Abdul Kalam APJ
-
కలాం వర్ధంతి: నివాళులర్పించిన వైఎస్ జగన్
తాడేపల్లి, సాక్షి: మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి నేడు. ఈ సందర్భంగా.. కలాంను కొనియాడుతూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘దేశం గర్వించే శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాష్ట్ర పతిగా అబ్దుల్ కలాం గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి అంటూ యువతలో స్ఫూర్తిని నింపిన మిస్సైల్ మ్యాన్ ఆయన. ఒక మారుమూల గ్రామంలో జన్మించి, దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఆయన ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం. నేడు అబ్దుల్ కలాంగారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’’ అని ఎక్స్ ఖాతాలో జగన్ పోస్ట్ చేశారు.దేశం గర్వించే శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాష్ట్ర పతిగా అబ్దుల్ కలాం గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ``కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి`` అంటూ యువతలో స్ఫూర్తిని నింపిన మిస్సైల్ మ్యాన్ ఆయన. ఒక మారుమూల గ్రామంలో జన్మించి, దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఆయన ఎదిగిన…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 27, 2024కలాం 9వ వర్ధంతిని పురస్కరించుకుని ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు. ‘‘శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం.. స్ఫూర్తిదాయకమైన వ్యక్తి’’ అని వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతాలో కలాంకు నివాళులర్పించారు. Remembering Dr. APJ Abdul Kalam, Former President of India, great scientist, and inspiring personality, on his death anniversary. His vision, humility, and unwavering dedication to education and innovation continue to inspire us. Let's honour his legacy by striving for excellence… pic.twitter.com/6u4B1tZsvD— Vijayasai Reddy V (@VSReddy_MP) July 27, 2024 -
నిన్ను సంతోషంగా కానీ.. దుఃఖంతో కానీ.. ఉంచేది నీ మనసే!
మీరు పిల్లలు... మార్పు మీ దగ్గరే ప్రారంభం కావాలి. ప్రయత్న పూర్వకంగా కొన్ని మంచి లక్షణాలు పసి వయసులోనే అలవాటు చేసుకోవాలి. దీనికి ఉపకరించేవి పెద్దలు, గురువులు చెప్పే మాటలు.. అలాటిదే శతక నీతి కూడా... ఇప్పడు మనం తెలుసుకుంటున్న ‘తన కోపమె తన శత్రువు...’ సూక్తి సుమతీ శతకం లోనిది. మన కోపం ఎక్కువగా మనల్నే నష్టపరుస్తుంది, మనం ప్రశాంతంగా ఉంటే మనం నేర్చుకునే విషయాలపట్ల మనకు ఏకాగ్రత కుదురుతుంది. ఎదుటివారు కష్టంలో ఉంటే ఆదుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి... అంటూ మన సంతోషమే మనకు స్వర్గం, మన దుఃఖమే మనకు నరకం అంటారు బద్దెన గారు. పోతన గారు ఓ మాటంటారు... ‘‘వ్యాప్తిం బొందక వగవక /ప్రాప్తంబగు లేశమైన బదివే లనుచుం/దృప్తిం జెందని మనుజుడు/ సప్తద్వీపముల నయిన? జక్కంబడునే?’’ అంటే...లభించినది కొంచెం అయినా అదే పదివేలుగా భావించి తృప్తి పొందాలి. అలా తృప్తి పడనివారికి సప్తద్వీపాల సంపదలు వచ్చిపడినా కూడా తృప్తి తీరదు....అంటారు. ‘నన్ను ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులున్నారు, నాకు మంచి స్నేహితు లున్నారు. నేను మంచి పాఠశాలలో చదువుతున్నా. నాకు మంచి గురువులున్నారు..అలా మనకు ఉన్నవేవో వాటిలోని మంచిని తలుచుకుంటూ మన ప్రయత్నం, మన అభ్యాసం మటుకు నిజాయితీగా చేయాలి. ఇది చేయకుండా అంటే ఉన్నవాటిలోని మంచిని చూడకుండా... లేనివి ఏవో పనిగట్టుకుని ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? ఉన్న పుణ్యకాలం గడిచిపోతుంది. అలా నిత్యం దిగాలుగా ఉండి చేతిలో ఉన్న సమయాన్ని కూడా వృథా చేసుకునేవాడిని ఆ దేముడు కూడా కాపాడలేడు. నిన్ను సంతోషంగా కానీ దుఃఖంతో కానీ ఉంచేది నీ మనసే. దానిని అదుపు చేసుకో, దానికి నచ్చ చెప్పు. దాని మాట నీవు వినడం కాదు, నీ మాట అది వినేటట్లు చేసుకో. అది నీ చేతిలో ఉంది. అది ఇతరుల వల్ల సాధ్యం కాదు. అలా ఆలోచించి నిత్యం తృప్తిగా, సంతోషంగా ఉంటూ పనులు చక్కబెట్టు కుంటుంటే అదే నీకు స్వర్గం. మీకొక రహస్యం చెబుతా. మనం అందరం చెప్పుకునే స్వర్గలోకం శాశ్వతం కాదు.. మనం చేసిన మంచి పనుల వల్ల మనం స్వర్గం చేరుకునేది నిజమే అయినా... అది మన ఖాతాలో పుణ్యం ఉన్నంతవరకే. అది అయిపోగానే ... మనం పడిపోతాం. కానీ ఇక్కడ ఈ మనుష్య జన్మ నీకు దక్కింది... 84 లక్షల జీవరాశుల్లో దేనికీ దక్కని అదృష్టం వల్ల నీకు దక్కిన ఈ జన్మ సార్థకం చేసుకోవాలంటే ... నీవు దొరికిన దానితో తృప్తిపడి... నిత్యం సంతోషంగా ఉంటే... నీ జీవితాంతం అలా ఉండగలిగితే... ఇక్కడే నీకు స్వర్గ సుఖాలు లభించినట్లు. అలాకాక నా స్నేహితుడు మంచి మార్కులతో ఉత్తీర్ణుడవుతున్నాడు, నేను కాలేకపోతున్నా... అని తలుచుకుంటూ నువ్వు ఏడుస్తూ కూర్చుంటే... నీ నరకాన్ని దేముడు కాకుండా నీవే సృష్టించు కున్నట్లయింది. జన్మజన్మలకూ నీవు కూడా సంతోషంగా ఉండాలంటే, నీకు కూడా నీ స్నేహితుడి లాగా సరస్వతీ కటాక్షం పొందాలంటే.. కష్టపడు, బాగా చదువు. ఈ జన్మలో నీకు వచ్చిన విద్య పదిమందికి పంచు, కష్టంలో ఉన్నవాడికి నీకు చేతనయినంత సహాయం చెయ్యి. నిత్యోత్సాహంతో ఉండు. ఫెయిల్ అయ్యావు... అంత మాత్రానికే లోకం తల్లకిందులయిపోయినంతగా దిగాలు పడొద్దు... అబ్దుల్ కలాం గారు.. ఎఫ్.ఎ..ఐ.ఎల్..ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్... అన్నారు. అంటే నీవు నేర్చుకోవడానికి నీవు చేసిన మొదటి ప్రయత్నం అది అన్నారు.. ఇప్పుడు నీవేం చేయాలి.. రెండో ప్రయత్నం. పట్టుదలతో, ఏకాగ్రతతో సాధించు... అంతే తప్ప నీ అరచేతిలో నీవు సృష్టించుకోగలిగిన స్వర్గాన్ని నీవే కిందకు నెట్టేసి నరకాన్ని చేతులారా తెచ్చిపెట్టుకోవద్దు. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అబ్దుల్ కలాంకు సీఎం జగన్ నివాళి
-
ఈ మౌన ముని.. ‘పోఖ్రాన్–2’ పథ నిర్దేశకుడు
1996 మే 8. ప్రధాని కార్యాలయం నుంచి ఏపీజే అబ్దుల్ కలాంకు వర్తమానం వచ్చింది – రాత్రి 9 గంటలకు ప్రధానిని కలవమని. పి.వి.నరసింహారావు ప్రధాని. కలాం ప్రధానికి శాస్త్ర సాంకేతిక విషయాల సలహాదారు, డీఆర్డీఓ కార్యదర్శి. ‘‘కలాంగారూ, నేను తిరుపతి వెళ్తున్నాను. అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్, మీ బృందం పరీక్షలకు సిద్ధంగా ఉండండి. నా అనుమతి కోసం వేచి ఉండండి. ఈ పరీక్షలకు డీఆర్డీఓ, డీఏఈ సిద్ధంగా ఉండాలి’’– అని కలాంకు ముఖాముఖిగా చెప్పారు పీవీ. అది ఎన్నికల సమయం. 1996 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం లభించలేదు. 1996 మే 16న మాజీ ప్రధాని నరసింహారావు, అబ్దుల్ కలాం, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డైరెక్టర్ ఆర్. చిదంబరం కలసి అంతకుముందురోజే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అటల్ బిహారీ వాజ్‌పేయిని కలిశారు. పీవీ ప్రధానికి ఓ చీటీ ఇచ్చారు. వాజ్‌పేయి కేవలం 13 రోజులు పని చేసి, మెజారిటీ చాలదనే కారణం మీద జూన్ 1న బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు 1998 మార్చిలో జరిగాయి. మార్చి 19న వాజ్‌పేయి మళ్లీ ప్రధాని అయ్యారు. 2004 మే 22 దాకా పదవిలో ఉన్నారు. 2004 క్రిస్మస్ రోజులు. డిసెంబర్ 23న పీవీ కన్నుమూశారు. గ్వాలియర్‌లో వాజ్‌పేయి రచయితల సమావేశంలో మాట్లాడుతూ ‘ఈ విషయం బయటికి చెప్పవద్దని పీవీ కోరారు. కానీ ఆయనే గతించారు. చెప్పడం తన విధి’ అని ప్రకటిస్తూ 1996 మే 16న అందుకున్న చీటీలోని విషయం వివరించారు. ‘సామగ్రి తయ్యార్ హై’ అని రాసిన చీటీ లోగుట్టు చెప్పేశారు. ‘అణుపరీక్షలకు అంతా సిద్ధం, నిరభ్యంతరంగా ముందుకెళ్ళవచ్చు’ అని దాని అంతరార్థం. పీవీనే పోఖ్రాన్– 2 న్యూక్లియర్ ప్రోగ్రాం మూలపురుషుడు అని ఆ రోజు వాజ్‌పేయి ప్రకటించి ఉండకపోతే మనకు సాధికారంగా తెలిసి ఉండేదికాదు. ఆంధ్రప్రదేశ్‌లో పీవీ ప్రారంభించిన భూసంస్కరణలు, విద్యాసంబంధమైన పలు చర్యలు ఆయనను తెలుగు ప్రాంతంలో చిరంజీవిని చేశాయి. ప్రధానిగా చేసిన ఆర్థిక సంస్కరణలు, విదేశీ వ్యవహారాలలో భారత్ ధోరణి, హ్యూమన్ రిసోర్సెస్ మంత్రిగా చేసిన మార్పులు నేటికీ కొనసాగుతున్నాయి. అయితే, అణుశక్తి రంగంలో ఆయన చూపిన చొరవ, వ్యూహం గురించి ఎక్కువ ప్రస్తావన రాలేదు. 1996 మే నెలలో జరగవలసిన అణుపరీక్షలు నరసింహారావు మళ్ళీ అధికారంలోకి రాకపోవడం వల్ల ఆగిపోయాయి. నిజానికి 1995 డిసెంబర్లో ఒకసారి ప్రయత్నాలు మొదలై, ఆరునెలలు వాయిదా పడ్డాయి. 1995 నవంబర్ చివర్లో ప్రధాని అణు పరిశోధనా బృందాల నాయకులు అబ్దుల్ కలాం, ఆర్.చిదంబరంకు టి–30 కార్యక్రమం నిర్దేశించారు. ముప్పయి రోజుల్లో అణుపరీక్షలు జరగాలని అంతరార్థం. అయితే డిసెంబర్ 15న న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆ దేశ ఉపగ్రహాలు సేకరించిన సమాచారం మేరకు భారతదేశం అణుపరీక్షలు జరుపుతోందని వార్త ప్రచురించి సంచలనం రేపింది. మరోవైపు సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం (సీటీబీటీ), అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)లపై సంతకాలు చేయాలా, వద్దా అని దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి డిసెంబర్లో అణు పరీక్షలు జరుపలేదు. మరి మళ్ళీ ఆరునెలలకే ఎందుకు అణుపరీక్షలు జరపాలని భావించారు పీవీ? ఎందుకంటే 1995 డిసెంబరు నాటికి హైడ్రోజన్ బాంబు సిద్ధం కాలేదు. శాస్త్రవేత్తలు ఆరు నెలల వ్యవధి అడిగారు. అంతేకాకుండా థార్ ఎడారిలో పోఖ్రాన్ దగ్గర అణుపరీక్షలకు సిద్ధం చేయడంలో గూఢచారి ఉపగ్రహాల కెమెరా కళ్ళను ఎలా బురిడీ కొట్టిం చాలో కూడా ఈ వ్యవధిలో మన శాస్త్రవేత్తలు నేర్చుకున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాలు మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఉంటే 1995 డిసెం బర్లో కొన్ని పరీక్షలు జరిపి ఉండేవారు పీవీ. కానీ ఆయన ఆవిధంగా ఆలోచించలేదు. నరసింహా రావు కనుమూయడానికి కొన్నినెలల ముందు జర్నలిస్టు శేఖర్ గుప్తా ఈ విషయం అడిగితే– ‘భయ్యా కొన్ని రహస్యాలు నా పాడెతోనే పోనీవోయ్’ అని పీవీ అనడం అందరూ టీవీల్లో చూశారు. పోఖ్రాన్–2 అణుపరీక్షల తర్వాత ప్రపంచం సులువుగానే భారతదేశాన్ని అంగీకరించింది. అదేవిధంగా పీవీ ధోరణికి తగినట్టుగానే తరవాత వచ్చిన ప్రధానులు సీటీబీటీ, ఎన్పీటీ ఒప్పందాలపై సంతకాలు చెయ్యలేదు. కనుకనే ఈ విషయాలన్నీ దగ్గరగా చూసిన అబ్దుల్ కలాం– దేశభక్తితో అలరారే రాజనీతిజ్ఞుడు పీవీ అని కొనియాడటం ఎంతో అర్థవంతం అనిపిస్తుంది. వ్యాసకర్త సైన్స్ రచయిత, వర్తమాన అంశాల వ్యాఖ్యాత మొబైల్ : 94407 32392 డా. నాగసూరి వేణుగోపాల్ -
అబ్దుల్ కలాం జీవిత చరిత్రపై ఆన్లైన్ పోటీలు
కవాడిగూడ: మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం జీవిత చరిత్రపై ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఆన్లైన్ పోటీలను నిర్వహించనున్నట్లు లీడ్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ (లిప్స్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ చించల రాంచందర్, ఉపాధ్యక్షుడు ఆరుకాల రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ... లిప్స్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఎన్.బి.సుదర్శన్ ఆచార్య సూచన మేరకు కోవిడ్–19 నేషనల్ చాంపియన్‌షిప్ ఆన్లైన్ పోటీలు మొదటి లెవల్–1 పరీక్ష ముగిసిందని ఆగస్టులో లెవెల్–2, సెప్టెంబర్‌లో లెవెల్–3 పోటీలు పూర్తవుతాయన్నారు. అన్ని జిల్లాలు, పట్టణ, మండల కేంద్రాల్లో అబ్దుల్ కలాం చాంపియన్ షిప్ ఆన్లైన్ పోటీల్లో పాల్గొనేందుకు ఔత్సాహికులు ముందుకు రావాలన్నారు. అదే విధంగా అబ్దుల్ కలాం వర్ధంతి రోజున రాష్ట్రంలోని లిప్స్ జిల్లా కన్వీనర్లు, కో కన్వీనర్లు ఆయా జిల్లాల్లో సంస్మరణ సభలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. అక్టోబర్ 15న అబ్దుల్ కలాం ప్రఖ్యాత అవార్డులను ప్రదానం చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయి లో ఈ నెల 27 సాయంత్రం వెబినార్ సమా వేశంతో పాటు ఫేస్బుక్, ట్విట్టర్లైవ్లో ప్రముఖులు పాల్గొనవచ్చన్నారు. లిప్స్ ప్రధాన కార్యదర్శి కష్టం అనిల్‌కుమార్ బా బు, సహాయ కార్యదర్శి కోయిలకొండ శ్రీకాంత్‌రెడ్డి, కోశాధికారి ఆర్. శ్రీనివాస్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బానాల రాఘవ, సలహాదారులు కందాల పాపిరెడ్డి, జలజం సత్యనారాయణ, జె.పి.రెడ్డి, కడారి అనంతరెడ్డి పాల్గొన్నారు. -
కలాం ఆశయాలకు కార్యరూపం
రైతు భరోసా కేంద్రాల వల్ల భవిష్యత్‌లో అద్భుతాలు చూస్తాం.. సాక్షి ప్రతినిధి, తిరుపతి/చిత్తూరు అగ్రికల్చర్: ‘రైతు భరోసా కేంద్రాలను పరిశీలించాక రాష్ట్ర ప్రభుత్వానికి రైతులపై ఎంతటి చిత్తశుద్ధి ఉందో స్పష్టంగా తెలిసింది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ఆశయాలకు కార్యరూపంగా అద్భుతమైన ప్రణాళికతో ఆర్బీకే వ్యవస్థను ప్రభుత్వం రూపొందించింది. కలామ్ ఆలోచనల మేరకు పట్టణ ప్రాంతాల్లోని సదుపాయాలను గ్రామీణ ప్రాంతాలకు చేరువ అయ్యేలా వీటిలో ఏర్పాట్లు చేశార’ని తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చర్ క్యాంపస్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత జి.కృష్ణారెడ్డి చెప్పారు. ఆర్బీకేల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను తెలుసుకునేందుకు చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని సి.రామాపురం, పూతలపట్టు మండలం వావిల్‌తోట, గంగాధర నెల్లూరు మండలం వేల్కూరు, చిత్తూరు మండలం బీఎన్ఆర్ పేట గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. అక్కడి ఆర్బీకేలలో గుర్తించిన విషయాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. వ్యవసాయ రంగానికి మంచి ప్రోత్సాహం రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి ప్రోత్సాహం అందించారు. సేంద్రియ విధానంతో కూరగాయలను సాగు చేస్తున్నాం. సకాలంలో సూచనలు, సలహాలు ఇచ్చేవారు లేక ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది. – రాగమ్మ, మహిళా రైతు, కుప్పం బాదూరు, ఆర్సీ పురం మండలం ఏం కావాలన్నా చిత్తూరు వెళ్లాల్సి వచ్చేది పంటల సాగుకు ఏం కావాలన్నా 15 కిలోమీటర్ల దూరంలోఉన్న చిత్తూరు వెళ్లాల్సి వచ్చేది. అధిక ధరల భారంతో పాటు, రవాణా ఖర్చు కూడా ఎక్కువ అయ్యేవి. ఇప్పుడు రైతు భరోసా కేంద్రం ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి వాటిని గ్రామంలోనే పొందే వెసులుబాటు కలిగింది. – టి.గోవిందయ్య, రైతు, వేల్కూరు, గంగాధర నెల్లూరు మండలం రైతుల ఇంటికే విత్తనాలు సి.రామాపురం ఆర్బీకేని పరిశీలించేందుకు వెళ్లగా.. రామ్మోహన్ అనే రైతు కనిపించారు. ఆయన్ని కదిలించగా ‘మండల కేంద్రానికి వెళ్లి విత్తనాలు తెచ్చుకునేవాళ్లం. గంటల తరబడి నిరీక్షించినా విత్తనాలు దొరికేవి కాదు. అనవసర ఖర్చు పెరిగేది. ఇప్పుడవేవీ లేకుండా ఆర్బీకే ద్వారా విత్తనాలు ఇంటికే వచ్చాయి’ అని చెప్పారు. వేల్కూరు ఆర్బీకేలో ఏకాంబరం అనే రైతును పలకరించగా.. పశువులకు చిన్నపాటి వైద్యం కోసం కూడా ఐదారు కిలోమీటర్లు తీసుకెళ్లాల్సి వచ్చేదని, రోజంతా దానికే సరిపోయేదని చెప్పారు. ఇప్పుడు అవసరమైతే పశు వైద్యుడే వచ్చి వైద్యం చేసేలా సౌకర్యాలు కల్పించారని చెప్పారు. భూసార పరీక్షలు నిర్వహించడం, సేంద్రియ కషాయాలు ఉండడం, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ల ద్వారా పంటల సాగుకు సూచనలు, సలహాలు ఇవ్వడం, వ్యవసాయ పనిముట్లు అందుబాటులోకి రానున్న విధానాన్ని తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యాను. ఉత్పత్తుల వివరాలన్నీ కియోస్క్‌లో ఇస్తే మరింత మేలు రైతుల వద్ద ఉన్న ఉత్పత్తుల వివరాలు, వాటి ధరలను కూడా పొందుపరిస్తే మరింత ప్రయోజనం కలుగుతుంది. ఉదాహరణకు కుప్పం, పలమనేరు మార్కెట్లలో ప్రతి వారం రూ.కోటి విలువైన మేకలు, గొర్రెల విక్రయాలు జరుగుతాయి. కియోస్క్‌లో గొర్రెల పెంపకందారుల వివరాలు, వారి వద్ద ఉన్న జీవాల వివరాలు, ధరలను పొందుపరిస్తే.. వ్యాపారి నేరుగా వెళ్లి కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల దళారీ వ్యవస్థను సంపూర్ణంగా నిరోధించవచ్చు. -
కలాం విజన్ ఇదీ..
దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ప్రజల్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. 2020 నాటికి భారత్ ఎలా ఉండాలో, దాని రూపురేఖలు ఎలా మారిపోవాలో ఆయనకు ఎన్నో అంచనాలున్నాయి. 2000 సంవత్సరంలో కలాం నేతృత్వంలో శాస్త్ర, సాంకేతిక రంగంలోని టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ (టీఐఎఫ్‌ఐసీ)కు చెందిన 500 మంది నిపుణులతో విజన్–2020 డాక్యుమెంట్ రూపొందించారు. అప్పటికి భారత్ రూపురేఖలు ఎలా మారిపోవాలో ఆయన వైఎస్.రాజన్ తో కలసి ‘2020: ఏ విజన్ ఫర్ ది న్యూ మిలీనియం’పేరుతో పుస్తకాన్ని తీసుకొచ్చారు. భారత్‌లో ఉన్న సహజవనరులు, మానవ వనరులు, భారతీయుల్లో నెలకొన్న పోటీతత్వం మన దేశాన్ని శక్తిమంతమైన దేశాల సరసన నిలబెడుతుందని అంచనా వేశారు. విద్యతోనే దేశ సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని 2020 నాటికి భారత్ అన్ని రంగాల్లోనూ దూసుకుపోయి అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరుతుందని ఆకాక్షించారు. అవినీతి రహిత సమాజం ఏర్పాటు కావాలంటే అక్షరాస్యత పెరగాలన్నారు. ‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’అంటూ యువతకు పిలుపునిచ్చారు. భారత్ ఆర్థికంగా ఉచ్ఛ స్థితికి చేరుకోవాలంటే 2020 నాటికి స్థూల జాతీయోత్పత్తి 11 శాతంగా ఉండాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాల కల్పన జరిగితేనే దేశంలో ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని అభిప్రాయపడ్డారు. కలాం కన్న కలలకు అందరూ సలాం చేసినా ఆయన అంచనాలకు దేశం ఏ మాత్రం చేరుకోలేకపోయింది. పైగా సరికొత్త సవాళ్లు పుట్టుకొస్తున్నాయి. -
'కలాం పేరిట అవార్డులు ఇవ్వడం గొప్ప విషయం'
సాక్షి, విజయవాడ : విజయవాడలోని గ్లోబల్ క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ ఆఫ్ ఫిలాన్తరోపిక్ సొసైటీ ఆధ్వర్యంలో అబ్దుల్ కలామ్ అవార్డ్స్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు మరువలేనివి. అటువంటి వ్యక్తి పేరు మీద అవార్డులు అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవార్డు అందుకొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. సమాజ మార్పు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద పీట వేశారు. మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేన్లు కల్పించిన ఘనత మా ప్రభుత్వానిదేనని మంత్రి వెల్లడించారు. రాజ్యాంగ పదవిలో ఉన్నా సామాన్య జీవితం గడిపిన అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని మనందరం ఆదర్శంగా తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. కలాం ఆశయాలను జగన్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజికి న్యాయానికి ముఖ్యమంత్రి జగన్ కట్టుబడే ఉన్నారని పేర్కొన్నారు. -
ఇస్రో ప్రగతిలో త్రిమూర్తులు
సౌండింగ్ రాకెట్ స్థాయి నుంచి చంద్రయాన్–2 ప్రయోగం దాకా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎన్నో మైలురాళ్లను దాటింది. విక్రమ్‌సారాభాయ్, ప్రొఫెసర్ సతీష్ ధవన్ దేశఅంతరిక్ష ప్రయోగాలకు బీజాలు వేశారు. ఆ తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం వాటిని విజయపథంలో నడిపించేందుకు ఎంతో కృషి చేశారు. నేడు ఇస్రో సాధిస్తున్న విజయాల్లో వీరి పాత్ర కీలకం. ప్రపంచ దేశాల్లో భారత్‌కు గుర్తింపు వచ్చిందంటే దాని వెనుక వీరు వేసిన బాటలో నడిచిన శాస్త్రవేత్తలు ఎందరో ఉన్నారు. సాక్షి, సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగాల పితామహులు విక్రమ్‌సారాభాయ్, సతీష్ ధవన్ వేసిన బీజాలతో నేడు వినువీధిలో ఇస్రో విజయపతాకాన్ని ఎగురవేస్తోంది. డాక్టర్ విక్రమ్‌సారాబాయ్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థను బుడి బుడి అడుగులతో నడిపించగా, తప్పటడుగులు లేకుండా సజావుగా నడిపించిన శాస్త్రవేత్త సతీష్ ధవన్. ఆ తరువాత ఏపీజే అబ్దుల్ కలాం ఇస్రోను ముందుకు నడిపించారు. 1972లో విక్రమ్‌సారాభాయ్ దురదృష్టవశాత్తు మరణించారు. ఆ తరువాత ప్రభుత్వం అంతరిక్ష పరిశోధన సంస్థను ఎవరు నడిపించగలరని వెతుకుతుండగా అందిరి అలోచనల్లో పుట్టిన వ్యక్తి ప్రొఫెసర్ సతీష్ ధవన్. విక్రమ్‌సారాభాయ్ మరణానంతరం 1979లో షార్ కేంద్రంగా అంతరిక్ష పరిశోధనలను ఆనాటి ఇస్రో చైర్మన్ సతీస్ ధవన్, మరో ముఖ్యశాస్త్రవేత్త, దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నడిపించారు. షార్ నుంచి చేపట్టిన తొలిప్రయోగం ఎస్ఎల్వీ–3 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఏపీజే అబ్దుల్‌కలాం(ఫైల్) వీరిద్దరి సారధ్యంలో షార్ నుంచి మొదట ప్రయోగించిన ఎస్ఎల్వీ–3 విఫలమైనప్పుడు నిరాశ,నిస్పృహలకు లోనైన సహచర శాస్త్రవేత్తల వెన్నుతట్టి మరో ప్రయోగానికి కార్యోన్ముఖులను చేశారని ఈ నాటికి వారి గురించి తెలిసిన సహచర శాస్త్రవేత్తలు చెప్పుకోవడం విశేషం. ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ వంటి భారీ రాకెట్ల ప్రయోగానికి ఆద్యుడిగా ఇస్రో చరిత్రలో నిలిచిపోయారు సతీష్ ధవన్. ఆ తరువాత యూఆర్ రావు, కసూర్తిరంగన్, మాధవన్నాయర్, ప్రస్తుతం డాక్టర్ కే రాధాకృష్ణన్, ఏఎస్ కిరణ్‌కుమార్ వంటి అతిరథ మహారధులు ఇస్రో చైర్మన్లుగా అంతరిక్ష ప్రయోగాలను కొత్త పుంతలు తొక్కిస్తూ ప్రపంచ దేశాల్లో భారత్‌ను బలమైన దేశంగా నిలబెట్టారు. ఇస్రో తొలినాళ్లలో సరైనా సాంకేతిక పరిజ్ఞానం లేక చిన్నచిన్న ఉపగ్రహాలను ప్రయోగించుకుంటూ రష్యా, ప్రాన్స్ ంటి దేశాలకు చెందిన అంతరిక్ష సంస్థలపై ఆధారపడి పెద్ద పెద్ద ఉపగ్రహాలను పంపేది. నేడు ఆ స్థాయిని దాటి విదేశాలకు చెందిన ఉపగ్రహాలను వాణిజ్యపరంగా పంపిస్తూ సంవత్సరానికి సరాసరిన సుమారు రూ.1000కోట్లకుపైగా ఆదాయాన్ని గడిస్తోంది. ఇప్పటి వరకు 30 దేశాలకు చెందిన 297 ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించి త్రిబుల్ సెంచరీకి చేరువలో ఉంది. అదే ఇస్రో ఇప్పటి వరకు 30 ఉపగ్రహాలను మాత్రమే విదేశాల నుంచి పంపించింది. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ చంద్రయాన్–1, మంగళ్యాన్–2, నేడు చంద్రయాన్–2 వంటి గ్రహాంతర ప్రయోగాలు చేసే స్థాయికి ఎదిగింది. నేడు అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచంలో భారత్ నాలుగో దేశంగా అవతరించనుండడానికి ఆనాటి అంతరిక్ష పితామహులు వేసిన బీజాలే కారణం. నేటి తరం శాస్త్రవేత్తలు ఇస్రో భాహుబలి రాకెట్‌గా పేరు పొందిన జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ ద్వారా సుమారు నాలుగు టన్నుల బరువు కలిగిన చంద్రయాన్–2 మిషన్ ద్వారా చంద్రుడిపై పరిశోధనలకు సిద్ధమవుతున్నారు. భారత అంతరిక్ష పరిశోధనలకు త్రిమూర్తులు చేసిన కృషిని మరిచిపోకుండా కేరళలోని రాకెట్ విడిభాగాల తయారీ కేంద్రానికి విక్రమ్ సారాభాయ్ స్పేస్‌సెంటర్, శ్రీహరికోటకు వెళ్లే మార్గానికి విక్రమ్ సారాభాయ్ మార్గ్, శ్రీహరికోట హైలీ అల్టిట్యూడ్ రేంజ్ (షార్) కేంద్రానికి ప్రొఫెసర్ సతీష్ ధవన్ పేరుతో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌గా, బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రానికి ప్రొఫెసర్ యూఆర్‌రావు శాటిలైట్ సెంటర్లుగా నామకరణాలు చేసి వారికి అంకితం ఇవ్వడం విశేషం. -
గుండె గుడిలో ఆ దీపం వెలగాలి
ఒక్కొక్కప్పుడు పెట్టుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకోలేకపోవచ్చు. విచారించనవసరం లేదు. మీరు కష్టపడ్డారు. త్రికరణశుద్ధిగా కృషి చేసారు. మీరు లక్ష్యాన్ని చేరుకోలేకపోతే తప్పు కాదు. కానీ అసలు లక్ష్యం లేకపోవడం మాత్రం దారుణం. జీవితంలో లక్ష్యం ఉండి తీరాలి. దాన్ని సాధించగలనన్న నమ్మకం ఉండాలి. అందుకే అబ్దుల్ కలాంగారు విద్యార్థుల చేత తరువాత ప్రతిజ్ఞగా ‘‘నేను నా విశ్వాసం అంత యువకుడను. సందేహమంత వృద్ధుడను. కాబట్టి నా హృదయంలో విశ్వాసం అనే దీపాన్ని వెలిగిస్తాను’’ అని ప్రమాణం చేయించారు.మనిషికి విశ్వాసం, సందేహం పక్కపక్కనే ఉంటాయి. ఈ పని నేను చేయగలననుకుంటాడు. ఆ మరు క్షణంలోనే ‘చేయగలనా?’ అనుకుంటాడు. అందుకే నమ్మకం దృఢంగా ఉండాలి. ఒకప్పుడుకలాంగారిని ఇరాన్ నుంచి వచ్చిన కొందరు దివ్యాంగులయిన విద్యార్థులు కలిసారు. వారిలో ఆత్మ స్థయిర్యాన్ని నింపడానికి కలాంగారు ఒక కవిత రాసి వినిపించారు. ‘‘మీ శరీరంలో అక్కడక్కడా వైక్లబ్యాలు ఉండవచ్చు. కానీ మీలో భగవంతుడున్నాడు. మీకు ఎప్పుడు ఏది అవసరమో దానిని ఆయన ఎప్పుడూ భర్తీచేసి కాపాడుతూ ఉంటాడు.’’ అని చెపుతుండగా కాళ్ళు సవ్యంగా లేని ఒక విద్యార్థి చేతికర్రల సాయంతో వచ్చి కలాం గారి పక్కన నిలబడి తాను రాసిన ఒక కవితను ఆయన చేతికిచ్చాడు. అందులో ఇలా ఉంది –‘‘నాకు కాళ్ళు సరిగా లేవు. వంచలేను. కానీ ఎంతటి గొప్పవాడు నా ఎదురుగా ఉన్నా, మహారాజయినా వారి ముందు వంగవలసిన అవసరాన్ని నాకా భగవంతుడు కల్పించలేదు’’ అని ఉంది. ఆ కుర్రవాడి ఆత్మస్థయిర్యం చూసి కలాంగారు చలించి పోయారు.చేతులు తెగిపోయినా, కాళ్ళు రెండూ పూర్తిగా లేకపోయినా వారి పనులు వారు చేసుకోవడమే కాదు, చిత్రకళలవంటి కళల్లో, క్రీడల్లో కూడా రాణిస్తున్నారు. కష్టపడి చదివి పరీక్షకు వెళ్ళేముందు క్షణంలో తండ్రి చనిపోతే, గుండె దిటవు చేసుకుని తండ్రి ఆకాంక్షలను నెరవేర్చడానికి వెళ్ళి పరీక్షలు రాసి వచ్చిన పిల్లలున్నారు. ఆ విశ్వాసం, ఆ ధైర్యం చెదిరిపోనంత కాలం మిమ్మల్ని పడగొట్టడం ఎవరికీ సాధ్యంకాదు.మీరు ఎంత ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకున్నా మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రయాణం మొదలు పెట్టిన తరువాత ప్రతిబంధకాలు వచ్చి తీరుతాయి. అవి లేకుండా ఎవరి జీవితమూ గడవదు. సానబెడితే తప్ప వజ్రానికి కాంతి రాదు. అగ్నితప్తం చేసి సాగదీస్తే తప్ప బంగారం కూడా ఆభరణం కాదు. కష్టాలు అనుభవిస్తేనే రాణించి ప్రకాశించేది. సూర్యుడి కాంతిని అరచేతిని అడ్డుపెట్టి ఎవరూ ఆపలేరు. ధర్మంతో ముందుకెడుతున్న వాడిని ఆపగలిగిన ధైర్యం ఎవరికీ ఉండదు. వాడు ప్రకాశించి తీరతాడు. అబ్దుల్ కలాం, సచిన్ టెండూల్కర్... ఇలా గొప్పవాళ్ళయిన వారంతా జీవితంలో భయంకరమైన కష్టాలు అనుభవించి వచ్చినవారే. మొక్క పెరుగుతున్నప్పుడు పైన ఏదో అడ్డువచ్చిందని ఆగిపోదు, దిశ మార్చుకుని పెరుగుతూ అడ్డు తొలగంగానే తిరిగి నిటారుగా పైకి లేస్తుంది. సీతాకోక చిలుకల్లా రంగులతో ఎగరాలంటే గొంగళి పురుగు దశ దాటాల్సిందే. బురదలోంచి వచ్చిన తామరపువ్వు సువాసనలు వెదజల్లుతూ వికసించినట్లుగానే మీరంతా ఆత్మ విశ్వాసంతో వికసనం చెందాలి. అటువంటి ధైర్యంతో, పూనికతో మీరంతా ముందుకు నడవాలన్న బలమైన ఆకాంక్షతోనే కలాంగారు విద్యార్థులతో ఈ ప్రతిజ్ఞలు చేయించారు. -
అన్ని వికారాలకు అదే మూలం
