
స్ఫూర్తి పతాకం అబ్దుల్ కలామ్
సింపుల్ లివింగ్.. హై థింకింగ్...
ఈ గాంధీజీ సూక్తిని పాటించి
భారతీయులందరికీ ఆదర్శంగా
నిలిచిన వ్యక్తి మాజీ రాష్ట్రపతి,
మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా..
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్!
దేశ ప్రథమ పౌరుడి హోదాలో కూడా అతి సామాన్య జీవితాన్ని గడిపి ఈ తరానికి స్ఫూర్తిగా నిలిచారు. అలాంటి అసాధారణ వ్యక్తికి సంబంధించిన కొన్ని విశేషాలు... ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా... జీవకారుణ్యం కలామ్ డీఆర్‌డీఏలో పనిచేస్తున్నప్పుడు.. ఆ భవన భద్రత కోసం దాని ప్రహరీ మీద గాజుపెంకులు అతికించాలని కలామ్ టీమ్ నిర్ణయించిందట. ‘వద్దు వద్దు .. అలాంటి పనులేమీ చేయకండి... పాపం గోడమీద వాలి సేద తీరే పక్షులకు అన్యాయం చేసినవాళ్లమవుతాం. ఆ ప్రహరీని అలాగే వదిలేయండి’ అంటూ అడ్డు చెప్పారు కలామ్. ఆయనలోని జీవకారుణ్యానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏం కావాలి?
ఎదిగిన కొద్దీ ఒదిగి...
ప్రెసిడెంట్ కలామ్‌కి ఎంత గొప్ప వ్యక్తి దగ్గర్నుంచి ఉత్తరం వచ్చినా, ఎంత చిన్న వ్యక్తి దగ్గర్నుంచి అభినందన వచ్చినా.. స్వయంగా తానే వారికి జవాబు రాసి పంపేవారట. అభినందనలకు కృతజ్ఞతలూ తెలిపేవారట. అలా ఒకసారి నమాన్ నరైన్ అనే చిత్రకారుడు కలామ్ చిత్రపటాన్ని గీసి పంపితే ఆయనకు కలామ్ స్వంతదస్తూరీతో థ్యాంక్యూ కార్డ్ పంపారు. ఎదిగినా ఒదిగి ఉండే తత్వానికి కలామ్‌ని మించిన మనిషి కనపడ్తాడా? వినయం, విజ్ఞత, ఔదార్యం ఆయనకు పుట్టుకతోనే అబ్బిన గుణాలు.
పురా (్క్ఖఖఅ... ప్రొవైడింగ్ అర్బన్ ఎమినిటీస్ టు రూరల్ ఏరియాస్)
కలామ్ దేశ అధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేసిన వెంటనే అంతకుముందు తను చేసిన ఉద్యోగం తాలూకు సేవింగ్స్ అన్నింటినీ పురా అనే ట్రస్టును స్థాపించి దానికి రాసిచ్చేశారు. పట్టణ సౌకర్యాలను గ్రామాల్లోనూ అందుబాటులోకి తేవడం పురా పని. కలామ్ సంపాదించిన ప్రతి పైసా ఆ ట్రస్ట్‌కే వెళ్లింది. చనిపోయే నాటికి కలామ్ దగ్గరున్న ఆస్తి.. 25 వందల పుస్తకాలు, ఒక చేతి గడియారం, ఆరు చొక్కాలు, నాలుగు పాంట్లు, ఒక జత షూ మాత్రమే! సామాన్యుడికి కూడా ఇంతకన్నా ఎక్కువ ఆస్తే ఉంటుంది కదా.
ఇంకొన్ని ఆసక్తికర విషయాలు
కలామ్ చదివింది ఏరోస్పేస్ ఇంజనీరింగ్.. కావాలనుకున్నది ఫైటర్ పైలట్. తర్వాత పనిచేసింది డీఆర్‌డీఓలో. అయింది.. దేశానికి అధ్యక్షుడిగా! నిరంతరం మునిగితేలింది బోధనలో! అబ్దుల్ కలామ్ ట్విట్టర్‌లో కేవలం 38 మంది ట్వీట్‌లనే రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారట. అందులో ఉన్న ఒకే ఒక క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్.
కలామ్ ఎప్పుడు ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా అందులో ‘తిరుక్కురల్’ అనే పుస్తకంలోని సూక్తులను తప్పకుండా ప్రస్తావించేవారు.
కలామ్ ఈ తరాన్ని ఎంతగా ప్రభావితం చేశారంటే .. ఆయన గురించి ‘ఐయామ్ కలామ్’పేరుతో సినిమా వచ్చేంతగా!