చూపు లేకపోతేనేమి.. లక్ష్యముంది!
చూపు లేకపోతేనేమి.. లక్ష్యముంది!
Published Sun, Apr 23 2017 11:08 PM | Last Updated on Mon, Aug 20 2018 3:02 PM
ఇప్పటివరకూ 3,000 మంది విద్యార్థులకు విద్యను అందించటమే కాదు.. వృత్తివిద్య కోర్సుల్లోనూ శిక్షణ ఇచ్చాం. కానీ వారికి ఉపాది ఎలా ? అందుకే ఈ కంపెనీ మొదలు పెట్టాం. ఇప్పుడు మా కంపెనీలో 150 మంది రకరకాల వృత్తి నిపుణులు ఉన్నారు. అంతా ఏదో ఒక భౌతిక అవయవ లోపం ఉన్నవారేం. అయితే మిగతావారికి వీరంతా ఏమాత్రం తీసిపోరు. లోపమనది ఎప్పటికీ విజయానికి అడ్డుగోడ కాదు. ఉన్నత లక్ష్యాలు లేకపోవడమే నిజమైన లోపం.
ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కడమే గొప్పగా భావిస్తారు. అలాంటిది అతిపిన్న వయసులో.. ఫోర్బ్స్ సూపర్ అచీవర్స్ ఫ్రమ్ ఏషియా జాబితాలో చోటు దక్కించుకున్నా.. ఆయన దానిని సెలబ్రేట్ చేసుకునే మూడ్‌లో లేరు. ఎందుకంటే ఇప్పుడు ఆయన దృష్టంతా ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో చేరడమే.
సాధారణ వ్యక్తులు ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే గొప్పేంకాదు.. కానీ పుట్టుకతో చూపులేనివారు ఇటువంటి లక్ష్యాలను నిర్దేశించుకోవడం, సాధించడం సాధారణ విషయం కాదు. ఇంతకీ ఆయనెవరో తెలుసా.. మన తెలుగువ్యక్తి శ్రీకాంత్ బొల్లం.
వివరాల్లోకెళ్తే...
స్కూల్ ఎడిషన్: శ్రీకాంత్ బొల్లం... రూ.50కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీకి సీఈవో. అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. తన కంపెనీని సక్సెస్ గ్రాఫ్‌లో ముందుంచడానికి కష్టపడే ఈ యువకుడిని చూసి ఒకప్పుడు నవ్వినవాళ్ళే అంతా. ఆఖరికి మంచి ర్యాంక్‌తో ఐఐటీ సీటు సంపాదించుకున్నా క్యాంపస్‌లోకి కూడా రానివ్వలేదు. ఎందుకంటే శ్రీకాంత్ అంధుడన్న కారణంతోనే..
మన తెలుగువాడే..: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఒక చిన్న పల్లె టూరిలో పుట్టాడు శ్రీకాంత్. పుట్టినప్పటి నుంచే కళ్లు కనిపించవు. దీంతో ఏదైనా అనాధాశ్రమంలో చేర్చమని సలహా ఇచ్చారు బంధువులు. కానీ కన్నప్రేమ అందుకు అంగీకరించలేదు. అంధుడైనప్పటికీ మిగతావారిలాగే ఊర్లోని బడికి పంపించారు. ఆ తర్వాత అంధుల పాఠశాలలో చేరి పదోతరగతిలో 90 శాతం మార్కులు సంపాదించాడు. క్రికెట్, చెస్ ఆటల్లోనూ చాంపియన్‌గా నిలిచాడు. అయితే ఈ విజయాలేవీ అతనికి పూలబాటను ఏర్పాటు చేయలేదు. ఐఐటీతోపాటు ఇంజనీరింగ్ పూర్తిచేసేందుకు ఎన్నో ముళ్లబాటల్లో నడవాల్సి వచ్చింది.
అబ్దుల్ కలాం చొరవతో...: అంధుడైనప్పటికీ అద్భుత ప్రతిభతో లీడ్ ఇండియా ప్రాజెక్ట్‌లో చోటు దక్కించుకున్నాడు. సాక్షాత్తూ మన మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్ అబ్దుల్ కలాం చేపట్టిన ప్రాజెక్ట్‌లో చదువుకునే అవకాశం వచ్చింది. ఆ తర్వాత విదేశాల్లోని ఆహ్వానాలు.. అడ్మిషన్లు శ్రీకాంత్ జీవితాన్నే మార్చేశాయి. చదువు పూర్తయిన వెంటనే తిరిగి భారత్‌లో అడుగు పెట్టాడు. తన లాంటి మరికొందరికి చేయూత అందించాలని నిర్ణయించుకున్నాడు. బొల్లాంత్ ఇండస్ట్రీస్ పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పరిశ్రమలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.
Advertisement
Advertisement