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటూ సామాజిక పరిశుభ్రతకోసం పరితపించిన వారిలో విశేషంగా చెప్పుకోదగిన వ్యక్తి మహాత్మాగాంధీ. అబ్దుల్ కలాంగారు కూడా అందుకే ‘‘స్వచ్ఛమైన భూగోళం కోసం, స్వచ్ఛమైన శక్తికోసం నిరంతరం శ్రమిస్తాను’’ అని విద్యార్థులచేత ప్రమాణం చేయించేవారు. ఇంకొన్ని రోజుల్లో ప్రాణం వదిలిపెట్టేస్తారన్నప్పుడు కూడా ఆయన విపరీతంగా బాధపడిన అంశం–మన దేశంలో చాలా మంది ఆరోగ్యం నశించిపోవడానికి కారణం– ప్లాట్‌ఫారమ్ మీద ఆగి ఉండగా ప్రయాణికులు రైళ్లలోని శౌచాలయాల్లో మలమూత్ర విసర్జన చేయడం–అన్న విషయం. అలా చేసినప్పడు అవి స్టేషన్లలోని పట్టాల మధ్యలోనిలిచి పోతాయి. వాటిమీద వాలిన ఈగలు, దోమలు, సూక్ష్మక్రిములు అక్కడే తిరుగుతూ ప్లాట్‌ఫారాలమీద అమ్మే, ప్రయాణికులు తినే ఆహార పదార్థాలమీద వాలి నేరుగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రైలు ప్రయాణికులలో చంటిపిల్లలు, వృద్ధులు, రోగులు మాత్రమే కాదు, అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నవారు కూడా వ్యాధిగ్రస్తులవుతారు. చదువుకున్నవారయినా, చదువులేనివారయినా అక్కడ ప్రయాణ హడావుడిలో విచక్షణ కోల్పోయి అనారోగ్యానికి బలవుతున్నారు. విద్యార్థులుగా మీరు దీని పట్ల అవగాహన పెంచుకుని మీరు పాటించడమే గాదు, మీ ఎదురుగా మరెవరయినా స్టేషన్లలో ఆగి ఉన్న రైళ్ళలో శౌచాలయాలు వినియోగించకుండా చూడండి.అలాగే పల్లెలు, పట్టణాలు,నగరాలు అనే తేడా లేకుండా అనుసరిస్తున్న మరొక చెడ్డ అలవాటు – బహిరంగ మలమూత్ర విసర్జన. ఇది మన పరిసరాలను, మన ఆరోగ్యాన్నే కాకుండా మన దేశ గౌరవాన్ని కూడా పాడు చేసి అప్రతిష్ఠ తీసుకు వస్తున్నది. మరుగుదొడ్లు కట్టుకుంటామంటే ఇప్పుడు ప్రభుత్వాలుకూడా డబ్బిస్తున్నాయి. అలాగే శక్తి ఎప్పడూ కూడా స్వచ్ఛమైనదై ఉండాలి. నేను ఏది తింటే అది నాకు శక్తిగా మారుతుంది. మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే మంచి రోగనిరోధక శక్తితోపాటూ మంచి శక్తిని కూడా పొందుతున్నా. కుళ్ళిన ఆహారాన్ని తీసుకుంటే వెంటనే శరీరం రోగగ్రస్థమైపోయి నీరసపడిపోతాం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం, వ్యాయామాల ద్వారా బలంగా ఉంచుకోవడం ఒక ఎత్తు అయితే సమస్త శక్తులకూ కారణమయిన మనసుని కూడా శుభ్రంగా ఉంచుకోవడం మరొక ఎత్తు. కళ్ళతో, చెవులతో, ముక్కుతో, స్పర్శతో మనం గ్రహించే వాటితో మన మనసు కూడా ప్రభావితమవుతుంది. అందువల్ల మనం లోపలికి గ్రహించే వాటిపట్ల మనం సర్వదా అప్రమత్తంగా ఉండాలి. నిల్వ ఉన్న పదార్థాలు, మసాలా పదార్థాలు తీసుకుంటే అవి మీ ఆరోగ్యాన్నేకాక, మీ మనసును కూడా ప్రభావితం చేస్తాయి. అలా కాకుండా మీ మనసును ఎంతగా నియంత్రించి శక్తిమంతం చేసుకుంటే మీమనస్సులోంచి అంత మంచి ఆలోచనలు వస్తాయి. మీరు ఎంత మంచి ఆహారాన్ని పుచ్చుకుంటే అంత మంచి శక్తి మీ శరీరం నుండి విడుదలవుతుంది.నిలకడగా ఒక చోట ఉండగలిగేటట్లు, మీ ఆలోచనలను స్థిరంగా ఉంచగలిగేటట్లు, మీ చదువుసంధ్యలపట్ల మీ శ్రద్ధాసక్తులు నిశ్చలంగా ఉండేటట్లు మీ శరీరాన్ని, మీ మనసును నియంత్రించుకోగలగాలి. ప్రయత్నపూర్వకంగా అది అది అలవాటుగా చేసుకోవాలి. అలా వ్యక్తిగతంగా మీ వద్ధి, తద్వారా మీ వంటి ఉత్తమ పౌరులతో దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. అపురూపం హతజోడి:హతజోడి లేదా హస్తజోడి అనేది ఒక అరుదైన మూలిక. రెండు మూడంగుళాల పరిమాణంలో ఉండే ఈ మూలిక చూడటానికి ముకుళించిన హస్తాల రూపంలో ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇది ఎక్కువగా నేపాల్‌లోని లుంబినీ లోయలోను, అమర్కంటక ప్రాంతంలోను దొరుకుతుంది. ఉమ్మెత్తజాతికి చెందిన ఒక మొక్కకు చెందిన మూలిక ఇది. మొక్క బాగా ఎదిగిన తర్వాత దాని వేళ్లు జోడించిన చేతుల ఆకారంలోకి రూపుదిద్దుకుంటాయి. హతజోడి మూలికను చాముండేశ్వరీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. దృష్టిదోష నివారణకు, దుష్టశక్తుల కారణంగా తలెత్తే అనర్థాల నివారణకు హతజోడి మూలిక అద్భుతంగా ఉపయోగపడుతుందని తంత్రశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. పూజ మందిరంలో చాముండేశ్వరీ దేవి ఎదుట హతజోడి మూలికను ఉంచి, దానిని ఎర్రని పుష్పాలు, ఎర్రని అక్షతలతోను, ధూప దీప నైవేద్యాలతోను అర్చించాలి. దీనిని ఉంచి చాముండేశ్వరి హోమం జరిపించడం మరీ శ్రేష్ఠం. అలా పూజించిన తర్వాత ఎర్రని వస్త్రంలో కట్టి డబ్బు భద్రపరచే చోట ఉంచినట్లయితే, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. దీనిని తాయెత్తులో ఉంచి భుజానికి లేదా మెడలో ధరించినట్లయితే, కార్యసిద్ధి, మానసిక స్థైర్యం కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు కుదుటబడతాయి. – పన్యాల జగన్నాథ దాసు -
అబ్దుల్ కలాం బయోపిక్‌లో బాలీవుడ్ స్టార్..!
సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా ప్రస్తుతం అని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే సినీ తారలు, క్రీడాకారుల జీవితాలతో పాటు పలువురు రాజకీయ నాయకుల కథలు కూడా వెండితెర మీద సందడి చేస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో ప్రముఖుడు చేరనున్నాడు. మిసైల్ మ్యాన్‌గా భారత దేశానికి ఎన్నో సేవలందించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం జీవితాన్ని సినిమాగా రూపొందించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు నిర్మాతలు అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్‌ను హాలీవుడ్ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ టైటిల్ రోల్లో కనిపించనున్నారట. ఇప్పటికే కథ విన్న అనిల్ కపూర్ నటించేందుకు సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది. -
బతకడం అంటే పునర్నిర్మాణం
సన్మార్గ నిర్దేశకులనైన మహోన్నతులు ఎక్కడెక్కడనో కాదు, మనసుతో చూస్తే మన చుట్టూనే అతి సామాన్యులుగా జీవిస్తూ కనబడుతుంటారు. ఆ విషయాన్ని అబ్దుల్ కలాం ‘నా జీవన గమనం కలల సాకారం’ స్పష్టంగా వివరించింది.రామసేతు నిర్మాణ ప్రదేశమైన ధనుష్కోడి దర్శనార్థం వెళ్లే హిందువులను రామేశ్వరం నుండి అక్కడికి పడవ ద్వారా చేరవేసేవాడు జైనులాబ్దిన్. అదే అతనికి జీవనాధారం. అయితే, 1964లో భారీ తుఫాను వచ్చి అతని పడవ ధ్వంసమైంది. అది అతనికి కొత్తేమీ కాదు. ఆ విధంగా జరిగినప్పుడల్లా మరో కొత్త పడవని నిర్మించుకునేవాడు. సాధారణంగా ఇటువంటి సమయంలో అతడి చేతికింద అబ్దుల్ కలాం ఉండేవాడు. ఆ తండ్రి కొత్త పడవలో కూర్చుని అలలకి ఎదురుగా తన ప్రయాణాన్ని యథావిధిగా మొదలుపెట్టేవాడు. ‘బ్రతకడం అంటే కష్టాలని ఎదుర్కొని జీవితాన్ని పునర్నిర్మించుకోవడమే’ అన్న గొప్ప సారాంశాన్ని కుమారునికి వారసత్వంగా అందించాడు. సాధారణంగా భారతీయులు తమ మాటామంతిలో కులమతాల నుండి ఎంతటి ఆదర్శవంతునికైనా సరే మినహాయింపు ఇవ్వరు, ఒక్క కలాంకు తప్ప. ఈయనని కేవలం భారతీయుడిగా మాత్రమే గౌరవించడానికి ఇష్టపడతారు. అందుకు కారణం ఆయన ప్రతీ మతంలోని గొప్ప అంశాలని గుర్తించి గౌరవించడమే. కలాం తండ్రి జైనులాబ్దిన్ రామేశ్వరంలోని మసీదుకు ఇమామ్. పక్షి లక్ష్మణశాస్త్రి రామనాథ ఆలయ అర్చకులు. ఫాదర్ బోడల్ చర్చికి ప్రీస్ట్. ముగ్గురూ వర్తమాన స్థితిగతుల గురించి చర్చలు జరుపుతుండేవారట. ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నా రామేశ్వరం మాత్రం ప్రశాంతంగా ఉండేదట. దీని గురించి కలాం ఈ విధంగా చెప్పారు: ‘పట్టణంలో శాంతి భద్రతలు నిలిచి ఉండటానికి ముఖ్యమైనది ప్రజల మధ్య సరైన ప్రచార ప్రసారం’ అని. బహుశా ఆ ముగ్గురి మైత్రీ ప్రభావమేమో కలాం మహనీయత! స్క్వార్జ్ హైస్కూలు నుండి ఇస్రో వరకు సాగిన ప్రస్థానంలో ఎప్పటికప్పుడు వెంటే ఉండి ముందుకు తోసిన జ్ఞాపకాలని పొందుపరిచారు కలాం. ‘కలలు అనేవి నిద్రలో వచ్చి కరిగిపోయేవి కావు. అవి మనలని నిద్ర పోనివ్వకుండా చేయాలి’ అని చెప్పిన ఈ మిస్సైల్ మాన్ ఒక ఆవేదనని కూడా వ్యక్తం చేశారు. ‘ఈ సమాజం ప్రస్తుత పరిస్థితిని ప్రశ్నించకుండా ఉండటం నేర్చుకున్నది’ అని. రేపటి తరానికి అది అలవర్చటం కోసమే కావొచ్చు, తరచూ పిల్లల్ని కలిసి ఏదైనా ప్రశ్నించమని కోరేవారు. ‘నేను కూడ ఒక అన్వేషినే. మీతో జరిపే చర్చల ద్వారా నేనూ కొన్ని సమాధానాలు వెతుక్కుంటున్నాను’ అంటూ వికసించే మొగ్గలతో గడిపిన జ్ఞాపకాలని అక్షరీకరించారు. ఈ పుస్తకం కేవలం ఆలోచింపజేయడమే కాదు, ఆచరణ వైపు కదిలిస్తుంది కూడా. కె.నందన్‌కుమార్ గౌడ్ -
అబ్దుల్ కలాంకు వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, హైదరాబాద్ : మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ప్రఖ్యాత శాస్త్రవేత్త, దార్శనికుడు, మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఎన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించినప్పటికీ.. నిరాడంబరత్వానికి ఆయన ప్రతీక అని ఈ సందర్భంగా కొనియాడారు. అబ్దుల్ కలాం సదా స్ఫూర్తిదాయకమని, ప్రపంచ సృజనాత్మక కేంద్రంగా భారత్ వర్ధిల్లాలన్న కలాం స్వప్నం నిజం కావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. #AbdulKalam You have been a great influence and inspiration. I hope India carries on with your dream of seeing India as the world’s innovation hub. #MissileMan pic.twitter.com/I3me4j7tp8 — YS Jagan (@YSJagan4CM) 15 October 2018 -
చిన్ని నా బొజ్జకు... అనుకుంటే ఎలా ?
