటు చేసి గద్దె దింపింది. -
పాక్ మాజీ అధ్యక్షుడు జర్దారీ అరెస్ట్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ(63) అరెస్టయ్యారు. మనీ లాండరింగ్ కేసులో ఆయన్ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్ఏబీ) బృందం సోమవారం అదుపులోకి తీసుకుంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) సహాధ్యక్షుడిగా ఉన్న జర్దారీ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు తిరస్కరించిన కొద్ది గంటల్లోనే ఆయన అరెస్ట్అయ్యారు. కోర్టులో ప్రవేశపెట్టే వరకు ఎన్ఏబీ కార్యాలయంలోనే ఆయన్ను ఉంచుతారని సమాచారం. ఈ కేసులో జర్దారీతోపాటు ఆయన సోదరి ఫర్యాల్ తల్పూర్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. అధికారంలో ఉండగా అక్రమంగా సంపాదించిన రూ.6.80 కోట్లను విదేశాలకు తరలించేందుకు వేలాది నకిలీ అకౌంట్లను సృష్టించారని వీరిపై ఆరోపణలున్నాయి. అధికారులు తల్పూర్‌ను అరెస్ట్ చేయలేదు. జర్దారీ అరెస్టుపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పాక్ ప్రధానిగా బేనజిర్ భుట్టో 1988–90, 1993–96 సంవత్సరాల్లో పనిచేయగా, ఆమె భర్త జర్దారీ అధ్యక్షుడిగా 2008–13 సంవత్సరాల మధ్య పనిచేశారు. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రతిపక్షాలను అణచివేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వం అరెస్టు చేసిందని, నకిలీ బ్యాంకు అకౌంట్లతో తనకు సంబంధంలేదని జర్దారీ పేర్కొన్నారు. -
జర్దారీ ఆస్తులన్నీ జప్తు చేయండి
ఇస్లామాబాద్: నకిలీ ఖాతాల ద్వారా సుమారు రూ.22 వేల కోట్ల మేర అవినీతికి పాల్పడిన కేసులో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఆస్తులను జప్తు చేయాల్సిందిగా జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం (జేఐటీ) సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది. ఈమేరకు జేఐటీ.. కరాచీ, లాహోర్‌లలోని ప్రఖ్యాత బిలావల్ హౌజ్, ఇస్లామాబాద్‌లోని జర్దారీ ఇంటిని జప్తుచేయాలని కోరుతూ శనివారం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. కరాచీలోని 5 ప్లాట్లతో పాటు న్యూయార్క్, దుబాయిల్లో ఉన్న జర్దారీ ఆస్తులను కూడా జప్తు చేయాలంది. దర్యాప్తు బృందం జర్దారీ పట్టణ, వ్యవసాయ భూములు, జర్దారీ గ్రూప్, అతని సోదరి ఫరీల్ తాల్పూర్ ఆస్తులపై విచారణ జరపాల్సిందిగా నివేదికలో కోరింది. జర్దారీ, ఓమ్ని గ్రూప్స్ ప్రభుత్వ నిధుల్లో అక్రమాలకు పాల్పడినట్లు, నగదును ‘హుండి’, ‘హవాలా’ ద్వారా దేశం నుంచి బదిలీ చేసినట్లు ఆరోపించింది. ఆయన ఆస్తులను దేశం నుంచి బదిలీ చేసే అవకాశం ఉన్నందున ఈ కేసులో తీర్పు వెలువడే వరకు ఆస్తులను జప్తు చేయాల్సిందిగా కోరింది. కాగా, జర్దారీ, తాల్పూర్‌లు ఈ నివేదికను ఊహాగానాలుగా, రాజకీయ వేధింపులను లక్ష్యంగా చేసుకుని రూపొందించారని ఆరోపించారు. జర్దారీ, ఇక్బాల్ మెమాన్ పేరుతో ఓ బినామీ కంపెనీని స్థాపించగా, దాన్ని 1998లో జప్తు చేశారు. ఈ కేసులో జర్దారీ అత్యంత సన్నిహితుడైన హుస్సేన్ లవాయి గతేడాది జూలైలో అరెస్టు కాగా, మరో సన్నిహితుడు ఓమ్ని గ్రూప్ చైర్మన్ అన్వర్ మజీద్, అతని కుమారుడు అబ్దుల్ ఘనీ మజీద్‌ను గతేడాది ఆగస్టులో అరెస్టు చేశారు. -
అధ్యక్షున్ని అవుతా.. సాయం చేయండి
వాషింగ్టన్: పాకిస్తాన్లో మళ్లీ తాను అధికారంలోకి రావడానికి రహస్యంగా సాయం చేయాలని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ అమెరికా చట్ట సభ్యులను కోరుతున్న వీడియో బయటపడింది. పాక్‌లోని అబోటాబాద్‌లో అల్‌కాయిదా చీఫ్ లాడెన్ స్థావరాన్ని గుర్తించడంలో నిఘా సంస్థ ఐఎస్ఐ విఫలం కావడంపై తాను సిగ్గు పడుతున్నట్లు ముషార్రఫ్ చెప్పారు. అమెరికా ఇచ్చిన నిధులతోనే ఉగ్రవాదంపై పోరాడామనీ, పాక్‌లో పేదరికాన్ని తగ్గించామని చెప్పారు. తాము నిధుల్ని ఉగ్రవాదంపై పోరాటం కోసం ఇచ్చామనీ, పేదరిక నిర్మూలనకు కాదని అమెరికా చట్టసభ్యులు ఘాటుగా స్పందించారు. ‘అబోటాబాద్‌లో లాడెన్ ఆచూకీ తెలుసుకోకపోవడం ఐఎస్ఐ నిర్లక్ష్యమే. అమెరికా నిఘా సంస్థ సీఐఏ కూడా 2001, సెప్టెంబర్ 11న ఉగ్రదాడుల విషయంలో ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది’ అని తెలిపారు. 2012 తర్వాత తీసినట్లు భావిస్తున్న ఈ వీడియోను ముషార్రఫ్ వ్యతిరేకి అయిన కాలమిస్టు గుల్ బుఖారీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. 2001–08 మధ్యకాలంలో పాక్ అధ్యక్షుడిగా ఉన్న ముషార్రఫ్, అభిశంసన నుంచి తప్పించుకునేందుకు రాజీనామా చేశారు. చికిత్స పేరుతో దుబాయ్ వెళ్లిన ముషార్రఫ్ మళ్లీ పాక్‌కు రాలేదు. 2007లో రాజ్యాంగాన్ని రద్దుచేయడంతో ముషార్రఫ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. -
‘చావు కోసం ఎదురుచూస్తున్నా.. ఆ ఆలోచనే ఇలా’
అక్షరాల ద్వారా చెప్పలేని భావాలను కార్టూన్ల ద్వారా పలికించవచ్చు. కొన్ని వాక్యాల్లో వర్ణించలేని భావాలని ఒకే ఒక బొమ్మ రూపంలో తెలియజేయడం కార్టూనిస్టుల ప్రత్యేకత. నవ్వించడం, కవ్వించడమే కాదు... ఆలోచింపజేయడం, మనసును ద్రవింపజేసే కార్టూన్లను రూపొందించడం కొంతమంది కళాకారులకే సొంతం. అమెరికాకు చెందిన వార్తా పత్రిక క్లారియన్ లెడ్జర్ ఎడిటోరియల్ కార్టూనిస్ట్ మార్షల్ రామ్సే కూడా ఆ కోవకు చెందిన వారే. ప్రస్తుతం.. అమెరికా మాజీ అధ్యక్షుడు, దివంగత నేత జార్జ్ హెచ్. డబ్ల్యూ బుష్ ఙ్ఞాపకార్థం ఆయన వేసిన కార్టూన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య బార్బరా, కూతురు రాబిన్‌తో బుష్‌కు ఉన్న అనుబంధాన్ని ఈ కార్టూన్ చక్కగా వర్ణించిందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రామ్సే వేసిన కార్టూన్ సీనియర్ బుష్ అంత్యక్రియలు గురువారం పూర్తవనున్న విషయం తెలిసిందే. వాషింగ్టన్‌లోని నేషనల్ క్యాథడ్రల్ చర్చిలో అధికారిక లాంఛనాలతో ఓసారి, హూస్టన్‌లోని సెయింట్‌మార్టిన్ ఎపిస్కోపల్ చర్చిలో మరోసారి ఆయనకు వీడ్కోలు పలుకుతామని అధికారులు వెల్లడించారు. అయితే హూస్టన్‌లో ఆయన భార్య బార్బరా, కుమార్తె రాబిన్ పక్కన బుష్ పార్థివదేహాన్ని ఖననం చేయనుండటంతో దీని ఆధారంగా రామ్సే కార్టూన్ రూపొందించారు. ఫ్లైట్‌లో ప్రయాణించిన బుష్.. ఆయన భార్య బిడ్డలను చేరుకున్నట్టుగా కార్టూన్ వేసిన రామ్సే... ‘మీ కోసం ఇన్నాళ్లు ఎదురుచూశాం’ అంటూ అందులో అక్షరాలు పొందుపరిచారు. మార్షల్ రామ్సే ఇప్పుడు చావు కోసం ఎదురుచూస్తున్నా! ‘ఒకప్పుడు చావు అంటే నాకు చాలా భయం ఉండేది. చనిపోతాననే భయం నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. కానీ కొన్ని రోజులుగా చావు కోసం ఎదురుచూస్తున్నా. ఎందుకంటే చనిపోయిన తర్వాత మనకు ఇష్టమైన, స్వర్గంలో ఉన్న మన ప్రియమైన వారిని కలుసుకోవచ్చు. అమెరికా మాజీ ప్రథమ మహిళ బార్బరా చనిపోయిన తర్వాత ఆమె ఙ్ఞాపకార్థం గీసిన కార్టూన్ ఈ ఆలోచన నుంచి పుట్టిందే. ప్రస్తుతం వేసిన జార్జ్ బుష్ కార్టూన్ అందరి మనసులను హత్తుకుంటోంది. ముఖ్యంగా జార్జ్ బుష్ మనుమరాలు జెన్నా బుష్ హాగర్ ఈ కార్టూన్ చూసి భావోద్వేగానికి లోనైంది’ అని రామ్సే తన ఫేస్బుక్ పేజీలో రాసుకొచ్చారు. నేవీ పైలట్.. ప్రియమైన భర్త.. తండ్రి జార్జ్ బుష్- బార్బరా బుష్లది 73 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితం. గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత