సి.రామాపురం ఆర్‌బీకే వద్ద రైతులతో మాట్లాడుతున్న శాస్త్రవేత్త కృష్ణారెడ్డి
రైతు భరోసా కేంద్రాల వల్ల భవిష్యత్‌లో అద్భుతాలు చూస్తాం..
సాక్షి ప్రతినిధి, తిరుపతి/చిత్తూరు అగ్రికల్చర్: ‘రైతు భరోసా కేంద్రాలను పరిశీలించాక రాష్ట్ర ప్రభుత్వానికి రైతులపై ఎంతటి చిత్తశుద్ధి ఉందో స్పష్టంగా తెలిసింది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ఆశయాలకు కార్యరూపంగా అద్భుతమైన ప్రణాళికతో ఆర్‌బీకే వ్యవస్థను ప్రభుత్వం రూపొందించింది. కలామ్ ఆలోచనల మేరకు పట్టణ ప్రాంతాల్లోని సదుపాయాలను గ్రామీణ ప్రాంతాలకు చేరువ అయ్యేలా వీటిలో ఏర్పాట్లు చేశార’ని తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చర్ క్యాంపస్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత జి.కృష్ణారెడ్డి చెప్పారు. ఆర్‌బీకేల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను తెలుసుకునేందుకు చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని సి.రామాపురం, పూతలపట్టు మండలం వావిల్‌తోట, గంగాధర నెల్లూరు మండలం వేల్కూరు, చిత్తూరు మండలం బీఎన్‌ఆర్ పేట గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. అక్కడి ఆర్‌బీకేలలో గుర్తించిన విషయాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు.
వ్యవసాయ రంగానికి మంచి ప్రోత్సాహం
రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంచి ప్రోత్సాహం అందించారు. సేంద్రియ విధానంతో కూరగాయలను సాగు చేస్తున్నాం. సకాలంలో సూచనలు, సలహాలు ఇచ్చేవారు లేక ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది.
– రాగమ్మ, మహిళా రైతు, కుప్పం బాదూరు, ఆర్‌సీ పురం మండలం
ఏం కావాలన్నా చిత్తూరు వెళ్లాల్సి వచ్చేది
పంటల సాగుకు ఏం కావాలన్నా 15 కిలోమీటర్ల దూరంలోఉన్న చిత్తూరు వెళ్లాల్సి వచ్చేది. అధిక ధరల భారంతో పాటు, రవాణా ఖర్చు కూడా ఎక్కువ అయ్యేవి. ఇప్పుడు రైతు భరోసా కేంద్రం ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి వాటిని గ్రామంలోనే పొందే వెసులుబాటు కలిగింది.
– టి.గోవిందయ్య, రైతు, వేల్కూరు, గంగాధర నెల్లూరు మండలం
రైతుల ఇంటికే విత్తనాలు
సి.రామాపురం ఆర్‌బీకేని పరిశీలించేందుకు వెళ్లగా.. రామ్మోహన్ అనే రైతు కనిపించారు. ఆయన్ని కదిలించగా ‘మండల కేంద్రానికి వెళ్లి విత్తనాలు తెచ్చుకునేవాళ్లం. గంటల తరబడి నిరీక్షించినా విత్తనాలు దొరికేవి కాదు. అనవసర ఖర్చు పెరిగేది. ఇప్పుడవేవీ లేకుండా ఆర్‌బీకే ద్వారా విత్తనాలు ఇంటికే వచ్చాయి’ అని చెప్పారు. వేల్కూరు ఆర్‌బీకేలో ఏకాంబరం అనే రైతును పలకరించగా.. పశువులకు చిన్నపాటి వైద్యం కోసం కూడా ఐదారు కిలోమీటర్లు తీసుకెళ్లాల్సి వచ్చేదని, రోజంతా దానికే సరిపోయేదని చెప్పారు. ఇప్పుడు అవసరమైతే పశు వైద్యుడే వచ్చి వైద్యం చేసేలా సౌకర్యాలు కల్పించారని చెప్పారు. భూసార పరీక్షలు నిర్వహించడం, సేంద్రియ కషాయాలు ఉండడం, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్‌ల ద్వారా పంటల సాగుకు సూచనలు, సలహాలు ఇవ్వడం, వ్యవసాయ పనిముట్లు అందుబాటులోకి రానున్న విధానాన్ని తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యాను.
ఉత్పత్తుల వివరాలన్నీ కియోస్క్‌లో ఇస్తే మరింత మేలు
రైతుల వద్ద ఉన్న ఉత్పత్తుల వివరాలు, వాటి ధరలను కూడా పొందుపరిస్తే మరింత ప్రయోజనం కలుగుతుంది. ఉదాహరణకు కుప్పం, పలమనేరు మార్కెట్‌లలో ప్రతి వారం రూ.కోటి విలువైన మేకలు, గొర్రెల విక్రయాలు జరుగుతాయి. కియోస్క్‌లో గొర్రెల పెంపకందారుల వివరాలు, వారి వద్ద ఉన్న జీవాల వివరాలు, ధరలను పొందుపరిస్తే.. వ్యాపారి నేరుగా వెళ్లి కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల దళారీ వ్యవస్థను సంపూర్ణంగా నిరోధించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment