న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం మృతికి సంతాప సూచకంగా పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పంజాబ్ టెర్రరిస్టు దాడిని రెండు సభలు ఖండించాయి. గురుదాస్ పూర్ అమరులకు నివాళులర్పించాయి.
లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గురుదాస్ పూర్ అమరులకు నివాళులర్పిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. కలాం అంత్యక్రియలు స్వగ్రామం రామేశ్వరంలో గురువారం పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభ ఆయనకు ఘన నివాళులర్పించింది. అనంతరం ప్రజా రాష్ట్రపతికి గౌరవసూచకంగా శుక్రవారానికి వాయిదా పడింది.
అటు రాజ్యసభలోనూ ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన వారికి నివాళులర్పిలస్తూ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సభను మధ్నాహం రెండుగంటలకు వాయిదా వేశారు.
కాగా మాజీ రాష్ట్రపతి కలాం హఠాన్మరణంతో పార్లమెంట్ ఉభయసభలు సోమవారం ఘనంగా నివాళులర్పించాయి. అనంతరం గురువారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.