అనతికాలంలోనే వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఎంతో అన్యోన్యంగా మెదిలిన ఈ జంట ప్రతీ విషయంలో ఒకరికి ఒకరు అండగా నిలిచేవారు. బుష్‌కు సంబంధించిన ప్రతీ కార్యక్రమంలోనూ బార్బరా భాగమయ్యేవారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో బార్బరా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో బుష్ కుంగిపోయారు. భార్య మరణించిన నాటి నుంచి అనారోగ్యంతో పూర్తిగా చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. సుమారు ఏడు నెలల వ్యవధిలో ఈ దంపతులు మరణించారు. లుకేమియాతో కుమార్తె మృతి... జార్జ్ బుష్- బార్బరా దంపతులకు ఆరుగురు సంతానంతో పాటు మనుమలు, మనుమరాల్లు, మునిమనవలతో కూడిన అందమైన కుటుంబం ఉంది. వీరికి 1950లో ఈ జంటకు ఓ కుమార్తె జన్మించింది. ఆమె పేరు పౌలిన్ రాబిన్సన్. మూడేళ్ల ప్రాయంలో అంటే 1953లో లుకేమియా(క్యాన్సర్) బారిన పడి రాబిన్ మరణించింది. తమ జీవితంలో అత్యంత విషాదకర ఘటన రాబిన్ మరణమేనని బుష్ దంపతులు అనేక సందర్భాల్లో గుర్తుచేసుకునేవారు. ఇక రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నేవీ పైలట్‌గా వ్యవహరించి అమెరికా సాధించిన పలు విజయాల్లో బుష్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయాల ఆధారంగా విమానం బొమ్మ వేసిన రామ్సే... స్వర్గంలో ఆయన బార్బరా, రాబిన్సన్లను కలుసుకుని ఆనందపడుతున్నట్లుగా మరో చిత్రాన్ని గీశారు. దీనికి సోషల్ మీడియాలో అనూహ్య స్పందన లభిస్తోంది. గతంలో ఆయన వేసిన బార్బరా కార్టూన్‌కు కూడా ఇదే తరహాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. బార్బరా బుష్ మరణానంతరం రామ్సే వేసిన కార్టూన్ వైరల్‌గా మరో ఫొటో! బుష్ ఙ్ఞాపకార్థం రామ్సే వేసిన కార్టూన్‌తో పాటుగా.. ఆయనకు సంబంధించిన మరో ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుష్ భౌతికకాయం వద్ద ఆయన పెంపుడు శునకం సలీ విచారంగా పడుకున్న ఫొటో నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. విశ్వాసానికి మారుపేరు శునకం అనే మాటను సలీ మరోసారి నిరూపించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
బుష్ గౌరవార్థం ‘స్పెషల్ ఎయిర్‌మిషన్ 41’
హూస్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు దివంగత జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్ భౌతికకాయాన్ని వాషింగ్టన్ తీసుకెళ్లేందుకు అధ్యక్షుడి అధికారిక విమానం ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ హూస్టన్‌కు చేరుకుంది. బుష్ గౌరవార్థం ఈ విమానానికి తాత్కాలికంగా ‘స్పెషల్ ఎయిర్‌మిషన్ 41’గా పేరుపెట్టారు. వాషింగ్టన్‌లోని నేషనల్ క్యాథడ్రల్ చర్చిలో అధికారిక లాంఛనాలతో ఓసారి, హూస్టన్‌లోని సెయింట్‌మార్టిన్ ఎపిస్కోపల్ చర్చిలో మరోసారి బుష్ అంత్యక్రియలు జరగనున్నాయి. గురువారం హూస్టన్‌లో ఆయన భార్య బార్బరా, కుమార్తె రాబిన్ పక్కన బుష్ పార్థివదేహాన్ని ఖననం చేయనున్నారు. మరోవైపు, బుష్ భౌతికకాయం వద్ద ఆయన పెంపుడు శునకం సల్లీ విచారంగా పడుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
సంబంధాలు పునర్నిర్మించుకుందాం!
మాలె: మాల్దీవుల నూతన అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలితో కలసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్ని పునర్నిర్మించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. శనివారం సోలి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన మోదీ.. ఆ వెంటనే ఆయనతో సమావేశమై చర్చలు జరిపారు. అభివృద్ధి, శాంతి కోసం మాల్దీవులు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి అండగా ఉంటామని మోదీ హామీ ఇచ్చారు. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలో శాంతి, భద్రతల పరిరక్షణకు, ఒకరి ఆశయాలు, ప్రయోజనాల్ని మరొకరు గౌరవించుకునేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారు. మాల్దీవుల్లో అధికార మార్పిడి అనంతరం ఇరు దేశాల సంబంధాలు తిరిగి పూర్వ స్థితికి చేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉగ్రపోరులో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యల్ని సోలి మోదీ దృష్టికి తీసుకొచ్చారు. గృహ, మౌలిక వసతుల అభివృద్ధితో పాటు తాగు నీరు, మురుగు నీటి నిర్వహణ తదితర సౌకర్యాల్ని వెంటనే మెరుగుపరచాల్సి ఉందని చెప్పారు. పదవి నుంచి దిగిపోయిన అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ హయాంలో రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. చైనాకు అనుకూల వ్యక్తిగా పేరొందిన యామీన్.. ఆ దేశంలో అత్యవసర పరిస్థితి విధించడాన్ని భారత్ వ్యతిరేకించింది. విమానాశ్రయంలో ఘన స్వాగతం.. అంతకుముందు, మాల్దీవుల రాజధాని మాలె చేరుకున్న ప్రధాని మోదీకి విమానాశ్రయంలో రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. సోలి ప్రమాణస్వీకారం సందర్భంగా మాల్దీవుల మాజీ అధ్యక్షులు అబ్దుల్ గయూమ్, మహ్మద్ నషీద్‌ల మధ్య కూర్చున్న మోదీ..వారిని హత్తుకున్నారు. శ్రీలంక మాజీ అధ్యక్షురాలు చంద్రికా కుమారతుంగతోనూ ముచ్చటించారు. సోలి ప్రమాణానికి హాజరైన అత్యున్నత స్థాయి ప్రభుత్వాధినేత మోదీనే కావడం గమనార్హం. ప్రధాని హోదాలో మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. -
రాఫెల్‌కు ‘రిలయన్స్’ భారత్ ఎంపికే
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేస్తున్న ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్‌కు ఇండియాలో భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్‌ను భారత ప్రభుత్వమే ఎంపిక చేసిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ బయటపెట్టారు. ఫ్రెంచి మీడియాతో హోలాండ్ మాట్లాడుతూ ‘డసాల్ట్ ఏవియేషన్‌కు భారత్‌లో భాగస్వామిగా అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌ను భారత ప్రభుత్వమే ఎంపిక చేసింది. మా ప్రమేయం ఏమీ లేదు. ఎంచుకోవడానికి మాకు మరో కంపెనీ కూడా లేదు. భారత్ నిర్ణయించిన భాగస్వామినే మేం అంగీకరించి చర్చలు ప్రారంభించాం’ అని తెలిపారు. దీంతో రాఫెల్ ఒప్పందం విషయంలో మోదీ ప్రభుత్వం చెబుతున్న మాటలకు, హోలాండ్ వెల్లడించిన విషయాలకు పొంతన లేకుండా పోయింది. 2015 ఏప్రిల్‌లో నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్‌తో చర్చల తర్వాత 36 రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేయనున్నట్లు మోదీ చెప్పారు. ప్రాణమిత్రుడి కోసమే ఈ కుట్ర: కాంగ్రెస్ రాఫెల్ విషయంలో హోలాండ్ వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని బీజేపీపై కాంగ్రెస్ మరోసారి విరుచుకుపడింది. ప్రాణ స్నేహితుడికి లాభం చేకూర్చేందుకే ప్రధాని మోదీ ప్రభుత్వం కుట్ర, దగాకు పాల్పడిందనీ, ఇప్పుడు హోలాండ్ మాటలతో ఆ విషయం బట్టబయలైందని విమర్శించింది. ‘మోదీ భారత్‌ను వెన్నుపోటు పొడిచారు. మోదీ రహస్యంగా, వ్యక్తిగతంగా చర్చలు జరిపి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని మార్చారు. దివాలా తీసిన, రక్షణ రంగంలో ఏ మాత్రం అనుభవం లేని అనిల్ అంబానీ కంపెనీకి వేల కోట్ల విలువైన ప్రాజెక్టును మోదీనే∙ఇచ్చినట్లు ఇప్పుడందరికీ తెలిసింది. మన సైనికుల రక్తాన్ని మోదీ అగౌరవపరిచారు’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ట్వీట్‌చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఓ ట్వీట్ చేస్తూ ‘ప్రభుత్వ రంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌ను కాదని 30 వేల కోట్ల ప్రాజెక్టును ప్రధాని తన స్నేహితుడి కంపెనీకి కట్టబెట్టడంలో ఉన్న మోసం, కుట్ర, దగా బయటపడింది’ అని అన్నారు. కాంగ్రెస్ నేత చిదంబరం మాట్లాడుతూ ‘ఎన్డీయే కుదుర్చుకున్న రాఫెల్ ఒప్పందంలో మనకు విమానాలు రాలేదు. అబద్ధాలు మాత్రమే వచ్చాయి. హోలాండ్ చెప్పిన వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ఏ కొత్త అబద్ధం చెబుతారో?’ అని అన్నారు. కాంగ్రెస్ మరో అధికార ప్రతినిధి మనీశ్ తివారీ ట్వీట్ చేస్తూ 2012లో తాము ఒక్కో రాఫెల్ యుద్ధ విమానాన్ని రూ. 526 కోట్లకే కొనేందుకు ఒప్పందం చేసుకున్నప్పటికీ 2015కు ఆ ధర రూ. 1,670 కోట్లకు ఎలా పెరిగిందో కూడా హోలాండ్ చెప్పాలని కోరారు. కీలక వాస్తవాలను దాచిపెట్టి దేశ భద్రతను మోదీ ప్రమాదంలో పడేస్తున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి మాట్లడుతూ రాఫెల్ ఒప్పందం పెద్ద కుంభకోణమనీ, మోదీ ప్రభుత్వం అబద్ధాలతో భారతీయులను తప్పుదోవ పట్టించిందన్నారు. -
నేతలపై రేటింగ్స్‌కూ కొత్త యాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐదేళ్లకొకసారి ఓట్లు వేసి నాయకులను ఎన్నుకోవటం కాదు.. అదే ఓటర్లు ఇప్పుడు స్థానిక నాయకులకు రేటింగ్స్, రివ్యూలూ ఇచ్చే అవకాశమొచ్చింది. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో నేత యాప్‌ను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ విడుదల చేశారు. ఓటర్లకే కాకుండా నేత యాప్‌తో రాజకీయ పార్టీలకు పారదర్శకత, మంచి గుర్తింపు ఉన్న అభ్యర్థుల ఎంపిక సులవుతుందని ప్రణబ్ చెప్పారు. ఇప్పటివరకు దేశంలోని 4,120 అసెంబ్లీ, 543 పార్లమెంటరీ నియోజకవర్గాల అభ్యర్థులకు 1.5 కోట్ల మంది ఓటర్లు రేటింగ్స్ ఇచ్చారని నేత యాప్ ఫౌండర్ ప్రతమ్ మిట్టల్ తెలిపారు. 16 భాషల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో ఈ యాప్ అందుబాటులోకి తెచ్చారు. కార్యక్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ ఎలక్షన్ కమీషనర్ ఎస్‌వై ఖురేషీ పాల్గొన్నారు. -
ఐరాస మానవహక్కుల చీఫ్‌గా బ్యాష్లే
యునైటెడ్ నేషన్స్: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ నూతన చీఫ్‌గా చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బ్యాష్లే ఎన్నికయ్యారు. జొర్డాన్ దౌత్యవేత్త జీద్ రాద్ అల్–హుసేన్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. యూఎన్ మానవ హక్కుల సంస్థ హైకమిషనర్ పదవికి బ్యాష్లే పేరును ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్ ప్రతిపాదించారు. 193 సభ్య దేశాల సాధారణ అసెంబ్లీ శుక్రవారం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 1993లో ఏర్పాటైన యూఎన్ మానవ హక్కుల సంస్థకు బ్యాష్లే ఏడో హైకమిషనర్ కానున్నారు. ఈనెల 31న జీద్ రాద్ పదవీకాలం ముగియనుంది. -
‘ఎన్నార్సీ’పై మాటల యుద్ధం
న్యూఢిల్లీ: అస్సాంలో అక్రమ వలసదారులను గుర్తించేందుకు విడుదలచేసిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్నార్సీ) ముసాయిదా జాబితాపై రాజకీయ రభస కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఈ అంశంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో అధికార పార్టీ తరఫున బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వివరణ ఇస్తూ.. అక్రమ వలసదారులను గుర్తించే సాహసాన్ని కాంగ్రెస్ చేయలేకపోయిందన్నారు. నిజమైన భారతీయుల పేర్లను జాబితా నుంచి తొలగించబోమని హామీ ఇచ్చారు. అస్సాంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారుల వివరాలేవీ ప్రభుత్వం వద్ద లేవని, ఎన్నార్సీలో చోటుదక్కని వారంతా విదేశీయులు కారని కాంగ్రెస్ పేర్కొంది. మానవతా దృక్పథాన్ని అవలంబించాలని, భారతీయులకు జాబితాలో చోటు నిరాకరించొద్దని సూచించింది. వివాదాస్పద ఎన్ఆర్సీ జాబితాతో దేశంలో సివిల్ వార్, రక్తపాతం జరుగుతాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హెచ్చరించారు. అక్రమ వలసదారులను కాపాడతారా?: షా ప్రశ్నోత్తరాలను రద్దుచేసి ఎన్నార్సీపై చర్చ నిర్వహించేందుకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అంగీకరించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ.. అక్రమ వలసదారులను గుర్తించి భారతీయుల జాబితాను తయారుచేసేందుకే ఎన్ఆర్సీ కసరత్తు చేపట్టామన్నారు. 1985, ఆగస్టు 14న అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సంతకంచేసిన అస్సాం ఒప్పందం ప్రకారమే ఎన్నార్సీ జాబితాను రూపొందించాల్సిందని, కానీ ఆ పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయిందని మండిపడ్డారు. అక్రమ వలసదారులను గుర్తించే ధైర్యం ఆ పార్టీకి లేకపోయిందని ఆరోపించారు. అక్రమంగా వలసొచ్చిన బంగ్లాదేశీయులను కాపాడటానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందా? అని ప్రశ్నించారు. ‘సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఎన్ఆర్సీ రూపుదిద్దుకుంటోంది. 40 లక్షల మందికి ముసాయిదా జాబితాలో చోటుదక్కలేదు. ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వారినా?’ అని అసహనం వ్యక్తం చేశారు. నిజమైన భారతీయులెవరూ ఆందోళనచెందనక్కర్లేదని, వారి పేర్లను ఎన్ఆర్సీ నుంచి తొలగింబోచమని హామీ ఇచ్చారు. షా వ్యాఖ్యలపై కాంగ్రెస్, తృణమూల్, ఇతర విపక్షాలు నిరసన వ్యక్తం చేయడంతో తొలుత పది నిమిషాలు, తరువాత రోజంతటికీ సభ వాయిదాపడింది. అంతర్జాతీయంగా ప్రభావం: కాంగ్రెస్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ రాజ్యసభలో చర్చను ప్రారంభిస్తూ.. ఎన్నార్సీ మానవతా సమస్య అని, పలానా కులం, మతానికి సంబంధించినది కాదని పేర్కొన్నారు. ‘ఎవరినీ దేశం నుంచి తరిమికొట్టాలని మేము కోరుకోవడం లేదు. ఇది కేవలం 40 లక్షల మందికి సంబంధించిన సమస్య కాదు. వారి కుటుంబం, పిల్లలను కూడా కలుపుకుంటే ఆ సంఖ్య 1.5 కోట్లకు చేరుతుంది. ఎన్నార్సీతో అంతర్జాతీయంగా, ముఖ్యంగా బంగ్లాదేశ్‌పై, ప్రభావం పడుతుంది. పౌరసత్వాన్ని నిరూపించుకునే బాధ్యత కేవలం పౌరులపైనే కాకుండా ప్రభుత్వంపై కూడా ఉండాలి’ అని ఆజాద్ అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్‌గోపాల్ యాదవ్ స్పందిస్తూ ఎన్ఆర్సీ జాబితాలో చోటుదక్కనివారిలో హిందువులు, ముస్లింలు, బిహార్, యూపీ ప్రజలు కూడా ఉన్నారని అన్నారు. మాజీ రాష్ట్రపతి కుటుంబీకులకు చోటేదీ? ఎన్నార్సీ జాబితాలో దివంగత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సోదరుడు లెఫ్టినెంట్ ఎక్రముద్దీన్ అలీ అహ్మద్ కుటుంబ సభ్యులకు చోటు దక్కలేదు. ఆ కుటుంబం అస్సాంలోని కామరూప్ జిల్లా రాంగియా పట్టణంలో నివసిస్తోంది. ‘నేను ఫక్రుద్దీన్ సోదరుడి కుమారుడిని. మా నాన్న పేరు వారసత్వ డేటాలో లేకపోవడంతో మాకు ఎన్ఆర్సీ జాబితాలో చోటు దక్కలేదు. ఈ విషయంలో మాకు చాలా ఆందోళనగా ఉంది‘ అని జియా ఉద్దీన్ అంటున్నారు. పూర్వీకులకు సంబంధించిన స్థానికత పత్రాలు సమర్పించలేకపోయిన వారెవరికీ ఈ జాబితాలో చోటు దక్కలేదు. జాబితాలో 40 లక్షల మందికి చోటు కల్పించకపోవడానికి గల కారణాలపై ప్రభుత్వం గోప్యత పాటిస్తోంది. ఎన్నికల సంఘం అనుమానాస్పద ఓటర్లుగా గుర్తించిన వారిని, పౌరసత్వంపై ఇప్పటికే విదేశీ ట్రిబ్యునల్స్‌లో సవాల్ చేసిన వారిని జాబితాలో చేర్చలేదు. తదుపరి బెంగాల్లోనా? అస్సాం మాదిరిగానే పశ్చిమబెంగాల్లోనూ ఎన్నార్సీ జాబితా ను రూపొందించే ఉద్దేశం ఉందా? అని ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ నుంచి స్పష్టత కోరారు. మంగళవారం ఆమె రాజ్‌నాథ్‌ను కలసిన తరువాత విలేకర్లతో మాట్లాడుతూ..