కుల, జాతి, మత, రాష్ట్ర భేదాలు లేకుండా ఎవరోఒకరి జీవితాన్ని రక్షించడానికి లేదా వృద్ధిలోకి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను–అన్నది అబ్దుల్ కలాం విద్యార్థులచేత చేయించిన నాలుగో ప్రతిజ్ఞ. నిజానికి ఈ మాటలు ఎక్కడివంటే...అబ్దుల్‌కలాంగారిని చాలా ప్రభావితం చేసిన వ్యక్తులు ఇద్దరు. ఒకరు మహాత్మా గాంధీ. మరొకరు నెల్సన్ మండేలా. వీరిద్దరూ అంటే ఆయనకు చాలా గౌరవం. బారిష్టర్ చదువుకోవడానికి విదేశాలకు వెడుతున్నప్పుడు గాంధీగారి తల్లి ఆయనకు చెప్పిన మాటలు ఇవి. ఆమె ఏమన్నారంటే...‘ ‘మనిషిగా పుట్టినందుకు ఒకరికి ఉపకారం చేయాలి. దానికి ముందు – నా కులం వాడా, నా మతం వాడా, నా జాతి వాడేనా, నా భాష వాడేనా వంటివి చూడొద్దు. ఈ తేడా చూపకుండా ఎవరో ఒక్కరి నైనా సరే, వాళ్ళ జీవితాన్ని రక్షించడానికి లేదా వద్ధిలోకి తీసుకురావడానికి నీవు కారణం కావాలి. మనిషికీ , మిగిలిన జీవులకూ తేడా అక్కడే ఉంది’’ అని. ఆకలితో ఉన్న పులికి నిండు గర్భంతో ఉన్న జింక కనబడినా దానిని ఆహారంగానే చూస్తుంది తప్ప ఇతరత్రా ఆలోచించదు. పెద్ద చేప చిన్న చేపలను మింగేస్తుంది. అది వాటి స్వభావం. కానీ మనిషి మాత్రం –‘‘నేనొక్కడినీ బతకడం గొప్పకాదు, నా చుట్టూ ఉన్న ప్రాణులనూ కాపాడవలసిన బాధ్యత నాది’’ అనుకుంటాడు. మండుటెండలోనుంచి వెళ్ళి మనిషి ఒక చెట్టు నీడన సేదతీరతాడు. ‘‘నేను దీని నీడను అనుభవిస్తున్నాను’’ అనుకుని కాసిన్ని నీళ్ళు దానికి పోస్తాడు. ఆ చెట్టే కాదు, ఏ చెట్టయినా దానికి కొద్దిగా నీళ్ళు పోసే ప్రయత్నం చేయగలగాలి. ఏదో ఒక ప్రాణికి ఇంత ఆహారం పెట్టగలగాలి. తమిళనాడులో ఒక వ్యక్తిని చూసా. ఆయనకు మామిడితోట ఉంది. చాలా చెట్లున్నాయి. అన్ని చెట్లనుంచి కాయలు కోసుకుంటాడాయన. కానీ ఒక్క చెట్టును మాత్రం కోయకుండా అలా వదిలేస్తాడు. ఎందుకలా అని అడిగితే – మామిడిచెట్టంటూ ఉంటే పళ్ళు తినడానికి రామచిలుకలు వస్తాయి. నా తోటలోని కాయలన్నీ నేనే తినేయడం ఎందుకండీ. ఒక చెట్టును వాటికి వదిలేస్తా. రేపు పొద్దున వచ్చి చూడండి. చెట్టుమీద కాయలను మీరు లెక్కపెట్టగలరేమో కానీ ఆనందంతో రెక్కలు విప్పుకుని వచ్చే చిలుకలను లెక్కపెట్టలేరు. ఆ అందం చూసి అనుభవించే తృప్తి ఎంత ఖర్చుపెట్టినా దొరకదు. ఇన్ని చెట్లకాయలను నేనొక్కడినీ తినలేకపోతే అమ్ముకుంటాను...కానీ ఆ చిలకలు మాత్రం వాటికి ఎంత అవసరమో అంతే తింటాయి. తప్ప తుంచుకెళ్ళవు, కింద పడేయవు. మళ్ళీ రేపొచ్చి తింటాయి.’’ అని చాలా తన్మయత్వంతో చెప్పాడు. అంతేకాదు నూకలు(విరిగిన బియ్యం) తెప్పించి రోజూ కొద్దిగా పొలంలోని మూలల్లో చీమల పుట్టల దగ్గర రోజూ చల్లుతుంటాడు. ‘‘చిన్ని నాబొజ్జకు... అని మాత్రమే అనుకోను. నాతోపాటూ నాలుగు ప్రాణులు తినాలి కదండీ’’ అంటాడు. ‘‘అన్ని ప్రాణులకూ ఆకలి ఒక్కటే. నేను తినకుండా వాటికి పడేయడం లేదు కదా, అటువంటప్పడు కాసిని వాటికి కూడా పెట్టడానికి అభ్యంతరం ఎందుకుండాలి’’అని కూడా అంటాడు. అంటే మనిషి మిగిలిన ప్రాణుల్లా బతకకూడదు. అవి భూతదయతో ఉండే అవకాశం లేదు. కానీ మనిషి తానొక్కడూ బతకడం కాదు,‘‘మరొక ప్రాణి బతకడానికి, మరొకరు వృద్ధిలోకి రావడానికి నేను ప్రయత్నిస్తున్నానా..??’’ అని తనను తాను నిత్యం ప్రశ్నించుకుంటూ ఉండాలి.’’ - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
జైత్రయాత్ర నీ కుటుంబం నుంచే ప్రారంభించు
కలాంగారు రాష్ట్రపతి పదవిలో ఉండగా, ఆయన అన్నగార్లు, వాళ్ళపిల్లలు, బంధువులు చాలా మంది రాష్ట్రపతిభవన్ చూడడానికి వస్తామని ఉత్తరం రాసారు. బంధువులు కదా, రావద్దని ఎందుకంటారు ! అందర్నీ రమ్మన్నారు. వారు వచ్చారు. భోజన ఫలహారాలు తీసుకుంటూ . రెండూమూడురోజులు అక్కడే గడిపి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. వారటు వెళ్ళంగానే కలాంగారు తన కార్యాలయ సిబ్బందిని పిలిచి...‘‘మా బంధువులు అక్కడ విడిదిచేసిన ఫలితంగా భోజనాలకు, బసకు, కరెంటుకు ఇతరత్రా వసతులకు ఖర్చెంతయిందో లెక్కగట్టి చెప్పండి’’అని అడిగారు. వాళ్ళు సంకోచిస్తుంటే...‘‘ఈ దేశమంతా నా కుటుంబమే. వాళ్ళు కష్టపడి కట్టిన పన్నులను నా బంధువులకోసం ఖర్చు పెట్టలేను’’ అని చెప్పి వారు ఆ బిల్లు ఎంతో చెప్పంగానే కట్టేసారు. అదీ వ్యక్తిత్వమంటే. ఆయన అలా బతికిచూపించి ఈ దేశ యువతరం ముఖ్యంగా విద్యార్థులు అంతా అలా బతకాలని కలలు కన్నారు. లతా మంగేష్కర్ గొప్ప గాయకురాలు. 30వేల పాటలకు పైగా పాడారు. ఆవిడ పాడని పాటలేదు, ఆలపించని కీర్తనలు, భజనలు లేవు. కానీ ఆమె ఐశ్వర్యవంతురాలిగా పుట్టలేదు. తండ్రి దీనానాథ్ మంగేష్కర్. ఆమెకు నలుగురు చెల్లెళ్ళు. కుమార్తెలను కూడా తన నాటక కంపెనీలో సభ్యులుగా చేర్పించి నాటకాలు వేయగా వచ్చిన డబ్బుతో కుటుంబ పోషణ జరిపేవారు. తరువాత కాలంలో ఆమె పాటలుపాడి పేరు, హోదా, డబ్బు బాగా సంపాదించినా తన కుటుంబాన్ని వదలలేదు.అందరినీ వృద్ధిలోకి తెచ్చారు. ఎంతో ధనాన్ని దానధర్మాలకు వెచ్చించారు. ఆదర్శవంతంగా బతికారు. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి ఒక వెలుగు వెలిగిన గొప్ప సంగీత విదుషీమణి. ఆవిడ జీవితం అంతే. అది వడ్డించిన విస్తరేమీ కాదు. మీరాబాయి సినిమాలో ఆమె నటించినప్పుడు కనకవర్షం కురిసింది. అదీగాక దేశవిదేశాల్లో సంగీత కచ్చేరీలద్వారా కూడా సంపాదించారు. ఎన్నో సంస్థలకు లక్షల రూపాయలు ఆర్జించిపెట్టారు. ఎన్నో గుళ్ళూ గోపురాల నిర్మాణాలకు, నిర్వహణకు సాయం అందించారు. ఆస్తులుకూడా అమ్మేసుకున్నారు. ఒక దశలో సొంత ఇల్లు కూడా లేకుండా చేసుకున్నారు. ఆమెకూడా కుటుంబంలో ఒక మంచి సభ్యురాలిగానే జీవితం మొదలుపెట్టి, నలుగురికి ఆదర్శంగా గడిపారు. ఆమె సుబ్బులక్ష్మి...ఆమె మాదన్నారు తమిళులు, ఆమె సుబ్బలక్ష్మి..ఆమె మాది అని దక్షిణాది వాళ్ళంటే, ఉత్తరాదివాళ్ళు ఆమెను శుభలక్ష్మి అని పిలుచుకుని సొంతం చేసుకున్నారు. ఆమె శరీరత్యాగం చేసారని తెలిసిన తరువాత మొదటగా పరుగెత్తుకు వెళ్ళిన వ్యక్తి కలాంగారు. ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్ళి, ఆమె అంత్యక్రియల్లో ముందు నిలబడి కంటనీరు కారుతుండగా ఒక మాటన్నారు...‘‘నాకు ముగ్గురు తల్లులు. ఒకరు జన్మ ఇచ్చిన తల్లి. మరొకరు ఈ దేశమాత. నాకు మూడవ తల్లి సుబ్బలక్ష్మిగారు. నేను ఎవరి కంఠస్వరం వింటే నా కష్టాలన్నింటినీ మర్చిపోతానో, ఆ తల్లిని ఈ వేళ పోగొట్టుకున్నాను.’’ అని ఆవేదన వ్యక్తం చేసారు. మీరు పిల్లలు. ఇటువంటివారిని ఆదర్శంగా పెట్టుకోండి. మీరు ఎంత పెద్దకలలు కన్నా వాటి ఆచరణలో ముందు వీరిలాగా ఒక మంచి కుటుంబ సభ్యునిగా మీ పాత్ర సమర్ధంగా నిర్వహించండి. మిమ్మల్ని చూసి మీ కుటుంబం, మీ ఊరు, మీ రాష్ట్రం, మీ దేశం గర్వపడే విధంగా జీవించండి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అలెగ్జాండర్ని ప్రెసిడెంట్ చేసింది నేనే: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్ : భరింపశక్యంకాని గొప్పలు చెప్పుకోవడంలో తమను మించిన వారు లేరని మరోసారి రుజువుచేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. చరిత్రంటే నారా వారిదేనని.. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టడం.. విశిష్టులకు నోబెల్, ఆస్కార్లు ఇప్పించడం.. సత్య నాదెళ్లకు ఇంజనీరింగ్ సలహా ఇవ్వడం.. పీవీ సింధుచేత షటిల్ రాకెట్ పట్టించడంలాటి ఘనకార్యాలెన్నో చేశానని చెప్పుకునే చంద్రబాబు తాజాగా మరో బాంబు పేల్చారు. అయితే ఈసారి చంద్రబాబు పేల్చింది అలాంటి ఇలాంటి బాంబుకాదు. చంద్రబాబు చెప్పింది ఏంటో అర్థం కాక టీడీపీ నేతలు, కార్యకర్తలు జుట్టుపీక్కుంటుంటే, నెటిజన్లు మాత్రం చంద్రబాబు మాటలను రీపీట్ చేసుకొని మరీ వింటూ తెగ నవ్వుకుంటున్నారు. అసలు ఏం జరిగిందంటే... గత మంగళవారం గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జరిగిన ‘నారా హమారా... టీడీపీ హమారా’ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మైనార్టీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ముస్లింలకు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లను కాపాడేందుకు సుప్రీం కోర్టులో పోరాడుతానని, రాయలసీమతో పాటు నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉర్దూను రెండో భాషగా చేస్తామని, హజ్‌యాత్రకు అమరావతి నుంచి నేరుగా విమాన సదుపాయం కల్పిస్తామని, మైనార్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చి ఆదుకుంటామని హామీలిచ్చారు. ముస్లిం మైనార్టీ వర్గానికి త్వరలో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పిస్తానన్నారు. ఇక అదే ఫ్లో లో 'తెలుగుదేశం పార్టీ ఎన్నో చరిత్రలు సృష్టించాము. ఒకటి రెండు కాదు ఒక దశలో అలెగ్జాండర్ గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేశాము. నేనొక్కటే చెప్పాను ఈ దేశానికి అన్ని విధాలుగా అర్హత కలిగిన వ్యక్తి ఆయనే ఉండాలని చెప్పి ప్రధాన మంత్రిగారిని ఒప్పించి దేశ అధ్యక్ష పదవికి సహకరించిన పార్టీ ఈ తెలుగు దేశం పార్టీ' అంటూ చంద్రబాబు స్పీచ్ దంచికొట్టారు. దీంతో అక్కడున్నవారంతా ఎవరబ్బా ఈ అలెగ్జాండర్ అంటూ ముక్కున వేలేసుకున్నారు. చంద్రబాబుకు ప్రసంగానికి సంబంధించి వీడియో సామాజికమాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఆ అలెగ్జాండర్ ఎవరో కాదు క్రీ.పూ. 3వ శతాబ్ధంలో ప్రపంచ దండయాత్రకు బయలుదేరిన గ్రీకు రాజు అలెగ్జాండర్ అయ్యిండొచ్చు, అతనికి మన చంద్రబాబుకు మంచి స్నేహితుడనుకుంటా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొందరు కలలు కనండి.. నిజం చేసుకోండి అంటూ యువతలో స్పూర్తినింపిన అబ్దుల్ కలాం అయ్యి ఉంటారని, చివరికి పేరుకూడా సరిగ్గా పలకడం రాదు కానీ మిసైల్ మ్యాన్ కలాంకు చంద్రబాబు రాష్ట్రపతి పదవి ఇప్పించారా అంటూ మండిపడుతున్నారు. ఇంతకుముందు కూడా ఇలానే.. హైదరాబాద్‌లో గత మేలో నిర్వహించిన మహానాడుకు సంబంధించి చంద్రబాబు ఒక ట్వీట్ చేశారు. ‘‘ఒకప్పుడు తాగునీరు లేని పరిస్థితి నుంచి హైదరాబాద్ నేడు మహానగరంగా మారిందంటే దాని వెనుక టీడీపీ ప్రభుత్వ శ్రమ, కష్టం ఎంతో ఉంది. దేశంలోనే నంబర్ వన్‌గా పేరొందిన బేంగంపేట విమానాశ్రయమూ టీడీపీ హయాంలోనే నెలకొల్పాం. భావితరాల భవిష్యత్తు కోసం హైటెక్ సిటీని నిర్మించాం’’ అని రాసుకొచ్చారు. అంతే, నెటిజన్లు ఒక్కసారిగా ఘొల్లున నవ్వుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ 1930లోనే నిజాం రాజు కట్టించారు. అప్పటికి మన సారు ఇంకా పుట్టనేలేదు! ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ కొందరు ‘అవునవును.. నిజాం రాజు మీ దోస్తే కదా..’’ అంటూ సెటైర్లు వేశారు. తప్పును గ్రహించిన చంద్రాలు సారు కొద్ది నిమిషాలకు ఆ ట్వీట్‌ను డిలిట్‌చేసి, ‘బేగంపేట’ ప్రస్తావన లేకుండా మరో ట్వీట్ చేశారు. కానీ అప్పటికే ఆ స్క్రీన్ షాట్లు వైరల్ అయిపోయాయి... (డిలిట్ చేసిన బాబు ట్వీట్ స్ర్కీన్‌షాట్) -
