![కలాంకు బాలీవుడ్ ఘన నివాళి - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71438059886_625x300.jpg.webp?itok=yauabGdX)
కలాంకు బాలీవుడ్ ఘన నివాళి
ముంబై : భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం ఆకస్మిక మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్ఫూర్తిమంతమైన దార్శనికత, శాస్త్ర రంగంలో ఆమోఘమైన ప్రతిభ పాటవాలు, రాజకీయాలు తెలియని వ్యక్తి రాష్ట్రపతిగా ఆ పదవిని చేపట్టి వన్నె తెచ్చిన తీరుతో అబ్దుల్ కలాం ప్రపంచంలోని ప్రతి ఒక్కరి ప్రేమకు పాత్రులయ్యారని వారు ఘనంగా నివాళులర్పించారు. కలాంతో తమకు గల అనుబంధాన్ని బాలీవుడ్ ప్రముఖులు మంగళవారం ట్విట్టర్లో ఇలా వివరించారు.
అమితాబ్ బచ్చన్ : అబ్దుల్ కలాం మేధస్సు అద్భుతం... ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించేవారు... ఉదారభావంతో వ్యవహారించే వారు... ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.
షారూఖ్ ఖాన్: గురుదాస్పూర్లో తీవ్రవాదుల దాడి వార్తతో విచారంలో మునిగాను. ఆ వెంటనే భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇక లేరు అని వార్త విని షాక్ గురయ్యాన్. వీరందరికి ఆత్మ శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.
సల్మాన్ ఖాన్: అనేక తరాల భారతీయులకు అబ్దుల్ కలాం సాబ్ స్ఫూర్తి ప్రదాత అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. కలాంను కలవాలని చాలా సార్లు ప్రయత్నించాను. అందుకు చాలా ప్రయత్నం చేశానన్నారు. నేనే కాదు... భారతీయులంతా ఆయన్నీ మిస్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రియాంక చోప్రా: అబ్దుల్ కలాం మృతి భారత్కు తీరని లోటని ప్రియాంక చోప్రా తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
ఏ ఆర్ రెహమాన్: యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన అబ్దుల్ కలాం మరణం గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు.
అనుపమ్ ఖేర్: అబ్దుల్ కలాం గారు.... మీ దేశభక్తికి, మీ స్ఫూర్తివంతమైన జీవితానికి, మీ జ్ఞానానికి ధన్యవాదాలన్నారు.
కబీర్ బేడీ: అబ్దుల్ కలాం నిజమైన స్ఫూర్తి ప్రదాత
సాజిద్ ఖాన్: రాష్ట్రపతిగా ఉన్న ఆయన రాజకీయ నాయకుడిగా వ్యవహరించలేదు. అబ్దుల్ కలాం గొప్ప మానవతా వాది.