‘అస్సాం ఎన్నార్సీ గురించి మాట్లాడటానికే ఢిల్లీ వచ్చా. జాబితాలో చోటుదక్కని 40 లక్షల మంది వివరాలు సమర్పించాను. తదుపరి ఎన్ఆర్సీ బెంగాల్లోనే అని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలను ఆయన దృష్టికి తీసుకెళ్లా. అలాంటి ప్రకటనలు చేసే అధికారం వారికి ఎవరు ఇచ్చారు?’ అని మమత అన్నారు. బెంగాల్లో అక్రమ వలసదారులు కోట్లలో ఉంటారని, తదుపరి ఎన్నార్సీ బెంగాల్లో చేపట్టే అవకాశాలున్నాయని బీజేపీ నేత కైలాశ్ చెప్పారు. ఇప్పుడే చర్యలు వద్దు: సుప్రీం ఎన్నార్సీ జాబితాను ఆధారంగా చేసుకుని ఎలాంటి బలవంతపు చర్యలకు దిగొద్దని కేంద్రం, అస్సాం ప్రభుత్వాల్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది కేవలం ముసాయిదా జాబితానే అంది. అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రామాణిక అమలు విధానాన్ని(ఎస్ఓపీ) రూపొందించాలని కేంద్రానికి సూచించింది. పేర్ల తొలగింపును సవాలుచేసేందుకు బాధితులకు న్యాయబద్ధ అవకాశం కల్పిస్తూ ఎస్ఓపీని ఆగస్టు 16 నాటికి తమ ముందు ఉంచాలని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్‌ల బెంచ్ ఆదేశించింది. జాబితాలో చోటుదక్కని 40 లక్షల మంది తప్పు డు పత్రాలతో ఇతర రాష్ట్రాలకెళ్లకుండా వారి బయోమెట్రిక్ వివరాలు సేకరించాలనుకుంటున్నట్లు కేంద్రం కోర్టుకు తెలిపింది. అలాంటి వారు తమ రాష్ట్రంలోకి ప్రవేశిస్తారని పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాలు ఆందోళనచెందుతున్నాయంది. మోరీగావ్‌లో తుది జాబితాలో తమ పేరు చెక్‌చేసుకునేందుకు క్యూలో నిల్చున్న జనం -
మాజీ రాష్ట్రపతి బంధువులకు లభించని పౌరసత్వం
గువాహటి : అస్సాంలో జాతీయ పౌర గుర్తింపు(ఎన్నార్సీ) తుది ముసాయిదాను కేంద్రం సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో 40 లక్షల మందికి ఆ జాబితాలో చోటు లభించలేదు. దీనిపై ప్రతిపక్షాలతో పాటు, సామాన్యులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నార్సీ ముసాయిదా నుంచి 40 లక్షల మందిని తప్పించడంపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘సొంతగడ్డపై భారతీయులే శరణార్థులయ్యారు’ అని పేర్కొన్నారు. బీజేపీ విభజించు పాలించు సిద్దాంతాన్ని పాటిస్తుందని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే బీజేపీ ఇలా వ్యవహరిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మాజీ రాష్ట్రపతి బంధువులకు దక్కని చోటు.. సోమవారం విడుదల చేసిన పౌరసత్వ జాబితాలో మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ బంధువులకు చోటు లభించలేదు. ఆయన సోదరుడు ఇక్రాముద్దీన్ అలీ కుమారుడు జియాద్దీన్ కుటుంబ సభ్యుల పేర్లు జాబితాలో లేవు. అస్సాంలోని కామ్రూప్ జిల్లాలోని రాంగియాకు చెందిన జియాద్దీన్ కుటుంబానికి పౌరసత్వ జాబితాలో చోటు లభించకపోవడంపై వారిలో ఆందోళన నెలకొంది. జియాద్దీన్ మాట్లాడుతూ.. ‘నేను ఫక్రుద్దీన్ అలీ బంధువును.. మా కుటుంబ సభ్యుల పేరు ఎన్నార్సీ ప్రకటించిన జాబితాలో లేకపోవడంతో ఆశ్చర్యపోయాం. మాకు చిన్నపాటి ఆందోళన ఉంద’ని తెలిపారు. కాగా, భారత ఐదవ రాష్ట్రపతిగా సేవలందించిన ఫక్రుద్దీన్ పదవిలో ఉన్నప్పుడే మరణించిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత రిజిస్ట్రార్ జనరల్ శైలేశ్ మాత్రం జబితాలో పేరు లేని వారు తమ అభ్యర్థనను లేఖ ద్వారా సమర్పించవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగిందన్నారు. ఇది తుది జాబితా కాదని పేర్కొన్నారు. బాధితుల్లో చాలా మంది తమ దగ్గర అన్ని రకాల పత్రాలు ఉన్నప్పటికీ పౌరసత్వం కల్పించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మాజీ రాష్ట్రపతి బంధువులకు కూడా ఈ జాబితాలో చోటు లభించకపోవడం ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
మాజీ అధ్యక్షురాలికి మరో 8 ఏళ్లు శిక్ష
సియోల్ : దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గున్ హైకి ఎనిమిదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ సియోల్ సెంట్రల్ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. గూఢాచార సంస్థకు జరిపిన కేటాయింపుల్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడటం, నిషేధం ఉన్నప్పటికీ 2016 పార్లమెంటరీ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం వంటి ఆరోపణలు రుజువైన నేపథ్యంలో శిక్ష ఖరారు చేసినట్లు కోర్టు తెలిపింది. కాగా పార్క్‌కు ఇప్పటికే ఓ అవినీతి కేసులో 24 ఏళ్ల పాటు శిక్ష పడింది. ప్రభుత్వ ఖజానాకు చెందిన 2.91 మిలియన్ డాలర్లను తన సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారన్న కారణంగా ఆమెకు శిక్ష పడింది. ఈ క్రమంలో పార్క్ 32 ఏళ్ల పాటు జైలులోనే జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. వివాదాలకు కేరాఫ్... దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు పార్క్ చుంగ్- హీ కుమార్తె అయిన పార్క్ గున్ హైపై అవినీతి, అధికార దుర్వినియోగం, కోర్టు ధిక్కరణ వంటి పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజీనామా చేసి, ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ సొంత పార్టీ నేతలే పట్టుబట్టారు. కాగా తనపై ఆరోపణలు రుజువైనప్పటికీ కూడా రాజీనామా చేయడానికి ఒప్పుకోకపోవడంతో ఎనిమిది మందితో కూడిన రాజ్యాంగ కమిటీ ఆమెపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడంతో పదవి కోల్పోవాల్సి వచ్చింది. 2017లో పదవి కోల్పోయిన అనంతరం పార్క్ గున్పై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అయినప్పటికీ ఆమె తన ప్రవర్తన మార్చుకోకుండా కోర్టుకు హాజరు కాకుండా ధిక్కరణకు పాల్పడ్డారు. దీంతో శిక్షతో పాటు 16 మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
అత్యుత్తమ అధ్యక్షుడు ఒబామా
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామానే ఉత్తమ అధ్యక్షుడు అని అధిక శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షులపై ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన సర్వేలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగో స్థానంలో నిలిచారు. రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్ ఒబామాను 44 శాతం మంది అమెరికన్లు బెస్ట్ ప్రెసిడెంట్‌గా పేర్కొన్నారు. 33 శాతంతో రెండో స్థానంలో బిల్ క్లింటన్, 32 శాతంతో మూడో స్థానంలో రొనాల్డ్ రీగన్ నిలిచారు. కనీసం సగం పదవీ కాలాన్ని కూడా పూర్తి చేసుకోని ట్రంప్ మాత్రం కేవలం 19 శాతం ఓట్లతో నాలుగో స్థానంతో సరిపుచ్చుకున్నారు. 2011లో ఒబామా తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు నిర్వహించిన సర్వేలో 20 శాతం ఓట్లతో ఆయన మొదటి స్థానంలో నిలిచారు. 2018 జూన్ 5 నుంచి 12 మధ్య తమ జీవిత కాలంలో తాము చూసిన అధ్యక్షులపై 2,002 మంది వయోజనుల అభిప్రాయాలు సేకరించారు. ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్ ఆధారంగా విశ్లేషణ చేశారు. ఫస్ట్ చాయిస్లో 31 శాతం, సెకండ్ చాయిస్లో 13 శాతంతో మొత్తం 44 శాతం ఒబామా మొదటి స్థానంలో నిలిచారు. ట్రంప్ తమకు ఫస్ట్ చాయిస్ అని 10 శాతం మంది చెప్పగా, 9 శాతం మంది సెకండ్ చాయిస్ అని పేర్కొన్నారు. -