కలిసి నడవాలి.. నడిపించాలి
జీవితంలో కొన్ని పనులు మనం ఒక్కరమే చేయగలం. కానీ చాలా పనులు పదిమంది సహాయం లేకుండా చేయలేం. అందుకే అందరితో కలిసిమెలిసి చేయడం, చేయి చేయి పట్టుకుని నడవడం, నడిపించడం చేతకావాలి. నేనే గొప్ప, నేనెవరితోకలవను–అన్నవాడు వృద్ధిలోకి రాలేడు. అబ్దుల్ కలాం ఈ మాటలు ఒఠ్ఠిగా చెప్పలేదు. తాను స్వయంగా ఆచరించి చూపాడు కాబట్టే ఆయన మాటలంటే మనకంత గురి, మనకంత గౌరవం. విధి నిర్వహణలో ఏదయినా లోపం జరిగితే దానికి ఆయన ఒక్కడే బాధ్యత తీసుకునేవాడు. అదే ఉప్రగహం కక్ష్యలోకి వెళ్ళడం వంటి విజయాలు చవిచూసినప్పుడు ఆ గొప్పతనం తనొక్కడిదే కాదనీ, శాస్త్రవేత్తలందరిదీ అనడమేకాక, పై అధికారులకు, చివరకు ప్రధానమంత్రికి కూడా ఫలానా వారికృషివల్ల ఇది సాధించగలిగామని చెబుతూ వారిని స్వయంగా వెంటపెట్టుకెళ్ళి చూపేవాడు. ఒకరోజు కలాం తన దగ్గర పనిచేస్తున్న ఒక వ్యక్తిని ‘నువ్వు ఇవ్వాళ రాత్రి 11 గంటల వరకు ఉండి ఈ కార్యాన్ని పూర్తి చేయాలి’ అని పురమాయించారు. ఆ ఉద్యోగి కొంచెం ఇబ్బందిగానే తనకు అప్పగించిన పనిని అంగీకరించి చేసేందుకు వెళ్ళాడు. కలాం వెంటనే అతని సన్నిహిత ఉద్యోగిని మరొకరిని పిలిచి ‘రోజూ బాగా శ్రద్ధగా చేసేవాడు, ఇవ్వాళేమయింది’ అని వాకబు చేసాడు. ‘ఆయన తన భార్యాబిడ్డలను ఇవ్వాళ సాయంత్రం ఏదో ఎగ్జిబిషన్‌కు తీసుకెడతానని చెప్పాడు. పని చేయాల్సి వచ్చినందుకు కాదు, వాళ్ళను నిరాశపరచాల్సి వస్తున్నందుకు బాధపడి ఉంటాడు’’ అని అతను చెప్పి వెళ్ళిపోయాడు. రాత్రి 11 గంటలకు తనకు అప్పగించిన పనిముగించుకుని సదరు ఉద్యోగి భార్యాబిడ్డలకు సంజాయిషీ ఎలా చెప్పాలని మథనపడుతూనే ఇంటికి చేరుకుని తలుపు తీసి ఆశ్చర్యపోయాడు. నిరాశలో ఉంటారనుకున్నవాళ్ళంతా ఆనందంతో తుళ్ళుతూ కనిపించారు. అయోమయం నుంచి తేరుకోకముందే పిల్లలొచ్చి ‘‘నాన్నా, నాన్నా అబ్దుల్ కలాం తాతగారు మనింటికి వచ్చారు. మీనాన్న అత్యవసరమయిన పనిమీద కార్యాలయంలో ఉండిపోవాల్సి వచ్చింది. మిమ్మల్ని ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్తానన్నారటకదా, పదండి, నేను తీసుకెళ్తా అని తన కారెక్కించుకుని మమ్మల్ని తీసుకెళ్ళి అంతా తిప్పి చూపించి మళ్ళీ ఇంటిదగ్గర దింపి వెళ్ళిపోయారు’’ అని చెప్పారు. ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. తన చుట్టూ ఉన్నవాళ్ళ పట్ల కలాం అంత ప్రేమభావంతో ఉండేవారు. ఇటువంటి వారిని చూసి మీరు స్ఫూర్తి పొందాలి. కలాం కలలు కన్న విద్యార్థులగా మీరు తయారు కావాలి. చదరంగం ఆడాలి. మీ ఒక్కరి ప్రజ్ఞాపాటవాలు చాలు. ఫుట్‌బాల్ ఆడాలి. మీ టీమ్ అంతా కలిసి ఆడితేనే మీరు గెలుస్తారు. ఒక గోడ కట్టాలి. ఇటుకలు మాత్రం ఉంటే సరిపోదు, సిమెంట్ ఒక్కటి ఉంటే చాలదు. వాటితోపాటూ ఇసుక, నీరు ఉండాలి, అవన్నీ సమపాళ్ళలో కలిసినప్పుడే గట్టిగోడ నిలుస్తుంది. అందుకే మనకన్నా కిందివారిని, మనతోటివారిని, మనకంటే పైవారిని అందరినీ కలుపుకుని, సఖ్యతతో సమన్వయంతో, విశాల హృదయంతో ముందుకడుగేయాలి. మనందరం చేయిచేయి పట్టుకుని ‘‘మేమందరం భారతమాత బిడ్డలం, భారతీయులం, అందరం కలిసి నవభారతాన్ని నిర్మించుకుంటాం’’ అన్న దృఢ దీక్షతో అటువంటి సమగ్రతతో పనిచేసిన నాడు కలాంగారు ఏ లోకంలో ఉన్నా ఆయన పరిపూర్ణ ఆశీస్సులు మీకందరికీ అందుతాయి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మంచిని చూస్తుంటేనే మంచివారు అవుతారు
భవిష్యత్తంతా విద్యార్థులదే. దేశ కీర్తి ప్రతిష్ఠలు, అభివృద్ధి మీ చేతిలో ఉన్నాయని గట్టిగా నమ్మిన అబ్దుల్ కలాం మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి పలు సూచనలుచేసారు. ఎవరికి వారు తాము చదువుకున్న చదువుతో డబ్బు సంపాదించుకుంటూ, అదే ధ్యేయంగా బతికితే దేశం ఎలా, ఎప్పటికి బాగుపడుతుందనేది ఆయన ఆవేదన. చదువుకోవడం గొప్పకాదు. మీరో గొప్ప ఇంజనీరో, డాక్టరో అవుతారు. మీ చదువుద్వారా ఎంతమందికి మీరు ఉపయోగపడుతున్నారనే దాన్ని బట్టి మీ చదువుయొక్క సార్ధక్యం ఆధారపడి ఉంటుంది. మీరు డాక్టరై ఎంతమందికి ప్రాణభిక్షపెడుతున్నారు, స్వార్థంలేకుండా ఎంతమందికి చికిత్స చేయగలుగుతున్నారు. సమాజ హితానికి ఎంత ప్రయత్నిస్తున్నారన్న స్పృహతో మీరు గొప్పవారవుతారు తప్ప అన్యథా కాదు. నేను ఇంజనీరయినాను కాబట్టి ఎంతమంది ఏమయిపోయినా ఫరవాలేదు, ఏ ఆనకట్ట ఎలా బద్దలయిపోయినా ఫరవాలేదు, నా డబ్బు నాకొస్తుందికదా.. అన్న ఆలోచన మంచిది కాదు. మీ చదువుతో మీరు, మీ కుటుంబం, మీ బంధుమిత్ర పరివారం, మీ సమాజం, మీ దేశం అందరూ బాగుండాలి, అన్నీ బాగుపడాలి. అప్పుడు మీ చదువుకు సార్థకత. అలా జరగాలంటే...పదిమందితో కలిసి మీ ప్రజ్ఞాపాటవాలు పంచుకోవాలి. అలా పంచుకోవాలంటే మున్ముందుగా మీకు ఉండవలసిన ఒకానొక ప్రధాన లక్షణం– అందరిలో మంచిని చూడగలగడం. ప్రతివారిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. ఏ గొప్పతనం లేకుండా ఎవరూ ఉండరు. మీ చుట్టూ ఎవరున్నా, ప్రతివారిలో ఉన్న ప్రతిభను వెతకగలగడం మీకు చేతకావాలి. మీ వద్ద ఎవరిపేరయినా ప్రస్తావనకు వచ్చీరాగానే వారిలోని ఉత్తమగుణాలు మీకు వెంటనే స్ఫురణకు రావాలి. అలా కాకుండా ప్రతివాడిలోనూ చెడు మాత్రం చూసే అలవాటున్నప్పుడు వారిని తృణీకరించడం, చులకనచేసి మాట్లాడడం అలవాటవుతుంది. దానివల్ల అవతలివాళ్ళకు ఎటువంటి నష్టం వాటిల్లుతుందో నాకు తెలియదు కానీ, ఎవరిలోకూడా మంచి చూడడం అలవాటు చేసుకోక, మంచిని అనుకరించడం తెలియక, మంచిమార్గంలో వెళ్ళడం చేతకాక... చివరకు మనమే పతనమయిపోతాం. అలా కాకుండా ఉండాలంటే... ఎక్కడికెడితే అక్కడ ఇమిడి పోవడం చిన్నప్పటినుంచీ ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా అలా పిల్లల్ని ప్రోత్సహించాలి. నీటిలో ఇసుక వేస్తే కరగదు. అదే చక్కెరవేస్తే కరిగిపోతుంది, కలిసిపోతుంది. అది మీకు చేతకావాలి. అలా నలుగురిలో కలిసిపోవాలి, కరిగిపోవాలి. మీరు బడికి వెళ్ళారు. అక్కడ తోటి పిల్లలతో హాయిగా కలిసిపోవాలి. కాలేజికి వెళ్ళారు. సహ విద్యార్థులతో, కింది తరగతుల వాళ్ళతో, పైతరగతుల వాళ్ళతో కలిసిపోవాలి. ఉద్యోగానికి వెళ్ళారు. అక్కడ చిన్నా పెద్దా ఉద్యోగులందరితో కలిసిపోవాలి. కుటుంబంలో, బంధువులతో, దేశపౌరులతో.. అలా కలిసిపోతుండాలి. ‘‘నేను ఇంత గొప్పవాడిని’’ అని గిరిగీసుకుని మిగిలిన వాళ్ళకన్నా దూరంగా బతకడం, మిగిలినవాళ్ళు నాకన్నా తక్కువ వాళ్ళు అని భావించడం మనకు మేలు చేయకపోగా మనల్ని మరింత కిందకు దిగజారుస్తుంది. అలా కాకుండా ఉండాలంటే మీరు మూడు విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. మనతో సమానులను ఆదరబుద్ధితో చూడాలి. మన కంటే కిందివారిని మనమే చొరవతీసుకుని వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి, వారిని ప్రేమించాలి. మనకన్నా పైవారిపట్ల గౌరవ మర్యాదలతో మసులుకోవాలి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఏపీజే అబ్దుల్ కలాంకు ఘననివాళి
వనపర్తిటౌన్: అధికారం సమాజశ్రేయస్సుకు వెచ్చించాలనే రాజ్యాంగ స్ఫూర్తికి ఏపీజే అబ్దుల్ కలాం ప్రాణం పోశారని ప్రజావాగ్గేయకారుడు రాజారాంప్రకాశ్ అన్నారు. దివంగత మాజీ రాష్ట్రపతి కలాం వర్ధంతిని శుక్రవారం టీజేఏసీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమా లు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజారాంప్రకాశ్ మాట్లాడుతూ రెండోసారి రాష్ట్రపతి అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించాడని తెలిపారు. రాష్ట్రపతిగా తన పదవీకాలం ముగిసిన తర్వాత మరుసటి రోజు అధికారిక లాంఛనాలను దరిచేరనీయలేదన్నారు. కలలు కని, వాటిని సహకారం చేసుకోవాలని భారతవనికి దిశనిర్దేశం చేసిన మహానీయుడు కలాం అని వెల్లడించారు. టీజేఎస్ పట్టణాధ్యక్షుడు ఖాదర్‌పాష, పానుగంటి నాగన్న, గిరిజన నేత హరీష్, కృష్ణ పాల్గొ న్నారు. ఖిల్లాఘనపురం: మండలకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల్లో శుక్రవారం దివంగత మాజీ రాష్ట్రపతి భారత రత్న అవార్డు గ్రహిత ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థులకు వకృ త్వ పోటీల విజేతలకు విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు గోపి బహుమతులను అందజేశారు. గురుపౌర్ణమిని పురష్కరించుకొని విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు. -
అబ్దుల్‌కలాంను ఆదర్శంగా తీసుకోవాలి
పుల్లంపేట: సామాన్య కుటుంబంలో పుట్టి అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించిన ఏపీజే అబ్దుల్‌కలాంను ఆదర్శంగా తీసుకోవాలని పీవీజీ పల్లి ప్రధానోపాధ్యాయురాలు కే కృష్ణవేణి పేర్కొన్నారు. పాఠశాలలో శుక్రవారం సాయంత్రం అబ్దుల్ కలాం వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నతనం నుంచి ఎన్నో కష్టనష్టాలకోర్చి చదువుకున్న అబ్దుల్‌కలాం గురువుగా, శాస్త్రవేత్తగా తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. నేటి విద్యార్థులందరూ అబ్దుల్‌కలాంను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు సుబ్బరామిరెడ్డి, చంద్రకుమార్, శివశంకర్ రాజు, నవీన్‌కుమార్, భారతీ అబ్దుల్‌కలాం జీవిత విశేషాలను వివరించారు. కార్యక్రమంలో రెడ్డిప్రసాద్, గంగనపల్లె వెంకటరమణ మాట్లాడారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయుడు గుత్తికొండ హేమసుందరం రచించిన ‘ఓ విద్యార్థి తెలుసుకో’ అనే పుస్తకాలను హెచ్ఎం, ఉపాధ్యాయులు విద్యార్థులకు పంపిణీ చేశారు. -
‘ఆపరేషన్ శక్తి’ సాగిందిలా!
