
దివికేగిన భారత మిసైల్
మాజీ రాష్ట్రపతి, దేశం గర్వించదగ్గ అంతరిక్ష, రక్షణ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం (84) సోమవారం సాయంత్రం 6.40 గంటలకు కన్నుమూశారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఐఐఎంలో జరిగే సెమినార్లో ప్రసంగించేందుకు వెళ్లిన ఆయన.. అక్కడే వేదికపై తీవ్ర అస్వస్థతతో కుప్పకూలారు. ఆయనను అక్కడకు రెండు కిలోమీటర్ల దూరంలోని బెథనీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఓసారి ఆయన జీవిత విశేషాలను చూస్తే..
అవుల్ పకీర్ జైనుల్బదీన్ అబ్దుల్ కలాం రామేశ్వరం, రామనాథపురం జిల్లా, తమిళనాడు రాష్ట్రంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో అక్టోబరు 15, 1931 న జన్మించాడు. తండ్రి జైనుల్బదీన్, పడవ యజమాని. తల్లి ఆశిఅమ్మ, గృహిణి. పేద కుటుంబ కావటంతో కుటుంబ అవసరాలకు చిన్న వయసులోనే పని ప్రారంభించాడు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా తోడ్పడటానికి వార్తాపత్రికలు పంపిణీ చేశాడు.
పాఠశాలలో సగటు మార్కులు అయినప్పటికీ నేర్చుకోవటానికి తపన పడేవాడు. ఎక్కువ సమయం కష్టపడేవాడు. రామనాథపురం స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక, కలాం సెయింట్ జోసెఫ్స్ కళాశాల, తిరుచిరాపల్లి చేరారు. 1954 లో భౌతికశాస్త్రం నందు పట్టా పొందారు. అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధసంస్థగా ఉండేది. ఈ కోర్సు పై అతనికి కోర్సు పూర్తి అయ్యేవరకు మక్కువ కలగలేదు. నాలుగేళ్లు ఈ కోర్సు చదివినందుకు తరువాత చింతించారు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేరారు.
కలాం సీనియర్ తరగతి ప్రాజెక్ట్ పనిచేస్తుండగా, పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్ట్ తదుపరి మూడు రోజుల్లో పూర్తి చేయకపోతే తన స్కాలర్షిప్ ఎత్తివేస్తాను అని బెదిరించారు. ఇచ్చిన గడువులో కష్టపడి పని పూర్తిచేసి డీన్ ను ఆకట్టుకున్నారు. తరువాత డీన్ "కలాం నీకు తక్కువ గడువు ఇచ్చి ఎక్కువ ఒత్తిడి కలిగించాను" ఆన్నారు. ఎనిమిది స్థానాల కొరకు జరిగిన ప్రవేశ పరీక్షలో తొమ్మిదో స్తానం పొంది యుద్ధ పైలట్ కావాలనే తన కలను తృటిలో కోల్పోయాడు.
కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చెయ్యటం ద్వారా తన వృత్తిని ప్రారంభించారు. కానీ డీఆర్డీవోలో ఉద్యోగం చేయడంతో ఆయన సంతృప్తి చెందలేదు. కలాం ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త విక్రం సారాభాయ్ కింద ఇన్‌కాస్పర్ కమిటీలో పనిచేశారు. 1969 లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేరి ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (ఎస్ఎల్వీ-III) ప్రయోగానికి డైరెక్టర్ గా పనిచేశారు. జూలై 1980 లో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్య లో విజయవంతంగా చేర్చినది. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు.
1970 ల్లో స్థానికంగా తయారైన ఎస్ఎల్వీ రాకెట్ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయి. విజయవంతమైన ఎస్ఎల్వీ కార్యక్రమం టెక్నాలజీ ఉపయోగించి బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేయడంకోసం ఏర్పాటైన ప్రాజెక్ట్ డెవిల్ మరియు ప్రాజెక్ట్ వలింట్ లకు కలం డైరెక్టర్ గా పనిచేశారు. కేంద్ర కేబినెట్ అసమ్మతి ఉన్నప్పటికీ, ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఆమె విచక్షణ అధికారాలు ఉపయోగించి కలామ్ నిర్దేశకత్వంలోని అంతరిక్ష ప్రాజెక్టుల కోసం రహస్యంగా నిధులు కేటాయించారు. కలాం ఈ క్లాసిఫైడ్ అంతరిక్ష ప్రాజెక్టులు నిజమైన స్వభావం కప్పిపుచ్చడానికి యూనియన్ క్యాబినెట్ ఒప్పించటంలో సమగ్ర పాత్ర పోషించారు.
కలాం పరిశోధన, నాయకత్వంతో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించడంతో 1980 లలో ప్రభుత్వం కలాం ఆధ్వర్యంలో ఆధునిక క్షిపణి అభివృద్ధి కార్యక్రమానికి రూపకల్పన చేసింది. అప్పటి రక్షణ మంత్రి, ఆర్.వెంకటరామన్ సూచనతో కలాం, డాక్టర్ వీఎస్ అరుణాచలం (రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు మరియు లోహశోధకుడు) తో కలిసి ఒకేసారి పలు వివిధ క్షిపణి అబివృద్ధికి రూపకల్పన చేశారు. 1998 లో, కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమ రాజు పాటు, కలిసి కలాం తక్కువ ధర కలిగిన కొరోనరీ స్టెంట్ కలాం-రాజు స్టెంట్ ను అభివృద్ధి చేశారు. 2012 లో ఇద్దరూ కలిసి, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కోసం కలాం - రాజు టాబ్లెట్ అనబడే టాబ్లెట్ పీసీ రూపొందించారు.
భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్- డీఆర్డీవో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్ పనిచేశారు. 1998 లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించారు. 2002 అద్యక్షఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ద్వారా అభ్యర్ధిగా ప్రతిపాదించగా, ప్రతిపక్ష కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పై గెలిచారు.భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.