హెస్‌సీఏ-విశాఖ మధ్య ఎలాంటి అగ్రిమెంట్ లేదు
-
నెరవేరిన ప్రణబ్, ఆర్ఎస్ఎస్ లక్ష్యం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తన కార్యాలయానికి ఆహ్వానించడం ద్వారా.. తాను అనుకున్న లక్ష్యాన్ని ఆర్ఎస్ఎస్ సాధించింది. ఆది నుంచి వివాదాస్పదమైన ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా అనుకున్నట్లుగానే వీలైనంత ప్రచారం పొందింది. ఇక ప్రణబ్ ముఖర్జీ కూడా తెలివిగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని నొప్పించక.. తానొవ్వక అన్న రీతిలో బయటపెట్టడంలో విజయం సాధించారు. పైకి చెప్పకపోయినా.. ప్రణబ్ ప్రసంగం ఆర్ఎస్ఎస్ పెద్దలకు అంతగా రుచించనట్లే కనిపించింది. ఏ సాంస్కృతిక, సామాజిక, రాజకీయ సంస్థ.. దేశాన్ని విచ్ఛిన్నం చేయలేదని తెలివిగా మనసులో మాటను ప్రణబ్ వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ భావజాలం క్షుణ్నంగా తెలిసిన ప్రణబ్.. దానిని పరోక్షంగా విమర్శించేందుకు నెహ్రూ సోషలిజంను చాటిచెప్పే ప్రయత్నం చేశారు. బౌద్ధం ఆవిర్భావం నుంచి ఎంత విధ్వంసం జరిగినా దేశం చెక్కుచెదరకుండా ఎలా కొనసాగిందో ప్రణబ్ చాటి చెప్పారు. సాంస్కృతిక ఐక్యమత్యంపై సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పిన అంశాల్ని ప్రస్తావించిన ప్రణబ్.. అదే సమయంలో నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ను ప్రస్తావిస్తూ జాతీయవాదం, దేశభక్తికి అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఎప్పటిలానే తన సొంత ధోరణిలో ప్రణబ్ ప్రసంగం కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని రాజకీయ పునరావాసంగా వాడుకునేందుకు ప్రణబ్ ఏమాత్రం ప్రయత్నించలేదన్న విషయం ఆయన ప్రసంగంతో స్పష్టమైంది. గొప్ప రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తూ హుందాగావ్యవహరించారు. కాంగ్రెస్ సెల్ఫ్‌గోల్ గతంలో ఐదుగురు భారత రాష్ట్రపతులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు హాజరైనా.. ఈ స్థాయిలో ఎన్నడూ ప్రచారం లభించలేదు. ఈ కార్యక్రమ ప్రచార బాధ్యతలు మొత్తం కాంగ్రెస్ పార్టీనే తీసుకుంది. ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి ప్రణబ్ హాజరుపై ఆ పార్టీ అతిగా స్పందించిందని విమర్శలు వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందించకపోయినా.. ప్రణబ్ కుమార్తె శర్మిష్ట ముఖర్జీతో పాటు పలువురు సీనియర్ నేతలతో విమర్శలు చేయించింది. సొంత చరిత్రను గుర్తుచేయాల్సింది: లెఫ్ట్ న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగాన్ని వామపక్షాలు స్వాగతించాయి. ఈ విషయమై సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి స్పందిస్తూ..‘ఆరెస్సెస్ ప్రధానకార్యాలయంలో ప్రణబ్ ఇచ్చిన ప్రసంగంలో మహత్మాగాంధీ హత్య వివరాలు అదృశ్యమయ్యాయి. గాంధీ హత్య అనంతరం అప్పటి హోంమంత్రి పటేల్ అరెస్సెస్‌పై నిషేధం విధించడం, బాపూ హత్యతో అప్పటి ఆరెస్సెస్ శ్రేణులు సంబరాలు చేసుకోవడం.. ఇలాంటి సొంత చరిత్రను ఆరెస్సెస్‌కు ఈ భేటీలో ప్రణబ్ మరింత గట్టిగా గుర్తుచేయాల్సింది’ అని ట్వీట్ చేశారు. కాగా తాము ఊహించినట్లే ప్రణబ్ మాట్లాడారనీ, ఏదేమైనా అయన ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సింది కాదని సీపీఐ వ్యాఖ్యానించింది. -
విభేదించినా విచ్చేసిన ప్రముఖులు..
తమ సిద్ధాంతాలతో విభేదించే జాతీయ నాయకులు, ప్రముఖులకు గతంలో కూడా ఆర్ఎస్ఎస్ ఆహ్వానం పలికింది. ► 1933లో బ్రిటిష్ హయాంలో సెంట్రల్ ప్రావిన్సెస్ హోం మంత్రిగా ఉన్న సర్ మోరోపంత్ జోషిని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ ఆహ్వానించారు. ► 1934 డిసెంబర్ 25న వార్దాలోని ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని మహాత్మా గాంధీ స్వచ్ఛందంగా సందర్శించారు. హెడ్గెవార్‌తో ఆయన చాలా సమయం సంభాషించారు. ► లోక్‌నాయక్ జయప్రకాష్‌నారాయణ్ సంఘ్ కార్యకర్తల సమావేశంలో అతిథిగా పాల్గొన్నారు. ► ప్రముఖ సామాజిక కార్యకర్త అభయ్ భాంగ్, సీబీఐ మాజీ డైరెక్టర్ జోగిందర్ సింగ్, రివల్యూషనరీ పార్టీ ఆఫ్ ఇండియా(గవాయ్)అధ్యక్షుడు ఆర్ఎస్ గవాయ్, నేపాల్ మాజీ సైన్యాధ్యక్షుడు రుక్మాంగద్ కటావాల్లు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు అతిథులుగా హాజరయ్యారు. ► 2007లో సర్సంఘ్చాలక్ కేఎస్ సుదర్శన్ ఆహ్వానంపై మాజీ ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏవై టిప్నిస్ అతిధిగా పాల్గొన్నారు. లౌకికత్వాన్ని గౌరవించాలని, ఇతర మతాల పట్ల ఓర్పు, సహనంతో వ్యవహరించాలని ఆర్ఎస్ఎస్పై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. టిప్నిస్ వాదనను తిప్పికొడుతూ ఒక్కొక్క అంశంపై సుదర్శన్ ప్రసంగించారు. ► 1963 గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను అప్పటి ప్రధాని నెహ్రూ ఆహ్వానించారని, అలాగే రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరాన్ని సందర్శించారని ఆర్ఎస్ఎస్ నేతలు పేర్కొన్నారు. ‘సంఘ్ శిక్షా వర్గ్’ ఏడాదికోసారి జరుగుతుంది. 1927లో హెడ్గెవార్ దీనిని ప్రారంభించినపుడు ‘ఆఫీసర్స్ ట్రైనింగ్ క్యాంప్’గా పిలిచేవారు. అనంతరం సంఘ్ బాధ్యతలు చేపట్టిన గోల్వాల్కర్ దీని పేరును ‘సంఘ్ శిక్షా వర్గ్’గా మార్చారు. సైద్ధాంతికంగా విభేదించినా.. అవసరాన్ని బట్టి నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు ఆర్ఎస్ఎస్తో సంప్రదింపులు, సమాలోచనలు జరిపేవారని తెలుస్తోంది. బాబ్రీ మసీదు విధ్వంసం, మండల్ కమిషన్ వివాదం అనంతరం ఆర్ఎస్ఎస్ పట్ల కాంగ్రెస్ కఠిన వైఖరి ప్రారంభమైందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సహనశీలతే భారతీయత
ప్రణబ్ స్పందించారు. ఆరెస్సెస్ ఆహ్వానాన్ని మన్నించినప్పటి నుంచి వస్తున్న వరుస విమర్శలకు నాగపూర్‌లో జూన్ 7వ తేదీననే జవాబిస్తానన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్.. చెప్పినట్లే ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం వేదికగా గురువారం ఆ విమర్శలకు జవాబిచ్చారు. అనుమానాలు తీర్చారు. సహనశీలతే భారతీయ ఆత్మ అని స్పష్టం చేశారు. జాతీయవాదం ఏ మతానికో, జాతికో సొంతం కాదని తేల్చి చెప్పారు. హిందూ, ముస్లిం, సిఖ్, ఇతర అన్ని వర్గాల సిద్ధాంతాల సమ్మేళనమే జాతీయవాదమని నిర్వచించారు. ద్వేషం సమాజ సామరస్యతను నాశనం చేస్తుందని, అభిప్రాయ బేధాలను చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని హితవు పలికారు. అసహనం, వితండవాదం, మతం ఆధారంగా భారత్‌ను నిర్వచించాలనుకునే ఏ ప్రయత్నమైనా చివరకు దేశ అస్తిత్వాన్నే పలుచన చేస్తుందని హెచ్చరించారు. కోపం, హింస, ఘర్షణల నుంచి శాంతి, సంతోషం, సామరస్యం దిశగా మనమంతా ముందుకెళ్లాలన్నారు. నాగపూర్: ద్వేషం, అసహనం దేశ అస్తిత్వాన్ని బలహీనపరుస్తాయని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. నాగపూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రధాన కార్యాలయంలో గురువారం స్వయం సేవకుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంసేవకులు జరిపిన ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, ఆ తరువాత ప్రణబ్ స్వయం సేవకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆరెస్సెస్ ఆహ్వానాన్ని ప్రణబ్ మన్నించడం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో.. దేశం దృష్టి అంతా ఈ కార్యక్రమం పైనే ఉంది. కార్యక్రమంలో ప్రణబ్ మాట్లాడుతూ.. దేశం, జాతీయవాదం, దేశభక్తిపై తన ఆలోచనలను పంచుకునేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. శతాబ్దాల భారత చరిత్ర, ముస్లిం దురాక్రమణలు, వివిధ సామ్రాజ్యాల ఏర్పాటు, బ్రిటిష్ పాలన..