పోఖ్రాన్ పరీక్షలు.. భారతదేశం తన అణు పాటవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన సందర్భమది. తొలిసారి 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో పోఖ్రాన్–1 పేరిట ‘స్మైలింగ్ బుద్ధ’ అనే కోడ్‌తో అణు పరీక్షలు నిర్వహించగా, 1998లో ప్రధాని వాజ్‌పేయి ఆదేశాలతో ఆపరేషన్ శక్తి(పోఖ్రాన్–2) పేరుతో అణు పరీక్షలు నిర్వహించారు. కానీ 1974తో పోల్చుకుంటే 1998లో అణు పరీక్షల నిర్వహణకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అమెరికా నిఘా సంస్థ సీఐఏకు చెందిన శక్తిమంతమైన ఉపగ్రహాలు ఈ ప్రాంతంలో నిఘా పెట్టడంతో వ్యూహాత్మకంగా వాటిని బురిడీ కొట్టిస్తూ అధికారులు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. పోఖ్రాన్–2 అణు పరీక్షలు జరిపి 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన 58వ ఇంజనీరింగ్ రెజిమెంట్ కమాండర్ కల్నల్ (రిటైర్డ్) గోపాల్ కౌశిక్ , చేతన్ కుమార్‌లను టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూ చేసింది. నాటి ఆపరేషన్ సందర్భంగా తీసుకున్న జాగ్రత్తలపై తమ అనుభవాలను వీరిద్దరూ మీడియాతో పంచుకున్నారు. ఎన్నో జాగ్రత్తలు.. ఈ విషయమై కల్నల్ గోపాల్ కౌశిక్ మాట్లాడుతూ.. ‘1974తో పోల్చుకుంటే 1998లో ఆపరేషన్ శక్తి సందర్భంగా భారత్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చి ంది. ఎందుకంటే తొలిసారి అణు పరీక్షలు నిర్వహించినప్పుడు భారత్ సామర్థ్యం, ఉద్దేశం గురించి ఎవ్వరికీ తెలియదు. అలాగే అణు బాంబును ఎక్కడ పరీక్షిస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల కార్యకలాపాలపై దృష్టి సారించేందుకు అవసరమైనన్ని ఉపగ్రహాలు అమెరికా వద్ద అప్పట్లో లేవు. కానీ 1998 నాటికి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఎందుకంటే 1995–96లో భారత్ అణు పరీక్షలకు రహస్యంగా చేస్తున్న ఏర్పాట్లు బయటకు పొక్కడంతో అమెరికా సహా అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి ఎదురైంది. దీంతో పరీక్షల్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా పోఖ్రాన్ గురించి ప్రపంచం మొత్తానికి తెలియడంతో శక్తిమంతమైన అమెరికా నిఘా ఉపగ్రహాలు ఈ ప్రాంతంపై ఎప్పుడూ తిరుగుతూనే ఉండేవి’ అని తెలిపారు. ఎదురైన సవాళ్లు ఎన్నో.. అణు పరీక్షల ఏర్పాట్ల సందర్భంగా ఎదురైన ప్రతికూల పరిస్థితులపై కౌశిక్ స్పందిస్తూ.. ‘ఈ పరీక్షల ఏర్పాట్లలో శాస్త్రవేత్తలు, అధికారులకు వాతావరణం ప్రధాన సవాలుగా నిలిచింది. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రత 51 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటే శీతాకాలంలో ఉష్ణోగ్రత మైనస్ 3 డిగ్రీలకు పడిపోయేది. అంతేకాకుండా ఈ ప్రాంతమంతా విషపూరితమైన పాములు, తేళ్లు ఉండేవి. దీంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది. దీంతోపాటు అణు బాంబుల్ని భూమిలోపల అమర్చేందుకు తవ్విన ఆరు గుంతల్లో నీటి ధార రావడం మరో తలనొప్పిగా మారింది. విపరీతమైన వేడి ఉన్న ఈ ప్రాంతంలో వర్షపు కోట్ ధరించి అణు బాంబును అమర్చేందుకు తవ్విన గుంతల్లో దిగి పనిచేయడం శాస్త్రవేత్తలు, సైనికులకు ఇబ్బందికరంగా తయారైంది. అలాగే వీటిలో అమర్చిన లోహపు పరికరాలు నీటి ప్రభావంతో తుప్పుపట్టడం మొదలుపెట్టాయి. దీంతో నీటిని బయటకు తోడేద్దామని తొలుత అనుకున్నాం. అయితే నీటి ప్రభావంతో మారిపోయే ఇసుక రంగును, అక్కడ మొలిచే పచ్చికను సైతం విదేశీ నిఘా ఉపగ్రహాలు గుర్తించే వీలు ఉండటంతో మరో మార్గాన్ని అన్వేషించాం. దూరంగా ఉన్న ఇసుకలో పైపుల్ని లోతుగా పూడ్చి వాటిద్వారా నీటిని పంపింగ్ చేసేవాళ్లం. దీంతో పైకి కన్పించకుండానే నీళ్లు పూర్తిగా ఇంకిపోయేవి’ అని అన్నారు. ‘తవ్విన గుంతల్లో అణు బాంబుల్ని అమర్చిన అనంతరం వాటిని ఇసుక బస్తాలతో నింపడం మరో సవాలుగా నిలిచింది. ఇసుక బస్తాలను పైనుంచి విసిరేస్తే అణు బాంబులు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో పరిష్కారం కోసం శాస్త్రవేత్తలు, అధికారులు చురుగ్గా ఆలోచించారు. ఓ జాలీ లాంటి పరికరంతో బ్యాగుల్ని జారవిడిచే అంశాన్ని పరిశీలించారు. కానీ ఇలా 6,000 ఇసుక బస్తాలను జారవిడిచేందుకు వారం పట్టే అవకాశం ఉండటంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. చివరికి బిలియర్డ్స్ ఆటలో వినియోగించే క్యూ స్టిక్స్‌తో సరికొత్త ఆలోచన వచ్చింది. గుంతల్లో పైపుల్ని ఒకదానిపక్కన మరొకటి అమర్చిన అధికారులు, వాటిపై ఇసుక బస్తాలను జారవిడిచారు. ఈ వ్యూహం పనిచేయడంతో ఏర్పాట్లు పూర్తిచేసి 1998 మే 11 నుంచి 13 మధ్య ఐదు అణు పరీక్షల్ని విజయవంతంగా నిర్వహించాం’ అని తమ అనుభవాలను పంచుకున్నారు. పగలు క్రికెట్.. రాత్రి ఏర్పాట్లు ‘అమెరికా నిఘా ఉపగ్రహాల్ని పక్కదారి పట్టించేందుకు వినూత్నంగా ఆలోచించాం. పోఖ్రాన్ ప్రాంతంలో ఆర్మీ అధికారులు, శాస్త్రవేత్తలు పగటిపూట క్రికెట్ ఆడేవారు. దీంతో చుట్టుపక్కల ఉండే జనాలు బాగా గుమిగూడేవారు. జనసంచారం ఉండటంతో విదేశీ నిఘా వర్గాలు పోఖ్రాన్లో రహస్య కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎంతమాత్రం అనుమానించలేదు. సాధారణ సైనికులే అక్కడ ఉన్నారని భావించాయి. కేవలం రాత్రిపూట మాత్రమే ప్రయోగ పనుల్ని చేపట్టేవారు. అణుశక్తి కమిషన్ మాజీ చైర్మన్ ఆర్.చిదంబరం, బార్క్ మాజీ చీఫ్ అనీల్ కకోద్కర్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం సహా 100 మంది శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. శాస్త్రవేత్తల కదలికల్ని నిఘా ఉపగ్రహాలు గుర్తించకుండా వారందరూ సైనిక దుస్తులు ధరించేవారు. అబ్దుల్ కలామ్‌ను మేజర్ జనరల్ పృథ్వీరాజ్ అని, చిదంబరాన్ని మేజర్ నటరాజ్‌గా వ్యవహరించేవారు’ అని కౌశిక్ చెప్పారు. -
అది అప్పుడు గొంగళిపురుగు, మరి ఇప్పుడో!!
