సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో సీన్ రిపీట్ అయింది. ఐదో రోజు కూడా అదే దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పట్టువిడవకుండా పోరాడుతున్నా సభ సజావుగా లేదనే సాకుతో లోక్‌సభాపతి సుమిత్రా మహాజన్ గురువారం కూడా లోక్‌సభను వాయిదా వేశారు. దీంతో వరుసగా ఐదు రోజులు ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే లోక్‌సభ వాయిదా పడినట్లయింది. గురువారం సభ ప్రారంభం కాగానే అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్ పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులతో నినాదాలు చేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో కేవలం 30 సెకన్లకే సభ తొలుత 12గంటల వరకు వాయిదా పడింది.
అనంతరం 12గంటలకు సభ మొదలుకాగా, కేంద్రం తరుపున మంత్రి అనంతకుమార్ హెగ్దే మాట్లాడుతూ తాము అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని, ఇతర అంశాలపై కూడా చర్చకు రెడీ అని చెప్పారు. అయితే, సభలో ప్రతి ఒక్కరు కూర్చోవాలని, స్పీకర్ వద్ద వెల్‌లో ఉన్న వారు వెనక్కి రావాలని, అప్పుడు మాత్రమే చర్చ సాధ్యం అవుతుందన్నారు. ఏ విషయంలోనూ కేంద్రం వెనక్కి వెళ్లబోదని స్పష్టం చేశారు. అయితే, టీఆర్‌ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు వరుస ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఓ మూడు నిమిషాలపాటు సాగిన సభ శుక్రవారానికి వాయిదా పడింది. రాజ్యసభలో కూడ ఐదోరోజు ఇదే వాతావరణం నెలకొంది. విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో రాజ్యసభలో కూడ గందరగోళ వాతావరణం నెలకొంది. వెల్‌లోకి వచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, అన్నాడీఎంకె ఎంపీలు దూసుకురావడంతో గందరగోళం నెలకొంది. దీంతో శుక్రవారానికి వాయిదావేస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.
ఆరోసారి అవిశ్వాసం నోటీసులు
కేంద్రంపై అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం మధ్యాహ్నం లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవకు మరోసారి నోటీసులను అందజేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు నోటీసులు ఇవ్వడం ఇది ఆరోసారి.
Comments
Please login to add a commentAdd a comment