తదితర భారత చరిత్రలోని పలు ముఖ్యమైన ఘట్టాలను, ఆయన తన ప్రసంగంలో గుర్తుచేశారు. ప్రణబ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు: ► ముందుగా మనం దేశం, జాతీయవాదం, దేశభక్తి అనే మూడు పదాల డిక్షనరీ అర్థాలను తెలుసుకుందాం. ► దేశమంటే.. ఒకే సంస్కృతి, ఒకే భాష, చరిత్ర, అలవాట్లను కలిగి ఉన్న ప్రజల సమూహం. జాతీయవాదం అంటే.. ఒక దేశానికి ఉండే గుర్తింపు, ఆ దేశ ప్రయోజనాలకు ఉండే మద్దతు. దేశభక్తి అంటే ఒకరికి తమ దేశంపై ఉండే ఆత్మసమర్పణ, నిబద్ధత. ► భారత్ ఓ బహిరంగ సమాజం.. పట్టు, సుగంధ ద్రవ్యాల ద్వారా ప్రపంచంతో అనుసంధానమైంది. వీటి వాణిజ్య మార్గాల ద్వారా మన సంస్కృతి, విశ్వాసం వంటివి వ్యాపారులు, మేధావుల ద్వారా కొండలు, లోయలు, సముద్రాలు దాటి ప్రపంచమంతా వ్యాపించాయి. హిందుత్వంతో సహా బౌద్ధం మధ్య ఆసియా, చైనాలకు పాకింది. మెగస్తనీస్, హుయనుత్సాంగ్ వంటి వారు భారత సమర్థవంతమైన పాలనా విధానం, గొప్ప మౌలికవసతులతో కూడిన వ్యవస్థలను తమ పుస్తకాల్లో పేర్కొన్నారు. తక్షశిల, నలంద, విక్రమశిల, వలభి, సోమపుర, ఓదంతపురి వంటి విశ్వవిద్యాలయాలు మన పురాతన విద్యా విధానాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. చాణిక్యుడి అర్థశాస్త్రం నాటి పరిపాలన తీరుకు నిదర్శనం. ► ఆ తర్వాత దేశమంతా విస్తరించిన 16 మహాజనపదాలు, చంద్రగుప్త మౌర్యుడు గ్రీకులకు ఓడించి బలమైన భారత సామ్రాజ్యాన్ని నిర్మించడం, తర్వాత అశోకుడు ఆదర్శవంతమైన పాలనను అందించడం.. గుప్తులతోపాటు ఎందరో రాజులు ముస్లిం దురాక్రమణ దారులను అడ్డుకునేందుకు ప్రయత్నించడం.. 300 ఏళ్లపాటు ముస్లిం పాలకులు దేశాన్ని పాలించడం ఇవన్నీ దేశ చరిత్రలో మైలురాళ్లు. వ్యాపారం కోసం వ చ్చిన బ్రిటిషర్లు 190 ఏళ్లు దేశాన్ని తమ బానిసత్వంలో ఉంచుకోవడం మధ్యలో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ఇవన్నీ మనం మరిచిపోలేం. 2500 ఏళ్ల పాటు దేశంలో ఎన్నో రకాలుగా మారిన రాజకీయ పరిస్థితుల్లోనూ 5వేల ఏళ్లకు పైగా మన నాగరిత ఇంకా కొనసాగుతుండటమే భారత్ గొప్పదనానికి నిదర్శనం. ► దేశాన్ని ఒక్కటిగా ఉంచడం, జాతీయత భావాన్ని పెంపొందించడంలో జవహార్‌లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, బాల గంగాధర్ తిలక్ తదితరులను సేవలు మరిచిపోలేనివి. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి వల్లే మనమంతా ఒకే ఒకదేశంగా మారాం. ► భారతదేశం గొప్పదనం ఇక్కడి బహుళత్వం, సహనంలోనే ఉంది. శతాబ్దాలుగా మన ప్రజల సహజీవనం నుంచే ఈ బహుళత్వం పుట్టింది. లౌకికవాదం, సమగ్రత మన విశ్వాసాలు. ► మనం 130 కోట్ల మంది భారతీయలం.. 122 భాషల్లో, 1600 యాసల్లో మాట్లాడుకుంటాం. ఏడు ప్రధాన మత విశ్వాసాలను పాటిస్తాం. అయినా, ఒకే వ్యవస్థలో, జీవిస్తాం. ఒకే జాతీయజెండాను గౌరవిస్తాం. భారతీయత అనే ఒకే అస్తిత్వాన్ని కాపాడుకుంటాం. ఇదే భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. ► వివిధ అంశాలపై మనం వాదించుకోవచ్చు కానీ భిన్నాభిప్రాయాలుండకూడదని చెప్పకూడదు. పరస్పర విరుద్ధ ఆలోచనలున్నప్పటికీ చర్చల ద్వారానే వీటిని పరిష్కరించుకోవాలి. ► శాంతిపూర్వకమైన అస్తిత్వం, కరుణ, జీవితంపై గౌరవం, సామరస్యం వంటివి భారత నాగరికతలోని సహజ సూత్రాలు. ► చిన్నారులు, మహిళలపై అత్యాచారం జరిగిన ప్రతిసారీ.. భారతమాత ఆత్మ క్షోభిస్తుంది. మన సామరస్యపూర్వక సహజీవనాన్ని అనవసర కోపతాపాలు చిన్నాభిన్నం చేస్తున్నాయి. అహింసాయుత సమాజం మాత్రమే ప్రజలంతా ప్రజాస్వామ్య విధానంలో భాగస్వాములయ్యేలా చేస్తుంది. ప్రత్యేకంగా వెనుకబడిన, అణగారిన వర్గాలకు మార్గం చూపిస్తుంది. కోపం, హింస, ఘర్షణ నుంచి శాంతి, సామరస్యం, సంతోషం మార్గంలో మనమంతా పయనించాలి. ► దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఇటీవలి అంతర్జాతీయ సూచీలు తెలియజేస్తున్నాయి. సంతోషం. కానీ సంతోషకర సూచీలో మాత్రం మనం ఇంకా వెనకబడే ఉన్నాం. ► ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే రాజు సంతోషంగా ఉంటాడు. ప్రజల సంక్షేమమే రాజు సంక్షేమం. తనకు ఇంపుగా ఉన్నదానికంటే ప్రజలకు మేలు చేసే పనిని చేయడమే రాజు ముఖ్యమైన ధర్మం. ప్రజల విషయంలో రాజు ఎలా ఉండాలనేదాన్ని కౌటిల్యుడు బాగా వివరించారు. ► శతాబ్దాలుగా ఉన్న ఐకమత్యం, ఆత్మీయీకరణ, అందరూ కలిసి జీవిచడమే మన దేశ గుర్తింపు. ► ‘ఒకే భాష, ఒకే మతం, ఒకే శత్రువు అనేది మన జాతీయవాదం కాదు. (ఆరెస్సెస్ ‘ఒకే దేశం– ఒకే సంస్కృతి’ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ) ► ప్రతిరోజూ మనచుట్టూ హింస పెచ్చుమీరటాన్ని గమనిస్తున్నాం. హింస, భయం, అవిశ్వాసం ఇవన్నీ మన గుండెల్లో పాతుకుపోతున్నాయి. అందుకే ప్రజలను భయం, శారీరక, మానసిక హింస నుంచి స్వతంత్రులను చేయాలి. ► దేశంలో సామాజిక, ఆర్థిక మార్పు తీసుకువచ్చేందుకు లకి‡్ష్యంచిన హక్కుల పత్రం వంటిది భారత రాజ్యాంగం. ఇది 130 కోట్ల మంది భారతీయులు ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపం. ► మహాత్మాగాంధీ, నెహ్రూలు పేర్కొన్నట్లు మన జాతీయతావాదం ఒక్కరికే పరిమితం కాదు, దూకుడు, విధ్వంసకరమైనది కాదు. అందరినీ కలుపుకుని పోవడమే జాతీయతావాదం. ► ప్రజలు వారి దైనందిన జీవితంలో చేయాల్సిన పనులకు సరైన మార్గదర్శకం చేయాలి. ఇదే సంతోషకరమైన జీవితాన్ని ఇస్తుంది. దీంతో సహజంగానే జాతీయతావాదం పెరుగుతుంది. ‘సంఘ్’ భారతీయులందరిదీ స్వయంసేవకుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో మోహన్ భాగవత్ నాగపూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేయాలని కోరుకుంటోందని, తమకు బయటివారంటూ ఎవరూ లేరని ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. తమ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరవడంపై చర్చించడం అర్థరహితమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం తరువాత కూడా ప్రణబ్ ప్రణబ్‌గానే ఉంటారని, సంఘ్ సంఘ్‌గానే ఉంటుందని అన్నారు. ఏటా తమ కార్యక్రమానికి ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని, ఆ పరంపరలోనే ఈసారి ప్రణబ్ వచ్చారని అన్నారు. భిన్నాభిప్రాయాలున్నా మనమంతా భరతమాత పిల్లలమే అన్నారు. నాగపూర్‌లో హెడ్గేవార్ నివాసంలో ప్రణబ్, భాగవత్ అందరినీ కలుపుకుపోతున్నాం.. ‘ఆరెస్సెస్ ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాదు. మాకు బయటివారంటూ ఎవరూ లేరు. ఆరెస్సెస్ భారతీయులందరిదీ. భారత మాత ప్రతి ఒక్కరికీ తల్లి వంటిది. హిందువులు దేశానికి వారసులు. అందరినీ కలుపుకుని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావడం, దేశం పేరు ప్రతిష్టలను మరింత పెంచే కార్యకర్తలను తయారుచేయడమే ఆరెస్సెస్ లక్ష్యం. కుల,మత, ప్రాంత, వర్గ భేదాల్లేకుండా దేశమంతా ఒక్కటేననే భావనను నెలకొల్పుతున్నాం. అందరినీ కలుపుకుని వెళ్లడం ద్వారా క్రమశిక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచాం. ప్రజాస్వామ్య ఆలోచనే ఆరెస్సెస్ అస్తిత్వం. దేశం కోసం పనిచేయడాన్నే మేం విశ్వసిస్తాం. ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్ కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నప్పుడే స్వాతంత్య్ర సమరంలో జైలుకెళ్లారు. చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు మాతో కలిసి పనిచేశారు. జాతి నిర్మాణంలో సమాజమంతా భాగస్వామ్యమైనప్పుడే ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుంది’ అని భాగవత్ అన్నారు. భారతమాత గొప్ప పుత్రుడు హెడ్గేవార్ నాగపూర్: ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరాం హెడ్గేవార్.. భారతమాత ముద్దుబిడ్డ అని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. హెడ్గేవార్ పుట్టిన ఇంటిని సందర్శించిన అనంతరం అక్కడి సందర్శకుల పుస్తకంలో ‘భారతమాత గొప్ప పుత్రుడికి ఘనమైన నివాళులర్పించేందుకు నేను ఇక్కడికొచ్చాను’ అని ప్రణబ్ రాశారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ నాగపూర్ నగరంలోని ఇరుకు వీధులగుండా హెడ్గేవార్ నివాసానికి ప్రణబ్‌ను దగ్గరుండి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లగానే ప్రణబ్ తన పాదరక్షలు తీసి లోపలకు వెళ్లారు. ఈ సందర్భంగా హెడ్గేవార్‌కు సంబంధించిన వివరాలను ప్రణబ్‌కు మోహన్ భాగవత్ వివరించారు. నాగపూర్‌లోని సంఘ శిక్షావర్గ తృతీయ కార్యక్రమానికి స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ కుటుంబసభ్యులను కూడా ప్రత్యేక అతిథులుగా ఆరెస్సెస్ ఆహ్వానించింది. ప్రణబ్ సూచనల్ని ఆచరిస్తారా: కాంగ్రెస్ న్యూఢిల్లీ: ప్రణబ్ ప్రసంగం భారతీయ నాగరిక విలువలతో పాటు బహుళత్వం, లౌకికవాదం, అందర్ని కలుపుకుపోవడాన్ని ఆరెస్సెస్, బీజేపీలకు చూపిందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఈ విషయమై కాంగ్రెస్ నేత సూర్జేవాలా స్పందిస్తూ.. ‘ప్రణబ్ చేసిన విలువైన సూచనల్ని అంగీకరించి ఆరెస్సెస్, బీజేపీలు తమ ఆలోననావిధానం, స్వభావం, ధోరణిని ఈరోజు మార్చుకుంటాయని ఆశిస్తున్నాం. తమ తప్పుల్ని అంగీకరించేందుకు ఆరెస్సెస్ సిద్ధమా? హింసాత్మక, అణచివేత లక్షణాలను విడిచిపెడుతుందా? మహిళలు, పేదలపట్ల అనుసరిస్తున్న పక్షపాత ధోరణిని ఆరెస్సెస్ వదిలివేస్తుందా?’ అని సూర్జేవాలా ప్రశ్నించారు. నాగపూర్‌లో హెడ్గేవార్ -
ప్రణబ్ ఏం మాట్లాడనున్నారు?
మాజీ రాష్ట్రపతి, జీవితకాలం లౌకికవాది గా, కాంగ్రెస్ వ్యక్తిగా నిలిచిన ప్రణబ్ ముఖర్జీ నేడు (గురువారం) నాగపూర్‌లో జరుగుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) కార్యక్రమం లో ఏం మాట్లాడబోతున్నారని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐదు దశాబ్దాలకు పైగా కొనసాగిన రాజకీయ జీవితంలో ఆయన అనేక ప్రసంగాలు చేశారు. ఐదేళ్లు రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనూ వివిధ సందర్భా ల్లో తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. వాటి లో ప్రధానంగా ప్రస్తావించదగినవి 2012లో ఆయన రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా చేసిన ప్రసంగం.. మరొకటి, 2017లో రాష్ట్రపతిగా చేసిన చివరి ప్రసంగం. 2012లో.. 2012లో లౌకికత, ప్రజాస్వామ్యం, సమాన త్వం తదితరాలను ప్రస్తావించినప్పటికీ.. ప్రధానంగా పేదరిక నిర్మూలన, ఉగ్రవాదం, అవినీతిపై పోరు.. తదితర అంశాలపైనే ఎక్కువగా ఆయన ప్రసంగం కేంద్రీకృతమైంది. ‘భారతదేశ అభివృద్ధిలో తాను కూడా భాగస్వామినేనని దేశంలోని అత్యంత పేదవాడు కూడా విశ్వసించినప్పుడే అది నిజమైన అభివృద్ధి. ఆకలిని మించిన బాధ, వేదన లేదు. ఆధునిక భారతదేశ డిక్షనరీలో నుంచి పేదరికం అనే పదాన్ని లేకుండా చేసేందుకు మనమంతా కృషి చేయాలి’ అని నాడు ప్రణబ్ పేర్కొన్నారు. మన భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపాలైన గుడి, మసీదు, చర్చి, గురుద్వారా.. ఇవన్నీ సఖ్యతగా సాగినప్పుడే సామాజిక సామరస్యత సాధ్యమవుతుంది’ అని కూడా నాడు ప్రణబ్ వ్యాఖ్యానించారు. 2017లో.. గత సంవత్సరం చేసిన ప్రసంగంలో ప్రణబ్ ముఖర్జీ ప్రధానంగా లౌకికత్వం, సామరస్య పూర్వక సహజీవనం పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ‘నా ఇన్నేళ్ల జీవితంలో నేను అర్థం చేసుకున్న కొన్ని వాస్తవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సహనశీలత, భిన్నత్వం.. వీటిలోనే మన భారతీయ ఆత్మ నిలిచి ఉంది. భారత్ అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతమే కాదు.. భిన్న ఆలోచనలు, విభిన్న తాత్వికతలు, మేధో భావనలు, అత్యుత్తమ విలువలు, సృజనాత్మక కళా నైపుణ్యాలు.. ఇవన్నీ కలగలసిన చరిత్రే భారత్. శతాబ్దాల ఆలోచనల ఫలితంగా మన దేశ భిన్నత్వం రూపుదిద్దుకుంది. సాంస్కృతికంగాను, భాషా విశ్వాసాల్లోనూ భిన్నత్వం మన ప్రత్యేకత. సహనశీలత మన బలం. మన అభిప్రాయాల్లో బేధాలుండొచ్చు.. మనం వాదించుకోవచ్చు.. కానీ విభిన్న అభిప్రాయాలను గౌరవించాలని మనం శతాబ్దాలుగా మన ఆలోచనల్లో, మన రక్తంలో ఇంకించుకున్న ఉన్నత భావనను మాత్రం తొలగించుకోవద్దు. అదే మన దేశ ఔన్నత్యం. దాన్ని కోల్పోతే మన మౌలిక వ్యక్తిత్వాన్నే కోల్పోయినట్లు’ అని ప్రణబ్ ముఖర్జీ నొక్కి చెప్పారు. 2018లో.. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో స్వయం సేవకులను ఉద్దేశించి ప్రణబ్ ఏం ప్రసంగించబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. ఆరెస్సెస్ విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తారా? లేక సూచనలు, సలహాలు ఇస్తారా? ఇవన్నీ కాకుండా.. సంఘ్ సిద్ధాంతాలకు జై కొడతారా? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఆరెస్సెస్ ఆహ్వానాన్ని ప్రణబ్ అంగీకరించడాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల సీనియర్లు కొందరు ఇప్పటికే తప్పుబడుతున్నారు. నాగపూర్ వెళ్లొద్దంటూ లేఖలు, ఫోన్ల ద్వారా ఆయనకు సలహా ఇచ్చారు. అయితే, ‘వీటన్నింటికీ నా స్పందనను నాగపూర్‌లోనే వెల్లడిస్తా’ అని ఇప్పటికే ప్రణబ్ కూడా తేల్చి చెప్పారు. కొన్నేళ్ల క్రితం ప్రముఖ సామాజిక కార్యకర్త, మెగసేసే అవార్డ్ గ్రహీత అభయ్ బంగ్ను కూడా ఆరెస్సెస్ ఆహ్వానించింది. అప్పుడూ ఆయనపై విమర్శలు వచ్చాయి. ‘నా అభిప్రాయాలు చెప్పేందుకు ఏ వేదికైనా ఒకటే’ అంటూ అభయ్ అప్పుడు స్పందించారు. అభిప్రాయాలు వెల్లడించడాన్ని లెఫ్ట్ తప్పుపట్టడాన్ని కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు ఆరెస్సెస్ కార్యక్రమంలో ప్రణబ్ పాల్గొనడాన్ని స్వాగతిస్తున్న వారు కూడా అదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు. ఇక ప్రణబ్ పయనమెటో తేలాలంటే.. మరి కొద్దిగంటలు వేచి చూడాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ద.కొరియా మాజీ అధ్యక్షురాలికి 24 ఏళ్ల జైలు