అబ్దుల్ కలాంగారు ప్రతిజ్ఞచేయించినట్లుగా లక్ష్యసాధనకు ఏకాగ్రతతో శ్రమించాలి. లక్ష్య్యసాధన లో రెండు భాగాలు – లక్ష్యం నిర్ణయించుకోవడం మొదటిదికాగా, రెండవది దాని సాధనకోసం శ్రమించడం. విద్యార్థులుగా మీరు విజేతల అనుభవాలను పరికించి చూడండి. లక్ష్యం నిర్ణయించుకునే దశ, లక్ష్యసాధన తరువాతి దశ.. గొంగళి పురుగు దశ, సీతాకోకచిలుక దశలా కనిపిస్తాయి. రేపు మీ జీవితంలో కూడా అంతే. గొంగళిపురుగు ఒళ్ళంతా నల్లటి వెంట్రుకలతో ఏవగింపు భావన కలిగించేలా ఉంటుంది. మీదపడితే దురదపెడుతుంది. దానిని చూడడానికి తాకడానికి ఎవ్వరూ ఇష్టపడకపోయినా అది ఆకులుతిని తన నోటివెంట వచ్చే ద్రవంతో గూడుకట్టుకుని దానిలో పడుకుని నిద్రపోతుంది. అది దానికి తపస్సు. అది ఆ నిద్రలో ఉండగానే రంగురంగుల అందమైన సీతాకోకచిలుకగా మారుతుంది. తరువాత తాను కట్టుకున్న గూడు బద్దలు కొట్టుకొని బయటకు రావడంకోసం రెక్కలు విప్పడానికి ఉన్నచోటు దానికి సరిపోదు. గూడు గోడలు అడ్డుపడుతుంటాయి. అలా కొట్టుకుంటున్నప్పడు అది అలసిపోదు. ‘నేను బయటకి వచ్చి తీరుతా’ అన్న కృతనిశ్చయంతో శ్రమిస్తుంది. అలా కొట్టుకోగా కొట్టుకోగా గూడుకు చిన్న రంధ్రం పడుతుంది. ఇంకా శ్రమించగా ఆ రంధ్రం నెమ్మదిగా పెద్దదయి తనకు అడ్డుపడిన చిక్కులను తొలగించుకుంటూ గూట్లోంచి బయటపడుతుంది. రివ్వున ఆకాశంలో ఎగిరిపోతుంది. అప్పుడు దానిని చూస్తే ఆశ్చర్యపోతారు. అప్పుడది.. ఒళ్ళంతా నల్లటి వెంట్రుకలతో ఏవగింపు భావన కలిగించిన పురుగు ఎంతమాత్రం కాదు. అసలు అది ముందు అలా ఉండేదంటే కూడా నమ్మశక్యం కాదు. ఎన్ని రంగులు, ఎన్ని రేఖలు, చిత్రవిచిత్రమైన గీతలు ముగ్గులు పెట్టినట్లుగా చాలా అందంగా కనబడుతుంది. పరమ సంతోషంగా గాలిలో ఎగురుతూ పోతుంటుంది. ఆకులుతిని బతికిన గొంగళిపురుగు మరింత ఆశ్చర్యకరంగా పూలలో మకరందాన్ని తన తొండంతో జుర్రుకునే క్రమంలో పూరేకులమీద వాలినా వాటికి ఏ మాత్రం అపకారం జరగనివ్వదు, పాడు చేయదు. అది గూడు బద్దలు కొట్టుకోలేకపోతున్నప్పుడు మీరు వెళ్ళి ఏ చీపురుపుల్లతోనో అడ్డొచ్చిన గూడును జాగ్రత్తగా తొలగించారనుకోండి. ఆశ్చర్యం.. సీతాకోకచిలుక బయటికొస్తుంది,కానీ ఎగరలేక కిందపడిపోతుంది. అదలా కష్టపడేక్రమం లోనే, దానికాళ్ళకు, దాని రెక్కలకు కావలసిన బలాన్నది సొంతంగా సమకూర్చుకుంటుంది. అదీ మనిషికి ఉండవలసిన సాధనాబలం. ‘భగవంతుడు ఇంత గొప్ప జన్మనిచ్చాడు. మేధస్సు ఇచ్చాడు. ఇన్ని విద్యాలయాలు ఇచ్చాడు. ఇంత జ్ఞానాన్ని అందించే పుస్తకాలనిచ్చాడు. ఇంతమంది పెద్దలనిచ్చాడు. ఇంత గొప్ప సమాజాన్నిచ్చాడు. ఇన్ని ఉపకరణాలతో నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేనా?’ అని తనను తాను ప్రశ్నించకుంటూ లక్ష్యం దిశగా ఏకోన్ముఖంగా సాగిపోయిన విద్యార్థి సీతాకోకచిలుక లాగా సకలవర్ణశోభితమై తన కాళ్ళతో, తన రెక్కలతో స్వేచ్ఛగా విహరిస్తూ వస్తాడు. అందుకే విజయానికి చిహ్నంగా పైకి ఎగురుతున్న సీతాకోకచిలుక బొమ్మను వేస్తారు. గురువుగారి దగ్గర విద్యనేర్చుకోవడం అంటే... శిష్యుడు గురువుగారిని శ్రమపెట్టకుండా ఆయన దగ్గరచేరి విద్యపొందాలి. ఎలా !!! పూవుకు ఏ మాత్రం అపకారం చేయకుండా దాని గుండెల్లోకి చొరబడి సీతాకోకచిలుక మకరందాన్ని జుర్రుకున్నట్లు శిష్యుడు విద్యను సముపార్జించాలి.‘భృంగావళీచ మకరందరసానువిద్ధఝుంకారగీతనినదైఃసహసేవనయ ..... శేషాద్రి శేఖరవిభో తవసుప్రభాతమ్’.... సీతాకోక చిలుకులు ఎగురుతున్నాయి. ఆ సవ్వడి మీకు వినబడడం లేదా, తెల్లవారుతోంది స్వామీ, మీరు లేవండి – అని వేంకటేశ్వరస్వామిని కూడా ప్రేమగా నిద్రలేపడానికి ఒకనాడు ఏవగింపు కలిగించిన ఇప్పటి సీతాకోచిలుక ఒక అద్భుతమైన ఉపమానంగా నిలుస్తున్నది. సాధకుడు దానినుంచి స్ఫూర్తిని పొందాలి. విజేతగా సప్తవర్ణాలతో మెరిసిపోవాలి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
బంగారు భవితకు పది సూత్రాలు
విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్‌ను, వారి వ్యక్తిత్వ వికసనాన్ని దృష్టిలోపెట్టుకుని, వేనాడు(కేరళ)లోని జవహర్ నవోదయ పాఠశాలలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వారిచేత ఒక ప్రతిజ్ఞ చేయించారు. అది ఒక్క సందర్భంలోనే చేయించారు. అది తన జీవితంలో మరచిపోలేని రోజని ఆయన తన పుస్తకంలో రాసుకున్నారు. ఆ ప్రతిజ్ఞలోని పదిసూత్రాలు ఇవి.... 1 నేను ఒక పెద్ద లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాని సాధనకోసం కష్టపడతాను. చిన్న లక్ష్యం పెట్టుకోవడం నేరమని గుర్తించాను. 2 చిత్తశుద్ధితో పనిచేసి సమగ్ర విజయం సాధిస్తాను. 3 నేను నా కుటుంబంలో, నా సమకాలీన సమాజంలో, దేశంలో, ప్రపంచంలో ఒక మంచి సభ్యుడిగా ఉంటాను. 4 కుల, జాతి, భాష, మత, రాష్ట్ర భేదాలు లేకుండా ఎవరో ఒకరి జీవితాన్ని రక్షించడానికి లేదా వృద్ధిలోకి తీసుకు రావడానికి నేను ప్రయత్నిస్తాను. 5 ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా ‘‘నేనేం ఇవ్వగలను’’ అని ఆలోచిస్తాను. 6 సమయ ప్రాముఖ్యతను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. జవసత్వాలతో ఉన్న నా కాలాన్ని వృథా కానివ్వను. దీనినే నేను ఆదర్శంగా భావిస్తాను. 7 స్వచ్ఛమైన భూగ్రహ వాతావరణం కోసం, స్వచ్ఛమైన ఇంధన శక్తికోసం సర్వదా ప్రయత్నిస్తాను. 8 ఈ దేశ యువ ప్రతినిధిగా నా లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా సాధించడానికి సాహసంతో పనిచేస్తాను. ఇతరుల విజయాలను కూడా అదే స్ఫూర్తితో ఆస్వాదిస్తాను. 9 నేను నా విశ్వాసమంత యువకుడిని/యువతిని. సందేహమంత వృద్ధుడను/వృద్ధురాలను. అందువల్ల నా హృదయంలో విశ్వాసమనే దీపాన్ని వెలిగిస్తాను. 10 నా దేశ పతాకం నా హృదయంలో ఎప్పుడూ రెపరెపలాడుతూనే ఉంటుంది. నా దేశానికి కీర్తి, వైభవం తీసుకు వస్తాను. ఆ రోజున తనలోంచి వచ్చిన భావావేశాన్ని పదిసూత్రాలుగా మలచి కలాం అక్కడ విద్యార్థులతో చేయించిన ఈ ప్రతిజ్ఞను కాకినాడలో విద్యార్థులకోసం ఏర్పాటు చేసిన ఒకశిబిరంలో వారితో అదే స్ఫూర్తితో, నిబద్ధతతో చేయించాం. ఈ ప్రతిజ్ఞా పాఠాన్ని ప్రతి విద్యార్థీ ప్రతిరోజూ ఒకసారి ఇంట్లో కుడిచేయి ముందుకు చాపి నిజాయితీగా ప్రతిజ్ఞలాగా చదువుకోవాలి. విద్యాలయాలు కూడా ఇలా పిల్లల చేత ప్రతిజ్ఞ చేయిస్తే ... విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు, వారి ఊరు, ఈ దేశం అన్నీ గర్వపడే పౌరులుగా తయారవుతారు. దీని కారణంగా అబ్దుల్ కలాంగారి ఆశీస్సులు వారందరికీ పరిపూర్ణంగా లభిస్తాయి. నేను కూడా ‘‘మహాత్మా! విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి మీరు కన్న కలలు సాకారం కావాలనీ, అలాగే మీరు చెప్పిన విషయాలు వారి మనసులలో బాగా నాటుకుని వారు ఉత్తమ పౌరులుగా తయారు కావడానికి అవసరమైన శ్రద్ధాసక్తులను వారికి కటాక్షించవలసింది’’ అని కోరుతూ శారదామాతకు శిరస్సువంచి నమస్కారం చేస్తున్నా. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కలాంను చూడాలన్న కల అది
పూర్వ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ఎ.పి.జె. అబ్దుల్ కలాం గురించి మన దేశంలో తెలియని విద్యార్థినీ విద్యార్థులుండరు. ఆయనకు పిల్లలన్నా, పిల్లలకు మంచి విషయాలు బోధించాలన్నా ప్రాణం. రాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన వెంటనే మద్రాస్ ఐ.ఐ.టి ప్రాంగణంలోని ఒక అతిథి భవనంలో ఉంటూ దేశంలోని పలు ప్రాంతాల్లోని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలను పునఃప్రారంభించిన మహానుభావుడు. చివరకు విద్యార్థులతో మాట్లాడుతూ, మాట్లాడుతూ జారిపడిపోయి శరీరాన్ని విడిచిపెట్టేసాడు. అటువంటి కలాం– రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరువాత కేరళ రాష్ట్రంలోని వేనాడులో జవహర్ నవోదయ విద్యాలయంలో ఒక రోజు సాయంత్రం 6 గంటలకు ప్రసంగించడానికి వెళ్ళాల్సి ఉంది. ఆయన దానికి తగ్గట్టుగా ప్రణాళికవేసుకుని ఉదయం 10 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్ళారు. అక్కడ విమానం రెండు గంటలు ఆలస్యం అయింది. ముందనుకున్న ప్రకారం బెంగళూరులోదిగి కాలికట్ విమానం ఎక్కి, అక్కడినుంచి కారులో వేనాడుకు వెళ్ళాలి. బెంగళూరుకు ఆలస్యంగా చేరుకోవడంతో కాలికట్ విమానం వెళ్ళిపోయింది. ఇప్పుడెలా అని ఆలోచిస్తుండగానే సాయంత్రం ఆరు కావచ్చింది. అంటే ఆ సమయానికి ఆయన వేనాడులో వేదికమీద ఉండాలి. వెంటనే ఆయన పాఠశాలవారికి ఫోన్ చేసి ‘‘విమానం ఆలస్యం అయింది. రాలేకపోతున్నా. కనుక మీ కార్యక్రమాన్ని కొనసాగించండి. నా ఆశీస్సులు మీ కెప్పుడూ ఉంటాయి.’’ అని చెప్పారు. అది విన్న నిర్వాహకులు – ‘‘కలాంగారిని దగ్గరగా చూడాలని, ఆయనతో మాట్లాడాలని మా పిల్లలందరికీ కల. ఎంత ఆలస్యమయినా ఫరవాలేదు. మీరు రాగలరా ?’’ అని అడిగారు. దానితో చలించిపోయిన కలాం–‘‘ఇప్పడు నాకు మరో మార్గంలేదు. ఒక్క అరణ్యమార్గంలో ఇక్కడినుండి (బెంగళూరు) కారులో వస్తే తెల్లవారు జామున 2.30–3గంటలకు చేరుకోగలను. అప్పటివరకూ మీ పిల్లలు ఉండగలరా ?’’ అని బదులిచ్చారు. ‘‘పరమ సంతోషంతో కూర్చుంటారు’’ అని నిర్వాహకులు చాలా హుషారుగా సమాధానమిచ్చారు.‘అయితే, వస్తున్నా..’’ అన్నారాయన. ‘‘నాగరకతకు సంబంధించిన చిహ్నంగా ఆ రహదారి తప్ప వేరొకదారి లేదు. అంత భయంకరమైన అరణ్యమార్గంలో చంద్రుడి కాంతి ఒక్కటే తోడుగా నేను ఆరుగంటలకు వేనాడు బయల్దేరాను’’అని ఆయన తన పుస్తకంలో రాసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత రెండున్నరకు వేనాడు చేరుకున్నారు. అంతదూరం ప్రయాణం చేసిన బడలికనుంచి ఉపశమనం పొందడానికి విశ్రాంతి మందిరానికి వెళ్లకుండా, కనీసం ముఖంకూడా కడుక్కోకుండా పిల్లలు ఎదురుచూస్తుంటారని నేరుగా పాఠశాలకు వెళ్ళారు. తెల్లవారుఝాము మూడవుతున్నది. పిల్లలకళ్ళు మత్తుకు వాలిపోయి, తలలు పక్కకు ఒరిగిపోయి నిద్రముఖాలతో తూగుతూ ఉండాలి. కానీ కలాం గారొస్తున్నారన్న సంతోషంలో పౌర్ణమి చంద్రుడిలా వికసించిన ముఖాలతో వారందరూ ఎదురుచూస్తుంటే, ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ ఆనందంలో ఆయన ప్రసంగించినా సంక్షిప్తంగానే ముగించారు. దానికి ముందు ఆయన వారితో పది సూత్రాలతో పొదిగిన ఒక చక్కటి ప్రతిజ్ఞ చేయించారు. ఈ దేశం వృద్ధిలోకి రావాలని, పిల్లలందరూ కూడా జీవితంలో మూడుపూవులూ ఆరుకాయల చందంగా ఎదగాలన్న ఆకాంక్ష ఆ సూత్రాలవెనుక ఉన్న సూత్రం. (అబ్దుల్ కలాం జీవితంలోని స్ఫూర్తిదాయక అంశాలతో కాకినాడ గోశాలలో విద్యార్థులను ఉద్దేశించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు 2017లో చేసిన వ్యక్తిత్వ వికాస ప్రసంగం సంక్షిప్త పాఠం– ఈ వారం నుంచి).