సియోల్: అవినీతి కేసులో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హైకి 24 ఏళ్ల జైలు శిక్ష పడింది. దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్రకెక్కిన గుయెన్ అతి తక్కువ కాలంలోనే ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. లంచం, అధికార దుర్వినియోగం వంటి పలు కేసుల విచారణలో పార్క్ దోషిగా తేలారు. ‘ప్రముఖ వ్యాపారవేత్త చోయి సూన్ సిల్‌తో కలసి దాదాపు రూ.140 కోట్లకు పైగా డబ్బును పార్క్ లంచంగా డిమాండ్ చేశారు’అని న్యాయమూర్తి కిమ్ సే యూన్ పేర్కొన్నారు. ‘పార్క్‌కు 24 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నాను. అలాగే దాదాపు రూ.11 లక్షలు జరిమానా విధిస్తున్నాను’అని తీర్పు వెలువరించారు. దక్షిణ కొరియా నియంత పార్క్ చుంగ్ హీ కుమార్తె అయిన గ్వెన్ 2013లో అధికారంలోకి వచ్చారు. నాలుగేళ్ల లోపే ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆందోళనల మధ్య ఆమె గద్దె దిగారు. -
భారీ కుంభకోణం: పార్క్‌కు 24ఏళ్ల ఖైదు
సియోల్: దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గెన్ హై(66)కు 24 ఏళ్ల జైలు శిక్ష పడింది. అవినీతి కేసులో భారీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెకు ఈ శిక్షను ఖరారు చేశారు. దేశ ప్రథమ మహిళా అధ్యక్షురాలిగా కొనసాగిన ఆమె అనూహ్య రీతిలో పతనమయ్యారు. లంచం, అధికార దుర్వినియోగం, క్రిమినల్ ఆరోపణలపై సుమారు 10 నెలల పాటు పార్క్ గెన్ను విచారించారు. మాజీ అధ్యక్షురాలు పార్క్ గెన్ సుమారు 2.2 కోట్ల డాలర్ల మేర అవినీతికి పాల్పడినట్లు ధృవీకరించినకోర్టు తీర్పును వెలువరించింది. అధ్యక్ష అధికారాలను ఆమె దుర్వినియోగం చేశారు. తద్వారా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడంతోపాటు దేశ వ్యవహారాల్లో భారీ గందరగోళం తీసుకొచ్చారని న్యాయమూర్తి కిమ్ సే-యున్ వ్యాఖ్యానించారు. ఆమెకు విధించిన కఠిన శిక్ష భవిష్యత్ నాయకులకు ఒక గుణపాఠం కావాలన్నారు. ప్రాసిక్యూషన్ 30 సంవత్సరాలు శిక్షను కోరగా ..సాక్ష్యాధారాలను పరిశీలించిన ముగ్గురు జడ్జీల బెంచ్ ఆమెకి 24 ఏళ్ల జైలుశిక్షతో పాటు, 17 మిలియన్ డాలర్ల జరిమానా విధించారు. మరోవైపు న్యాయస్థానం తీర్పును ప్రసారం చేయాలని నిర్ణయించిన తరువాత తీర్పును వినడానికి ఆమె సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టుకు హాజరు కాలేదు. అంతేకాదు పార్క్ మరియు ఆమె న్యాయవాదులు కూడా పాల్గొనడానికి నిరాకరించారు. దక్షిణ కొరియాలో ఇలా జరగడం మొదటిసారి. దీనికి సంబంధించిన చట్టాన్ని గత సంవత్సరం ఆమోదించిన తర్వాత తీర్పును లైవ్ టెలికాస్ట్ చేశారు. అటు కోర్టు వెలుపల వందల కొద్దీ మద్దతుదారులు పెద్ద ఎత్తున గుమి గూడారు. బిగ్ స్క్రీన్‌పై కోర్టు తీర్పును పరికించారు. అనంతరం కొరియా, అమెరికా జెండాలతో పార్క్ విడుదలను డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. 2012లో పార్క్ దేశ మొదటి మహిళా అధక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాలుగేళ్లకే ఆమెపై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమెను అభిశంసించాలని ఆ దేశ పార్లమెంటు కూడా నిర్ణయించింది. అంతేకాదు ఈ భారీ కుంభకోణంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ ఇరుక్కున్న సంగతి తెలిసిందే. అధ్యక్షురాలు పార్క్ , ఆమె స్నేహితురాలు చోయ్ సూన్ సిల్ ద్వారా శాంసంగ్‌కు భారీ ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. -
ఎల్పీయూ అవార్డుల ప్రదానం
న్యూఢిల్లీ: ఉత్తమ పాఠశాలలు, ఉపాధ్యాయులకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ‘ఎల్పీయూ ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్’ అవార్డులను తన నివాసంలో ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా 89 పాఠశాలలు, 29 కోచింగ్ సెంటర్లకు రూ. కోటి విలువైన గ్రాంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రోత్సాహకంగా నగదు బహుమతులను అందజేశారు. విద్యార్థులతో మాట్లాడేందుకు వీలుగా ‘ప్రణబ్ సర్ కి పాఠశాల’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలి కార్యక్రమంలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ) విద్యార్థులతో ముచ్చటిస్తూ.. రిజర్వేషన్లు, సమానత్వం, భావి భారత దార్శనికత తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. -
కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ఒబామా
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనూ ట్రెండింగ్‌గా ఉండేందుకు ఒబామా ప్రయత్నించేవారు. అలాగే అధ్యక్ష పదవినుంచి వైదొలిగిన తరువాత కూడా ఆయన వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. ఇతర మాజీ అధ్యక్షులకు భిన్నంగా కొత్త సంప్రదాయానికి తెరతీశారు. తాజాగా.. 2017లో తనకు నచ్చిన పుస్తకాలు, పాటల టాప్-12 జాబితాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి నెటిజన్ల నుంచి ఊహించని మద్దతు వస్తోంది. ఫిక్షన్ రచనలతో పాటు పలు రకాల రచనలు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. అందులో మొదటి స్థానంలో నయోమి అల్డెర్మ్యాన్ రచించిన ‘ది పవర్’ నిలిచింది. అలాగే 2017లో తన మనసును చూరగొన్న పాటల జాబితాను ఆయన విడుదల చేశారు. ఇదిలావుండగా.. ఒబామా మనసుకు నచ్చిన పుస్తకాలు, పాటల జాబితాపై పలువురు కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. I️ CANT BELIEVE OBAMA SAID HAVANA WAS ONE OF HIS FAVORITE SONGS OF THE YEAR I️ AM REALLY CRUYING OH MY GOD DONT LOOKA T ME — camila (@Camila_Cabello) 31 December 2017 Obama posted his favorite songs of ‘17 and one of them was Broken clocks by @sza and since I also love that song i think we should just give this man a third term 🤷🏽♀️ — Lloyd (@unBRE_lievable) 1 January 2018 My goal is to someday have a book that I wrote on Obama’s reading list 🙏 https://t.co/HSVS2hcdjO — Brinley (@brinlliance1) 1 January 2018 -
యెమెన్ మాజీ అధ్యక్షుడి హత్య
సనా: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న యెమెన్‌లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్(75)ను హతమార్చినట్లు హుతి తిరుగుబాటుదారులు ప్రకటించారు. దేశంలో నెలకొన్న సంక్షోభం ముగిసిందనీ.. సలేహ్, ఆయన మద్దతుదారుల్ని హతమార్చినట్లు తిరుగుబాటుదారుల అధీనంలోని అల్–మసీరా చానెల్ పేర్కొంది. మరోవైపు తిరుగుబాటుదారులు తీవ్రగాయాలతో ఉన్న సలేహ్ మృతదేహాన్ని ట్రక్కులో చేరుస్తున్న వీడియో ఒకటి ఆన్లైన్లో కన్పిస్తోంది. 3 దశాబ్దాల పాటు యెమెన్‌ను పాలించిన సలేహ్ అరబ్ విప్లవం నేపథ్యంలో 2012లో ఉద్వాసనకు గురయ్యారు. అనంతరం యెమెన్ అధ్యక్షుడైన మన్సూర్ హదీకి వ్యతిరేకంగా హుతి తిరుగుబాటుదారులతో చేతులు కలిపారు. దీంతో దేశంలో అంతర్యుద్ధం రాజుకుంది. ప్రాణభయంతో హదీ సౌదీ అరేబియాకు పారిపోవడంతో సలేహ్ హుతి రెబల్స్‌తో కలిసి మూడేళ్ల కిత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. కానీ ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తడంతో వారం రోజుల క్రితమే సలేహ్ హుతి రెబల్స్ నుంచి విడిపోయారు.